Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మైక్య సంవాదం

[డా. బి. హేమవతి రచించిన ‘ఆత్మైక్య సంవాదం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నా మనో ఫలకంపై నిలిచిన చిత్రమా!
శ్రీ ఆంజనేయుడి పాత్రలో లీనమైన వేళ..
హృదయ సింహాసనాన్ని అధిష్టించిన ఓ ఈశ్వరా!
శివ స్వరూపమే రాముడై నా ముందు నిలిచావా?

విల్లంబులు ధరించి..
పట్టు పీతాంబరాలతో..
చరాచర జగత్తును నీ కనుపాపల్లో బంధించి,
సాక్షాత్తు ఆత్మ స్వరూపుడవై సాక్షాత్కరించావు.
నీవే నేనై.. నేనే నీవై..

అద్వైత భావనలో అన్నీ తెలిసిన జ్ఞానివై,
పెదవులపై ఆ చిరునవ్వును చిందిస్తూ..
నీవు నన్నే చూస్తున్నావు,
నేను నిన్నే చూస్తున్నాను!

మన కనులు కలిసి విడిపోయిన ఆ క్షణం..
రూపాలు వేరైనా ప్రాణం ఒక్కటే అనిపించగా,
ఆత్మ ఆత్మతో మమేకమై..
ఇద్దరం కలిసి ఒక్కటైన అపురూప దృశ్యం!

రెప్పల చాటున దాగి ఉన్నా.. నిప్పుల వెలుగువు నీవు,
కనులు మూసినా తెరిచినా వెలిగే ధ్యానం నీవు
నేల పైన నేనున్నా.. నింగి హృదయం నీవు

నువ్వు విసిరే చిరునవ్వులో అనంతమైన శాంతి,
నా మదిలో వెలిగేది నీవు ప్రసాదించిన కాంతి…

సరిహద్దులు చెరిగిపోయిన వేళ..
కాలం ఆగిపోయింది, లోకం కరిగిపోయింది,
శరీరం ఒక గూడు మాత్రమేనని తెలిసింది…

నేను చేసే ప్రతి పని నీ ధ్యానమే,
నాలోని ప్రతి శ్వాస నీ నామమే!
మౌనమే మన మధ్య సంభాషణై..
మాటల అవసరం లేని మధుర క్షణమిది,
నువ్వు నాలోకి.. నేను నీలోకి..
సముద్రంలో నది కలిసినట్టు,
జ్యోతిలో జ్యోతి విలీనమైనట్టు!

నువ్వు వేరు కాదు.. నేను వేరు కాదు..
కనిపించే రూపం మాయ,
కలిసి ఉన్న ఆత్మ సత్యం.
చివరకు మిగిలింది..
మనం కాని ‘ఒక్కటే’ పరమాత్మ తత్త్వం!

Exit mobile version