[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[తార పుట్టాకా, టియోనికి అసలు తీరుబాటు ఉండడం లేదు. బాగా అలసిపోయినట్లనిపిస్తోంది. దాదాపు వారం రోజుల తరువాత తిరిగి సిస్టమ్‍కి కనెక్ట్ అవుతుంది. తాను పనిచేసే ఆర్గాన్ రీప్లేస్‍మెంట్ సెంటర్ రెంప్లాజో నుంచి వచ్చిన సందేశాలు ఎన్నో ఉంటాయి. వాటితో పాటు సీని చనిపోయిందన్న వార్త కూడా ఉంటుంది. ఈవీ తనని కాంటాక్ట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిందని గ్రహిస్తుంది. ఈవీకి ట్యాగ్ చేసి తనని సంప్రదించమని చెప్తుంది. సీనికీ, తనకీ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒకసారి తమ మాటల మధ్య దొర్లిన సంభాషణని గుర్తు చేసుకుంటుంది. ఆ సమయంలో తమ గతం గురించి, భూమి గురించి, గ్రేట్ ఎస్కేప్ గురించి, తమ మూలాల గురించి తెలుసుకోవాలని సీని చూపిన ఆసక్తిని గుర్తుచేసుకుంటుంది టియోని. అవన్ని తనకి పెద్దగా ఆసక్తి కల్గించవని తాను చెప్పగా, సీని ‘అభిరుచి’ అనే పదం గురించి చెప్పడం, తన ఆసక్తుల గురించి అడగడం గుర్తొస్తుంది టియోనికి. ఈలోపు ఈవీ వస్తుంది. తారని అబ్బురంగా చూస్తుంది. సీని పంపిన మ్యూజిక్ విన్నారా అని ఈవీ అడిగితే, వినలేదంటుంది టియోని. సీని చనిపోయే ముందు రోజు తనకి పంపిందని చెబుతుంది ఈవీ. టియోని తన ట్యాగ్‍ని వెదికి ఆ మ్యూజిక్ ఫైల్‍ని గుర్తిస్తుంది. దాన్ని ప్లే చేయగా శ్రావ్యమైన సంగీతం ఆ గదంతా వ్యాపిస్తుంది. తర్వాత తన ఎన్‍క్రిప్టెడ్ ఛానెల్‍లో సీని పంపిన ఓ సందేశాన్ని తెరపై చూపిస్తుంది టియోని. అందులో మాయ అనే వ్యక్తి గురించి, ప్లామ్‍లీ గురించి ప్రస్తావన ఉంటుంది. ఈ మాయ ఎవరని ఈవీ అడిగితే, తెలియదంటుంది టియోని. ప్రామ్‍లీ కొన్నేళ్ళ క్రితం నివిదమ్‍కు నేతృత్వం వహించిందని చెబుతుంది. ఈవీ అక్కడ్నించి బయల్దేరి – సీని ఒకప్పుడు కొద్ది రోజులు పని చేసిన – ఇరానా హబ్‍కు వస్తుంది. అక్కడ నియోసి అనే ఆమెను కలిసి సీని గురించి, సంగీతం గురించి వివరాలు అడిగితే, ప్రస్తుతం సీని పని చేసిన స్థలాన్ని సీల్ చేశామని, అక్కడికి ఎవరూ వెళ్లలేరని చెప్తుంది. ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చి, అక్కడున్న సిస్టమ్స్ గదిలోకి ప్రవేశిస్తుంది ఈవీ. ఓ సిస్టమ్ ముందు కూర్చుని సీని గురించి వెతుకుతుంది. ఏ సమాచారమూ లభించదు. సీని వివరాలన్నీ సిస్టమ్‍నుంచి తొలగించబడ్డాయని గ్రహిస్తుంది. తర్వాత మాయ కోసం వెతుకుతుంది. ఏ సమాచరామూ లభించదు. నిరాశగా ఇల్లు చేరి, తను చేసిన ప్రయత్నాల గురించి ట్యాగ్ ద్వారా టియోనికి తెలియజేసి, ఇక ఆ విషయాన్ని వదిలేస్తుంది ఈవీ. ఇక చదవండి.]
అధ్యాయం-1 – ఒక మరణం – 5వ భాగం
రెంప్లాజోలో తిరిగి పనిలో చేరడం అనేది టియోని విషయంలో ఓ కఠినమైన మార్పు అయింది. మొదట్లో, ఎన్నో రోజులు పనిచేసిన తర్వాత, బాగా చీకటిపడ్డాకా, నిద్రపోతున్న తారని వీపుకు కట్టుకుని, తన అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించేది. ఎప్పుడూ అలసిపోతుండేది. తార సంరక్షణలో సాయపడటానికి ఓ టోబాక్ (1) ని కొనాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకుంది. ముఖం, చేతులు, కాళ్ళతో ఓ మనిషి ఆకారంలో ఒక టోబాక్‍ని కొంది, దానికి హాప్ అని పేరు పెట్టింది. రెంప్లాజోలో టియోని పనిలో ఉండేటప్పుడు హాప్ తారని చూసుకునేది. పని పూర్తయ్యాకా, టియోనితో కలిసి ఇంటికి వచ్చేది. అవయవాల రీప్లేస్‌మెంట్‌ల కోసం వచ్చేవాళ్ళతో పనిలో ఉన్నా, టియోని హాప్ సిస్టమ్‌ను నిరంతరం పర్యవేక్షించేది. సమయం దొరికినప్పుడల్లా ఆమె తారను కూడా చూసుకునేది.
తార నిద్రపోవడాన్ని అలసిపోయిన కళ్లతో చూసింది టియోని. హాప్ సాంత్వన కలిగించే నీలి కాంతిని వెదజల్లుతోంది, తార యొక్క ప్రతి అవసరం పట్ల అప్రమత్తంగా ఉంది. టియోని కిటికీ పక్కన వాలు కుర్చీలో పడుకుంది. క్రియేషన్స్ ఎందుకు తగ్గాయో ఆమె నెమ్మదిగా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. తాను ఎప్పుడూ కట్టివేయబడినట్టు, నిరంతరం అలసిపోయినట్లు భావించింది టియోని. నిబంధనల ప్రకారం, ఆమె సంతానం తదుపరి పదహారు జాక్ (2) ల వరకు ఆమెతో ఉంటుంది, ఆ తర్వాతే తార వేరే వెళ్లవచ్చు. టియోని నిట్టూర్చింది; తార పెరిగే కొద్దీ పరిస్థితులు మెరుగుపడవచ్చు.
కాస్త విశ్రాంతి పొందినట్లుగా భావించి, టియోని లేచి భోజనం సిద్ధం చేసింది. ఆమె తనకు ఇష్టమైన వెజిటబుల్ స్టూ అసిపో మిశ్రమాన్ని నీటిలో వంపి, దానితో పాటు రెండు ఇనోలా రొట్టెలను వేడి చేసింది. తిన్న తర్వాత, ఆమె తన ట్యాగ్‌ని చెక్ చేసింది. చాలామందితో పాటు, ఈవీ నుంచి కూడా ఒక ట్యాగ్ ఉంది. ఆమె ఈవీ ఏం అడుగుతోందో చూసింది. ఆ ‘మాయ’ ఓ పెద్ద రహస్యంలా అనిపించింది, ఎవరో అంతుచిక్కడం లేదు, కానీ ఆమె గురించి టియోని ఆసక్తి చూపలేదు. వాళ్ళు ఆమెను కనుగొన్నారా లేదా అనేది టియోనికి పట్టింపు లేదు. సీని చనిపోయింది, ఇక ఆ వాస్తవాన్ని ఏదీ మార్చలేదు సీని మరణానికి కారణానికి సంబధించిన వార్తల కోసం ఎదురు చూస్తోంది టియోని.
వర్షాకాలం అయినప్పటికీ ఆకాశంలో మూడు చందమామలు వెలిగిపోతున్నాయి. నగరం తెల్లటి కాంతితో నిండిపోయింది. కిటికీలోంచి కనిపించే చెట్లు వెండి వస్త్రంతో కప్పబడి ఉన్నట్లు అనిపించింది. వర్షం లేకుండా ఓ కాలంటే (3) గడిచిపోయింది కానీ వాతావరణం ఇంకా తేమగా ఉంది. టియోని కిటికీ వదిలి, వెనక్కి తిరిగి అపార్ట్‌మెంట్‌లోని లైట్లను డిమ్ చేసింది. కళ్ళు బరువెక్కుతుండగా, ‘అభిరుచి’ అనే పదానికి సీని ఇచ్చిన వివరణ ఆమెకు గుర్తొచ్చింది. అంటే, భూలోకవాసులు ‘బలవంతపు భావోద్వేగాల’ను అనుభవించారు. కానీ, దేని గురించి? ఎందుకు? సుదూర భూమిలో నివసించేవారిని విషయాల పట్ల మక్కువ పెంచుకోవడానికి సీనిని ఏది పురికొల్పి ఉంటుందోనంటూ ఆమె ఆశ్చర్యపోయింది..
🚀
కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. బయట, సూర్యుడిని చీకటి మేఘాలు కమ్మేసినందున, గది లోపలి వెలుగు మసకబారింది. స్కైలైట్ బూడిద రంగులో ఉంది, గదిలోని వారి మానసిక స్థితి కూడా ఉంది. అందరూ భౌతికంగా హాజరు కావాలని అభ్యర్థించినప్పటికీ, ఇద్దరు సభ్యులు తమ ట్యాగ్ ఛానెల్‌ల ద్వారా సమావేశంలో పాల్గొంటున్నారు. హాజరైన సభ్యులను చూస్తూ, సీని మరణాకి కారణం తెలిసిందని ప్రకటించింది క్రేటీ.
“ఇక్కడ భౌతికంగా లేని వారి ఛానెల్స్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ విషయం ప్రస్తుతం ఈ గదిలో మాత్రమే చర్చించబడాలి” అని ఉల్తూర్ తుది మాటగా చెప్పింది.
క్రేటీ మిగతావారి కేసి చూసింది; ఉల్టూర్ అభిప్రాయంతో ఎవరూ విభేదించినట్లు కనిపించలేదు. భౌతికంగా హాజరు కాని ఆ ఇద్దరు సభ్యుల ఛానెల్స్ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి.
క్రేటీ చెప్పడం మొదలుపెట్టింది, “సీని మరణం నిజంగానే విష్ (4) వల్ల సంభవించింది. పైగా, అది ఫెన్స్‌కి (5) అవతలి వైపు నుండి వచ్చిందని కూడా నమ్మకంగా చెప్పవచ్చు” అంది.
“అది అక్కడ్నించే వచ్చిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?” అని అడిగింది ఉల్తూర్. ఆమె గత సమావేశం కంటే నెమ్మదిగా, ధాటిగా ఉన్నట్లు అనిపించింది.
“కారణం విష్. అది ధృవీకరించబడింది. పైగా విష్ కు సంబంధించిన స్టోర్‌లు ఏవీ మవ వద్ద లేవు కాబట్టి, అది అవతలి వైపు వచ్చి నుంచి ఉండాలి” అని స్పష్టం చేసింది క్రేటీ.
బల్ల చుట్టూ కూర్చున్న సభ్యులు మౌనం వహించారు. నివేదికలో అనేక అంశాలు ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు కదలికలను బట్టి, గదిలో ఒకసారి వెలుగు, మరోసారి నీడ వ్యాపిస్తూ.. ఆ గదిలోని వారి మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. అక్కడున్న వారిలో ప్రతి ఒక్కరికీ, ఈ విపత్తు ఘటన ఎలోన్ (6) లో తమ జీవితాలలో తీసుకురానున్న అనివార్యమైన మార్పు గురించి తెలుసు.
“ప్రస్తుతానికి ఈ విషయాన్ని మనలోనే ఉంచుకుందాం. తదుపరి ఏమి చేయాలో నిర్ణయించే ముందు దీని గురించి మరోసారి చర్చిద్దాం”, అంది ఉల్తూర్.
“నేను అంగీకరిస్తున్నాను. సీని మరణం ప్రమాదవశాత్తు జరిగిందని ప్రజలకు చెప్పాలని నేను సభ్యులకు ప్రతిపాదిస్తున్నాను”, అంది క్రేటీ.
కొన్ని గుసగుసలు వినిపించాయి, కానీ ఎవరూ ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. సమావేశం ముగిసినట్లు అనిపించింది, కానీ సభ్యులెవరూ తమ కుర్చీల నుండి కదలలేదు.
“ఇంతకు ముందులానే, దీన్ని ఎదుర్కోవడానికి మేము ఒక మార్గాన్ని కనుగొంటాము. కొంత సమయం తర్వాత మళ్లీ కలుద్దాం” అని క్రేటీ ధైర్యంగా సమావేశాన్ని ముగించింది.
సభ్యులు కౌన్సిల్ భవనం నుండి బయటకు వచ్చారు, ప్రతి ఒక్కరూ తమ స్వంత ఆలోచనలలో మునిగిపోయారు. ఎవరూ మాట్లాడలేదు. బయట, సూర్యుడు నల్లని మేఘం వెనుక దాగి ఉన్నాడు, కానీ సూర్య కిరణాలు మేఘాలకు వెండి తొడుగును తొడిగాయి.
ఉల్తూర్ కూడా వెంటనే వెళ్లిపోయింది. ఆమె తన అపార్ట్‌మెంట్‌కి వచ్చేసింది. ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌లో, ఆమె ప్రామ్‌లీకి అత్యవసర సందేశాన్ని పంపింది. ప్రామ్‌లీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఉల్తూర్ ఆ మ్యూజిక్ ఫైల్‍ని గుర్తు చేసుకుంది. ఏదో లింక్ ఉండాలని ఆమెకు తెలుసు. బహుశా సీని ఏదో పొరపాటు పడి ఉండొచ్చు. ఉల్తూర్ సీని అవశేషాలను కలిగి ఉన్న ప్రయోగశాలకు మరొక ట్యాగ్‌ని పంపింది.
సీని బ్రెయిన్ మ్యాపింగ్ వెంటనే నాకు పంపాలని కోరుకుంటున్నాను. ఎలోన్ కౌన్సిల్ సభ్యురాలిగా ఆదేశిస్తున్నాను. సీని బ్రెయిన్ మ్యాపింగ్ – ఆమె చనిపోయే ముందు ఆమె కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ఆధారాలను అందిస్తుందని ఉల్తూర్ ఆశించింది.
ప్రామ్‌లీ నుండి ఎటువంటి స్పందన లేదు. క్రమక్రమంగా, ట్యాగ్ ఛానెల్‌లు సీని ప్రమాదవశాత్తు మరణించిందనే సమాచారాన్ని ప్రసారం చేయడం ప్రారంభించాయి.
అది ఒక కట్టుబాటు. ఏదైనా ముఖ్యమైన లేదా బెదిరింపు ఘటన జరిగినప్పుడు, కౌన్సిల్ సభ్యులు – దాని గురించి నివాసితులు చివరి వరకు అజ్ఞానంగా ఉండేలా చూస్తారు. అనవసరమైన గందరగోళాన్ని సృష్టించకుండా పరిస్థితిని చక్కదిద్దడానికి కౌన్సిల్ ఉత్తమంగా సన్నద్ధమైందని సభ్యులు విశ్వసించారు. అయినప్పటికీ, అటువంటి ఘటన తర్వాత, తరచుగా నివాసితులు ఎక్కువగా నష్టపోయారు.
ప్రామ్‍లీ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తూ సీని పొందిన ఆ మ్యూజిక్ ఫైల్‍ని ప్లే చేసింది ఉల్తూర్. ప్రామ్‍లీ మౌనం అర్థం కావడం లేదు. అది ఉల్టూర్‌కి కోపాన్ని, అసౌకర్యాన్ని కలిగించింది. సీని మరణంపై వచ్చిన రిపోర్టు ఎంత ఘోరంగా ఉందో తలచుకున్నప్పుడల్లా ఉల్తూర్‌కి దిక్కుతోచని భావన కలిగింది. ప్రయోగశాల నుంచి జవాబొచ్చేసరికి, మధ్యాహ్నం నగరాన్ని బద్ధకంగా స్వాధీనం చేసుకుంది.
సీని మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆమె దేహంపై పరీక్షలు చేసే సమయంలో, మెదడులోని డేటా తుడిచివేయబడింది. అందువల్ల, ఆమె బ్రెయిన్ మ్యాపింగ్ ఫలితం ‘శూన్యం’.
ఆ మెసేజ్ స్క్రీన్‌పై మెరుస్తుంటే నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది ఉల్తూర్. అదే సమయంలో, ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌లో ప్రామ్‌లీ చేరింది.
“ఎక్కడ ఉన్నావు, ప్రామ్‍లీ? నీ కోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నాను. నేను పంపిన అర్జెంట్ మెసేజ్‍లు నీకు అందలేదా?” అడిగింది ఉల్తూర్.
“పొలం వద్ద పనులు! ఇంతకీ రిపోర్ట్‌లో ఏం వచ్చింది, ఉల్తూర్? సిస్టమ్‌లో ఫ్లాష్ అవుతున్నది నిజం కాదని నాకు తెలుసు” అంది ప్రామ్‍లీ.
ఉల్తూర్ తెర మీద ప్రామ్‍లీ వైపు చూసింది. ప్రామ్‍లీ నుదిటిపై చెమట మెరుస్తూ ఉంది, ఆమె బూడిద రంగు కేశాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఆమె ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్లు అనిపించింది. ప్రామ్‍లీ భౌతికంగా చాలా దూరంగా, పర్వత పాదాల ప్రాంతంలో ఉంది. కానీ ఆమె మరింత దూరంగా ఉందని ఉల్తూర్‌కి అనిపించింది. తెరపై ఆమె చిత్రం వలె, ప్రామ్‍లీ కూడా అసహజంగా కనిపించింది.
“సీనీ మరణానికి కారణం విష్ అని నివేదిక ధృవీకరిచింది ప్రామ్‍లీ. పైగా అది ఫెన్స్ అవతలి వైపు నుండి వచ్చిందని నమ్మకంగా చెప్పారు.”
ప్రామ్‍లీ మౌనంగా ఉండిపోవడంతో, ఉల్తూర్ కొనసాగించింది “నేను సీని బ్రెయిన్ మ్యాపింగ్ కోసం కూడా అడిగాను. వారు దానిని ‘శూన్యం’ అని పేర్కొన్నారు.”
ప్రామ్‍లీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందేమోనని కాసేపు వేచి ఉంది ఉల్తూర్. కానీ, తెరపై ప్రామ్‍లీ వదనం మౌనంగా, భావరహితంగా ఉల్తూర్ వైపు చూస్తూ ఉండిపోయింది.
కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాకా, ఉల్తూర్ ఉద్రేకానికి లోనయ్యింది. “తగిన చర్యలు తీసుకుని తదుపరి సమావేశంలో నివేదించాలని కౌన్సిల్ కోరింది” అని చెప్పి, ప్రామ్‍లీ ప్రతిస్పందన కోసం ఎదురుచూడకుండా, ఛానెల్ స్విచ్ ఆఫ్ చేసింది ఉల్తూర్. దానిని మళ్ళీ ఆన్ చేయడానికి ప్రామ్‍లీ ప్రయత్నించలేదు. స్తబ్ధుగా ఛానల్ నుండి వెలువడే నిశ్శబ్దం భరించలేని విధంగా ఉంది. తానూ పూర్తిగా ఒంటరినైనట్లు భావించింది ఉల్తూర్. సీని పంపిన ఆ మ్యూజిక్ ఫైల్ ప్లే అవుతూనే ఉంది. దాని శ్రావ్యమైన లయ ఉల్తూర్ అర్థం చేసుకోలేని రీతిలో ఆమెను వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. అసలేం జరిగిందనేదానికి ఈ మ్యూజిక్ ఫైల్ కీలకం, అని ఉల్తూర్ గట్టిగా నమ్మింది. ఇది ఆలోచించాల్సిన సమయం కాదని, చర్యలు తీసుకునే సమయమని కూడా ఆమెకు తెలుసు. వచ్చి తనని కలవమని కోరుతూ ఈవీని ట్యాగ్ చేసింది.
ఆ సందేశాన్ని చూసిన ఈవీ, దానిని పట్టించుకోవద్దని అనుకుంది. కానీ అలా చేయలేకపోయింది; ఉల్తూర్ కౌన్సిల్‌లో ప్రముఖ సభ్యురాలు. అందుకే ఉల్తూర్‌ను కలవాలనీ, జరిగిందేదో జరిగిపోయింది, ఇక సీని మరణం గురించి వదిలేయాలని ఉల్తూర్‍కి చెప్పాలని ఈవీ నిర్ణయించుకుంది.
ఉల్తూర్ అపార్ట్‌మెంట్ లోకి ప్రవేశిస్తూనే, గోడలకున్న ప్రకాశవంతమైన రంగులను చూస్తూ అబ్బురపడింది ఈవీ. బ్యాక్‌గ్రౌండ్‌లో, సీని తనకు పంపగా, తాను ఉల్తూర్‌కి పంపిన ఆ మ్యూజిక్ ఫైల్ ప్లే అవుతోంది. అది వినగానే, ‘మాయ’ అనే వ్యక్తి ఎవరో కనుగొనడంలో తాను చేసిన విఫల ప్రయత్నం ఈవీకి గుర్తొచ్చింది. ఆమె గబగబా జరిగినదంతా ఉల్తూర్‌కి చెప్పింది. వెళ్ళిపోవడానికి తొందరపడుతోంది ఈవీ.
“అది మాయ కావచ్చు లేదా ప్రామ్‍లీ కావచ్చు, ఈ వ్యక్తుల కోసం వెతకడం, వారికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా అని తెలుసుకోవడం కౌన్సిల్ పని, ఉల్తూర్. నేను చేయగలిగినదంతా చేశాను” అంది ఈవీ. ఆమె లేచి నిలబడి తలుపు వైపు వెళ్ళింది, సంభాషణలో సరైన విరామం దొరికిన క్షణం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.
ఉల్తూర్ ఆ చిన్న గదిలోకి అటూ ఇటూ నడిచింది. ఆమె శరీరాకృతి మధ్యస్థంగా ఉన్నప్పటికీ, ఆమె ఉనికి ఆ గదంతా నిండినట్టు అనిపిస్తోంది.
‘నాకు ప్రామ్‍లీ తెలుసు, కానీ ‘మాయ’ ఎవరు? నేను ఆమె గురించి ఎప్పుడూ వినలేదు. ఇరానా హబ్ సిస్టమ్ నుంచి సీని జాడలన్నీ చెరిపేశారని అంటున్నావా?”
“అవును, ఉల్తూర్, నేను అనేక విధాలు ప్రయత్నించాను, కానీ ప్రతిసారీ విఫలమయ్యాను. ‘మాయ’ అని పిలవబడే ఏ సంగీతం లేదా మ్యుజీషియన్ జాడలు లేవు” అంది ఈవీ. ఆమె అప్పటికే ఎగ్జిట్ బటన్‌ను నొక్కినందున తలుపు తెరుచుకునేందుకు వేచి ఉంది.
ఈ సంక్షోభంలో తనకంటూ నమ్మకమైన మిత్రులు అవసరమని ఉల్తూర్ గ్రహించింది. మాయకి సంబంధించిన విషయమేదో సీని ప్రామ్‍లీకి చెప్పాలనుకుంది. వీరి మధ్య ఏదో లంకె ఉందనేది స్పష్టం. మాయను కనుగొనడం తప్పనిసరి అని ఉల్తూర్‌కి తెలుసు. అసలేం జరిగిందో, వీటన్నింటికీ ప్రామ్‍లీతో ఏం సంబంధమో అర్థం చేసుకోవడానికి ఇది ఉల్తూర్‍కి సాయపడుతుంది.
గోడపై ఉన్న రంగురంగుల వస్త్రాన్ని ఈవీ మెచ్చుకోలుగా చూడడం ఉల్తూర్ గుర్తించింది. ఈవీ తలుపు దగ్గర నిల్చున్న తీరు చూస్తే ఆమె వెళ్లిపోవాలనుకుంటోందని ఉల్తూర్‍కి అర్థమైంది. ఈవీ వైఖరి నిరాసక్తంగా ఉంది, పైగా జరుగుతున్న ఘటనల పట్ల ఆమె ఉదాసీనంగా ఉన్నట్లు అనిపించింది.
“ఈవీ, ఈ ‘మాయ’ గురించి ఇంకెవరికి తెలుసు?”
“టియోనికి తెలుసు. ఆమె రెంప్లాజోలో పని చేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఆమె తన పాపతో తీరిక లేకుండా ఉంది.”
తలుపు మెల్లగా తెరుచుకుంది, ఈవీ బయటకు అడుగేయడానికి సిద్ధంగా ఉంది.
ఎవరో నిజంగా క్రియేషన్ (7) కోసం వెళ్ళారా? ఉల్తూర్ ఆశ్చర్యపోయింది. ఎలోన్‌లో వారి ఉనికికి, ప్రస్తుతానికి, ఇకపై క్రియేషన్స్ అవసరం లేదు. క్రియేషన్స్ తగ్గిపోయాయి, ఆగిపోయాయి, ఒక విధంగా మర్చిపోయారు. కానీ ఇదంతా, వారికి తెలిసిన జీవితం – అన్నీ త్వరలో, అనూహ్యంగా మారిపోవచ్చు. ఆ ఆలోచన ఉల్తూర్‌ని మళ్లీ వర్తమానం లోకి తీసుకువచ్చింది.
“ఈవీ, కూర్చో. నేను నీతో మాట్లాడాలి” ఉల్తూర్ ఆదేశించింది. “నేను నీకు చెప్పబోతున్నది నీ కోసమే అని అర్థం చేసుకో. ఈ విషయాలని నువ్వు ఎవరితోనైనా చర్చిస్తే, కౌన్సిల్ సభ్యురాలిగా, నేను నిను సుదీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచుతాను” చెప్పింది ఉల్తూర్.
ఈవీ అవాక్కయింది. ఇందులో చిక్కుకుపోవాలని ఆమె అనుకోలేదు. తెరిచిన తలుపు దగ్గర నిలబడి, “ఇంతకుమించి వేరే ఏ వివరాలు నేను తెలుసుకోదలచలేదు, ఉల్తూర్. ఇది నాకు సంబంధించిన విషయం కాదు” అంది.
“నీకు సంబంధించినదే, ఈవీ. కూర్చుని విను” అంది ఉల్తూర్.
ఉల్తూర్ స్వరంలో ఈవీ అవిధేయత చూపలేని ఆజ్ఞ ఉంది. ఈవీ బయటకు పరిగెత్తాలనుకుంది, కానీ ఆమె పాదాలు ఆమెను తిరిగి లోపలికి తీసుకువెళ్ళి, ఉల్తూర్ చూపించిన కుర్చీ వైపుకి నడిపించాయి. ఈవీ కూర్చుంది. తలుపు మళ్ళీ మూసుకుంది. ఈవీ నిరుత్సాహపడింది, కానీ ఉల్తూర్‌ను ఉపేక్షించలేమని ఆమెకు తెలుసు.
“సీని మరణం ప్రమాదవశాత్తు జరగలేదు, ఫెన్స్‌కి అటువైపు నుంచి వచ్చి విషప్రయోగం చేసి చంపారు. ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి, నేను ‘మాయ’ను కనుగొనాలి. ఏమి జరిగిందో తెలుసుకోడానికి ఆమె కీలకమని నేను నమ్ముతున్నాను” చెప్పింది ఉల్తూర్.
ఈవీ మౌనంగా ఉంది. ఉల్తూర్ చెబుతున్న దానిలో ఏదో అరిష్టం ఉంది. వీలైనంత త్వరగా వెళ్లిపోవాలనే ఈవీ కోరికకు బలం చేకూరింది. ఆమె మళ్ళీ లేచి నిలబడింది.
“కానీ, వీటితో నాకేం సంబంధం ఉల్తూర్? సీనికి జరిగింది నన్నూ బాధించింది, అయితే నేను దీనిని పరిష్కరించే ప్రయత్నం పూర్తి చేసాను.”
“కూర్చో, ఈవీ. ఇది మనందరికీ సంబంధించినదే. ఎందుకంటే విష్ అవతలి వైపు నుండి వస్తే, వారితో విరోధం లేదా సంఘర్షణ ఆసన్నమైందని అర్థం. ఆ గొడవలు, వాటి పర్యవసానాల గురించి నువ్వు విని ఉంటావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.”
ఈవీ తలాడించింది, ‘సీని నన్ను క్రానికల్ చదవమని ప్రోత్సహించింది. నేను ఇప్పటికీ వాటిని చదువుతున్నాను. అవును, ఆ గొడవల గురించి నాకు తెలుసు” అంటూ ఈవీ మళ్ళీ కూర్చుంది.
పరిస్థితి తీవ్రతని ఈవీ ఇప్పటికీ గ్రహించలేదని ఉల్తూర్‌కి అర్థమైంది. తర్వాత, అసలు ఈ విషయంలోకి తీసుకురావడానికి ఈవీ సరైన వ్యక్తి కాదా అని అనుకుంది కాసేపు.
ఈవీ నిరాసక్తంగా కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఉల్తూర్ చెబుతున్నదానిపై ఆమె ఆసక్తి చూపలేదు.
ఉల్తూర్ మరోసారి ప్రయత్నించింది, “ఈవీ, సీనికి ఏమి జరిగింది అనేది, ఎలోన్‌లో, మనకు తెలిసిన, మన ఉనికి కొనసాగింపుకి సంబంధించినది. మళ్లీ గొడవ జరిగితే ఏం జరుగుతుందో ఊహించుకో. జరగబోయే విధ్వంసం, నష్టాలు ఊహాతీతం. మనం ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నాకు నీ సాయం కావాలి, ఈవీ, ‘మాయ’ని వెతకాలి. ఆమెను కనుగొని నా దగ్గరకు తీసుకురా” చెప్పింది ఉల్తూర్.
తన భుజాలపై మోయలేని భారం మోపుతున్నట్లు ఈవీకి అనిపించింది. ఆమె లేచి కిటికీ వైపు నడిచింది. సీని, మ్యూజిక్ ఫైల్, మాయ, విష్, గొడవలు – ఈ మాటలు ఆమె మనసులో సుడులు తిరుగుతున్నాయి.
సీని చనిపోయాక, ఈవీ ఎందుకు ఉల్తూర్‍ని చూడడానికి వచ్చింది? అప్పుడలా రాకుండా ఉంటే, ఈ రోజు ఇక్కడ నిలబడి ఉండేది కాదు.
వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంది ఈవీ. కాని రాబోయే గొడవల గురించి ఉల్తూర్ అన్న మాటలు ఆమెను ఆ రంగుల గదిలో నిలిపేశాయి.
సీని చనిపోయాకా, జరిగిన ఈ సంఘటనలన్నీ ఎలా కలగలిసిపోయాయి? ఫెన్స్‌కి అటువైపు నుంచి వచ్చిన విష్ ద్వారా సీనిని చంపారు. ఏదో ఒకవిధంగా, ‘మాయ’ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనిపించింది. వీటన్నింటి వెనుక ఉన్న కారణాలను వెలికితీస్తే తప్ప, ఫెన్స్‌కు అవతలి వైపు ఉన్న వారితో ఘర్షణ తప్పదని అనిపిస్తోంది.
ఈ సమాచారంలో ఏదో ముఖ్యమైన వాస్తవం లోపించిందని ఈవీ భావించింది. ఆమె కిటికీలోంచి చూస్తూ దాని గురించే ఆలోచించింది. మధ్యాహ్న సమయంలో సూర్యుడితో దాగుడుమూతలు ఆడుతున్న మేఘాలను చూస్తుండగానే ఆమె ఆలోచనకు అంతరాయం ఏర్పడింది.
“కానీ, అటువైపున్నది ఎవరు ఉల్తూర్?”
“నీకు తెలియదా? నీ చదువు కొనసాగినన్ని జాక్స్ లోనూ నీకెప్పుడూ చెప్పలేదా? వాయునం (8) లోని వారు చెప్పలేదా?” ఉల్తూర్ ఆశ్చర్యపోతూ అడిగింది.
“లేదు, ఉల్తూర్. మాకు ఎప్పుడూ చెప్పలేదు.”
వారు తమ అంచనాలలో పొరబడ్డారా? వాయునం బోధకుల నుండి అన్ని రిఫరెన్సులు తొలగించబడ్డాయా? ఫెన్స్‌కు అవతలి వైపు ఉన్న వారి నుండి వేరు పడడం తమ పక్షాన జరిగిన ఏమరుపాటా? ఫెన్స్‌కి అవతలి వైపు అనేదే అసలు లేదని నమ్మి, ఫెన్స్ పక్కనే జీవించడం తప్పా? ఉల్తూర్ ఆశ్చర్యపోయింది.
“వాళ్ళు మనలాంటి వాళ్ళేనా లేక వేరా?” ఈవీ మళ్ళీ అడిగింది. ఆమె ముఖం ఇప్పుడు గంభీరంగా కనిపిస్తోంది. ఈ సమస్య ఆమె దృష్టిని ఆకర్షించింది. ఈవీ – ఉల్తూర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది, ఆమె నల్లని కళ్ళు అప్రమత్తంగా ఉన్నాయి.
తాను విచ్ఛిన్నం చేస్తున్న ఓ అప్రకటిత నియమం గురించి ఆలోచించింది ఉల్తూర్. అయితే, అది బహిర్గతం కావాలని ఆమె గ్రహించింది. జరిగిన సంఘటనలు అందుకు దోహదం చేశాయి. ఫెన్స్‌కి అటు వైపు ఉన్నవారి ఉనికిని గుర్తించకుండా, రాబోయే ఈ ముప్పుకు తమవారెలా స్పందించగలరు? తమ మనుగడకు ఇది చాలా అవసరం.
ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుని, “ఈవీ, వాళ్ళు వేరే జాతి. వారు కూడా భూమి నుండే వచ్చారు. వారిని ‘పురుషులు’ అంటారు” అని చెప్పింది.
—
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
1) Tobok, టోబోక్ = యంత్ర సహకారి
(2) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(3) Calante, కాలంటే = ఎలోన్ గ్రహంలో ఒక నెల
(4) Vish, విష్ = విషమయమైన పదార్థం
(5) Fence ఫెన్స్= సరిహద్దు
(6) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(7) Creation = సంతానం
(8) Vayunum, వాయునం = విద్యాకేంద్రం
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.