Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-24

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[మాయ ఆర్యన్ కథ చెబుతూ ఉంటుంది. భూమి మీద ఆ సమయంలో విపరీతమైన వానలు కురుస్తున్నాయి. ఉరుములు ఉరుముతున్నాయి. జల ప్రళయంలా ఉంది. బయో-ఇన్ఫోటెక్ ప్రోగ్రామ్ అధిపతిగా ఉన్న రియా, ఆమె బృందమూ కలిసి క్లోనింగ్ ద్వారా సంతానాన్ని కనే ప్రక్రియకి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తారు. కాన్ఫరెన్స్ పూర్తయ్యాకా, రియా బయటకి వస్తుంది. ఇంటికి వెళ్ళటానికి ఎలివెటెడ్ రూట్‌లో ఉన్న స్ఫీడ్ ట్రైన్ ఎక్కి, క్రింద తడిసి ముద్దవుతున్న నగరాన్ని చూస్తూ ఉంటుంది. స్త్రీ పురుషులు వేర్వేరుగా ఉండే ప్రాంతాల మధ్య గీతలు గీసి లేనప్పటికీ, పురుషుల ప్రాంతం ఎక్కడ్నించి మొదలవుతుందో రియాకి తెలుసు. ఆర్యన్ రైలు దిగి తన ఇంటి వైపు నడుస్తాడు.   ఆ సమయంలొ మంచు విపరీతంగా కురుస్తూంటుంది. అలసటతో ఇల్లు చేరేసరికి, మాయ స్వరపరిచిన పాట వినవస్తుంది. ఆమె గదిలోకి వెళ్ళి పలకరిస్తాడు. కాసేపు మాట్లాడుకుంటారిద్దరూ. ప్రస్తుతం సంభవిస్తున్న సాంకేతిక మార్పులను జీర్ణించుకోలేక, ఎందుకు బతికున్నామా అని కొందరు అనుకుంటున్నారని అంటాడు. ఆర్యన్ కనిపెట్టిన ఎలోన్ గ్రహం గురించి మొదట ఉత్సాహం చూపించిన జనాలు, తర్వాత పట్టించుకోరు. తన యూనివర్శిటీలో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గుతోందని చెప్తాడు. బదులుగా, మీ యూనివర్శిటీ పురుషుల ప్రాంతంలో ఉంది, అందుకని అమ్మాయిలు రారని చెప్తుంది మాయ. కొద్దిసేపటికి రియా నుంచి మాయకి ఒక సందేశం వస్తుంది. సాంకేతిక వశం చేసుకున్న తన కూతురుని తలచుకుంటూ ఆ సందేశాన్ని చదువుతుంది మాయ. క్లోనింగ్ పద్ధతిలో తాను కూతురిని కనబోతున్నానని తెలియజేస్తుంది రియా. స్త్రీపురుషుల శారీరిక కలయిక ద్వారా కాకుండా, ఒకరి అవసరం మరొకరికి లేకుండా, సంతానోత్సత్తి జరిగే ప్రక్రియను ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఆర్యన్ నిద్ర లేవగానే ఈ విషయం చెప్పాలనుకుంటుంది.  కాలం గడుస్తుంది. భూమి మీద పరిస్థితులు మారిపోతాయి. అమీకి అయిదేళ్ళు వస్తాయి. స్త్రీ పురుషుల ప్రాంతాల మధ్య అధికారికంగా విభజన జరిగిపోతుంది. కొన్నేళ్ళకి, పురుషులు ఎలోన్‌పైకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నాలలో స్త్రీలను కలుపుకునిపోకపోవడం రియాని బాధిస్తుంది. భూమి మీద అన్ని సమస్యలకీ, ఎలోన్ ఒక్కటే పరిష్కారమా అని అనుకుంటుంది. ఇక చదవండి.]

అధ్యాయం-6 – ఆర్యన్ – 2వ భాగం

చాలా దూరంలో ఉన్న గెలాక్సీలో తాను కనుగొన్న ఆ సుసంపన్నమైన ‘ఎలోన్’ (1) గ్రహం గురించి ఆర్యన్‌ను లెక్కలేనన్ని చర్చలు, సంభాషణల కోసం పిలిచారు. ప్రారంభంలో అతను ఎంతో ఉత్సాహంగా, ఒక రకంగా సంతోషంగా ఉన్నాడు. కానీ, ఆ చర్చలు అలా కొనసాగుతుండటంతో అతనిలో నిరాశ పెరగడం ప్రారంభమైంది.

ఆ రోజు కూడా స్క్రీన్ ముందు రెండు గంటల సమయం గడిపిన తర్వాత, అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతన్ని ప్రశ్నించిన పురుషులు విరామం లేకుండా ప్రశ్నలు గుప్పిస్తూనే ఉన్నారు. ‘మనం అక్కడికి ఎలా చేరుకోవాలి?’ అనేదే వారి ప్రధాన ఆందోళనగా ఉంది. తాను స్పేస్‌షిప్‌లను తయారు చేయనని, అవి ఎలా చేయాలో కూడా తనకు తెలియదని అతను వారికి పదేపదే చెప్పాడు. ఆ గ్రహం యొక్క కోఆర్డినేట్స్, అతని పరిశోధనలు ఇప్పుడు విలువైన వస్తువులుగా మారి పురుషుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి.

ఆర్యన్ అలసటతో, నీరసంగా మంచంపై పడుకున్నాడు. ఎదురుగా ఉన్న గోడపై విశ్వం యొక్క చిత్రం వేలాడుతోంది, అందులో ఎడమవైపు చివరి మూలలో ఒక చిన్న నీలిరంగు చుక్క కనిపిస్తోంది.

ఇది ఎంత విచిత్రమైన వైరుధ్యం; ఆ చిత్రాన్ని చూడటం అతనికి ఒక వింత ప్రశాంతతను ఇస్తుంటే, మరోవైపు అతని నిరాశ అంతటికీ కారణం ఆ ‘ఎలోన్’ గ్రహమే. అక్కడ జరుగుతున్న చర్చలన్నింటినీ బట్టి పురుషులు ఎలోన్‌ను తమ సొంత గ్రహంగా భావిస్తున్నారని, దానిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదని నమ్ముతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విభేదాలు ఆర్యన్‌ను తీవ్రంగా కలచివేసాయి. పురుషులు, స్త్రీలు ఇలా ఉండాల్సింది కాదు. విశ్వాన్ని అన్వేషించే ప్రయాణంలో వారు భాగస్వాములు కావాలి కానీ, పోటీదారులు కాదు. పరిస్థితులు సర్దుకుని మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి, ఎప్పుడూ అలాగే జరుగుతుంది. అదే అతని ఏకైక ఆశ.

బయట గాలులు హోరున వీస్తూ, అతనిలోని అశాంతిని మరింత పెంచుతున్నాయి. మాయ, అమీని వెంటబెట్టుకుని లోపలికి వచ్చినట్లు ఇంటి ఆటోమేషన్ సిస్టమ్ మృదువుగా అనౌన్స్ చేసింది.

ఆర్యన్ త్వరత్వరగా లేచాడు. అమీ ఇంటికి వస్తే అతనికి చాలా ఇష్టం. కానీ రియాను చూస్తేనే ఈ మధ్య అతనికి ఒక రకమైన భయం కలుగుతోంది. అసలే ఆమె వీరిని కలవడానికి చాలా అరుదుగా వస్తుంది, ఒకవేళ వచ్చినా.. ఆమె భుజాలపై ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్లే కనిపిస్తుంది. ఇప్పుడు పదిహేనేళ్ల వయసున్న అమీ, వారి చుట్టూ జరుగుతున్న మార్పులకు ఒక ప్రతిరూపంలా ఉంది. ఆమె ఎంతో తెలివైనది, జిజ్ఞాస గలది, పైగా వారి జీవితాలను చుట్టుముట్టిన అన్ని రకాల గ్యాడ్జెట్లను ఉపయోగించడంలో ఎంతో నేర్పరి.

మరింత ఆధునికీకరించిన ‘హెల్ప్’ (రోబో) (2) ఇల్లంతా తిరుగుతూ భోజనానికి టేబుల్ సర్దడం ప్రారంభించింది. ఆర్యన్ డైనింగ్ ఏరియాలోకి ప్రవేశించేసరికి, అమీ, మాయ అప్పటికే టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. మాయ అతన్ని చూసి నవ్వింది, కానీ అమీ మాత్రం తన చిటికెన వేలిలో అమర్చిన చిప్ ద్వారా యాక్టివేట్ అయిన, తన అరచేతిపై కనిపిస్తున్న చిన్న స్క్రీన్‌లో నిమగ్నమై ఉంది. భోజనం వడ్డించడం పూర్తి కాగానే, అమి తన చెవి డివైజ్‌ను పక్కన పెట్టి, అరచేతి స్క్రీన్‌ను ఆపేసి, ఆర్యన్‌ వైపు తిరిగి, “నిజంగానే మీరు ఎలోన్ గ్రహాన్ని కనుగొన్నారా? ఈ మధ్య ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న గ్రహం అదేనా? మనకు తెలిసిన జీవరాశి మనుగడకు అది అనుకూలంగా ఉంటుందనేది నిజమేనా?” అని అడిగింది.

“అవును అమీ. అది జీవనానికి అనుకూలంగా ఉంటుంది. కానీ నీ గొంతులో ఎందుకంత సందేహం కనిపిస్తోంది?”

“నేను ఊరికే ఆలోచిస్తున్నాను.. ఎందుకంటే చంద్రుడిని లేదా అంగారక గ్రహాన్ని కూడా నివాసయోగ్యంగా మార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి కదా. చివరికి భూమికి దగ్గరగా ఉన్న దాని నమూనాలు కూడా జీవనానికి సహకరించలేదు. కాబట్టి, బహుశా ఇది కూడా అలాంటి ఒక అబద్ధపు ఆశేనేమోనని నా అనుమానం..” అమీ భుజాలు ఎగరేసింది.

ఆర్యన్ టేబుల్ అవతలి వైపు ఉన్న మాయ వైపు చూశాడు. ఆమె తన భోజనంపైనే దృష్టి పెట్టింది. అతనికి ఈ విషయం గురించి ఇక మాట్లాడటం ఇష్టం లేక, మాయ టాపిక్ మారుస్తుందేమోనని వేచి చూశాడు.

“అమీ, వీలైతే ఒకసారి ఇటు రమ్మని రియాకు చెప్పు. ఆమె మమ్మల్ని చూసి చాలా రోజులైంది,” అంది మాయ.

“ఆమె ఎలోన్ గ్రహాన్ని చేరుకోవడానికి మార్గాన్ని కనుగొనే పనిలో బిజీగా ఉంది. పురుషులు కూడా అదే పని చేస్తున్నారు కదా, అవునా?” ఆర్యన్ వైపు సూటిగా చూస్తూ అంది అమీ.

ఆర్యన్ నిట్టూరుస్తూ, “నేనూ అలాగే అనుకుంటున్నాను. వాళ్లు నన్ను పదేపదే రూట్ గురించి అడుగుతున్నారు, కాబట్టి వాళ్లు ఆ ప్రయత్నంలోనే ఉండి ఉంటారు,” అన్నాడు.

డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

“అయినా, మీరు పురుషులు కదా, కాబట్టి మీరు నాకు ఎలాగూ నిజం చెప్పరు!” అమీ చాలా నిర్లక్ష్యంగా అంటూ టేబుల్ మీది నుండి లేచింది. సోఫాపై వెనక్కి వాలి కూర్చుని, మళ్లీ తన అరచేతి స్క్రీన్‌ను యాక్టివేట్ చేసుకుంది. మాయ, ఆర్యన్ ఇద్దరూ నిశ్శబ్దంగా భోజనం ముగించారు. మాయ లేచి, ఆర్యన్ పక్క నుంచి వెళ్తూ అతని జుట్టును నిమురుతూ వెళ్లి అమీ పక్కన కూర్చుంది. ఆర్యన్ తన గదిలోకి వెళ్లిపోయాడు.

“ఏం చూస్తున్నావు, అమీ?” అని అడుగుతూ, మాయ ఆమె దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది.

అమీ చుట్టూ చూసి, ఆర్యన్‌, తమ మాటలు వినబడనంత దూరంలో ఉన్నాడని నిర్ధారించుకున్నాక, “వాళ్లు మెషీన్లలో ఉన్న ‘బులి’ మెదడును ఉపయోగిస్తున్నారు. ఆమె గుర్తుందా మీకు? ఆమె స్పేస్ సైంటిస్ట్. ఎలోన్ గ్రహానికి ప్రయాణించగల ఒక స్పేస్‌షిప్‌ను తయారు చేసే మార్గాలను కనుగొనడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు.” అని చెప్పింది.

మాయకు బులి గుర్తుంది. పాత రోజుల్లో ఆర్యన్, బులి కలిసి చాలాసార్లు పరిశోధనలు చేశారు. కానీ, ఐదేళ్ల క్రితం మెషీన్లతో తమను తాము మెర్జ్ చేసుకున్న కొద్దిమంది వ్యక్తులలో బులి ఒకరు.

మాయ ఆ మెర్జర్ (3) గురించి ఆలోచించి చాలా కాలమైంది. ప్రస్తుతం, ఆమె జీవితం చాలా పరిపూర్ణంగా, సంతృప్తికరంగా ఉంది.

🚀

ఆ గదిలో వరుసగా ఉన్న లో-లయింగ్ రిక్లైనర్స్ పై ఆహ్లాదకరమైన కాంతి ప్రసరిస్తోంది. అక్కడ ఉన్న కొద్దిమంది స్త్రీలు తమ అరచేతి స్క్రీన్‌లలో లేదా టేబుల్‌లపై ఉన్న చిన్న స్క్రీన్‌లలో నిమగ్నమై ఉండటంతో గదిలో పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. రియా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ఒక పొడవైన కిటికీ దగ్గర నిలబడి, వందో అంతస్తు నుండి కింద ఉన్న నగరాన్ని చూస్తోంది. ఆ నగరపు వెలుగులను చూడటం ఇష్టం కాబట్టి ఆమె తరచుగా ఈ వైన్ బార్‌కు వస్తూ ఉంటుంది. నిలువుగా నిరంతరం ఎదుగుతున్న ఆ నగరాన్ని, రక్తనాళాల లాంటి హై-స్పీడ్ రైళ్లు అనుసంధానిస్తున్నాయి.

మూడు రోజుల క్రితం, కొందరు స్త్రీలు పురుషుల ప్రాంతం మీదుగా వెళ్తుండగా వారిపై ఘోరమైన దాడి జరిగింది. ఇది ఇరువైపులా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గత అనేక దశాబ్దాలుగా హింసను అణచివేయడంలో.. ఇరువర్గాల ఆయుధశాలల్లో సిద్ధంగా ఉన్న భద్రతా పరికరాలు, నిరంతర నిఘా వ్యవస్థలు, ఇంకా అత్యంత రహస్యమైన నిశ్శబ్ద దాడి సాంకేతికతలు కీలక పాత్ర పోషించాయి.

రియా పూర్తిగా అలసిపోయినట్లు అనిపించింది. గత రెండు రోజులుగా నెట్‌వర్క్ ద్వారా పురుషులతో వర్చువల్ చర్చలు జరపడానికే సమయం సరిపోయింది. మరింత పెద్ద ఘర్షణ తలెత్తకుండా ఉండేందుకు, ఇరువర్గాల మధ్య విభజన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇప్పటివరకు స్థలం, వనరుల విషయంలో అనధికారికంగా ఉన్న విభజనను ఇప్పుడు అధికారికంగా సరిహద్దులు గీసి ఖరారు చేశారు.

భీకరమైన వర్షాన్ని మోసుకొస్తూ, ఉరుములు ఉరుముతున్న నల్లటి భయంకరమైన మేఘాలు చీకటి ఆకాశంలో వేగంగా కదులుతున్నాయి. ఇప్పుడు సంవత్సరాలన్నీ వాతావరణంతో నిరంతరం పోరాడటంలోనే గడిచిపోతున్నాయి. వారి జీవితాలు రెండు రకాల పోరాటాలకు పరిమితమైపోయాయి – ఒకటి పురుషులతో, మరొకటి వాతావరణంతో. రియా ఆ రిక్లైనర్ కుర్చీలలో ఒకదానిపై కూర్చుని వైన్‌ను ఒకే గుటకలో తాగేసింది. వెంటనే ఒక రోబో వచ్చి మరికొంత వైన్ పోసింది. ఆమె శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఇరువర్గాలకూ సమయం ముగిసిపోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. భూమి గురించి చేస్తున్న అంచనాలన్నీ నిరంతరం మారిపోతున్నాయి.

సమయం – ఇప్పుడు మనుషుల దగ్గర అది పుష్కలంగా ఉంది, కానీ భూమికి మాత్రం సమయం వేగంగా ముగిసిపోతోంది.

🚀

ఆర్యన్ ఇంటి దగ్గర ఎలిప్టికల్ ఎయిర్-కార్ నుండి కిందకు దిగాడు. అతనికి తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ ఎయిర్-కార్ అతనిపై కాసేపు అలానే ఉండి, ఆ తర్వాత దూసుకుపోయింది. అతను తమ వ్యక్తిగత ప్రదేశమైన ఇంట్లోకి ప్రవేశించాడు. వారి చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతున్నప్పటికీ, ఆర్యన్, మాయా తమ ప్రపంచాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి ప్రయత్నించారు. తమ ఇంటి పట్ల అతనికి ఉన్న ఈ మాలిమి ఆర్యన్‌కి ఎల్లప్పుడూ ప్రశాంతతను చేకూర్చుతుంది. అతను గది లోంచి, తనకిష్టమైన కుర్చీ వైపు వెడుతుండగా, అనుకోకుండా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఇంకా బాగా చూడటం కోసం అతను తన కళ్లద్దాలను సర్దుకుంటూ అద్దానికి దగ్గరగా వెళ్లాడు. అతని జుట్టు ఎప్పటిలాగే చెల్లాచెదురుగా ఉంది, అతని కళ్లు అలసిపోయినట్లు కనిపించాయి. అతను అంతం లేని జీవితంలో చిక్కుకున్న ఒక పురాతన జీవిలా కనిపించాడు. తానింకా ఎందుకు బతికున్నాడు? అని అతను ఆశ్చర్యపోయాడు.

“ఆకలిగా ఉందా?” అని తన సంగీతం గది నుంచి అడుగుతూ, “చాలా కాలం తర్వాత ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది,” అంది మాయ. ఆర్యన్ తన ప్రశ్నను మర్చిపోయాడు, అతని వెన్నులో వణుకు పుట్టింది. ఎలోన్ వ్యవహారాలను చూసే పురుషుల బృందం అతన్ని పిలిచింది. వారు బెదిరిస్తున్నట్లు లేదా భయపెడుతున్నట్లు కనిపించకపోయినప్పటికీ, వారి ప్రవర్తన ఖచ్చితంగా ఆజ్ఞాపించేలా ఉంది. అతను ఎలోన్ కోఆర్డినేట్స్ ఎవరికైనా చెప్పేస్తాడేమోననే భయంతో, అతన్ని పురుషుల ప్రాంతానికి మారమని వారు కోరారు. ఆర్యన్ అక్కడ కూర్చుని ఆ పురుషులను గమనిస్తున్నప్పుడు, వారిలో ఎవరైనా ఒక మహిళను కనీసం క్షణకాలమైనా ఎరుగుదురా అని అతను ఆశ్చర్యపోయాడు. ఉత్సాహం, ప్రతిష్ఠాత్మకత, ఇంకా వేగవంతమైన కొత్త కోణపు ఆలోచన కలిగిన ఈ పురుషుల సమూహం ఒంటరిగానే ఎలోన్‌ను తమ ఆవాసంగా మార్చుకోవాలని ప్రణాళిక వేసింది. ఎలోన్ – ఆ ఆవిష్కరణపై ఆర్యన్‌కు ఇప్పుడు ఎలాంటి యాజమాన్య హక్కు లేదా గర్వం మిగలలేదు.

హెల్ప్ (రోబో) రాత్రి భోజనం కోసం టేబుల్ సర్దుతోంది. ఆర్యన్ సంగీతం గదికి వెళ్లాడు. మాయా అతన్ని చూసి నవ్వింది. ఆమె తన వర్క్‌స్టేషన్ వైపు వంగి ఉంది. ఆమెకు చెప్పాలా? కానీ ఆమెకు ఏమి చెబుతాడు? మాయా లేచి,  తలుపు దగ్గర అతను నిలబడి ఉన్న చోటికి వచ్చింది. ఆమె అతన్ని కౌగిలించుకుని డైనింగ్ టేబుల్ వైపు నడిపించింది. అరుదైన ఆ ఆహ్లాదకరమైన ఎండ రోజున చీకటి పడటం ప్రారంభమైంది.

“ఈ రోజు మీ మీటింగ్ ఎలా జరిగింది? నెట్‌వర్క్‌లో మీటింగ్ పెట్టకుండా, నిన్నెందుకు అక్కడికి రమ్మన్నారు?”, హెల్ప్ వారికి భోజనం వడ్డిస్తుండగా మాయ అడిగింది.

ఆ క్షణంలో, ఆమెకు ఆ విషయం చెప్పేయాలని ఆర్యన్ నిర్ణయించుకున్నాడు.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(2) Help, హెల్ప్ = ఇంటి పనుల్లో సాయపడే యంత్రం

(3) Merger, మెర్జర్ = మనుషులు తన చైతన్యాన్ని యంత్రాలకు బదిలీ చేసి శరీర రహితంగా సజీవంగా ఉండిపోయే ప్రక్రియ.

(ఇంకా ఉంది)


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version