Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అచ్చతెలుగు అల్లసానిపెద్దన’ శ్రీ నారు నాగనార్య-2

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన – ‘అచ్చతెలుగు అల్లసానిపెద్దన’ శ్రీ నారు నాగనార్య – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ భాగం.]

తెలుగు కబ్బాలలో అచ్చతెలుగు వ్రాతకు ఒక మేలుగా చెప్పదగినంత వెనకటి కత ఉంది. ఈ దారిలో సాగిన అప్పటి కవులు తమ వ్రాతలను తమదైన తీరులో మలచుకున్నారు. అయితే, నాగనార్య వెనకటి కబ్బాలను తిరిగి అచ్చతెలుగులో వ్రాసే పనిని పద్యంలో చేపట్టి, ఒక కొత్త త్రోవని చూపించారు. ‘మనువు పుట్టువు’ కబ్బం ఆ త్రోవన ఎన్నదగిన కబ్బం! 1947 సొంత ఏలుబడి మొదలయ్యాక అచ్చతెలుగు గురించిన తలంపులన్నీ ఆగిపోయాయనుకునే వేళల్లో 1960-70లలో అచ్చతెలుగు కబ్బాలు వ్రాసిన కవి నారు నాగనార్య.

కందుకూరి వీరేశలింగంగారి త్రోవన నడవటం వలన నారు నాగనార్య అచ్చతెలుగుని నేర్పుగా చేపట్ట గలిగారు. వారు అప్పటికే అనేక కావ్యాలు వ్రాసి, పద్యంలోని మెలకువల్ని తన చవితో (అనుభవంతో) ఆకళింపు చేసుకున్న మంచి వ్రాతరి!

‘మనువు పుట్టువు’ – అచ్చతెలుగులో ఒక కొత్త రచనాప్రయోగం

అచ్చతెలుగు కబ్బాన్ని వ్రాయటంలో ‘మనువు పుట్టువు’ వారి రెండవ రచన. ఈ కావ్యంలో పదునెక్కువని అప్పట్లో భారతి లాంటి పత్రికలు ఎన్నదగిన కబ్బంగా వ్రాశాయి. అచ్చతెలుగు మాటలు వాడేప్పుడు, ఎక్కడా ఏలితనం (కృత్రిమత) కనిపించకపోవటం నాగనార్య వ్రాతల్లో కనుకలిగా కనిపిస్తుంది! ఈ కబ్బాన్ని చదువుతుంటే ముప్పాతిక వంతు మామూలు తెలుగు కబ్బం చదువుతున్నట్టే అనిపిస్తుందని భారతి మాసపత్రికలో క్షేమేంద్ర వ్రాశారు. తెచ్చిపెట్టుకున్న మాటలు ఒక్కోప్పుడు పంటికింద రాయిలా తగుల్తుంటాయి. కానీ, నాగనార్య వ్రాతల్లో అలాంటివి కనిపంచవు. ఎబ్బెట్టుతనం దాదాపుగా లేదని ఆయన నాటి వ్రాతరుల మెప్పుపొందిన కబ్బం ఇది.

అల్లసాని పెద్దన గారి మనుచరిత్రకి ఇది అచ్చతెలుగులో వెలువడిన ఒక కూడపోక (అనుసరణ). మక్కికి మక్కీ అచ్చతెలుగు కాదు. కత ఒకటే గానీ, కత చెప్పిన తీరు వేరు. ఒక నుడిలో ఎన్నదగిన ఒకనాటి పెద్ద కబ్బాన్ని అదే నుడిలో మరో రూపాన మలచడం అనేది ఇక్కడ కొత్తగా కనిపిస్తుంది. అచ్చతెలుగు కబ్బాలు తళుకించిన కవులెవరూ చేయని గొప్ప పని ఇది.

నాగనార్య అచ్చతెలుగు నుడికారంలో తిరిగి చెప్పడానికి కొత్త దోవ వేశారు. అచ్చతెలుగును ఎవరూ పెద్దగా పట్టించుకోక పోయినా తన ఎదనిండా నిండిన తెలుగు నెనరు కొద్దీ ఆయన అచ్చతెలుగునే వ్రాయటాన్ని ఎంచుకొన్నారు.

‘మనుచరిత్ర’ మాదిరిగానే ఈ ‘మనువు పుట్టువు’ కూడా ఆరు ఆశ్వాసాలతో 720 పద్యాలతో నడిచింది. ఇందులో గద్యం ఒక్కటి కూడా లేదు. అయితే, ఇది పెద్దనగారి కబ్బం లోని పద్యాన్ని అచ్చతెలుగులోకి మార్చి చెప్పిన వ్రాతగా కాకుండా, నాగనార్యగారు సొంతంగా కొన్ని చోట్ల పెంపు చేసి కొన్ని చోట్ల కుదించి వ్రాశారు. అయినప్పటికీ కతను ఎక్కడా వదిలిపెట్టినట్లు కనిపించదు.

ఈ కబ్బంలో కవి కూడబోయిన (అనుసరించిన) దానికి సొంతంగా ‘అరుణాస్పద ప్రోలు’ని బొమ్మకట్టించిన తీరు గొప్ప మచ్చు. పెద్దన ఒక్క పద్యంతో సరిపెట్టిన చోట నాగనార్యగారు ఇరవైనాలుగు పద్యాల మేరకు పెంపు చేశారు. అలాగే ప్రవరుడి గురించి కూడా పెద్దనకన్నా నాగనార్య వ్రాసిందే ఎక్కువ ఉంది.

గుటకలుమింగు, అడప దడప, దిమ్మదిరుగు, అట్టెడ, కడుపు చెరువగు, దబ్బున, ఆకు చాటుపిందె, వాజమ్మ, కచ్చితము, నట్టేట పుట్టిముంచు, రామందాడి, కుడిచికూర్చుండు, ఆదర బాదర, బఱ్ఱెగొడ్డు, బాదిన యట్లు, బల్లుమని తెల్ల వారు, పడి పడిచూచు, చెక్కు చెమర్చు, పూసగ్రుచ్చు ఇలాంటి తెలుగు పలుకుబడులతో నిండిన కబ్బం ఇది.

నాగనార్యుల సొంత తలంపుల్లోంచి పుట్టిన పోలికలు వారి తీర్పరితనాన్ని (పరిశీలనా పాటవం) గొప్పగా అవుపింపచేస్తాయి. ‘ముకుద్రాడు దెగిన కఱికోడె’, ‘కలుపు దీసిన పొలము’, ‘కడిగి గాలించు’ , ‘ఊబను కఱ్ఱకదల్చు’, ‘వెన్నముద్ద పయిజల్లు చక్కెరపొడి’, ‘చెలమును ద్రవ్విన నీరు’, ‘విరిపొట్టము విచ్చుట’, ‘పైరుకు నానుడువాన సయించుట’, ‘రొంపమానిసికి మర్వంబించునే?’ ఇలాంటి పోలిక పలుకులు (ఉపమాలంకారం) కతకు తగినట్టు అలవోకగా వాడటం అచ్చతెలుగున ఒక కొత్తదనాన్ని తెచ్చినట్టయ్యింది.

“అచ్చెరు వెచ్చ విచ్చవిరియన్‌ గనుదమ్ముఁలుఁ జూపుకోపు పై
పెచ్చుగఁ గల్వ పూల్లురియ విచ్చిన వెచ్చని చన్నుదోయి పెం
పచ్చువడన్‌ గగుర్పొడువనబ్రపుం గోరిక లూరిపేరి న
ట్లచ్చర మిన్న కన్గొనియె నా ‘నలకూబరు’ తీరు పాఱునిన్‌”

మను చరితము రెండవ ఆశ్వాసంలోని 28వ పద్యంతో పోల్చుకొని ఈ పద్యాన్ని చూస్తే నాగనార్య పెద్దనకు దీటైన కబ్బరచన చేశారనిపిస్తుందని డా|| కె వి సుందరాచార్యులు వ్రాశారు.

నాగనార్య వ్రాతల్లోని పద్యాలు ఆయన నుడికార నేర్పరితనాన్ని, ఛందస్సు మీద పట్టును బుర్రలో పుట్టిన తలంపుల పూలకు ఎదలో తావినలదినట్టు వ్రాయగల తేరుగడను తెలివిడితనాన్ని చాటుతాయి.

‘మెచ్చులపచ్చ మ్రుచ్చిలి’లో గాని, ‘మనువు పుట్టువు’లో గానీ పద్యాల్లో కనిపించే కైసేతలు (అలంకారాలు) పరువడులు (భావోద్వేగాలు) ఉరవడులు (సహజమైన వేగం) గానీ సాజమైన తీరున కనిపిస్తాయి.

అలాగే, వారి ‘వీరపూజ’లోని పద్యాలు దావరితనం (వీరత్వం), సివాలాడే ఊపు (ఆవేశం), గండరితనం (పౌరుషం) వంటివన్నీ చాలా లోతైన మాటలతో బొమ్మకట్టి కనిపిస్తాయి

‘తిలోత్తమాసాహసికము’ లోని పద్యాలు కులుకు (శృంగారము)నీ, సోయగాన్ని, సొంపునీ, ఇంపునీ (సున్నితత్వాన్ని) చాటుతాయి.

అచ్చతెలుగులో వ్రాస్తే తేటతెల్లంగా వ్రాయటానికి కొలదులు (పరిమితులు) ఏర్పడతాయనే కొందరు అనుకోవటాన్ని ఆయన లేనిదాన్ని ఉన్నట్టు అనుకోవటం అంటాడు. జోడైన మాట కుదిరితే అచ్చతెలుగులోని సొంపు మరి దేనికొస్తుంది? తెలుగు నుడికారాలు నుడికట్లు ( పదబంధాల కూర్పు) ఏ నుడికీ తీసిపోనివని ఆయన నొక్కి చెప్పారు.

వెనకటి పంటను చెప్పుకుంటూ ఇప్పుడు పండించకుండా వదిలిన పొలాన్ని అచ్చతెలుగున వేవిలి నేల అంటారు. తెలుగును కూడా మన వాళ్లు అలానే ‘వేవిలి’ చేశారు. తెల్లవారితే చాలు పొన్నెగంటి తెలుగన్న కూచిమంచి తిమ్మకవి అంటూ పేరుకొలుపు (నామజపం) చేస్తారు. కానీ తెలుగున వ్రాయరు.

తెలుగున వ్రాయటం అంటే నూటికి 60-80 గా ఉన్న సంస్కృతం మాటల్ని ఆపి నూటికి 60-80 తెలుగు మాటల్నయినా వాడాలనే తలంపు మన వ్రాతరులకు కలగాలి. నారు నాగనార్య 50 యేళ్ల వాడే త్రోవ చూపాడు. ఆయన్ని కూడపోకపోవటం మన చేతకాని తనం అంతేగాని ఆయన చపచపనగా (వృథాగా) పనిచేశాడని అనుకోవటం సరికాదు.

ఆయనతో పాటుగా వ్రాసిన వ్రాతరులు ఇంకా వ్రాస్తున్న వారున్నారు. అచ్చతెలుగు ఎన్నటికీ చపచపన కాదు. తెలుగు మాటలు వాడకుండా తెలుగు కావలి గురించి మాట్లాడటం నవ్వు తెప్పించదూ..!

అచ్చతెలుగున వ్రాస్తే ఎవరూ చదవరనే వారిని అలా ఉంచి, అందరూ చదివే తీరున తెలుగు మాటల వాడకాన్ని పెంవ్చుకుంటూ మనపని మనం చేసుకుపోదాం!

Exit mobile version