Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-26

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[మాయ ఆర్యన్ కథ చెబుతూ ఉంటుంది. ఆర్యన్ కనుగొన్న ఎలోన్ గ్రహం గురించి చర్చించడానికి అతన్ని ఎన్నోసార్లు సమావేశాలకి పిలుస్తారు పురుషులు. ఓ రాత్రి, భోజనం చేస్తుండగా, ఆ రోజు సమావేశంలో జరిగినదంతా మాయకి చెప్పాలనుకుంటాడు చెప్పబోతుండగా, తలుపు తెర్చుకుని లోపలికి వస్తుంది రియా. మాయ కూతుర్ని హత్తుకోవాలనుకుంటుంది. రియా తల్లి కౌగిలిని తప్పించుకుంటూ టేబుల్ వైపు నడుస్తుంది. ‘చాలా ఏళ్ళ తరువాత వచ్చావు, మాతో డిన్నర్ చెయ్యి’ మాయ అంటుంది.  రియా ఓ ప్లేట్ తీసుకుంటుంది. మాయ కూతురితో మాట్లాడాలి ప్రయత్నిస్తే, రియా మాత్రం నేరుగా ఆర్యన్‌తో మాట్లాడుతుంది. ఎలోన్ కోఆర్డినేట్స్ ఇవ్వమని అడుగుతుంది. ఆర్యన్ నిర్ఘాంతపోతాడు. మాయ కూతురిని తిడుతుంది. స్త్రీపురుషులు కలిసి జీవించడానికి అనుమతి ఉన్న చివరి కొద్దిమందిలో వారిద్దరూ కూడా ఉన్నారనే విషయం తెలుసా అని తల్లిని అడుగుతుంది రియా. ఆ అనుమతికి తానే కారణమంటుంది. ముందు తిను, తర్వాత మాట్లాడుకోవచ్చని మాయ అంటుంది. కానీ తినకుండానే లేచి వెళ్ళిపోతుంది రియా. ఆ రాత్రి ఇద్దరూ అస్థిమితంగా నిద్రిస్తారు. ఉదయం లేవగనే, ‘మాయా, నేను నీకు ఎలోన్ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తాను, సాయంత్రానికల్లా నేను ‘మెన్స్ ఎరీనా’ కి మారిపోతాను’ అని చెప్తాడు ఆర్యన్. తాము ఇక కలిసి ఉండడం కుదరదని మాయ గ్రహిస్తుంది. పక్కగదిలో తార గట్టిగా ఏడవడంతో, మాయ చెప్తున్న గతం వివరాలు వింటున్న టియోనీ, ఈవీ వర్తమానంలోకి వస్తారు. టియోని లేచి వెళ్ళి పాపని చూసివస్తుంది. ఈవీ వర్క్ స్టేషన్ దగ్గరే కూర్చుని ఉంటుంది. మాయ నుంచి ఇంకే చప్పుడు రాకపోతే, ఆమె వెళ్ళిపోయిందని గ్రహిస్తారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం భూమిపై ఏం జరిగిందనేది తెలుసుకోడం చాలా ముఖ్యమని ఈవీ భావిస్తుంది. టియోని మాత్రం పెద్దగా ఆసక్తి చూపదు. ‘మనం పురుషులను నాశనం చేయాలని అనుకోవడం లేదు ఈవీ. ఆ పురుషులే ఏదో కుట్ర పన్నుతున్నారు. మనల్ని మనం కాపాడుకోవాలి’ అని అంటూ, ‘వీటన్నింటి గురించి ఉల్తూర్‌కి చెప్తావా’ అని అడుగుతుంది. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్తుంది ఈవీ. ఇద్దరూ గదిలోని కిటికి గుండా బయటకి చూస్తుండిపొతారు. – ఇక చదవండి.]

అధ్యాయం-7 – నిర్ణయాలు – 1వ భాగం

పాటిక్స్, వల్హన్ నగరం వెలుపల ఉన్న ఒక చిన్న, ప్రత్యేకమైన డైనింగ్ సెంటర్‌లో కిటికీ పక్కన కూర్చున్నారు. ఆ కిటికీ నుండి బయటకి చూస్తే రంగురంగుల పువ్వులతో నిండిన పచ్చటి గడ్డితో ఉన్న ఒక చిన్న టెర్రస్ కనిపిస్తోంది. టెర్రస్ అవతల, చీకటిలో, సముద్రపు హోరు వినబడుతోంది. లోపల ఆ శబ్దం తగ్గినట్లు అనిపించినా, దాని ఉనికి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

డైనింగ్ సెంటర్ చుట్టూ తిరిగే బెల్ట్ పై సర్వింగ్ రూమ్ నుండి ఆహారం వచ్చింది. వారు ఆర్డర్ చేసిన కింపాయో శాండ్‌విచ్‌లు, తిబ్లి సాస్, ఇంకా రెండు గ్లాసుల ఎనాబ్‌లను తీసుకున్నారు. కిటికీ గుండా బయట చీకటి పడుతున్న దృశ్యాన్ని చూస్తున్న వల్హన్‌ను పాటిక్స్ గమనించాడు. శరీరంలో క్షీణించిన అవయవాల స్థానంలో కొత్తవి మార్పించుకోడం వల్హన్‌కి మేలు చేసిందని పాటిక్స్ నిర్ధారించుకున్నాడు.

దూరంగా ఉన్నప్పటికీ, వల్హాన్ సముద్రపు హోరును తన పాదాల కిందే ఉన్నట్లుగా భావిస్తున్నాడు. గేజర్ భవనంలో ఓడెప్‌తో జరిగిన చర్చలు కొన్ని సమస్యలకి స్పష్టత నీయడంలో సహాయపడ్డాయి, కానీ అతని మనస్సులో ఇంకా ఏదో అనిశ్చితి ఉంది. ‘తాయ్’ గ్రహాన్ని ప్రత్యామ్నాయ నివాసంగా మార్చుకోడంలోని సాధ్యతను అంచనా వేసే పనిలో ఇమే ఇంకా గేజర్‌లోనే ఉన్నాడు.

“అసలు గేజర్ వద్ద ఏం జరుగుతోంది? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు?” ఎనాబ్‌ ఓ గుక్క తాగి, మెత్తటి సోఫాలో వెనక్కి వాలుతూ అడిగాడు పాటిక్స్.

“ఏమీ లేదు, మామూలు విషయమే. నీకు తెలుసుగా, అక్కడ భారీ టెలిస్కోప్ ఉంది, అందులోంచి మేము గెలాక్సీలను చూస్తున్నాము”. వల్హన్ ఆ ప్రశ్నను దాటవేస్తూ, బయటకే చూస్తూ ఉండిపోయాడు.

పాటిక్స్ తన రెండు మోచేతులను టేబుల్‌పై పెట్టాడు. సీలింగ్ లైట్ల వెలుతురు మెరుస్తున్న ఆ టేబుల్ ఉపరితలంపై, పాటిక్స్ ప్రతిబింబంతో పాటు కనిపిస్తోంది.

“మనిద్దరం ఒకరితో ఒకరం స్పష్టంగా మాట్లాడుకుందాం, వల్హన్. ఇప్పుడు, మునుపటి కంటే చాలా అవసరం. మనం ఒకే పక్షాన ఉండాలి, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న వాటన్నింటినీ బట్టి..” అంటూ పాటిక్స్ మాటలు ఆపేశాడు.

వల్హన్ తన దృష్టిని పాటిక్స్ వైపు మరల్చాడు. “మరి అసలు ఏం జరుగుతోంది, పాటిక్స్? అవతలి వైపు ‘నెక్స్’ (1) గురించి ఈ మాటలన్నీ ఏంటి? లెక్స్ (2) హైవేలపై ఇలాంటి విషయాలను ఎవరు పెడుతున్నారు? దీనివల్ల ఎలాంటి గందరగోళం చెలరేగిందో చూశావు కదా? ఇన్ని జాక్స్ (3) కాలంగా మనకు లభించిన శాంతితో మనం ఎందుకు ఆడుకుంటున్నాము?”

పాటిక్స్ మళ్లీ వెనక్కి వాలాడు. ఇది అంత సులభం కాదని అతనికి తెలుసు. “ఆ విషయాన్ని రాదుల్ లెక్స్ పై పెట్టాడని నేను విన్నాను. నేను త్వరలోనే అతన్ని కలిసి, ఎందుకు అలా చేశాడో అడుగుతాను” అని తేలికగా అన్నాడు పాటిక్స్.

“ఇప్పుడు, నువ్వు చెప్పు, గేజర్ వద్ద.. ఇంకా మత్సు వద్ద ఏం జరుగుతోంది.?” అడిగాడు

వల్హన్ పాటిక్స్ వైపు చూసి నవ్వి, “నేను నీతో ఏకీభవిస్తున్నాను, పాటిక్స్. మనం ఒకరితో ఒకరు స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఈ సమావేశానికి ఏదైనా అర్థం ఉంటుంది. మొదటిది, నెపో (4) నిల్వలు తగ్గిపోతున్నాయని నీకు కూడా తెలుసని నాకు తెలుసు. మనకు ఇతర నిల్వలు లేదా ప్రత్యామ్నాయ పదార్థం అవసరం. రెండవది, విశ్వంలో మరేదైనా గ్రహం నివాసయోగ్యంగా ఉందా, అక్కడ నెపో నిల్వలు ఉన్నాయా అని మేము గేజర్ వద్ద అన్వేషిస్తున్నాం. నా వైపు నుండి ఇంతే, ఇప్పుడు నీ వంతు.” వల్హాన్ వేచి చూస్తుండగా, వారు కొంతసేపు నిశ్శబ్దంగా తిన్నారు. వల్హన్‌తో తాను ఏ విషయాలు పంచుకోవాలో పాటిక్స్ ఆలోచించాడు.

“అవతలి వైపు ఒక నెక్స్ జరిగింది. బబుల్స్ సేకరించిన సమాచారం ఇది. అంతకంటే ముఖ్యంగా, గైనేక్ (5) ఆ నిందను మనపై వేస్తున్నారు! అవును, నెపో నిల్వలు క్షీణిస్తున్నాయని నాకు తెలుసు. నివాసయోగ్యమైన గ్రహాన్ని కనుగొనడంలో మీకు ఏమైనా విజయం లభించిందా?” ప్రత్యామ్నాయ నివాసం ఉండటం తన ప్రణాళికలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని పాటిక్స్‌కు తెలుసు. అయితే, వారు ఒక గ్రహాన్ని కనుగొన్నప్పటికీ, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని కూడా అతను అర్థం చేసుకున్నాడు.

‘ఎవరు మరణించారు, పాటిక్స్?’ అని అడిగాడు వల్హన్, “ఎవరైనా ముఖ్యమైన వ్యక్తా?”

“అలాగేమీ కనిపించడం లేదు. ఆ పేరు ‘సీని’ అని తెలుస్తోంది. మనం ‘విష్’ (6) ని ఉపయోగించామని వారు చెప్తున్నారు, అది చాలా హాస్యాస్పదం, ఎందుకంటే మనం చాలా జాక్స్ క్రితమే విష్‌ను నిలిపివేశాము. మరియు ఆ విషయం వారికి కూడా తెలుసని నేను నమ్ముతున్నాను. వారు దీన్ని మనపై నెట్టే విధానం చూస్తుంటే, వారు ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది, అందులో మనపై ఏదో ఒక రకమైన దాడి చేసే ఆలోచన ఉంది”

వల్హాన్ మౌనంగా తిన్నాడు. పాటిక్స్ చెబుతున్నది నిజమా కాదా అని అతను తేల్చుకోలేకపోయాడు. ‘విష్’ని వాడటం నిలిపివేశారనే విషయం గానీ, ప్రస్తుత నిల్వలను వారు ఏమి చేశారనే విషయం గానీ అతనికి తెలియదు.

వారు డిన్నర్ ముగించుకుని డైనింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చారు. వారు సముద్రతీరం వెంబడి నడుస్తుండగా మూడు చందమామలు ప్రకాశిస్తూన్నాయి, తేలికపాటి గాలి వీస్తోంది. దారికి దగ్గరగా, సముద్రపు అలలు రాళ్లను ఢీకొంటూ, వెండి వెలుతురులో మెరుస్తున్న నురగను చిమ్ముతున్నాయి.

“మనం అన్వేషిస్తున్న గ్రహం జీవానికి అనుకూలంగా ఉంటుందో లేదో నాకు ఇంకా తెలియదు. కానీ దానికి మంచి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అది ఎలోన్ (7) అంత అందంగా, సమృద్ధిగా ఉంటుందా అనేది మనకు ఇంకా తెలియదు. ప్రస్తుతానికి, నేను చెప్పగలిగేది ఒక్కటే, ఇది ఫలించవచ్చు లేదా ఫలించకపోవచ్చు ఒకవేళ ఇది పని చేయకపోతే, మనం ఇతర ప్రపంచాల కోసం వెతకాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, నాకు భూమిపై ఉన్న ఆ ప్రజల గురించి ఆశ్చర్యం వేస్తుంది. ఎలోన్‌ను కనుగొనడానికి చాలా శ్రమ, పరిశోధన అవసరమై ఉంటుంది. వారు చేయగలిగినప్పుడు, మనం కూడా ఖచ్చితంగా చేయగలమని నమ్ముతున్నాను.”

సముద్రపు హోరు తోడు రాగా వారు నిశ్శబ్దంగా ముందుకు సాగారు. కొత్త గ్రహం గురించిన ప్రతిపాదన సుదూర భవిష్యత్తుకు సంబంధించినదని, అది తన ప్రణాళికపై ఎలాంటి ప్రభావం చూపదని పాటిక్స్ నమ్మాడు. విషయాలను ఎటు వైపు తీసుకెళ్లాలో ఇప్పుడు అతనికి స్పష్టత వచ్చింది.

“మరి రాదుల్ సంగతి ఏంటి, పాటిక్స్? అతడి చేత లెక్స్ పై ఈ విషయాలన్నీ ఎందుకు పెట్టిస్తున్నావు? అతని సందేశాలకు ఎలాంటి స్పందనలు వచ్చాయో చూశావా? రేపే మనం గైనేక్‌తో యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉంది.”

“నేనేమీ లెక్స్ పై అతనితో ఏమీ పెట్టించడం లేదు, వల్హన్. కొంతకాలం క్రితం ఎటుయిస్ వద్ద నన్ను కలవడానికి వచ్చినప్పుడు అవతలి వైపు జరిగిన నెక్స్ గురించి అతనికి తెలిసింది. అతడి గురించి నీకు తెలుసుగా, అతనికి దేనిపైనా శ్రద్ధ ఉండదు, పనికొచ్చే పనేమీ చేయడు. లెక్స్‌తో ఆడుకోవడం అతనికి ఒక కాలక్షేపం. నిజానికి, మరింత జాగ్రత్తగా ఉండమని అతనికి చెప్పాలని నేను అనుకుంటున్నాను”, రాదుల్ తనంతట తానే ఇదంతా చేస్తున్నాడనే భ్రమను మరికొంత కాలం కొనసాగించాలని పాటిక్స్ అనుకున్నాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి అదే ఉత్తమ మార్గం. రాదుల్ గురించి పాటిక్స్ తనకు పూర్తి నిజం చెప్పడం లేదని వల్హన్‌కు తెలుసు, కానీ దీని గురించి అతన్ని మరింత ఒత్తిడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అతను గ్రహించాడు.

“సరే. మరి లెక్స్ హైవేలను మింగేస్తున్న గైనేక్‌లపై ద్వేషపూరిత వెల్లువ గురించి ఇప్పుడు నువ్వు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నావు? అది తగ్గే సూచనలేమీ కనిపించడం లేదు. దానికి ఒక స్వంత రూపం వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ కోపాన్ని మరో వైపు మళ్లించడమో లేదా పూర్తిగా చల్లార్చడమో చేయాలి, పాటిక్స్. ఇది మనకు మంచిది కాదు.”

పాటిక్స్ నిశ్శబ్దంగా అతని పక్కనే నడిచాడు. దీని గురించి అతను చాలా లోతుగా, చాలా కాలం ఆలోచించాడు. రాదుల్‌ను  పాయింట్ వద్దకి పిలిపించి, అతని ముందు ఈ సవాలు విసిరిన రోజు నుండి, ప్రతిదీ అతని ప్రణాళికల ప్రకారమే ఒకచోటికి చేరుకోవడం ప్రారంభమైంది.

“నేను నీతో ఏకీభవిస్తున్నాను, వల్హన్. వీటన్నింటిపై మనం చర్చించడానికి సైనెడ్ సమావేశం ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. బహుశా మనం ఒక కలాంటే (8) తర్వాత కలవవచ్చా?”

వల్హాన్ తల ఊపాడు. వారు నడుస్తున్న దారి చివరకు చేరుకున్నారు. అక్కడ నుండి వారు వేర్వేరు ట్రావెలర్స్ ఎక్కడానికి రోడ్డు వైపు నడవడం ప్రారంభించారు.

“సమావేశంలో దేని గురించి చర్చిస్తారు, పాటిక్స్?” వల్హన్ అడిగాడు.

“బబుల్స్ నుండి మనం సేకరించిన సమాచారాన్ని, ఇంకా నెపో నిల్వల క్షీణతను అందరితో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. దాని అర్థం – మనకు ఏమి సమస్య ఉండొచ్చు, ఇంకా మనం ఏమి చేయాలి అనేవి చర్చించాలి,” పాటిక్స్ బదులిచ్చాడు.

వారు దాదాపు రోడ్డుకు చేరుకున్నారు.

“నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా?” అడిగాడు వల్హన్.

పాటిక్స్ వెంటనే టాపిక్ మారుస్తూ, ‘ఒడెప్ గురించిన సమాచారం నీ దగ్గర ఏమైనా ఉందా, వల్హన్? ఈ సమావేశానికి సైనెడ్ పిలిస్తే అతనొస్తాడని నువ్వు అనుకుంటున్నావా?” అని అడిగాడు.

వల్హాన్ కొండల్లోని ఒడెప్ ఇంటికి ఇంకా వెళ్తుంటాడని పాటిక్స్‌కు తెలుసు. ఓడెప్ కొండల్లోకి వెళ్లిపోయి ఉండవచ్చు, కానీ అతని అభిప్రాయాలకు సైనెడ్‌లో ఇప్పటికీ చాలా విలువ ఉంది.

వల్హన్ విషయం గ్రహించాడు. ఇక పాటిక్స్‌ను అతని ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు అడగలేదు. బదులుగా, అతను ఒడెప్ గురించి ఆలోచించాడు – కొండల్లోని ఆ ఏకాంతపు ఇంట్లో కూర్చుని, అవయవ భర్తీలను వదిలేసి, తనకి చావు రాబోతోందని తెలిస్తే జీవితం ఎలా మారుతుందో చూడటానికి ప్రయత్నిస్తూ, విశ్వం యొక్క ప్రయాణంలో గైనేక్‌లను తోటి ప్రయాణికులుగా భావిస్తున్నాడు ఒడెప్. అతని మాటలు ఇకపై ఎవరూ వినరు. నిజానికి, అతని అభిప్రాయాలను వినవలసిన అవసరం కూడా వారికి లేదు. ఓడెప్ ఉనికి లేకుండా తెరమరుగైపోవాలని నిర్ణయించుకున్నందున, అతను అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది.

“అతను బాగానే ఉన్నాడు, పాటిక్స్. కొంతకాలం క్రితం నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతన్ని కలిశాను. సైనెడ్ చర్చకు వచ్చే విషయం గురించి మాట్లాడితే, మనం రమ్మని అడిగితే అతను వస్తాడు. కానీ మనం అతన్ని పిలవాల్సిన అవసరం ఉందా? నాకు తెలిసినంతవరకు, అతను ఒక రకంగా అన్ని విషయాల నుండి వైదొలిగాడు” చెప్పాడు వల్హన్.

పాటిక్స్ ఊపిరి పీల్చుకుంటూ తల ఊపాడు. అంతా ఖరారైంది. ఇప్పుడు ప్రణాళికను అమలు చేయడమే తరువాయి.

(ఇంకా ఉంది)

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Nex, నెక్స్ = మరణం, చావు

(2) Lex, లెక్స్ = సమాచార పరికరం

(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(4) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(5) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం

(6) Vish, విష్ = విషమయమైన పదార్థం

(7) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(8) Calante, కాలంటే = ఎలోన్ గ్రహంలో ఒక నెల


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version