Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-4

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[సీని చనిపోయి ఐదు రోజులు గడిచినా, ఆమె మరణం వెనుక కారణం గురించి ఏ సంగతి తెలియదు. ఫెన్స్ దగ్గరకి వెళ్ళొచ్చాకా, ఇంట్లోంచి బయటకు రాలేదు ఉల్తూర్. వేదనతో క్రుంగిపోయిందామె. వార్త తెలిసిన వెంటనే రాకుండా, ప్రామ్‍లీ తన అమర్ పంటకే ప్రాముఖ్యతనీయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరో వచ్చినట్టు గుమ్మం దగ్గరి సెన్సార్ స్పందించడంతో, విసుగ్గానే ఎవరని అడుగుతుంది. బయట నిలుచుని ఉన్న ఈవీ తన గురించి చెప్పి, సీని నాకు తెలుసు అని అనడంతో తలుపు తీస్తుంది ఉల్తూర్. కొంచెం సేపు మౌనంగా ఉన్న తరువాత సీని తనకి పంపిన ఓ మ్యూజిక్ ఫైల్ గురించి తెలుసా అని ఈవీ టియోనిని అడుగుతుంది. తనకి తెలియదని చెప్తే, ఆమెకు పంపుతుంది ఈవీ. సీనికి ఏమైంది, ఎవరికీ ఏమీ తెలిసినట్టు లేదని అడగుతుంది. కౌన్సిల్ వారి సమాధానం కోసం తానూ ఎదురుచూస్తున్నానని, తనకి తెలిస్తే, ఈవీకి చెప్తానని అంటుంది ఉల్తూర్. ఈవీ వెళ్ళిపోయాకా, ఆ మ్యూజిక్ ఫైల్ ప్లే చేసి వింటుంది. ఎన్ని సార్లు విన్నా ఆ వాయిద్యాలను గుర్తించలేకపోతుంది. అదెక్కడి నుంచి వచ్చిందని ఈవీని ట్యాగ్ ద్వారా అడుగుతుంది. తనకీ తెలియదని చెప్తుంది ఈవీ. ఉల్తూర్‍ని కలిసాకా, వాల్ట్‌కి వెళ్ళి క్రానికల్ చదువుతుంది ఈవీ. క్రియేషన్ గురించి తెలుసుకుంటుంది. తన క్లారెంట్ గురించి ఆలోచిస్తుంది. వాల్ట్ సిస్టమ్‌ను మూసేసి, ఎన్నో ప్రశ్నలతో ఇంటికి బయల్దేరుతుంది ఈవీ. అమర్ పంట పక్వానికి వస్తుంది. తదుపరి పంటకి నేలని సిద్ధం చేస్తూ, ప్రామ్‍లీ తన ట్యాగ్‍ని చూసుకుంటుంది. సీని మరణం గురించి కౌన్సిల్ ఇప్పటికీ మౌనంగా ఉండడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నగరానికి వెళ్ళాకా, ఉల్తూర్‍ని కలవాలని నిర్ణయించుకుంటుంది. లోపలికి వచ్చిన తనకు వచ్చిన ఫైల్స్‌ని చూస్తుంటే సీని పంపిన మ్యూజిక్ ఫైల్ కనబడుతుంది. దాన్ని ప్లే చేసి, విని ఆ అద్భుతమైన సంగీతానికి అబ్బురపడుతుంది. వాయిద్యాల గురించి, స్వరకర్తల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఏ సమాచారమూ దొరకదు. ఆ మ్యూజిక్ ఫైల్‍ని సీని ఎక్కడ్నించి సంపాదించిందో అర్థం కాదు ప్రామ్‍లీకి. ఈ ఫైల్ ద్వారా సీని తనకేదైనా చెప్పదలచిందా అని అనుకుంటుంది. ఇక చదవండి.]

అధ్యాయం-1 – ఒక మరణం – నాల్గవ భాగం

ఆ చిన్న అపార్ట్‌మెంట్ చిందరవందరగా ఉంది. అంతకు ముందు ఎంతో పొందికగా, శుభ్రంగా ఉంచే టియోని – తార రాక వల్ల – ఇంటిని సరిగా పట్టించుకోవడం లేదు. టియోనికి ఈ మధ్య నిద్ర అస్సలు సరిపోవడం లేదు. తార పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సివస్తోంది, మాన్యువల్‌లో చెప్పినదానికీ, వాస్తవంలో తీసుకోవాల్సిన జాగ్రత్తకీ తేడా ఉందని అనిపించిందామెకు. రెంప్లాజోలో తిరిగి పనిలో చేరిన తర్వాత, తారకి సంబంధించి తనకు సహాయం చేయడానికి ఒక టోబోక్‌ (1) ని తీసుకోవాలని అనుకుంది టియోని. రెంప్లాజో అనేది ఆర్గాన్ రీప్లేస్‍మెంట్ సెంటర్, ఇక్కడ గ్రహవాసులు అవయవ మార్పిడి ద్వారా చికిత్స చేయించుకుంటారు, పునరుజ్జీవనం పొందుతారు.

మధ్యాహ్నం అయింది, తార నిద్రపోతోంది. టియోనికి ఎందుకో అశాంతి కలగసాగింది. రోజులు మందంగా గడుస్తున్నట్లు అనిపించింది. ఆమె పనులన్నీ తార సంరక్షణకు అనుగుణంగా మార్చుకుంది. తన గదిని సర్దుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అక్కడి నిశ్శబ్దం, అలసట తనను బలంగా చుట్టుముట్టినట్లు టియోనికి అనిపించింది. సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. గబగబా సర్దుకుని, హడావిడిగా కొరివ్ సాస్‌తో రెండు ఇనోలా రొట్టెలు తిన్న తర్వాత, టియోని – దాదాపు ఒక విహాన్ (2) తర్వాత సిస్టమ్‌కి మళ్లీ కనెక్ట్ అయింది.

పెండింగ్‍లో ఉన్న కేసుల గురించి రెంప్లాజో అనేక రిమైండర్‌లను పంపింది. టియోని స్క్రోల్ చేస్తూనే ఉంది, ఆపై ఆమె ఒక సందేశాన్ని చూసింది. సీని చనిపోయిందన్న ఆ వార్త చదవగానే టియోని నిర్ఘాంతపోయింది. నమ్మలేకపోయింది. మరింతగా చదివేసరికి, వివరాలు వెల్లువలా వచ్చాయి. ఈవీ పదే పదే తనను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు ఆమె గమనించింది.

తార మళ్ళీ ఏడ్వసాగింది. టియోని అప్రయత్నంగా లేచి, తారను ఎత్తుకుని, జోకొట్టసాగింది. ఆమె మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

సీనికి ఏమైంది? దీని అర్థం తను ఇక ఎన్నటికీ ఆమెను చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు లేదా ఆమెను మళ్లీ కలవలేదు. అంతేనా?

ఈ వార్త టియోనిని కలవరపరిచింది. ఇంతకు ముందు ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. సీని అవయవాలను రీప్లేస్ చేయడం ద్వారా ఆమెకు ప్రాణం పోయవచ్చా? కానీ, చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అసాధ్యమనే వాస్తవం ఒక కుదుపులా, ఆమెకు స్ఫురించింది. మరణం చాలా అరుదైన విషయం, దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. సుదూర గతంలో ఎప్పుడో మరణాలు సంభవించాయి. కానీ, ఇప్పుడు సీని విషయంలో అదే జరిగింది.

తార తిరిగి నిద్రలోకి జారుకుంది. టియోని ఆమెను మంచంపైన పడుకోబెట్టింది. అస్థిరంగా, నిరుత్సాహంగా గదిలోకి వెళ్లింది. కిటికీ బయట, మధ్యాహ్నం గాలికి ఒక చెట్టు ఊగుతోంది. సూర్యుడు మసకబారాడు. ప్రకృతి స్తబ్ధుగా ఉంది. అంతా ఇదివరకులానే అనిపించింది, కానీ సీని ఇకపై ఎలోన్‌లో ఉండదు. మళ్ళీ, టియోనికి అసౌకర్యంగా అనిపించింది. ఆమె ఈవీకి ట్యాగ్ చేసి, ఆమెను సంప్రదించమని కోరింది. ఈవీ వెంటనే స్పందించి వస్తున్నానని చెప్పింది.

ఈవీ కోసం ఎదురుచూస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా, ఓ స్పష్టతతో, సీని గురించి తలచుకుంది టియోని. ఒక మెరుపులా, తమ స్నేహంలో గడిచిన జాక్స్ (3) అన్నీ గుర్తొచ్చాయి.

రీప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా సీని ఎన్నో ప్రశ్నలు వేసేది. ఆమె చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంది. సీని ఆసక్తికి టియోని ఆశ్చర్యపోయేది. ఇది ఎలోన్ (4) ప్రజలలో సాధారణ లక్షణం కాదు. రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రస్థానానికి సంబంధించిన సమాచారం కోసం వాల్ట్‌ను పరిశోధిస్తున్నప్పుడు సీని టియోనిని,  ఈవీని కలుసుకుంది.

తానూ, సీని కల్సి ఓ సాయంత్రం – నగరం నడిబొడ్డున ఉన్న ఒక రూఫ్‌టాప్ కేఫ్‌లో కూర్చుని మాట్లాడుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంది టియోని. సూర్యకిరణాలు సీని అందమైన జుట్టు మీద పడుతున్నాయి. “దేని గురించైనా నీకెందుకు అన్ని ప్రశ్నలు ఎదురవుతాయి సీని?” అడిగింది టియోని.

“టియోని, మనం ఎప్పటి నుంచి రీప్లేస్‌మెంట్స్ చేస్తున్నామో మీరు తెలుసుకోవాలనుకోవడం లేదా? మరి అంతకు ముందు ఏం జరిగింది?”

“అదేమంత అవసరం కాదు సీని. గతం పట్ల ఎందుకంత ఆసక్తి నీకు?”

సీని క్రింద విస్తరించి ఉన్న విశాలమైన నగరాన్ని చూసింది. రూఫ్‍టాప్ మీదుగా వీస్తున్న గాలి పరిశుభ్రంగా, హాయిగా ఉంది.

“ఒక రోజు ఉల్తూర్ తనకో పాపాయి కావాలని నిర్ణయించుకున్నట్లు నాకు తెలుసు. కాబట్టి, ఆమె క్రియేషన్ ఫెసిలిటీకి వెళ్ళింది, అక్కడి వారు ఆమె శరీరం నుండి ఒక కణాన్ని తీసుకున్నారు. ఆమె ఒక ఫారమ్‌ను నింపి, నా భౌతిక లక్షణాల గురించి కొన్ని సూచనలను అందించి, ఆపై వెళ్లిపోయింది. సమయం వచ్చినప్పుడు, క్రియేషన్ సెంటర్ వాళ్ళు ఆమెను పిలిచి, ఇన్‌క్యుబేటర్ నుండి నన్ను బయటకు తీసి ఆమెకు అప్పగించారు. నాకు ముదురు ఎర్రటి జుట్టు, లేత గోధుమరంగు కళ్ళు ఉన్నాయి, అలాగే తను కోరుకుంది. అలా, నేను ఎలోన్‌లో ప్రాణం పోసుకున్నాను, ఇక్కడే జీవిస్తాను..” అంటూ ఓ క్షణం ఆగి, “అయితే, అసలు కణం ఎక్కడ నుంచి వచ్చింది? మన ఉనికికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? అని నేను తరచుగా ఆలోచిస్తాను. నేను క్రానికల్‌ని చదివానని మీకు తెలుసు. కానీ అది గ్రేట్ ఎస్కేప్ తర్వాత నుంచే మన గురించి మాట్లాడుతుంది. భూమి అనే ఆ గ్రహం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. వారు ఆ గ్రహంపై ఎలా జీవించారు? ఎందుకు అక్కడ్నించి వచ్చేసారు? నేను భూమి గురించి తెలుసుకోడానికి కూడా ప్రయత్నించాను, కానీ మొత్తం గెలాక్సీ మాయమైనట్టు, అది పూర్తిగా అంతరిక్షంలోని అంతర్భాగాలలో అదృశ్యమైనట్లు అనిపిస్తుంది. ఈ నిశ్శబ్దం, భూమిని కనబడకుండా చేసే ఈ గోడ నాకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మనం భూమి నుండి వచ్చాం, కానీ దాని గురించి మనకేఏమీ తెలియదు. ఇది మిమ్మల్ని కలవరపెట్టడంలేదా?” అంది.

సీని తన ఆలోచనలను పంచుకున్నంతసేపూ టియోని మౌనంగా ఉండిపోయింది. అయితే, భూమి గురించి లేదా అలాంటి వాటి గురించి మునుపెన్నడూ టియోని అసలు ఆలోచించలేదు.

“కానీ ఈ విషయం మనకెందుకు సీని? దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి?” అని అడిగింది.

అస్తమిస్తున్న సూర్యుడు తమను బంగారు వర్ణంతో ముంచెత్తడంతో సీని నిశ్శబ్దంగా ఉండిపోయిందని టియోని గుర్తుచేసుకుంది. తరువాత, సీని మృదువుగా మాట్లాడింది, “ఎందుకంటే ఆ గ్రహం మీద ఏమి జరిగిందో – అది మనం ఈ రోజు ఎలా జీవిస్తున్నామో నిర్ణయిస్తుంది. మనం ఎవరో, మనం దేనికి విలువిస్తామో, మనకి ఏది ముఖ్యమైనదో అది నిర్ణయించింది. ‘అభిరుచి’ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా, టియోని?”

సమాధానం చెప్పే ముందు ఒక్క క్షణం ఆలోచించి, “లేదు. విన్నట్టు గుర్తున్నట్లు లేదు” అంది టియోని.

“నాకు కూడా వినలేదు. నేను భూమికి చెందిన కొన్ని పదార్థాలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు వాల్ట్‌లో దాని గురించి తెలుసుకున్నాను. నేను దాని కోసం శోధించాను, భూమిపై మాట్లాడే వివిధ భాషల నుండి గుర్తుండిపోయేంత కాలం సజీవంగా ఉన్న పదాలన్నింటినీ కలిగి ఉన్న లెక్సికాన్‌లో ఈ పదం పేర్కొనలేదని గ్రహించాను. దాని అర్థం మీకు తెలుసా?” అంది సీని. అయితే, టియోని ప్రతిస్పందించే వరకు వేచి ఉండకుండా, సీని కొనసాగించింది, “అంటే ఎలోన్‌లో ‘అభిరుచి’ అనే పదం ఎవరికీ గుర్తులేదు. దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి నేను చాలా వెతకవలసి వచ్చింది. సరళంగా చెప్పాలంటే, దీని అర్థం ‘శక్తివంతమైన లేదా బలవంతపు భావోద్వేగం’. మీకెప్పుడైనా అలా అనిపించిందా టియోని?”

సంభాషణ ఎటు వెళుతుందో టియోనికి అర్థం కాలేదు. పని చేయడం, అపార్ట్‌మెంట్‌ని చక్కగా ఉంచుకోవడం, కేఫ్‌లకు వెళ్లడం వంటి ఆమె ఇష్టపడే లేదా ఆనందించే అనేక విషయాలు ఉన్నాయి, కానీ ‘అభిరుచి’ అంటే ఆమెకు అర్థం కాలేదు.

“నాకు అర్థం కావడం లేదు సీని. మనం చేసే పనుల గురించి మనమందరం ఏదో అనుభూతి చెందుతాము. మనం వాటిని ఇష్టపడకపోతే వాటిని చేయలేం. చేసేదాన్ని ఇష్టపడకుండా ఉండలేం.”

“నాకు తెలుసు, టియోని. నాకు మొదట ఇన్ఫర్మేటిక్స్ అంటే ఇష్టం కాబట్టి నివిదమ్‍లో చేరాను. తర్వాత, నేను ఇరానా హబ్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. కానీ, నాకంటూ ఒక అభిరుచి ఉందా? అది ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలని నేను ఆసక్తిగా ఉన్నాను” అంది సీని.

నిశ్శబ్దం మరోసారి వారిని ఆవరించింది. కాసేపటి తర్వాత, “నన్ను చూడండి, నేను ఉన్నాను. నా ఉనికి అలాగే కొనసాగుతుంది” అంది సీని. “కానీ, ఇప్పుడు, నా అస్తిత్వపు మూలాలను తెలుసుకోవడం నా అభిరుచిగా మారిందా?” అంది.

తన ట్యాగ్ నుండి స్పందనలు రావడంతో, వర్తమానంలోకి వచ్చింది టియోని. తలుపు వద్ద ఈవీ వేచి ఉన్నట్లు తెలిసింది. ‘నేను ఉన్నాను. నా ఉనికి అలాగే కొనసాగుతుంది’ అనే సీని ఆత్మవిశ్వాసం గాలిలో ప్రతిధ్వనించినట్లు అనిపించింది.

తలుపు తీసింది టియోని. ఈవీ లోపలికి వచ్చింది. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒక ఉమ్మడి వేదన వారిని కమ్ముకుంది, కానీ దానిని ఎలా వ్యక్తీకరించాలో వారికి తెలియలేదు. లోపల గదిలో, తార ఏడవసాగింది. టియోని గబగగా లోపలికి వెళ్లింది. గది మధ్యలో ఉన్న ఈవీ విస్మయానికి గురై నిలబడింది. తారని ఎత్తుకుని వచ్చింది టియోని. ఈవీ ఒక చిన్న పాపని చూడ్డం అదే మొదటిసారి. ఆ జీవి చాలా చిన్నది, నిస్సహాయంగా కనిపించింది.

“పాప పేరు తార. ఎత్తుకుంటావా?” టియోని అడిగింది.

చేతులు చాచడానికి ఈవీకి ధైర్యం సరిపోలేదు. టియోని పాపని జోకొడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఈవీ మౌనంగా ఉండిపోయింది. “పాప ఎప్పుడు వచ్చింది టియోనీ? ఇందుకేనా మీ సిస్టమ్ ఇన్నాళ్ళూ ఆపేశారు? సీని పాపని చూసిందా?” అడిగింది ఈవీ.

ఏడుపు ఆపి నీలికళ్లతో తననే సూటిగా చూస్తున్నట్టు అనిపించిన తార వైపు చూస్తూ ఈవీ అడిగింది.

“సీని మరణించిన రోజే తార వచ్చింది, అవును, నేను ఆమెతో ప్రత్యేకంగా గడపాలనుకున్నాను. అందుకే నా సిస్టమ్‌ని షట్‌డౌన్ చేశాను. లేదు, సీని పాపని చూడలేదు.” చెప్పింది టియోని.

ఈ మాటలు అంటున్నప్పుడు, అనుకోకుండా ఆమె బుగ్గలపై కన్నీళ్ళు కారాయి. పాపకి పాలు పట్టింది టియోని. ఈవీ మౌనంగా గమనిస్తుండగా, పాపని పడుకోబెట్టింది. కడుపు నిండిన తార, మంచం మీద నుంచి చుట్టూ చూడసాగింది.

ఈవీ మంచం దగ్గరకు వచ్చి తారని చూసింది. చిన్ని చిన్ని కాళ్ళూచేతులు, గుండ్రటి ముఖం, ఉంగరాల జుట్టు – అబ్బురంగా అనిపించింది. చేతిని చాచి, తార బుగ్గలను మృదువుగా పుణికింది.

“ఇప్పుడు చెప్పు ఈవీ? సీనికి ఏమయింది?” టియోని వేసిన ప్రశ్న అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ఈవీ పాప దగ్గర నుండి కదిలి, టియోని పక్కన కూర్చుంది.

“ఎవరికీ తెలియదు. కౌన్సిల్ చెప్పే వివరాల కోసం ఎదురుచూస్తున్నాం. ఉల్తూర్‌కి కూడా ఏమీ తెలియదు” అంది ఈవీ. ఓ క్షణం ఆగి, “నేను ఆమెను కలవాలనుకుంటున్నాను” అంది.

తార చిన్నగా కేరింతలు కొడుతుండగా, కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్యా ఆవరించిన నిశ్శబ్దానికి సీని ఓ తాడులా ఆధారంగా ఉన్నట్లుంది.

“సీని పంపిన మ్యూజిక్ ఫైల్ విన్నారా?” ఈవీ అడిగింది.

ఆశ్చర్యపోయింది టియోని. తల అడ్డంగా ఊపింది. సంగీతం పట్ల ఆమెకు ఆసక్తి లేదు, ఆ విషయం సీనికి కూడా తెలుసు.

“చనిపోయే ముందు రోజు నాకు పంపింది”, ఈవీ కొనసాగించింది, “అది మీకు కూడా కాపీ చేయబడింది. మీరు తప్పక వినండి, టియోని. ఇంత అద్భుతమైన సంగీతాన్ని నేను ఎప్పుడూ వినలేదు. నేను దానిని ఉల్తూర్‌కు కూడా పంపాను. ఆ పైల్ సీనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఉల్తూర్‌కు కూడా తెలియలేదు.”

టియోని తన ట్యాగ్‌ వెతికి, సీని నుండి నిజంగానే ఏదో వచ్చిందని చూసింది. ఆమె దానిని తెరపై తెరిచింది.

‘టియోని, ఈ సంగీతాన్ని వినండి. ఇది ఎక్కడ నుండి వచ్చిందనే ఆసక్తి కలగడం లేదా? మీరు దానిని విన్న తర్వాత, ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌కి వెళ్లండి.’ (ఇటాలిక్స్)

ఈ సందేశం తెర మీద కనబడింది. రికార్డెడ్ మెసేజ్‍లా కాకుండా, స్వయంగా సీనియే మాట్లాడినట్లుగా అనిపించింది టియోనికి.

“టియోని, దయచేసి వెంటన్ మీ ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌కి వెళ్లండి”, ఈవీ కోరింది.

ఈ మ్యూజిక్ పైల్ యొక్క రహస్యమైన మూలం బహుశా బహిర్గతం కావచ్చు. సీని చనిపోయినప్పటి నుండి ఈవీ విచిత్రమైన స్థితిలో ఉంది – ఆ మ్యూజిక్ ఫైల్ మూలం, క్రానికల్‌లోని మెటీరియల్, ఈ ప్రశ్నలన్నీ ఆమె చెవుల్లో గుసగుసలాడుతూ ఆమెను గందరగోళానికి గురిచేశాయి. ఈవీ స్పష్టత కోరుకుంది. ఆమె తన అసలు జీవనశైలికి తిరిగి రావాలని కోరుకుంది.

టియోని కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత ఆ మ్యూజిక్ పైల్‌ని ప్లే చేసి  వినిపించింది. “సీని అడిగినట్టే చేస్తాను. ఆమె ఇప్పుడు ఉండి ఉంటే, నేను భిన్నంగా చేసి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు కాదు” అంది.

మ్యూజిక్ ప్లే అవడంతో, దాని లయ అపార్ట్మెంట్ అంతటా వ్యాపించింది. సంగీతం ఆగిపోగానే గది ప్రశాంతతతో తడిసిముద్దయినట్లయింది. తార నిద్రలోకి జారుకుంది. పాట చివరి స్వరాలు మందగించిన తర్వాత, టియోని తన ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌ని యాక్సెస్ చేసింది. సీని సందేశాన్ని స్క్రీన్‌పై ప్రదర్శించింది, తద్వారా దాన్ని ఈవీ కూడా చదవగలిగింది.

సంగీతమంటే ఆసక్తి లేని మీలాంటి వారికి కూడా ఈ మ్యూజిక్ నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను ఈవీతో కొన్ని ఫైల్స్ పంచుకున్నాను; ఆమె కూడా వాటిని ఆనందించింది. నేను వాటిని ఎక్కడ నుండి పొందాను అని ఈవీ నన్ను అడుగుతూనే ఉంది. సరే, మీరు స్వరకర్త గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే, మాయని అడగండి. ఈవీ మెషీన్‌లతో బాగా పని చేస్తుంది కాబట్టి మీరు ఆమె సహాయం తీసుకోవచ్చు. మీరు ఇరానా హబ్ నుండి అన్వేషణ ప్రారంభించవచ్చు.

టియోని, మనం ఎక్కడి నుండి వచ్చామనేది మనం ఎక్కడికి వెళ్తున్నామో నిర్ణయించే అంశం. ఇది ఒక విధంగా మనం ప్రస్తుతం ఎలా జీవిస్తున్నామో నిర్ణయిస్తుంది. గతం యొక్క దారం వర్తమానాన్ని, భవిష్యత్తును కలుపుతుంది. ఇది నాకు ఈ మధ్యనే అర్థమైంది. దీని గురించి నేను త్వరలో ప్రామ్‌లీతో కూడా మాట్లాడతాను. మాయ కనబడినప్పుడు చెప్పు. మీరిద్దరూ ఆమెను కలిస్తే ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను.

నిద్రలోకి జారుకున్న తార నిద్రలోనే చిన్నగా ఏడ్చింది. బయట ఆకాశం నల్లగా మారిపోయింది.

“మాయ అంటే ఎవరు? ఆమె గురించి సీని మీతో ఎప్పుడైనా మాట్లాడిందా?” ఈవీ అడిగింది.

టియోని తల అడ్డంగా ఊపింది. ఆమెకూ బోలెడు ప్రశ్నలు ఉన్నాయి, “ప్రామ్‍లీ ఎవరు? ఆమె గురించి విన్నావా, ఈవీ?”

“నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ, చాలా జాక్‌ల క్రితం, ప్రామ్‍లీ అనే వ్యక్తి నివిదమ్‌కు నాయకత్వం వహించినట్లు నాకు గుర్తుంది. బహుశా సీని మాట్లాడుతున్నది ఆమె గురించే కావచ్చు లేదా మరొకరి గురించి అయ్యుండచ్చు,” అని బదులిచ్చి, కాస్త నిరుత్సాహంగా లేచి నిలబడింది ఈవీ.

సీని సందేశం దేనికీ పరిష్కారం చూపలేదు. బదులుగా, అది ఆమెకు మరిన్ని ప్రశ్నలు కల్పించి, గందరగోళాన్ని జోడించింది. నిద్రిస్తున్న తార రూపాన్ని ఒకసారి చూసి, మృదువుగా ఊపిరి పీల్చుకుంటున్న ఆ చిన్న రూపాన్ని చూసి ఈవీ ఆశ్చర్యపోయింది. తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

బయట వీస్తున్న తాజా గాలి ఈవీకి కొంత ఊరటనిచ్చింది. ఆమె షటిల్ కోసం ఎదురుచూసింది. ఇంతలో ఒక షటిల్ వచ్చింది, కానీ బాగా రద్దీగా ఉండడంతో, దాన్ని వదిలేసింది. తన చుట్టూ బోలెడు మంది ఉండడానికి ఆమె మానసిక స్థితి అంగీకరించడం లేదు. ఆమె కొంత ప్రశాంతతని, కొంత నిశ్శబ్దాన్ని కోరుకుంది. మాయ గురించి ఉల్తూర్‌కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఆమె తదుపరి షటిల్ కోసం ఎదురుచూసింది. కాస్తా ఖాళీగా ఉన్న షటిల్‌ ఎక్కి కూర్చున్నా, ఆమె తన మనస్సులో ఓ నిర్ణయం తీసుకుంది. మాయ ఎక్కడుందో కనుక్కుని, ఆమెను సహా వెళ్ళి ఉల్తూర్‌ను కలవాలని అనుకుంది.

🚀

ఆకాశం మేఘావృతమై ఉంది. ముసురుపట్టినట్టుగా ఉంది. వాల్ట్‌లోని తన వర్క్‌స్టేషన్‌లో కూర్చుని ఇరానా హబ్‌తో అనుబంధించబడిన వ్యక్తులందరినీ ప్రాసెస్ చేసింది ఈవీ. మాయ అని ఎవరి ప్రస్తావన లేదు. ఆమె దాదాపు రెండు వందల జాక్‌ల నాటి డేటా స్కాన్ చేసింది కానీ ఏ సమాచారమూ లేదు. మాయ అని పిలవబడే వారు ఎవ్వరూ ఉనికిలో ఉన్నట్లు అనిపించలేదు. ఇరానా హబ్‌లో సంగీతం ఒక పాఠ్యాంశం కాదు. కలవరపడిన ఈవీ, టియోని తన ట్యాగ్‌కి పంపిన సీని సందేశాన్ని మళ్ళీ చదివింది. సిస్టమ్ ఏమీ వెల్లడించనందున తాను వ్యక్తిగతంగా ఇరానా హబ్‌ను సందర్శించాల్సిన అవసరం ఉందని ఆమె గ్రహించింది.

అక్కడికి వెళ్లడం కొంత భయంగా అనిపించింది. ఇరానా హబ్ ఒక ప్రత్యేకమైన సంస్థ, ఎంపిక చేసిన కొన్ని రంగాలలో రాణించడానికి ఎంపికైన కొందరు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఆమె ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ధైర్యాన్ని కూడగట్టుకుని, వాల్ట్‌ను విడిచి, ఇరానా హబ్‌కి వెళ్ళే షటిల్‌ ఎక్కింది ఈవీ.

హబ్ బయట నిలబడి, దాని పరిపూర్ణ పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఈవీ. ఇరానా హబ్ వాల్ట్ కంటే పెద్దది. కళ్ళు చూడగలిగినంత దూరం ఆకాశంలోకి లేచి, దాని వివిధ విభాగాలు వివిధ రకాల నిర్మాణాలను కలిగి ఉన్నాయి. కొన్ని విభాగాలు గుండ్రని పైకప్పులను కలిగి ఉండగా, కొన్ని వాలుగా ఉన్నాయి, మరికొన్ని చదునైన పైకప్పులను కలిగి ఉన్నాయి. మేఘావృతమైన ముసురు కమ్మిన ఆ మధ్యాహ్నం పూట – ఆ భవనపు మీగడ వన్నె వర్ణం కొంతమేర మురికిగా అనిపించింది. విశాలమైన భవనం చుట్టూ అనేక చెట్లు ఉన్నాయి, ఒక వైపున ఒక చిన్న ప్రశాంతమైన సరస్సు ఉంది.

సీని హబ్‌లోని ‘డెవలపింగ్ ఎలోన్’ విభాగంలో పనిచేసింది. భారీ ప్రవేశ ద్వారం వద్ద ఆ విభాగం కోసం ఈవీ బటన్‌ను నొక్కినప్పుడు, తలుపుకు ఒక వైపున ఉన్న ఎలివేటర్ క్రిందికి వచ్చింది. ఈవీ లోపలికి అడుగుపెట్టింది. లిఫ్ట్ లోపల చాలా పేర్లతో ఒక స్క్రీన్ ఉంది. నియోసి అనే పేరును గుర్తించింది ఈవీ. నియోసి ఇటీవల వాల్ట్‌ను సందర్శించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది. ఆమె పేరు పక్కన ఉన్న బటన్‌ను నొక్కినప్పుడు, “ఎవరది?” అని ఒక స్వరం ప్రశ్నించింది.

“నేను ఈవీ, వాల్ట్ మేనేజర్‌ని. నేను ఒక విషయం తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని కలవవచ్చా?” అంది. ముందుగా ట్యాగ్ చేయకుండా ఒకరిని సందర్శించడం అనేది విచిత్రమైన విషయం. కొంత సందిగ్ధత తర్వాత, “తలుపులు తెరిచినప్పుడు కుడివైపు తిరగండి. మీకు ఎడమ వైపు నా పేరు కనిపిస్తుంది.” అందా స్వరం.

ఈవీ సూచనలను అనుసరించింది. ఆమెకేదో వింత భావన కలిగింది, తానేదో గోతిలో ఉన్నట్టు, తమె మెడకేదో ముడి వేసినట్టు అనిపించింది. తానేదో తప్పు చేస్తున్నట్లుగా వణికిపోతున్నట్లు ఈవీ గ్రహించింది. ఎందుకలా అనిపిస్తోంది? ఏదేమైనా, ఆమె సీని చెప్పిన వారి కోసం మాత్రమే వెతుకుతోంది!

ఆశ్చర్యంగా, నియోసి నవ్వుతూ ఈవీని పలకరించింది. ఈవీ ఆమె ముందు నిలబడి తన మనసులో మెదిలిన మొదటి విషయాన్ని బయటపెట్టింది, “నాకు సీని తెలుసు. ఆమె ఎక్కడ పని చేస్తుందో చూడాలనుకున్నాను” అంది.

“ఓహ్” అంది నియోసి. ఒక క్షణం తర్వాత, “ఆమెకు ఏమి జరిగిందనే దానిపై కొంత స్పష్టత వచ్చే వరకు ఆమె స్పేస్ మూసివేయబడింది. ఎవరూ లోపలికి వెళ్లలేరు. అవును, ఆమె ఈ విభాగంలో పని చేసింది. ఎప్పుడో ఒకసారి కలిసేవాళ్లం. కానీ, సీని ఎప్పుడూ సిస్టమ్స్ ఏరియాలో బిజీగా కనిపించేది. ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపింది” చెప్పింది నియోసి.

ఈవీ తల తిరుగుతోంది. మాయ గురించి అడగాలా? వద్దా? తను ఇంకా నిలబడి ఉందని గ్రహించింది. నియోసి – ఈవీ మనసును చదివినట్లుగా, ఖాళీగా ఉన్న కుర్చీ వైపు సైగ చేసింది.

“ఇక్కడ సంగీతం విభాగం ఉందా?” ఇంకా నిలబడి ఉన్న ఈవీ అడిగింది.

“ముందు కూర్చోండి”, అంటూ, “ఇరానా హబ్‌లో సంగీతం విభాగం లేదు” అని చెప్పింది నియోసి.

ఇంక అడగడానికేమీ ప్రశ్నలు లేవనిపించింది ఈవీకి. మర్యాదపూర్వకంగా నవ్వి, అక్కడ్నించి బయల్దేరింది. తను తలుపు దగ్గరికి కూడా రాకముందే నియోసి తన సీట్‌కి వెళ్ళి పనిలో లీనమవడం గమనించింది ఈవీ.

బయట, దూరంగా సిస్టమ్స్ ప్రాంతం డిస్‌ప్లేను చూసి, పొడవైన ఆ కారిడార్‌లో అటువైపు నడవసాగింది ఈవీ. అక్కడికి చేరుకోగానే, అది లిమిటెడ్ యాక్సెస్ ఉన్న సెక్యూర్డ్ ఏరియా అని గ్రహించింది. ఈవీ తన ట్యాగ్‌ని తలుపు వద్ద స్వైప్ చేసింది. వాల్ట్ మేనేజర్‌గా ఆమెకు ఎలోన్‌లోని అనేక సెక్యూర్డ్ ఏరియాలకు యాక్సెస్ ఉంది. ఆమె ట్యాగ్ ఇరానా హబ్‌లోని సిస్టమ్స్ ఏరియాలోనూ పనిచేసింది.

లోపల, హాలు దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఒక మూలలో, టెర్మినల్ వద్ద ఎవరో కూర్చున్నట్లు గ్రహించింది ఈవీ. ఆమె కూడా ఓ ఏకాంత టెర్మినల్ వద్ద కూర్చుని సిస్టమ్‌లోకి ప్రవేశించింది. సీని కోసం వెతికింది, కానీ, సిస్టమ్ ఆమెను గుర్తించలేదు. మరణించిన సమయంలో సీని ప్రస్థానాన్ని సిస్టమ్‌లో తిరిగి పొందేందుకు ఈవీ ప్రయత్నించింది. కానీ ఆశ్చర్యకరంగా, సిస్టమ్‍లో సీని ప్రస్తావన లేకపోవడమే కాకుండా, ఆమె చేసిన అన్ని పనులు క్రమపద్ధతిలో తుడిచివేయబడ్డాయని గ్రహించింది. సీని సిస్టమ్‍లో కూడా ఉనికి కోల్పోయిందని గ్రహించి విస్తుపోయింది ఈవీ.

తరువాత మాయ కోసం వెతకసాగింది. సంగీతం, వాయిద్యాలపై కొన్ని ప్రశ్నలను అడిగింది, వందల కొద్దీ జాక్‌ల రికార్డులను చూసింది. మొత్తం సిస్టమ్‌లో మాయ అనే వ్యక్తి లేదా స్వరకర్త లేదు. తనకు తెలిసిన కమాండ్స్, అన్ని టెక్నిక్‌లు, నైపుణ్యాలను ఉపయోగించి చాలా సేపు శోధించిన తర్వాత, ఈవీ అలసిపోయింది. సిస్టమ్‌లో సీని గానీ, మాయ గానీ లేరు.

ఇక, ఆమె ఇంటిముఖం పట్టింది, బాగా అలసిపోయినట్లు, నిస్సారమైనట్లు అనిపించింది. సీని దారి పొడవునా చెదరగొట్టిన నీడలను వెంటాడుతూ తాను ఎందుకు పరిగెత్తింది? సీని చనిపోయింది. ఆ సంగీతాన్ని ఎవరు సృష్టించారనేది ఇప్పుడు ముఖ్యమా? ఆ సంగీతానికి సీని మరణానికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ఇదే తన చివరి ప్రయత్నమని ఈవీ నిర్ణయించుకుంది. ఫలించని తన శోధన గురించి టియోనికి ట్యాగ్‌ ద్వారా తెలిపి, ఈ విషయాన్ని అక్కడితో వదిలేసింది. వచ్చే విహాన్‌లో వాటర్ గ్లైడింగ్ చేయాలని అనుకుంది. క్రానికల్‌ని ప్రాసెస్ చేయడం పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Tobok,  టోబోక్ = యంత్ర సహకారి

(2) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం

(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(4) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(మళ్ళీ కలుద్దాం)


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com  అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version