[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[వల్హన్, పాటిక్స్ ఒక డైనింగ్ సెంటర్లో కలుసుకుని నెపో నిల్వల క్షీణత, ప్రత్యామ్నాయ గ్రహం ‘తాయ్’ అన్వేషణ, ఇంకా గైనేక్లతో తలెత్తుతున్న వివాదాల గురించి సుదీర్ఘంగా చర్చిస్తారు. ఎలోన్ గ్రహంలో స్త్రీలు ఉంటున్న వైపు సీనీ అనే యువతి చనిపోయిందని, ఆమె మరణానికి పురుషులు చేసిన విషప్రయోగమే కారణమని తమని నిందిస్తున్నారని పాటిక్స్ వల్హన్కి చెప్తాడు. ఈ ‘నెక్స్’ (మరణం) గురించి లెక్స్ హైవేలపై చెలరేగుతున్న ద్వేషపూరిత గందరగోళం వల్ల యుద్ధ వాతావరణం నెలకొందని వల్హన్ ఆందోళన వ్యక్తం చేస్తాడు. అయితే, ఈ రహస్యాల వెనుక పాటిక్స్ స్వంత ప్రణాళికలు ఉన్నప్పటికీ, వాటిని వల్హన్ వద్ద దాచిపెడుతూ రాదుల్పై నెట్టేయడానికి ప్రయత్నిస్తాడు. చివరగా, ఈ సంక్షోభంపై చర్చించడానికి సైనెడ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తారు. సమాజానికి దూరంగా కొండల్లో ఒంటరిగా జీవిస్తున్న ఒడెప్‌ను ఈ చర్చలకు పిలవాల్సిన అవసరం లేదని భావించి, పాటిక్స్ తన తదుపరి వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-7 – నిర్ణయాలు – 2వ భాగం
ఇమే లేని సమయంలో, ఫురావా వాళ్ళు అతని మొక్కలను బాగా చూసుకున్నారు. అవి మంచి ఎత్తుకు పెరిగి, ఇమే రూపకల్పన చేసిన సముద్రపు నీలి రంగు గంట ఆకారపు పువ్వులతో నిండిపోయాయి. వాటిపై ఉన్న ముదురు నీలి రంగు చుక్కలు వాటి అందాన్ని మరింత పెంచాయి. ఇమే ఆ మొక్కల పక్కన మోకాళ్లపై కూర్చుని, వాటి సువాసనను ఆస్వాదిస్తున్నాడు. ఉదయాన్నే సముద్రతీరంలో వచ్చే తాజా గాలి సువాసన వాటి నుండి వస్తోంది. ఆ పువ్వులు వికసించిన విధానం చూసి ఇమే ఎంతో సంతోషించాడు; అయోనా మార్గాల్లో వాటిని ఎక్కడ నాటాలో అతనికి ఇప్పటికే ఒక స్పష్టత ఉంది.
“ఇదేం స్థలం, ఇమే? నేను ఇంతకు ముందెన్నడూ ఇక్కడికి రాలేదు. రంగులు, సువాసనల మాయాజాలంలా ఉందే ఇది!” అంటున్న రాదుల్ నీడ ఇమే మొక్కలపై పడింది.
ఇమే తలెత్తి పైకి చూశాడు. గతంలో చూసినదానికంటే రాదుల్ ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్నాడు. అతని జుట్టు చిన్నగా ఉంది, దుస్తులు చాలా హుందాగా ఉన్నాయి. ఇప్పుడు అతన్ని చూస్తే, అతను ఒక గ్రూప్ హౌస్‌లో నివసించేవాడని ఎవరూ చెప్పలేరు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇమే రాదుల్‌ను కలవాలని నిర్ణయించుకున్నాడు. అయోనాలో వారి చివరి సమావేశానికి మరియు ఇప్పటికీ మధ్య చాలా మారిపోయిందని అతను గ్రహించాడు.
“ఇది ఫురావా, రాదుల్. ఇది పువ్వులు, మొక్కల పెంపక కేంద్రం. నీ సందేశం వచ్చినప్పుడు నేను ఇప్పటికే ఇక్కడికి వస్తున్నాను, అందుకే నిన్ను కూడా ఇక్కడికే రమ్మన్నాను!’’
“నువ్వు చాలా రోజులు దూరంగా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు?” ఫురావా ప్రాంగణంలో పెద్ద వృక్షం కింద ఉన్న బెంచీల వైపు నడుస్తూ రాదుల్ అడిగాడు.
ఇమే బెంచ్ మీద కూర్చోగా, రాదుల్ చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని చూస్తూ ముగ్ధుడైపోయాడు.
“నేను కొంచెం పని మీద గేజర్ భవనానికి వెళ్లాను. సరే నువ్వు చెప్పు, ఈ మధ్య లెక్స్ (1) పై వింత సందేశాలను ఎందుకు పెడుతున్నావు? నువ్వు నెక్స్ (2) గురించి చెప్పింది నిజమేనా?” ఇమే అడిగాడు. రాదుల్ ఎంతో సంతోషించాడు. చివరికి తను లెక్స్పై పెట్టిన సందేశాన్ని ఎవరో ఒకరు గుర్తించారని.
“అవును ఇమే, ఫెన్స్ (3) కి అవతలి వైపు ఒక నెక్స్ సంభవించిందని, దానికి గైనేక్లు (4) మనల్ని నిందిస్తున్నారని నాకు సైనెడ్ లోని కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. ఈ రోజుల్లో లెక్స్పై వస్తున్న ఈ గందరగోళం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?” అని అతను అడిగాడు. ఇమే కొంతసేపు ఆ సువాసన భరితమైన గాలిని ఆస్వాదించాడు. రాదుల్ ఇంకా బెంచ్ దగ్గరే నిలబడి, వికసించిన రకరకాల పువ్వుల వైపు చూస్తున్నాడు. ఈ జోక్యాల వల్ల రాదుల్కు ఏమి లభిస్తుందో ఇమే ఊహించలేకపోయాడు. ఇదంతా అతను స్వయంగా చేస్తున్నాడా లేదా ఎవరైనా అతనిని నడిపిస్తున్నారా?
“గైనేక్లతో శత్రుత్వం ఎక్కడ మొదలైందో నీకు తెలుసా అని నువ్వు నన్ను గతంలో అడిగావు. నేను రకరకాల మార్గాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. భూమిపై మన ఉమ్మడి జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. అది ఎక్కడో రికార్డ్ చేయబడలేదు. ఆ సమయం చాలా పురాతనమైనది కావడం వల్ల కాలక్రమేణా దాని ప్రాముఖ్యతను కోల్పోయిందని నేను అనుకుంటున్నాను. ఫెన్స్‌కి అవతల ఉన్నవారే శత్రువులు – నేటి ఏకైక నిజం ఇదే,” రాదుల్ అన్నాడు.
అప్పుడు ఇమే మొదటి నుండి అడగాలనుకుంటున్న ప్రశ్నను అడిగాడు, “రాదుల్, మొదట నువ్వు క్రియేషన్ (5) గురించిన అంశాన్ని సైనెడ్ ముందుకు తీసుకురావాలనుకున్నావు. ఇప్పుడు గైనేక్లపై ఈ భయాందోళనలను, ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించావు. అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు?”
ఎట్టకేలకు రాదుల్ అతనితో పాటు బెంచ్ మీద కూర్చున్నాడు. అతను తన ప్రకాశవంతమైన నీలి రంగు కళ్లతో ఇమే వైపు నేరుగా చూశాడు.
“ఎలోన్ (6) పై సంపూర్ణ యాజమాన్యం. ఈ గ్రహం మొత్తం మనకే కావాలి, ఇమే. కంచెలు ఎక్కడైతే ఏర్పడతాయో, అక్కడ ఘర్షణ వచ్చే అవకాశం ఇప్పటికే పొంచి ఉంటుందని నీకు తెలుసు. మీలో కొందరు ఎప్పుడూ మాట్లాడే ఈ శాంతి కాలం, ఇరువైపులా మనం మళ్లీ బలాన్ని పుంజుకోవడానికి దొరికిన ఒక విరామం మాత్రమే. ఆలోచించు.. వారి వైపు నెక్స్ సంభవించడానికి మనం కారణమనే ఈ నిందతో వారు అలజడి సృష్టించడం ప్రారంభించారు. మరి దీనికి మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? మనం కేవలం ఫెన్స్ వెనుక దాక్కుని, వారి తదుపరి అడుగు కోసం ఎదురుచూడాలా? ఇమే, మన గ్రహాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది. నువ్వు ఊహించిన దానికంటే చాలా రకాలుగా మనకు ఆ రెండవ భాగం అవసరం. ఇది కేవలం స్థలానికి సంబంధించినది మాత్రమే కాదు. మనం మనుగడ సాగించాలంటే ఆ రెండవ భాగం మనకు ఖచ్చితంగా కావాలి”
రాదుల్ పూర్తి నమ్మకంతో, నిశ్చయంగా మాట్లాడుతుండటం ఇమే గమనించాడు. రాదుల్ అయోనాకు వచ్చినప్పుడు, ఇప్పుడు అతని అణువణువునా కనిపిస్తున్న ఈ తీవ్రమైన కోరికను ఇమే అస్సలు పసిగట్టలేకపోయాడు. నెపో (7) నిల్వలు తగ్గిపోతున్నాయనే విషయం రాదుల్కు తెలుసని అతని మాటల ద్వారా స్పష్టమైంది.
“మన మనుగడ కోసం ఒక ప్రత్యామ్నాయ గ్రహాన్ని కనుగొనడానికి నేను గేజర్ వద్ద పని చేస్తున్నాను, రాదుల్. ఇప్పటికే ఒక గ్రహాన్ని స్పష్టమైన అవకాశంగా గుర్తించాము. మనం అక్కడికి వెళ్ళిపోయేలా ఆలోచించవచ్చు. ఈ గ్రహాన్ని, అవతలి వైపు ఉన్న ఆ జీవులను వదిలేసి, మనం మన జీవితాలను కొత్తగా ప్రారంభించవచ్చు. భూమి జ్ఞాపకాలు కానీ, అక్కడి నుండి మనతో వచ్చిన ఏ బంధాలు కానీ లేకుండా మనం ఒక కొత్త ఇల్లు, కొత్త నగరాలు, ఒక సరికొత్త ఉనికిని నిర్మించుకోవచ్చు”, తను మాట్లాడుతున్నప్పుడు కూడా, తాను ఒక రకంగా రాదుల్‌ను బతిమాలుతున్నట్లు ఇమే గ్రహించాడు.
“కొత్త గ్రహమా?” రాదుల్ నమ్మలేనట్లు ఆశ్చర్యంగా అడిగాడు, “అది మనకు ఎందుకు అవసరం? మనకు కావలసిందల్లా ఇక్కడే ఉంది. నేను నా చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తున్న కొద్దీ, ఎలోన్ ఎంత అందంగా ఉందో నాకు మరింత అర్థమవుతోంది. ఇది మన ఇల్లు, ఇమే. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఎందుకు ఆలోచించాలి? కానీ, ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇమే, నీ ఆ కొత్త గ్రహాన్ని గుర్తించి ఉంచు. మనం ఎలోన్ మొత్తం స్థిరపడిన తర్వాత, ఆ కొత్త గ్రహానికి విస్తరించడం గురించి ఆలోచించవచ్చు. మనం మళ్లీ క్రియేషన్స్ ప్రారంభిద్దాం. మనం ఏ రకంగానూ మన పరిమితులను నిర్దేశించుకోకూడదు, ఇమే. నేను నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను,” రాదుల్ తిరిగి దిగంతం వైపు చూశాడు, అప్పుడే దాన్ని జయించినట్లుగా అతని చూపు ఉంది. ఇప్పటికే సేకరించిన డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేస్తున్న యంత్రం గురించి ఇమే ఆలోచించాడు. మరో కొన్ని రోజుల్లో, ‘తాయ్’ గ్రహం జీవానికి అనుకూలమైనదా కాదా అనేది అతనికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అయోనా కిటికీ గుండా అతనికి కనించే ఆ గ్రహాలన్నీ ఎలోన్ యొక్క కాబోయే వలస రాజ్యాలా? అతను ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు.
“అంటే, రాదుల్, ఈ గ్రహం నుండి గైనేక్ లను అంతమొందించే సమయం వచ్చిందని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు కేవలం మరొక జాతిని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నావా? ఈ మొత్తం విశ్వంలో మనకు అత్యంత దగ్గరైన వారు వారేనని నువ్వు గ్రహించలేకపోతున్నావా? వారు వెళ్ళిపోయాక మనం ఒంటరిగా మిగిలిపోతాము. నేను చాలా ‘జాక్స్’ (8) పాటు అంతరిక్షాన్ని గమనిస్తూ, కాపలా కాస్తున్నాను; అక్కడ కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది, రాదుల్. అక్కడ మరెవరూ ఉన్నట్లు కనిపించడం లేదు. అలాగే, గైనేక్ లకు మన ఉమ్మడి గతం గురించి ఏదైనా సమాచారం తెలిసి ఉంటే, అది వారితో పాటే అంతరించిపోతుందని, ఆ విషయం మనకు ఎప్పటికీ తెలియకుండా పోతుందని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా?”
రాదుల్ లేచి నిలబడుతూ నవ్వడం ప్రారంభించాడు. “రా ఇమే, మనం ఇంక్యుబేటర్ భవనంలోకి వెళ్లి కొంచెం ఎనాబ్ (9) తాగుదాం. నువ్వు పని చేసే ఈ విశ్వం, గెలాక్సీలు నీ మనస్సుతో ఆడుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను. వారు కూడా మన కోసం ఇదే ఆలోచిస్తున్నారని నువ్వు గ్రహించడం లేదా? అవతలి వైపు ఉన్నవారెవరైనా ఈ గెలాక్సీలో ఒంటరిగా మిగిలిపోవడం గురించి ఆలోచిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఆ పురాతన ఉమ్మడి గతం గురించిన సమాచారంతో నువ్వు ఏం చేస్తావు? భవిష్యత్తును చూడు, ఇమే. ఈసారి ఎవరు గెలిస్తే వారు ఎలోన్లోనే ఉంటారు, ఆపై, ఈ విశ్వాన్ని జయించడం వారి వశమవుతుంది. అది మనమే కావాలి”.
రాదుల్ ఇంక్యుబేటర్ భవనం వైపు నడవడం ప్రారంభించాడు. వారిద్దరూ కలిసి నడుస్తుండగా, భవిష్యత్తులో వారంతా రాదుల్‌ను అనుసరించబోతున్నారని ఇమే గ్రహించాడు.
🚀
తన ముందు విస్తరించి ఉన్న కొండలను చూస్తూ, ఇమే ట్రావెలర్ స్టాప్ వద్ద కూర్చున్నప్పుడు ఎండ మండిపోతోంది. కొండ వాలులలోని పచ్చని చెట్లు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. ఇప్పటికే రెండు ట్రావెలర్స్ అతనిని దాటి వెళ్ళిపోయాయి, కానీ అతను కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు. కొండలపై ఉన్న ఒడెప్ ఇంటికి వెళ్లే దారి స్పష్టంగా కనిపిస్తోంది; కొద్దిమంది ప్రయాణికులతో పైకి వెళ్తున్న చివరి ట్రావెలర్‌ను కూడా అతను చూడగలుగుతున్నాడు. కానీ తను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తూ అతను అక్కడే కూర్చున్నాడు.
గేజర్ భవనం నుండి ఫలితాలు రావడం ప్రారంభమైనప్పుడు అతను అయోనాలో ఉన్నాడు. వాటిని విశ్లేషించినప్పుడు ఇమే తీవ్ర నిరాశకు గురయ్యాడు. ‘తాయ్’ వారి ప్రత్యామ్నాయ నివాసం కాలేదని స్పష్టమైంది. అక్కడి వాతావరణ కదలికల విశ్లేషణ అది అత్యంత అస్థిరమైన, బలహీనమైన ప్రదేశమని తేల్చింది. ఆ గ్రహ వాతావరణంలో సుదీర్ఘ కాలం పాటు వేగంగా ఆక్సీకరణ జరగడం వల్ల సూర్యకాంతి నీలం రంగులోకి మారుతుంది, అంటే తాయ్ జీవనానికి అనుకూలం కాదు. ఇమే తీవ్రమైన నిరాశను అనుభవించాడు. అతని మొదటి ఆలోచన వల్హన్‌కు చెప్పాలనేదే, కానీ వారి మధ్య ఏర్పడిన దూరం ఇంకా తగ్గలేదు. అతను గేజర్ను విడిచిపెట్టినప్పటి నుండి, వారిద్దరూ మాట్లాడుకోలేదు. అప్పుడు, అతనికి ఒడెప్ గుర్తుకు వచ్చాడు.
సూర్యుడు ఇప్పుడు మరింత తీవ్రంగా ప్రతాపం చూపిస్తున్నాడు, ముందున్న దారి అతనికి ఆహ్వానం పలుకుతోంది. చివరికి, ఇమే లేచి కొండలపైకి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని పాదాల కింద ఎండిన ఆకులు నలిగిపోతూ శబ్దం చేస్తుండగా, చెట్ల మధ్య సూర్యుడు దాగుడుమూతలు ఆడుతున్నాడు. చాలా దూరం నడిచిన తర్వాత, ఒక మలుపులో ఒడెప్ ఇల్లు కనిపించింది. ఇమే మనస్సులో ఒకేసారి భయము, ఇంకా ఆందోళన కలిగాయి. తను గేజర్ భవనాన్ని విడిచిపెట్టినప్పటి నుండి, ఓడెప్ జుట్టులో మరికొన్ని తెల్ల వెంట్రుకలు వచ్చాయా అని అతను ఆలోచించాడు.
అతను ఇంటి దగ్గరికి చేరుకోగానే, ఒడెప్ బయటకు వచ్చాడు. దారిలో నడిచి వస్తున్న ఇమేను చూసి అతడు నవ్వాడు.
“ఇమే, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నిన్ను ఇక్కడికి పిలవాలని అనుకుంటున్నాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది, లోపలికి రా, లోపలికి రా.” అంటూ స్వాగతం పలికాడు.
లోపలికి వెళ్ళిన తర్వాత ఇమే ఆ ఇల్లాంతా గమనించాడు. అక్కడ సామాన్లు చాలా తక్కువగా, నిరాడంబరంగా ఉన్నాయి. తెరిచిన కిటికీ నుండి సూర్యకాంతి లోపలికి వస్తూ, బోసిగా ఉన్న ఆ గదులకు జీవం పోస్తోంది. ఆ ఇంటి నిర్మాణం నగరం లోపల, చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాల కంటే భిన్నంగా అనిపించింది.
“దీన్ని నువ్వే డిజైన్ చేశావా, ఒడెప్?” అడిగాడు ఇమే.
“అవును, నేనే. ఇది భిన్నంగా ఉందని నాకు తెలుసు; నిజానికి, నేను దీన్ని అలాగే తయారు చేయడానికి ప్రయత్నించాను,” ఒడెప్ అన్నాడు. అతను విశ్రాంతిగా కూర్చునే ఒక కుర్చీని చూపించాడు. వారిద్దరూ దానిపై కూర్చున్నారు.
“నువ్వు బానే ఉన్నావుగా?” ఇమే అతని జుట్టు వైపు చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.
ఓడెప్ నవ్వి, “నాకు ఇంకా రెండు తెల్లటి వెంట్రుకలే ఉన్నాయి, ఇమే. ప్రత్యామ్నాయ అవయవాలను ఉపయోగించడం ఆపేసినా కూడా విషయాలు అంత త్వరగా మారిపోవు. మనం నెపోను ఎంతగా శుద్ధి చేశామంటే, మన అవయవాలు చాలా ‘జాక్స్’ కాలం పాటు మన్నుతాయి. నేను ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంది.” అన్నాడు.
వారు కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. తాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఇమే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.
“ఒడెప్, ‘తాయ్’ గ్రహం మన భవిష్యత్తు నివాసం కాలేదు. దాని విశ్లేషణ నివేదిక వచ్చింది. అక్కడ వాతావరణం చాలా అస్థిరంగా ఉంది, మనం మన అన్వేషణను మళ్లీ మొదటి నుండి ప్రారంభించాలి,” ఇమే ఒక్కసారిగా చెప్పేశాడు.
“ఒక ప్రత్యామ్నాయ ఆవాసాన్ని కనుగొనడానికి విశ్వాన్ని అన్వేషించడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, ఇమే. దానికి ఓపిక, శ్రమ అవసరం. కానీ మనం విజయం సాధించే వరకు, ఎలోన్ లోనే జీవించాలని, ఇక్కడి వాస్తవాలను ఎదుర్కోవాలని గుర్తుంచుకోవాలి.’ చెప్పాడు ఒడెప్.
“కానీ, ఎలోన్‌లోని వాస్తవాలు అంత ప్రోత్సాహకరంగా లేవు, ఒడెప్. నువ్వు లెక్స్‌తో కనెక్ట్ అవకుండా విడిగా ఉన్నావు కాబట్టి ఆ విషయం నీకు తెలియదు. మనం మళ్లీ ఒక ఘర్షణల దశలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది. సైనెడ్లో ఇలాంటి చర్యకు ఆమోదం తెలపడానికి ఎదురుచూస్తున్న సభ్యులు ఉన్నారు. పురుషులంతా ఏకమవడానికి ఏదో ఒక కారణాన్ని కనుగొన్నట్లున్నారు, ఇప్పుడు వారు గైనేక్ లను పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ పరిస్థితి అంతా చాలా వేగంగా నియంత్రణ తప్పుతోంది.” చెప్పాడు ఇమే.
ఒడెప్ సుదీర్ఘంగా నిట్టూర్చాడు, “ఇమే, మనం చాలా కాలం పాటు శాంతిని అనుభవించాము. ఒక రకమైన నిశ్శబ్దం మన ఉనికిని ఆవరించింది. ఒక శత్రువు ఉన్నాడని తెలుసుకుని మేల్కొనడం మనల్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచుతుంది. క్రమమైన వ్యవధిలో జరిగే యుద్ధం ఒక జీవశక్తి లాంటిది. ఇది మన ఉమ్మడి జీవితాల్లో ఎంతో అవసరమైన మార్పును తెస్తుంది. అది మనకు ఏదో ఒక పనిని, ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. యుద్ధం విధ్వంసంపై ఆధారపడినప్పటికీ, అది ఒక ఏకీకరణ శక్తి. బహుశా విశ్వానికి మూలాధారమైన సృష్టి మరియు వినాశనం అనే చక్రంలోకి మనం తిరిగి ప్రవేశించడానికి ఇది మన మార్గం కావచ్చు.” అన్నాడు.
“అంటే నువ్వు దీన్ని సమర్థిస్తున్నావా?” ఇమే ఆశ్చర్యపోయాడు.
అసలు ఒడెప్ ఇంటికి అంత దూరం వచ్చినప్పుడు తను ఏమి ఆశించాడు?
“నేను సమర్థిస్తున్నానా లేదా అనేది ముఖ్యం కాదు, ఇమే. మేము గేజర్ను విడిచిపెట్టినప్పుడు వల్హాన్ నాతో చెప్పినట్లు, నేను చాలా కాలంగా వీటన్నింటికీ దూరంగా ఉన్నాను. ఇప్పుడు, నేను ఉనికి లేని ఒక అంచున ఉన్నాను. నేను ఏం చెప్పినా, దేన్ని నమ్మినా ఇక దేనికీ ప్రాధాన్యత లేదు”, ఒడెప్ దయగల కళ్లు ఇమే వైపు నేరుగా చూశాయి. వాటిలో ఓటమి కానీ, బాధ కానీ లేవు. కేవలం అంగీకారం మాత్రమే ఉంది.
ఇమే లేచి తలుపు వెలుపలికి నడిచి, దిగంతం వైపు చూశాడు. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతుండగా ఆకాశమంతా నారింజ రంగు రంగులు అలుముకుంటున్నాయి.
అతని లెక్స్ మోగింది. అది రాదుల్ నుండి వచ్చిన సందేశం.
‘పరిస్థితిని చర్చించడానికి వచ్చే విహాన్ (9) సైనెడ్ సమావేశం కాబోతోంది. ఈ విషయం నీకు తెలియజేయాలని అనుకున్నాను.’
ఇమే వెనక్కి తిరిగి మళ్లీ లోపలికి నడిచాడు. ఒడెప్ తన కుర్చీలో కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. ఇమే అడుగుల చప్పుడు విని ఒడెప్ కళ్లు తెరిచాడు.
అతని ఆందోళనతో కూడిన ముఖాన్ని చూస్తూ, “చర్యల కోసం వారు చేస్తున్న ఈ హడావిడిలో, గైనేక్లు ఒక శక్తివంతమైన శత్రువు అనే విషయాన్ని మర్చిపోకూడదని నేను ఆశిస్తున్నాను. వారు ఎప్పుడూ అలాగే ఉన్నారు, ఇమే. మనకు ఉన్నట్లే జీవించాలనే, ఉనికిని కాపాడుకోవాలనే కోరిక వారికీ ఉంది. ఇది సమాన బలం ఉన్న ఇద్దరి మధ్య జరిగే పోరాటం”, అని చాలా సహజంగా భుజాలు ఎగరేశాడు ఒడెప్.
“ఒడెప్, వచ్చే విహాన్‌లో సైనెడ్ సమావేశం కానుంది. నువ్వు కూడా ఆ సమావేశానికి ఎందుకు వెళ్లకూడదు? వారు నీతో ఏకీభవించకపోయినా, నీ మాటలైనా వింటారు.” అన్నాడు ఇమే.
“నన్ను రమ్మని వారు అడగలేదు, ఇమే. కాబట్టి నేను వెళ్లలేను, కానీ నేను దుర్క్కి ఒక సందేశం పంపుతాను -నా తరపున నువ్వు ఆ సమావేశానికి హాజరు కావాలని నేను కోరుకుంటున్నట్లు అందులో చెప్తాను. కనీసం ఆ రకంగానైనా, అక్కడ ఏం జరుగుతుందో మన ఇద్దరికీ తెలుస్తుంది కదా?”
అక్కడికి వెళ్లి తను ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? సైనెడ్లో ఏం జరుగుతుందనే దాని గురించి ఇమే ఎప్పుడూ చురుగ్గా ఆలోచించలేదు. అతని స్థానం ఎప్పుడూ నక్షత్రాలు మరియు గెలాక్సీల మధ్యే ఉండేది. ఒడెప్ ప్రతినిధిగా తను హాజరుకావడాన్ని వల్హన్ ఇష్టపడడని ఇమేకు తెలుసు.
“ఒడెప్, నేను ఎప్పుడూ వీటన్నింటిలో పాలుపంచుకోలేదు. నువ్వే వెళ్లాలని నేను అనుకుంటున్నాను”, ఇమే వాదించడానికి ప్రయత్నించాడు.
“నేను ఇప్పుడు ప్రాధాన్యత లేని ఒక అంచున ఉన్నాను, ఇమే. నువ్వు అందులో భాగస్వామివి. అక్కడికి వెళ్ళు, నీకు ఏది ముఖ్యం అనిపిస్తే అది మాట్లాడు. వివేకంతో కూడిన స్వరం ఎప్పుడూ ముఖ్యమైనదే. అది నిర్ణయాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ప్రక్రియపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది” చెప్పాడు ఒడెప్.
ఇమే పసుపు రంగులో ఉండే తాయ్ గ్రహం గురించి, ఎలోన్ గురించి, ఫెన్స్ గురించి, ఇంకా తమ ప్రస్తుత ఉనికి గురించి ఆలోచించాడు. ప్రతిదీ ఒక్కసారిగా నాటకీయంగా మారిపోతామని హెచ్చరిస్తోంది. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు.
“సరే, వారు అంగీకరిస్తే నేను వెళ్తాను. కానీ నా ఉనికి అక్కడ పెద్దగా మార్పు తెస్తుందని నేను అనుకోవడం లేదు. ముందడుగు వేయాలనే వారి సంకల్పం నన్ను కొంత భయపెడుతోంది,” రాదుల్తో జరిగిన తన సంభాషణను గుర్తుచేసుకుంటూ ఇమే అన్నాడు.
“కొన్నిసార్లు, సమాజంలో బలంగా ఉన్న అభిప్రాయానికి భిన్నంగా ఆలోచించేలా చేసే కొన్ని హెచ్చరిక మాటలు కూడా, నిర్ణయాలు తీసుకునే విధానాన్ని మార్చగలవు”, ఇమే వైపు సూటిగా చూస్తూ అన్నాడు ఒడెప్.
(ఇంకా ఉంది)
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Lex, లెక్స్ = సమాచార పరికరం
(2) Nex, నెక్స్ = మరణం, చావు
(3) Fence ఫెన్స్= సరిహద్దు, కంచె
(4) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం
(5) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం
(6) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(7) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(8) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(9) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం
(10) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
