Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-21

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[ఇమే పనిచేసే గేజర్‌ భవనానికి ట్రావెలర్‌లో బయల్దేరుతాడు వల్హన్. లెక్స్‌లో నిరంతరాయంగా వస్తున్న సందేశాలు అతన్ని కలవరపరుస్తాయి. పురుషులు గైనేక్ పై యుద్ధానికి తొందరపడడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫెన్స్‌కి అటువైనపు నెక్స్ సంభవించిందా అని ఆలోచిస్తాడు. గేజర్ భవనాన్ని చూస్తూ అబ్బురపడుతూ, ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఊహించి, నిర్మించిన వ్యక్తులు ఇంకా నెపోకు ప్రత్యామ్నాయాన్ని ఎందుకు కనుగొనలేకపోయారా అని అనుకుంటాడు. గేజర్ భవనం చేరి, ఇమే గది వద్దకు వెళ్తాడు. రాదుల్ పెట్టాడని భావిస్తున్న ఆ మెసెజ్ గురించి ముగ్గురు చర్చించుకుంటారు. ఇమే గుర్తించిన రెండు గ్రహాలలో తాయ్‌లో నెపో లేదా నెపో లాంటి శుద్ధి చేయదగ్గ పదార్థం ఏదైనా ఉందేమో చూడమని ఇమేకి చెప్తాడు. తాను ఆ పని మీదే ఉన్నానని అంటాడు ఇమే. నెపో నిల్వలు, ప్రత్యామ్నాయాలు ఎలోన్‌లో గైనేక్ వద్ద ఉన్నప్పుడు, విశ్వంలో ఇతర గ్రహాలలో ఎందుకు వెదుతున్నారని అడుగుతాడు ఒడెప్. చర్చల మధ్యలో ఒడెప్ జుట్టులో తెల్ల వెంట్రుకని ఒకదాన్ని గమనించి దాని గురించి అడుగుతాడు ఇమే. తాను ప్రత్యామ్నాయాలు తీసుకోడం మానేసినందున శరీరం క్షీణించసాగిందని, అందుకే జుట్టులో తెల్లవెంట్రుకలున్నాయని చెప్తాడు ఒడెప్. తాను అవయవాలను ఎందుకు మార్పిడి చేసుకోవడంలేదో చెప్తాడు. ఇవన్నీ సరదాగా చెప్పడం లేదు కదా అని అడుగుతాడు వల్హన్. ఇమే లేచి తినడానికి పదార్థాలు  తీసుకురావడానికి వెళ్తాడు. ఆహారం తీసుకుంటూ నెపో గురించి, నెక్స్ గురించి మాట్లాడుకుంటారు. పురుషులు, ఒక జాతిగా, మనం కూడా క్రియేషన్ చేయగలమని మర్చిపోయారని అంటాడు ఒడెప్. ఇమే రాదుల్ ప్రస్తావన తెస్తాడు. ఇక చదవండి.]

అధ్యాయం-5 – ప్రత్యామ్నాయాలు – 4వ భాగం

“మనం శాశ్వతత్వం ఎంచుకున్నందున క్రియేషన్ (1) గురించి మరచిపోయాము. మనకు నెక్స్ (2) లేవు, కాబట్టి మనం సృష్టించాల్సిన అవసరం లేదు. మనం ఈ గ్రహం మీద ఉన్నాం, ఇక్కడే శాశ్వతంగా ఉంటామని భావిస్తాము. మనం మన శరీరాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తున్నాము, మన మనస్సు మరో తరం మానవులను సృష్టించడం గురించి ఆలోచిస్తోంది. ఈ నిషేధానికి కారణం ఏమైనప్పటికీ, అది కొనసాగడానికి కారణం మనం క్రియేషన్ అవసరాన్ని మరచిపోవడమే” చెప్పాడు ఒడెప్.

“కానీ ఈ తాత్కాలిక నిషేధంలో తప్పేముంది, ఓడెప్? నెక్స్‌లు ఉండడం, మరిన్ని క్రియేషన్స్ చేసుకోవడం – జీవించడానికి ఒక మంచి మార్గం అని నువ్వెందుకు అనుకుంటున్నావు?” అడిగాడు వల్హన్.

“వల్హన్, ఇది ఒక ఉత్తమమైన మార్గమని నేను చెప్పడం లేదు. గతంలో మనం ఈ విధంగా జీవించామని మాత్రమే చెబుతున్నాను. జీవితం యొక్క పరిమితి, ఒకరి జీవన విధానాన్ని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవడమే నేను ప్రయత్నిస్తున్నది. అందుకే నేను గతాన్ని లోతుగా పరిశోధించాను, ఎందుకంటే అంతిమంగా, ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో చాలా వరకు మన గతమే నిర్ణయిస్తుంది. శాశ్వతంగా జీవించాలనే భావన ఈ రోజు మనల్ని నడిపించే శక్తిగా ఎందుకు ఉందో, గతంలో మనల్ని నడిపించిన శక్తి ఏమిటో నేను అర్థం చేసుకోవాలనుకున్నాను.”

అతను ఊపిరి పీల్చుకుని, తన మాటలు వాళ్ళ మనసుల్లోకి ఇంకనిచ్చాడు.

“భూమిపై జీవం ఎలా ఉండేదో తెలిపే కొంత ప్రాథమిక సమాచారం కోషుమ్‌లో ఉంది. మన పూర్వీకులకు సమయం చాలా పరిమితంగా ఉండేది, అందుకే వారు జీవశాస్త్రంతో పోరాడటం ప్రారంభించారు. వారు వ్యాధులతోనూ, ఇంకా నెక్స్‌కు కారణమయ్యే ఇతర అనేక కారణాలతో పోరాడారు, కానీ ఆ యుద్ధంలో వారు ఎన్నడూ పూర్తిగా గెలవలేకపోయారు. మనం దానిని ముందుకు తీసుకువెళ్లి, మెరుగుపరిచి, కాలక్రమేణా నెక్స్‌ను జయించాము. మన గతంలో, మరో గెలాక్సీలో ప్రారంభమైన ఆ యుద్ధమే ఈ రోజు మనల్ని ఇలా తీర్చిదిద్దింది.”

కాస్త విరామం తర్వాత అతను ఇలా కొనసాగించాడు, “పరిమిత సమయం అనేది సద్వినియోగం చేసుకోవలసిన ఒక వనరుగా మారింది. నెక్స్ తమ కోసం ఎదురుచూస్తోందని వారికి మొదటి నుంచే తెలుసు కాబట్టి, భూలోకవాసులు ప్రతి అనుభవాన్ని ఆస్వాదించడానికి, వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సేకరించడానికి తమ జీవితాలను ఒక అంతులేని అన్వేషణగా జీవించారు. సృష్టించడం, ఆవిష్కరించడం, రాణించడం, సరిహద్దులను ఛేదించడం – ఇవే ఒక సార్థకమైన జీవిత సారం అయ్యాయి. ఒక విధంగా, నెక్స్ గురించిన ఆశ – మనం కేవలం భావనాత్మక స్థాయికి పరిమితం చేసిన ఆ సంఘటన – భూమిపై జీవన విధానాన్ని తీర్చిదిద్ది, నిర్దేశించింది. జీవితం స్వల్పకాలికమైనదని, దానిని సాధ్యమైన ప్రతి విధంగానూ గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనే ఆ నాగరికతకు చోదక శక్తిగా నిలిచింది. వారు తమ జీవితాన్ని అనేక విధాలుగా పొడిగించుకోవడానికి ప్రయత్నించారు; కొన్నింటిలో విజయం సాధించారు, మరికొన్నింటిలో విఫలమయ్యారు. వారి గ్రహంపై సహజ పరిస్థితులు క్షీణించడంతో, వారు ప్రత్యామ్నాయ నివాసం కోసం విశ్వమంతటా వెతికారు. వారు ఎలోన్‌ (3)ను కనుగొని ఇక్కడికి వచ్చారు. ఆ విధంగానే మనం ఈ గదిలో కూర్చుని, చుట్టూ ఉన్న చీకటిలో ఒక కాంతి పుంజంలా వెలుగుతున్న ఈ గదిలో నెక్స్, నెపో (4), గైనేక్ (5) గురించి చర్చిస్తున్నాం.”

ఒడెప్ తన కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతను ప్రదర్శిస్తున్న ప్రశాంతతకు విరుద్ధంగా గదిలో ఉద్రిక్తత నెలకొని ఉంది.

ఇమే లేచి టెలిస్కోప్ వైపు నడిచాడు. ఒడెప్ చెబుతున్న వింత విషయాలన్నింటి నుండి దూరంగా వెళ్ళడానికి అదొక మార్గం, టెలిస్కోప్ నుంచి అంతరిక్షంలోకి చూడడం అతనికి సుపరిచితంగా, తెలిసినదిగా అనిపించింది. సుదూరంలో, ఆకాశంలో జీటా, తాయ్ గ్రహాలు మినుకుమినుకుమంటూ, ఒక కొత్త ప్రపంచపు వాగ్దానంతో అతన్ని పిలుస్తున్నట్లు అనిపించాయి.

చివరికి, కాసేపటికి, ఎన్నో జాక్స్ (6) గడిచినట్టు అనిపించిన తర్వాత, వల్హన్ మాట్లాడుతూ – “అయితే, మనం సాధించిన ప్రగతి అంతా విశ్వం మన కోసం రూపొందించిన దానికి వ్యతిరేకమని చెప్పాలనుకుంటున్నావా ఒడెప్? అదెలా సాధ్యం?” అన్నాడు. వల్హన్ లేచి నిలబడి, తమ చుట్టూ ఉన్న ప్రపంచం వైపు చేతులు చాచి చూపిస్తూ, “ఇదే మనం జీవించే విధానం. లెక్కలేనన్ని యుగాలుగా ఇదే మన జీవన విధానం. ఎవరూ ఫిర్యాదు చేయలేదు; మనం ఎలాంటి అశాంతిని ఎదుర్కోవడం లేదు. గతంలో మనుషులు జీవించిన విధానమే ఉత్తమమైనదని నువ్వెందుకు అనుకుంటున్నావు? వాళ్ళు కూడా నెక్స్‌తో పోరాడటానికి ప్రయత్నించారన్న సంగతి మర్చిపోకు. శాశ్వతంగా జీవించడం వారికి ఒక కలగా ఉండేది. మనకు అది వాస్తవం.”

వల్హన్ గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు.

ఇమే ఈ వింత చర్చను ముగించి, అసలు విషయానికి తిరిగి రావాలనుకున్నాడు. ఒడెప్ సూచిస్తున్నది విచిత్రంగా ఉంది. పురుషులు ఖచ్చితంగా మరణించడం మంచి విషయమా? అంతకంటే అసంబద్ధమైనది మరొకటి ఉండదు. ఇమే తన కుర్చీలో వాలి ఉన్న ఒడెప్‌ను చూశాడు. అతను తను ఇంతవరకు చూసిన ఏ పురుషుడి కంటే చాలా పెద్దవాడిగా కనిపించాడు. తనలో ఒక అసహ్యం పుడుతున్నట్లు ఇమేకు అనిపించింది.

“ఒడెప్, మేము, ఎలోన్ ప్రజలం, నెక్స్ కోసం ఆరాటపడం. దానిని అధిగమించడానికి మార్గాలను కనుగొంటాం. మేము లెక్కలేనన్ని జాక్‌లుగా అలా చేస్తూనే ఉన్నాం, దానిలో గొప్ప పురోగతిని సాధించగలిగాము. క్షీణిస్తున్న నెపో నిల్వలను ఎదుర్కొంటున్నప్పుడు నెక్స్‌ను ఓడించడానికి మార్గాలను కనుగొనడమే, ఈ రోజు మన ముందున్న సవాలు. కాబట్టి, దయచేసి ఈ విషయంలో తికమక పెట్టద్దు”, ఐమే స్వరంలోని అధికారపూరితమైన, నిశ్చయాత్మకమైన ధ్వని వల్హన్‌ను ఆశ్చర్యపరిచింది.

ఒడెప్ నిట్టూర్చి, “ఈ ప్రయాణంలో మనం ఏమి కోల్పోయామో తెలుసుకోవడమే నా ప్రయత్నమంతా. గతం బాగుందని గానీ, మనం ఏదో తప్పు చేస్తున్నామని గానీ దీని అర్థం కాదు. కానీ, ఒక జాతిగా మనం అనంతమైన జీవితాన్ని పొందినట్లయితే, మనం ఏదో కోల్పోయి ఉండాలి. నేను గుర్తించాలనుకుంటున్నది అదే. అందుకే నా కాలాన్ని పరిమితం చేసుకుని, నేను భిన్నంగా ఎలా జీవిస్తానో చూడాలని నిర్ణయించుకున్నాను. నా శరీరం క్రమంగా క్షీణిస్తున్న కొద్దీ, క్రియేషన్ చేయాలనే కోరిక నాలో పాతుకుంటోందని నేను గ్రహించాను. అందుకే, ఇమే, మారటోరియంపై చర్చను ప్రారంభించాలన్న రాదుల్ వైఖరికి నేను మద్దతు ఇస్తాను. మనం క్రియేషన్స్ గురించి మాట్లాడటం ప్రారంభించాలి. దానిని మన దృష్టి నుండి మరుగున పడనివ్వకూడదు. మన ప్రయాణంలో మనం ఏదో కోల్పోయామని నేను అనుకుంటున్నాను. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, లయం, సృష్టి అనేవి విశ్వంలో లయబద్ధంగా సాగుతాయి. మన జీవన విధానం లయంలో సుదీర్ఘ విరామాన్ని తీసుకువచ్చింది, అందుకే మనం సృష్టించాలనే తపనను కోల్పోయాము. మనం కోల్పోయిన ఇతర విషయాలు, ఇతర ఆకాంక్షలు కూడా ఉండి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆ నష్టాన్ని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. బహుశా పునరుద్ధరించడానికి, వెతకడానికి విలువైనది ఏదైనా ఉండవచ్చు. నా వరకూ, క్రియేషన్స్‌ని పునరుద్ధరించడం విలువైనది.”

ఒడెప్ మాటలు విన్న తర్వాత, వల్హన్ ఇమేతో ఏకీభవించసాగాడు. ఒడెప్, తనకున్న అపారమైన జ్ఞానం మరియు ప్రతిభతో, పూర్తిగా భిన్నమైన మార్గంలో ఉన్నాడు.

“ఒడెప్, ఒక్క క్షణం పాటు ఈ లాభనష్టాల ఆలోచనను పక్కన పెడదాం. ఒకవేళ తాయ్‌లో మనకు నెపో నిల్వలు దొరక్కపోయినా, వెంటనే ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా కనుక్కోలేకపోయినా, గైనేక్‌తో చివరి పోరాటం చేయడానికి ఇదే సరైన సమయం అని నీకు అనిపిస్తుందా?” వల్హన్ తన ప్రశ్నకు తానే ఆశ్చర్యపోయాడు. ఇంత తేలికగా అది బయటకు వచ్చిందంటే, ఈ ఆలోచన తన ఉపచేతనలో ఎక్కడో దాగి ఉండి ఉండాలని అతను గ్రహించాడు.

“వల్హన్, ఫెన్స్ (7) అవతల ఉన్న గైనేక్ లేకపోతే మన గ్రహం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. మనం ఆ జాతిని అంతం చేసి, ఎలోన్ గ్రహం మీద ఒంటరిగా మిగిలిపోతే ఎలా ఉంటుంది?” ఒడెప్ ఆ ఆలోచనను మిగతా ఇద్దరి ముందు ఉంచి, వారి స్పందనల కోసం ఓపికగా ఎదురుచూశాడు.

వారి అందమైన గ్రహమైన ఎలోన్ పూర్తిగా వారికే చెందుతుంది. ఎలోన్‌లోని మెలికలు తిరిగి ప్రవహించే నదులు, గంభీరమైన పర్వతాలు, పచ్చని చెట్లు మరియు అంతులేని సముద్రాల గురించి వల్హన్ ఆలోచించాడు – అవన్నీ  ఆస్వాదించడానికి తమవే అవుతాయి. ఇంకా ఉపయోగించని నెపో నిల్వలు దొరుకుతాయి. పైగా గైనేక్ అభివృద్ధి చేసిన ప్రత్యామ్నాయాన్ని కూడా వారు చేజిక్కించుకుంటారు. ఫెన్స్‌ని, ఉనుమో (8) ని నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గైనేక్ అనే భూతం తమ చుట్టూ అలుముకోకుండా, పురుషులు స్వేచ్ఛగా సృష్టించడానికి, ఉనికిలో ఉండటానికి, జీవించడానికి వీలుంటుంది.

“అది సరైన పనే అవుతుంది, ఒడెప్. ఈ గ్రహం మనది, దీనిని మనం పూర్తిగా సొంతం చేసుకోవాలి”, ఈ విషయం తన మనసులో స్పష్టమవడంతో వల్హన్‌కు ఒక వింతైన ఉపశమనం కలిగింది.

ఇమే మౌనంగా ఉండి, టెలిస్కోప్ ద్వారా కనిపిస్తున్న మినుకుమినుకుమనే గెలాక్సీలను చూస్తూ ఉన్నాడు. అతను ఎన్నో ఏళ్లుగా నక్షత్రాలను, గ్రహాలను గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచైనా ఏదైనా ప్రసారం జరిగినట్లు గానీ, జీవం ఉన్నట్లు గానీ అనిపించినప్పుడల్లా అతను ఉత్సాహపడేవాడు. కానీ వచ్చినవన్నీ తప్పుడు సంకేతాలే. వారి చుట్టూ ఉన్న విశ్వంలో ఘన నీరవత ఆవరించి ఉంది, ఎక్కడా ఏ విధమైన జీవం ఉన్న జాడలూ కనబడలేదు. అతనికి తెలిసినంతవరకు, ఈ అంతులేని విశ్వంలో గైనేక్ మినహా, వాళ్లు ఒంటరిగా ఉన్నారు.

“ఒడెప్, నాకు తెలిసినదల్లా ఒక్కటే, మనం గైనేక్‌ని ఓడించి నాశనం చేస్తే, మనం ఒంటరిగా మిగిలిపోతాం. కనీసం నావరకైతే, ఇది చాలా కలవరపరిచే ఆలోచన. మనం ఎప్పటికప్పుడు ఒకరినొకరు నాశనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం కంటే, మన మన జ్ఞానాన్ని పంచుకునే మార్గాలను అన్వేషించాలని నేను అనుకుంటున్నాను.”

ఒకదానికొకటి పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలు కలిగి పక్కపక్కనే నిలబడి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను చూశాడు ఒడెప్. కానీ వారు ఒకరినొకరు చూసుకోవడం లేదు. ఒడెప్ ప్రశ్నలు ఇమే, వల్హన్‌ల మధ్య, తమకే తెలియని ఒక అగాధాన్ని సృష్టించాయి.

“గుర్తుందా, వల్హన్, ఆ మధ్య ఆ కొండ అంచున నీకు దాదాపు ఇదే విషయం చెప్పాను. ఈ విశ్వంలో మనకు తెలిసినంత వరకు గైనేక్ మాత్రమే మనలాంటి ఇతర జాతులు. మనం చాలా కాలంగా ఆ ఫెన్స్ అవతల వాళ్లతో కలిసి జీవిస్తున్నాం. నిజానికి, మనం భూమి మీద వాళ్లతో కలిసి జీవించాం, ఎలోన్‌కు కలిసే వచ్చాం. మనల్ని కలిపి ఉంచేది ఏదో ఒకటి ఉండి ఉండాలి. ఇప్పుడు అది కూడా మనకు దూరమైందని నేను అనుకుంటున్నాను; మన ఇద్దరికీ దూరమైంది. మనం ఆ బంధం కోసం ఎప్పుడూ వెతకలేదు, ఈ రోజు మనల్ని పీడిస్తున్న ఈ శత్రుత్వపు మూలాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు. కానీ మనం పెనవేసుకున్న ఉనికిని పంచుకున్నామన్న జ్ఞానం ఇంకా మనతోనే ఉంది. నేను ఇమేతో ఏకీభవిస్తున్నాను – మనం వాళ్లను కోల్పోకూడదు.. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాదు. ఇక ఈ గ్రహం విషయానికొస్తే, వల్హన్, ఇది మనకు ఎంత చెందినదో వాళ్లకు కూడా అంతే చెందినది. మనం ఈ నిజాన్ని గుర్తించి, అంగీకరించాలి. పురుషుల సమస్యలకు పరిష్కారాలు ఈ నేపథ్యంలోనే కనుగొనాలి.” చెప్పాడు ఒడెప్.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం

(2) Nex, నెక్స్ = మరణం, చావు

(3) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(4) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(5) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం

(6) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(7) Fence ఫెన్స్= సరిహద్దు, కంచె

(8) Unumo ఉనుమో = ఫెన్స్‌కి అవతల స్త్రీ జాతి నివసించే ప్రాంతాలలో జరుగుతున్న వాటిని ఆరా తీసే రహస్య సంస్థ


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version