Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అభినవ అక్షర జ్యోతి ఆచార్య కొలకలూరి ఇనాక్

[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘అభినవ అక్షర జ్యోతి ఆచార్య కొలకలూరి ఇనాక్’ అనే కవితని అందిస్తున్నాము.]

ద్మశ్రీ ఆచార్య
కొలకలూరి ఇనాక్ గారంటే..?
గుడిసె గుండెలో
రగిలే ఒక అగ్ని పర్వతం
కలంతో కన్నీటి కడలిని
కదిలించిన కవి చంద్రులు..

కులంగోడలపై సమానత్వపు
సూర్యోదయాన్ని చిత్రించిన రవివర్మ
ఆది ఆంధ్రుడిగా అణగారిన
అమాయకపు ఆత్మలకు ఆశాకిరణం..

అమ్మ తలలేనోడి ఆవేదనను
అక్షరార్చన చేసిన అక్షర యజ్ఞం..

భక్తితో మునివాహనుడిగా
మారిన సమానవత్వపు రథ సారథి
నూట ఎనిమిది గ్రంథాల నవనీతంతో
తెలుగు కళామతల్లికి నుదుట సాహితీ
తిలకం దిద్దిన భరతమాత ముద్దుబిడ్డ..

తరతరాలుగా
అంటరానితనపు
అగ్నిగుండంలో పడి
దళితజాతి విలవిలలాడిన
మలమలమాడిన వేళ..

అంబేద్కర్ రాజ్యాంగ
రాజకీయ రణరంగంలో
సమానత్వపు శంఖారావం పూరిస్తే..

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
అక్షరాలను ఖడ్గాలుగా మలిచి
సాహిత్య సమరాంగణంలో
తరతరాల బానిస సంకెళ్లను తెంచిన
కలం వీరుడు సాహితీ సమరయోధుడు

సాహితీ దిగ్గజం.. సాహితీ శిఖరం
శ్రీ కొలకలూరి ఇనాక్ గారి
కలం నుండి జాలువారింది 108 గ్రంథాలు కావు
అవి నూట ఎనిమిది నిప్పుకణికలు..

ప్రతి కథ ఒక కన్నీటి చరిత్ర..
ప్రతి నాటకం ఒక నిరసన నినాదం..
ప్రతి కథ కవిత ఒక ఆత్మగౌరవ జెండా..

కాలాన్ని ప్రశ్నించిన కవి..
వేదికలకు వెలుగైన మహావక్త
సమాజాన్ని ప్రక్షాళనం చేసిన
సాహితీ సంఘసంస్కర్త..

తాడిత పీడిత బడుగు
బలహీన బహుజన వర్గాల్లోని
కష్టజీవుల కన్నీటి గాధలను
అగ్గిరవ్వల్లా అక్షరాల్లో నిక్షిప్తం చేసి
ప్రపంచానికి దారి చూపిన సాహితీ స్రష్ట

కథకు కరుణ..
నాటకానికి నాడి..
విమర్శకు వివేకం..
గేయానికి గుండెచప్పుడు..
పద్మశ్రీ ఆచార్య కొలకలూరు ఇనాక్ గారు

గేదెల కాపరి స్థాయి నుంచి
విశ్వవిద్యాలయ శిఖరాల వరకు
కసితో స్వయంకృషితో స్వర్ణసోపానాలు
చెక్కినా ఎక్కినా బహుముఖ ప్రజ్ఞాశాలి

దళితుల కన్నీటిని దివిటీలుగా
మార్చిన దళిత దీపస్తంభం..

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక చైతన్యం
సమాజంలో సమానత్వపు
ప్రేమదీపాలను వెలిగించిన అక్షర జ్యోతి..

అవమానాల అగ్నిని..
అవార్డుల అరుణోదయంగా
మార్చుకున్న మహామనీషి
ఆత్మీయతను ఆభరణంగా
ధరించిన అక్షరయోగి..
అభినవ అంబేద్కర్..

చిరునవ్వును చిరునామాగా
చేసుకున్న చైతన్యమూర్తి..
ప్రేమను పరిమళంగా పంచే
సాహితీ కురువృద్ధులు..
పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

88వ జన్మదిన శుభాకాంక్షలతో
వెయ్యేళ్లు వెలిగే ఆ అక్షరదీపానికి
నా వినమ్ర నమస్సుమాంజలి..

(1 జూలై న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి పుట్టినరోజు సందర్భంగా నా కవితాంజలి)

Exit mobile version