Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అభౌతికం

[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘అభౌతికం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నిప్పులు పొదుగుతున్న నింగీ
విచారం నిలుపుకున్న కళ్ళూ
ఎంత ప్రజ్వలిస్తున్నాయి?
పోటీ పడుతున్న పాలిపోయిన చుక్కలనూ
వెలవెలబోతున్న చల్లని వలయాన్నీ ఓ మూలకు విసిరి.

మెత్తని రాత్రిని గట్టిగా మన చుట్టూ చుట్టుకుని
నాలోలోపల రగిలే నీ పరోక్షం బడబాగ్నిలో
సమక్షాలను నెమరువేసుకుంటూ
శక్యం కాని ఈ ఒత్తిడిని వెనక్కు మళ్ళించి
మన గతాని ఊపిరులూదుతున్నట్టు
ఎంత ఉపశమనం!
“నీ గోరంత వెలుగు కొండంత చిమ్మ చీకటిలో
మూసిన నీ కనురెప్పల ముత్యపు చిప్పల్లో దూరి నా ఉనికి
మంచి ముత్యమై మెరిసినప్పుడు
నీ కంటి జంట అద్దాల్లో
ప్రతి క్షణం మనం కొత్త వెలుగులు
చిత్రించుకున్నాం కదూ”

హద్దూ అదుపూ లేని సువిశాల నీలిమ కింద
పంచుకున్న ఎన్నెన్ని ఊహలో స్వప్నాలో
ఎంత మనోహరంగా అలంకరించుకున్నాను.
అడుగు అడుగునా నీ మాటలు గీసిన నా చిత్రాన్ని
ఏదో ఒకదాన్ని ఆవిష్కరించుకుంటూ
నన్ను నేను సమాధానపరచుకోడం
సతత హరితమై పోయిన నిన్నటి మనలోంచి
చల్లని ఉపశమనమై ఒక స్పర్శ
కాలిన హృదయానికి నవనీతపు లేపనమేగా

“చెప్పు ప్రియతమా నీ మనసు నా మనసుతో మమేకమై
మునివేళ్ళ చిరు స్పర్శ నీ లోలోపలి విచారం పెకలించి వేసేలా
కలిసి ఈ కష్టసుఖాలను కలబోసుకుంటూ పయనిద్దాం.
మనలో మనకు తెలియని కొత్త రూపాలను ఒకటిగా మలచుకుందాం.”

నీ ఆగమనం ఈ ఎడారిలో ఆమనికి స్వాగతమే.
నీ పాదాల చిరు తాకిడి ఈ హృదయం
ఎదురుచూసే ఒక వసంత రుతువే.
తరలిపోయే ప్రతి శిశిరానికీ
ఒక కొత్త రంగుల ప్రపంచమే
కలసి కదిలే అడుగుల ముద్రలు.

ఆత్మ కొసకంటా పెనవేసుకు పోయినా
స్వప్న సీమలో నేనే కరిగి ప్రవహిస్తూ
నాకు నేను ఆవిరై నీచుట్టూ మేఘమైనప్పుడు –
“వెన్నెల రాత్రులూ, వేడి మధ్యాన్నాలూ
అరవాలిన నీ మనసు రెప్పలపైన
రెపరెపలాడే సీతాకోక చిలుక రెక్కలై
మన హృదయాలు ఒకటిగా స్పందించినప్పుడు,
సమయాసమయాలు తెలియని నిశ్శబ్ద రాగ ఝరులం”

నింగి రూపమూ లేదు,
పాలపుంత పరుగులూ లేవు.
ఉన్నదొకటే కనుచూపు మేర
అజరామరమై రెండు అక్షరాల ప్రేమ
మన అస్తిత్వ సమాలోచన.

Exit mobile version