Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆశయాల పందిరి

[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘ఆశయాల పందిరి’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

గోదావరి జిల్లాలో ఒక గ్రామం. పల్లెకు ఎక్కువ,పట్టణానికి తక్కువ. చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కొబ్బరి చెట్లతో పచ్చగా కళకళలాడుతోంది. చాలా వరకూ ఇళ్ల కాంపౌండ్ వాల్స్ సిమ్మెంటుతో కట్టినవే. ఆ వీధి మొదట్లో ఇల్లు మాత్రం కొంచం ప్రత్యేకంగా ఉంది. ఇంటి ముందు తాటాకుల పందిరి. ఇంటి గేటుకి ఒక పక్క తుమ్మ చెట్టు, మరోపక్క మామిడి చెట్టు, పెరట్లో వేప చెట్టు, చుట్టూ కొబ్బరి చెట్లు మల్లె పందిరి ఉన్నాయి. ఇంకా రకరకాల మందారాలు విరగబూసాయి. చుట్టూ బోలెడు ఖాళీస్థలం. ఆ ఇంటి ఆడపిల్ల ఆరవి.

ఆరవికి మొక్కలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల నాన్నతో పొలానికి వెడుతుండేది. ఆరవి అమ్మ అవంతిక, నాన్న గౌతమ్. గౌతమ్ పెద్ద చదువులే చదివినా వ్యవసాయం మీద అపేక్షతో సొంత ఊరిలో మకాం పెట్టాడు. అక్కడే ఉన్నత పాఠశాలలో చదువుకుంది ఆరవి. తెలివైనది, చదువులో,ఆటపాటల్లో చురుకైనది. తన ఊరు, ఇల్లు చాలా ఇష్టం.

ఆ ఇంటి గేటు తీయగానే పక్కన ఒక అరుగు. అరుగు పైన పెంకులతో పైకప్పు. అరుగు మీద ఒక బెంచీ, నాలుగు కుర్చీలుంటాయి. ఎవరైనా వస్తే అక్కడే ఆరవి నాన్న కూర్చుని మాటాడుకుంటుంటారు. అక్కడే రోజూ దిన పత్రిక చదవుతుంటాడు.

ఆరవి చెన్నైలో ఇంజనీరింగ్ ఎమ్.టెక్ చేసింది. హైదరాబాదులో ఓ మంచి కంపెనీలో ఉద్యోగం  చేస్తోంది.

కానీ ఆరవి దృష్టంతా తన ఊరు, పొలాల మీదనే ఉంటుంది. రసాయన ఎరువులతో ప్రజలు ఎలా అనారోగ్యాల పాలవుతున్నారో చూస్తోంది. చాలానే ఆర్గానిక్ ఉత్పత్తులు వస్తున్నాయి. కానీ అవి ఎంత మంది కొనగలరు! ఇలా ఆలోచిస్తుంది ఆరవి.

తన కల ఏంటంటే కల్తీలేని పాలు, రసాయనాలు వాడని సహజ కూరగాయలు, పండ్లు, పంటలు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పండించి మధ్య తరగతి ప్రజలకు కూడా అందించాలని.

అయితే ఆడపిల్ల అనగానే ఎన్ని చదువులు చదివించినా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయాలనే ఆరాటం తల్లిదండ్రులకు సహజం. అలాగే ఆరవి తల్లిదండ్రులు కూడా సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. సంప్రదాయాలు,కట్టుబాట్లు ఉన్న మధ్య తరగతి కుటుంబం. ఆరవి కూడా బుద్దిమంతురాలు, చక్కని అమ్మాయి. అందుకే సంబంధాలు కూడా చాలా వస్తున్నాయి.

ఇంట్లో ముద్దుగా ఆరూ అని పిలుస్తారు. “ఆరూ ఈ ప్రొఫైల్స్ చూడు. అందరూ వెల్ సెటిల్డ్. అబ్బాయిలు కూడా బాగున్నారు. నీకు ఎవరైనా నచ్చుతారేమో చూడు తల్లి” అంది కొన్ని అక్కడ టీపాయ్ మీద పెడుతూ.

ఆరు తనకేం పట్టనట్టు కూర్చుని టి.వి చూస్తోంది. తండ్రి గౌతమ్ కూతురినే గమనిస్తున్నాడు.

“అవంతీ తరువాత చూస్తుందిలే. నువ్వు వంట ప్రయత్నం చెయ్యి” అన్నాడు ఇప్పుడు మాటాడొద్దని అన్నట్టు.

ఒక రోజు ఏదో చదువుకుంటున్న ఆరు గదిలోకి వచ్చి “అమ్మా ఆరవి” అని పిలిచాడు.

“కూర్చోండి నాన్నా” అంటూ కుర్చీ ముందుకు జరిపింది.

కూర్చుంటూ “అవంతి కాఫీ తీసుకురా” అన్నాడు.

“కాసేపు మాటాడదామని అమ్మా! ఆడపిల్లని ఎంత చదివించినా ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే కదరా. ఆలస్యం అయితే నలుగురూ ఏమనుకుంటారు!” అన్నాడు కొంచం అనునయంగా.

అవంతిక కాఫీలు ఇచ్చి అక్కడ మంచం మీద కూర్చుంటూ “అప్పుడే మొదలెట్టేశారా తండ్రి కూతుళ్లు” అంటుంటే “అది కాదమ్మా నువ్వుండు. నాన్నా మీరు అమ్మ కూడా చదువుకున్నారు. ఇంకా ఇలాగే ఆలోచిస్తున్నారా!” అంది బాధగా.

“నాకు పెళ్లి చేసేసి అత్తారింటికి పంపేస్తే మీ బాధ్యత తీరిపోతుందనా నాన్నా? అమ్మా నన్ను మనిషిగా చూడండి. అందరిలానే నాకూ కొన్ని ఆశయాలు, కలలుంటాయి. వాటికి విలువ ఇవ్వరా.” అంది ఆవేదనగా.

“నా తపన, తెలివితేటలు ఈ ఉద్యోగానికో, వంటగదికో మాత్రమే పరిమితం చేయలేను నాన్నా. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి”అంది బాధాతప్త హృదయంతో.

అవంతిక కళ్లతో చేసిన సైగను చూసి “సరేలే అమ్మా! తరువాత మాటాడుకుందాం” అంటూ అలా పొలం వెళ్లొస్తానంటూ బయటకు నడిచాడు.

***

ఇలా నాలుగు రోజులు గడిచిపోయింది.

ఒకరోజు “నాన్నా మనం సరదాగా కాఫీ, టిఫిన్ పట్టుకుని ముగ్గురం పొలం వెడదామా” అంది ఆరవి.

“వై నాట్ రా తల్లి! అవంతి తెమలగలవా” అంటుంటే అవంతి “వంటమొదలు పెట్టేశానండి. ఈరోజు టిఫిన్ చేయలేదు. ఓ అరగంటలో పూర్తైపోతుంది. కారేజి,కాఫీ పట్టుకుని వెళ్దాం” అంది.

ఇంతలో గౌతమ్ మంచినీళ్ళ గ్లాసులు, కాఫీ గ్లాసులు, టవల్, ఒక చాప, ఒక దుప్పటి ఇలా కావలసినవి కారులో సర్ది పెట్టాడు.

గబగబా తెమిలి అవంతి కూడా రెడీ అయింది.

“పదండి” అంటూ బయటకు వచ్చింది.

కారు పొలంవైపు పరిగెత్తింది ఆరు మనసులాగనే. కారు పచ్చని పొలాలమధ్య రోడ్డు వారగా ఆగింది.

కారు చూసి శ్రీను పొలంలో చేస్తున్న పని ఆపి “గౌతమ్ బాబుగారు ఏటండందరూ వచ్చేశారూ పికినిక్కా” అన్నాడు సరదాగా లోపల బ్యాగులు అవీ తీస్తూ.

“ఇంచుమించు అంతే శీను. అలా పోయి నాలుగు అరిటాకులు కోసుకురా. మీ ఆవిడ లక్ష్మిని కూడా రమ్మను.” అన్నాడు గౌతమ్.

కాసేపు పొలమంతా తిరిగి బోరు దగ్గర కాళ్లు కడుక్కుని చెట్ల కింద వేసిన చాప మీద కూర్చున్నారు.

అవంతిక “కొంచం జంతికలు తెచ్చాను. అవి తింటూ కాస్త కాఫీ తాగుదాం.” అంది డబ్బా ఓపెన్ చేస్తూ.

ఆరు “వావ్! అమ్మా మంచి పని చేశావ్ నాకిష్టమైన జంతికలు తెచ్చి.” అంటూ హుషారుగా తను ప్లేట్లు తీసి వాటిలో వేసింది. ఇంతలో కాఫీ కప్పుల్లో పోసింది అవంతిక.

భార్యాభర్తలిద్దరూ ‘ఏదో ఉంది’ అనుకుంటూ ఆలోచిస్తున్నారు.

వారిని గమనించిన ఆరు “ఏమీ లేదు నాన్నా మనం హాయిగా మనసు విప్పి మాటాడుకుందాం” అంది ప్రశాంతంగా.

“అమ్మా! నేను కొంత కాలం సెలవుపెడదామనుకుంటున్నా” అంది వారిద్దరికేసి చూస్తూ.

‘అయితే’ అన్నట్టు చూశారిద్దరూ.

“నాన్నా! నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. విని ఆలోచించండి, అర్థం చేసుకోండి. నేను పనిచేసే హైదరాబాద్‌కు దగ్గరలో ఓ పదెకరాలు పొలం కౌలుకుతీసుకుందామని అనుకుంటున్నాను.” అంటుంటే మధ్యలో కంగారుగా “పొలమా! నువ్వా” ఆశ్చర్యం ఆందోళనలతో అన్నారు.

“ఏంటమ్మా అంత కంగారు! ఆడపిల్లలంటే మనుషులు కారా! అమ్మా! నాకూ కొన్ని ఆశయాలు,లక్ష్యాలు ఉన్నాయి. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మీకూ తెలుసు. రసాయనాలు మనుషులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉచిత సేవకాదు కానీ, సాధ్యమైనంత వరకూ అందరికీ రసాయన ఎరువులు లేకుండా సహజ పద్దతుల్లో పంటలు పండించి సహజాహారాన్ని అందుబాటులోకి తేవాలని ఆశ. అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేయగలిగే ధరలతో వారందరికీ అందుబాటులోకి తేవాలని.” అంది ఆవేశంగా.

“స్వచ్ఛమైన ఆహారం, సహజాహారం అంటే ప్రజలు తెలుసుకునేలా చేయాలి.” అంటున్న ఆరు మాటలకు నిశ్చేష్టులయ్యారు.

“అమ్మా! ఆరవీ నాన్న ఈ వ్యవసాయంలో ఎంత కష్టపడుతున్నారో మనకందరికీ తెలుసు. నువ్వేమో అపురూపంగా పెరిగావు. ఇవేం పిచ్చి ఆలోచనలురా తల్లి!” అంది బాధగా కూతురు వంక చూస్తూ.

గౌతమ్ “వ్యవసాయం చేయడమంటే చాలా కష్టమైన పని ఆరూ.  దీని గురించి మనకంత అనుభవం లేదు.

పైగా చాలా డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి. నేనైతే ఇవ్వలేను. ఏదో ఓ ఆరెకరాలు పాలుకి చేస్తున్న నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా. ఆడపిల్లవి, ఎలా చేయగలవని మా దిగులు. కాస్త ఆలోచించు తల్లి. ఈ మతి మాలిన ఆలోచనలు మానుకో. మంచి సంబంధం చూసి పెళ్లి చేయవలసిన బాధ్యత మాది” కాస్త కఠినంగా అన్నాడు.

ఆరవి తమాయించుకుంది.

‘అమ్మా నాన్నలు కదా!వాళ్లు అలా ఆలోచించడం సహజం.’ అనుకుంటూ

చాలా దృఢంగా, స్థిరంగా “అమ్మా! నాన్నా! వ్యవసాయం చేయాలనే నా నిర్ణయం మారదు. తల్లిదండ్రులుగా మీ సహకారం, ప్రోత్సాహం అందించితే సరే, లేదా కనీసం నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరే అంటుంటారు కదా  అమ్మాయైనా, అబ్బాయైనా సమానమేనని, అన్నయ్యతో పాటు నన్నూ చదివించారే. అన్నయ్య అడగ్గానే అమెరికా పంపించారు. నేను ఇక్కడే నేనెంచుకున్న రంగంలో పనిచేస్తానంటే”అంటున్న ఆరు మాటలకడ్డొస్తూ “ఆడపిల్లకి పెళ్లనేది ఒక భద్రత తల్లీ. సమాజం బంధువులు కూడా రకరకాలుగా మాటాడుకుంటారు” అన్నాడు నచ్చజెపుతూ.

అలసిపోయిన ఆరవి ఓపిక కూడగట్టుకుని “అమ్మా మీరిద్దరూ ప్రశాంతంగా ఆలోచించండి. రేపు ఉదయం మాటాడుకుందాం. ఇక ఇంటికి వెళ్లిపోదాం” అంది.

ఇంటికి వెళ్లాక “అమ్మా! నాకు ఆఫీసు పని చాలా ఉంది.” అంటూ గదిలోకెళ్లి లాగిన్ అయింది.

చూస్తుండగానే రాత్రి 8 అయిపోయింది. “ఆరవి భోజనానికి రా” అంటూ పిలిచింది అవంతిక.

“స్నానం చేసి వస్తా” అని గబగబా వచ్చి తిన్నాననిపించుకుని “అమ్మా!నాన్నా! నిద్ర వస్తోంది పడుకుంటా” అని గదిలోకెళ్లిపోయింది.

మంచంపై వాలగానే ఎన్నో ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి.

‘ఏంటో కాలం మారింది. ఎన్నో మార్పులొచ్చాయి. ఆడపిల్లలు మగపిల్లలకన్నా ఓ మెట్టు పైనే ఉన్నారు. కానీ ఆడపిల్ల స్వతంత్రంగా ఆలోచించడం అనే భావన ఇంకా ఎదగలేదు తల్లిదండ్రులలో. చదువు, పెళ్లి, పిల్లలు ఇదే జీవితం. ఇదొక చట్రం.

అయినా నేను పెళ్లి చేసుకోననలేదే! ముందు నాకు నచ్చిన రంగంలో కృషి చేసి నిలదొక్కుకుని, వాళ్లు చూసిన నచ్చిన సంబంధమే చేసుకుంటానన్నా కదా!’ అనుకుంటూ నిద్రాదేవి ఒడిలోకెళ్లిపోయింది.

***

ఆ రోజు శనివారం. స్నానంచేసి, జుత్తు ఆరబెట్టుకుంటూ హాల్లోకి వచ్చింది ఆరవి. 6 గంటలు అయినట్టుంది. వెంకటేశ్వర సుప్రభాతం వస్తోంది. అమ్మ పెట్టినట్టుంది. నాన్న పూజ పూర్తయింది. అగరు బత్తి గంధపు సువాసనలు ఇల్లంతా పరిమళిస్తున్నాయి.

వంట గదిలోంచి ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు హాల్లోకి వచ్చి మరీ ఊరిస్తున్నాయి. అవంతిక బయటకు కాఫీ గ్లాసులు ట్రేలో పెట్టి తీసుకు వచ్చింది.

తండ్రీ కూతుళ్లకు చెరో గ్లాసు ఇచ్చి తనో గ్లాసు తీసుకుని వారిద్దరికీ ఎదురుగా కుర్చీలో కూర్చుంది.

“చల్లారిపోకుండా తాగండి, మాటాడుకుందాం”  అంది కొంచం ప్రశాంతంగా.

తాగేసిన కాఫీ గ్లాసు పక్కన పెట్టి అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మెల్లగా మంద్రస్వరాన “నేను మీ మాట కాదనడం లేదు.మీరు నాకోసమే ఆలోచిస్తున్నారనీ తెలుసు. నాకు ఇష్టమైన జీవితాన్ని ఎంచుకుని, నా కలలను సాకారం చేసుకోవాలని; ఎలాగైనా విజేతను కావాలని నా ఆకాంక్ష. తరువాత మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానమ్మా! దీని గురించి బాగా స్టడీ చేసాను. చాలామందిని కలుసుకున్నాను. ఒక్క సంవత్సరం వ్యవధి ఇవ్వండి నాకు. నేనేంటో మీ అందరికీ తెలియచేస్తాను. మీరందరూ గర్వపడేలా చేస్తాను. నా మాట నమ్మండి నాన్నా” అంది కాస్త ఆవేశంగా.

“నేను విజయం సాధించినా లేకున్నా మీరు చెప్పినట్టే చేస్తాను. నా మాట నమ్మండి” అంది బతిమాలుతూ.

గౌతమ్ మూర్ఖుడు కాదు. ఆలోచన లేనివాడసలే కాదు. విచక్షణ ఉన్న మనిషి. తన కూతురు చాలా దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో చెప్పిన మాటలు భార్యాభర్తలిద్దరినీ ఆకట్టుకున్నాయి.

“అయితే నువ్వు లక్షలు జీతమొచ్చే ఉద్యోగం మానేసి పలుగూ పారా పడతావన్న మాట” అన్నారు నవ్వుతూ.

తల్లిదండ్రుల చిరునవ్వు చూసి తేలికపడ్డ మనసుతో ఆరవి “అప్పుడప్పుడు సెలవులు పెట్టుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను నాన్నా” అంది నవ్వుతూ. “ఆ తరువాత కావాలంటే లాంగ్ లీవ్ పెడతా” అంది.

“అలా అయితే ఇక్కడ మేమిద్దరమే ఎందుకు! నీతోపాటే ఉంటాం.” అన్నాడు కూతురేమంటుందోనని ఆలోచిస్తూ.

“హేపీ నాన్నా! తప్పకుండా” ఎగిరి గంతేసినంత పని చేసింది.

అమ్మానాన్నల ఇద్దరి చేతులు తన చేతుల్లోకి తీసుకుని కళ్లకద్దుకుని ముద్దు పెట్టింది ఆనందంతో.

హైదరాబాదుకి గౌతమ్ అవంతికలు కూడా వెంటనే ఆరవితో కలసి షిఫ్ట్ అయిపోయారు. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో తీసుకున్నారు అద్దెకు.

***

ఉదయం 7 గంటలైంది.

వాకింగ్ పూర్తి చేసి వచ్చి బాల్కనీలో కూర్చుంది.

“నాన్నా! ఒకసారి ఇలా రండి” గట్టిగా పిలిచిన ఆరు పిలుపుకి బాల్కనీలోకొచ్చాడు గౌతమ్.

“నాన్నా కూర్చోండి. ఇక్కడకు సుమారు ఓ వంద కిలో మీటర్ల దూరంలో ములుగు అని ఒక గ్రామం ఉంది.

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఓ పదెకరాల పొలం ఆరేళ్లుగా పంటలు వేయకుండా ఆర్గానిక్ వ్యవసాయం కోసమని భూమిని వదిలేసాడట. అయితే అతనికి ఇండియా రావడం ఇంకా వీలు కాదట. నా రిక్వెస్ట్ చూసి ఫోన్ చేశాడు – ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. తను రెండు మూడు రోజుల్లో అమెరికా వెళ్లిపోవాలి, మాటాడుకుందాం రండని. అతని పేరు అభిరామ్” పట్టలేని ఆనందంతో చెప్పింది ఆరవి.

గౌతమ్ అవంతికలు మనసులోనే దేవునికి దణ్ణం పెట్టుకున్నారు – “ఇక ఎలాగూ సిద్దపడ్డాము కనుక మా కూతురికి మేలు చెయ్యి తండ్రీ” అని.

మర్నాడు భోజనాలవగానే అభిరామ్ ఇంటికి బయలదేరారు.

అభిరామ్ ఇల్లు ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న కమ్మూనిటీలో ఉంది.

అంత వత్తిడి కాదుగానీ కొంచం నర్వస్ గానే ఉంది. ప్రీ అప్రూవల్ పంపారు వాళ్లకి.

ఫస్ట్ ప్లోర్ వాళ్లది. కాలింగ్ బెల్ కొట్టింది.

సుమారు నలభై అయిదేళ్లుంటాయి. తెల్లని పంచ లాల్చీ వేసుకున్నారు. తలుపు తీసి వారిని చూస్తూ కొడుకు చెప్పిన వాళ్లని గుర్తుపట్టి వారిని లోపలకి ఆహ్వానించారు.

“నా పేరు ఆనంద్. మా అబ్బాయి అభిరామ్. నేను రిటైర్డ్ ఆర్మీ. ఇక్కడే బాంక్ లో పనిచేస్తున్నా మేనేజర్ గా కూర్చోండి” అంటూ పరిచయం చేసుకున్నారు.

“ఆరవి మా అమ్మాయి. ఈమె అవంతిక మా ఆవిడ. నేను వ్యవసాయం చేస్తున్నాను.”

ఉభయుల పరిచయాలు అయ్యాయి.

“అబ్బాయి వస్తాడు” అంటుంటే హాల్లోకి వస్తూ “హలో నేను అభిరామ్” అంటూ పరిచయం చేసుకున్నాడు.

తెల్లగా పొడుగ్గా ఒత్తైన ఉంగరాల జుత్తు,పెదాలపై చిన్న నవ్వు. ‘చాలా సింపుల్ గా ఉన్నాడు’ అనుకుంది ఆరవి.

ఆరవి లేచి విష్ చేయబోతుంటే తనే “హాయ్” అంటూ పలకరించి “కూర్చోండి” అన్నాడు తనూ కూర్చుంటూ.

ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తోంది ఆరవి. ముందుగా అభిరామే మాటాడాడు.

“వ్యవసాయం చేయడం చాలా కష్టం. చాలా ధైర్యం, సహనం కావాలి. అటువంటిది ఒక ఆడపిల్ల చేస్తాననడం,

అంటే ఆడపిల్లలు చేయకూడదని కాదు. తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలందించడం నన్ను చాలా ఇంప్రస్ చేసింది. సరే.. మరి కండీషన్స్ అన్నింటికీ అంగీకారమేనా!” అంటూ ఆరవి, ఆమె తల్లిదండ్రులకేసి చూస్తూ ఆగాడు.

ఆరూ కాస్త తేరుకుని “ఇక్కడ పొలం దొరకడమే కష్టం. అందునా నేననుకున్న సహజాహార పంటలకు అయితే నేను చాలాకాలం భూమిని పంటలు లేకుండా వదిలేయాలి. సహజ పంటల వ్యవసాయానికి సిద్ధం చేసిన పొలం దొరకడం నా అదృష్టం. మీరు సహృదయంతో, నమ్మకంతో పొలం కౌలుకివ్వడమే చాలా సంతోషం” కొంచం ఉద్వేగంగా అంది.

“మరి మీకు పొలం దూరమవుతుంది కదా” అన్నాడు సందేహంగా.

“మేము అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుంటాము. నేను కారులో వెళ్తాను డ్యూటీకి. ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ మూడు రోజులు.” అంది.

“బాగానే ఉంటుంది అలా అయితే ప్లానింగ్ బావుంది..” అంటుంటే అభిరామ్ తల్లి అపర్ణ కాఫీలు తెచ్చి ఇచ్చింది అందరికీ.

అవంతిక మొహమాట పడుతుంటే “ఏముందండి ఇందులో కప్పు కాఫీయే కదా” అంది.

ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక అందరూ ఒకసారి పొలం వెళ్లి చూసి వచ్చారు. ఆరవి ఆమె తల్లిదండ్రులు వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు.

ఆ తరువాత ఒక రోజు ఆరవి”నాన్నా బాంక్ వాళ్లకు మన సేంద్రియ వ్యవసాయం అన్న కాన్సెప్ట్ నచ్చింది. అందునా మధ్య తరగతి, సామాన్య ప్రజలకు కూడా అందించాలనే నా తాపత్రయం వారికి మరింత నచ్చింది.

ఫుల్ లోన్ శాంక్షన్ చేశారు.” అంది ఆనందంగా.

“అమ్మా నేనూ ఏమైనా డబ్బు” అంటున్న తండ్రిని “అవసరమైతే సర్దుబాటు చేద్దురుగాని. ప్రస్తుతం మీ సలహాలు, అనుభవం, సహాయం చాలా విలువైనవి నాన్నా! అవి చాలు” అంది.

ఆరవి మంచి రోజు చూసుకుని అమ్మానాన్నలతో ములుగు గ్రామానికి మకాం మార్చేసింది. కొత్తలో చాలా ఇబ్బందులు పడింది. తల్లిదండ్రుల తోడు ఉండటం ఒక ప్లస్ పాయింట్ తనకు. అయితే ఊళ్లోవాళ్లు, చుట్టు పక్కల వాళ్లు ఆడపిల్ల ఇంత దూరం వ్యవసాయం చేయడానికి వచ్చిందా అంటూ చెవులు కొరుక్కునేవాళ్లు. అదేమీ పట్టించుకోకుండా తన లక్ష్యం మీదనే గురిపెట్టింది.

ఒకసారి పెద్ద తుఫాను రావడం, నాలుగు రోజులు విపరీతమైన వర్షాలు పడటం నారుమడి దెబ్బతినడం చూసి తల్లడిల్లిపోయింది. తనకి చేదోడువాదోడైన యాదగిరి, గౌతమ్ కూడా అనునయించారు ఆరవిని.

గౌతమ్ “అమ్మా పూర్వం వ్యవసాయం జూదం లాంటిదనేవారు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే మట్టిని నమ్మినవాళ్లు చెడిపోరు.” అన్నాడు.

యాదగిరి “ప్రేమతో కూడిన కట్టంతో సాకిరి చేత్తే ఆ భూదేవి తల్లే మనల్ని అక్కున సేర్చుకుంటాదమ్మా . బిడ్డంటి దానివి ఇనుకోమ్మా! ఇందులో వ్యయ ప్రయాసలుంటాయి. కష్టనష్టాలుంటాయి. ఆటి నుండి మనం పాఠం నేర్చుకోవాల” అన్నాడు ప్రేమగా.

ఆరవి తండ్రి గౌతమ్ వ్యవసాయానుభవం ఉన్నవాడు. యాదగిరి కూడా అక్కడ స్థానిక పరిస్థితులు తెలిసిన వాడు, వ్యవసాయంలో అనుభవం ఉన్నవాడు. ఇద్దరూ కలసి సలహాలివ్వటం,ప్రోత్సహించడం చేసేవారు.

ప్రకృతిలో దొరికేవాటిని వినియోగించుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీలో మెలకువలు చెప్పారు. సరికొత్త పద్దతులైన బిందుసేద్యం అమలు పరిచింది. సోలార్ పంపులను వినియోగించింది. GPS, సెన్సార్లు, డ్రోన్‌లు AI వంటి సాంకేతికతలను ఉపయోగించి, పంటలకు అవసరమైన నీరు, సహజ ఎరువులు, సహజమైన పురుగుమందులను వాడటం వంటివి చేసింది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జీవవైవిధ్యాన్ని పెంచడం,వాతావరణ మార్పులను తగ్గించడం వంటి పద్ధతులను అమలు చేసింది.

ఇందులో అంతర పంటలు,బహుళ పంటల మిశ్రమ సాగు వంటివి కూడా వేసింది. అవి లాభదాయకం కూడా. గ్రీన్‌హౌస్‌లు, షేడ్ నెట్‌లు వంటి వాటిని వినియోగించి మొక్కలను వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించడం వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించింది. ఇది దిగుబడిని పెంచడానికి పంట నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడ్డాయి.

సగం పొలంలో వరి పంట, మిగిలిన పొలంలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, అపరాలు, కొన్ని తృణ ధాన్యపు పంటలు వేసింది.చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది.

ఎలాగూ శని ఆది వారాలు సెలవే. మూడు రోజులు ఇంటినుండే పని చేయడం, అప్పుడప్పుడు సెలవు పెట్టడం ఇలా పరిగెత్తింది ఆరవి. మధ్య మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆత్మాభిమానం గల అమ్మాయి. అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. ఎలాగో అలా ఆత్మవిశ్వాసంతో, స్వయంకృషితో అన్నింటినీ అదిగమించింది.

ఆరవి ‘సహజాహార ఉత్పత్తులు’ అనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది.

తన టీమ్ లో అందరూ కష్టపడేవాళ్లే. ‘ఆరవి సహజాహార ఉత్పత్తులు’ అనే పేరుతో సంస్థను నెలకొల్పింది. ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేసింది. ASP అన్న పేరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. యాప్ లోను, వాట్సాప్ లోను వినియోగదారుల ఆర్డర్లు తీసుకోవడం, నాణ్యమైన ఉత్పత్తులను భద్రంగా సమయానికి పంపిణీ చేయగలగడం చేస్తోంది. కూరగాయలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, బియ్యం అన్నీ అమ్మడం మొదలు పెట్టారు. ఆసక్తి ఉన్న వినియోగదారులను తమ వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించి వారికి చూపించడం, కావాలంటే అక్కడే వారికి కావాల్సినవి అమ్మడం అనే అవకాశాన్ని కల్పించింది.

వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించడం, అక్కడ కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వడం అనే పారదర్శకతకు, ఈ విధానం పట్ల ప్రజల నుండి విశేషమైన స్పందన వచ్చింది. దీనితో ASP సంస్థ బాగా విస్తరించింది.

లాభాలను తగ్గించుకుని సరసమైన ధరలకు ఇవ్వడం, మేలురకమైన ఉత్పత్తులను పంపిణీ చేయడం వలన గుడ్ విల్ పెరిగింది. ఎంతో మంది మహిళలకు,మగవాళ్లకు కూడా మంచి ఉపాధి ఇవ్వగలిగింది. చాలా మంది ఆ ఊరినుండే కాకుండా చుట్టుపక్కలనుండి కూడా బతుకుతెరువు కోసం వచ్చారు.

ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు వ్యవసాయ క్షేత్రంలో వేసిన వంట గది, చిన్నది ఒక గది వసారాతో కట్టిన ఇంటి ముంగిట ఆరు బయట ఆరవి ఆమె తల్లిదండ్రులు బయట కూర్చుని కొబ్బరి నీళ్లు తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.

కొబ్బరి బొండాం కింద పెడుతూ గౌతమ్ కొంచం గంభీర స్వరంతో “ఆరు నిన్ను అర్థం చేసుకోలేకపోయాము రా. నీకూ కొన్ని ఆశలు,ఆశయాలుంటాయన్న సంగతి విస్మరించి ఓ సామాన్యమైన తండ్రిలాగనే ఆలోచించా. పెంచడం, చదివించడం, పెళ్లి చేయడం అనుకుని అడ్డం పడ్డాను. నిన్ను నొప్పించాను. మెల్లమెల్లగా నాకుగా నేను, అమ్మ నీ మనసు గ్రహించాము. నీ దృఢ సంకల్పం అర్థమైంది. ఎప్పుడూ నీ ఆర్థిక అవసరాల గురించి గమనిస్తున్నాము కానీ ముందుకు రాలేదు సహాయం చేయడానికి. నీ తెలివితేటలతో ఎలా పరిష్కరించుకుంటావో చూద్దామని. మా అంచనా ప్రకారం నీ పట్టుదల, తెలివితేటలు, సమయస్ఫూర్తి అమోఘం. అలా చూడు తల్లీ.. ఈ క్షేత్రంలో వాళ్లందరు నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఎంత బాగా పని చేస్తున్నారో. వారి సేవలు కూడా శ్లాఘనీయం. వాళ్లందరికీ నువ్వు కల్పించిన వసతులు, భరోసా అభినందనీయం. మట్టిని నమ్మినవారు చెడిపోరని మరోమారు రుజువు చేశావు తల్లీ.”అన్నాడు ఆనందంతో.

తండ్రీ కూతుళ్లను ప్రేమగా,సంతోషంతో చూస్తూండిపోయింది అవంతిక.

గబగబా పరిగెత్తుకుంటూ ఆరవి పర్సనల్ అసిస్టెంట్ తన క్లాస్‌మేట్ అయిన మంజరి ఫోన్ తెచ్చి ఇచ్చింది ఆరవికి.

“ఏంటి మంజూ ఏమైంది! ఎవరూ!” అడిగింది

“ఏం కాదు ఆరూ, అభిరామ్ ఇండియా వచ్చారంట. రేపు ఉదయం 8గంటలకు రేపు అమ్మానాన్నలతో వస్తున్నారంట ఇక్కడికి. నువ్వు ఫోన్ తీయకపోతే నాకు ఫోన్ చేస్తే తెచ్చా” అంది.

ఆరవి గుండెల్లో రాయి పడింది. తను రెండు సంవత్సరాలు నిద్రాహారాలు మాని కష్టపడి అప్పులు తీర్చి ఒక కొలిక్కి తెచ్చింది సంస్థని. అతను ఇచ్చేయమంటాడేమోనని బెంగపట్టుకుంది.

అది గమనించిన తల్లి “ఎందుకమ్మా అలా కంగారు పడతావు. సరదాగా చూడటానికి అయిండొచ్చుకదా! బి పాజిటివ్” అంది కూతురుతో.

ఫోన్ చేసి అభిరామ్ తో మాటాడింది ఆరవి.

“నాన్నా పదండి ఇంటికి వెడదాం చీకటిపడుతోంది. ఏదైతే అదే అవుతుంది” అంటూ.

“ఇంటికెళ్లాక స్నానం చేసి అన్నం తిని రిలాక్స్డ్ గా పడుకో” అన్నారిద్దరూ.

మర్నాడు త్వరగా లేచి కాలకృత్యాలు ముగించుకుని అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతోంది ఆరవి. కారు హారన్ వినిపించి గబగబా బయటకు వెళ్లారు గౌతమ్ అవంతికలు.

అప్పటికే కారు పక్కన పెట్టి లోపలకొస్తున్నారు అభిరామ్ అమ్మా నాన్నలతో.

గౌతమ్ ఎదురెళ్లి “రండిరండి “అంటూ సాదరంగా ఆహ్వానించాడు వాళ్లని. వాళ్లని చూసి హాల్లోకొచ్చింది ఆరవి.

“అమ్మా మీరందరూ మాటాడుకుంటూండండి నేను కాఫీ తెస్తా”అంటూ వంటగదిలోకెళ్లింది అవంతిక.

వాళ్లు ఏవో సరదాగా మాటాడుకుంటున్నారు.అవంతిక కాఫీలు పట్టుకొచ్చి అందరికీ ఇచ్చి తనూ ఓ గ్లాసు తీసుకుని కూర్చుంది. అభిరామ్ వాళ్లూ కూడా మొహమాటపడకుండా తీసుకున్నారు.

అభిరామ్ అవంతికను “ఆంటీ” అని పిలుస్తుంటే అభిరామ్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆరవి ఈ కొత్త పిలుపేంటా అని.

అవేం పట్టించుకోకుండా “ఒకసారి పొలం చూసొద్దాం అందరం” అన్నాడు అభిరామ్ లేస్తూ.

అన్నింటికీ సిద్ధపడిన ఆరవి గౌతమ్ అవంతికలు కూడా బయలదేరారు.

అవంతిక బయటనుండి “ స్వాతీ తలుపేసుకో. కాయగూరలు తరిగి ఉంచు మేము వచ్చేసరికి” అని కారు దగ్గరకు నడిచింది. ఆమె వెనుకనే స్వాతి వచ్చి “అలాగే మేడమ్”అంది.

ఊళ్లోకెళ్లగానే కారు పక్కన చెట్టునీడలో పెట్టి వచ్చారు అందరూ. వ్యవసాయ క్షేత్రం చూడగానే అభి కళ్లు ఆశ్చర్యానందాలతో వెలిగిపోయాయి.

“వండర్ఫుల్! ఈ ప్రదేశం ఇంత అద్భుతంగా అవుతుందనుకోలేదు.” అన్నాడు పట్టరాని సంతోషంతో.

‘హమ్మయ్య’ అనుకుంది అభి మాటలకు.

ఆరవి మంజరెక్కడుందో ఫోన్ చేద్దామని కాస్త దూరంగా వెళ్లింది.

ఇదే మంచి సమయం అని “అంకుల్, ఆంటీ! మీకు విషయం చెప్పాలి. అమ్మానాన్నలకు ఎప్పుడో చెప్పాను” అని ఒక క్షణం ఆగి.. “ఆరవి నన్ను కాంటాక్ట్ చేసినపుడే తన ప్రొఫైల్ చూశాను. తన ఆశయాలు, ఆశలు నాకు నచ్చాయి. అందుకే తనకు పొలం కూడా కౌలుకిచ్చాను. ఒకరికొకరు బాగా తెలుస్తామని. మొదటి చూపులోనే తన ఆత్మవిశ్వాసం, పట్టుదల నన్ను అమితంగా ఆకర్షించాయి. అదే అమ్మానాన్నలకు చెబితే మీ ఇద్దరికీ ఇష్టమైతే మాకూ ఓకె అన్నారు. అందుకే రెండు సంవత్సరాలు ఆగాను. మీ అనుమతితో ఆరవితో మాటాడతాను” అంటూ వాళ్లేమంటారోనని ఆగాడు.

ఆనందం ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి గౌతమ్ అవంతికలను.

‘పిల్లాడు బుద్ధిమంతుడు, మంచివాడు. మంచి సంబంధం’ అనుకుంటూ తమ కూతురు ఏమంటుందోనన్న సంశయం వారి మొహంలో కనబడింది.

“ఆ విషయం నాకొదిలేయండి నేను చూసుకుంటా” అన్నాడు తేలికపడ్డ మనసుతో. “మీరు ఊ అంటే” అన్నాడు నవ్వుతూ.

“సరేనమ్మా” అన్నారు అప్రయత్నంగా

“మీరు మాటాడుకుంటూండండి నేను ఆరవి దగ్గరకెడతాను” అన్నాడు గబగబా అడుగులేస్తూ.

ఫోన్ కట్ చేసి వెనక్కు తిరిగిన ఆరవి తన్నే చూస్తూ నిలబడిన అభిని చూసి కంగారుపడింది.

“హాయ్” అన్నాడు నవ్వుతూ.

అతనూ చూపు మరల్చి “అదిగో మీవెనుక చెట్ల కొమ్మల మధ్యన సూర్యోదయం ఎంత బావుందోనని చూస్తున్నా” అన్నాడు అన్నాడు తమాషాగా.

గొంతు పెగుల్చుకుని “హహ.. అవునవును” అంది.

“అయితే పొలం ఇచ్చేస్తారా!” అన్న అభి మాటలకు కాస్త బాధగా “మీ పొలం మీ ఇష్టం” అంది కాస్త నిష్ఠూరంగా.

“పోనీ పొలంతో పాటు మీరూ వచ్చేయండి” అన్నాడు నవ్వు బిగబట్టుకుని.

“ఆ.. ఏంటీ?” అంది రెట్టించి కొంచం కోపంగా.

అప్పుడు నవ్వుతూ “నేరుగా విషయానికొచ్చేస్తున్నా. నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీరు నాకు బాగా నచ్చారు. నచ్చారంటే అందం అనే కాదు సుమా! మీ వ్యక్తిత్వం నచ్చింది. అందుకే మీ కోసం రెండేళ్లు నిరీక్షించాను. అమ్మావాళ్లు పెళ్లి చేసుకోమంటే నచ్చచెప్పి ఈ మేడమ్ గారి కోసం ఆగాను” అన్నాడు చిలిపిగా నవ్వుతూ.

ఆరవి గుండె వేగం పెరిగింది.

ఎంత ధైర్యవంతురాలైనా ఈ విషయంలో కొంచం కంగారు ఉంటుంది.

“మరి అమ్మా నాన్నా” అనబోతుంటే “వారి అనుమతితోనే ఇక్కడకు వచ్చాను మా అన్నదాత అన్నపూర్ణ గారూ” అన్నాడు కాస్త హాస్యంగా, కొంటెతనంతో.

పూర్తిగా అర్థం అయింది ఆరవికి.

రెండు చేతులు జోడించి తెచ్చిపెట్టుకున్న కోపంతో “అయితే మీరంతా ఒకటేనన్నమాట. నా ఇష్టాయిష్టాలు ఎవరికీ పట్టవన్నమాట” అంటూ మొహం ఇంకో పక్కకు తిప్పుకుంది.

“అమ్మా ఆరవి సహజాహార ఉత్పత్తుల యజమాని గారూ ఏదైనా అందరం మీ అనుమతి కోసమే వేచియున్నాం. మరి దేవిగారి దయ” అన్నాడు సరదాగా సలాం చేస్తూ నాటక ఫక్కీలో.

పొలంలో కొబ్బరాకుల నుండి పడుతున్న లేత కిరణాలకో లేక అభి అభ్యర్ధనకో ఆరవి చెంపలు కెంపులయ్యాయి.

చెప్పకనే చెబుతున్న ఇష్టాన్ని అరుణార్ణవమైన ఆమె మోము చెప్పేస్తోంది అభికి.

‘హమ్మయ్య’ అని మనసులో అనుకుని “ఇంకా ఏమైనా సందేహాలున్నాయా జీ” అన్నాడు అభ్యర్ధనగా.

ఆరవి మనసులో ఆలోచిస్తోంది.

పొలం గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు అభి ప్రవర్తన, మాటలు నచ్చాయి తనకి.

ఈ రెండేళ్ల నుండీ చూస్తున్నాను. ఫోన్లో మాటాడుతున్నా, సంస్కారవంతుడు అని అనుకుంటోంది.

అభి వైపు తిరిగి “చాలా పెద్ద ఘనకార్యమే చేశారు. పదండి వాళ్లు ఎదురు చూస్తుంటారు.” అంది నడుస్తూ.

“మీ ఆజ్ఞ తల్లీ” అంటూ నవ్వుకుంటూ ఆరవిని అనుసరించాడు తేలికపడ్డ మనసుతో.

ఎక్కడనుండో గుడి గంటలు మ్రోగాయి చిలకా గోరింకల్లా ఉన్న ఆ జంటను అవునంటూ.

Exit mobile version