Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-2

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[అంతరిక్షంలో ఎలోన్ అనే గ్రహం! భూగ్రహం విధ్వంసానికి గురయ్యాకా, మానవులు అంతరిక్షంలో ఆవాసయోగ్యంగా ఉన్న గ్రహాలలో స్థిరపడ్డారు. ఎలోన్‍లో స్త్రీ పురుషులు వేర్వేరు జాతులుగా ఉన్నారు. అనేక ఏళ్ళ పాటు వారి మధ్య ఎన్నో ఘర్షణలు జరుగుతాయి. క్లాష్-ii అనే మహా పోరాటం తరువాత, గ్రహాన్ని రెండు భాగాలుగా చేస్తూ ఫెన్స్ అనే సరిహద్దు ఏర్పడ్డాకా, శాంతి నెలకొంటుంది. ఆ గ్రహం ఆధునిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటుంది.  అ రెండు జాతులలోనూ స్త్రీ పురుషులు ఒకరి ప్రమేయం లేకుండా మరొకరు క్లోనింగ్ ద్వారా సంతానాన్ని పొందగలుగుతారు. శరీర అవయవాలని రీప్లేస్ చేసుకునే వీలుండడంతో, మరణాలు అరుదైపోతాయి. అలాంటి పరిస్థితులల్లో సరిహద్దుల వద్ద ఓ స్త్రీ శవం కనబడిందన్న వార్త వర్క్ స్టేషన్‍ని నిర్వహిస్తున్న ఈవీ ట్యాగ్‍పై  కనబడుతుంది. కొద్ది సేపట్లోనే, ఎలోన్‍లో స్త్రీలు ఉండే వైపు అంతా గందరగోళం నెలకొంటుంది. నగరంలోని మరో ప్రాంతంలోని క్రియేషన్ ఫెసిలిటీలో టియోని అస్తిమితంగా ఉంటుంది. ఆ రోజే ఆమెకు సంతానం కలగనుంది. తన పాపని తార అని పేరు నిర్ణయించుకుందామె. తారతో తన మొదటి కలయికకి అంతరాయం కలగకూడదని, ఈ కేంద్రంలోకి అడుగుపెడుతున్నప్పుడే, తన ట్యాగ్‌ని షట్ డౌన్ చేస్తుంది టియోని. దాంతో బయట జరుగుతున్న సంఘటనలేవీ ఆమె దృష్టికి రాలేదు. కాసేపటికి నిపుణురాలు బయటకి వచ్చి, తారని టియోని చేతుల్లో పెట్టి కొన్ని సూచనలు చేస్తుంది. పాపని తీసుకుని టియోని ఇల్లు చేరుతుంది. ఎలోన్‍లో అత్యున్నత నిర్ణయాధికార బృందమైన ‘కౌన్సిల్’ అత్యవసరంగా సమావేశమవుతుంది. కౌన్సిల్ ప్రస్తుత అధిపతి క్రేటీ. సమావేశాన్ని ప్రారంభిస్తూ – చనిపోయినది కౌన్సిల్‍లో సీనియర్ సభ్యురాలైన ఉల్తూర్ కూతురు సీని అని చెబుతుంది. ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగినట్లు లేదని, సీనికి విషం ఇంజెక్ట్ చేసినట్లు అనిపిస్తోందనీ, మన వైపు విషం దుకాణాలు లేవు కాబట్టి, ఈ పని సరిహద్దుకు అవతలి వైపు వారు చేసి ఉంటారని అంటుంది. వాళ్ళ అలా చేయరు, చేస్తే శాంతికి భంగమని వాళ్ళకి కూడా తెలుసని కొందరు సభ్యులు వాదిస్తారు. దుఃఖంతో ఉన్న ఉల్తూర్ మౌనంగా ఉండిపోతుంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చాకా మళ్ళీ కలుద్దామని సమావేశాన్ని ముగుస్తుంది క్రేటీ. తన ఇంటికి వెళ్ళిన ఉల్తూర్ శూన్యాన్ని అనుభవిస్తుంది. కూతురు సీని ఇక కనబడదు, తనని పిలవదు అనుకుంటూ రోదిస్తుంది. అసలు ఎలోన్‍లో మరణాలు సంభవించి వంద ఏళ్ళకు పైగా అయ్యుంటుందని అనుకుంటూ ఫెన్స్ వద్దకు వెళ్తుంది. ఫెన్స్‌కి అవతలివైపు వారు సీనిని చంపేశారంటే ఆమెకి ఇంకా నమ్మబుద్ధి కాదు. మున్ముందు పెను విపత్తు రానున్నదని ఆమెకు అనిపిస్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం-1 – ఒక మరణం – రెండవ భాగం

వీ దిగ్భ్రాంతి చెందింది. ఆమె తన అపార్ట్‌మెంట్‌లో కూర్చుని బయట చీకటిని చూస్తూ ఉండిపోయింది. ఎవరైనా చనిపోవడమనేది ఈవీకి తెలియదు. ఇక, ఇప్పుడు, సీని చనిపోయింది. ఆ వార్త పూర్తి గూఢార్థం ఆమెకు ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. తను ఇక ఎన్నడూ సీనితో మాట్లాడలేదు, ఆమెను చూడలేదు, ట్యాగ్ చేయలేదు. ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. ఎలా జరిగింది? గత విహాన్‌ (1)లో మాత్రమే, ఇరానా హబ్‌లోని ఆసక్తికరమైన మాడ్యూల్ గురించి సీనిని తాను ట్యాగ్ చేసింది. ఇక, ఈవీ సీనిని మరిన్ని వివరాలు అడగలేదు.

ఈవీ టియోనిని తలచుకుంది, ఆమెకు అత్యవసర ట్యాగ్‌ని పంపింది. సీని గురించి ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఈవీ తన మంచం మీద పడుకుని పైకప్పు వైపు చూసింది. ఆమె దుప్పటిని శరీరానికి వదులుగా చుట్టుకుంది. ఆ దుప్పటి రాత్రి పూట విశ్రాంతి కోసం గది ఉష్ణోగ్రతలను సర్దుబాటు చేస్తుంది. ఆమె పొట్టి రాగి జుట్టు ఆమె గుండ్రని ముఖంపై పడుతూ, ముఖాన్ని కప్పుతోంది. తన మెదడులో ఏదో ఒక వింత రంధ్రం ఏర్పడినట్లు ఈవీ భావించింది – దాన్ని ఎలా సరిదిద్దాలో ఆమెకు తెలియడం లేదు.

సీనీకి ఏమైంది? వాళ్లిప్పుడు ఆమెను ఏం చేస్తారు? హఠాత్తుగా, చనిపోయిన వ్యక్తిని వారేం చేస్తారో తెలుసుకోవాలనుకుంది ఈవీ. సీనిది ముదురు ఎర్రటి పొడవాటి జుట్టు, సొగసైన తీరు! తెలివైన ప్రశ్నలు సంధించే సీనికి ఏమైంది? ఆమెకంతా గందరగోళంగా ఉంది. ఈ వింత ఆలోచనలు మనసుని కుదిపేస్తుంటే నిద్రలోకి జారుకుంది.

ఆమెకి మెలకువ వచ్చేసరికి, నగరం ఇంకా చీకటిలో ఉంది. ఆమె ట్యాగ్ నిండిపోయింది. కొన్ని పాత సందేశాలు ఇప్పుడు గోడలోని స్క్రీన్‌పై మెరుస్తున్నాయి. ఈవీ తన ట్యాగ్‍ని తన శరీరం లోపల అమర్చుకోలేదు. కొన్ని సమయాల్లో, ఆమె దానిని ఆపివేయవలసి వచ్చింది. ట్యాగ్ ఛానెల్‌లలో ఎడతెగని సంభాషణల నుండి ఆమె కాస్త నిశ్శబ్దాన్నీ, విశ్రాంతిని కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ రోజంతా ట్యాగ్‌లో సీని గురించే సందడి. ఆమెను చంపినట్లు కౌన్సిల్ సందేశం పంపింది. అయితే, సరిగ్గా ఏమి జరిగిందో ఎవరికీ తెలియలేదు. టియోని నుంచి ఇంకా ఎలాంటి కబురూ రాలేదు. ఈవీ ట్యాగ్ ద్వారా టియోని అపార్ట్‌మెంట్ వర్క్‌స్టేషన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది, కానీ కుదరలేదు.

ఈవీ ఆందోళన చెందింది. సీనిని చంపేశారు, టియోని అందుబాటులో లేదు. ఈవీలో వ్యాపించే భావాల స్వరూపం చాలా కొత్తగా ఉంది. ఈవీ సీనితో మాట్లాడాలనుకుంది, ఆమె గొంతు వినాలనుకుంది. తన మెదదు లోని ఈ గందరగోళం ఎప్పుడు, ఎలా సద్దుమణుగుతుందా అని ఆలోచిస్తూ మరోసారి కళ్ళు మూసుకుంది ఈవీ.

🚀

ఆ రెండంతస్తుల భవనం చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం. దూరంగా, పర్వతాల నీడలు ఆకాశానికి అలంకారంగా కనిపిస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయం అది. ప్రామ్‌లీ వర్క్‌స్టేషన్‌లో కూర్చుని, దానిని షెడ్యూల్ చేయసాగింది. తెరిచి ఉన్న కిటికీల నుండి లోపలికి వచ్చే గాలి హాయిగా, పండిన అమర్ (2) పంట వాసనతో నిండి ఉంది. గత అనేక జాక్‌లుగా (3), ప్రామ్‍లీ ఈ వాసనను ఇష్టపడుతోంది. వ్యవసాయం – ఆమె మునుపు పెద్దగా దృష్టి సారించని విషయమే అయినా, ఇప్పుడు, అది ఆమె ఎంతో ఆస్వాదించే విషయంగా మారింది. ఆమె షెడ్యూల్‌ను ఖరారు చేసింది మరియు మరుసటి రోజు ఉదయమే తొలి వేకువలో యాక్టివేట్ అయ్యేలా సిస్టమ్‌ను రెడీ మోడ్‌లో ఉంచింది.

బహిరంగ ప్రదేశంలోకి అడుగు పెడుతూనే, ప్రామ్‍లో ఒళ్ళు విరుచుకుంది. శరీరం బాగా అలసిపోయిన భావన. పంట కోసిన తర్వాత, వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలనుకుంది. చివరిసారిగా ఆమె శరీర అంగాలను మార్చుకున్నది దాదాపు నలభై జాక్‌ల క్రితం. బహుశా కొన్ని అవయవాలను మార్చాలేమో! క్షీణిస్తున్న సూర్యకాంతిలో, ఆమె బూడిదరంగు కేశాలు మెరిశాయి. జుట్టుని చక్కగా పొట్టిగా కత్తిరించి, తన పొడవాటి ముఖాని చుట్టూ వచ్చేలా టోపీలా చేసుకుంది. ప్రామ్‍లీ పొడవుగా, సన్నగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సాధికారతతో ఉంటుంది. పొలంలో ఉన్నప్పుడు – నగరంలో ఉన్నప్పుడు ధరించే దుస్తులు కాకుండా – సాధారణంగా మోకాలి పొడవు ప్యాంట్‌, పొట్టి రవిక ధరిస్తుంది.

ప్రధాన భవనానికి అవతలి వైపున ఉన్న షెడ్‌లో, టోబోక్ (4) లను చక్కగా వరుసలో ఉంచడం ప్రామ్‍లీ చూసింది. ప్రతి టోబాక్‌ – దానికి కేటాయించిన పంట-సంబంధిత పనిని సక్రమంగా చేయడానికి అదనపు పరికరాలు అమర్చబడ్డాయి. సమయం ఆసన్నమవగానే, అవి బయటకు వెళ్లి పొలం పని చేయడం ప్రారంభిస్తాయి.

ప్రామ్‍లీ తిరిగి ఇంట్లోకి నడిచింది. గోడపై ఉన్న తెరనిండా సీనికి సంబంధించిన వార్తలు ముసురుకున్నాయి. దిగ్భ్రాంతి, అపనమ్మకం, ఆగ్రహం, ఇంకా భయం.. వ్యక్తమవుతున్నాయి. ట్యాగ్ ద్వారా తనని సంప్రదించడానికి ఉల్తూర్ పదే పదే ప్రయత్నిస్తున్నట్లు ప్రామ్‍లీ చూసింది. తెలివైన, ఉత్సావంతురాలైన సీనికి జరిగింది నిజంగా దారుణం. తాను మొదటిసారి ఉల్తూర్‌ను కలిసినప్పుడు, ప్రామ్‍లీ అప్పుడప్పుడే ఎదుగుతున్న ఇన్ఫర్మేటిక్స్ నిపుణురాలు, అప్పడు సీని పసిపాపగా ఉండేది. ఎదుగ్తుతున్నకొద్దీ, సీని కంప్యుటేషన్ ఐడియాస్‌లో ప్రతిభ కనబరిచింది. తమ ప్రధాన సమాచార కేంద్రమైన నివిదమ్‌లో చేరమని ప్రామ్‍లీ ఆమెను ప్రోత్సహించింది. సీని ఆ మార్గాన్నే అనుసరించింది, అత్యుత్తమంగా రాణించి తన సమర్థతని నిరూపించుకుంది.

రెండు జాక్‌ల క్రితం, సీని ప్రామ్‍లీని కలిసేందుకు, కొండల మధ్యలో ఉన్న ఆమె పొలానికి వెళ్ళింది. ఇద్దరూ పొలంలో నడుస్తూ మాట్లాడుకున్నారు. నివిదమ్‍లో పనిచేయడం మానేశానని, ఇరానా హబ్‌లో చేస్తున్నానని సీని చెప్పింది. సీని ఇలా మారడం ప్రామ్‍లీని తీవ్ర నిరాశకు గురిచేసింది.

సీని అకస్మాత్తుగా దారి మార్చుకోడానికి కారణమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రామ్‍లీ ప్రయత్నించింది. పొలంలో ఉండగా, ఆకాశంలో మూడు చందమామలు అస్తమించడాన్ని తిలకిస్తూండగా, “ఎందుకు సీని? ఇరానా హబ్‌లో నీ ప్రతిభను వృథా చేస్తున్నావు. నువ్వు అక్కడ ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగింది ప్రామ్‍లీ.

“ప్రామ్‌లీ, మీరు లెక్కలేనన్ని జాక్‌ల పాటు నివిదమ్‌కు నాయకత్వం వహించారు, మరి మీరెందుకు వ్యవసాయం చేపట్టారు?” అని సీని అడిగింది, ప్రామ్‍లీ ప్రశ్నకు జవాబు చెప్పకుండా.

ప్రామ్‌లీ మౌనంగా ఉండిపోయింది. సీని ఎప్పుడూ కుతూహలంతో ఉండేది. ఆమె ఎదుగుతున్నప్పుడు కూడా, లెక్కలేనన్ని ప్రశ్నలు వేసేది, అవి నిరంతరం ప్రామ్‌లీ ట్యాగ్‌పై కనబడుతూనే ఉండేవి.

ట్యాగ్‍లో ఉల్తూర్ నుండి అసంఖ్యాక సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రామ్‍లీ ఛానెల్‍ని ఉల్తూర్ ఇంటికి మార్చింది. సీని మరణం తర్వాత వారిద్దరూ ఒకరినొకరు మొదటిసారి చూసుకున్నారు.

ఉల్తూర్ సోఫాలో కూర్చుని ఉంది. లైట్లు అస్పష్టంగా ఉన్నాయి, ఆమె రంగురంగుల అపార్ట్మెంట్ అంతా నైరాశ్య భావం. ఉల్తూర్ అపార్ట్‌మెంట్‌లో వేలాడదీసిన కాంతివంతమైన దుస్తులు సీనిని గుర్తు చేస్తున్నాయి.

ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ఉల్తూర్ మొదలుపెట్టింది, “ప్రామ్‍లీ, ఎవరైనా చనిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో నేను మర్చిపోయాను. అకస్మాత్తుగా నాకు క్లాష్-ii గుర్తొచ్చింది, ఆ సమయంలో నాకు తెలిసిన చాలా మంది చనిపోయారు. ఎవరి ఆత్మీయులైనా మరణిస్తే వారిని చుట్టుముట్టే  వేదన, ఒంటరితనం – అనే భావాలని నీకింకా అర్థం కావు. చరమత్వం భరించలేనిది. క్లాష్-ii జరిగి దాదాపు యాభై జాక్‌లు పూర్తయ్యాయి. అప్పటికి మరణం అనేది అరుదుగా సంభవించే ఘటనగా మారింది.”

ప్రామ్‌లీ మౌనంగా కూర్చుంది. ఉల్తూర్ చెప్పింది నిజమే. ప్రామ్‍లీకి తెలిసిన వారు ఎవరూ మరణించలేదు. బహుశా ఆమె ఆ బాధను అర్థం చేసుకోలేదు.

“ప్రస్తుతం ఓనిప్ ఎక్కడుంది?” అడిగింది ఉల్తూర్, మౌనాన్ని భగ్నం చేస్తూ.

ప్రామ్‌లీ అవాక్కయ్యింది. ఆమె చాలా జాక్‌ల నుంచి తన క్లారెంట్ (5) గురించి ఆలోచించలేదు, ఆమె విషయాలేవి తెలియదు. ఎలోన్‌ (6) లోని చాలా మంది నివాసితుల లానే, తాను కూడా పదహారు జాక్‌లు పూర్తయ్యాకా తన క్లారెంట్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఉల్తూర్, సీని వంటి వారు ఇందుకు మినహాయింపు. సీని పెద్దయ్యాకా కూడా, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు.

“ఆమె ఎక్కడో మహాసముద్రానికి సమీపంలో ఉన్న నగరంలో ఉంది. ఎందుకు?” ప్రామ్‍లీ అడిగింది.

“ఊరికే అడిగాను. ఏదేమైనా సీని గురించి కౌన్సిల్ ఏం చెబుతుందో తెలుసా?”

“మీరు దీని గురించి మాట్లాడాలనుకుంటే, ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌కి మారండి”, ప్రామ్‍లీ సలహా ఇచ్చింది.

వారు ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌కు మారారు. ఉల్తూర్ కొనసాగించింది, “అవతలి వైపు నుంచి వచ్చిన ‘విష్’ (7) కారణంగా చనిపోయిందని క్రేటీ ప్రకటించింది! ప్రామ్‍లీ, ఇది ఎలా సాధ్యం? మనం శాంతియుతంగా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడెందుకు ఇలా చేస్తారు? మరి సీని? తనే ఎందుకు? ఏదో పొరపాటు జరిగిందని అనిపిస్తోందా?”

ఉల్తూర్‌ మాటలకు ప్రామ్‍లీ అంతరాయం కలిగించలేదు. ఆమె తన మనసులో ఉన్న అన్ని ప్రశ్నలను అడిగేసింది. ఉల్తూర్ ముఖంపై కన్నీటి బొట్టు కారడంతో ఆమె మౌనం వహించింది.

“ప్రామ్‍లీ, ఈ ఘటనలో అవతలివైపు వారి ప్రమేయం నిజమేనని నిర్ధారణ అయితే, అప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు” దృఢ నిశ్చయంతో చెప్పింది ఉల్తూర్.

బయట, గాలి వీస్తోంది, పండిన అమర్‌తో కలిసిన రాత్రిపూల సువాసన గది అంతా వ్యాపించింది. “క్రేటీ చెప్పినదానిని – విశ్లేషణ నివేదిక ధృవీకరించిందా?” ప్రామ్‌లీ మెల్లగా అడిగింది. ఉల్తూర్ వేదన ప్రామ్‍లీని కలత చెందిస్తోంది.

“ఇంకా లేదు. తుది నివేదిక ఇంకో విహాన్ లోపు రావచ్చు.”

“అప్పటిదాకా వేచి ఉందాం ఉల్తూర్. అప్పటికి పంటకోతలు అయిపోయి నేను సిటీకి వచ్చేస్తాను. మనిద్దరం కలిసి ఈ పని చేయవచ్చు”.

“ఈ పరిస్థితిలో నువ్వు పంట గురించి ఎలా ఆలోచిస్తావు? నీ అసలు పని అది కాదు, ప్రామ్‍లీ. ఆ విషయం గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను”, సెక్యూర్ లైన్‍ని అకస్మాత్తుగా ఆపేసే ముందు చెప్పింది ఉల్తూర్.

ప్రామ్‌లీ లేచి నిలబడి కిటికీలు మూసేసి లైట్లు డిమ్ చేయడానికి బటన్‌ని నొక్కింది. తాను నివిదమ్‌కు అధిపతి అయినప్పుడు, ఉల్తూర్ నివసించే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోకి మారింది ప్రామ్‍లీ. ఉల్తూర్ అప్పటికి కూడా కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉండేది. ప్రామ్‍లీ సాంకేతిక నైపుణ్యాలు, ఇంకా ఒక సమూహాన్ని సమీకరించడంలో ఉల్తూర్ సామర్థ్యం – కౌన్సిల్ విషయాలలో కూడా వారిద్దరూ సహకరించుకోడానికి, కలిసి పనిచేయడానికి తోడ్పడింది. ఒకరి అపార్ట్‌మెంట్‌ల యాక్సెస్ కోడ్‌ మరొకరికి తెలుసు. ఉల్తూర్ వేదనని ప్రామ్‍లీ అర్థం చేసుకుంది, కానీ అమర్ పంట కోతకొచ్చింది.

నిద్రపోయే సమయమైంది. ఈ సంఘటన ఎలోన్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులకు దారితీస్తుందని ఆమెకి ఖచ్చితంగా తెలుసు.

🚀

నిద్ర లేచిన వెంటనే, ఈవీ తన ట్యాగ్‌ని చూసుకుంది. టియోని నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈవీ మళ్లీ టియోని అపార్ట్‌మెంట్ వర్క్‌స్టేషన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది, కానీ ఆమె సిస్టమ్ మూసివేయబడిందని గ్రహించింది. ఇది అసాధారణం. ట్యాగ్‌లోని సంభాషణల చిట్టడవిలో చర్చ – సీని గురించి కాకుండా, ఇతర సాధారణ విషయాల గురించే జరుగుతోంది. ఈ అంశం మీద కౌన్సిల్ తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

వెలుపల, అదొక ప్రకాశవంతమైన రోజు. నగరం అంతటా గాలి చురుకుగా వీస్తోంది, చల్లదనాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈవీ వాల్ట్‌ని స్క్రోల్ చేసింది. సందర్శకులు ఇంకా స్ట్రీమింగ్ ప్రారంభించనందున అది నిశ్శబ్దంగా ఉంది. తమ వారసత్వపు ఖజానా అయిన వాల్ట్‌ను ఈవీ నిర్వహిస్తుంది. వారు ఎలోన్‌లోకి వచ్చినప్పటి నుండి, భౌతికంగా లేదా వర్చువల్‌గా సేవ్ చేయబడిన మెటీరియల్ అంతా వాల్ట్‌లో లభ్యమవుతుంది. ఎలోన్ నివాసితులు వాల్ట్‌కి కొత్త మెటీరియల్‌లను క్రమం తప్పకుండా పంపుతారు. మెటీరియల్‌ని, డేటాను క్రోడీకరించడం; వాటిని సరైన వర్గీకరణల క్రింద కొత్త మెటీరియల్‌లను జోడించడం ఈవీ పని. ఆమె తన ఉద్యోగాన్ని ఇష్టపడుతుంది.

ఈవీ దుస్తులు ధరించి సిద్ధమయ్యేసరికి, ఆమె అపార్ట్‌మెం‍ట్‌లో సంగీతం వినిపించింది. ఈ ప్రత్యేకమైన సంగీతాన్ని కొంతకాలం క్రితం సీని – ఈవీతో పంచుకుంది. అది అద్భుతమైది, తాను అంతకు ముందెపుడు విననిది. ఇది ఎక్కడిదని ఈవీ అడిగితే, సీని సమాధానం దాటవేయటానికి ప్రయత్నించింది. “సరైన సమయం వచ్చినప్పుడు, ఇది ఎక్కడిదో నేను చెప్తాను” అని ఊరుకుంది.

ఆ సమాధానం గురించి ఆలోచించి ఈవీ ఆశ్చర్యపోయింది. సీని చెప్పిన కొన్ని విషయాలు అర్థంకానివిగా తోచాయి చాలా సార్లు, కానీ ఆమె ఇప్పటి వరకు వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

సీని దాదాపు ఐదు జాక్‌ల క్రితం నుంచి వాల్ట్‌ని సందర్శించడం ప్రారంభించింది. నివిదమ్‌లో భాగంగా, ఆమె ట్యాగ్‌లోని వాల్ట్‌లోని అన్ని మెటీరియల్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంది, అయినప్పటికీ ఆమె వ్యక్తిగతంగా రావడానికే ఇష్టపడింది, తరచుగా వచ్చి అక్కడ చాలా సమయం గడిపేది. ఈవీ మొదట్లో ఆమె వల్ల కొంచెం భయపడింది. చాలా కష్టపడి వెతికి తీయాల్సిన మెటీరియల్‌ని అడిగేది సీని. ఒకరోజు, సీని ఈవీ ఛాంబర్‌లోకి వచ్చి, “మీరు క్రానికల్‌ చదివారా?” అని అడిగింది

“లేదు”, ఈవీ సమాధానమిచ్చింది.

“ఎంత అవమానం, ఈవీ! మీరు వాల్ట్ మేనేజర్ అయ్యుండి మీరు దాన్ని చదవలేదా? ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని లేదా? మన గతంలో ఏం జరిగింది? మనం ఎలోన్‌కు చేరుకున్నప్పటి నుండి క్రానికల్ మన ప్రస్థానాన్ని వివరిస్తుంది, దాన్ని చదివితే మీ గురించి మీరు తెలుసుకుంటారు” అంది సీని.

ఈవీ నిశ్శబ్దంగా ఉండిపోయింది. సీని విద్యాభ్యాసం పూర్తి చేసే సమయంలో తమ గత చరిత్రను అధ్యయనం చేసింది.

ఎలోన్ ఒక అందమైన ప్రదేశం అని ఆమెకు తెలుసు. ఇది పెద్ద సరస్సులు మరియు మహాసముద్రాలు, కొండలు, ఇంకా చెట్లతో కప్పబడిన పర్వత సానువులను కలిగి ఉంది. వారు ఇక్కడ వేలాది జాక్‌లుగా నివసిస్తున్నారు. ధ్వంసమైన ‘భూమి’ అనే మరో గ్రహం నుండి తాము ఎలోన్‌కి వచ్చామని కూడా ఆమెకు తెలుసు. క్లాష్-ii తర్వాత ఫెన్స్ (8) ఏర్పడక ముందు, తాము అవతలివైపు ‘వారి’కి వ్యతిరేకంగా ఎంతో కాలం పోరాడారు. అయితే, ఫెన్స్ ఏర్పడినప్పటి నుండి, శాంతి నెలకొంది. ఈవీ ఇవన్నీ తెలుసుకుంది. కానీ, అంతకు మించి గతం పట్ల ఆమెకు ఆసక్తి కలగలేదు. మరింత తెలుసుకోవాలని ఆమెకు ఎప్పుడూ అనిపించలేదు. ఆమె సంగీతాన్ని తన ఉద్యోగాన్ని ఆస్వాదిస్తుంది; కొండలకి, సరస్సులకు వెళ్లడానికి ఇష్టపడుతుంది. వాటర్ గ్లైడింగ్ ఆమెకు ఇష్టమైన క్రీడ. ఈవీకి, ఇవి చాలు.

“నాకలా అనిపించలేదు సీని. మనం ఇక్కడ ఉన్నాం, అదే నాకు ముఖ్యం. అన్నీ తెలుసుకునే ప్రయత్నం నువ్వెందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.”

సీని నిట్టూర్చి ఊరుకుంది, గది నుండి బయలుదేరింది. సంభాషణ గురించి వెంటనే మరచిపోయింది ఈవీ.

కానీ, రెండు జాక్‌ల క్రితమే సీని నివిదమ్ వీడి ఇరానా హబ్‌లో చేరింది. వాల్ట్‌కి ఆమె సందర్శనలు మరింత తరచుగా జరిగాయి. వారు కలిసిన ప్రతిసారీ, ఆమె ఈవీని, “క్రానికల్‌ని చదవడం ప్రారంభించారా?” అని అడిగేది.

ప్రతీసారి లేదని జవాబు చెప్పడానికి విసుగొచ్చి, ఒక రోజున క్రానికల్‌ను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. చదవడం కంటే ప్రాసెసింగ్ సులభం. క్రానికల్ డాక్యుమెంట్‌కు తన ట్యాగ్‌ను జోడించి, విషయాన్ని నేరుగా తన మెదడు ప్రాసెస్ చేయడానికి అనుమతించింది ఈవీ. దానివల్ల కళ్ళకు విశ్రాంతి దొరికింది, చదవడం కంటే వేగంగా ఉంది. అయినప్పటికీ, క్రానికల్ – ఈవీకి ఆసక్తిని కలిగించలేదు. చిన్న సాకుతో, ఆమె ప్రాసెసింగ్‌ను వదిలివేసి, వేరొక అంశానికి వెళుతుంది. ఆమె క్రానికల్-ii తో ప్రారంభించింది, సీని చనిపోయినప్పుడు మధ్యలో ఎక్కడో ఉంది.

తన అపార్ట్‌మెంట్ నుండి బయటకు వచ్చి, వాల్ట్‌కి వెళ్ళేందుకు షటిల్‌ ఎక్కింది ఈవీ. వాల్ట్ కనబడగానే, ఈవీ, ఎప్పటిలాగే, దాని భారీతనం చూసి విస్తుపోయింది. అదొక పెద్ద భవనం, మనోహరంగా నిర్మించబడింది, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. సూర్యరశ్మిని లోపలికి వచ్చేలా ఆర్చ్‌డ్ రూఫ్ కలిగి ఉంది. వివిధ విభాగాలుగా విభజించబడిన ఆ భవనం, వర్క్‌స్టేషన్‌లతో నిండి ఉంది, వాల్ట్ చాలా దూరం నుండి చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.

ఐవీ ఛాంబర్ భవనం చివరి అంతస్తులో ఉంది. ఆమె తన గదిలో ప్రవేశించి పని ప్రారంభించింది. పగలు వేగంగా గడిచిపోయింది, గదిలోని కాంతి మసకబారుతుండగా, సాయంత్రం ఆమె మరోసారి టియోనిని సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ ఆమె సిస్టమ్ ఇప్పటికీ మూసివేయబడే ఉంది. సీని తర్వాత యాభైకి పైగా జాక్‌లు, టియోని తర్వాత దాదాపు ఇరవై ఐదు జాక్‌లు గడిపింది ఈవీ.

టియోని మొదట సందర్శకురాలిగా వాల్ట్‌కు వచ్చింది. నిబంధనల ప్రకారం వాల్ట్‌లోని మెటీరియల్‌కి ఆమె ట్యాగ్‌పై యాక్సెస్ ఇవ్వడానికి ముందు, ఆమె కొంతకాలం క్రమం తప్పకుండా సందర్శించింది.

టియోని ఎందుకు అందుబాటులో లేదో అని మళ్లీ ఆలోచించింది ఈవీ.

ఆమె సిస్టమ్‌లో క్రానికల్-ii తెరిచి ఉంది, కానీ తనకు ప్రాసెసింగ్ చేయాలని అనిపించలేదు. సీని చనిపోవడంతో ఇక ఆమెను ఒత్తిడి చేసేవారు లేరు. ఈవీ ‘డాక్యుమెంట్స్-రిసీవ్డ్’ ఛానెల్‌కు మారింది.

ఆమె జాబితాను స్క్రోల్ చేస్తున్నప్పుడు, సీని ఆమె మూడు రోజుల క్రితం పంపిన మ్యూజిక్ ఫైల్ కనబడింది. అకస్మాత్తుగా తీవ్ర విచారాన్ని అనుభవించింది ఈవీ. సీని ఆమెకు పంపిన చివరి మ్యూజిక్ ఫైల్ ఇదే. ఈ వింత ముగింపుని అంగీకరించడం ఎంత కష్టమో. ఆ మ్యూజిక్ ఫైల్‍ టియోనికి కూడా పంపబడిందని ఈవీ గమనించింది. టియోని సంగీతం వంటి వాటికి దూరంగా ఉండటం ఈవీని ఆశ్చర్యపరిచింది.

ఆ మ్యూజిక్ ఫైల్‍ని ప్లే చేసింది ఈవీ. ఆ గదిలో ఒక మధురమైన రాగం ప్రవహించింది. ఇంతకుముందు సీని పంచుకున్న సంగీతం మాదిరే ఇది కూడా చాలా బాగుంది. ఈవీ కళ్ళు మూసుకోగా, సంగీతం తన మాధుర్యంతో ఆమెను ముంచెత్తింది.

🚀

తార ఏడుస్తోంది. అయితే, ఆమె ఏడుపులు, గది చుట్టూ తేలియాడుతూ, టియోని చెవులకు మధురంగా ​​వినిపించాయి. తార నిద్రిస్తున్న చిన్న మంచం దగ్గరకు వెళ్లి ఆమె వైపు చూసింది. చాలా కాలంగా క్రియేషన్స్ జరగలేదు కాబట్టి, తారా ఉపయోగం కోసం సరిపోయే వాటిని సంపాదించడం కష్టం. తార ఏడుపు కొనసాగింది. క్రియేషన్ ఏడ్చినప్పుడల్లా, టియోని ఆమెను ఎత్తుకుని, ఆమె భుజంపై వేసుకుని, నెమ్మదిగా తట్టాలని ఇన్‍స్ట్రక్షన్ మాన్యువల్ పేర్కొంది. టియోని జాగ్రత్తగా ఆ పని చేసింది. తార చాలా చిన్నది. కొన్ని సమయాల్లో, పాప తన చేతుల్లోంచి జారిపోతుందేమోనని అనుకుంది టియోని. ఆమె ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌ని చాలాసార్లు ప్రాసెస్ చేసింది.

తారని భుజంపై వేసుకుకుని, టియోని గదిలో నెమ్మదిగా అటూ ఇటూ నడించింది. కాసేపయ్యాక, తార ఏడుపు ఆపేసి, నిశ్శబ్దంగా పడుకుంది. కిటికీ దగ్గర నిల్చుని, టియోని బయటకు చూసింది. సాయంత్రమైంది. మబ్బుల్లేని ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. షటిల్స్ వాటి సంబంధిత ఎనర్జీ కారిడార్‌లలో తేల్తూ ఉన్నాయి.

తార చిన్న ఆకారపు వెచ్చదనం టియోని శరీరమంతా వ్యాపించింది. ఇది ఒక వింత సంచలనం, పూర్తిగా కొత్త అనుభవం- తన శరీరంపై మరొక శరీరపు స్పర్శ! గత మూడు రోజులుగా, టియోని – మిగిలిన ఎలోన్‌ వాసులతో సంబంధం లేకుండా ఉంది. అక్కడ తార, టియోని మాత్రమే ఉన్నారు. తారతో ప్రతిరోజూ ఓ కొత్త ఆవిష్కరణ, కొత్త సంచలనం. క్లారెంట్‍లు అందరూ ఇలాగే భావిస్తారా అని టియోని మరోసారి ఆశ్చర్యపోయింది.

తారా నిద్రలోకి జారుకోవడంతో టియోని మెల్లగా ఆమెను చిన్న మంచం మీద పడుకోబెట్టింది. సిస్టమ్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఇంట్లో పూర్తి నిశ్శబ్దం నెలకొంది. ఆమె ట్యాగ్, వర్క్‌స్టేషన్, గోడపై ఉన్న స్క్రీన్ అన్నీ నిర్జీవంగా, నిశ్చలంగా ఉన్నాయి. ఒక క్షణం పాటు, మళ్ళీ కనెక్ట్ అవనా అని ఆలోచించింది టియోని, కానీ వెంటనే వద్దని నిర్ణయించుకుంది. సిస్టమ్‌కి మళ్లీ లింక్ చేయడానికి ముందు ఆమె తారతో మరికొంత ప్రత్యేక సమయాన్ని వెచ్చించాలని అనుకుంది.

టియోని కిటికీ దగ్గర వాలు కుర్చీలో కూర్చుని, ఆకాశాన్ని రాత్రి ఆక్రమించుకోవడాన్ని చూస్తూ ఉంది. రోజులోని ఈ గంట సీనికి కూడా ఇష్టం. క్రియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు సీని ఆశ్చర్యాన్ని ఆమె గుర్తుచేసుకుంది. టియోని సీనికి కొన్ని రీప్లేస్‌మెంట్స్ చేసినప్పటి నుండి వారు ఒకరికొకరు తెలుసు. క్లారెంట్ కావాలనే టియోని కోరిక గురించి సీని ఆమెను ఎన్నో ప్రశ్నలు వేసింది. టియోని విషయంలో, ఎన్నో జాక్‌లు గడిచినందున క్లారెంట్‌గా మారడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె రీప్లేస్‌మెంట్స్ లో నిపుణురాలు; అందుకని చికిత్స కోసం ఎలోన్ నలుమూలల నుంచి ఆమె వద్దకు జనాలు వస్తారు. తన బాధ్యతలలో భాగంగా తాను మార్పిడి చేసే అవయవాలను గమనిస్తూండడం వల్ల – క్రియేషన్‍కి వెళ్ళాలన్న కోరిక ఆమెలో తలెత్తింది.

కోరిక బీజమై క్లారెంట్ కావాలనే భావనగా మారింది. దాని గురించి ఆలోచించింది టియోని. అనుమతి కోసం ఆమె క్రియేషన్ ఫెసిలిటీని సంప్రదించినప్పుడు, వారు క్రియేషన్ ప్రక్రియ విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే వరకు వేచి ఉండాలని ఆమెకు చెప్పారు. జాక్‌లు గడిచేకొద్దీ, కోరిక బీజం ఆమెలో లోతుగా పాతుకుపోయింది. ఇది అవయవాలను అధ్యయనం చేయడంతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండదు; బదులుగా, అది ఆమెలో ఒక సహజమైన అవసరంగా మారింది.

కళ్ళు మూతలు పడుతుండగా, తనను, తారను చూడడానికి సీని ఇంకా ఎందుకు రాలేదని టియోని ఆశ్చర్యపోయింది. తారా రాక గురించి, అలాగే కొంతకాలం సిస్టమ్ నుండి డిలింక్ చేయాలనే టియోని నిర్ణయం గురించి సీనికి తెలుసు.

టియోని నిద్ర పడుతున్నప్పుడే, తారా మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. అలసిన టియోని కుర్చీలోంచి నెమ్మదిగా లేచి తారను ఎత్తుకుని గదిలో పచార్లు చేయసాగింది. బయట, రాత్రి చీకటి కమ్మేసింది, అంతా నిశ్శబ్దంగా ఉంది.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం

(2) Amar = శరీర అవయవాల రీప్లేస్‍మెంట్‍లో ఉపయోగపడే ఒక మొక్క

(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(4) Tobok,  టోబోక్ = యంత్ర సహకారి

(5) Clarent, క్లారెంట్ = క్లోనింగ్ పేరెంట్

(6) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(7) Vish, విష్ = విషమయమైన పదార్థం

(8) Fence ఫెన్స్= సరిహద్దు

(మళ్ళీ కలుద్దాం)


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com  అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version