[డి. మధుసూదన రెడ్డి గారు రచించిన ‘అభాగ్యులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
హనుమంతు బజారుకు బయలుదేరాడు. ప్రత్యేకమైన పనిమీద. చేతిలో చుట్టచుట్టిన రెండు తెల్ల కాగితాలున్నాయి. వాటిలో తాను రాత్రి రాసిన కథ ఉంది. దానిని కథ అనడం కంటే తన భావాలలో రూపుదిద్దుకున్న ఓ అభాగ్యుని ఆత్మఘోష అనడం సబబేమో. దాన్ని పట్టుకుని ఎక్కడికి వెళుతున్నాడనేకదా మీ ప్రశ్న! అవును, దానిని ఒకరి చేతికి చేర్చడమే ఇప్పుడతనికున్న పని. ఆ ప్రత్యేకమైన పనిమీదే బయటికొచ్చాడు. అది చేర్చాల్సింది ఏదో పత్రిక నడిపే సంపాదకుని చేతికో కాదు. అనాలోచితంగానో, అసహ్యంతోనో లేక అర్థంకాని స్థితిలోనో ఉండి నిన్నటి సాయత్రం మాట్లాడిన మధుగాడి చేతికి. ఈ రాయడమనే పని పెట్టుకోకుండానే నిన్న సాయంత్రమే చెప్పవలసిన నాలుగు ముక్కలేవో మధుగాడితో చెప్పుండొచ్చు. చెప్పడంతో తన పని పూర్తవదు. అది వాడి తలకెక్కించాలి. వినేవాడికి విషయంపై ఆసక్తి, చెప్పేవాడిమీద అనురక్తి లేకపోతే ఈ తలకెక్కడం అనే పని తలనొప్పిగా తయారవుతుంది. అందునా వినేవాడు పూర్తిగా వినకుండానే మధ్యలో ప్రశ్నలేయడం మొదలుబెట్టినా, లేక ‘ఆగాగు.. ఇక్కడ నీకో విషయం చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ మర్చిపోతాను’ అంటూ వాడు చెప్పడంలో చొరబడినా ఇక విషయం ఓ కొలిక్కి రాకపోగా పక్కదారి పట్టొచ్చు. ఇదిగో ఇవన్నీ లేకుండా సూటిగానో వీలుగాకపోతే భావగర్భితంగానో చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా రాసి ఉంచాడు.
మధు ఈ సమయంలో ఎక్కడుంటాడో తనకి తెలుసు. అక్కడికే చేరుకున్నాడు. కానీ మధు అక్కడ కనిపించలేదు. ఖచ్చితంగా వస్తాడని నమ్మకం కాబట్టి ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్నాడు. తన ఎదురుచూపు వృథా కాలేదు. మధు వస్తూనే “ఏదో ముఖ్యమైన పని పెట్టుకునే వచ్చినట్టున్నావ్” అంటూ తనని పలకరించాడు. “నిజానికి ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను, అట్టే సమయం లేదు” అంటూ అబద్ధంతో మొదలుబెట్టి, చేతిలో ఉన్న రెండు కాగితాలూ మధుకిచ్చి, “ఓసారి చదువు! సాయంత్రం కలుస్తాను. వీలుగాకుంటే రేపుదయం.” అంటూ ముఖ్యమైన పని ఉన్నవాడిలాగా బయలుదేరి ఇంటికి చేరి నిజంగా ప్రశాంతంగా పడుకున్నాడు. ఉద్దేశమేమంటే, చదివేవాడికి పక్కన రాసినవాడుంటే మళ్ళీ అదే తంతు.. చెప్పేవాడికీ వినేవాడికి మధ్య జరిగే రసాభాసలాంటిదే.
అక్కడ మధు చదవడం ప్రారంభించాడు.
అనగనగా ఓ జీవకణం. ఏ జీవకణం ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలియనట్లే, దానికి కూడా తెలియదు తాను ఎక్కడ పుట్టిందో. ఊహ తెలిసేటప్పటికి తాను ఓ చెట్టులో ఒదిగున్నానని అర్థమైంది. చలనం వచ్చాక చెట్టంతా కలియదిరుగుతూనే ఉంది. అడగకుండానే అన్నం సమకూరుస్తున్న ఆ చెట్టు కొన్నాళ్లవరకూ తనగురించి పట్టించుకోనట్లే, తనపై ఏ ఆంక్షలూ మోపనట్లే ఉండిపోయింది. కానీ ప్రకృతిలో ఎక్కడా బాధ్యతలు లేకుండా హక్కులు సమకూరవు కదా! కొంచం ముందో వెనకో ప్రతివారూ తమ బాధ్యతలు నెత్తికెత్తుకోవలసిందే. ఆ సమయం రానే వచ్చింది. ప్రియవచనాలు పలుకని తండ్రిలాగా చెట్టు దానిని కొమ్మనుండి రెమ్మకు నడిపించి తన జీవితాదర్శం కోసం సన్నద్ధమై ఉండమని ఆదేశించి, మిగతా తన తోబుట్టువులను మరో కొమ్మకో రెమ్మకో నడిపించే పనిలో ఉండిపోయింది. తనను కమ్ముకున్న ఆలోచనలు ఓ రూపాన్ని సంతరించుకోకముందే నిద్ర కమ్ముకొచ్చింది. సూర్యోదయమయ్యేసరికి తానొక మొగ్గగా చివురుల మధ్యనుండి పొడుచుకువచ్చి బయటి ప్రపంచాన్ని చూడడం మొదలుబెట్టింది. క్రమంగా తనలో వచ్చే మార్పులు తనకు ఆనందాన్ని ఇవ్వడం మొదలుబెట్టాయి. కొత్తగా వచ్చి చేరే రంగులు ఆత్మవిశ్వాసం పెంచడంతోపాటూ తనని ఆవరించిన అందం ఆహాన్ని కూడా పెంచసాగింది. కానీ అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. తిరిగి తన హంగులన్నీ ఎలా అంతర్ధానమవుతున్నాయో అర్థం కాక అయోమయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగానే మరో సూర్యోదయం తనకు తనని కొత్తగా ప్రరిచయం చేసింది. తానిప్పుడు పిందెగా పరిణమించింది. తన జీవితాదర్శం మెల్లమెల్లగా స్పురించసాగింది. తానిప్పుడు కొత్త రంగులు కోరుకోవడం లేదు. తనకున్న రంగుకే మేలిమి పొదువుకుంటుంది. తనలో రుచిని నిపుకునే పనిలో నిమగ్నమైంది. అదృశ్యంగానే నాన్న అన్నీ సమకూర్చేటట్లుగా చెట్టు తనకు కావలిసినవి పంపుతూనే ఉంది. అన్నిటినీ తనలో భద్రంగా నింపుకుంటూ తాను సైతం అన్నార్తుల జఠరాగ్నిని చల్లబరిచే అమృతంలో బింధువవ్వాలని కలలు కనడం మొదలుబెట్టింది. ఆకులు తనకు అన్నదాతలైనప్పటికీ తనని లోకానికి పరిచయం చేయడానికి వచ్చే సూర్యరశ్మి తనను చేరకుండా అడ్డుగా వచ్చినందుకు వాటితో అప్పుడప్పుడూ ముభావంగానే ఉంటూంది. రవిగాంచని చోటునూ కవిగాంచును గదా అనే ఆశతో తన పరిసరాలలోకి వచ్చివెళ్లే చిన్నారుల కళ్ళలో తాను ఎప్పుడుపడతానా అని ఆతృతతో ఎదురుచూడసాగింది. తానాశపడే వారి చూపులు సోకడానికి నోచుకోలేదుగానీ, తానిష్టపడని వారి చూపులుమాత్రం చురచురా గుచ్చుకున్నాయి. తనకున్న చిరు ఆకలి తీర్చుకుంటున్న సంబురంలో మిగిలిన అమృతం అంతా ఎవరికీ కాకుండా చేస్తున్నాననే ఎరుకలేని పురుగు దానిని తొలిచి లోపలికి చేరింది. అప్పటినుండీ తన ఆశలు ఆవిరైపోతున్నట్టుగా ఆ పండుకు అర్థమవసాగింది. ఆ పురుగు తన దేహానికి పెద్దగా హానిచేయకపోయినా తన గుండెకు మాత్రం పెద్ద గాయమే చేసింది. ఎప్పుడో ఒకరో ఇద్దరో తనని చూసికూడా తన దేహంపై ఆ పరాన్నజీవి చేసిన గుర్తును గుర్తించి తెంపుకోకుండానే తొలగిపోవడం తను మానసికంగా కుంగి పోవడానికి కారణమయ్యింది. కొద్ది రోజుల్లోనే తన దేహం వడలి పోతున్నఛాయలు స్పురించసాగాయి. అదలా ఉండగానే తొడిమ దాని పట్టును సడలిస్తూ తనని వదిలించుకోవాలని చూస్తున్నట్లు అర్థమయ్యింది. తొడిమ హృదయం ఎంత కర్కశమైనది.. అనిపించింది తనకు. కానీ తొడిమకున్న స్థితప్రజ్ఞత గురించి తానెరుగదు. ఇక తనని వదిలేస్తుంది.. తన జీవితం నిరర్ధకమైంది.. అంతా అయిపోయింది.. అనుకుంటూనే చివరి ప్రయత్నంగా తొడిమకు మనస్సులోనే నమస్సులు చెపుతూ వేడుకుంది ‘నా జీవితాన్ని నిరర్థకం చేయకూ’ అంటూ. ఆనంద వైరాగ్యాలకు అతీతమైన స్వచ్చమైన హృదయంతో ఆ తొడిమ చెప్పింది ‘నీ జీవితం ద్వీగుణీకృతమౌతుంది. ఇప్పుడు నీవు ఎవరో ఒక్కరికి మాత్రమే ఆకలిని తీర్చే పండువి కావు. ఎందరికో ఆకలిని తీర్చగల పండ్లను సృస్టించే వృక్షాలను నువ్వు పునఃసృష్టించబోతున్నావు’ అని. ఆ మాటలు విన్నాక కుదుటపడిన మనసుతో ప్రశాంతత నిండిన హృదయంతో స్వేచ్ఛగా జారి నేలను హత్తుకుంది.
చదవడం పూర్తయిన మధు హృదయంలోకూడా ప్రశాంతత నెలకొంది. కొంతసేపు అలానే కూర్చుండిపోయాడు. మెల్లగా లేచి హనుమంతుని కలవాలనుకున్నాడు. కానీ ఏదో ముఖ్యమైన పనిపై వెళ్లాడుకదా.. సాయంత్రమవ్వందే రాడేమోననిపించింది. అంతవరకూ ఇక్కడే ఉండాలంటే కష్టంగా తోచింది. హనుమంతు ఇంటికే వెళ్ళి ఎదురుచూద్దాం.. తాను రాగానే కలవొచ్చు అని నిర్ణయించుకుని బయలుదేరాడు.
ఇంటికి వెళ్ళేసరికి హనుమంతు నులక మంచంపై పడుకుని ప్రశాంతంగా రేడియోలో పాటలు వింటున్నాడు. తాను వస్తున్న అలికిడికి హనుమంతు తనవైపు చూశాడు. తాను చిరునవ్వు నవ్వాడు. తన హృదయంలో నెలకొన్న ప్రశాంతత ఆ చిరునవ్వులో గోచరించిందేమో, హనుమంతు లేచి, తనపక్కన కూర్చోమన్నట్లుగా మధుని ఆహ్వానించాడు.
కాసేపు మౌనంగా కూర్చున్నారిద్దరూ. తరువాత మధుయే మెల్లగా తనకా కాగితాలు తేటపరిచిన విషయాలను మనస్ఫూర్తిగా పంచుకోవడం మొదలుబెట్టాడు.
“నిన్న వాళ్ళని చూసినప్పుడు నిజంగా బాధేసింది. కొంత చిరాకు కూడా కలిగింది. తామే ఏ భాగ్యానికీ నోచుకోక నానా బాధలూ పడుతుంటే, ఇంకా ఎందుకు కంటారా వీళ్ళు పిల్లల్ని అనిపించింది. రోగాలతో రోష్టులతో నరకాన్ని అనుభవిస్తూ, ఏపూటకాపూట తిండికి యెందరివో ఈసడింపులు భరిస్తూ కూడా పిల్లల్ని ఇదే నరకానికి ఎందుకు తీసుకోస్తున్నట్లు? అని జీర్ణించుకోలేకపోయాను. ఆ వికారం మనసును తొలుస్తుంటే వాళ్ళకీ వాళ్ళ జీవితం పట్ల అందమైన కలలుంటాయి అనే విషయం నా మనసుకి యెలాతోస్తుంది? అందుకే ఒళ్ళుమరిచిన ఆవేశంతో వాళ్ళని నానామాటలన్నాను. యేదో చేతిలో ఉన్న పదో పరకో ఇవ్వడం మానేసి వాళ్ళకి బుద్ధిహీనతను ఆపాదించి వారి హృదయాన్ని ఇంకా బాధపెట్టాను.”
కృతజ్ఞత నిండిన కళ్ళతో హనుమంతుని చూస్తూ మధు నిశ్చలంగా ఉండిపోయాడు కాసేపు.
పశ్చాత్తాపం తెచ్చే బాధతో కాకుండా పరిపూర్ణత తెచ్చే ప్రశాంతతతో మధు అలా మాట్లాడడం విని హనుమంతు ముచ్చటపడ్డాడు.
“ఓసారి కలిసొద్దాం రా!” అంటూ ఇద్దరూ ఒకేసారి లేచి నిలుచున్నారు.
