Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మీయ రాగం

[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘ఆత్మీయ రాగం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అమ్మ ప్రేమ ఓ అడుగంటని అమృతం!
ఇక తిరిగి రాని గతమై మిగిలినా..
ఓ నీడలా మన వెంటే అడుగేస్తూ ఉంటుంది
ఏ స్వార్థమూ ఎరుగదు కదా ఆమె దీవెన!

ఏ వెలుతురు కిరణాలలో కలిసిపోయిందో
ఎన్నటికీ ఆరని దీపమంటి తన ప్రేమ సాక్షిగా..
ఏ ఇంద్ర ధనస్సులో వర్ణంగా తాను మారిపోయిందో
ఎన్నటికీ మాసిపోని తన చిరు నవ్వులా!

తాను నేర్పిన ఆ తొలి పలుకులే ఆలంబనగా
ఎన్నెన్నో అనుబంధాలకు బీజం వేస్తూ
ఎదురు తీర్చలేని ఋణానుబంధమై
తీపి జ్ఞాపకాల ఖజానాగా మిగిలిపోయింది .

నా తలపులలో తరగని తపనలా
ఎన్నటికీ ఆరని జ్ఞాపకాల చెమ్మలా
నా గుండెకొమ్మపై పలికే వేణువులా
సదా ఆత్మీయతా రాగమై వినిపిస్తూ ఉంటుంది.

Exit mobile version