Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-20

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[ఇమే పనిచేసే గేజర్‌ భవనానికి వస్తాడు ఒడెప్‌. అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకుంటాడు ఇమే, కానీ అదేంటో అతనికి అర్థం కాదు. ఒడెప్ రాకముందే అతని గురించి సమాచారం సేకరిస్తాడు ఇమే. ఒకప్పుడు ఎన్నో భవనాలని నిర్మించి, సైనెడ్ బృందానికి సలహాలిచ్చిన ఒడెప్, పదవీ విరమణ చేసి కొండల్లో నివాసం ఏర్పర్చుకున్నాకా, అతనేం చేస్తున్నాడో పెద్దగా తెలియలేదు. జీటాలో నెపో లభ్యతకి సంబంధించిన డేటాని పరిశీలిస్తున్నప్పుడు, ఇమేని మాటల్లో పెడతాడు ఒడెప్. కాసేపు జీటా, తాయ్ గ్రహాల గురించి మాట్లాడుకుంటారు. ఎలోన్ గ్రహాన్ని కనుక్కున్నది ఎవరో తెలుసా అని అడుగుతాడు ఒడెప్. తెలియదంటాడు ఇమే. ఆ సమాచారం ఎక్కడా లభించలేదని చెప్తాడు. ఎలోన్‌కి కనుగొన్నది ఆడో, మగో తెలుసా అని అడుగుతాడు ఒడెప్. ఇమే మౌనంగా ఉండిపోతాడు. జీవితం అనంతం కానప్పుడు, నిరంతరం కొనసాగనప్పుడు – అదెలా ఉండేదో అని ఆలోచించావా అని ఇమేని అడుగుతాడు ఒడెప్. లేదంటాడు ఇమే. తర్వాత వాళ్ళు తమ డేటాని విశ్లేషించడం మొదలుపెడతారు. సాయంత్రం గడిచిపోయి, మంచు కురవడం మొదలవుతుంది. మంచు తునకలని చూసి ఒడెప్ ఆనందిస్తే, తాను వాటిని రోజూ చూస్తాడు కనుక పెద్దగా ప్రాధాన్యమివ్వడు ఇమే. ఉన్నట్టుంది ఒడెప్ తలలో ఒక తెల్ల వెంట్రుకని గమనిస్తాడు ఇమే. మళ్ళీ కాసేపు డేటాని విశ్లేషించాకా, తనకి నిద్ర వస్తోందని చెప్పి వెళ్ళి పడుకుంటాడు ఒడెప్. సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ చేసి, తన గదికి వెళ్ళడానికి ఇమే ఎస్కలేటర్ వైపు వెళ్తుండగా, ‘ఫెన్స్‌కి అవతలి వైపు సంభవించిన నెక్స్‌ నిజమేనా, దానికి కారణం పురుషులే అని గైనేక్‍లు నిందిస్తున్నారు, ఇవన్నీ నిజాలేనా? అంటూ’  రాదుల్ పేరు మీద ఒక మెసేజ్ లెక్స్‌లో వస్తుంది. అది చదివి విస్తుపోతాడు ఇమే. కొద్ది సేపటి తర్వాత, అదే మెసేజ్ రాదుల్ పేరు లేకుండా లెక్స్ హైవేలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది, సంచలనం సృష్టిస్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం-5 – ప్రత్యామ్నాయాలు – 3వ భాగం

గేజర్ భవనానికి తీసుకెళ్లే ట్రావెలర్‌ (వాహనం)లో కూర్చున్నాడు వల్హన్. గేజర్ భవనం నగరం నుండి చాలా దూరంలో ఉంది. ట్రావెలర్ నుంచి కిటికీ బయటకి చూస్తే, అక్కడి దృశ్యాలన్నీ ఆకుపచ్చగా, కోమలంగా ఉన్నాయి. చెట్లు గాలికి ఊగుతున్నాయి, వాటి ఆకులపై బంగారు రంగు సూర్య కిరణాలు మెరుస్తున్నాయి.

అతని లెక్స్ (1) నిరంరాయంగా చప్పుడు చేస్తూనే ఉంది. లెక్స్ హైవేపై సిస్టమ్‌లో చాలా ఎక్కువ స్పందనలు వస్తున్న ఎంట్రీ చూసి వల్హన్ అయోమయానికి లోనయ్యాడు. ఆ సందేశాన్ని సృష్టించిన వ్యక్తి పేరు పేర్కొనలేదు, దాని కంటెంట్ చాలా నాటకీయంగా ఉంది. పురుషులు తమ దృష్టిని పూర్తిగా గైనేక్‌ (2) పై కేంద్రీకరింపబడేలా చేసింది, ఇది అనేక జాక్‌ (3) ల తర్వాత జరిగిన విషయం. ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. పురుషులు ‘యుద్ధం’ కోసం తొందరపడుతున్నారు, అది వారు పుచ్చుకోబోయే తదుపరి గ్లాసు ఎనాబ్ (4) అన్నట్లుగా, దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సంఘటనకీ పాటిక్స్ నడిపే ఉనుమో (5)తో ఏదైనా సంబంధం ఉందా అని అని అనుకున్నాడు వల్హన్. అది నిజమేనా? అక్కడ ఏదైనా నెక్స్ (6) సంభవించిందా?

బయటి ప్రకృతి దృశ్యం నిరుత్సాహంగా మారడంతో, వల్హన్ లెక్స్ చూడడం ఆపేసాడు. ఆలోచించడానికి, చర్యలు తీసుకోడానికి ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. లెక్స్‌లో కొత్త విషయం వస్తే, లెక్స్ హైవేలపై ఈ చర్చ అంతా దానిపైకి మళ్ళుతుందని అతనికి ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ట్రావెలర్‌కు ఇరువైపులా స్నోఫ్లేక్స్ కనిపిస్తున్నాయి. వాహనం

అకస్మాత్తుగా మలుపు తిరిగేసరికి, గేజర్ భవనం కనబడసాగింది. చాలా జాక్‌ల తర్వాత వల్హాన్ గేజర్‌కు రావడం ఇది రెండవసారి. గేజర్ భవనం అద్భుతంగా ఉంది, ఎత్తుగా, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంది. తాను రోండ్యురల్‌ (7) ఎక్కే ప్రదేశానికి, ట్రావెలర్‌ దగ్గరగా వస్తున్నప్పుడు వల్హన్ మంత్రముగ్ధుడై – ఆ భవనాన్ని చూశాడు. ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఊహించి, నిర్మించిన వ్యక్తులు ఇంకా నెపో (8)కు ప్రత్యామ్నాయాన్ని ఎలా కనుగొనలేకపోయారా అని ఒక క్షణం ఆశ్చర్యపోయాడు వల్హన్.

ట్రావెలర్‌ దింపిన ప్రదేశం నుండి కొద్ది దూరం నడిచి, గేజర్ భవనం వరకు తీసుకువెళ్ళే రోండ్యురల్‌లో కూర్చునాడు వల్హాన్. అది పైకి చేరుకున్నాక, తలుపు తెరుచుకుంది. ఎంబార్క్‌మెంట్ స్టేషన్ వద్ద ఇమే, ఒడెప్ – అతని కోసం వేచి చూస్తున్నారు. ఒడెప్ తన జుట్టును కత్తిరించుకున్నాడు, అతని ఇంట్లో అతన్ని ఆవరించి ఉన్న నీరసమైన సోమరితనం ఇప్పుడు అతనిలో కనబడడం లేదు.

“లెక్స్‌లో రాదుల్ పెట్టిన మెసేజ్ మీరు చదివారా? అది పురుషులలో కల్లోలం సృష్టిస్తోంది” చెప్పాడు ఇమే, వారు భవనం లోపలికి రాగానే.

“అది రాదుల్ పెట్టాడని నీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగాడు వల్హన్.

“నేను మొదట అతని ఐడితో మెసేజ్‌ని చూశాను కానీ తరువాత, ఎవరో దానిని అజ్ఞాతవ్యక్తి మెసేజ్‌గా మార్చారు. అది రాదుల్ నుండి వచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.”

వారు గేజర్ భవనపు వెచ్చని, రంగురంగుల పరిసరాలలోకి ప్రవేశించారు.

“ఇంతకీ లెక్స్‌లో ఆ మెసేజ్, దానిమీద చర్చ ఏమిటి?” అని కొంచెం అయోమయంగా అడిగాడు ఒడెప్. వల్హన్ వివరించాడు. వల్హన్ అక్కడ ఉండడం ఐమేకు ఉపశమనం కలిగించింది. వారు ముగ్గురూ టెలిస్కోప్ గది వైపు నడుస్తున్నప్పుడు, ఒడెప్ జుట్టులో ఓ తెల్ల వెంట్రుకను ఐమే స్పష్టంగా గుర్తించాడు. అది కుడి వైపున ఉంది. చీకటి ప్రదేశంలో ఒక వెండి గీతలా ఉంది. ఈ విషయం గురించి వల్హన్‌తో చర్చించడానికి ఒడెప్ అక్కడ లేనంత వరకు తను వేచి ఉండాల్సిందేనని ఇమేకు తెలుసు.

ఆ ముగ్గురు – ఐమే వర్క్ స్టేషన్ వైపు వెళ్లి పనిలోకి దిగారు. వారు డేటాను పరిశీలించి, చర్చించడానికి సిద్ధమయ్యే సమయానికి సూర్యుడు అస్తమించాడు.

“ఈ రెండు గ్రహాలలో, మనం నివసించడానికి తాయ్ మరింత అనుకూలంగా ఉంటుందని ఒడెప్ అభిప్రాయపడ్డారు” అని ఇమే చెప్పాడు వల్హాన్‌తో.

“నేను అతనితో ఏకీభవిస్తున్నాను. జీటాలోని ఉష్ణోగ్రత – దాని కక్ష్య, సూర్యుడి నుండి దూరం కారణంగా అత్యంత తీవ్రమైన పరిస్థితులను కల్పిస్తుంది. కాబట్టి, జీటాను వదిలివేసి తాయ్‍పై దృష్టి పెడదాం. మొదట, దానిలో నెపో ఉందా లేదా నెపో వలె శుద్ధి చేయగలది ఏదైనా ఉందా అని మనం నిర్ధారించుకోవాలి,” అన్నాడు వల్హన్. డేటాను అధ్యయనం చేస్తున్నప్పుడే ఈ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించుకున్నాడు వల్హన్.

“ఆ శోధనపై నేను దృష్టి పెడుతున్నాను. అందుకే నేను గేజర్‌లో నా బసను పొడిగించాను’ చెప్పాడు ఇమే.

“మనకు త్వరిత సమాధానాలు కావాలి, నేను. ఆ నెక్స్ గురించిన మెసేజ్ ఏదో ఈ లెక్స్‌లో తిరుగుతోందని, అది సరికాదని అనిపిస్తోంది. ఒడెప్, నీ అభిప్రాయం ఏమిటి?” వల్హన్ ఒడెప్‌ను సంభాషణలోకి లాగడానికి ప్రయత్నించాడు. మరోవైపు, ఒడెప్ కళ్ళు మూసుకుని తన కుర్చీలో పడుకుని ఉన్నాడు.

అతను కళ్ళు తెరిచి, మిగతా ఇద్దరినీ చూసి నవ్వి, లేచి నిలబడి గ్లాస్ పేమ్ వైపు నడిచాడు. బయట మంచు కురుస్తోంది. త్వరలోనే ఆకాశం నుండి తెల్లటి దుప్పటి క్రిందకి దిగి, కళ్ళముందు ఉన్న ప్రతిదానినీ కప్పేస్తుంది.

“మనం కొత్త గ్రహం కోసం ఎందుకు చూస్తున్నాం, వల్హన్?” అని ఒడెప్ అడిగాడు. సమాధానం అతనికి బాగా తెలిసి కూడా ప్రశ్న అడగటంతో వల్హన్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇమే ఒడెప్‌ని దగ్గరగా చూస్తున్నాడు. అతను కూర్చున్న చోట నుండి, ఒడెప్ జుట్టులో తెల్ల వెంట్రుక స్పష్టంగా కనిపించింది.

“నెపో నిల్వలు క్షీణిస్తున్నాయి, త్వరలో పూర్తిగా అయిపోతాయి. కాబట్టి మనం ప్రత్యామ్నాయాన్ని లేదా  ఇప్పటికే నెపో ఉన్న ప్రదేశాన్ని కనుగొనాలి. ఇప్పటివరకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంలో విఫలమైనందున, ఒక విధంగా, మనం రెండో ఎంపిక కోసం చూస్తున్నామని నేను అనుకుంటున్నాను” అని జవాబిచ్చాడు వల్హన్.

“నెపో, ఇంకా దాని ప్రత్యామ్నాయం కూడా ఇక్కడే ఎలోన్‌ (9) లో ఉన్నాయి. గైనేక్‌ దగ్గర రెండూ ఉన్నాయి. కాబట్టి, మీరు గెలాక్సీలలో మరెక్కడో ఎందుకు వెతుకుతున్నారు?” అడిగాడు ఒడెప్‌ ఇంకా పేన్‌లోంచి బయటకు చూస్తూనే.

వల్హన్ ఒడెప్‌ వైపు తీక్షణంగా చూశాడు. కొండల్లోకి వెళ్ళిపోయినప్పటి నుండి, ఒడెప్ ఇలా గందరగోళంగా మాట్లాడటం ప్రారంభించాడు. అతనేం చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తోందని భావించాడు వల్హన్.

“అంటే, లెక్స్‌లోని ఆ సందేశంతో నువ్వు ఏకీభవిస్తున్నావా? మనం వారిని ఎదుర్కొని, వారి సగభాగాన్ని ఆక్రమించి, వారిని నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని నమ్ముతున్నావా?’ అడిగాడు వల్హన్. ఎందుకంటే అది ఒడెప్‌ ప్రశ్నకి తార్కిక ఫలితంలా అనిపించింది.

గదంతా గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. ఒడెప్‌ వెనక్కి వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. అతని ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తూ వల్హన్ నిటారుగా కూర్చున్నాడు. మరోవైపు, ఇమే – ఒడెప్‌ జుట్టులోని తెల్ల వెంట్రుకని చూస్తూ ఉండిపోయాను. ఎవరూ మాట్లాడలేదు. వల్హన్ వ్యక్తం చేసిన ఆలోచనలు గాలిలో ఎగిరిపోతున్న మేఘం తునకల్లా గదిలో తేలుతున్నాయి.

‘మీ జుట్టులో తెల్ల వెంట్రుక ఎందుకు ఉంది, ఒడెప్‌?’ అని అస్పష్టంగా అడిగాడు ఇమే. అతని మాటలకు అతనే ఆశ్చర్యపోయాడు. దిగ్భ్రాంతి చెందాడు ఒడెప్. కాసేపు మౌనం తర్వాత, ఒడెప్‌ నవ్వు గది అంతటా బిగ్గరగా, స్పష్టంగా వినిపించింది. అతను తన జుట్టులో చేతులు జొనిపి, వర్క్ స్టేషన్ వైపు వంగి, తెరపై తన ప్రతిబింబంలో తన జుట్టును ఒక వైపు నుండి మరొక వైపుకు చూశాడు.

“మమ్మల్ని వెంటాడుతున్న అన్ని ప్రశ్నలలో సమాధానం చెప్పదగ్గ ఏకైక ప్రశ్న ఇదేనని అనుకుంటున్నాను. నేను ప్రత్యామ్నాయాలు తీసుకోడం  మానేసినందున నా జుట్టులో తెల్ల వెంట్రుక ఉంది. నా కళ్ళ క్రింద చారలు ఉన్నాయి. నేను తరచుగా అలసిపోతాను. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవాలి. నా ఇంటి దగ్గర ఉన్న కొండ ఎక్కినప్పుడు నాకు ఊపిరి ఆడదు,” అని కుట్రపూరిత స్వరంలో గుసగుసగా చెప్పాడు ఒడెప్, “ఒకటి కాదు రెండు తెల్ల వెంట్రుకలున్నాయి నా జుట్టులో” చెప్పి, మెల్లగా నవ్వాడు ఒడెప్‌.

“నేను వృద్ధుడిని ఇమే, భవిష్యత్తులో ఏదో ఒక రోజు నాకు నెక్స్ సంభవిస్తుంది. వల్హన్, అంతగా షాక్ అవ్వకు. ఈ ఆలోచన చాలా కాలం క్రితం, కొండల దగ్గర ఒక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ డిజైన్ పూర్తి చేసినప్పుడు వచ్చింది. అప్పటికే, నేను చాలా భవనాలను డిజైన్ చేసి నిర్మించాను, సైనెడ్ కోసం చాలా పని చేసాను, అనేక నిబంధనలు రూపొందించాను. లెక్కలేనన్ని విషయాలను చర్చించాను. ఒక రోజు, నేను గట్టుపై కూర్చుని – నువ్వు చివరిసారిగా సందర్శించినప్పుడు – మనిద్దరం కూర్చున్న ఆ గట్టు వల్హన్ – సూర్యుడు అస్తమించడాన్ని చూస్తున్నప్పుడు, ఆ ఆలోచన నా మనసులో మెదిలింది. మొత్తం విశ్వం – సృష్టి, స్థితి, లయల ఆవృతి కలిగి ఉంటుంది. ఇది అంతులేని ప్రక్రియ. నేను కూర్చుని చూసిన చోట నుండి, ప్రతిరోజూ సూర్యుడు అస్తమించాడు, మూడు చందమామలు ఉదయించాయి. తర్వాత, అవి వెళ్ళిపోయాక, తిరిగి సూర్యుడు కనిపించాడు. వాటిలో ప్రతి ఒక్కటి కనిపించి, మాయమై, తిరిగి కనిపించింది. అంటే ఏదీ శాశ్వతంగా ఉండదు. మొదట ఇది కేవలం ఒక ఆలోచన, కానీ జాక్‌లు గడిచేసరికి అది కోరికగా మారింది. నేను ఏదైనా నోటస్ (10) కి వెళ్ళిన ప్రతిసారీ, విశ్వం నా చెవుల్లో ఏదో గుసగుసలాడుతున్నట్లు అనిపించేది. ఆ గుసగుసలు బిగ్గరగా పెరిగిపోయాయి, నేను ఇక దానిని విస్మరించలేనంత బిగ్గరగా మారాయి. నిశ్శబ్దం శబ్దాన్ని ముంచివేస్తుందా లేదా కొన్ని సమాధానాలను అందిస్తుందా అనే ఆశతో నేను నా కొండప్రాంతపు ఇంటికి తిరిగి వెళ్ళాను. అయితే, ఆ నిశ్శబ్దం కొత్త ప్రశ్నలకు దారితీసింది. ఆ సుదీర్ఘ రోజుల్లో, వేరే ఏ పని లేనప్పుడు, నేను సమాధానాల కోసం వెతికాను.. కోషుమ్‌లో, సైనెడ్ పత్రాలలో, నేను ఆలోచించగలిగే అన్ని ప్రదేశాలలో వెతికాను. కానీ అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఉన్నాయని; ఇన్ని జాక్‌లలో ఎవరూ ఈ సాధారణ ప్రశ్నను అడగలేదని గ్రహించాను – మన సమయం పరిమితమైతే మన జీవితాలు ఎలా మారుతాయి? మన భవిష్యత్తులో నెక్స్ ఉందని మనకు తెలిస్తే? మనం శాశ్వతంగా ఉండటం గురించి మాత్రమే ఆలోచించే జాతి. మన ప్రయత్నాలు, ఆలోచనలు మరియు పరిశోధనలన్నీ ఆ ఒక్క దిశలో లక్ష్యంగా పెట్టుకున్నాయి. మనం నెపోను కనుగొన్నాం, ఇక అప్పటి నుండి మనం దానిపై దృష్టి సారించాం.

దానిని శుద్ధి చేయడం, మెరుగుపరచడం, మరిన్ని ప్రత్యామ్నాయాలను కనుగొనడంపైనే పని చేశాం. ఇప్పుడు, నెపో క్షీణిస్తోందని మనకు తెలుసు కాబట్టి, అది లభించే మరొక ప్రపంచాన్ని అన్వేషించడం లేదా గైనేక్‌తో యుద్ధం చేయడం గురించి ఆలోచించడం ప్రారంభించాం. శాశ్వతంగా జీవించడమనే ఏకైక లక్ష్యంతో మన ప్రపంచాన్ని నిర్మించుకున్నాం” అని కొన్ని క్షణాలు ఆపి, “నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తిందామా, ఇమే?” అంటూ మాట మార్చాడు ఒడెప్‌.

వల్హన్ కుర్చీలో కదలకుండా కూర్చుండిపోగా, ఒడెప్ ఆజ్ఞకు ప్రతిస్పందనగా, ఐమే ఆశ్చర్యంగా పాంట్రీ వైపు నడిచాడు. ఒడెప్‌ మళ్ళీ కిటికీ వైపు తిరుగుతూ బయట చీకటిని చూశాడు. చివరికి మంచు కురవడం ఆగిపోయింది.

“ఒడెప్, నువ్వేమీ సరదాగా మాట్లాడడం లేదు కదా,” అన్నాడు వల్హన్. “నువ్వు ప్రత్యామ్నాయాలను ఆపేసి, నెక్స్‌కి సిద్ధమవ్వాలని నిర్ణయించుకోలేవు. ఇది అనూహ్యం. ఇంతకు ముందు ఎలోన్‌లో ఎన్నడూ ఇలా జరగలేదు. నువ్వెందుకిలా చేస్తున్నావు?” అడిగాడు వల్హన్ అయోమయంగా.

ఒడెప్‌ మౌనంగా ఉన్నాడు. గది తలుపు తెరుచుకుంది, ఇమే ఉడికించిన కూరగాయలు, టిబ్లి సాస్ కలిపిన మూడు గిన్నెలలో అన్నంతో పాటు అనేక కింపాయో రొట్టెలతో లోపలికి వచ్చాడు. అతను ఎటువంటి ఆలోచన లేకుండా ట్రే లో రకరకాల పదార్థాలు పెట్టుకుని వచ్చినట్లు అనిపించింది. అతను మూడు గ్లాసులలో ఎనాబ్ నింపి టేబుల్ మీద ఉంచాడు. ఒడెప్‌ తినడం ప్రారంభించాడు. మిగతా ఇద్దరు మౌనంగా అతని వైపు చూశారు. ఒడెప్‌ తమ ప్రపంచానికి చెందినవాడు కాదని వారికి అనిపించసాగింది.

చివరిసారిగా తను ఒడెప్‌ని కలిసినప్పుడు అతనిలో తాను గమనించిన వైవిధ్యపు వెలుగుని గుర్తుచేసుకున్నాడు. అతని శరీరం క్షీణిస్తున్నందున, అతను దానిని జరగనివ్వడం వల్లనే ఆ వెలుగు ఉద్భవించిందని వల్హన్ ఇప్పుడు గ్రహించాడు.

“ఇమే, అందుబాటులో ఉన్న మొదటి నోటస్‌లో స్లాట్ బుక్ చేయి. మనం రేపు ఉదయం ఒడెప్‌‌ని అక్కడికి తీసుకెళ్తున్నాము”.

ఒడెప్ నిట్టూర్చాడు. “ముందు కాస్త తిను వల్హన్. నువ్వు కూడా, ఇమే. బాగా పొద్దుపోయింది. నేను, నా తెల్ల జుట్టు మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.” అన్నాడు

“నాకు ఆకలిగా లేదు” అన్నాడు ఇమే. అతను ఒడెప్ వైపు చూడకుండా ఉండలేకపోయాడు. అకస్మాత్తుగా ఒడెప్, ఇమేకి తెలిసిన గెలాక్సీలో కనిపించిన వింత కొత్త నక్షత్రంలా అనిపించాడు.

వల్హన్ తన ఆహారం ప్లేట్ తీసుకున్నాడు. కొద్దిగా తిని, గ్లాసులోని ఎనాబ్‌ను అందుకున్నాడు.

‘నెపో నిల్వలు భారీగా క్షీణించిపోతున్నప్పుడు, అధమ స్థాయికి చేరుకునే ముందు – ఇతర నివాసయోగ్యమైన గ్రహాల కోసం వెతకమని తనికి చెప్పింది ఒడెప్‌ కదా? మరి ఇప్పుడు అతను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒడెప్‌ తనకి మార్గనిర్దేశం చేయడానికి, సహాయం చేయడానికి ఉండని సమయం వస్తుందా?’ అనుకున్నాడు వల్హన్. కానీ, తాను అలా జరగనివ్వడు అని తలచాడు.

“ఇమే, నెక్స్ అంటే ఏమిటో తెలుసా?” అడిగాడు ఒడెప్‌.

“అవును. ఒక వ్యక్తి ఉనికిలో లేకుండా పోయినప్పుడు నెక్స్ సంభవిస్తుంది. సిద్ధాంతపరంగా, ఇది మనలో ఎవరికైనా ఇప్పటికీ జరగవచ్చని నాకు చెప్పారు, కానీ అది చాలా కాలంగా సంభవించలేదు. నిజానికి, నాకు తెలిసిన ఎవరికీ ఎప్పుడూ నెక్స్ సంభవించలేదు” అని ఇమే బదులిచ్చాడు.

“మనకు, నెక్స్ అనేది ఇప్పుడు ఒక భావన మాత్రమే. ఒక “బహుశా” లేదా “కావచ్చు” అనే సంఘటన. ఒక విధంగా, మనం దానిని జయించాము. చాలా కాలంగా ఉన్న నాలాంటి వ్యక్తులకు, మేము ఎలోన్‌కు వచ్చినప్పుడు, నెక్స్‌లు సంభవించాయని, అవి తరచుగా జరుగుతాయని బాగా తెలుసు. ముఖ్యంగా గైనేక్‌తో జరిగిన రెండు యుద్ధాలలో ఎన్నో నెక్స్‌లు సంభవించాయి. ఆ సమయంలో అది ఒక వాస్తవం, ఓడించాల్సిన శత్రువు. కాలక్రమేణా, మనం దానిని ఫెన్స్ (11) కు రెండు వైపులా ఓడించాము. తరువాత, మన సంఖ్యలను పెంచుకునే ప్రయత్నంలో, మనం క్రియేషన్ (12) ప్రారంభించాము. కానీ నెక్స్‌లు అరుదవడంతో, క్రియేషన్స్ తగ్గసాగాయి. మనం చాలా జాక్‌ల పాటు వాటిపై తాత్కాలిక నిషేధాన్ని కూడా విధించాము.” అని చెప్పి, “అమలులో ఉన్న ఈ తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయడం అనే అంశాన్ని ఎవరూ ఎందుకు లేవనెత్తలేదో మీకు తెలుసా?” అడిగాడు ఒడెప్‌. ఇమే, వల్హాన్ ఇద్దరూ ఏమీ మాట్లాడకపోవడంతో ఒడెప్ కొనసాగించాడు, “ఎందుకంటే, మనం, పురుషులు, ఒక జాతిగా, మనం కూడా క్రియేషన్ చేయగలమని మర్చిపోయాము”.

“రాదుల్ తాత్కాలిక నిషేధం గురించిన ఈ అంశాన్ని పునఃపరిశీలన కోసం సైనెడ్‌లో ప్రస్తావించాలని యోచిస్తున్నాడు” అంటూ జోక్యం చేసుకున్నాడు ఇమే. సంభాషణ మరోసారి తాను పరిష్కరించగల విషయాలపైకి మళ్ళడం పట్ల అతను సంతోషించాడు.

(ఇంకా ఉంది)

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Lex, లెక్స్ = సమాచార పరికరం

(2) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం

(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(4) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం

(5) Unumo ఉనుమో = ఫెన్స్‌కి అవతల స్త్రీ జాతి నివసించే ప్రాంతాలలో జరుగుతున్న వాటిని ఆరా తీసే రహస్య సంస్థ

(6) Nex, నెక్స్ = మరణం, చావు

(7) Rondural, రోండ్యురల్ – పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళే వాహనం

(8) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(9) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(10) Notus, నోటస్ = అవయవ భర్తీ కేంద్రం Organ Replacement Centre,

(11) Fence ఫెన్స్= సరిహద్దు, కంచె

(12) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version