[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[ఎలోన్ గ్రహంలో ఫెన్స్‌కి అటువైపున అందరూ పురుషులే ఉండే భాగంలో, ‘అయోనా అబ్జర్వేటరీ’లో నుంచి రాత్రి పూట ఆకాశంలోని నక్షత్రాలను పరిశీలిస్తుంటాడు ఇమే. తమని చుట్టుముట్టిన ఆ నిశిలో, ఎక్కడో సుదూరంగా, ఖగోళంలో తమకు కాబోయే కొత్త ఆవాస గ్రహం ఉండి ఉంటుందని గట్టిగా భావిస్తాడు ఇమే. తన ఉద్యోగ బాధ్యతలలో కొన్ని ఫలితాల గురించి వల్హన్‍ని సంప్రదించాలని అనుకుంటాడు. కానీ తాను ప్రయాణంలో ఉన్నాననీ, వచ్చే వారం తిరిగొస్తానని వల్హన్ ‘లెక్స్’ ద్వారా సందేశం పంపుతాడు. జనాలని నగరంలోని ఒక చోటు నుంచి మరో చోటుకి చేర్చే వాహనం ట్రావెలర్‍లో ఎక్కి తన అపార్ట్‌మెంట్‌కి వెళ్తాడు ఇమే. నిద్రపోయేముందు తమ పూర్వీకుల గ్రహమైన భూమిని తలచుకుంటాడు. తెల్లవారుతుంది. గ్రూప్ హౌసెస్లో నివాసముండే రాదుల్‍కి మెలకువ వస్తుంది. టోబాట్ మెయిన్‍టెనన్స్ యూనిట్‌లో పని చేస్తాడతను. అస్తవ్యస్తంగా ఉన్న తన గదిని శుభ్రపరిచేందుకు వచ్చే టోబాక్ కోసం ఎదురుచూస్తాడు. ఆహారం తీసుకునే గదికి వెళ్తాడు రాదుల్. బ్లమ్, సాకా అప్పటికే అక్కడ ఉంటారు. తనకి కావల్సిన పదార్థాలు ఒక బౌల్‍లో వేసుకుని తినడానికి సిద్ధమవుతాడు రాదుల్. ఎట్టకేలకు నువ్వు ‘సైనెడ్’లో సభ్యుడవయ్యావట కదా అని అడుగుతాడు బ్లమ్. అవునంటాడు రాదుల్. ఎంతో కష్టపడితే గాని అందులో సభ్యత్వం దొరకలేదనీ, అందులోని వృద్ధులు – యువతనీ రానీయరనీ అంటాడు. నువ్వు ‘సైనెడ్’లో ఏం చేస్తావని బ్లమ్ అడిగితే, తన లక్ష్యాన్ని వివరిస్తాడు. వల్హన్ అవయవ మార్పిడి కేంద్రం నోటస్‌లో ఉంటాడు. తన అవయవాల మార్పిడి గురించి తన లెక్స్‌లో వచ్చిన సమాచారాన్ని చదువుకుంటాడు. అతను ఎలోన్ గ్రహంలో ఖనిజాలను, సహజ వనరులను, ఇతర వనరుల నిర్వహణను చూసే ‘మస్తు’ అనే సంస్థలో పనిచేస్తాడు. తమ గ్రహంలోని నెపో ఖనిజం వనరులు క్షీణించడాన్ని గుర్తిస్తాడు వల్హన్. దాని గురించి ఒడెప్‍తో మాట్లాడాలని అనుకుంటాడు. ఈలోపు అవయవాల మార్పిడి స్పెషలిస్ట్ వచ్చి -ఈసారి వల్హన్ శరీరంలో ఏయే అవయవాలు మారుస్తున్నామో, ఎంత కాలం అవి పని చేస్తాయో చెప్తాడు. ఇక్కడ ఆఖరి మరణం ఎప్పుడు సంభవించిందని వల్హన్ ఆయనని అడిగితే, ఒక్క మరణం కూడా లేదనీ, అసలు ఎలోన్‌లో గత వంద జాక్‍లలో, గత యుద్ధం తరువాతి నుంచి, చావన్నదే లేదని చెప్తాడు. నిర్ణీత తేదీ నాడు ‘సైనెడ్’ సభ్యుల సమావేశం మొదలవుతుంది. తొలిసారిగా ఆ సమావేశాలకు హాజరవుతాడు రాదుల్. సమావేశంలో లెక్స్‌ల వాడకం కుదరకపోవడంతో, తాను మాట్లాడాలనుకున్న అంశంపై వివరాలు గుర్తు రాక, తదుపరి సమావేశంలో మాట్లాడతానని అంటాడు. అతనికి ‘సైనెడ్’ బృందంలో సభ్యత్వం కోసం పట్టుపట్టి సాధించిన పాటిక్స్, ‘సైనెడ్’ సమావేశాల్లో రాదుల్ నడుచుకోవాల్సిన తీరుని అతనికి వివరిస్తాడు. మాటల సందర్భంలో తనకి నక్షత్రాలని గమనించడమంటే ఆసక్తి అని రాదుల్ చెప్తే, ‘అయోనా అబ్జర్వేటరీ’లో ఇమేని కలిసి, అతని సాయంతో గెలాక్సీల గురించి తెలుసుకోమంటాడు పాటిక్స్. ఇక చదవండి.]
అధ్యాయం-2 – క్షీణత – రెండవ భాగం
ఇమే తన ప్రాసెసర్ ప్లగ్ తీసేసి, కళ్ళు తెరిచాడు. అతను ప్రాసెస్ చేసిన మొత్తం డేటా అతని ముందున్న స్క్రీన్‌పై ప్రదర్శితమైంది. పొరుగున ఉన్న గెలాక్సీలో తాను గుర్తించిన రెండు గ్రహాలలో కనీసం ఒకటైనా దాని జాతులను నిలబెట్టుకోగలదని అతను కొంతవరకు నమ్ముతున్నాడు. అయితే, మరింత పరిశోధన చేయవలసి ఉంది. కొన్ని విహాన్ (1)ల తర్వాత తిరిగి వచ్చే వల్హన్ కోసం ఇమే ఎదురుచూస్తున్నాడు.
ఉన్నత విద్యా విభాగంలో ఉండగా ఇమేకి – నక్షత్ర వీక్షణం పట్ల ఆసక్తి కలిగింది. అతను తరచుగా కోషుమ్‌ను సందర్శించేవాడు, ఇది ఎలోన్ (2)లో సేకరించబడిన అన్ని విజ్ఞానాల భాండాగారం. అతను కోషుమ్‌లో వల్హన్‌ని కలిశాడు. చాలా సార్లు, వారు ఒకే మూలలోని వర్క్‌స్టేషన్‌లలో కూర్చునేవారు, కానీ ఎన్నడూ మాట్లాడుకోలేదు. అప్పుడు, ఒక రోజు, వల్హన్ అతనిని పలకరించి, “నువ్వు ఇక్కడ ఏం వెతుకున్నావు? నువ్వు ఉన్నత విద్యా విభాగంలో నమోదు చేసుకున్నావని నీ దుస్తులని బట్టి అర్థమవుతోంది. నేర్చుకునేవారు ఎక్కువగా ఇక్కడికి రారు” అన్నాడు.
“నాకు భూమిపై ఆసక్తి ఉంది, మనమంతా వచ్చిన గ్రహం”, చెప్పాడు ఇమే.
వల్హన్ పొడవాటి మనిషి. నిస్త్రాణత నిండిన నడక, బాగా కత్తిరించిన ముదురు గోధుమ రంగు జుట్టు, స్నేహపూర్వకమైన లేత గోధుమరంగు కళ్ళు, సున్నితమైన, నిర్ణయాత్మక వదనం. అతనితో మాట్లాడటం సులువు.
“ఎందుకు? భూమికి సంబంధించి నీకు ఆసక్తి కలిగించే అంశం ఏమిటి?” వల్హన్ ఎదురు ప్రశ్నించాడు.
“ఎలోన్ కంటే అది ఎలా భిన్నంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు నాశనం చేయబడింది? ఎలోన్‌కి కూడా అలాగే జరగవచ్చా? వంటి విషయాలు. మనలాంటి వాళ్ళు ఉండే గ్రహాలు ఇంకేమైనా ఉంటాయేమో అని కూడా అనుకుంటూంటాను. బహుశా, భూమి నుండి వారు వేరే చోట్లకి కూడా వెళ్ళి ఉండచ్చు కదా” జవాబిచ్చాడు ఇమే. ఆ స్పందనలో ఆసక్తి, ఉత్సుకత వ్యక్తమయ్యాయి.
ఆ సమావేశం వారి మధ్య సుదీర్ఘ సంభాషణలకు దారితీసింది.
కాలం గడుస్తున్న కొద్దీ, నక్షత్రాలూ, వాటి ఉనికి పట్ల ఇమేకి ఆసక్తి పెరిగింది. ‘అయోనా అబ్జర్వేటరీ’లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో అతడిని ప్రతి దశలోనూ వల్హన్ ప్రోత్సహించాడు. సుమారు, మూడు జాక్ (3)ల క్రితం, వల్హన్ ఇమేని తన ఇంటికి లంచ్‌కి పిలిచాడు.
వల్హన్ అపార్ట్‌మెంట్ అవసరమైనంత ఫర్నిచర్‍తో, చాలా నిరాడంబరంగా ఉంది. సాయంగా కేవలం ఒక టోబాట్ (4) ఉంది. అది ఒక గ్లాసులో జాగ్రత్తగా పోసి ఇమేకి తెచ్చి ఇచ్చిన ఎనాబ్ (5) రుచి బానే ఉంది. టోబాట్ బయటకు వెళ్ళి భోజనానికి తాజాగా ఉడికించిన కూరగాయలు, అన్నం, నాణ్యమైన గోధుమలతో తయారు చేసిన ‘కింపాయో’ బ్రెడ్ తెచ్చింది.
“నువ్వు ‘అయోనా అబ్జర్వేటరీ’లో చేరి చాలా రోజులయింది కదా, అందుకని నీకో పని అప్పజెప్తాను. గెలాక్సీలన్నీ వెతికి, ఎలోన్ లాంటి, మనం నివాసం ఉండగలిగే గ్రహాన్ని పట్టుకో. మనకో ప్రత్యామ్నాయ నివాసం చూడు” అని చెప్పాడు వల్హన్, తెరిచిన కిటికీలోంచి దూరతీరాలను చూస్తూ.
ఇమే మౌనంగా ఉండిపోయాడు. ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. ఆ ఆలోచన ఆసక్తికరంగానూ, ప్రమాదకరంగానూ అనిపించింది అతనికి. ఓ క్షణం ఆగి, తర్వాత నెమ్మదిగా, “ఎందుకు? ఎలోన్ ఏదైనా ప్రమాదంలో ఉందా? భూమి నుంచి ఇక్కడికి వచ్చినట్టే, ఇక్కడి నుండి మరో గ్రహానికి వెళ్ళాలా?” అని అడిగాడు.
“లేదు, అలాంటి ప్రమాదం ఏదీ లేదు. నా ఆసక్తి కొద్దీ అడిగానంతే. అలాంటి గ్రహాలు ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నాను, అంతే. మనం చలనశీలురం! భూమిని విడిచినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. మన ఈ ప్రయాణంలో కొత్త గమ్యాలను అన్వేషించాలి” చెప్పాడు వల్హన్.
వల్హన్ ఏదో దాస్తున్నాడని ఇమేకి అర్థమయింది. అయితే, అతను ఆ విషయాన్ని ఇక పొడిగించలేదు.
ఆ సంభాషణ తర్వాత, ఇమే – మరింత ఆసక్తితో తన అన్వేషణని కొనసాగించాడు. తన అపార్ట్‌మెంటుకి కూడా వెళ్ళకుండా ‘అయోనా అబ్జర్వేటరీ’లో రోజుల తరబడి ఉండిపోయాడు. విశ్వంలో సుదూరంలో ఉన్న గ్రహాలను, నక్షత్రాలను, వాటి సూర్యుళ్ళను అధ్యయనం చేశాడు. కఠినమైన ఆ అన్వేషణలో అతను పూర్తిగా అలసిపోయాడు. ఎట్టకేలకు, వల్హన్‌తో పంచుకునేందుకు ఓ సంగతి దొరికింది.
అయోనాలో తన పనులను ప్రాసెస్ చేస్తుండగా, పాటిక్స్ లెక్స్ (6) నుంచి వచ్చిన సమాచారం ద్వారా, రాదుల్ త్వరలో అయోనాకి రానున్నాడని తెలిసింది. లెక్స్ ఫోల్డర్స్ లోని సమాచారం ద్వారా రాదుల్ ఇప్పుడు సైనెడ్‍లో కొత్త సభ్యుడిగా చేరాడని అర్థమైంది. సెక్యూరిటీ సిస్టమ్‍లో రాదుల్ డేటాని తెరచి, అతని గురించి అంతా తెలుసుకున్నాడు.
అతనిలాంటి వ్యక్తికి సైనెడ్‍లో సభ్యత్వం ఎలా లభించిందో ఇమేకి అర్థం కాలేదు. నిస్సహాయంగా భుజాలెగరేశాడు ఇమే. ఏమైనా సైనెడ్ అనేది – కొంతమంది ఎంపిక చేయబడ్డ వ్యక్తుల బృందం. వాళ్ళ గురించి ఎవరికీ ఏమీ పెద్దగా తెలియదు.
రాదుల్‍ని అయోనాలో సాధారణ సందర్శకుడిగానే పరిగణించాలని ఇమే నిర్ణయించుకున్నాడు. చీకటి ముదిరి, నక్షత్రాలు కాంతిమంతంగా కావడంతో టెలిస్కోప్ వైపు కదిలాడు ఇమే.
🚀
పర్వతాల పాదాల వద్ద వల్హన్‌ని దింపింది ‘ట్రావెలర్’. అది అతన్ని ఒడెప్ ఇంటి వరకూ తీసుకెళ్ళగలదు. కానీ వల్హన్ కాస్త దూరం నడవాలనుకున్నాడు. దట్టంగా పెరిగిన చెట్లున్న కొండల మధ్యగా ఆ ఇరుకైన దారి బద్ధకంగా సాగుతోంది. నడుస్తూంటే, చెట్ల వాసన తెలుస్తోంది వల్హన్‍కి. తాజా ఆకులను, చెట్ల చిత్తడి వాసనని, పువ్వుల పరిమాళాలను చల్లటి గాలి మోసుకొస్తోంది. వల్హన్ నడుస్తుంటే, కాళ్ల క్రింద ఉన్న ఎండుటాకులు విరుగుతూ అతన్ని అనుసరిస్తున్నాయి. పది జాక్‌ల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఒడెప్‍ని కలవడం ఉత్తేజభరితంగా ఉంటుంది. ఇక్కడి గాలి భిన్నమైనది, అసంఖ్యాకమైన చెట్ల నీడ స్వాగతం చెప్తున్నట్టు ఉంటుంది. నగరంలో గాలిలో ఇలాంటి సువాసనలు ఉండవు, వృక్షకోటి ఒక క్రమపద్ధతిలో ఉంటుంది, చక్కని వ్యవస్థలా ఉంటుంది.
కొండ పాదాలా వద్ద గుబురుగా ఉన్న చెట్ల పక్కన ఇంటికి చేరాడు వల్హన్. తలుపు బార్లా తెరిచుంది, లోపలికి నడిచాడు. మామూలు దుస్తుల్లో ఉన్న ఒడెప్, వాలుకుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతను వల్హన్ అంత పొడుగరి, ఆ వాలుకుర్చీ అతనికి సరిపోయినట్టు లేదు. నల్లని పొడవాటు జుట్టు భుజాల వరకూ పెరిగింది. ఎలోన్‍లో ఉండే సాధారణ పురుషుల కంటే చాలా లావుగా ఉన్నాడు. లోపలికొచ్చిన వల్హన్ తలుపుని మెల్లగా తట్టాడు. ఒడెప్ కళ్ళు తెరిచాడు, ఆ కళ్ళెప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటాయి. అతనిలానే అతని కళ్ళు కూడా తెలివైనవి, దయ కలిగినవి.
“నన్ను చూడ్డానికి వస్తున్నట్టు ముందు చెప్పలేదేం వల్హన్? కొంచెం సేపయితే, అలా నడిచి వద్దామని బయల్దేరిపోయేవాడిని. నన్ను కలవలేకపోయేవాడివి, నేనొచ్చే దాకా ఎదురుచూడాల్సి వచ్చేది” అన్నాడు ఒడెప్, వాలుకుర్చీలోంచి లేస్తూ.
“నీకు లెక్స్ ద్వారా సమాచారమిచ్చాను ఒడెప్” అన్నాడు వల్హన్ లోపలికి వస్తూ.
“ఓ, లెక్స్ ద్వారా పంపావా? నేను దాన్ని క్రితం జాక్‌లో బయటకు తీసేశాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి. రా, కూర్చో, ఓ గ్లాస్ ఎనాబ్ తెస్తాను” అని చెప్పి, “నడిచొచ్చావా?” అని అడిగాడు.
అక్కడున్న మరో కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చున్నాడు వల్హన్. ఆ గదిలో గాలి ధారాళంగా వీస్తోంది. పంచభూతాలను ఆహ్వానిస్తున్నట్టుగ్గా అనిపించింది. ఆ గదిలో స్క్రీన్ గాని వర్క్ స్టేషన్ గాని లేకపోవడం గ్రహించాడు వల్హన్. క్రితంసారి వచ్చినప్పుడు ఓ వర్క్ స్టేషన్‍ని చూసినట్టు గుర్తొచ్చింది. ఒడెప్ దాన్ని చాలా రోజుల నుండి ఉపయోగించటం లేదని స్పష్టమవుతోంది.
కొండల్లోకి వచ్చి దాక్కున్నప్పటి నుంచి, ఒడెప్ ఏవో వింత పనులు చేస్తున్నాడని వల్హన్‍కు తెలుసు. కానీ లెక్స్ తీసేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఊహించలేని విషయం! లెక్స్ అనేది వాళ్ళ ఉనికిలో ఒక భాగం. దాన్ని తన నుంచి విడదీయాలని అసలు ఒడెప్‍కు ఎందుకు అనిపించిందో?
ఒడెప్ లోపల్నించి రెండు గ్లాసులు తీసుకురావడం కనిపించింది. ఒక గ్లాసుని వల్హన్‍కి అందించాడు. ఒడెప్ విషయంలో ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. వల్హన్ గుర్తించలేకపోతున్నాడు, కానీ తేడా ఉందని మాత్రం గ్రహించాడు.
“అవును, ఇక్కడికి నడిచే వచ్చాను. అయినా నీతో పాటు మళ్ళీ నడవగలను. ఇక్కడ చెట్ల మధ్య నడక హాయిగా ఉంటుంది” చెప్పాడు వల్హన్.
“మనం తరువాత వెళ్దాం” చెప్పాడు, ఒడెప్ ఓ గుక్క ఎనాబ్ తాగుతూ. “దాదాపు మూడు జాక్‌ల తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావు వల్హన్. ఆ పెద్ద నగరంలో ఏం జరుగుతుందో చెప్పు!” అన్నాడు.
“లెక్స్ ద్వారా, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఒడెప్”
“లెక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను లెక్స్‌ని ఎందుకు డిస్‌కనెక్ట్ చేసాను అనే దాని గురించి మాట్లాడటానికి నువ్వు ఇక్కడికి రాలేదు, అవునా?” టేబుల్ మీద ఉంచిన ఎనాబ్ బాటిల్ వైపు సైగ చేస్తూ ఓడెప్ నవ్వాడు.
నిజాయితీగా మాట్లాడడం ఒడెప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది, తరువాత అదే అతన్ని నేలకు తెచ్చింది. ఆర్కిటెక్ట్ అయిన ఒడెప్, ఎలోన్‌లోని అత్యంత పెద్ద వయసు వారిలో, అత్యంత విశిష్ట వ్యక్తులలో ఒకడు. అతను ఎలోన్ మీద అయోనా, సైనెడ్ బిల్డింగ్, కోషుమ్, ఇతర చిన్న విద్యా విభాగాలు, ఇంకా వల్హన్ ఇటీవల బయటకు వచ్చిన అందమైన నోటస్ వంటి అనేక భవనాలను నిర్మించాడు. ఒడెప్ అనేక జాక్‌ల పాటు సైనెడ్‌లో ఒక భాగం. అతను నూతన ఆలోచనలను ఆహ్వానించాడు, ఎలోన్‌పై వారి జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే నియమాలను, ప్రక్రియలను అభివృద్ధి చేశాడు. నిజానికి చాలా జాక్‌ల క్రితమే లెక్స్‌ని శరీరంలో అమర్చుకోడానికి ఒడెప్ ముందుకొచ్చాడని వల్హాన్ గ్రహించాడు!
అయితే, పది జాక్‌ల క్రితం, ఒడెప్ కొండ ప్రాంతాలకు వచ్చి, అడవుల్లో అదృశ్యమయ్యాడు. అతను అన్నింటి నుంచి – తన వృత్తి నుంచి, జీవితం నుండి తప్పుకున్నాడు. వల్హన్ వంటి చాలా మంది పురుషులు మొదట్లో అతనిని కలవడానికి వచ్చేవారు, కానీ జాక్‌లు గడిచేకొద్దీ వారి సంఖ్య తగ్గింది. ఒడెప్ అందరికీ దూరంగా జీవించడానికి ఇష్టపడినప్పటికీ, సమస్యలు ఎదురైనప్పుడల్లా పరిష్కారాలను అందించేవాడు ఒడెప్. ఓ సవాలును ఎదుర్కొన్నప్పుడు సైనెడ్ కూడా అతనిని సంప్రదించింది. అలాగే, తనకీ సమస్య వచ్చినప్పుడల్లా వల్హన్ ఒడెప్‌ని వెతుకుతూ వస్తున్నాడు.
“సరే, ఒడెప్! నెపో (7) నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. క్షీణత పెరుగుతూండడం వల్ల, కాలక్రమేణా అది తగ్గిపోతుంది. ఇప్పుడీ విషయన్ని ప్రస్తుతం నేను సైనెడ్ దృష్టికి తీసుకురావాలా? నువ్వేం అనుకుంటున్నావు? ఏం చెబుతావు?” అడిగాడు వల్హన్.
ఓడెప్ తన కుర్చీలో మౌనంగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు. తన చేతిలోని గ్లాసు లోని ద్రవాన్ని ఒక్క గుక్కలో తాగేసి, పక్కనే ఉన్న చిన్న బల్ల మీద పెట్టి, “అన్నిచోట్లా చూశావా? సముద్రాల్లోనూ, కొండల్లోనూ?” అని అడిగాడు.
“అన్ని చోట్లా నిల్వలను పరిగణనలోకి తీసుకున్నారు.” చెప్పాడు వల్హన్.
ఓడెప్ తన కుర్చీలోంచి లేచి, నవ్వి, “మనం నడుద్దాం, వల్హాన్. మన ఉనికిపై ఆధారపడిన విషయాన్ని చర్చించడానికి ఈ గది చాలా చిన్నదిగా అనిపిస్తోంది” అన్నాడు.
వారు అస్తమించే సూర్యుని దిశగా సాగి, అడవిలోకి సుదూరంగా సాగే ఓ చిన్న దారిలో నడవసాగారు.
🚀
అక్కడ వల్హన్, ఒడెప్ అడవిలో నడుస్తుండగా, రాదుల్ ‘అయోనా’ చేరేందుకు ఓ ట్రావెలర్ ఎక్కాడు. అక్కడ పని పూర్తయ్యాకా, దాని గురించి పాటిక్స్‌కి లెక్స్ ద్వారా తెలియజేయాలనుకున్నాడు. ట్రావెలర్ నగర వీధుల్లో దూసుకుపోతుండగా, ఆకాశంలోకి చూసిన రాదుల్, చాలా జాక్‌ల తరువాత, ఆకాశంలో మసకబారిన మూడు చందమామలను చూశాడు. ఏళ్ళ తరబడి రాత్రుళ్ళు ఆకాశాన్ని చూడలేదు రాదుల్. తాను పాటిక్స్‌కి ఇచ్చే జవాబు, అతనితో జరిపిన అసౌకర్యపు సంభాషణకు ముగింపులా ఉండాలని రాదుల్ భావించాడు. కానీ అలా జరగలేదు. పాటిక్స్ సంగతి, అతని ఆధిపత్య భావన గురించి సమయమొచ్చినప్పుడు చూడాలని అనుకున్నాడు.
సైనెడ్ భవనంలానే, అయోనా భవనం కూడా గొప్ప వైభవోపేతంగా ఉంటుంది. దాని ద్వారం ముందు నిలబడినప్పుడు, ఈ భవంతులను తాను ఇంతకు ముందెప్పుడూ ఎందుకు గమనించలేదో అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు రాదుల్. తన పనులు, గ్రూప్ హౌస్ విషయాలు, ఎనాబ్, ఇంకా లెక్స్ హైవేలు (ఫోల్డర్స్) వంటివాటిలో పడి – వీటినెప్పుడూ గమనించలేదని తనకి తాను చెప్పుకున్నాడు. బయటి ప్రపంచం ఎన్నడూ తన దృష్టికి రాలేదు. తలుపులు తెరుచుకున్నాయి, రాదుల్ లోపలికి ప్రవేశించాడు.
తనకి దారి చూపిస్తున్న టోబాట్‌ని అనుసరించి, తనున్న చోటుకి రాదుల్ రావడాన్ని సెక్యూరిటీ పానెల్ లోంచి ఇమే చూశాడు. రాదుల్ పొడగరి అని, అతనివి విశాలమైన భుజాలనీ, ఆకర్షించే నీలి కళ్ళు అని గుర్తించాడు ఇమే. అతని నడకలోని నిర్లక్ష్యం, చింపిరి ఆకారం, అహంకారపు నడత.. ఇవన్నీ గ్రూప్ హౌసెస్లో నివాసముండే పురుషుల లక్షణాలు. రాదుల్ లాంటి వ్యక్తి ప్రస్తుతం సైనెడ్ బృందంలో సభ్యుడన్న సంగతి వల్హన్‌కి తెలుసో లేదో అనుకున్నాడు ఇమే.
రాదుల్ తన వర్క్‌స్టేషన్‌కు చేరుకోగానే, ఇమే లేచి నిలబడి, “అయోనాకు స్వాగతం, రాదుల్. ఎలోన్‌ని మించిన ప్రపంచాన్ని నీకు పరిచయం చేయడానికి అంతా సిద్ధం చేశాను. దయచేసి ఈ గదిలోకి ప్రవేశించు; నీ లెక్స్ తగిన హైవేకి కనెక్ట్ అవుతుంది. సౌకర్యవంతంగా ఉండు, నీ ప్రయాణాన్ని ఆస్వాదించు. టోబాట్ బయట ఉంది. ఏదైనా సమస్య ఉంటే సహాయం చేస్తుంది”, చెప్పాడు ఇమే, రాదుల్‌ను విజిటర్ ఇంటర్‌ఫేస్ వైపు నడిపిస్తూ.
అయోనాలోని టోబాట్‌లు సాధారణ టోబాట్‍ల కంటే పొడవుగా ఉన్నాయని రాదుల్ గమనించాడు. అతను ఒక క్యూబికల్ లోకి ప్రవేశించగా, ఇమే తన వర్క్‌స్టేషన్‌కు తిరిగి వచ్చాడు. చిన్న క్యూబికల్‌లో ఓ వాలు కుర్చీ ఉంది, పైన మెరుస్తున్న ఆర్చ్ ఉంది. అతని లెక్స్‌ని ప్రాసెసర్ లైన్‌కి కనెక్ట్ చేయమని ఒక వాయిస్ అతనికి సూచించింది. రాదుల్ ఆ ఆదేశాన్ని పాటించాడు, విశ్వంలో అతని ప్రయాణం ప్రారంభమైంది.
బయట, రాత్రై, ఆకాశం చీకటిగా మారడంతో మూడు చందమామలు ప్రకాశవంతంగా మారాయి. దూరంలో ఉన్న నగరం నెమ్మదిగా నిద్రకు ఉపక్రమిస్తుంటే, నక్షత్రాలు అద్భుతంగా మెరిశాయి.
విజిటర్ ఇంటర్‌ఫేస్‌ని పూర్తి చేసిన తర్వాత, ఇమే పనిచేస్తున్న చోటికి వెళ్లాడు రాదుల్. విశ్వపు సంగ్రహావలోకనం తర్వాత, ఇతర సందర్శకుల మాదిరిగానే, అతని ముఖంపై అదే గందరగోళపు భావాలు గోచరించాయి.
“ఎలోన్‌కి మించిన లోకం ఇంత ఉందని నాకెప్పుడూ తెలియదు!” అన్నాడు రాదుల్, అయోనా చుట్టూ చూస్తూ. అయోనాలోని ప్రధాన ప్రయోగశాల గోడలకు అలంకరించిన మూడు పెద్ద స్క్రీన్‌లు అసంఖ్యాకమైన లెక్కలతో నిండిపోయాయి, డేటా నిరంతరం ప్రాసెస్ చేయబడినందున వాటి ఫలితాలు మారుతూనే ఉన్నాయి.
“టెలిస్కోప్ గుండా అసలైన ఆకాశాన్ని చూడవచ్చా?” అడిగాడు రాదుల్. ఇమే ఒకింత ఆశ్చర్యానికి లోనైయ్యాడు, అయినా ఏమీ మాట్లాడకుండా అతన్ని వ్యూయింగ్ ఛాంబర్‌కి తీసుకువెళ్లాడు. రాదుల్ టెలిస్కోప్ వ్యూయింగ్ పేన్ గుండా ఆకాశాన్ని చూస్తుంటే, ఇమే తన స్థానం వద్దకు వచ్చేశాడు.
“రాత్రుళ్ళు నువ్వు ఇక్కడే ఉంటావా, ఇమే?” అన్న ప్రశ్న వినబడి, తన వెనకాలే రాదుల్ నిలబడి ఉండడం చూసి ఇమే ఆశ్చర్యపోయాడు.
“అవును. చాలాసార్లు. ఈ రోజు కూడా ఉంటాను. ఇంకేమైనా చూడాలని ఉందా?” ఇమే అడిగాడు. రాదుల్ వెళ్ళిపోతే బాగుండని అతను అనుకుంటున్నాడు. తన వీపుని రాదుల్‍కి అభిముఖంగా ఉంచి తన వర్క్‌స్టేషన్‌లో తన పని చేసుకోసాగాడు ఇమే.
ఒక మూలలో ఉన్న ఫ్రీజర్‍ని చూపిస్తూ, “నీ దగ్గర ఎనాబ్ ఉందని తెలుస్తోంది. చెరో గ్లాసూ తాగుదాం, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను” చెప్పాడు రాదుల్.
రాదుల్ ఫ్రీజర్ వైపు నడిచాడు. ఇమే అతని సూచనను తిరస్కరించాలని కోరుకున్నాడు, కానీ రాదుల్ – పాటిక్స్ అతిథి. సైనెడ్ సభ్యుడిని అసంతృప్తికి గురిచేయడం ఇష్టం లేకపోయింది.
“నువ్వు తాగు. నేను పని చేస్తున్నప్పుడు ఎనాబ్ తాగను, అలాగే ఈ రాత్రికి చాలా పని పూర్తి చేయాలి”, అని చెప్పాడు ఇమే తన పనిని కొనసాగిస్తూ. అతని వీపు రాదుల్‌కి అభిముఖంగానే ఉంది.
రాదుల్ తనకు తాను ఒక గ్లాసులో ఎనాబ్ పోసుకుని, ఇమే వెనుక కొంత డేటాను చూసుకున్నాడు. ఇమే జుట్టు చక్కగా కత్తిరించబడింది, అతని బట్టలు నిరాడంబరంగా ఉన్నప్పటికీ బాగా సరిపోయాయి. రాదుల్ లెక్స్‌లో ఇమే ప్రాథమిక వివరాలను చూశాడు. ఇమే ఉన్నత విద్యా విభాగంలో చదువును పూర్తి చేసి ఇప్పుడు అయోనాలో మేనేజర్‌గా ఉన్నాడని అతనికి తెలుసు. ఇమే గ్రూప్ హౌస్‌లో కాకుండా ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడని రాదుల్‌కి తెలుసు. ఇమే, తన వివరాలు కూడా చదివి ఉంటాడని అతనికి ఖచ్చితంగా తెలుసు. అందుకే అతను తనతో ఎక్కువ మాట్లాడడంలేదనీ, అందుకే ఇప్పుడు తనకి వీపు చూపిస్తూ కూర్చున్నాడని రాదుల్ గ్రహించాడు. రాదుల్ సంకల్పం గట్టిపడింది. తన పట్ల ప్రజల ఈ ప్రవర్తనను మార్చబోతున్నాడు. అందుకే సైనెడ్‌లో చేరాడు.
“ఇమే, నువ్వు ఇక్కడ అయోనాలో ఏం చేస్తుంటావు?” సంభాషణను ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా రాదుల్ అడిగాడు.
ఇమే మెల్లగా అతనికి వైపుకి తిరిగాడు.
బహుశా కొంత సంభాషణ తర్వాత, రాదుల్ వెళ్లిపోతాడని ఇమే భావించాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో రాదుల్ కూచుని ఉన్నాడు. అతని వెంట్రుకలు కుర్చీ వెనుక భాగంలో చిందరవందరగా ఉన్నాయి, అప్పటికే ఎనాబ్ గ్లాసు ఖాళీగా ఉంది. అతని లేత పసుపు చొక్కా అతని భుజాల క్రిందకి జారి వేలాడుతోంది, అతని ప్యాంటు వదులుగా ఉంది.
“గెలాక్సీలను చూస్తాను, గ్రహాల కదలికలపై నిఘా ఉంచుతాను. విశ్వంలో ఫ్రీక్వెన్సీలు, తరంగాలు, అలలు లేదా మరేదైనా కదలికలను పర్యవేక్షించడం నా పని. నన్ను నేను అప్‌డేట్‌గా ఉంచుకోవడానికి పరిశోధన, ఇంకా అధ్యయనం కూడా చేస్తాను. ఇక్కడ ఉన్న పరికరాలను అప్-టు-డేట్‌గా, ఇంకా ఒక క్రమ పద్ధతిలో ఉంచడం కూడా నా పనిలో ఒక భాగం”, ఏ మాత్రం ఉత్సాహం లేకుండా వివరించాడు ఇమే.
తన గ్లాసులో మరికొంత ఎనాబ్ పోసుకుంటూ నవ్వాడు రాదుల్. అంతరిక్షంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది. రాదుల్ వెళ్ళిపోవాలని ఇమే కోరుకుంటుంటే, రాదుల్ మాత్రం సంభాషణ కొనసాగించడానికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు.
“నీకు పాటిక్స్ ఎలా తెలుసు?” అన్నాడు రాదుల్. ఇమేని మాట్లాడించాలని అతని ఉద్దేశం. ఇమే తన పట్ల శ్రద్ధ వహించాలని, తన పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని అతను కోరుకున్నాడు. పైగా ఇప్పుడు, తాను, సైనెడ్ సభ్యుడు.
“చాలా కాలం క్రితం, కొన్ని పరిశోధనలలో నేను పాటిక్స్‌కి సహకరించాను”, ఇమే నిట్టూర్చి బదులిచ్చాడు. కుర్చీలో జారబడి కూర్చున్న ఆ వ్యక్తి, ఎనాబ్‌ను అతిగా తాగడం అంత తేలికగా వదులుకోలేడని ఇమే గ్రహించాడు.
“ఇమే, గత అనేక జాక్‌లుగా, మన వద్ద ఒక్క క్రియేషన్ కూడా లేకపోవడం నీకు బాధ కలిగిస్తోందా?” అని రాదుల్ ప్రశ్నించాడు. క్రియేషన్స్- అతను సైనెడ్ యొక్క మొదటి సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించుకున్నాడు, కానీ లెక్స్ నియమాలు అతని ఆలోచనను అడ్డుకున్నాయి.
క్రియేషన్స్? ఇమే అవాక్కయ్యాడు. వాటి గురించి అతనెన్నడూ అస్సలు ఆలోచించలేదు, పైగా రాదుల్ చెబుతున్నవి సరైన వివరాలో కాదో కూడా అతనికి తెలియదు. వెంటనే లెక్స్‌లో చూశాడు. ఆ సమాచారం సరైనదే. “దానిపై సైనెడ్ కొన్ని వందల జాక్‍ల క్రితం తాత్కాలిక నిషేధం విధించింది. అందుకే..” అని చెప్తుంటే,
రాదుల్ అడ్డొచ్చి, “ఎందుకో తెలుసా? ఎందుకంటే పురుషులు తమ సృష్టి యొక్క సామర్థ్యాలను నిర్వచించాలనుకున్నారు!” అన్నాడు. అతను లెక్స్ హైవేస్ నుండి క్రియేషన్స్ గురించి ఈ సమాచారాన్ని సేకరించాడు. అతను అదే పంథాలో చెప్పసాగాడు, “ఇంతకుముందు, భౌతిక లక్షణాలకు సంబంధించి ప్రత్యేక వివరణలు ఉండేవి, కానీ పురుషులు ఇతర లక్షణాలను కూడా పేర్కొనాలని కోరుకున్నారు. ఈ తాత్కాలిక నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత అనేక చర్చోపచర్చలు జరిగాయి. ఇప్పుడు, వందకు పైగా జాక్‌ల తర్వాత, మనం కూడా సృష్టించగలమన్న సంగతి దాదాపు మర్చిపోయాము”, చెప్పాడు రాదుల్ తన గ్లాస్‌లోని ఎనాబ్‌నంతా ఒక్క గుక్కలో తాగేసి, గ్లాసులో ఇంకొంచెం ఒంపుకుంటూ. ఇమే నిశ్శబ్దంగా అతని మాటలు వింటూ కూర్చున్నాడు.
“అయితే, నీకు తెలుసా ఇమే, గైనేక్ (9) సృష్టిస్తూనే ఉంది. ఫెన్స్ (10) కి అటు వైపు, క్రియేషన్ కొనసాగుతోంది, వారి సంఖ్య పెరుగుతోంది. మనం మాత్రం లెక్కలేనన్ని జాక్‌ల నుంచి అదే స్థాయిలో ఉండిపోయాం”, రాదుల్ దీర్ఘాలు తీస్తూ చెప్తున్నాడు.
రాదుల్ గైనేక్ ప్రస్తావన తెచ్చిన మరుక్షణం, ఇమే ఆ సంభాషణపై ఆసక్తిని కోల్పోయాడు. ఎలోన్‌లో ఒక చిన్న మైనారిటీ ఉంది, వీరికి గైనేక్ పదం యొక్క ప్రతి అర్థంలోనూ ప్రత్యర్థే; గైనేక్ వారి ప్రతి ఆలోచనను మసకబారించింది. వారితో ఊహాత్మక వివాదాలు, పోటీలు ఈ పురుషుల ఉనికికి మార్గం. కానీ మెజారిటీ జనాలు ఇమే లాగా ఉన్నారు – వారు మరోవైపు గైనేక్ గురించి తెలుసుకుని జీవించారు, కానీ వారి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.
“సరే, ఇమే, నేను నీకు చెప్తాను. ఇది మారబోతోంది. క్రియేషన్ పై ఈ తాత్కాలిక నిషేధమే నేను సైనెడ్‌లో మాట్లాడబోయే మొదటి అంశం. గత సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకురావాలనుకున్నాను, కాని వారు లెక్స్‌ను అనుమతించలేదు, నేనేం చెప్పాలనుకున్నానో నాకు గుర్తురాలేదు. కానీ, ఇప్పుడు నా బుర్రలోనే ఉంది..” అంటూ, అటూ ఇటూ తిరగసాగాడు రాదుల్.
“తాత్కాలిక నిషేధం తొలగించాల్సిన అవసరం ఉందని ఎందుకు అనుకుంటున్నావు? గైనేక్‌కి అది లేనందు వల్లా? పురుషుల దృక్కోణం నుండి దాని గురించి ఆలోచించావా? నిజానికి, నేను నిన్ను అడగాలని అనుకుంటున్నా, నువ్వే క్రియేషన్‌కి వెళ్లాలనుకుంటున్నావా?” ప్రశ్నల వర్షంతో రాదుల్ యొక్క మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అనుకున్నాడు ఇమే.
అది పని చేసింది, రాదుల్ మౌనంగా ఉండిపోయాడు. అతను సైనెడ్ దృష్టిని ఆకర్షించడానికి ఏదో ఓ అంశాన్ని తీసుకున్నాడు, కానీ దాని మీద ఎక్కువగా ఏమీ ఆలోచించలేదు. అక్కడ కూర్చొని, ఇమే ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉండగా, రాదుల్ ఆలోచనలు ఫెన్స్‌కి అవతలివైపు ఉన్న గైనేక్‍ల వైపు మళ్ళాయి. వారి ఉనికి తనను ఇబ్బంది పెట్టిందని అతనికి తెలుసు. వారి ఉనికి అతని మనసు నీడల్లో దాగి ఉంది. పురుషులు వారితో గ్రహాన్ని ఎందుకు పంచుకోవాల్సి వచ్చింది?
“అదంతా నాకు తెలియదు, కానీ మన గ్రహంలో సగభాగం ఆక్రమించిన గైనేక్స్ కొద్దిరోజుల్లో మన సంఖ్యను మించిపోతారని ఎవరూ ఎందుకు ఆందోళన చెందడం లేదనేదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది”, అంటూ రాదుల్ తన మూడవ గ్లాసు ఎనాబ్‌ని ఒక్కసారిగా కిందకి దించాడు.
“ఫెన్స్ ఏర్పడినప్పటి నుంచి వారితో మనకు ఎలాంటి గొడవలు, తగాదాలు లేవు. అలాంటప్పుడు, వారి ఉనికి మనలో కొందరిని ఎందుకు అంతగా ఇబ్బంది పెడుతుంది?” రాదుల్ మాటల్లోని వీరావేశంతో ఇమే అవాక్కయ్యాడు.
అయితే, అప్పటికే, రాదుల్ చాలా మత్తులో ఉండి, పొందికగా సమాధానం చెప్పలేకపోయాడు. అతను ఇమేని చూసి నవ్వి, దాదాపు ఖాళీగా ఉన్న ఎనాబ్ బాటిల్ కోసం చేరుకున్నాడు. ఇమే బాటిల్‌ని దూరంగా నెట్టాడు. అతను రాదుల్ చేయి పట్టుకుని ఎగ్జిట్ వైపు నడిపించాడు. రాదుల్‌ని అతని గ్రూప్ హౌస్ వైపు తీసుకెళ్ళేలా లెక్స్ ద్వారా సంప్రదించి, ఒక ట్రావెలర్‌లో అతన్ని కూర్చోబెట్టాడు.
ట్రావెలర్ ముందుకు దూసుకుపోగానే, ఇమేని చీకటి ఆవరించింది. అతను ఫెన్స్ వైపు చూశాడు. చాలా జాక్‌ల తర్వాత, అతను గైనేక్ గురించి చురుకుగా ఆలోచించాడు. గ్రహం మీద వారి ఉనికి ఏ విధంగానూ అతివ్యాప్తి చెందలేదు. గత యుద్ధం నుండి అన్ని జాక్‌లలో, ఇరుపక్షాలు ఈ గ్రహాన్ని పంచుకోవడం, శాంతితో సహజీవనం చేయడం నేర్చుకున్నాయి.
ఇమే తన వర్క్‌స్టేషన్‌కి తిరిగి వెళ్ళాడు. రాదుల్‌తో జరిగిన సంభాషణ అతన్ని కొంత కలవరపరిచింది. చాలా జాక్‌ల పాటు, భూమి నుండి జాతులు ఎక్కడికి వెళ్లి ఉంటాయో అని ఇతర గ్రహాల కోసం ఇమే నిరంతరం శోధిస్తున్నాడు. పురుషులు, గైనేక్స్ కాకుండా ఇతర జాతులు వేరే గ్రహానికి వలస వెళ్లవచ్చని అతను నమ్మాడు. అయితే, జాక్స్ గడిచేకొద్దీ, ఇమే విశ్వంలో ప్రతిధ్వనించే వింత నిశ్శబ్దాన్ని మాత్రమే గుర్తించగలిగాడు. పురుషులు, గైనేక్ తప్ప, అంతులేని విశ్వంలో మరే ఇతర జాతులు ఉనికిలో లేవు.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం
(2) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(4) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి
(5) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం
(6) Lex, లెక్స్ = సమాచార పరికరం
(7) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(8) Creation, క్రియేషన్ = సంతానం
(9) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం
(10) Fence ఫెన్స్= సరిహద్దు
—
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.