Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-25

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[మాయ ఆర్యన్ కథ చెబుతూ ఉంటుంది. ఆర్యన్ కనుగొన్న ఎలోన్ గ్రహం గురించి చర్చించడానికి అతన్ని ఎన్నోసార్లు సమావేశాలకి పిలుస్తారు పురుషులు. అయితే ఆ చర్చలలో వారు స్త్రీలకు స్థానం కల్పించకపోవడం, ఆ గ్రహంపైకి తాము మాత్రమే వెళ్ళాలనుకోవడం ఆర్యన్‌కి నచ్చవు. ఆ గ్రహం కోఆర్డినేట్స్, ఇతర పరిశోధనా వివరాలను పురుషులు దక్కించుకుంటారు. కొద్దిసేపటికి అమీని తీసుకుని మాయ అక్కడికి వస్తుంది. పదిహేనేళ్ళ వయసున్న అమీ ఎంతో జిజ్ఞాస కలిగిన బాలిక, అన్ని రకాల గాడ్జెట్‌లను సులువుగా వాడగలదు. ముగ్గురు భోజనానికి కూర్చుంటారు. అమీ మాత్రం తన చిటికెన వేలిలో అమర్చిన చిప్ ద్వారా ఆక్టివేట్ అయి, తన అరచేతిలో కనిపిస్తున్న స్క్రీన్‌ని చూస్తూ ఉంటుంది. భోజనం పూర్తయ్యాకా, ఆ స్క్రీన్‌ని చూడ్డం ఆపేసి, ‘ఎలోన్‍ని గ్రహాన్ని నిజంగా మీరే కనుక్కున్నారా’ అని ఆర్యన్‌ని అడుగుతుంది. అవునంటాడు ఆర్యన్. అక్కడ మానవ జీవనం కొనసాగడంపై సందేహాలు వ్యక్తం చేస్తుంది అమీ. సంభాషణని మారుస్తూ, ‘రియాని ఒకసారి రమ్మని చెప్పు’ అని అమీతో అంటుంది మాయ. అమ్మ ఎలోన్‌కి చేరే మార్గం కనుగొనడంలో బిజీగా ఉందని అమీ చెబుతుంది. భోజనాలయ్యాక, ఆర్యన్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అతను అక్కడ లేదని నిర్ధారించుకుని, అమ్మమ్మతో మాట్లాడుతుంది అమీ. ఐదేళ్ళ క్రితం తనని తాను మెషీన్‌తో మెర్జ్ చేసుకున్న ‘బులి’ అనే మహిళా శాస్త్రవేత్తని గుర్తు చేస్తుంది అమీ. కొన్ని రోజులు గడుస్తాయి. రియా తనకిష్టమైన వైన్ బార్‌లో వందవ అంతస్తులో నిలబడి నగరాన్ని చూస్తూ ఉంటుంది. కొద్ది రోజుల ముందు స్త్రీ పురుషుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు ఆమె మనసుని బాధిస్తున్నాయి. ఇరువర్గాలకూ సమయం ముగిసిపోతోందని స్పష్టంగా తెలుస్తుంది. భూమికి సమయం మించిపోతోందని గ్రహిస్తుంది రియా. ఒకరోజు సాయంత్రం ఆర్యన్ ఇంటికి వచ్చేసరికి నిస్సత్తువగా అనిపిస్తుంది. తాను ఇంకా ఎందుకు జీవించి ఉన్నానా అని అనుకుంటాడు. మాయ వచ్చి అతనితో మాట్లాడడంతో కాస్త సర్దుకుంటాడు. భోజనం చేస్తుండగా, ఆ రోజు సమావేశంలో జరిగినదంతా మాయకి చెప్పాలనుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-6 – ఆర్యన్ – 3వ భాగం

“మాయా” అని చెప్పబోతుండగా, తలుపు తెరుచుకుంది. రియా లోపలికి వచ్చింది. మాయ మొహం వెలిగిపోయింది. లేచి, కూతురిని హత్తుకోవాలని చేతులు చాచి, ఎదురెళ్ళింది. రియా అమ్మ కౌగిలింతను తప్పించుకుంటూ టేబుల్ వైపు నడిచింది. మాయ తన కూతురిని హత్తుకోడానికి రావడం ఆర్యన్ చూడటం అదే చివరిసారి.

“ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చావు రియా. చాలా మారిపోయావు. రా, మాతో కలిసి డిన్నర్ చెయ్,” మాయ నెమ్మదిగా అంది.

రియా ఇబ్బందిగా కూర్చుని, హెల్ప్ (1) దగ్గర నుండి ప్లేట్ తీసుకుంది. “అమీ ఎలా ఉంది? తను కూడా చాలా కాలంగా మమ్మల్ని చూడటానికి రాలేదు,” గడచిన కాలాన్ని మాటలతో నింపడానికి మాయ ప్రయత్నించింది.

కానీ దానికి బదులుగా, రియా, ఆర్యన్‌ను ఉద్దేశించి మాట్లాడటానికి మొగ్గు చూపింది.

“ఆర్యన్, నాకు ఎలోన్ (2) యొక్క కోఆర్డినేట్స్ ఇవ్వు,” ఆమె డిమాండ్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టాకా, రియా మాట్లాడిన మొదటి మాటలు అవే. ఆ ఒక్క వాక్యం పలకడం ద్వారా రియా, బయట రేగుతున్న గొడవను నేరుగా తమ ఇంట్లోకి తీసుకువచ్చింది. చుట్టూ తిరుగుతున్న ఆ ఘర్షణ, కోపం అంతా వచ్చి వాళ్లు ముగ్గురూ కూర్చున్న ఆ టేబుల్‌పైనే తాండవించాయి. ఆర్యన్ స్థాణువైపోయాడు.

“రియా, నీ రాజకీయం నా డైనింగ్ టేబుల్ దగ్గర కుదరదు,” దృఢంగా తేల్చి చెప్పింది మాయ.

“మాయా, నువ్వు దేన్నయితే కేవలం ‘రాజకీయం’ అని కొట్టిపారేస్తున్నావో, అదే ఇప్పుడు మన ప్రపంచం యొక్క అసలు నగ్నసత్యం. స్త్రీపురుషులు కలిసి జీవించడానికి అనుమతి ఉన్న చివరి కొద్దిమందిలో మీరిద్దరూ కూడా ఉన్నారనే విషయం మీకు తెలుసా? ఎందుకో ఎప్పుడైనా ఆలోచించావా? దానికి ఒకే ఒక్క కారణం నువ్వు నా తల్లివి కావడం! ఆర్యన్ ఇంకా బతికున్నాడంటే.. ఎలోన్ కోసం వాళ్లు చేస్తున్న వ్యర్థమైన అన్వేషణలో అతను ఎప్పుడైనా అవసరపడొచ్చని వాళ్లు భావించడం వల్లే.” ఆమె ఒక దీర్ఘ శ్వాస తీసుకుని కొనసాగించింది, “ఇది మనుగడకు సంబంధించిన ప్రశ్న. మీకు లభిస్తున్న ఈ మినహాయింపులు ఇలాగే కొనసాగాలని మీరు అనుకుంటే, దానికి బదులుగా మీరు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి.” రియా ముఖంలో నవ్వు లేదు, గాంభీర్యం నిండి ఉంది. అది ఆర్యన్‌కు ఇన్నేళ్లుగా తెలిసిన ఆ పాత అమ్మాయి ముఖంలా అస్సలు లేదు.

కొద్ది సెకన్ల వ్యవధిలోనే మాయ ముఖంలో జీవితకాలపు భావోద్వేగాలు కదలాడాయి – నమ్మశక్యం కాని స్థితి, దిగ్భ్రాంతి, నిజాన్ని గ్రహించడం, అంగీకరించడం, ఆపై మళ్లీ అదే అమితమైన ప్రేమ. రియా మాత్రం ఆర్యన్ వైపు రెప్పవాల్చకుండా చూస్తూ, అతని సమాధానం కోసం ఎదురుచూస్తోంది.

“రియా, ముందు భోజనం ముగించు. సమాచారం సేకరించడానికి నువ్వు మాతో ఉన్న బంధాన్ని వాడుకోలేవు,” అంటూ మాయ ఆ విషయానికి అక్కడితో ముగింపు పలికింది.

రియా తన ప్లేట్ నుండి ముద్ద కూడా సరిగ్గా ముట్టలేదు. ఆమె లేచి నిలబడి, “ఈ చర్చ ఇక్కడితో ముగిసిపోలేదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. మాయా, నేను ఏ బంధాల వెనుకా దాక్కోవడం లేదు, నువ్వే దాక్కుంటున్నావు. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది,” అని అంది.

ఆమె వెళ్లగానే తలుపు గట్టిగా మూసుకుంది. బయట ఒక ఎయిర్-కార్ ఆగి, రియాను ఎక్కించుకుని వేగంగా వెళ్ళడం వారికి వినిపించింది. కానీ ఆమె ఆ గదిలో ఒక తెలియని అస్పష్టతను, గందరగోళాన్ని వదిలివెళ్లింది.

రాత్రి వేళ, ఆర్యన్ మంచంపై పడుకున్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నా, అతను పూర్తిగా మేల్కొనే ఉన్నాడు. పగటిపూట విన్న మాటలు అతని మనసులో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తున్నాయి. కాస్త ఆలస్యంగా మాయ ఆ గదిలోకి వచ్చింది. రియా వదిలివెళ్లిన ఆ గందరగోళం గురించి వారిద్దరూ మాట్లాడుకోలేదు.

“నాకు నచ్చేలా నా వీపు నిమరవా,” ఆర్యన్ పక్కకు ఒరుగుతూ అన్నాడు.

మాయ అతడిని హత్తుకుని, వీపుపై నిమిరింది, ఆపై వారిద్దరూ నిద్రలోకి జారుకున్నారు.

మరుసటి రోజు ఉదయం, ఆర్యన్ మ్యూజిక్ రూమ్‌కి వెళ్లాడు. మాయ అప్పటికే అక్కడ ఉంది, గాజు కిటికీ గుండా బయటకు చూస్తోంది. ఆ రోజు చీకటిగా, మబ్బుగా ఉన్న వేకువని చూస్తుంటే, రోజంతా వర్షం పడుతూ, నిరుత్సాహంగా ఉండబోతోందని అర్థమవుతోంది.

ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా ఆర్యన్ సూటిగా చెప్పాడు, “మాయా, నేను నీకు ఎలోన్ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తాను, సాయంత్రానికల్లా నేను ‘మెన్స్ ఎరీనా’ (పురుషుల ప్రాంతం) కి మారిపోతాను.”

సమాజం నిర్మించిన ఆ గోడల వెనుకకు వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని ఆర్యన్ అర్థం చేసుకున్నాడు. అతను ఒక పురుషుడు, మాయ ఒక స్త్రీ. వారి జీవితాలను శాసిస్తున్న ఈ సరికొత్త ప్రపంచ నిబంధనల ప్రకారం.. వారి మార్గాలు విడిపోక తప్పదు. మాయ సోఫాలో తన పక్కన ఉన్న సీటుపై మెల్లగా తట్టింది, కూర్చోమని సైగ చేస్తూ. ఆర్యన్ కూర్చున్నాడు, ఆమె తన చేతివేళ్లను అతని వేళ్లతో కలిపింది.”ఆర్యన్, ఇది మన ద్వారా పుట్టినప్పటికీ.. మనకు పూర్తిగా భిన్నంగా మారిన మనుషుల మధ్య జరుగుతున్న యుద్ధం. తెలివైన పక్షమే గెలవనివ్వు. నేను పురుషుల వైపూ లేను, స్త్రీల వైపూ లేను. నేను జీవితం వైపు ఉన్నాను. ఇక మన ఇద్దరి మధ్య, ఎలోన్ ఎక్కడ ఉందనే విషయం ఇప్పటి నుండి ఒక ముగిసిపోయిన అధ్యాయం.”

వారిద్దరూ చాలా సేపు అలాగే కూర్చుండిపోయారు. ఆర్యన్ తీసుకున్న నిర్ణయంలోని రెండో భాగం వారి మధ్య ఒక సన్నని దారపు పోగులా వేలాడుతోంది. అది వారిని విడదీస్తున్నట్లు ఉన్నా, ఒకరినొకరు బంధించి ఉంచింది.

🚀

పక్క గదిలో తార గట్టిగా ఏడవడం ప్రారంభించింది. టియోని లేచి, ఆమెను చూడటానికి వెళ్ళింది. హ్యాప్ (రోబో) ఏదో తినడానికి తీసుకురావడంతో తార ఏడుపు ఆపేసి, హ్యాప్‌తో బిజీ అయిపోయింది. టియోని తారను చూసుకుంటుండగా, ఈవీ వర్క్‌స్టేషన్ దగ్గరే కూర్చుని ఉండిపోయింది.

మధ్యాహ్నం దాటాక, కిటికీ బయట చాలా ప్రకాశవంతంగా ఎండ కాస్తోంది. లోపలికి వస్తున్న సూర్యకాంతి ఒక బంగారు వస్త్రంలా గది నిండా పరుచుకుంది.

“మాయా ఉన్నావా?” అడిగింది టియోని, ఆ గదిలోకి తిరిగొచ్చి. ఆమె కిటికీ పక్కన ఉన్న తన కుర్చీలో కూర్చుంది. ఈవీ లేచి నిలబడి, ఒళ్లు విరుచుకుంటూ.. లోపలికి వస్తున్న ఆ సూర్య కిరణాలతో ఆడుకోసాగింది. సిస్టమ్ నుండి వస్తున్న సన్నని ధ్వని, మాయ అక్కడి నుండి వెళ్ళిపోయిందని సూచిస్తున్నట్లుగా ఉంది.

“సీనికి ఇదంతా ముందే తెలుసంటావా? భూమిపై పురుషులు, స్త్రీలు ఎలా కలిసి జీవించారు, ఆపై ఎలా విడిపోయారు అనే విషయాల గురించి? భూమి మెల్లగా నాశనమవ్వడం గురించి? అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల గురించి? ఒకవేళ తెలిసి ఉంటే, ఆమె ఆ విషయాలను నీతో ఎందుకు పంచుకోలేదు టియోని? ఆమె ఎవరితోనైనా పంచుకుందా? అసలు ఈ రహస్యం వల్లేనా ఆమెను చంపేశారు?” అడిగింది ఈవీ.

మాయ మళ్ళీ వచ్చి కథను ముగిస్తుందని టియోని ఇంకా ఆశపడుతోంది. భూమిపై పురుషులు, స్త్రీల మధ్య ఉన్న సంబంధాలు, బంధాలు చాలా భిన్నంగా ఉండేవి. ఎలోన్‌లో ఉన్నవాళ్లు కనీసం దానిని ఊహించను కూడా లేరు. అసలు వారి మనుగడలోనే ఈ మనోహరమైన కథకు ఎక్కడా స్థానం లేదు.

“మన విషయానికి వస్తే, పురుషులు ఎప్పుడూ ఫెన్స్ (3) కు అవతలి వైపే ఉన్నారు. మాయ వివరిస్తున్న విషయాల గురించిన జ్ఞాపకాలు ఇటువైపు కానీ, అటువైపు కానీ ఎవరికీ ఉన్నాయని నేను అనుకోను. అసలు, అది పెద్ద పట్టింపు లేని విషయం,” అంది టియోని, ఎలోన్ లోని వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.

“బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ టియోని.. భూమిపై ఏం జరిగిందనేది చాలా ముఖ్యం.” ప్రతీదాన్నీ అనుమానంగా చూసే ఈవీ, ఇంకా ఆ గతాన్ని జీర్ణించుకోవడానికి ఇబ్బందిపడుతోంది.

“ఇదంతా తెలుసుకోవడం వల్ల ఏం మారుతుంది ఈవీ? భూమిపై పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి బంధాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం అందులో భాగం కాదు కదా. గతాన్ని తెలుసుకోవడం వల్ల ఏం మారుతుంది? అది వర్తమానాన్ని కానీ, భవిష్యత్తును కానీ మార్చగలదా?” ఇంతసేపూ గతాన్ని తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపించిన టియోని, ఇప్పుడు ఆ గతాన్ని అక్కడితోనే వదిలేయాలని ప్రయత్నిస్తోంది.

“ఒప్పుకుంటాను. దీనివల్ల ఏదైనా మారుతుందని నేను అనడం లేదు. గతం ముగిసిపోయింది కాబట్టి అది దేన్నీ మార్చలేదు. కానీ చివరికి, మనం ఒకే జాతికి చెందిన వాళ్లమని మనం అంగీకరించి తీరాలి,” ఆ మాట అంటున్నప్పుడు ఈవీ ఒక్కసారిగా ఆగింది. ఆ క్షణంలోనే ఆమెకు ఆ నిజం తట్టింది. విభిన్నమైన శరీరాలు, వేర్వేరు మనుగడ కలిగిన ఆ జీవులు.. నిజానికి తమలాంటి వారే.

“అది ఎప్పుడో చాలా కాలం క్రితం నాటి మాట, ఇవే. చాలా ‘జాక్స్’ (4) క్రితం భూమిపై జీవించిన వారితో మనల్ని మనం పోల్చుకోవడం లేదా వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం,” కిటికీ గుండా బయటకు చూస్తూ చెప్పింది టియోని.

“ఒక్కసారి ఊహించుకో టియోని, గతంలో మనం ప్రయత్నించినట్లుగా.. ఒకవేళ మనం పురుషులను పూర్తిగా నాశనం చేస్తే, ఈ విశ్వంలో మనం ఒంటరిగా మిగిలిపోతాం. మనకు తెలిసినంతవరకు మనలాంటి పోలికలు ఉన్న ఏకైక జీవులు వాళ్లు మాత్రమే.”

గదిలో పడుతున్న సూర్యకిరణాలు మెల్లగా వెనక్కి తగ్గుతుంటే.. ఎవరో ఆ స్వర్ణవస్త్రాన్ని లాగేస్తున్నట్లుగా ఉంది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

“మనం పురుషులను నాశనం చేయాలని అనుకోవడం లేదు ఈవీ. ఆ పురుషులే ఏదో కుట్ర పన్నుతున్నారు. మనల్ని మనం కాపాడుకోవాలి.” ఆ తర్వాత, కాసేపు ఆలోచించి టియోని ఇలా అడిగింది, “నువ్వు వీటన్నింటి గురించి ఉల్తూర్‌కి చెప్పబోతున్నావా?”

“నేను ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు. సీనిని చంపేసిన విషయానికి సంబంధించి.. మాయ చెప్పిన కథ ఇప్పటివరకు ఎలాంటి సమాధానాలనూ ఇవ్వలేదు.”

ఈవీ కూడా కిటికీ దగ్గరకు వచ్చి టియోని పక్కన నిలబడింది. ఇద్దరూ కలిసి బయట వైపుకి, ముదురుతున్న సాయంత్రాన్ని చూస్తూ ఉండిపోయారు. ఎక్కడో దిగంతంలో ఆ ఫెన్స్ కనిపిస్తోంది. అవతలి వైపు జీవిస్తున్న వారు ఒకప్పుడు తమతో ఇంతగా ముడిపడి ఉండేవారని అనుకోవడం చాలా వింతగా అనిపించింది.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Help, హెల్ప్ = ఇంటి పనుల్లో సాయపడే యంత్రం

(2) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(3) Fence ఫెన్స్= సరిహద్దు, కంచె

(4) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(ఇంకా ఉంది)


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version