Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-22

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[గేజర్ భవనంలో కూర్చుని మాట్లాడుకుంటుంటారు ఇమే, వల్హన్, ఒడెప్. వల్హన్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా, తాము శాశ్వతత్వాన్ని ఎంచుకున్నందున, క్రియేషన్ గురించి మరిచిపోయామని; తమని నెక్స్ లేవు కాబట్టి క్రియేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదని, కొత్త తరాన్ని సృజించాలంటే, క్రియేషన్ ఉండాల్సిందేనని చెప్తాడు ఒడెప్. క్రియేషన్‌పై తాత్కాలిక నిషేధం విధించడం తప్పు కాదని అంటాడు వల్హన్. క్రియేషన్స్ వల్ల జీవన విధానం ఎలా మెరుగవుతుందని అడుగుతాడు వల్హన్. తాను దాన్ని ఉత్తమ మార్గమని అనలేదని, ఒకప్పుడు ఆ విధంగా జీవించామని మాత్రమే చెబుతున్నానని అంటాడు ఒడెప్. తమ మాటల్లో, భూమిపై జీవం ఎలా ఉండేదో తెలిపే ప్రాథమిక సమాచారం కోషుమ్‌లో ఉందనీ, భూమి మీద మానవులు అనేక రోగాలతోనూ, మృత్యువు తొనూ పోరాడేరనీ, వాటిపై ఆధిక్యం సాధించేందుకు ప్రయత్నించారని అంటాడు. తమ సమయం పరిమితమని వారికి తెల్సు కాబట్టి, జీవితాన్ని ఒక అన్వేషణగా సాగించారని అంటాడు. అతని వాదన వల్హన్‍కీ, ఇమేకీ నచ్చదు. తనను తికమకి గురిచేయవద్దని కాస్త గట్టిగానే చెప్తాడు ఇమే. ఒడెపి నిట్టూర్చి తన మాటలని మరి కాస్త వివరిస్తాడు. ఒడెప్ చెప్పినదానికి భిన్నంగా, ఈ గ్రహం పూర్తిగా పురుషులదేననీ, దాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలని అంటాడు వల్హన్. అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఇమే. ఈ గ్రహం గైనేక్, పురుషుల ఉమ్మది ఆస్తి అని, సమస్యలకి పరిష్కారాలు ఈ నేపథ్యంలోనే కనుక్కోవాలని చెప్తాడు ఒడెప్. ఇక చదవండి.]

అధ్యాయం-5 – ప్రత్యామ్నాయాలు – 5వ భాగం

ఉనుమో (1) నుండి డేటా మరియు సమాచారం నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంది. పాటిక్స్ ఎటియస్‌లో చాలా ఎత్తులో ఉన్న తన గదిలో కూర్చుని, అప్పుడప్పుడు ఆ ప్రసారమవుతున్న డేటాను చూస్తున్నాడు. ఫెన్స్ అవతల నుండి వస్తున్న ఇన్‌పుట్‌లు, వాటి స్వభావంలోనూ, ప్రీక్వెన్సీ లోనూ ఎలాంటి మార్పు లేకుండా ఉన్నాయి. వాళ్ళు దేనికోసమో సిద్ధమవుతున్నట్లు అనిపించింది.

అయితే, రాడుల్ లెక్స్ (2) పై ఉంచిన సందేశం యొక్క గమనం ప్యాటిక్స్‌కు మరింత కీలకంగా అనిపించింది. ఆ సందేశం పొందుతున్న స్పందనల రకాలను, సమాచార ఛానల్స్ లోనూ, ఇంకా హైవేలను అతను గమనిస్తూ వచ్చాడు. ఆ సందేశం దానంతట అదే ప్రాణం పోసుకున్నట్లుగా కనిపించింది. అది అంతరించిపోవడానికి గానీ, దేనివల్లా కనుమరుగవడానికి గానీ నిరాకరించింది. అది సృష్టించిన గందరగోళాన్ని బట్టి చూస్తే, ఆ వ్యక్తులు గైనేక్ (3) పై తమ విషమంతా కుమ్మరించడానికి ఒక ప్రేరేపణ కోసం వేచి చూస్తున్నట్లుగా అనిపించింది.

ఇన్ని జాక్స్ (4) గా ఈ ఆవేదన ఎక్కడ దాగి ఉంది? ఈ తీవ్రమైన ప్రతిచర్యలను చూసి పాటిక్స్ కూడా ఆశ్చర్యపోయాడు. అకస్మాత్తుగా, ఆ మగవాళ్ళంతా ఏకగ్రీవంగా చర్యకు పిలుపునిచ్చారు. వారిలో కొందరు ఫెన్స్ (5) ను కూల్చివేసి, గైనేక్‌లపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. మరికొందరు వారిని పూర్తిగా తుడిచిపెట్టి, ఈ గ్రహాన్ని తమ సొంతం చేసుకోవాలని ఆశించారు. గైనేక్‌లు పురుషులపై నెక్స్ (6) ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఒక పుకారు చాలు, పురుషులు వారిని నాశనం చేయడానికి సిద్ధపడటం చూసి పాటిక్స్ ఆశ్చర్యపోయాడు. నెపో (7) నిల్వలు క్షీణిస్తున్నాయనే చిన్న గుసగుస కూడా లెక్స్‌పై ఉన్న ఈ కోపాన్ని కార్యాచరణగా మార్చడానికి సరిపోతుందని అతను నమ్మకంగా ఉన్నాడు.

సూర్యుడు తన పూర్తి వైభవంతో ప్రకాశిస్తున్నాడు. ప్యాటిక్స్ లేచి క్రింద వీధుల వైపు చూశాడు. ఎప్పటిలాగే, క్రింద పరుగులు పెడుతున్న సూక్ష్మ రూపాలను చూసినప్పుడల్లా, ప్యాటిక్స్‌కు తనలో ఏదో ఒక శక్తి నిండిన భావన కలిగింది.

అంతులేని జాక్స్ గడిచినప్పటికీ, పురుషులకు స్త్రీలకి మధ్య ఉన్న వైరం సద్దుమణగలేదు. అది కేవలం లోలోపల రగులుతూ, చిన్న అవకాశం దొరికినా తన వికార రూపాన్ని చూపించడానికి సిద్ధంగా వేచి ఉంది. ఒక క్షణం పాటు, పాటిక్స్ ఆ వైరపు మూలం గురించి తొలుత ఆలోచించాడు, కానీ అది ఎలా మొదలైందనేది అప్రస్తుతమని తరువాత నిర్ణయించుకున్నాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అది ఉనికిలో ఉంది, దానిని సముచితంగా ఉపయోగించుకోవాలి.

పాటిక్స్ ఫెన్స్ వైపు చూశాడు. వారి వ్యూహాన్ని సమీక్షించుకుని, కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం వచ్చింది. రాదుల్ తన నుండి సమాచారం కోసం ఎదురుచూస్తూ ఉంటాడని పాటిక్స్‌కు తెలుసు, కానీ కొంతకాలం అతన్ని ఒంటరిగా పనిచేయనివ్వాలని నిర్ణయించుకున్నాడు. తానే దీనికి నాయకత్వం వహిస్తున్నానని రాదుల్ భావించడం, నమ్మడం చాలా ముఖ్యం. అప్పుడే అతను ఇతరులను ఒప్పించగలడు. పాటిక్స్, తన వంతుగా, సరైన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తాడు.

అతను కిటికీ పక్కన నిలబడి ఆలోచిస్తుండగా, అతని లెక్స్ కు వల్హన్ నుండి ఒక సందేశం వచ్చింది.

నేను గేజర్ భవనానికి వెళ్ళి వస్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అన్నట్టు, నెక్స్‌లో వచ్చిన సందేశం సరైనదేనా?

గేజర్ భవనమా? వల్హన్ అక్కడ ఏం చేస్తున్నాడు? ఏదేమైనా, వల్హన్‌ని కలవాలని అతను నిర్ణయించుకున్నాడు. తాను సాధించాలనుకుంటున్న దాని గురించి వల్హన్‌ను ఒప్పించగలిగితే, అది సైనెడ్‌లో పెద్దగా వ్యతిరేకత లేకుండానే ఆమోదం పొందుతుంది. ఒకవేళ ఆ ఏకాంతవాసి అనుకోకుండా సైనెడ్ సమావేశానికి రావాలని నిర్ణయించుకుంటే, వల్హన్ ఓడెప్‌ను కూడా ఎదుర్కోగలడు. ఇంతటి మహత్తరమైన విషయాలు చర్చించబడబోతున్నప్పుడు, ఒడెప్‌ను కూడా పాల్గొనమని అడుగుతారని ప్యాటిక్స్‌కు తెలుసు.

🚀

రాదుల్ తాను లెక్స్ పై ఉంచిన సందేశాన్ని గమనిస్తూ ఉన్నాడు. అతని గుర్తింపును తొలగించినప్పుడు, పాటిక్స్ ఆ సందేశాన్ని ఆమోదించాడని, కానీ దానిని పంపినవారి పేరు బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకున్నాడని అతనికి అర్థమైంది. ఆ సందేశానికి వచ్చిన ప్రతిస్పందన రాదుల్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫెన్స్‌కు అవతలి వైపు ఉన్న ఆ జీవుల గురించి మగవారు అంత బలంగా భావిస్తారనే విషయం అతనికి కొత్తగా అనిపించింది. కొందరు సంధి గురించి మాట్లాడారు, కానీ వారి మాటలు అణచివేయబడి, ఎగతాళి చేయబడ్డాయి.

రాదుల్ గేమింగ్ లాంజ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘డౌన్ విత్ దెమ్’ అనే ఆట ఆడుతున్నాడు. అది గైనేక్ శత్రువుగా ఉండే ఒక యుద్ధ క్రీడ. అది గేమింగ్ బృందాలలో పెను సంచలనం సృష్టించింది. ఆ చిన్న సందేశం, దానిలోని నిరాధారమైన సూచనతో, వారందరిలో ఒక కొత్త రాక్షసుడిని రెచ్చగొట్టింది.

ఆట సాగుతున్న కొద్దీ చాలా మంది గైనేక్‍ లను చంపడంతో, తాను పూర్తి ఏకాగ్రతతో ఆడలేకపోతున్నానని రాదుల్ గ్రహించాడు. అతను లెక్స్‌ను డిస్‌కనెక్ట్ చేసి తన కుర్చీలో వెనక్కి వాలాడు.

ఎలోన్‌ (8) పై విడుదలైన ఈ శక్తి మొత్తాన్ని అతను ఎలా వినియోగించుకోవాలి? దీని గురించి అతను పాటిక్స్‌ను సంప్రదించాలా?

గేమింగ్ లాంజ్ పైకప్పుపై ఉన్న మసక డిజైన్‌లను చూస్తూ కూర్చున్న రాదుల్‌కు ఒక రకమైన అనిశ్చితి కలిగింది. ప్రతిచోటా పురుషులు ఆ సందేశం గురించి చర్చిస్తున్నారు, కానీ దాన్ని లెక్స్‌లో ఎవరు ఉంచారో ఎవరికీ తెలియదు. తన తదుపరి అడుగుతో తానే నాయకుడిగా గుర్తింపు పొందేలా రాదుల్ చూసుకోవాలి.

కన్సోల్ నుండి బయటకి వచ్చి, రాదుల్ చల్లని రాత్రిలోకి అడుగుపెట్టాడు. పారదర్శకమైన మేఘం వెనుక మూడు చందమామలు మెరుస్తున్నాయి. అది అతనికి అలవాటు కావడంతో, అతను ఒక ట్రావెలర్‌ ఎక్కి కోషుమ్‌కు వెళ్ళాడు. ఒక డిస్పెన్సర్ నుండి ఎనాబ్ (9) సీసాను తీసుకుని, ‘అస్’ అని పిలువబడే విభాగంలోని తన సుపరిచితమైన స్థానానికి వెళ్ళాడు. గైనేక్‌ల పట్ల ఈ ఆగ్రహం ఎప్పుడు మొదలైందో అతను తెలుసుకోవాలనుకున్నాడు. ఈ భావన యొక్క మూలాన్ని, గమనాన్ని కనుగొనగలిగితే, తాను పరిస్థితులను మరింత మెరుగ్గా మలచగలనని అతను భావించాడు.

రాదుల్ విరామం తీసుకునే సమయానికి మేఘాల పొర తొలగిపోయి మూడు చందమామలు స్పష్టంగా కనిపించాయి. అతను కిటికీ వద్దకు వెళ్లి, దానిని తెరిచాడు, చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంఘర్షణ ఆకాశంలా ఉన్నట్లు అనిపించింది. అది ఎల్లప్పుడూ ఉండేది. తాము, అంటే పురుషులు, గైనేక్ – ఇక్కడికి ఎలా కలిసి వచ్చారో, కానీ చివరికి ఎలా చెల్లాచెదురయ్యారో కోషుమ్ అతనికి చెప్పింది. గైనేక్ ఎలోన్‌ లోని పెద్ద పెద్ద భూభాగాలను ఆక్రమించుకోవడానికి ఎలా ప్రయత్నించిందో కూడా అది వివరించింది – అదే మొదటి యుద్ధానికి కారణం. ఆ తర్వాత కొంత విరామం వచ్చింది, దాని తర్వాత గైనేక్ నెపో అధిక పరిమాణంలో ఉన్న కొంత భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది, అది రెండవ యుద్ధానికి దారితీసింది. చివరకు, ఫెన్స్ ఏర్పడింది. వారు ఆ సుదూర గ్రహమైన భూమి నుండి ఎలోన్‌కు రాకముందే ఈ శత్రుత్వం, ఇంకా పోటీ చాలా కాలం నుండి ఉన్నట్లు అనిపించింది.

ఈ మొత్తం రహస్యానికి భూమే ఆధారమని గ్రహించిన రాదుల్, ఆ రెండు జాతులు భూమిపై ఎలా జీవించాయో అనే సమాచారం కోసం వెతికాడు. అయితే, కోషుమ్ వద్ద ఎలాంటి సమాధానాలు లేవు. రాదుల్‌కు దారి మూసుకుపోయింది. అతను అడగగలిగే వారు ఎవరూ లేరు. ఈ సంఘర్షణ మూలాన్ని కనుక్కోవడానికి అతను తన సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నాడో అని అతని గ్రూప్ హౌస్‌లోని పురుషులు అర్థం చేసుకోలేరు. అంతేకాదు, అతను ప్యాటిక్స్‌ను సంప్రదించాలనుకోలేదు. అతనికి ఇమేను గుర్తుచేసేలా నిర్మలమైన ఆకాశం, మినుకుమినుకుమనే నక్షత్రాలు కనిపించాయి. బహుశా అతన్ని అడగవచ్చేమో.

🚀

గేజర్ భవనం బయట ఆ రోజు చాలా అద్భుతంగా ఉంది. సూర్యరశ్మి చుట్టూ ఉన్న మంచుపై పరావర్తనం చెందడంతో, బయట పైకి చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది. లోపల, టెలిస్కోప్ గది పరావర్తనం చెందిన సూర్యకాంతి యొక్క బంగారు కిరణాలతో నిండిపోయింది. పూల సువాసన గాలిలో తేలుతూ, పరిసరాలకు ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఇచ్చింది. కొన్ని రాత్రుల క్రితం వారి సుదీర్ఘ చర్చ తర్వాత, ఇమే, వల్హన్, ఇంకా ఒడెప్ ఏమీ జరగనట్లు ప్రవర్తించారు. వారు తమ ముందున్న విషయంపై పూర్తి ఏకాగ్రతతో పనిచేశారు. ఇమే లెక్స్ హైవేలపై వస్తున్న గందరగోళాన్ని అనుసరిస్తున్నాడు, కానీ అతను ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఒడెప్ వారి ముందు ఉంచిన ఇతర సమస్యలన్నింటినీ విస్మరించి, వారు తాయ్‌ను అన్వేషించడం మరియు పరిశోధించడంపై దృష్టి పెట్టారు.

ఒడెప్, వల్హన్ ఆ రోజు బయలుదేరాల్సి ఉంది. భవిష్యత్తులో తాయ్‌ను నివాసంగా మార్చుకునే సాధ్యాసాధ్యాలపై తుది అంచనా వేయడానికి, అదనపు సమాచారాన్ని పరిశీలించడానికి ఐమే అక్కడే ఉండిపోయాడు.

మనకూ, గైనేక్‌కూ మధ్య ఉన్న సంఘర్షణకు మూలం ఏమిటి? నీకేమైనా తెలుసా? మన రెండు జాతులకూ భూమి మీద జీవితం ఎలా ఉండేది?

కొద్దిసేపటి క్రితం ఇమే లెక్స్ మీద రాదుల్ సందేశం ప్రత్యక్షమైంది. ఎలోన్ అంతటా ఉన్న పురుషులందరూ ఈ సమస్యలతో సతమతమవుతున్నారా? రాదుల్ లాంటి వ్యక్తి ఇంతగా ఎలా ఆలోచిస్తున్నాడు? ఇమేకు ఏ సమాధానమూ తోచలేదు. అతనికి కూడా ఏమీ తెలియదు. నిజానికి, విచిత్రమైనా జ్ఞానవంతుడైన ఒడెప్‌కు కూడా ఈ విషయం గురించి ఏమీ తెలియదు. మనుషులు ఇంతకుముందు ఎప్పుడైనా వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని ఇమే ఆలోచించాడు. బహుశా యుద్ధాలు, ఎలోన్‌లో బతకడానికి పడిన కష్టాలు వారి మనసుని ఆక్రమించి ఉంటాయి. ఆ తర్వాత, ఫెన్స్ ఏర్పడినప్పటి నుండి వచ్చిన శాంతి ఈ ప్రశ్నలన్నింటినీ పక్కకు నెట్టివేసి ఉండాలి. ఇప్పుడు, ఒక విధంగా, ఆ ఫెన్స్ ఛేదించబడటంతో, ఈ ప్రశ్నలు మరోసారి తలెత్తాయి.

తలుపు తెరుచుకుంది, వల్హన్, ఒడెప్ ఇద్దరూ లోపలికి వచ్చారు. “ఇమే, మనం సరైన దిశలోనే వెళ్తున్నామని నేను అనుకుంటున్నాను. నువ్వు చివరి విశ్లేషణ పూర్తి చేయి, అప్పుడు మనం ఒక ముగింపునకు రాగలం. నేను, ఒడెప్ ఇప్పుడు బయలుదేరుతాము. నీ పని పూర్తయ్యాక నువ్వు నగరానికి తిరిగి వెళ్ళవచ్చు,” అని వల్హన్, వారిని పై అంతస్తులోని రోండ్యురల్ (10) స్టేషన్‌కు తీసుకెళ్లే ఎలివేటర్ వైపు వెళ్తూ అన్నాడు. ఒడెప్, ఇమే కూర్చున్న చోటికి వచ్చి అతని భుజం మీద చేయి వేశాడు. ఇమే ఉలిక్కిపడ్డాడు. అది ఒక వింతైన సంజ్ఞ. ఎలా స్పందించాలో తెలియక, అతను లేచి నిలబడ్డాడు.

“నా జుట్టులోని వెండి వెంట్రుకలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. అవి ఒక సుదీర్ఘ ప్రయాణానికి సంకేతం. ఈ ప్రయాణం ముగింపుకు వస్తుందని అర్థం. నేను – ఈ జ్ఞానమే ఈ మొత్తం ప్రయాణాన్ని సార్థకం చేస్తుందని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నన్నూ చూడ్డానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నీకు ఖాళీ ఉన్నప్పుడు రా”, అని ఒడెప్ చిరునవ్వుతో అన్నాడు.

ఇమే కేవలం తల ఊపి తిరిగి పనిలో నిమగ్నమయ్యాడు. ఒడెప్, వల్హాన్ రోండ్యురల్ ఎక్కి కిందికి దిగడం మొదలుపెట్టారు.

ఒకరికొకరు ఎదురుగా నిలబడి, ఒడెప్, వల్హన్ మంచుతో కప్పబడిన పర్వతాల వైభవాన్ని చూశారు. కొంతసేపటికి, ఒడెప్ – వల్హన్ వైపు తిరిగి ఇలా అన్నాడు, “వల్హన్, నేను లెక్స్ ఎందుకు తీసేసానని నువ్వు నన్ను ఒకసారి అడిగావు. కారణం చిన్నదే. లెక్స్ హైవేలపై మనం చేసే శబ్దం నుండి నాకు నిశ్శబ్దం కావాలి. చుట్టూ ఏం జరుగుతుందో అది జరుగుతున్నప్పుడు తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. దాని అవసరం నాకు అనిపించలేదు. మొదట్లో, నేను ప్రతి గంటకు దాన్ని చూసేవాడిని. ఆ తర్వాత, రెండు గంటలకు ఒకసారి, నెమ్మదిగా, నాకు గుర్తు వచ్చినప్పుడు లేదా అవసరమైనప్పుడు మాత్రమే దాని వైపు చూసేవాడిని.”

వల్హన్ నిట్టూర్చి, “ఒడెప్, నువ్వు నోటస్‌ (11) కు ఎప్పుడు వెళ్తావు? నువ్వు ఒప్పుకోకపోతే, సైనెడ్ సమావేశాలలో ఈ విషయాన్ని ప్రస్తావించి, మిగతా సభ్యులు నిన్ను బలవంతంగా పంపేలా చేయాల్సి వస్తుంది,” అన్నాడు. అతను ఇంకా బయటకు చూస్తూనే ఉన్నాడు. వారు దిగుడు మార్గంలో దాదాపు మధ్యకు చేరుకున్నారు. “మన రెండు జాతులు కలిసి మనుగడ సాగించే విధంగా ప్రస్తుత సమస్యను పరిష్కరించగలిగితేనే, అప్పుడు నేను నోటస్‌కు వెళ్తాను.” చెప్పాడు ఒడెప్.

“ఇదేనా నువ్వు చేయాలనుకుంటున్నది? సైనెడ్ తీసుకునే నిర్ణయాలను నీ ఉనికి భావనలపై ఆధారపడేలా చేయడమా? వాళ్ళు పట్టించుకోరు, ఒడెప్. నువ్వు ఎన్నో ఏళ్లుగా ఆ కొండ మీదే కునారిల్లుతున్నావు. ఎలోన్ నిన్ను వదిలి ముందుకు వెళ్లిపోయింది. ఆ విషయం నీకు తెలుసని ఆశిస్తున్నాను”, అని చెప్పి, వల్హాన్ ఇప్పుడు అతని వైపు బ్రతిమాలుతున్నట్లుగా సూటిగా చూడసాగాడు.

“కానీ నువ్వు కలత చెంది ఉన్నావని నాకు అర్థమవుతోంది, వల్హాన్. నేను ప్రతిపాదిస్తున్న ఈ ‘బేరసారాలు’ కేవలం నువ్వు సైనెడ్‌లో చర్చించి నిర్ణయం తీసుకునేంత వరకు నా పక్షాన ఉండేలా చేయడానికి మాత్రమే. కొన్నిసార్లు, భూమిని విడిచి ఇక్కడికి వచ్చిన ఆ పురుషుల ఆలోచనలను నేను ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు గైనాకే తో ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎల్లప్పుడూ వారితో యుద్ధం చేస్తూనే ఉన్నారా? భూమిపై వెనుకబడిపోయి, మనకు శాశ్వతంగా దూరమైపోయిన ఇతర జాతులు ఏవైనా ఉన్నాయా? భూమి ఉన్న గెలాక్సీ కూడా నాశనమైపోయిందని నీకు ఖచ్చితంగా తెలుసు. భూమిపై మిగిలిపోయిన ప్రతిదీ పూర్తిగా ధ్వంసమైపోయింది. అది చాలా పెద్ద నష్టమై ఉండేది, వల్హన్. అందుకే మనం శత్రుత్వం వహించినప్పటికీ, గైనేక్‌ను కోల్పోకూడదని నేను పట్టుబడుతున్నాను. బహుశా ఈ ప్రశ్నలలో కొన్నింటికి సమాధానాలు వారి వద్ద ఉండవచ్చు. బహుశా మన ఉమ్మడి గతం గురించి వారికి ఏమైనా తెలిసి ఉండవచ్చు. ఊహించు, మనం వారిని కోల్పోతే, తెలుసుకునే మనకున్న ఏకైక అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు కదా?”

కొద్దిసేపు ఆగి, అతను ఇలా కొనసాగించాడు, “మనం ఏమి కోల్పోయామో గుర్తించి, తెలుసుకున్నప్పుడే, మన దగ్గర ఉన్నదాని విలువ మనకు తెలుస్తుంది. వల్హన్, అస్తిత్వం గురించి నీకున్న ఆలోచనల కన్నా భిన్నమైన ఆలోచనలు నాకూ లేవు. ఈ సుదీర్ఘ జీవితంలోని ప్రయోజనాలను నేను అనుభవించాను. నేను ఎన్నో పనులు చేశాను, ఎన్నో ఆలోచనలను ఫలవంతం చేశాను. ప్రత్యామ్నాయాలను ఆపేయాలన్న ఈ నిర్ణయం కూడా నేను ప్రయత్నిస్తున్న ఒక ఆలోచనే అని నువ్వు అనవచ్చు. మన అస్తిత్వంలో ఉండే అనంతత్వపు భావనను కోల్పోవడం వల్ల, నేను జీవితాన్ని భిన్నంగా అనుభవిస్తున్నానని గ్రహించాను. సూర్యోదయం మరింత అందంగా కనిపిస్తుంది, గాలి ఒక రాగం పాడుతుంది, మంచు తునకలు నాట్యం చేస్తాయి. నేను ఇంతకు ముందెన్నడూ గ్రహించని ఈ భావాలన్నీ ఒక కొత్త కోణాన్ని సంతరించుకున్నాయి. నష్టం అనే భావనే వస్తువులను అంత విలువైనవిగా కనిపించేలా చేస్తుందని నువ్వు అనవచ్చు. ఇది విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం అదే.”

ఆ ఇద్దరు పురుషులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఒడెప్ నవ్వుతూ, “ఇక ఎలోన్ నన్ను వదిలి ముందుకు సాగిపోవడం విషయానికొస్తే.. మార్పు అంటే అదే. భూమి మీద కూడా ఇదే పరిస్థితి. నిజానికి ఏమీ మారని ప్రపంచాన్ని మనమే సృష్టించుకున్నాం, ఎందుకంటే దాని నివాసులు మారరు. మనం తాయ్‌కి వెళ్లడం వల్ల మన ప్రపంచం మారిపోతుందని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? వాస్తవానికి, మనం మన ప్రపంచాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని వాదించవచ్చు. నేను దాన్ని అంగీకరిస్తాను. మన ప్రపంచంలో అంతర్గతంగా తప్పు ఏమీ లేదు. మనం ఉన్నాం, ఇకపైనా ఉంటాం. మనం పెద్ద నగరాలను నిర్మిస్తాం, యుద్ధాలు చేస్తాం, కొత్త విషయాలను కనుగొంటాం, బహుశా, ఒకరోజు కొత్త మనుషులను కూడా సృష్టిస్తాం. ఈ ప్రయాణంలో, నాలాంటి కొంతమందికి వింత ఆలోచనలు రావచ్చు, మీ ప్రశాంతమైన జలాల్లో రాళ్లు విసరవచ్చు. వల్హన్, ఆలోచనలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. గుర్తుంచుకో, మరో గ్రహానికి వెళ్లడం మన మనుగడకు సహాయపడుతుందనే ఆలోచన చేసింది సుదూర గెలాక్సీలోని ఎవరో. ఒక జాతిగా మనం ఉనికిలో ఉన్న ఈ కాలమంతటిలో, ఎన్నో రకాల ఆలోచనలు చర్చించబడ్డాయి, ప్రయత్నించబడ్డాయి. వల్హన్, కొంచెం మథనం చేయడం మంచిది, అది ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది.” అన్నాడు ఒడెప్.

వారు భవనం క్రింద భాగానికి చేరుకుని, తమ తమ ట్రావెలర్స్ కోసం ఎదురుచూడసాగారు.

“అయితే, ఇప్పుడు మనం మళ్ళీ మొదటికే వచ్చి, కాలంతో పరిమితమైన జీవితాన్ని గడపాలని నువ్వు ప్రతిపాదిస్తున్నావన్నమాట. ఎందుకు? ఎందుకంటే అది మన ఉనికిని మరింతగా గౌరవించేలా చేస్తుంది. నాకైతే అది హాస్యాస్పదంగా అనిపిస్తోంది”, అని చివరకు అన్నాడు వల్హన్.

ఒడెప్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, “లేదు, వల్హన్, వెనక్కి వెళ్ళడం కుదరదని నాకు తెలుసు. ఒక జాతిగా, శాశ్వతంగా మనుగడ సాగించాలనే కోరిక మన జన్యువుల్లో భాగమైపోయినట్లుంది. కానీ ఈ ప్రయాణంలో మనం కోల్పోయినదాన్ని తిరిగి పొందడానికి కనీసం ప్రయత్నించవచ్చు.”

వల్హన్ ఎక్కవలసిన ట్రావెలర్ రాగానే, అతను చేయి ఊపి దానిలోకి ఎక్కాడు. అది వేగం పుంజుకుంటుండగా, అతను వెనక్కి తిరిగి చూశాడు. దిగంతంలో ఒడెప్ ఒక చిన్న చుక్కలా కనిపిస్తూ, ఇంకా తన ట్రావెలర్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను దూసుకుపోతున్న ఆ నగరంలో, నష్టం, దాని పాఠాల గురించిన తన ఆలోచనలను స్వీకరించేవారు చాలా తక్కువని వల్హన్‌కు తెలుసు.

(ఇంకా ఉంది)

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Unumo ఉనుమో = ఫెన్స్‌కి అవతల స్త్రీ జాతి నివసించే ప్రాంతాలలో జరుగుతున్న వాటిని ఆరా తీసే రహస్య సంస్థ

(2) Lex, లెక్స్ = సమాచార పరికరం

(3) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం

(4) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(5) Fence ఫెన్స్= సరిహద్దు, కంచె

(6) Nex, నెక్స్ = మరణం, చావు

(7) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(8) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(9) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం

(10) Rondural, రోండ్యురల్ – పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళే వాహనం

(11) Notus, నోటస్ = అవయవ భర్తీ కేంద్రం Organ Replacement Centre


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version