[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘ఆశావాదం ఆయుధంగా..’ అనే కవితని అందిస్తున్నాము.]
ముచ్చట్లతో మురిపించి.. మైమరపించి..
కడగండ్లతో కన్నీటి ధారలు కురిపించి..
పరుగిడి పరుగిడి.. పుచ్చుకున్నది శెలవు
పాతబడ్డ కొత్త సంవత్సరం..!
మూడువందల అరవైఅయిదు రోజులు..
మరో విధంగా పన్నెండు నెలలు..
ప్రతీనెలా దేనికదే ప్రత్యేకం!
పరవశింపజేస్తూ ఒకసారి..
విషాదంలో ముంచేస్తూ మరోసారి..!!
జీవితమంటే పరిమళాలు వెదజల్లే
పూలతోట మాత్రమేనా.. కాదు కాదు..
గుచ్చుకునే పదునైన ముళ్ళు
పరుచుకున్న రాళ్లబాట కూడా..
అంటూ గుణపాఠాలు నేర్పి..
తీపి..చేదు అనుభవాల జ్ఞాపకాల
దొంతరలను మదిని పేర్చి..
గతంలోకి జారుకున్నది..!!
అదిగో! అడుగిడింది.. మరో వత్సరం..
వినూత్న రీతిని ముస్తాబై..
తెలతెలవారుతుండగా..
మంచు తెరలను చీల్చుకుని
మల్లెల సౌరభాలు వెదజల్లుతూ..
మనకోసమే.. మనకోసమే..
మనందరి కోసమే.. వడివడిగా
కదిలి కదిలి.. ముంగిట వాలింది..
కష్టసుఖాలు కావడికుండలని
అందుకున్న సందేశం నమ్మేద్దాం..
గతంలో బ్రతకడం మానేద్దాం..
వీడ్కోలుతో అధ్యాయం ముగిస్తూ..
ఆశావాదం ఆయుధంగా
అడుగులు వేస్తూ సాగుదాం..
వర్తమానానికి చేతులు చాస్తూ..
కలలకు కొత్త ఊపిరులు పోద్దాం..
ఇదిగో.. ఇదిగో.. వచ్చేసిందిగా..!
మరోసారి స్వాగతిద్దాం..
నూతన సంవత్సరమా..
స్వాగతం.. సుస్వాగతం..
మా జీవన గమనంలో
మధురిమలు నింపుమా..
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
