Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మశాంతి

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వేలూరి ప్రమీలాశర్మ గారి ‘ఆత్మశాంతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

డియారంలో ముల్లులు కదులుతున్న శబ్దం తప్ప, గదిలో ఏ చప్పుడూ లేదు. రెండు రోజులుగా అదే నిశ్శబ్దం. జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా మంచం మీదనే ఉండిపోయాడు గోపాలం. టాబ్లెట్ వేసుకోవడానికి మంచినీళ్ల కోసం లేచి, నీరసం వల్ల కాళ్లు వణుకుతుంటే తూలి పడబోయాడు.

‘ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఈ బ్రహ్మచారి బ్రతుకు?’ నిట్టూర్చాడు. ఉద్యోగం వచ్చి ఆరేళ్లవుతున్నా పెళ్లి గురించి ఆలోచించలేకపోయాడు. తన ఆశయాన్ని అర్థం చేసుకునే అమ్మాయి దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదని దృఢంగా నిశ్చయించుకోవడమే అందుకు కారణం. పట్టించుకునే వాళ్లులేని లోటు, మనిషి అవసరం గోపాలానికి ఇప్పుడు తెలుస్తోంది. ఆకలికి కడుపులో పేగులు మెలిపెడుతుంటే గోడను ఆసరాగా చేసుకుని, మెల్లగా వంటగదిలోకి నడిచాడు. స్టవ్ పక్కనే ఉన్న అలమరాలోనుంచి బ్రెడ్ ప్యాకెట్ తీసి వెచ్చ చేసుకుని తిందాం అనుకునే లోపు.. మంచం మీదున్న ఫోను అదే పనిగా మోగుతుండడంతో వెనక్కి తిరిగి చిరాగ్గా చూశాడు.

ఆగకుండా మోగుతున్న ఫోన్ తీసుకుని హలో అనగానే.. “ఒరేయ్ గోపీ! నాన్న కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. నిన్న రాత్రి నుంచి వెంటిలేటర్ మీద ఉంచారు. షుగర్ కూడా డౌన్ అయిపోయింది. యూరిక్ యాసిడ్ లెవెల్స్‌లో మార్పు వల్ల పాక్షికంగా కోమాలోకి వెళ్ళిపోయారు“ ఏడుస్తూ చెబుతున్న చంటి గొంతు వినగానే, గోపి గుండె.. దడదడలాడింది.

“మావయ్య.. మావయ్యకి ఏమైంది? ఇంత సడన్‌గా ఎందుకిలా అయ్యింది? ఇంతవరకూ బాగానే ఉన్నాడు కదా! అంతలోకే..” దుఃఖంతో గొంతుపూడిపోయి, మాట పెగలక ఆగిపోయాడు.

“నిన్నటి నుంచీ ఫోన్ చేస్తూనే ఉన్నాను.. ఎత్తవేమిరా? ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి రా! నాకెందుకో చాలా భయంగా ఉంది” చెబుతున్న చంటి గొంతు వణుకుతోంది.

“కంగారు పడకు.. వెంటనే బయలుదేరుతాను” అంటూ హాస్పిటల్ వివరాలు నోట్ చేసుకున్నాడు గోపాలం. కాస్త ఓపిక చేసుకుని రెండు మగ్గుల నీళ్లతో స్నానం పూర్తయిందనిపించి, గబగబా షర్టు తగిలించుకుని బయలుదేరిపోయాడు.

***

విజయవాడలో బస్సుదిగి హాస్పిటల్‌కి చేరేసరికి మెల్లగా చీకట్లు ముసురుకుంటున్నాయి. గాభరాకి కడుపులో నుంచి పులకరం మొదలయ్యి, ఒళ్ళు వేడెక్కుతుంటే ఆటోలో కూర్చునే జ్వరం టాబ్లెట్ చింపి వేసుకొని, కాసిని మంచి నీళ్లు తాగాడు. గొంతులో అడ్డుపడిన మాత్ర ఊపిరాడనివ్వలేదు. దగ్గుతో ఉక్కిరిబిక్కిరవుతూ.. తెచ్చుకున్న బాటిల్లో నీళ్లు అయిపోవడంతో ఆటో ఆపమన్నాడు. రోడ్డు పక్కనే ఉన్న షాపులో వాటర్ బాటిల్ కొంటుంటే, గోపాలం దృష్టిని పక్కనే ఉన్న అరటిపండ్ల గెల ఆకర్షించింది.

‘మావయ్యకి అమృతపాణి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం’ అనుకుంటూ తినే పరిస్థితిలో ఉన్నా, లేకపోయినా మావయ్య కోసం డజను పళ్ళు కొని, తిరిగి ఆటో ఎక్కాడు.

అరగంట క్రిందటే ఐసీయూ నుంచి మావయ్యని రూమ్‌కి షిఫ్ట్ చేశారని చంటి ఫోన్ చేసి చెప్పడంతో ‘హమ్మయ్య! ఇక మావయ్య మనలోకి వచ్చినట్టే.. దేవుడా! నా ఆయుష్షు కూడా పోసి మావయ్య బ్రతికేలా చూడు’ మనసులోనే వేడుకున్నాడు గోపాలం.

“మీరు చెప్పిన హాస్పిటల్ ఇదే! దిగండి సార్!” అన్న ఆటో డ్రైవర్ మాటలతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చాడు గోపాలం. హాస్పిటల్ రిసెప్షన్లో వివరాలు చెప్పి, తన మేనమామను ఉంచిన రూమ్‌కి చేరుకున్నాడు. లోపలకి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న బెడ్‌పై ఈ లోకంతో సంబంధంలేనట్టు పడుకొని ఉన్న మేనమామ శ్రీనివాసమూర్తిని చూసి.. దుఃఖం తన్నుకొచ్చింది గోపాలానికి. ముక్కులో నుంచి గొంతులోకి సన్నని గొట్టాలు అమర్చబడి ఉన్నాయి. భుజానికి పక్కగా  ఆ గొట్టం మొదలు వద్ద ఉన్న చిన్నగరాటు నుంచి, ద్రవహారాన్ని లోనికి పొయ్యడం చూసి తట్టుకోలేకపోయాడు. మావయ్య తనని ఒళ్లో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించిన రోజులు గుర్తుకొచ్చి, గోపాలం మనసు భారంగా అయిపోయింది.

మరోపక్క గోడవారిగా ఉన్న అటెండెంట్ బెడ్‌పై, మోకాళ్ళ మధ్యన తల పెట్టుకుని కూచుని మౌనంగా రోదిస్తున్న అత్తయ్యని చూసి చలించిపోయాడు.

‘మావయ్య లేకుండా అత్తయ్య ఎలా బ్రతకగలదు?’ అనుకుంటూ తన చెంపలపై నుండి కారుతున్న కన్నీరు తుడుచుకుని, అత్తయ్య భుజం మీద చేత్తో మెల్లగా తట్టాడు గోపాలం. మేనల్లుడిని చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. అతని చేతిని తన రెండు చేతులతో నువ్వు పట్టుకుని, నుదుటికి ఆనించుకుని ఏడ్వసాగింది. వైద్యానికి స్పందించడం లేదని, ఇంటికి తీసుకుపోమని ఆసుపత్రి వైద్యులు చెప్పారని తెలిసి, నివ్వెరపోయాడు. ఆ స్థితిలో అత్తయ్యనెలా ఓదార్చాలో గోపాలానికి అర్థం కాలేదు.

“ఆయన చూడరా! బంధాలన్నీ తెంచుకొని వెళ్లిపోతున్నారు. ఇక నేను బ్రతికుండి ప్రయోజనం ఏముంది?” తల కొట్టుకుని ఏడుస్తున్న అత్తయ్యను దగ్గరకు తీసుకున్నాడు గోపాలం. ఆ వేదన తన చెవికి సోకినట్టు, శ్రీనివాసమూర్తి నోటినుంచి నురుగుతో కూడిన గురక శబ్దం సన్నగా బయటకు వచ్చింది.

వెంటనే మావయ్య దగ్గరకు వెళ్లి, ఆయన బెడ్ మీద కూర్చుని, గుండెలపై చేత్తో ప్రేమగా రాసాడు గోపాలం. బాటిల్ ఫ్లై క్లిప్పులోకి గుచ్చిన సూది నుంచి, ఒంట్లోకి ఎక్కుతున్న సెలైన్ ట్యూబ్ లోకి రక్తం వెనక్కు తన్నింది. తన స్పర్శకు మావయ్య గుండె వేగంగా కొట్టుకోవడం గమనించాడు గోపాలం. చిన్నప్పుడు తనకు జ్వరం వస్తే రాత్రుళ్ళు.. తనని మామయ్య పొదువుకుని పడుకోబెట్టుకున్న రోజులు గుర్తుకు వచ్చి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.

***

మగ పిల్లవాడు కావాలంటూ నలుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత, మరోసారి కాన్పుకి సిద్ధమైంది గోపాలం తల్లి. అదృష్టం బాగుండి ఐదవ సారి మగబిడ్డ పుట్టినా.. చాలీచాలని జీతాల వల్ల పిల్లల్ని పెంచడం కష్టమయ్యింది ఆ దంపతులకి. దాంతో ఆడపిల్లలు హైస్కూల్ చదువుతూనే పుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అప్పటికే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న శ్రీనివాసమూర్తి, గోపాలం చదువు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. చెల్లెలికి నచ్చచెప్పి గోపాలాన్ని తనతోపాటు తన ఊరికి తీసుకుపోయాడు. కాలేజీ చదువు పూర్తయ్యేవరకూ అక్కడే పెరిగిన గోపాలం అంటే.. శ్రీనివాసమూర్తికి ప్రాణం.

“ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని గమ్యం చేరేవరకూ వెనుతిరిగి చూడవద్దు” అంటూ క్రమశిక్షణతో పెంచిన మామయ్య పెంపకంలో, గోపాలం వృద్ధిలోకి వచ్చాడు. అలా ఆ ఇంటి నీడలో ఇంకా ఎందరో పెరిగారు. తన సంపాదన అంతా నలుగురి ఉన్నతి కోసం ఖర్చు చేసిన శ్రీనివాసమూర్తి, తనకంటూ సొంత ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయాడు. రెక్కల కష్టం మీద ప్రయోజకుడైన కన్న కొడుకు కట్టించి ఇచ్చిన మూడు గదుల ఇల్లే వృద్ధాప్యంలో వారికి నీడనిచ్చింది.

మర్రి చెట్టులా.. ఓ మహా వృక్షంలా ఎందరికో నీడనిచ్చిన మామయ్యని, ఈరోజు ఈ పరిస్థితిలో చూసి గోపాలం తట్టుకోలేకపోయాడు. వైద్యానికి స్పందించని శ్రీనివాసమూర్తిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇల్లు చేరక ముందే కారులో వెనక సీట్లో గోపాలం ఒడిలో తల పెట్టుకున్న శ్రీనివాసమూర్తి శరీరం నల్లగా చల్లబడుతూ, కిందకి జారిపోయింది. ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని లోలోపలే అణుచుకోక తప్పలేదు గోపాలానికి.

అచేతనంగా మారిన శ్రీనివాసమూర్తి దేహం, అలసి నిద్రిస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడూ జాగ్రత్తలు చెప్పే మామయ్య చెయ్యి.. తన చేతిచుట్టూ బిగుసుకుని ఉండడం గమనించి, ఆ చేతిని మెల్లగా ముద్దాడాడు గోపాలం.

“నువ్వు వెళ్ళిపోతే.. రేపు నాకు మార్గం చూపించే దిక్కెవరు?” అంటూ కుళ్ళికుళ్ళి ఏడ్చాడు.

***

అంతిమ సంస్కారానికి పాడె మోసి, రుణం తీర్చుకున్నాడు గోపాలం. పెద్దకర్మ రోజున బంధువులూ, పరిచయస్థులూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మౌనంగా గదిలో మూలన కూర్చుని ఏడుస్తున్న అత్తయ్యని పలకరించి, హల్లోకి వస్తున్నవారందరినీ తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడు గోపాలం. చెరగని చిరునవ్వుతో చిత్తరువుగా మారిన మామయ్య ఫోటో వంక కన్నీళ్లు నిండిన కళ్ళతో చూసాడు. అపరాహ్నం వేళ కాకి పిడచ ముట్టకపోవడంతో, విస్తళ్ళు వెయ్యడానికి సంశయించి ఆగిపోయారు.

లోపం ఎక్కడ జరిగిందో తెలియజేయమని కళ్ళు మూసుకుని, మావయ్యకి మనసులోనే దణ్ణం పెట్టుకుని, వేడుకున్నాడు గోపాలం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. హాల్లో శ్రీనివాసమూర్తి ఫోటోను ఉంచిన కుర్చీకి ఎదురుగా వేసిన కుర్చీల్లో.. వచ్చిన వారందరూ కూర్చున్నారు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన సింహాచలం సంపంగి పూలను గుత్తిగా గుచ్చి, ఆయన ఫోటోకి వేసిన మల్లెల దండ మధ్యన ఉంచింది బిందు.

చంటీ, బిందూ ఇద్దరూ.. ఆయన కన్నబిడ్డలు. వారితోపాటే ఆ ఇంట్లో పెరిగిన గోపాలానికీ, మరో ఐదుగురికీ కూడా సమానమైన ప్రేమాభిమానాలు పంచిన శ్రీనివాసమూర్తి అంటే అందరికీ ఎంతో గౌరవం.

చెట్టు మీదనుంచి కిందకి దిగిన కాకి.. గోడ మీద ఉంచిన పిడచను చూస్తోందే తప్ప, ఒక్క మెతుకు కూడా ముట్టడంలేదు. నోరు తెరిచి కా.. కా అని అరుస్తున్న కాకిని చూస్తే.. మామయ్య తనతో ఏదో చెప్పాలని అనుకున్నట్టుగా అనిపించి,  గోపాలం తల ఎత్తి అటే చూస్తూ నుంచుండిపోయాడు.

శ్రీనివాసమూర్తి చిరకాల మిత్రుడు, పార్థసారథి గారు.. లేచి చేతికర్ర సాయంతో నాలుగు అడుగులు ముందుకు వేసి నుంచున్నారు. తన స్నేహితుడి ఫోటో ముందర కాసిని పువ్వులుంచి, ఒక్క క్షణం మౌనం తర్వాత గొంతు సవరించుకుని చెప్పడం ఆరంభించారు. ఆయన ఏం చెప్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

“శ్రీనివాసమూర్తికీ, నాకూ ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎంతో సౌమ్యుడు, మితభాషి అయిన నా మిత్రుడు.. ‘చెయ్యాలనుకున్న పనిని ఆచరణలో చేసి చూపించాలే తప్ప, వ్యర్థ ప్రసంగాలు అనవసరం’ అనేవాడు. ఎందరికో తాను బాసటగా నిలిచి, వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాడు. తన వల్ల ఉన్నతంగా తీర్చిదిద్దబడిన వారందరి ఊపిరిలోనూ, వాడింకా సజీవంగానే ఉన్నాడు. నా మిత్రుడికి మరణం లేదు.” ధారాపాతంగా చెంపలపై కారుతున్న కన్నీటిని ఆపే ప్రయత్నం చేయలేదు ఆయన.

అక్కడ ఉన్న వారందరి మనసులూ బరువెక్కాయి. ఒకరి తర్వాత ఒకరు తన మామయ్య చేసిన మంచి పనుల గురించి చెబుతుంటే.. గోడకి జారబడి అలాగే చూస్తూ నుంచుండిపోయాడు గోపాలం. కాకి.. పిడచముద్దనుంచిన ఆకు ముందు నుంచుని, అలాగే చూస్తోంది తప్ప.. మెతుకు ముట్టడంలేదు.

అప్పుడు లేచి నుంచున్నాడు చంటి. తన తండ్రి ఫోటోకి నమస్కరించి, తాను చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టాడు. అతని గొంతులో తీవ్రమైన ఆవేదన గూడుకట్టుకుని ఉండడం గమనించిన గోపాలం, ఏం చెబుతాడోనని వింటున్నాడు. దుఃఖం గొంతు పెగలనియ్యకపోవడంతో.. మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు చంటి. తమ్ముడి పరిస్థితి గమనించిన బిందు.. ముందుకు వచ్చి.. తన తండ్రి ఫోటోతో పాటు, అక్కడ ఉన్న అందరికీ నమస్కరించి చెప్పడం ఆరంభించింది.

“మా నాన్నకి మేమిద్దరమే కన్నబిడ్డలం. ఆయనకొచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని ఓ ఒడ్డున పడెయ్యడానికి ఆయన ఎంత కష్టపడేవారో ఈరోజు మీ అందరికీ తెలియాలి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచీ, మాతోపాటు.. మా ఇంట్లో మా దగ్గర బంధువుల పిల్లలు కూడా ఉండేవారు. పల్లెటూర్లలో ఉంటున్న తన తోబుట్టువుల పిల్లలని, అక్కడ వారికి హైస్కూల్ సదుపాయం లేదంటూ.. తెచ్చి తన దగ్గర పెట్టుకుని చదివించారు నాన్న. అలా ఒక్కొక్కరు నాలుగైదేళ్లకు తక్కువ కాకుండా మా ఇంట్లో ఉన్నారు. నాన్న సంపాదించిన ప్రతి రూపాయినీ, ఇంతమందికీ కడుపు నింపడానికే ఖర్చు పెట్టారు. కన్నబిడ్డల కోసం ప్రత్యేకించి ఆయన నిలువ వేసింది ఏమీలేదు. నాకూ, తమ్ముడికీ చాలా ఉక్రోషంగా ఉండేది..” వెక్కిళ్ల మధ్య చెప్పడం ఆపేసి కాసిని మంచినీళ్లు తాగింది బిందు. అక్కతో పాటు,  తానూ గొంతు కలిపాడు చంటి.

“నాన్న తన చేతులతో ఎంతోమందిని పైకి తీసుకొచ్చారు. మా ఇల్లు ఎప్పుడూ ఓ సత్రంలాగానే ఉండేది. చిన్నప్పుడు ఎన్నోసార్లు అనుకునేవాడిని.. ‘నాన్న మా కోసం..  కేవలం మాకోసమే ప్రేమగా ఏదైనా తెస్తే బాగుండు’ అని.. కానీ ఆ ప్రేమను అందరితో పాటే మాకూ పంచారు తప్ప, కన్నబిడ్డలుగా మాపై ప్రత్యేకించి ఏ శ్రద్ధా చూపలేదు. ఆయన పంచిన ప్రేమలో లోపం లేదు. కానీ ఏది తెచ్చినా దానిని అందరితోపాటే మాకూ ఇచ్చేవారు తప్ప.. ప్రత్యేకించి అక్క కోసం, నాకోసమంటూ ఏదీ తెచ్చేవారు కాదు. నాకు చాలా కోపంగా ఉండేది. అక్క కూడా చాలాసార్లు చాటుగా ఏడ్చేది” చెబుతున్న చంటి మాటలకి అక్కడున్న వారి కళ్ళు చమర్చాయి.

“అవును. మా తమ్ముడు చెప్పినదంతా నిజం. మాకంటూ ఓ సొంత ఇల్లు లేదు. వాళ్ళ పిల్లల్ని మా దగ్గర వదిలేసిన వాళ్ళందరూ ఈరోజు బాగానే ఉన్నారు. కానీ ఇంతమందిని పెంచడానికి.. మా నాన్న, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా.. ఒక్క రూపాయి అయినా ఇచ్చి, మమ్మల్ని ఆదుకున్నవాళ్ళు లేరు. ఆయన మాకు ఆస్తులేవీ ఇవ్వలేదు.. కష్టపడడానికి రెక్కలు మాత్రమే ఇచ్చారు. ఆ రెక్కలే మాకు ఆధారం.” ఎన్నో ఏళ్లుగా వారి మనసుల్లో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది.

అందరూ నిశ్శబ్దంగా వారు చెప్పేది వింటున్నారు. ఒకరిద్దరు పెద్దవాళ్ళు.. లేచి వెళ్లి, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు. చూపుడువేలితో కళ్లద్దాలు పైకి తోసుకున్న పార్థసారథి గారు ఏదో చెప్పడానికన్నట్టు గొంతు సవరించుకున్నారు.

“మా శ్రీనివాస మూర్తి చాలా ఉత్తముడు. ఆ ఇంటి ఇల్లాలు మహాసాధ్వి. తన భర్త ఆశయాలకు చేదోడుగా ఉన్నదే తప్ప, ఒక్క మాటైనా పెదవి విప్పి, ఏనాడూ తన కష్టాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఆ ఉత్తమురాలికి ఈరోజు, ఈ క్లిష్ట పరిస్థితి రావడం బాధాకరం. రత్నాల్లాoటి బిడ్డలున్నారు. కన్న బిడ్డలకన్నా ఎక్కువగా ఈ యింట పెరిగినవారూ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఆమెకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారనే భరోసా ఉందనే అనుకుంటున్నాను.”

పెద్దాయన మాటలూ.. చంటీ, బిందూ అన్నమాటలూ గోపాలం మనసుకి ముల్లులా గుచ్చుకున్నాయి. దోషిలా తలదించుకుని నుంచున్నాడు. తోబుట్టువులా ఆత్మీయత పంచిన బిందు మనసులో, ఇంత బాధ ఉందని ఊహించలేకపోయాడు. ఉక్రోషంతో ముఖం ఎర్రగా మారిన చంటి పరిస్థితి సరేసరి.

“మా నాన్న గురించి, నువ్వు కూడా నాలుగు ముక్కలు మాట్లాడితే బాగుంటుంది.” ఆ మాటలు.. చంటి తనని ఉద్దేశించే అన్నాడని, గోపాలానికి అర్థమయ్యింది.

అంతవరకూ గోడ మీద కూర్చుని ఇదంతా గమనిస్తున్న కాకి.. మరి కొంచెం వెనక్కి జరిగి నుంచుంది. తల పైకెత్తి చూసిన గోపాలానికి.. నడినెత్తిన ఉన్న సూర్యుడి కిరణం సూటిగా కంట్లో గుచ్చుకుని, కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. కళ్ళు తుడుచుకుని రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. హుషారుగా రెండు అడుగులు ముందుకు వేసిన కాకి.. పిడచముద్ద ఉంచిన ఆకు దగ్గరగా వచ్చి, తలపంకించి చూస్తోంది. నోరు తెరచి, క్రా.. క్రా అని అరుస్తున్న ఆ కాకిని చూస్తే, తన మేనమామ తనతో ఏదో చెప్పాలనుకున్నట్టుగా అనిపించింది గోపాలానికి.

కాసిని పువ్వులు తీసి, మావయ్య ఫోటో ముందు ఉంచి, “నావల్ల ఏదైనా లోటు జరిగితే మన్నించు..”  అంటూ స్వచ్ఛమైన, నిండు మనసుతో చేతులు జోడించి వేడుకున్నాడు. ఒక్కక్షణం తర్వాత గోపాలం మాట్లాడడం మొదలుపెట్టాడు.

“నిజమే! మా మామయ్య చేరదీసి, చదువులు చెప్పించిన వాళ్ళందరం.. ఈరోజు మంచిమంచి ఉద్యోగాలు సంపాదించి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళమే. మేమెవ్వరం ఒక్క రూపాయి కూడా మామయ్యకు తిరిగి ఇవ్వలేదు. వారి రుణం తీర్చలేనిది. మా చంటీ, బిందూ చెప్పినట్టు.. వారు అందంగా ఉండాలని కోరుకున్న వారి బాల్యాన్ని, మేము ఎవ్వరం తిరిగి ఇవ్వలేము. అందుకు క్షoతవ్యుడ్ని. కానీ అన్నపూర్ణమ్మ తల్లిలా ఆదరించిన అత్తయ్య చేతివంట తిని, మామయ్య నేర్పిన క్రమశిక్షణను వంటపట్టించుకుని, చక్కని వ్యక్తిత్వం ఉన్నవారిగా ఎదగలిగాం. మావయ్య ఎప్పుడూ అంటూ ఉండేవారు.. ‘మన వ్యక్తిత్వం నలుగురిలోనూ మంచి గంధం చెక్కలా, పరిమళం వ్యాపింప చేసేదిగా ఉండాలి’.. అని.

ఆ మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి, అందుకే ఆ ఇంటి రుణం ద్రవ్య రూపేణా తీర్చలేకపోయినా.. మావయ్య ఆశయాలను గౌరవిస్తూ, నాకు చేతనైనంత వరకూ పేద విద్యార్థులకు అండగా నిలబడుతున్నాను. ఇప్పుడు నా వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు. నేను ఇంతవరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. నా ఆశయాలను గౌరవించి, మా అత్తయ్యలా అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలని ఆగిపోయాను. “

“..ప్రతినెలా నా సంపాదనలో మూడవ వంతు, ఆసరా కోరుకునే వారికి అందజేస్తూ, ఆర్థికంగా అండగా నిలబడుతున్నాను. ఇలా నేను ఇంతవరకూ దాదాపు పన్నెండుమంది జీవితాలు నిలబెట్టగలిగాను. నన్నూ, నా లక్ష్యాలనూ అర్థం చేసుకుని,  నా ఆశయాలను గౌరవించి, నాకు సహకరించే అమ్మాయి దొరికే వరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే రేపు నా పిల్లలకి.. ఏ లోటూ కలగదని వివరించి చెప్పగలిగే వ్యక్తిత్వం ఆమెకి ఉండాలి. అలా అయితేనే రేపు నా పిల్లలు కూడా, మావయ్య నేర్పిన ఆశయాన్ని నెరవేర్చేందుకు సహకరించగలుగుతారు.”

గోపాలం మాటలు పూర్తి కాకుండానే, అంతవరకూ మౌనంగా ఇదంతా చూస్తున్న కాకి.. గబగబా వచ్చి పిడచముద్ద పెట్టిన ఆకులో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా, తృప్తిగా తిని, రివ్వున ఎగిరి.. తిరిగి చెట్టు మీద వాలింది.

గోపాలంతోపాటు అక్కడున్న వారందరి కళ్ళూ ఆశ్రుధారలతో నిండిపోయాయి.  పుణ్యగతులు కలగాలని కోరుకుని, ఆ ఇంటికి వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి, ఎవరిళ్లకు వారు వెనుదిరిగారు.

లోపలి గదిలో ఓ పక్కగా కూర్చుని, ఈ మాటలు వింటున్న శ్రీనివాసమూర్తి భార్య, చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.

“నేనూ ఈ ఇంటి బిడ్డనే అత్తయ్యా!” అంటూ ఆమె చేతిని, తన చేతిలోకి తీసుకుని ధైర్యం చెప్పాడు గోపాలం. ఆ ఆలంబన చాలన్నట్లు ఆమె తృప్తిగా నిట్టూర్చింది.

Exit mobile version