Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మానందం!

[యం. రమేష్‌ కుమార్ గారు రచించిన ‘ఆత్మానందం!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“అసలు మందు అలవాటు లేని నేను నీకు కంపెనీ ఇవ్వడం ఏమిట్రా? నీతో పడలేకపోతున్నాను” ధమ్సప్ తాగుతూ విసుగ్గా అన్నాను. చలపతి రెండో రౌండ్ పూర్తి చేసి మూడో రౌండ్ లోకి ప్రవేశిస్తున్నాడు.

“ఈ మందు చూశావా? ఈ బ్రాండ్ అంటే నాకిష్టం. ఇదెంత బాగుంటుందో నీ కంపెనీ కూడా అంతే బాగుంటుంది” నిషా కళ్ళతో చూస్తూ అన్నాడు వాడు. మూడో రౌండ్ పూర్తయితే వాడితో ఇబ్బందే! ఎందుకంటే అక్కణ్ణుంచి వాడి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది!

“నీకంటే జిగ్రీ దోస్త్ ఎవడున్నాడ్రా నాకు? నీకు మందు అలవాటు లేకపోవడం నా దురదృష్టం. అయినా నిన్నెప్పుడైనా మందు తాగమని బలవంతం చేశానా? లేదు కదా.. జస్ట్ నాకు కంపెనీ అడుగుతుంటాను. అంతే గదా.. దానికే ఎందుకురా నామీద విసుక్కుంటావ్?” అడిగాడు

నేనేమీ మాట్లాడలేదు. నిజమే.. వాడెప్పుడూ నన్ను మందు తాగమన్లేదు. ‘నాతో మాట్లాడుతూ వుంటే చాలు.. నా పని నేను చేసుకుంటాను’ అంటాడు. నిజం చెప్పాలంటే వాడికంటే జిగ్రీ దోస్త్ నాకు మాత్రం ఎవరున్నారని?

ఆ గార్డెన్ రెస్టారెంట్‌లో రౌండ్ టేబుళ్ళ చుట్టూ ఒక్కో గ్రూప్ కూర్చుని తీరిగ్గా మందు కొడుతున్నారు. మాకు ఎదురుగా వున్న టేబుల్‌లో ఒకాయన అరమోడ్పు కళ్ళతో సిగిరెట్ దమ్ము గట్టిగా లాగి గాల్లోకి నెమ్మదిగా పొగ వదిలాడు. సాయంత్రపు మంచులో ఆ పొగ తీరిగ్గా పైకి లేచి వయ్యారాలు పోతూ దెయ్యం పిల్లలా గింగిర్లు చుట్టుకుంటూ తిరిగి గాల్లోకి అదృశ్యమైంది. ఇలాంటి సుందర దృశ్యాలు(?) చూస్తూ చుట్టూ వున్నవాళ్ళని గమనిస్తూ మావాడి ప్రవచనాలు వినడం తప్ప అక్కడ నేను చేసేదేముంది?

ఈలోపు వాడి మూడో రౌండ్ పూర్తయింది!

“అరేయ్.. ఈ క్షణం గనక భగవంతుడు ప్రత్యక్షమై ‘నిన్ను తీసుకెళ్ళిపోయే టైమొచ్చింది. కేవలం నీకోసం నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో!’ అన్నాడనుకో.. నేనేం కోరుకుంటానో తెలుసా?” అడిగాడు.

మొదలెట్టాడ్రా బాబూ అనుకుని “ఏం కోరుకుంటావ్?” అన్నాను

“ఒక్క బాటిల్.. రోమానీ కాంటీ వైన్! అవును.. అదొక్క బాటిల్ ఇస్తే హేపీగా ఎంజాయ్ చేస్తూ తాగి చచ్చిపోవచ్చు”

వాడి మాటలు విని నాకు ఒళ్ళు మండింది. “దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే వైన్ బాటిల్ కోరుకుంటావా? నీకేమైనా పిచ్చా? నాకు తనికెళ్ళ భరణి గారి డైలాగ్ గుర్తుకొస్తోంది” చిరాగ్గా అన్నాను.

“ఏమిటది?” వాడు మాత్రం ప్రశాంతంగా అడిగాడు.

“అర్ధరాజ్యం ఇస్తానన్నా అడుక్కు తినే చిప్ప కడుక్కు దాచుకున్నాట్ట నీలాంటాడే! అదీ డైలాగ్”

ద్రవాన్ని తాగేసి వున్న వాడు ఉపద్రవంగా నవ్వాడు. నవ్వి నవ్వి అలసిపోయాక “భలే చెప్పావు గానీ ఎవడి ప్రాధాన్యతలు వాడికుంటాయ్ రా బాబూ.. ఇంతకూ రోమానీ కాంటీ వైన్ స్పెషాలిటీ ఏంటో అడిగావు కాదు” అన్నాడు.

“అడక్కపోయినా చెప్తావు గదా.. చెప్పూ”

“అది ప్రపంచంలోనే అత్యంత స్పెషల్ వైన్. ఒక బాటిల్ ఖరీదు ఎంత వుంటుందో తెలుసా? కనీసం ఇరవై లక్షలు! అలాంటిది తాగాలంటే మన వల్ల అయ్యే పనా చెప్పు? మన రిచ్ ఫ్రెండ్ చంద్రం కూడా అంత పెట్టి ఒక బాటిల్ కొనడేమో.. అయినా వాడికి మందు అలవాటు లేదనుకో.. ఉన్నా కూడా అంత ధైర్యం చెయ్యడనుకుంటాను. ఇక మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అలాంటి ఆలోచనే చెయ్యలేం కదా.. అందుకే భగవంతుణ్ణి చివరి కోరికగా అది కోరుకుంటానన్నాను. అయినా నాకు తెలీకడుగుతాను.. మనల్ని తీసుకుపోయేముందు.. అంటే మనం చచ్చే ముందు భగవంతుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే.. అదీ మన కోసం మాత్రమే అంటే ఏం కోరుకోవాలిరా? నువ్వు కోరుకునేది నీ కుటుంబసభ్యులకి పనికిరాదు. నీకోసం మాత్రమే అనేది అసలైన కండిషన్! ఇప్పుడు చెప్పు.. నువ్వయితే ఏం కోరుకుంటావ్?”

“నేనయితే..” అని ఆగిపోయాను. అవును ఏం కోరుకోవాలి? చచ్చే ముందు.. అదీ మన కోసం మాత్రమే.. ఏం కోరుకోవాలి? ఏదైనా చూడాలనా? ఎక్కడికైనా వెళ్ళాలనా? కొంతసేపు తీవ్రంగా ఆలోచించాను. ఏదీ సరిగ్గా అనిపించలేదు. పోనీ ఏదైనా తినాలనా? ఛి.. ఛీ.. వాడికి చెప్పి అంతకంటే చీప్‌గా ఆలోచిస్తున్నానేమిటి? మరయితే ఏం కోరుకోవాలి? మూడో పెగ్ అయ్యాక వీడి తెలివితేటలు టూమచ్‌గా పెరిగిపోతాయని తెలుసు గానీ మరీ ఇలాంటి ప్రశ్న వేసి నన్ను లాక్ చేస్తాడనుకోలేదు.

చలపతి నావైపే చూసి నవ్వుతున్నాడు. నీ మనసులో జరిగే గందరగోళం అంతా నాకు తెలుసు అన్నట్టుగా వుంది వాడి నవ్వు. నాకు ఉక్రోషం పెరిగిపోయింది. కానీ వాడికి చెప్పడానికి ఎలాంటి సమాధానం దొరకలేదు.

ఆ రోజు రాత్రి చాలాసేపటివరకూ పక్క మీదే పొర్లాడాను. వాడి ప్రశ్న నన్ను వేధిస్తోంది.. నా బుర్రని తినేస్తోంది. లేచి బాల్కనీలోకి వచ్చాను. పిల్లలిద్దరూ వేరే రూమ్‌లో నిద్రపోతున్నారు. కాసేపు అలాగే నిలబడ్డాను. ఏమీ తోచక మళ్ళీ గదిలోకి వచ్చేసి పక్క మీదకు చేరాను. అకస్మాత్తుగా కరంట్ పోయింది. పక్కకి తిరిగాను.. శ్రావణి కదలకుండా నిద్రపోతోంది. ఏసీ సౌండ్ ఆగిపోయి నిశ్శబ్దంగా వుంది. టిక్ టిక్ మంటూ గడియారం చప్పుడు మాత్రం చిన్నగా వినబడుతోంది. ఆ నడిరాత్రిలో ఆ నిశ్శబ్దం నాతో ఏదో చెప్తున్నట్టుగా వుంది. కొన్ని క్షణాలు అలాగే గడిచాయి. ఆ చీకట్లో నా బుర్రలో హఠాత్తుగా ఓ మెరుపు! అర్ధమైంది.. వచ్చేసింది.. ఇంతవరకూ ఆలోచిస్తున్న ప్రశ్నకు సమాధానం వచ్చేసింది! చిన్న చప్పుడుతో కరెంట్ రావడం తెలిసింది. ఏసీ మళ్ళీ సన్నగా శబ్దం  చేసుకుంటూ పనిచేయడం ప్రారంభించింది.

***

ఉదయాన్నే చందుకి ఫోన్ చేశాను. నేను చెప్పింది విన్నాక “బానే వుంది గానీ ఇంత సడన్‌గా ఏమిటి..?” అన్నాడు.

“అవును.. సడన్‌గా ఓ చిన్న జ్ఞానోదయం అయింది. సాయంత్రం నీ దగ్గరకు వస్తాను” అన్నాను. తర్వాత మా పత్రికాఫీస్‌కు వెళ్లి అర్జెంట్ వర్కులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. సాయంత్రం ఇంటికి వెళ్లేముందు బాస్‌ను కలిసి ఓ మూడు రోజులు శెలవు అడిగాను. శెలవు శాంక్షన్ అయ్యాక సరాసరి అట్నుంచి చందు దగ్గరికి వెళ్లాను. వాడి ఫాం హౌస్ తాళాలు తీసుకున్నాను. ఇంటికెళ్ళి బేగ్ సర్దుకుని బయల్దేరాను. వెళ్లేముందు ఆదివాసీల జీవనవిధానంపై సమగ్రమైన ఆర్టికల్ రాయడానికి ఓ మూడు రోజులు ఏజెన్సీకి వెళ్ళమని చెప్పారనీ, అందువల్ల అక్కడికి వెళ్తున్నాననీ, అక్కడి గెస్ట్ హౌస్‌లో సెల్ సిగ్నల్స్ సరిగా వుండవు కాబట్టి అవసరమైతే నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తాననీ ఇంట్లో చెప్పాను.

మన్యం జిల్లాలో అడవి మొదట్లో వున్న చందు ఫాం హౌస్‌ను చేరుకునేసరికి రాత్రి పది అయింది. కొండ పక్కన, అడవి మొదలులో ఏర్పాటు చేసుకున్న ఫాం హౌస్ అది! చెక్కలతోనూ, వెదురు బొంగులతోనూ నిర్మించబడింది. చుట్టూ వెదురు ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడి వుంది. ఆ ప్రహరీ లోపల అనేక రకాల మొక్కలు పెరుగుతున్నాయి. అక్కడ నాకు తోడు దాసు ఒక్కడే! అతడే వాచ్‌మన్, తోటమాలి, వంటవాడు కూడా! చందు విషయం ముందే చెప్పడం వల్ల నేనొస్తున్నట్టు అతడికి తెలుసు.

స్నానం చేసి ఫ్రెష్ అయి, దాసు నాకోసం వండిన భోజనం తిని ఆ రాత్రికి ఇంకేమీ ఆలోచించకుండా పక్క మీదకు చేరాను. జర్నీ చేసి అలసిపోయి వుండడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది.

మర్నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు అయ్యాక దాసుకి చెప్పి వాకింగ్ బయల్దేరాను. కొద్దిదూరం వెళ్ళాక అడవి దారి తగిలింది. కాలిబాట గుండా నడవడం మొదలుపెట్టాను. అక్కణ్ణుంచి ఇంకొంతదూరం వెళితే దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తాం. చెట్ల మీద పక్షులు చేస్తున్న శబ్దాలు వినబడుతున్నాయి. శిశిర ఋతువు ప్రవేశించినట్టుంది. ఆకులు రాల్చుకుని గుంపుగా నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నాయి చెట్లు.. వసంతం కోసమేమో? వసంతం తప్పకుండా వస్తుందని వాటికి ముందుగానే తెలుసనుకుంటాను! అందుకే ఆకులు రాల్చుకుని సిద్ధంగా వున్నాయి. ఆ చెట్లన్నీ కొద్దిరోజుల్లో లేత చిగుళ్ళు వేసుకుంటాయి. మధ్యమధ్యలో కొన్ని మోడువారిన చెట్లు కనిపించాయి. చిగురిస్తున్న చెట్లలోనే కాదు.. మోడువారిన తరువుల్లోనూ ఏదో అందముంది. అసలు ప్రకృతిలోని ప్రతి విషయంలోనూ ఏదో సౌందర్యం ద్యోతకమౌతూనే వుంటుంది కదా అనుకున్నాను. కొంతదూరం వెళ్ళాక మరీ దట్టమైన అడవిలోకి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని వెనుదిరిగాను.

చెట్ల మధ్య నుంచి నడుస్తూ తిరిగొస్తుంటే ఎవరో ఎండుకట్టెల మోపు నెత్తిమీద పెట్టుకుని వెళ్తున్న మనిషి కనిపించాడు. అతణ్ణి పలకరిద్దామనుకున్నాను గానీ వెళ్ళిపోయే తొందరలో వున్నట్టున్నాడని ఊరుకున్నాను. గబగబ నడుస్తూ వెళ్ళిపోతున్న అతడి అడుగుల క్రింద నలుగుతున్న ఎండుటాకులు లయబద్ధమైన ధ్వనుల్ని వెలువరిస్తున్నాయి. ఆ ధ్వనులకు తోడుగా విసురుగా వీస్తున్న గాలి శబ్దం నేపధ్యాన్ని అందిస్తోంది. ఎండుటాకుల్నించి పుడుతున్న ఆ సంగీతం మాత్రం పచ్చగా పచ్చిగానే వుంది.

ఫాం హౌస్‌కు చేరుకొని టిఫిన్ చేసి కాఫీ తాగాక అక్కణ్ణుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక జలపాతం వుందనీ, తప్పకుండా చూడాల్సిందని చందు చెప్పిన మాట గుర్తొచ్చింది. దాసు దగ్గర మోపెడ్ తీసుకుని బయల్దేరాను. పక్క ఊరికెళ్ళి అవసరమైన సరుకులు తెచ్చుకోవడానికి దాసు ఆ మోపెడ్ వాడుతుంటాడు.

నేను జలపాతం దగ్గరకు చేరేసరికి అక్కడి దృశ్యం అద్భుతంగా అనిపించింది. చుట్టూ చెట్లు, కొండలు.. మధ్యలో జలపాతం! ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఒంటరిగా వుండడం గొప్ప అనుభవం! అక్కడికి అప్పుడప్పుడూ ఎవరైనా వస్తారేమో తెలీదు గానీ అప్పుడు మాత్రం ఎవరూ లేరు. జలపాతపు తుంపర మీద పడుతూ వుంటే హాయిగా వుంది. పక్షుల కిలకిలారావాలు, జలపాతపు హోరు, అక్కడి ప్రకృతిలోని ఇతర శబ్దాలు అన్నీ కలిసి ఒక మనోహరమైన సజీవ చిత్రాన్ని ఆవిష్కరింపజేస్తున్నాయి. ఆ చల్లటి నీటిలో స్నానం చేసేసరికి ఏదో కొత్త శక్తి వచ్చింది. తనివితీరా అక్కడి అందాల్ని ఆస్వాదించాక తిరిగి బయల్దేరాను. మధ్యాహ్నం అడవి నాటుకోడి ఇగురుతో దాసు పెట్టిన భోజనం జన్మలో మరిచిపోలేను. భోంచేశాక బేగ్ లోంచి పుస్తకాలు తీశాను. హకల్ బెరీ ఫిన్ నవల పలకరించింది. అది తెరిచి చదువుతూ ఉండిపోయాను. ఇప్పటికి ఆ నవలను ఎన్నిసార్లు చదివానో గుర్తు లేదు. అయినా ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అలా చదువుతూ ఉండగానే నిద్ర ముంచుకొచ్చింది. అలాగే పడుకుని కాసేపు నిద్రపోయాను.

లేచాక లాప్‌టాప్‌లో ఏదైనా మూవీ చూద్దామని అనిపించింది. చార్లీచాప్లిన్ మోడరన్ టైమ్స్ పెట్టుకున్నాను. చాప్లిన్ మూవీస్లో నాకిష్టమైన వాటిల్లో అదొకటి. దాంట్లో ఫస్ట్ షాట్ సింబాలిక్‌గా వుంటుంది. ఒక ఫేక్టరీలో కార్మికులు మెట్లెక్కి పైకి వస్తుంటారు. మరో షాట్లో గొర్రెలు కూడా పైకి వస్తుంటాయి. మనుషుల్ని కర్మాగారం యజమానులు ఎంతగా ఉపయోగించుకుని బానిసల్లా పనిచేయించుకుంటారో అనే విషయాన్ని ఆ సినిమాలో చూపిస్తారు. మూవీలో లీనమై అలాగే చాలాసేపు చూస్తూండిపోయాను. అందులోంచి బైటకు వచ్చేసరికి సాయంత్రం కావస్తోంది. ఏజెన్సీ అవడం మూలంగా కాబోలు తొందరగానే చీకట్లు ఆవరించుకుంటున్నాయి.

సాయంసంధ్య కట్టుకున్న నారింజ వర్ణపు చీరను చూసి కుళ్ళుకుని కాబోలు నిశి కాంత నల్లని పరదాను కప్పేస్తోంది. చీకటి చిక్కనైన కొద్దీ చలి పదునెక్కుతోంది. బైట వరండాలోకి వచ్చాను. ప్రహరీలోపల అటు చివరగా మంట వేశాడు దాసు. “బాబూ.. రండి” అంటూ అక్కణ్నుంచే పిలిచాడు. వెలుగుతున్న మంటను చూస్తూంటే వెచ్చని ఆనందం కలిగింది. గబగబా అక్కడికి వెళ్లాను. పక్కనే ఓ నునుపుగా వున్న రాయిని నాకోసం సిద్ధంగా ఉంచాడతను. దానిమీద కూర్చున్నాను. ఎదుటి వేడికి నెమ్మదిగా వెచ్చదనం ఒళ్లంతా పాకింది. తెలియని హాయి ఏదో తనువంతా ఆక్రమించుకున్నట్టుంది. మంచు కురుస్తుండడం వల్ల కాబోలు క్రమంగా మంట ఆరిపోతోంది. ఇద్దరం లోపలికి వచ్చేశాం.

భోజనం చేశాక వరండాలోకి వచ్చి కాసేపు అటూఇటూ నడవడం మొదలుపెట్టాను. ఇయర్ ఫోన్స్ లో ఇళయరాజా ‘నథింగ్ బట్ విండ్’ శ్రావ్యంగా వినబడుతోంది. నడుస్తూనే వింటున్నాను. గిటార్ తీగెలతో మనస్సును మెలిపెడుతున్నాడు ఇళయరాజా.

చలి పెరగడంతో లోపలికి వెళ్లి మంచం మీద విశ్రాంతిగా చేరబడ్డాను. ఇయర్ ఫోన్స్ మాత్రం తీయలేదు. మనసుకి నచ్చిన సంగీతం వింటూనే వున్నాను. ఎంతసేపు గడిచిందో తెలీదు. మొయిన్ గేటు మూసి దాసు పడుకుండిపోయినట్టున్నాడు. నా చెవుల్లో మాత్రం అమృతం కురుస్తూనే వుంది. అవ్యక్తమయిన, మధురమయిన అనుభూతి ఏదో మనసు నిండా ఆవరించుకుంది. నిద్ర వస్తోంది.. ఆరోజు సంతృప్తికరంగా గడిచింది అనిపించింది. ఇయర్ ఫోన్స్ తీసేసి మంచం మీద వాలి నిద్రపోయాను.

మర్నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు అయ్యాక ఉదయపు ప్రకృతిని ఆస్వాదిస్తూ మార్నింగ్ వాక్‌కి బయలుదేరాను. ఈసారి అడవి వైపు కాకుండా వ్యతిరేక దిశలో బయల్దేరాను. ఎదురువచ్చే చెట్లు, ఎగురుతున్న పక్షులు అన్నీ నన్ను పలకరిస్తున్నట్టే వున్నాయి. అసలు ఉదయపు ప్రకృతిలో ఏదో గమ్మత్తు దాగి వుంటుంది. మంచులో తడిసిన దారులు, గాలికి తలలూపే పూలు, రాత్రి చల్లదనాన్ని ఇంకా పట్టుకునే వున్న గాలి.. అన్నీ ప్రత్యేకంగానే వుంటాయి.

నడుస్తూ వెళ్తూంటే నాలో ఏవో కవిత్వ భావనలు కదలాడుతున్నాయి. నిజానికి కవిత్వం ప్రకృతిలో వుంది.. అది నాలోంచి బైటకు రావడానికి ప్రయత్నిస్తోంది. ప్రకృతిలో ప్రతీదీ ఏదో చెప్తున్నట్టుగానే అనిపిస్తాయి. శబ్దం లేకుండా మౌనంగా నిలబడ్డ కొండలు, గలగలలతో పారే సెలయేరు, గాలికి ఊగే లతలు, నేలను చిగుర్చిన గడ్డి, గర్జించే కడలి, నిశ్శబ్దంగా ఉదయించే సూర్యుడు, కొండల మీద నుంచి పారే జలపాతాలు, చెట్ల మధ్య ఘోష పెట్టే గాలి.. అన్నీ ఏదో చెప్తూనే వుంటాయి. కాకపోతే అవి చెప్పేది గ్రహించి రికార్డు చెయ్యడానికి కవిత్వ హృదయం కావాలనుకుంటాను. చాలారోజుల తర్వాత ఈరోజెందుకో ఏదైనా రాద్దామనిపిస్తోంది.

తిరిగి ఫాం హౌస్‌కి చేరుకున్న తర్వాత స్నానం చేసి టిఫిన్ చేశాక లాప్‌టాప్ ముందు కూర్చున్నాను. చాలాసేపు తంటాలు పడ్డాక మనసులోంచి వచ్చిన కొన్ని వాక్యాలతో పేజీ నిండింది. అయితే అది కవిత కాదు.. కథ అసలే కాదు.. హృదయస్పందనని కార్డియోగ్రాఫ్ సూచించినట్టు నా మనసులోని స్పందనని ఆ వాక్యాలు చూపిస్తున్నాయంతే!

బైట సన్నగా వర్షం మొదలైంది. ఆరోజంతా ఇంక బైటికి వెళ్ళలేదు. పుస్తకం, సినిమా, సంగీతం.. ఒకదానితర్వాత ఒకటి నన్ను ఎంటర్‌టైన్ చేశాయి. మధ్యమధ్యలో దాసు అందించిన కాఫీ అమృతమే!

అలా మూడురోజులు అర్ధవంతంగా, ఆనందంగా గడిచిపోయాయి. అసలు విసుగన్నదే లేదు.. ఎందుకుంటుంది? నేను ఒంటరిగా లేను కదా.. నన్ను ఆనందపరచడానికి ఒకరా.. ఇద్దరా.. మార్క్ ట్వైన్, ముళ్ళపూడి, తిలక్, బాలూమహేంద్ర, చార్లీచాప్లిన్, ఆల్ ఫ్రెడ్ హిచ్‌కాక్, ఇళయరాజా.. ఇలా ఎంతమంది ఉద్ధండులు వున్నారని?

ఈ మూడురోజుల ఆనందానికి నిజంగా చందూకి, దాసుకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా మనసులో మాట దాసుకి చందూ చెప్పినట్టే వుంది. అందుకే అతడు నాక్కావాల్సిన సదుపాయాలు చూడ్డం తప్ప నా ఒంటరితనానికి ఎలాంటి ఆటంకం కలిగించలేదు. ఆ సాయంత్రం బయల్దేరే ముందు దాసుకి కొంత మొత్తం ఇచ్చాను.

***

“ఏవైపోయావ్? ఫోన్ ఆపుచేసుకు కూర్చున్నావు. చెల్లెమ్మని అడిగితే ఎక్కడికో ఏజెన్సీకి ఒక ఆర్టికల్ రాయడానికి వెళ్ళావని చెప్పింది. మూడు రోజుల పాటు నాకు కూడా చెప్పకుండా ఎక్కడకు మాయమైపోయావ్ రా?” ఆశ్చర్యంగా అడిగాడు చలపతి.

“ఏం లేదు.. నీ ప్రశ్న కోసం ఆలోచించాను.. నీ కోసం నువ్వు ఏం కోరుకుంటావని భగవంతుడు అడిగితే సమాధానం ఏమిటని అడిగావు. సమాధానం దొరికిందిరా! నిజానికి జీవితంలో మనకోసం మనం బ్రతికేది చాలా తక్కువ! తల్లిదండ్రుల కోసం, ఉద్యోగం కోసం, భార్యా పిల్లల కోసం, మిత్రుల కోసం.. ఇలా అత్యధిక భాగం ఎవరో ఒకరికోసం ఆలోచిస్తూ, ప్రతిస్పందిస్తూ బ్రతుకుతుంటాం. ఒక్క మూడురోజులు వేరే ఏ ఆలోచనలు లేకుండా నాకోసం నేను.. నాకిష్టమైన పనులు చేస్తూ.. ఆలోచిస్తూ.. ఎంజాయ్ చేస్తూ.. నాతో నేనే మాట్లాడుకుంటూ.. ఒంటరిగా.. ఎవరి నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఎవరి సమక్షాన్నీ ఫీలవకుండా గడపాలి. అందుకే ఫోన్ కూడా ఆపుచేశాను. నువ్వు రోమానీ కాంటీని తాగాలంటే  అది నీ వల్ల కాకపోవచ్చు. అందుకోసం చివరి క్షణాల్లో భగవంతుడు వచ్చి వరమివ్వాలేమో గానీ నా ఈ కోరిక సాకారం చేసుకోవడం.. కనీసం మూడురోజుల పాటు.. అంత కష్టం కాదు కదా అనిపించింది. అందుకే చందూని వాడి ఫాం హౌస్ తాళం అడిగి బేగ్ సర్దుకుని అక్కడకు వెళ్ళిపోయి మూడురోజులు నాకిష్టమైనట్టు గడిపాను. చాలా సంతృప్తిగా అనిపించింది.. మళ్ళీ రీఛార్జ్ అయినట్టుగా వుంది!” అన్నాను.

కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా వుండి “నేను రోమానీ కాంటీ ఆలోచనని వదిలేసుకుంటున్నాను..” అన్నాడు చలపతి.

“ఎందుకని?” అడిగాను.

“దానికంటే నీ ఆలోచనే ఎక్కువ కిక్కిచ్చేటట్టు వుంది!” సన్నగా నవ్వి చెప్పాడు.

Exit mobile version