Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆశ లేని మంచి మనిషి

[బాలబాలికల కోసం ‘ఆశ లేని మంచి మనిషి’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

రంగారావు ధనవంతుడు. ఆయనకు ఒక్కతే కూతురు వేదవల్లి. బాగా చదువుకుని మంచి జ్ఞానం గల అమ్మాయి.

ఆమె కొన్ని కథల పుస్తకాలు కూడా వ్రాసింది. ఆ పుస్తకాలకు వివిధ సాహిత్య సంఘాల నుండి బహుమతులు కూడా లభించాయి. అలా ఆమె పేరు ఊరులో మంచి సాహితీవేత్తగా కూడా సాహితీవేత్తలకు తెలిసింది.

మరి ఆమెకు పెండ్లి చేయాలి కదా! ఈ విషయం వేదవల్లికి చెబితే, “నాన్నా, నన్ను పెండ్లి చేసుకోవాలని వచ్చేవారు కేవలం మన ధనం చూసి రాకూడదు. వాళ్ళలో అతి డబ్బు ఆశ ఉండకూడదు. సాహిత్యాన్ని అభిలషించే వాడై ఉండాలి. మీరు ఇవన్నీ గమనించి నాకు తగిన వరుణ్ణి నిర్ణయించండి” అని వివరంగా చెప్పింది వేదవల్లి.

“సరేనమ్మా” అంటూ ఆయన చిరునవ్వుతో అంగీకరించాడు.

ఆయన పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి తన కూతురుకు తగిన వరుణ్ణి వెతికి పెట్టమని చెప్పాడు.

“అయ్యా తమ కూతురుకి తగిన సంబంధాలు మూడు నా వద్ద ఉన్నాయి. వాళ్ళలో ఇద్దరు పుట్టుకతోనే ధనవంతులు. మరో వ్యక్తి కూడా డబ్బున్న వ్యక్తే కానీ మిగతా ఇద్దరితో పోలిస్తే కొంత ధనం తక్కువ ఉన్నవాడు” వివరించాడు పేరయ్య.

“పరవాలేదు, ముగ్గురినీ వేరు వేరు రోజుల్లో రమ్మనండి. వారిని గురించి వారి అభిరుచుల గురించి తెలుసుకుంటాను” చెప్పాడు రంగారావు.

అలా రెండు రోజుల తరువాత పేరయ్య ఒక వ్యక్తితో వచ్చాడు. అతను తన గురించి తన ఆస్తి, డబ్బు గురించి గొప్పగా చెప్పుకుని కట్న కానుకలు తన తండ్రితో మాట్లాడమని చెప్పాడు. ఈ సంభాషణ అంతా వేదవల్లి చాటు నుండి గమనిస్తూనే ఉంది.

“నాన్నా ఈ సంబంధం వద్దు. అతని ఆలోచనలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. ఏ మాత్రం కళాదృష్టి లేదు” చెప్పింది వేదవల్లి.

మరో రోజు పేరయ్య రెండో వ్యక్తిని తీసుకువచ్చాడు. అతను అంతే. అతనికున్న ఆస్తులు ఇంకా తాను చెయ్యబోయే వ్యాపారాలను గురించి చెప్పాడు. అంతే కాని వేదవల్లి అభిరుచులు, వివిధ వేరే విషయాలు మాట్లాడలేదు. ఈ సంబంధం కూడా వేదవల్లికి నచ్చలేదు. అందుకే మీ సంబంధం వద్దు అని కబురు పంపించారు.

మరో రోజు పేరయ్య మరో వ్యక్తిని తీసుకువచ్చాడు.

“రంగారావుగారు, నా పేరు సోమనాథ్. నాకు తాతల నాటి ఆస్తులు లేవు, ఏదైనా నేను కష్టపడి సంపాదించుకున్నదే. పోతే మీ అమ్మాయి వ్రాసిన కథల పుస్తకాలు నావద్ద ఉన్నాయి. మా ఇంట్లో నాకొక చిన్న గ్రంథాలయం ఉంది. నాకు చిన్నప్పటినుండి సాహిత్యమంటే అభిలాష. నేను కూడా ప్రస్తుతానికి ఓ బాలల నవల వ్రాశాను, ఇక ప్రచురించాలి. మరో ముఖ్య విషయం మాకు కట్న కానుకలు ఏవీ వద్దు. నాకు గానీ మా తల్లిదండ్రులకు గానీ కట్నం తీసుకోవడం ఇష్టం లేదు” అని చిరునవ్వుతో చెప్పాడు.

చాటు నుండి అతను చెప్పినవన్నీ విన్న వేదవల్లి ముఖం ఆనందంతో వెలిగింది.

“నాన్నా సోమనాథ్ సంబంధం ఖాయం చేయండి, మంచిరోజు చూసి ఆయన తల్లిదండ్రులతో మాట్లాడండి” చెప్పింది వేదవల్లి.

రంగారావు తన కూతురు మాటలకు సంతోషించి ఇంట్లో అందరికీ మిఠాయిలు పంచాడు.

Exit mobile version