Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మజ్ఞానం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మజ్ఞానం’ అనే రచనని అందిస్తున్నాము.]

ఠోపనిషత్తు (1.2.18) లో ఒక ముఖ్యమైన శ్లోకం:

న జాయతే మ్రియతే వా విపశ్చిన్
నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్
అజో నిత్యః శాశ్వతో ఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే

ఆత్మ పుట్టేది గాని, చనిపోయేది గానీ కాదు; అలాగని ఒకప్పుడు వుండేదీ, మరొకప్పుడు వుండనిది కూడా కాదు; ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే వుండేది; నాశనం లేనిది, సనాతనమైనది; అది చంపదు, చంపబడదు; దేహం నశించినా ఆత్మ నశించదు.

ఆత్మ అనే సంపూర్ణ జ్ఞానం సదా చైతన్యపూర్ణమై ఉంటుంది. కనుక హృదయంలో సదా నిలిచి వుండే ఆత్మను భౌతికంగా గుర్తించలేకపోయినప్పటికీ ఆత్మ యొక్క ఉనికిని దాని చైతన్యం ద్వారా గుర్తించడం సాధ్యం. దీనికి కఠోపనిషత్తులో ఒక ఉదాహరణ ఇవ్వబడింది.

దట్టమైన మేఘాల కారణంగా కొన్ని సందర్భాలలో సూర్యుని ఆకాశంలో చూడలేము. అంత మాత్రానా అక్కడ సూర్యుడు లేనట్టు కాదు. అయితే సూర్యుని వేడి, అక్కడ నుండి ప్రసరింపబడే వెలుతురు ద్వారా ఆ సూర్యుడి ప్రభావాన్ని గుర్తించగలం. అదే విధంగా అన్ని జీవులలో, వాటి ఉనికికి ఆధారభూతమైన ఆత్మ వుంటుంది. ఈ ఆత్మను మనం భౌతికంగా ఇతర అంగములవలే చూడలేకపోయినప్పటికీ జీవుల చైతన్యం బట్టి గుర్తించగలం. ఈ ఆత్మ శరీరం నుండి నిష్క్రమించిన వెంటనే జీవుడు చైతన్యం కోల్పోయి జీవరహితంగా, చైతన్యరహితంగా మారుతాడు. అందుకే జీవుడు మరణిస్తే శివుడు శవమయ్యాడన్న ఒక నానుడి ప్రచారంలో ఉంది. జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ కూడా దేహం అనే ఒక చెట్టుపై (హృదయంలో) వున్నారు. భగవంతుని కరుణ వలన శోకములు, ఆందోళనలు, భోగభాగ్యాలనే ద్వంద్వ ప్రవృత్తుల నుండి బయటపడిన సాధకులు మాత్రమే ఆత్మ యొక్క ఉనికిని, ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటున్నారు.

ఆత్మ ఎప్పుడూ పుట్టదు మరియు చనిపోదు; లేదా అది ఎప్పటికీ మారదు, ఒకసారి ఉనికిలో ఉంటే, అది ఎప్పటికీ నిలిచిపోదు. ఆత్మ పుట్టనిది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది మరియు ఆదిమమైనది. శరీరం చంపబడినప్పుడు అది చంపబడదు. ఆత్మ అన్నది నిత్యం, శాశ్వతం, సనాతనం అని వేదం స్పష్టం చెస్తోంది. సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలం మనం.ఈ ముక్కు, నోరు, కళ్ళు, కాళ్ళు చేతులు అనే అంగాలం మనం కాదు. ఈ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.ఈ దేహం నశిస్తే దేహంలో వున్న శాశ్వతమైన దేహి నశించదు. సత్-చిత్-ఆనంద అనేది మీలో నివసించే, శాశ్వతమైన, అనంతమైన మరియు మార్పులేని ఆత్మ యొక్క పరమాత్మ యొక్క సారాంశం.

మనలో ఉన్న ఏకైక నిజమైన వాస్తవం ఆత్మ. మిగతావన్నీ అవాస్తవం. ఆత్మ త్రికాలదర్శి, గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి తెలిసినవాడు, అలాగే జరిగే ప్రతిదానికీ చైతన్య సాక్షి అయిన చైతన్యం. ఇదే మౌలికమైన జ్ఞానం ఆత్మజ్ఞానం.

ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని, నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. వ్యక్తి తన గురించి తాను తెలుసుకుని, తనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు నడిపించడమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞాన మార్గం కోసం భగవంతుడిని సాధనగా మలచుకోవాలి. ఆయన రూపాన్నే కాదు చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని కూడా చూడాలి.

Exit mobile version