[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చతెలుగు ‘మారుమాటలు’’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
మారుమాట అంటే పర్యాయపదం. ఒక మాటకి మారుగా లేదా బదులుగా వాడే మాటని పర్యాయపదం అంటారు. దానికి సరైన తెలుగుమాట మన నుడికలిమిలో (నిఘంటువుల్లో) కనిపించలేదు. అందుకని, అందరికీ తెలిసేంత తేలికగా ‘మారుమాట’ అని చెప్పుకుందాం. మారుమాటల పుట్టుకకు సాకులు (నిమిత్తం, కారణం) చాలా ఉన్నాయి.
ఋగ్వేదంలో ద్రావిడ నుడులు
ఎఫ్ బి జె క్వైపర్ అనే నుడి ఎరుకల మేటి (భాషావేత్త), ఋగ్వేదంలోంచి ‘గంగ’ లాంటి 383 నుడువుల్ని ఏరి, అవి ఇండో యురోపియన్ భాషాకూటముకు చెందిన మాటలు కావని తేల్చాడు. అంటే, ఋగ్వేదంలోకి ఆనాడే వచ్చి చేరిన అరువు పదాలని ఆయన ఒప్పుగా చెప్పుకొచ్చారు.
ఋగ్వేద నుడితో(భాష) పాటుగా ద్రావిడ, ముండా లాంటి నుడువులు మాట్లాడేవారు కూడా ఋగ్వేద పెద్దలతో (ఋగ్వేదార్యులు) కలిసి బతికారు. కాబట్టి, ఈ 383 నుడులూ కచ్చితంగా ద్రావిడ లేదా ముండా భాషాపదాలు కావచ్చని క్వైపర్ గారి తీర్పు. ఈ ద్రావిడ లేదా ముండా నుడులు (భాషలు) మాట్లాడే ఏలుకోటి తెగలతో ఋగ్వేద పెద్దలకు (ఆర్యులు) తరచూ జగడాలూ, నెయ్యాలూ జరుగుతుండేవి. ఒక పెద్ద జగడం (యుద్ధం) జరిగాక గెలిచినవారు ఓడినవారికి బానిస లౌతారు. ఆ బానిసల ద్వారా గెలిచినవారు సంతానం కంటారు. ఆ సంతానానికి ఆ ఇద్దరి పోలికలూ కలగలసి ఉంటాయి. అలాగే, ఆ ఇద్దరి నడవడులు, నుడులు కూడా కలగలసి పోతాయి. అలా ఏర్పడిన కొత్త తెగ కొత్త మనుగడ మొదలెడుతుంది. కాబట్టి, నడవడి(చరిత్ర)ని జగడాలు కాదు జగడాల తరువాత జరిగిన కలయికలే చాటుతాయి! భారతదేశపు నడవడి (చరిత్ర) అంతా ఈ కలయిక(జాతుల సంలీనం)ల వలనే జరిగింది. కలయికల వలనే ఋగ్వేదంలోకి ద్రావిడ,ముండా నుడులు కొన్ని చేరి ఉంటాయి. క్వైపర్ గారి తీర్పుని మనం ఇలా విడమరచి చూడవలసి ఉంటుంది.
మచ్చుకి ఋగ్వేదంలో ‘అపూపం’ అనే రొట్టె గురించి చూద్దాం: అపూపం ఋగ్వేదంలో చాలాసార్లు కనిపిస్తుంది. ‘కూకటి ద్రావిడ నుడు’ల్లో (మూలద్రావిడ పదాలు) అప్పం అనే మాట ఈ ఋగ్వేద అపూపానికి మూలం అంటారు క్వైపర్ గారు. ‘కూకటిద్రావిడ’ (ప్రోటో ద్రావిడ-మూలద్రావిడ) నుండి అప్పం అనే నుడినీ, దాని తయారీని కూడా ఋగ్వేద పెద్దలు తీసుకుని ఉంటారు. ఈ అప్పాన్నే తెలుగులో అప్పచ్చి, అప్పాలు అంటున్నాం.
ఇలా క్వైపర్ గారు ఇచ్చిన 383 పదాలలో మన ద్రావిడ నుడువులు ఇంకా ఎన్నున్నాయో మనం వెదికితే భారతదేశంలో ద్రావిడ నుడికూటము (ద్రవిడియన్ ఫ్యామిలీ ఆఫ్ లాగ్వేజి) ఎంత వెనకటి నాటిదో (ప్రాచీనత) తెలుస్తుంది. దానిలోంచి పుట్టిన తెలుగు నడక, నడత, నడవడిల వెనకటితనం కూడా తెలుస్తుంది.
ఇక్కడ ద్రావిడ అనే మాట గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది. సంస్కృతంతో సంబంధంలేని ఒక నుడికూటముగా చెప్పటానికి ఆంగ్లేయులు పెట్టిన పేరు ద్రావిడ! ఋగ్వేదం అప్పుడు వీళ్లెవరూ తమని ద్రావిడ తెగగా చెప్పుకోలేదు. ఆ నాటికి ఆ మాటే పుట్టలేదు. అయితే, ఇది ఇప్పుడు అందరికీ తేలికగానే తెలుస్తోంది కాబట్టి, తెలియజెప్పేందుకు మాత్రమే ‘ద్రావిడ’ అనే మాటని వాడవలసి వస్తోంది.
నుడువుల్నిబట్టి నుడుల నడవడి = భాషాచరిత్రని, తెలుసుకోగలగటాన్ని లింగ్విస్టిక్ ఆర్కియాలజీ అనే విన్కి (శాస్త్రం)గా చెప్తారు. తెలుగునుడుల్లో వెనకటివాటిని అంటే, కూకటి (మూల) ద్రావిడ నుడువుల్ని ఏరగలిగితే తెలుగు వెనకటితనం= ప్రాచీనత తేల్తుంది.
‘గంగ’ ద్రావిడ నుడి కావచ్చు!
తెలుగువారికి గంగమ్మ పెద్ద వేలుపు! తెల్లనిది, మయిల లేనిది, నేటైనది (పుణ్యప్రదం)గా ఉండే దేన్నయినా గంగతో పోల్చటమో లేక గంగ అనే పేరు పెట్టుకోవటమో తెలుగువారికి అలవాటు. గంగాళం నుండి గంగిరెద్దుదాకా గంగతో ముడివడిన నుడులు సంస్కృతం తరువాత తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి.
ద్రావిడ భాషల్లో గంప, గంగాళం లాంటి పేర్లలో ‘గం’ అంటే పెద్దది అనే! ‘గ’ /‘గా’ అనేది కాన్ అనే మాటకు చెందినది. తిన్నగా, పొందికగా అని! దీనికి ‘అ’ చేరిస్తే ‘ అగ’ అవుతుంది. చేయగ, చూడగ, వ్రాయగ లాంటి మాటలు ఇలా పుట్టాయి. అగపడు అంటే పెద్దదిగా కనిపించటం. తెలుగులో ‘గంగ’/ ‘గంగి’ అంటే గొప్ప అని! గొప్పది ఏదైనా అది గంగే మనకి! గంగిరెద్దు అనే పేరులో ‘గంగి’, పెద్దది, గొప్పది, మేలిమిలనే సూచిస్తుంది గదా! ఋగ్వేదానికన్నా ముందునాటి ద్రావిడులు పెద్ద ఏరు కాబట్టి దాన్ని ‘గంగ’ అనే పేరుతో పిలిచి ఉండొచ్చు.
ఋగ్వేదం పెద్దలు ఐదు నదుల కూటము అయిన పంచాప (పంజాబ్) దగ్గర ఉన్నప్పుడు ఋగ్వేదంలో ఎక్కువ పాలు తయారైందని పెద్దలు చెప్తారు. ఆ తరువాత గంగాతీరం వెంబడి కడలి దాకా నడిచినప్పుడు ఋగ్వేదంలో తక్కిన భాగాలు పూర్తయ్యాయి. కాగా, కుడినేల (దక్షిణం)కు చెందిన ద్రావిడులకు ఎక్కడో ఉన్న గంగ ఎలా తెలుసంటే, అప్పట్లో ద్రావిడులు ఎడమనేల(ఉత్తరదిక్కు) పైన (కూడా) ఉండి ఉంటారు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, సింధు నేలలో ‘బ్రాహుయీ’ అనే ద్రావిడనుడి మాట్లాడిన తెగలు ఉండేవారని నుడినేర్పులు చెప్తారు. కాబట్టి అప్పం, గంగ లాంటి ద్రావిడ కూకటి మాటలు (ప్రోటో ద్రవిడియన్) ఋగ్వేదంలోకి చేరటంలో వింతేమీ లేదు.
మారుమాటలు ఇలా..
“గంగని మీ తెలుగులో ఏమంటారు?” అని ఎవరో నారాయణదాసు గారిని అడిగితే తడుముకోకుండా “అంకులేరు” అన్నారట ఆయన! ‘అంకులు’ అంటే వేల్పులు (దేవతలు). ఈ అంకులు అచ్చతెలుగు మాట. ఆంగ్లం ‘అంకుల్’తో దీనికి చుట్టరికం ఏమీ లేదు. నారాయణదాసు వారు ‘సీమపలుకువహి’ అనే పొత్తంలో ‘అంకులు’ అనే మాటకి మరికొన్ని మారుమాటలు= పర్యాయపదాలు ఇచ్చారు:
చదలుకాపులు, చావనివారు, జియ్యలు, జేజెలు, జేజేలు, తెరగంటులు, తొలి వేల్పులు, పగతురు, పల్కుటల్గు మేటులు, బాసవాలులు, బాసవాలుదిట్టరులు మింటితెరువరులు, మినుకు తెరువరులు, ముడియనివారు, వినుద్రిమ్మరులు, వేలుపులు ఇవీ ఆ మారుమాటలు. నిజానికి ఈ మాటలన్నీ కొన్ని నారాయణదాసుల వారూ, మరికొందరు వెనకటి కవులూ అల్లినమాటలే! అల్లటం దేనికంటే, ఆ నుడిలోపలి ఎదని మనకు విప్పి చూపటానికే! వ్రాయితల నేర్పు ఇక్కడే కదా బయట పడేది..?
మారుమాటలు మనకు బాగా తెలిసి ఉండాలి. అచ్చంగా తెలుగులో వ్రాయాలనుకున్నప్పుడు సరైన మాట దొరకకపోతే మారుమాటకోసం వెదకాలి. మారుమాటలు ఒక్కో సారి వ్రాతకు సొగసునిస్తాయి. ‘గంగ’ని అంకులేరు అనటంలో ఆ సొగసు బాగా కనిపిస్తోంది. కాబట్టి, అచ్చతెలుగులో వ్రాయటానికి మనం ఒక్కోసారి మారుమాటలకు పెద్ద పీట వెయ్యాల్సి వస్తుంటుంది.
తెలుగు ‘వేల్పులు’
ఋగ్వేదానికే నుడులందించిన ద్రావిడులకు సొంతవైన వేలుపు కొలుపు లున్నాయి. గంగమ్మ కొలుపు అలాంటి వెనకటిదై ఉండవచ్చు. అంకమ్మ, అంకాలమ్మ, అక్క, ఎక్కలమ్మ, ఎఱ్ఱపోతమ్మ, ఎల్లమ్మ, ఏల, ఎహువల, ఎంకి, కూనలమ్మ, గంటలమ్మ, గొంతెమ్మ, గోగులమ్మ, పెద్దింటమ్మ, పోలక, పోలకమ్మ, పోలేరమ్మ, బెజ్జమ్మ, ముత్యాలమ్మ, మైలారు లాంటి తెలుగు వేల్పుల్లో తొలివేల్పులు ఉన్నారు. ఋగ్వేద పెద్దలు (ఆర్యులు) మరియు ద్రావిడుల నడుమ ఏర్పడిన కలయికల వలన వేలిమి (యఙ్ఞ యాగ హోమాదులు) కొలుపుల్ని మనం కూడా మొదలు పెట్టాం. దీన్ని ‘ద్రావిడుల ఆర్యనీకరణం’ అంటారు. అలాగే, మన కొలుపులు కొన్ని ఋగ్వేద పెద్దలు కూడా అలవాటు చేసుకున్నారు. దీన్ని ‘ఆర్యుల ద్రావిడీకరణం’ అంటారు. రెండు కుదురులు లేదా తెగల కలయిక వలన జరిగింది.
ఈ మొత్తం తంతులో మనం ఇచ్చినదెంత పుచ్చుకున్నదెంత అనడిగితే పుచ్చుకున్నదే తూకానికి ఎక్కువ ఒగ్గుతుంది. అలాగని ఇచ్చినది తక్కువేమీ కాదు. ఎందుకంటే, తెలుగు అనే మాటలో తెల్ అంటే తెల్లని (స్వచ్ఛమైనది), తెలియు (విదితమగు, విశదమగు, మేలుకొను, ప్రసన్నతనొందు) ఇన్ని ఒప్పుకోళ్లున్నాయి. తెలుగంటే, తెలివిడి కలిగినవారి నుడి(భాష) అని!
సంస్కృతం వెంటే మనం నడవటాన, సంస్కృతంలోనే పుట్టిన కతల్ని, గాథల్ని మనం వెంట తెచ్చుకోవటం వలన మన మాటల తీరుకూడా అదే దారిన నడిచింది. మచ్చుకి గంగానది మారుమాటల్ని కొన్నింటిని చూద్దాం:
విష్ణువు ‘అడుగు’ = పాదం నుండి పుట్టింది కాబట్టి ‘గంగ’ని ‘అడుగుపుట్టువు’, ‘పెరుమాళ్ళ అడుగు బుగ్గ’, ‘వెన్ను అడుగు పాప’ ఇలా అన్నారు. దీన్నే కొద్దిగా తిప్పి గంగానదిని అడుగులో గలవాడు కాబట్టి విష్ణువును ‘అడుగువాక గలవాడు’ అన్నారు.
‘అంచ’= ‘హంస’ లకు నివాసం కాబట్టి గంగని అంచలవిడిది అన్నారు. వెల్లివాక, తెలియేఱు, తెలివాక ఇవన్నీ తెల్లని ఏరు(నది)కి పేర్లు. వాక అంటే వైపు, పక్క(Side) అని!
నదులు ఎల్లలుగా మన నుడినడవడులు (భాషాసంస్కృతులు) నడుస్తుంటాయి. వాక అలాంటి ఎల్ల (పొలిమేర)ని చాటే మాట.
“చదలువాకనీటల జలకమాడి” అంటాడు నంది తిమ్మన. గంగని చదలువాక అనీ, ఆకాశవీధిని ‘చదలవాడ’ అనీ అన్నారు.
మిన్ను/విను అంటే ఆకాశం, స్వర్గం. గంగని మిన్నేరు అనీ, మిన్నీరు అనికూడా పిలుస్తారు. మినుచూలు, మినుబావి, మిను రతనము, మిన్నుకొలకు, మినువాక, మిన్నువాక లేదా మిన్వాక ఈ పేర్లన్నీ ఆకాశగంగని సూచిస్తాయి. శివుణ్ణి “మిన్ను వాక తాలుపు” అన్నారు. ఆకాశగంగని వినుజాలు, వినువాక, విన్వాక, విన్నుకేళాకూళి ఇలా పిలిచారు.
తలయేరు అంటే శివుడి తలపైన ఉండే నది. “పునుక తాలుపు తలయేఱు” అంటే కపాలం పుచ్చుకు తిరిగే శివుని తలపైన గంగ. వాకతాలుపు అంటే గంగాధరుడు, శివుడు. మినుసిగ వేలుపు తలయేరు అనటం కూడా ఉంది. భగీరథుని మొక్కు వలన ఆ మిన్ను నుంచి దిగివచ్చి 60 వేలమంది సగరపుత్రులకు వేలుపు వాసం(స్వర్గప్రాప్తి) ఇచ్చింది కాబట్టి, గంగని అరువది వేవుర ముగితి త్రోవ అన్నారు. భగీరథయత్నం అంటానికి ‘తలలోజేజమ్మ దిగిరావాలి’ అంటుంటాం.
నేలకిదిగొచ్చిన గంగ పెద్ద ఉరవడితో పారుతూ దారిలో జహ్ను అనే “అడవి నెలవరి” = మహర్షి ఇంటిని ముంచెత్తడంతో అలుకువ (కోపం) చెందిన ఆయన గంగను ఒక గుటకలో మింగేస్తాడు. భగీరథుడు వచ్చి కాళ్లంటి మొక్కితే జాలిపడి తన చెవినుండి గంగను వదిలి, ఆమెను తన పుత్రికగా దత్తు చేసుకుంటాడు. జహ్ను కూతురు కాబట్టి జాహ్నవి అన్నారు. జడధారి చెవిబుగ్గ, ‘జడధారి చెవి ఊట’ పేర్లు దీన్ని బట్టే ఏర్పడ్డాయి.
ఆకాశగంగ అనే సంస్కృత పిలుపుకి చదలేరు, చదలువాక సరైన తెలుగు మాటలు. టిబెట్లో గంగని లచ్చూనది అంటారు. “ల” అంటే వేల్పు. “చు” అంటే నీరు. ‘వేల్పుడిగ్గియ’ అనే మాట మనకూ ఉంది!
తాత అంటే పుట్టువునిచ్చే నాలుగు మొగాల వేలుపు, బ్రహ్మ! ఆయన చేతి కమండలంలో వాసం ఉంటుంది కాబట్టి గంగని తాత వనటి వెల్లి అన్నారు.
కూతురుకి కూతురు మనుమరాలు అవుతుంది. కడలికి కూతురు డబ్బులవేలుపు లక్ష్మీదేవి. ఆమెకి కూతురు గంగ. అంటే సముద్రుడి మనుమరాలు కాబట్టి గంగమ్మని కూఁతుబిడ్డ అంటారు.
గంగానది రెండుగట్లకీ మధ్య దూరం ఎక్కువ. వెడల్పైన నది కాబట్టి దూరపార అన్నారు. సముద్రానికి కూడా ఈ పేరుంది. పొడుగైన గంగానది మగుడుగా అంటే సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది కాబట్టి పొడుగుమగుడు బయలేరు అన్నారు.
పులిచూలు అంటే కుమార స్వామి తల్లి పార్వతి. పార్వతికి సవితి గంగమ్మ కాబట్టి పులిచూలిసవతితల్లి అనీ, పులిమావి సవతితల్లి, ఱెల్లుకానుపు సవతి అనీ పిలిచారు.
ఇంకా పొందామరలపంట, బంగారు తామర పంటచేను అనీ గంగను పిలుస్తారు. నెలవంక శివుడి శిరసున అలంకారంగా ఉన్నాడు. గంగకూడా శివుని శిరసున చేరింది ఆమెని వెన్నెలవంక అన్నారు.
త్రిపథగ అంటే ఆకాశం, భూమి, పాతాళం ముల్లోకాలను పావనం చేసిన గంగానది అనటానికి ముయ్యేఱు, మున్నీటిరాణి, మున్నీటికన్నె, మున్నీటిగరిత, మున్నీటిగౌరు, ముత్తెరువులాఁడి, ముత్రోవ ద్రిమ్మరి, ఇన్ని తెలుగు పేర్లతో పిలిచారు. రెప్పవేయని అమరులు స్నానం చేసి తరించే గంగ ఏరుని ఱెప్పవేయని మెప్పు కేళాకూళి అన్నారు.
కూకటిద్రావిడ (ప్రోటోద్రావిడ) మాటల్ని పుచ్చుకుని, సంస్కృతం త్రోవలో మన వెనకటి కవులు అచ్చతెలుగులో అనేక మారుమాటల్ని పుట్టించుకుని నుడికలిమిని పెంపు చేశారు. మాటని పుట్టించేప్పుడు అది చదువులేనివాడికి కూడా తెలిసేదిగా ఉండాలి. ఈ మధ్య కొందరు చదువుకొన్నవారికి కూడా తెలియని మాటల్ను పుట్టించి నుడికాపుదలకు పూనుకొన్నట్టు చెప్పుకున్నారు. తేలికగా తెలిసేలా మారుమాటలు ఇలా ఉండాలి! సంస్కృతం నుడువులు లేకుండా అచ్చంగా తెలుగులో వ్రాయాలన్నది సంస్కృతం మీద పగతో కాదు, సంస్కృతాన్ని వదిలి మనం ఎక్కడకూ పోలేము కూడా! మన తెలుగును మనం వాడకానికి తెచ్చుకోవాలన్నదే యావ!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
