Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అచ్చతెలుగు అల్లసానిపెద్దన’ శ్రీ నారు నాగనార్య

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన – ‘అచ్చతెలుగు అల్లసానిపెద్దన’ శ్రీ నారు నాగనార్య – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

 

వైద్యవిద్వాన్ మధురకవి అచ్చతెలుగు అల్లసానిపెద్దన శ్రీ నారు నాగనార్య

“అబ్బురపు టచ్చ తెనుఁగీ
కబ్బము డెబ్బది యొకండు గా
బ్రబ్బిన బత్తిని వ్రాసితి
బొబ్చిలుతన్ దలిబాస చొరవల్‌ తెరువుల్”

మనకు సొంత ఆలన (స్వాతంత్ర్యం) వచ్చాక అచ్చతెలుగున కబ్బాలు వ్రాసిన అరుదైన వారిలో శ్రీ నారు నాగనార్య చెప్పుకోదగిన వ్రాసరి (కవి)!

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, మారేపల్లి రామచంద్రశాస్త్రి, దాసు శ్రీరాములతో ఆగిపోయిందనుకున్న అచ్చతెలుగు కదలికకు జీవం పోసిన వాడాయన.

“అచ్చ తెలుఁగన్న నాకిచ్చమెచ్చువచ్చు. తన తల్లి బాసఁ బేరానను జదువరి యొకడు గలుగు. తన బాసయు తన సీమయు తన తల్లియు నొక్క తెగగ తలపోసి” అచ్చతెలుగులో కైతలు అల్లాడాయన. తెలుగంటే తనకు గల నెనరువలనే అచ్చతెలుగున వ్రాయాలనే తలంపు కలిగినట్టు చెప్పుకున్నారాయన. అటు సంస్కృతమూ ఇటు తెలుగు రెండింటి పైనా పట్టు ఉన్న చదువరి నాగనార్యగారు, అచ్చతెలుగుకే ఎక్కువ చోటిచ్చిన వ్రాయసగాడు.

అచ్చతెలుగు మీద వరుసగా వ్రాస్తున్న నా విరివి వ్రాతల్లో పదేపదే మనం ‘అచ్చతెలుగంటే సంస్కృతాన్ని తూలనాడటం’ కాదని, తెలుగు మాటల వాడకం పెంపుకోసం చేసేదేనని చెప్పుకుంటూ వస్తున్నాం.

ఇప్పుడు కైతలు వ్రాసేవారిలో ఒకప్పటిలా సంస్కృతంలో దిట్టలు తక్కువ. మనకు తెలీకుండానే ఎన్నో సంస్కృతం అవి సంస్కృతం అని తెలీకుండానే అలవోకగా వాడేస్తూన్నాం. ఎవరైనా చెప్తే, ‘తెలుగు కాదా’ అని అచ్చెరువౌతున్నాం!.

మన మాటల్లోనూ, వ్రాతల్లోనూ ‘అనేకమంది’ లాంటివి (దుష్టసమాసాలు) దొర్లిపోతున్నాయి. ‘చాలామంది’ అని తెలుగులో అంటే వచ్చే పరువు తక్కువ ఏమీ లేదు. ఆదిభట్ల నారాయణదాసుగారి లాంటి అచ్చతెలుగు వ్రాసరులు (రచయితలు) తెలుగులోకి సంస్కృతాన్ని దూర్చి, దాన్ని ఇలా చెడ్డమాటలుగా మార్చి మన్నన తగ్గించకూడదనే అన్నారు. ఇలా అనటమే సంస్కృతానికి మనం ఇచ్చే అసలారే తేకువ (గౌరవం).

ద్రావిడ నుడులు, సంస్కృత నుడుల కూటముగా నడుస్తున్న తెలుగులోంచి తెలుగు మాటల్ని జల్లించుకోగలిగితే తేరినవన్నీ అచ్చతెలుగులే! ఈ అచ్చతెలుగుమాటలకు తప్పనప్పుడే సంస్కృత నుడులు, తత్సమాలు తద్భవాలు లేదా అన్యదేశ్యాలను వాడాలని, పేర్లనీ- పొగడ్తల్నీ మార్చకుండా అలాగే వాడుకోవాలని వెనకటి నుండీ వస్తున్న అచ్చతెలుగు కట్టు. ఈ కట్టు తీరునే నారు నాగనార్య అచ్చతెలుగున ‘మనువు పుట్టువు’ పేరుతో అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్రని, “మెచ్చుల పచ్చ మ్రుచ్చిలి” పేరున నందితిమ్మన పారిజాతాపహరణం కబ్బాన్ని, వెన్నెలపెండ్లి అనే సొంత కతతో ఒక కబ్బాన్ని అలాగే రామకత పేరుతో రామాయణాన్ని ఈ అన్నింటినీ అచ్చతెలుగులోనే వ్రాశారాయన.

మనుగడ సుద్దులు (జీవిత కథ)

1903 జూలై 3వ తేదీన సుబ్బమ్మ, నరసింహం దంపతులకు కడప జిల్లా రాజంపేట తాలూకా రాఘవరాజపురం అగ్రహారంలో పుట్టిన నాగనార్య రైల్వే కోడూరు నాగవరం దగ్గర ఉండేవాడు. ఆయుర్వేద వైద్యుడాయన. వైద్యవిద్వాన్ చదివారు. కార్వేటి నగరంలోని వేదం వెంకట కృష్ణశర్మ వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద ఛందస్సు, అలంకారశాస్త్రాలు, జనమంచి శేషాద్రిశర్మ వద్ద ‘శ్రీవిద్యోపాసన’ నేర్చాడు. సంస్కృతాంధ్ర భాషల పైన పట్టు పెంచుకున్నారు. తరువాత రమణ మహర్షి పట్ల ఆదట(భక్తి) పెంచుకున్నాడు.

సొంత ‘ఆలన కదలిక’ (స్వాతంత్ర్య పోరాటం) కోసం 1921 ‘సహాయ నిరాకరణోద్యమం’లో పాల్గొన్నారు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమంలో ఉంటూ ఖద్దరు కదలికలో పనిచేశారు. 1923, 1947లలో సత్యాగ్రహ కదలికలలో పాల్గొన్నందుకు రెండుసార్లు కటకటాల పాలయ్యారు.

1949 నుంచి వ్రాతపైన చూపు పెట్టుకున్నారు. 72 పద్యకావ్యాల వరకూ వ్రాశారు. 1973 జనవరి 18న మరణించారు. చనిపోయే ముందు ‘రామకత’ అచ్చతెలుగు కావ్యం వ్రాశారు.

వెన్నెల పెండ్లి అచ్చతెలుగు కబ్బం

శ్రీ నారు నాగనార్య వ్రాసిన వెన్నెల పెండ్లి కబ్బం 1971 ఆగస్టు 1వ తేదీన మొదలుపెట్టి, అదే నెల 9 నాటికి పన్నెండు పొద్దుల్లో వ్రాసేశారు. ఇందులో మొత్తం 214 గద్య, పద్యాలు ఉన్నాయి. ఇది ఆయన డెబ్బయ్యవ కబ్బం. పొన్నగంటి తెలగనార్యుడు మొదలుపెట్టిన అచ్చతెలుగు కబ్బపు తీరుకు నాగనార్య కబ్బాలు ఒక కొనసాగింపు.

ఈ కబ్బంలో కత పాత జానపద కతలాంటిదే! ‘వలమురి’ని చందురుడనే రాజు ఏలుతున్నాడు. పక్కనే ఉన్న ‘సుడిగట్టు’ అనే సీమను ఏలే రాజుగారి కూతురు ‘వెన్నెల’! ఆమె సొంపుల గురించి విని చందురుడు ఆమెను కోరటం, వెన్నెల కూడా చందురుడి గురించి విని ఎదలో నెయ్యాన్ని పెంచుకోవటం, కానీ అందుకు తండ్రి ఒప్పకపోవటం, చివరికి పెద్ద ఎత్తున కయ్యం, అందులో చందురుడే గెలవటం, వెన్నెలను పెండ్లాడటం ఇదీ ఇందులో కత.

ఈ కతలో పెద్ద మలుపులూ, చిక్కుముడులూ లేవు. ఉన్నదంతా వ్రాసిన తీరులోనే ఉంది. చందురునికి, వెన్నెలకు మధ్య ఒక బ్రాహ్మణుడు మాటలు చేరవేసి ఆ ఇద్దరినీ కలిపేందుకు పడిన పాట్లు వెనకటి కబ్బపు వ్రాతల తీరును గుర్తుకు తెస్తుంది. ఈ కబ్బంలో వలమురి అంటే ఎడమవైపుకు తిరిగిన కూతకైదువు (శంఖం)అని. ఎడమ (వామపక్ష) తలపుల తీరులో వలమురిని బొమ్మకట్టించాడాయన. కయ్యం జరిగిన తీరు భారతం, కుమారసంభవం, ఉత్తరహరివంశం లలో కయ్యాలవ్రాతను తలపింప చేస్తుంది. కూడపోయినట్టుగా (అనుసరణ) కాకుండా, తేలికైన తీరున నడిపించారు.

ఈ కబ్బానికి వన్నె తెచ్చింది ఆయన వాడిన బాసే! ఏలిమాటలు (కృత్రిమ పదబంధాలు), తెచ్చి ఇరికించి కూర్చిన మాటలు దట్టంగా పెనగొన్నవేవీ ఇందులో కనిపించవు. మంది నోట పలికే వాడుక మాటల్నే ఎంతో నేర్పుగా మలచారు.

తద్భవీకరణ వలన తెలుగు నిలుపును పొందిన మాటలు, తెలుగువారి నోట సాజంగా పలికే మాటల్లా ఒదిగాయి. సంస్కృతం నుంచి వచ్చిన చిన్న మాటలు కూడా తెలుగులో కలిసిపోయి, కబ్బానికి అచ్చతెలుగు సాజంగా అమరింది.

‘తూచాతప్పక’ ‘పాతరలాడుట’, ‘చుట్టరికము’, ‘చూరులో పెట్టుట’, ‘ఊపిరి పీల్చరాని పనులు’, ‘గొంతుమీదికి వచ్చుట’ ‘ఇరువదినాల్లు గంటలు’ వంటి మాటలు ఈ కబ్బాకి నిండుదనాన్నిచ్చాయి. ఇవి పదాలుగా కాకుండా, అందులోని వారి (పాత్రలు) ఎదతీరుని చాటుతాయి.

కయ్యం జరిగేప్పుడు పగవాళ్ళని ఊచకోత కోయటాన్ని ‘రైతులు జొన్నను కోసినట్లు’ అనటం, మింటిలో చుక్కలు మొలిచినట్లుగా కనిపించడాన్ని ‘తడిజొన్నలు ఆరబోసిన వడువు’తో పోల్చడం, వెన్నెలను ‘విరిసిన వనం’ అనటం ఈ కబ్బంలో తెచ్చిపెట్టుకున్నట్టుగా కాకుండా సాజంగా పుట్టినవిగా ఉంటాయి.

అచ్చతెలుగు అనేది సంస్కృతం మాటల్ని తీసేసి తెలుగు మాటలను పెట్టటమేనని అనుకునేవారికి ఈ కబ్బం అచ్చతెలుగున ఎలా వ్రాయాలో నేర్పుతుంది. మంది నోట పలికే మాటల్ని, వారి బతుకు కుడుపుల్ని, వారి తలంపుల తీరును ఎత్తి చూపటం వలన తెలుగుతనం వెలుగున కొస్తుందని ఈ ‘వెన్నెల పెండ్లి’ కబ్బం చాటి చెప్తుంది. అచ్చతెలుగున వ్రాయటం అంటే తెలుగుదనాన్ని చాటి చూపటం!

“మెచ్చుల పచ్చ మ్రుచ్చిలి” కబ్బం

నారు నాగనార్య గారు నందితిమ్మన వ్రాసిన పారిజాతాపహరణం కబ్బాన్ని అచ్చతెలుగులోకి మార్చి దానికి “మెచ్చుల పచ్చ మ్రుచ్చిలి” అని పేరుపెట్టాడు. “మెచ్చులపచ్చ మ్రుచ్చిలిన్ దప్పక కొంటి దొంటి కత..” అని ఈ కబ్బం గురించి ఆయన చెప్పుకున్నాడు.

“పలువురు జదవని వ్రాతల వలన్మేలేమి యంచు బలుకుట వినియు తల్లిబాసను పలుకుట దప్పే యంచు.. నాగనార్య ఈ కబ్బాన్ని అచ్చతెలుగున కూర్చానన్నాడు.

“అచ్చతెనుఁగునఁ గబ్బములల్లి తల్లి
బాస మునుపటి కంటే సెబాసనంగ
వాసిఁ గూర్చిన తొంటి కయీసరులను
వేడుకుని వారికరిదిఁ బాడుకొనెద”

అంటూ అచ్చతెలుగున వ్రాసి, “తల్లిబాస సెబాసనంగ వాసి గూర్చటం” తనపనిగా చెప్పుకున్నాడు. ‘తొంటి కయీసరులు’ (పూర్వకవుల్ని) కొలిచాడు. పారిజాతం చెట్టుని ‘మెచ్చుల మాను’ అన్నాడు. మ్రుచ్చిలి అంటే దొంగతనం. ‘మెచ్చులపచ్చ మ్రుచ్చిలి’ అంటే పారిజాతాపహరణం అని!

“నాయెడఁద బొంగువారుచున్నది యయారె
తల్లిబాసగు తెనుఁగున కుల్ల మలర
నేమి కానుక యిత్తుఁ గెంపెడఁద జీల్ప
బొడము నెత్తురు పారాణి పూఁతఁదప్ప”

అంటూ తన గుండె చీలిస్తే తెలుగే కనిపిస్తుందంటాడు.

కృష్ణుణ్ణి వేలం వేసినప్పుడు సత్యభామ పొగిలిపొగిలి ఏడవటాన్ని నాగనార్య ఇలావ్రాస్తారు:

“ఒగరు తొగరు చిగురు వగరుచు సగమాని
క్రోల్చి క్రోల్చి గండు కోకిలమ్మ
పాటవోలె నేలపాల్యి యేడ్వనీ
కేమీవచ్చె దలపు లెందుజొచ్చె” అని!

సత్యభామ పొగరణిగిందన్నట్టుగా ఉంటుందీ పద్యం.

అచ్చతెలుగున వ్రాయటం అంటే నడుస్తున్న నడవడిని పట్టించుకోకపోవటం కాదు. ఆయన ఏడాది అంకెల గుర్తుల్ని చెప్పటానికి విక్రమార్కశకం, శాతవాహన శకం లాంటివి కాకుండా క్రీస్తుశకాన్నే ఎంచుకున్నాడు. ఆయన చదువరిని చూపున పెట్టుకున్న వ్రాయసగాడు, మందిని మరచి మింటిలో తిరిగితే నేలపైన గుర్తులు మిగలవని ఎరిగినవాడు, పొత్తాల చదువరి తనాన్ని కాక మంది బతుకుల చదువరి తనాన్ని చూపించగలిగితే అచ్చతెలుగు కబ్బాలు మందిని చేరగలుగు తాయని నమ్మినవాడు కూడా!

ఇంకా మనువు పుట్టువు, రామకత లాంటి కబ్బాల గురించి చెప్పాల్సింది ఉంది వచ్చే ‘సంచిక’లో చూద్దాం!

Exit mobile version