[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[ఒక పర్వతంపై సన్నని దీర్ఘచతురస్రం ఆకారంలో నిర్మించబడిన గేజర్ భవనంలో, ఎలోన్‌లోకెల్లా అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ ఉంటుంది. ఆ భవనం లోపల భిన్నమైన ప్రపంచం ఉంటుంది. రకరకాల పూల మొక్కలు పెరుగుతూంటాయి, ఆ పూల సువాసనలు వ్యాపించి ఉంటాయి. కొన్ని టోబోట్‌లు పనిచేస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు ఇమే మూడువారాల క్రితం వచ్చాడు. ఆ పెద్ద భవంతిలో, అతను కాక మరో ఇద్దరు మాత్రమే ఉంటారు. భవిష్యత్తులో ఆవాసాలుగా పనికొస్తాయనుకున్న జీటా, తాయ్ అనే రెండు గ్రహాలను కనుగొంటాడు ఇమే. అయితే, వాటిల్లో నెపో నిల్వలున్నాయో లేవో తెలుసుకోవాల్సి వస్తుంది. రెండు వారాల క్రితం, రెండు గ్రహాల నుండి నేల మరియు వాతావరణపు డేటాతో ఒక చిన్న ప్రోబ్ తిరిగొచ్చింది. వాటినింకా విశ్లేషించాల్సి ఉంది. తాను చాలా సేపటి నుంచి పని చేస్తున్నానని గ్రహించిన ఇమే, రోండ్యురల్ ఎక్కి, మొత్తం భవనం చుట్టు తిరుగుతాడు. ఇంతలో, మర్నాడు గేజర్‌ను చూడ్డానికి ఒడెప్ వస్తున్నాడనీ, తాను ఆ తర్వాతి రోజు వచ్చి వారితో చేరతానని వల్హన్ నుండి సందేశం రావడంతో, లెక్స్ ద్వారా ఒడెప్ గురించి తెలుసుకుంటాడు. మళ్ళీ తన వర్క్ స్టేషన్‌కి వచ్చేస్తాడు. ‘పాయింట్’ లో కలిసినప్పటి నుండి రాదుల్ – పాటిక్స్ నుండి ఒక సంకేతం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే, అతని నుండి ఎటువంటి సమాచారం రాదు. రాదుల్ నెపో గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గతంలో తనను ఎప్పుడూ ఆకర్షించని సమాచారం, వాస్తవాలు, గణాంకాల ద్వారా యాదృచ్ఛికంగా వెతుకుతాడు. ఫెన్స్‌కి అవతలివైపు నుంచి నెక్స్‌కి సంబంధించిన సమాచారం ఏదైనా తెలుస్తుందేమోనని, రోజుల తరబడి, హైవేలపై నిఘా ఉంచుతాడు రాదుల్. నెక్స్ గురించి, నెపో నిల్వల గురించి సమాచారం అందుబాటులో లేకపోవడం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక తానే స్వయంగా కథ నడపాలని నిర్ణయించుకుంటాడు రాదుల్. ఇక చదవండి.]
అధ్యాయం-5 – ప్రత్యామ్నాయాలు – 2వ భాగం
ఒడెప్ గేజర్ భవనానికి చేరుకుంటాడు. విజిటర్స్ లౌంజ్‍లో విశ్రాంతిగా కూర్చున్నాడు. రోండ్యురల్ (1) నుంచి ఇమే బయటకు వచ్చి, ఒడెప్‌ను చూడగానే, ఎంతో వింతైన భావన కలిగింది. అతను పొడవుగా, సన్నని భుజాలతో, చిన్న నల్లటి జుట్టుతో, చక్కటి జాకెట్ ధరించి ఉన్నాడు. అయినప్పటికీ, అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, దానిని ఐమే వెంటనే గుర్తించలేకపోయాడు. ఒడెప్ తనతో చేరడానికి వేచి ఉండగా, ఐమే తన వర్క్‌స్టేషన్‌లో కూర్చుని అతని గురించి మరిన్ని సమాచారాన్ని సేకరించాడు.
పదవీ విరమణ చేసి కొండల్లో నివాసం ఏర్పర్చుకున్నప్పటి నుండి ఒడెప్ ఏమి చేస్తున్నాడో పెద్దగా తెలియదు. అతను ఏమీ చేయనట్లే అనిపించింది. అతను గతంలో ఎన్నో గొప్ప భవనాలను నిర్మించాడు, సైనెడ్ బృందంలో ఎన్నో కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చాడు. లెక్స్ (2), హైవేల కోసం కొన్ని నిబంధనలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతను ఎందుకు వెనక్కి తగ్గాడు? ఒడెప్, మధ్యలో ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నాడో ఇమేకి అర్థం కాలేదు. అలాంటి విశ్రాంతి ఎన్నడూ అవసరం లేదు.
తన ప్రస్తుత అన్వేషణలను ఒడెప్‌తో పంచుకోవాలా లేక వల్హన్ కోసం వేచి ఉండాలా అని ఇమే తన మనస్సులో చర్చించుకున్నాడు.
మధ్యాహ్నం సూర్యుడు దిగంతంలో అస్తమించగానే ఇమే తన దృష్టిని డేటాపైకి తిరిగి తీసుకువచ్చాడు. జీటాలో నెపో (3) లభ్యత గురించి తన పరిశోధనలో మునిగిపోయిన ఇమేకి తన భుజంపై ఎవరో చిన్నగా తట్టినట్లు తోచింది. ఒడెప్ అతని వెనుక నిలబడి ఉన్నాడు.
“జీటా లేదా తాయ్ – మనకు తెలిసినట్టుగా – జీవానికి ఆధారంగా నిలవగలవని నువ్వు నిజంగా అనుకుంటున్నావా?” ఇమే దగ్గర కూర్చుంటూ నవ్వుతూ అడిగాడు ఒడెప్. వల్హాన్‌కీ, అతనికీ మధ్య ఎటువంటి రహస్యాలు లేవని తనకి తెలియజేయడానికి ఇది ఒడెప్ పద్ధతని గ్రహించాడు ఇమే.
“నా ప్రాథమిక అంచనా అదే సూచించింది. అయితే, గేజర్‌లో పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి, నేను విరుద్ధమైన డేటాను చూశాను, దానిని నేను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉందని నేను అంగీకరించాలి” అని వివరించాడు ఐమే.
“భూమిపై నివసిస్తున్నప్పుడు కొన్ని శతాబ్దాల క్రితం ఎలోన్‌ను (4) ఎవరు కనుగొన్నారో నీకు తెలుసా?” అడుగుతూ, లేచి నిలబడి టెలిస్కోప్ వీక్షణ ప్యానెల్ నుండి చూశాడు ఒడెప్.
“తెలియదు, నేను దానిని ఎప్పుడూ తెలుసుకోలేకపోయాను. నేను ఈ ప్రాంతంలో చదువుకుంటున్నప్పుడు, చాలా వెతికాను, కానీ నాకు ఏ పేరు దొరకలేదు. మీకు తెలుసా, ఒడెప్?” ఆసక్తిగా అడిగాడు ఇమే.
“లేదు, నాకూ తెలియదు. దురదృష్టవశాత్తు, మన పురాతన కాలం గురించి పెద్దగా తెలియదు” అని ఒడెప్ విచారంగా అన్నాడు. అతను గాజు కిటికీల దగ్గరకు నడిచి బయట అస్తమిస్తున్న సూర్యుడిని చూడటం ప్రారంభించాడు.
“వాళ్ళ సాధనాలు, పరికరాలు మనవాటి కంటే చాలా మెరుగ్గా ఉండి ఉండాలి” అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఇమే.
ఒడెప్ నిశ్శబ్దంగా నిలబడి గాజు పలకలోంచి బయటకు చూస్తున్నాడు. కనుమరుగవుతున్న సూర్యుడు చుట్టూ ఉన్న – మెరుస్తున్న, మంచుతో కప్పబడిన పర్వతాలపై లేత కాంతిని ప్రసరింపజేస్తున్నాడు.
“నేను అలా అనుకోను, ఇమే. వారి అనేక ఆవిష్కరణలు మనం తిరిగి కనిపెట్టాల్సిన అవసరం లేదని నిర్ధారించాయి. కానీ మనం వారి జ్ఞానపు మూలాలను ఆధారం చేసుకుని చాలా ముందుకు సాగాము. మనతో పోలిస్తే వారు స్ట్రగులర్స్. సమయం తక్కువగా ఉండడం వారికి ప్రేరణనిచ్చింది. మనకు లేనిది ఆ ప్రేరణే; ఎందుకంటే మన వద్ద ‘కాలం’ అనంతమైనది. ఇంతకీ, ఇమే, ఎలోన్‌ను కనుగొన్నది ఒక పురుషుడు అనుకుంటున్నావా లేక గైనేక్ (5) అనుకుంటున్నావా?”
ఒడెప్ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక, “జీటా, తాయ్‌లకు చెందిన డేటాను మీరు చూడాలనుకుంటున్నారా?” అకస్మాత్తుగా అడిగాడు ఇమే.
“ఆ పని మనం తర్వాత చూద్దాం” అన్నాడు ఒడెప్. చాలాసేపు మౌనంగా ఉన్నాకా, ఒడెప్ “ఇమే, జీవితం అనంతం కానప్పుడు, నిరంతరం కొనసాగనప్పుడు – అదెలా ఉండేదో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా?” అడిగాడు.
అతను పేన్ నుండి దూరంగా వచ్చి, తిరిగి ఇమే వర్క్ స్టేషన్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
“సరే, నాకేమీ పెద్దగా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అలా జీవించడం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను మీకు తినడానికి ఏదైనా తీసుకురానా?” తొందరపడి అడిగాడు ఇమే. ఒడెప్ తన అంగీకారాన్ని తెలపడంతో హమ్మయ్య అనుకున్నాడు.
అతను త్వరగా లేచి ఎస్కలేటర్‌లో పాంట్రీకి వెళ్లాడు. అక్కడ తినడానికి కావల్సిన ఎంచుకోడానికి కాస్త సమయం తీసుకున్నాడు, ఒక గ్లాసులో ఎనాబ్ (6) పోసుకున్నాడు.
మొదట రాదుల్, ఇప్పుడు ఒడెప్ – వీళ్ళిద్దరికీ – వింతైన, సంబంధం లేని సమస్యల గురించి ఆలోచించే, ఆశ్చర్యపోయే వీలుంది ఎందుకంటే వారు పెద్దగా ఏమీ చేయలేదు. ఈ వింతైన అసంబద్ధమైన చర్చను ముగించడానికి ఇమే మళ్ళీ నెపో ప్రస్తావన తేవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన వర్క్‌స్టేషన్‌కు తిరిగి వచ్చి కూరముక్కలు, టిబ్లి సాస్, కింపాయోతో నిండిన ట్రే ని ఒడెప్ ముందు ఉంచాడు.
“జీటా లేదా తాయ్ మనకు భవిష్యత్తులో ఆవాసాలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, నెపో నిల్వలు లేకపోతే మనం ఏమి చేయాలి?” అని అడిగాడు ఇమే.
“ఏముంది, మనమందరం అక్కడికి వెళ్లి భూమిపై మన పూర్వీకులు జీవించినట్లుగా జీవించడం ప్రారంభించవచ్చు.. కాలంతో పోటీపడుతూ పరుగెత్తే ప్రజల కోరికలను నిజంగా అనుభూతి చెందడానికి జీవించండి” అని ఒడెప్ నవ్వుతూ చెప్పాడు.
“మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, ఒడెప్. నెపో లేకుండా మనం ఎలా జీవించగలం? అదే మన ఉనికికి ఆధారం కదా”, అన్నాడు ఇమే అయోమయంగా.
“మనం నిర్ణయించాం కాబట్టి అది ఆధారం అయ్యింది. ఏమైనా, భవిష్యత్తులో ఉండే ఆ ఆవాసాలలో దేనిలోనైనా నెపో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా?”
ఇమే త్వరగా తన వర్క్‌స్టేషన్‌ను తెరిచి, తన పరిశోధన ఫలితాలను ఒడెప్‌తో పంచుకోవడం ప్రారంభించాడు. వారు చర్చించుకుంటూ, డేటాను పరిశీలిస్తుండగా, సాయంత్ర సమయం గడిచిపోయింది, మంచు కురవడం ప్రారంభమైంది. ఒడెప్ అకస్మాత్తుగా తన కుర్చీలోంచి లేచి, గది గాజు గోడ దగ్గర నిలబడ్డాడు. స్నోఫ్లేక్స్ గాజు మీద పడి మెలికలు తిరుగుతూ కరిగిపోతున్నాయి. అతను వాటిని జాగ్రత్తగా గమనించాడు. ఇమే తన వర్క్‌స్టేషన్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని, ఒడెప్ తిరిగి వచ్చే వరకు ఓపికగా వేచి ఉన్నాడు, దాంతో వారు పరిశోధన కొనసాగించగలిగారు. ఒడెప్ ఏమీ చేయనట్లు అనిపించినప్పటికీ, అతనికి చాలా తెలుసని ఇమేకి స్పష్టమైంది. అతను అడిగే ప్రశ్నలు, అతని అంతర్దృష్టి ఇమేని ఆశ్చర్యపరిచాయి. అందరికీ దూరంగా కొండల్లోకి వెళ్ళిపోయే నాటికి ఎలోన్‌లో అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులలో ఒడెప్ ఒకడు.
“ఇక్కడికి రా” అంటూ ఒడెప్ తను నిలబడి ఉన్న చోటికి రమ్మని ఇమేని పిలిచాడు. “ఆ స్నోఫ్లేక్స్ చూడు. అవి అంత అందంగా నాట్యం చేసి ఆడుకుంటున్నాయో?” అన్నాడు
ఇమే వెళ్లి ఒడెప్ పక్కన నిలబడ్డాడు. ప్రతిబింబించే కాంతిలో స్నోఫ్లేక్స్ తిరుగుతున్నాయి, అవి పేన్‌ను తాకినప్పుడు అదృశ్యమవుతున్నాయి. అలా కురుస్తున్న మంచు ఏమీ తేడాగా అనిపించలేదు ఇమేకి. గేజర్ భవనం నిరంతరం మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు కురవడాన్ని అతను ప్రతిరోజూ చూస్తాడు. నిజానికి, అతను దుర్భరమైన పరిసరాలలో ఉండి అలసిపోయాడు, నగరానికి తిరిగి వెళ్ళడానికి ఆత్రుతగా వేచి ఉన్నాడు. అయినప్పటికీ, ఒడెప్ చేతిలో ఉన్న పనిని తిరిగి ప్రారంభించడానికి పేన్ దగ్గర ఓపికగా నిలబడి వేచి ఉన్నాడు ఇమే.
“నీకివి ఆకర్షణీయంగా అనిపించడం లేదా?” అడిగాడు ఒడెప్, అతని చూపు మెరిసే మంచు రేణువులను వదలడం లేదు.
“మరీ అంత ఆకర్షణీయంగా ఉండదు. ఇక్కడ ఎప్పుడూ మంచు కురుస్తుంది. సరే, మనం మన చర్చ కొనసాగిద్దామా?” అన్నాడు ఇమే.
ఒడెప్ దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. అతను తన రెండు చేతులను పేన్ మీద ఉంచి బయటకు చూస్తూనే ఉన్నాడు. ఏమి చేయాలో తెలియక ఇమే పేన్‌కి ఆనుకుని ఉన్నాడు. అతను అక్కడ నిలబడి ఉన్న ఒడెప్ వైపు చూశాడు. ఆ సమయంలో, ఇమే మొదట ఒడెప్ తలలో పలిత కేశాన్ని గమనించాడు, అది లైట్ల వెలుగులో మెరుస్తోంది. అతని కళ్ళు – వెండిలా మెరుస్తున్న ఆ తెల్ల వెంట్రుక మీదుగా వెళ్ళి, ఒడెప్ కళ్ళ మూలకు దగ్గరగా ఉన్న సన్నని గీతలపై నిలిచాయి.
ఇమే వెనక్కి తిరిగి తన వర్క్ స్టేషన్ వైపు నడిచాడు, కొంచెం అయోమయంగా. అతను స్క్రీన్ పై పేజీలు తిప్పుతున్నాడు, కానీ అతని మనసు వేరే చోట ఉంది. ఎలోన్‌లో ఒడెప్ లాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ చూడలేదు. అసలేం జరుగుతోంది? మరుసటి రోజు వల్హాన్ వచ్చినప్పుడు వల్హాన్‌తో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు ఇమే. ఒడెప్‌కి బహుశా కొన్ని ప్రత్యామ్నాయాలు అవసరమని, అది కూడా త్వరగా అవసరమని ఇమే నిర్ధారించాడు.
ఒడెప్ ఇమే కూర్చున్న చోటికి తిరిగి వచ్చాడు, ఇద్దరూ మళ్ళీ డేటాను లోతుగా పరిశీలించారు. ఒడెప్ ఇంతకు ముందు ఏదైనా తప్పు చేశాడేమో అని చూడటానికి ఇమే ఒడెప్ వైపు చూశాడు. అంతకు ముందు ఒడెప్ తలలో కనిపించిన తెల్లటి వెంట్రుకలు లేవు. బహుశా, అది క్షీణిస్తున్న కాంతి ప్రభావమేమోనని ఆశ్చర్యపోయాడు ఇమే.
డేటాను పరిశీలిండంలో కొన్ని గంటలు గడిపిన తర్వాత, “నాకు తెలుసు, నువ్వు ఇక్కడ కొంత మంచి పని చేసావు. మన త్వరిత విశ్లేషణ తర్వాత, జీటా తాయ్ రెండిట్లో, మనకు తెలిసిన జీవానికి ఆధారంగా ఉండేందుకు తాయ్ మరింత అనుకూలంగా ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను” అని ఒడెప్ ప్రకటించాడు. బయట, మంచు కురవడం ఆగిపోయింది, భయంకరమైన చీకటి – భవనాన్ని ఆవరించింది.
“నేపో సంగతి ఏంటి? తాయ్‌లో అది ఉందా లేదా అలాంటిదేదైనా ఉందా?” అని అడిగాడు ఇమే.
“నేను చెప్పలేను. దానికి మరికొంత డేటా మైనింగ్, ఇంకా తాయ్ నుండి సేకరించిన గణాంకాల విశ్లేషణ అవసరం. వల్హన్ రేపు వచ్చినప్పుడు మనం దాని గురించి చర్చించవచ్చు”, అని ఒడెప్ కుర్చీలోంచి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు.
“నేను ఇప్పుడు నిద్రపోవాలి. నిద్రపోయి చాలా రోజులైంది”
ఒడెప్ వెళ్ళిపోయాడు, అతను వెళ్ళేంత వరకూ చూస్తూనే ఉన్నాడు ఇమే. మరుసటి రోజు ఉదయం వల్హన్ వచ్చినప్పుడు అతనితో చర్చించడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇమే లేచి ఆ రోజు బయలుదేరే ముందు చివరిసారిగా టెలిస్కోప్ ద్వారా చూశాడు. జీటా, తాయ్ రెండూ విశ్వంలో చాలా దూరంగా తమ పసుపు కాంతిని ప్రసరింపజేస్తున్నాయి. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాయ్ – జీవానికి ఆధారమవ్వవచ్చని ఆలోచించడం ఆసక్తికరంగా ఉంది. దాన్లో నగరాలు, రోడ్లు, సముద్రాలు, పర్వతాలు, భవనాలుంటాయి, ఇంకా మనుషులు ఉంటారు.
కొంతసేపటి తర్వాత, తానూ ఒడెప్ పని చేస్తున్నప్పుడు తెరిచిన అన్ని డేటాలను షట్ డౌన్ చేయడం ప్రారంభించాడు ఇమే. షట్ డౌన్ పూర్తయిన తర్వాత, అతను తన గదికి వెళ్ళడానికి ఎస్కలేటర్ వైపు కదిలాడు. అతని చేతికి ఉన్న లెక్స్ కంపిస్తోంది. అతను ఒడెప్‌తో పని చేస్తున్నంత సేపూ దానిని యాక్సెస్ చేయలేదు. ఎస్కలేటర్ క్రిందికి కదులుతున్నప్పుడు ఇమే – లెక్స్‌లో వచ్చిన సందేశాన్ని చదవసాగాడు. వచ్చిన సందేశాలలో మొదటిది రాదుల్ నుండి వచ్చింది. అతను కొన్ని క్షణాల క్రితమే దాన్ని ఎంటర్ చేశాడు. అది అన్ని ప్రముఖ హైవేలపై కనబడుతోంది.
‘ఫెన్స్ (7) కు అవతలి వైపు ఒక నెక్స్ (8) సంభవించిందనీ, దానికి కారణం మనమేనని గైనేక్ మమ్మల్ని నిందిస్తున్నారని వదంతులు వినబడుతున్నాయి. ఇది వింతగా లేదూ? నమ్మశక్యం కాదే?! మొదట, మరణం సంభవించడం నిజం! అది సహజంగా జరగలేదు. ఇక, రెండవది, వారు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? గైనేక్‍కి ఏమైంది? ఎవరైనా సమాధానం ఇస్తారా?
రాదుల్’
ఇమే ఆ సందేశాన్ని అపనమ్మకంతో చదివాడు. అతను తన గది తలుపుకి చేయి చూపించాడు, అది తెరుచుకుంది.
రాదుల్ ఏం చేస్తున్నాడు? అతనెందుకు ఇలాంటివి సృష్టిస్తున్నాడు? లేదా అది నిజమేనా? నిజమే అయితే, అతనికి దాని గురించి ఎలా తెలిసింది? వల్హన్‌కు ఎందుకు తెలియలేదు?
ఇమే బట్టలు మార్చుకుని మంచం మీద పడిపోయాడు, అలసిపోయాడు. కాసేపటికి అతను మళ్ళీ ఆ సందేశాన్ని యాక్సెస్ చేశాడు. కానీ ఆ కొద్ది సమయంలోనే, ఎవరో సందేశాన్ని సృష్టించిన వ్యక్తిని తొలగించారు. ఇప్పుడు అది సిస్టమ్‌లో తెలియని ఎంట్రీ. సృష్టించిన వ్యక్తి పేరు తొలగించబడినప్పటికీ, సందేశం చెక్కుచెదరకుండా ఉంది, అందరికీ అందుబాటులో ఉంది.
ఇమే కళ్ళు నిద్రలోకి జారుకున్న కొద్దీ, లెక్స్ పై ట్రాఫిక్ పెరిగింది. పురుషులు సందేశాన్ని చదవడమే కాకుండా దానికి ప్రతిస్పందిస్తున్నారు. కలుజులు తెరుచుకున్నాయి.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Rondural, రోండ్యురల్ – పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళే వాహనం
(2) Lex, లెక్స్ = సమాచార పరికరం
(3) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(4) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(5) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం
(6) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం
(7) Fence ఫెన్స్= సరిహద్దు, కంచె
(8) Nex, నెక్స్ = మరణం, చావు
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
