Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చతెలుగు – మన నుడి, నడవడి, మనుగడ

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘అచ్చతెలుగు – మన నుడి, నడవడి, మనుగడ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ఒరుల నుడులు ఏవీ లేకుండా, మన తెలుగు మాటలతోనే మనం చెప్పదలచింది సొగసుగా, మంది అందరికీ తేలికగా బుర్ర కెక్కేదిగా ఉండేది ‘అచ్చతెలుగు’.

తెలుగులో వ్రాసేప్పుడు మన తెలుగు మాటలనే వాడాలని ఒట్టుపెట్టుకుని వ్రాస్తేనే అచ్చతెలుగు వ్రాత తేలికవుతుంది. చదివే వాళ్లకి ఇది ఇబ్బంది కలిగిస్తుందని అనుకోపనిలేదు. కొంచెకాడులక్కూడా (సామాన్యులు) అది వినుకలిగా (చెవికింపుగా) ఉంటుంది. అచ్చతెలుగు అంటే, కేవలం మాటల్ని మార్చి వ్రాయడం కాదు. మన మాటతో మన తలంపును, అందరికీ తెల్లమయ్యే తీరున చెప్పడం!

అచ్చతెలుగు తలంపుకు వెయ్యేళ్లు

అచ్చతెలుగులోనే వ్రాయాలన్నది ఇవ్వాళ నేను కొత్తగా చెప్తున్నది కాదు. తెలుగునుడి తనదైన ‘ఓజ’ (సహజ లక్షణం)ను, తనదైన నడకను నిలుపుకోవాలనే యావతో ఎందరో వ్రాయితలు, నుడిగండ లనదగినవారు వెనకటి వెయ్యేళ్లుగా ఎవరికి వీలైనంత పనిని వారు చేస్తూ వచ్చారు.

నన్నయ తన భారతంలో రెండు అచ్చతెలుగు పద్యాలు వ్రాశాడు కూడా! తిక్కన, ఎర్రన ఇంకా ఎందరో వ్రాయితలు అచ్చతెలుగున పద్యాలు వ్రాయాలని చూసినవారే. అంటే, మన నుడి తనదైన నడకను వదలకూడదనే తలంపు మనకు కొత్తది కాదు. మన నుడి పట్ల ఈ మక్కువ వెయ్యేళ్లుగా ఏదో ఒక తీరున కొనసాగుతూనే ఉంది.

ఏ నుడీ ఒంటరి కాదు

అయితే ఒక నుడిలోని ‘ఓజ’ ఆ నుడిని పలికే మంది (ప్రజల) మనుగడపైనా, వారి బతుకుతీరుపైనా, వేరే నుడికుదురులతో ఏర్పడిన చుట్టరికాలపైనా నిలబడి ఉంటుంది. ఒకరితో ఒకరికి చెలిమి లేకుండా ఏ నుడికుదురూ తనకు తానుగా సొంతంగా పుట్టదు. ఒంటరిగా మనలేదు కూడా!

నుడి అనేది ఎప్పుడూ ఎడతెగక పారే ఏరు లాంటిది. నుడివాగులు అనేకం వచ్చి దానిలో కలిసిపోతుంటాయి. వేరే నాడుల (దేశాల) వారితో సరుకుల బేరసారాలు, అక్కడివారిక్కడికీ ఇక్కడివారక్కడికీ రాకపోకలు, వేరే వాళ్లు ఇక్కడకు వచ్చి కలిసిపోవటం, వాళ్లతో కయ్యాలు, వియ్యాలు, ఏలుబడి వాడుకలు, ఒకరి వేలుపులకు వేరొకరు కొలుపులు, వారి చదువులు వీరు చదువుకోవటాలు, వ్రాతలు, బొమ్మలు ఆటపాటలు, అన్నీవేరేవారినుంచి పొందటాలు.. ఇలా ఎన్నో త్రోవల్లో ఒరుల నుడులు మన తెలుగులోకి వచ్చి కలిశాయి. ఇవ్వాళే కాదు, రేపూ కలుస్తూనే ఉంటాయి.

తెలుగు నుడికి చుట్టరికాలు

వందల ఏళ్లుగా తెలుగు నుడి సంస్కృతం, ప్రాకృతాలతో పాటు కన్నడం, తమిళం, మరాఠీ, ఉర్దూ, పర్షియన్, ఆంగ్లం వంటి అనేక నుడులతో చుట్టరికం కలిగి ఉంది. దాని వల్ల తెలుగు నుడికలిమి పెరిగింది. ఆ చుట్టరికం వలన మన నుడి తీరులోనూ మార్పులొచ్చాయి.

తెలుగులో ఒరుల నుడులు ఎక్కువగా ఉండటం ఒక తక్కువ తనం ఏమీ కాదు. తెలుగువారు కలుపుగోరులనీ ఎక్కడెక్కడి వారితోనో తెలుగు వారికి ఒద్దిక, చెలిమి వేల ఏళ్లుగా ఉండేవని అందువలన తెలుగులో ఒరుల నుడులు వేరే వారికన్నా ఎక్కువని ఇది చాటుతోంది.

అలా కొల్లలుగా ఒరుల నుడులు వచ్చి చేరినప్పటికీ, అవన్నీ పులిహారలో జీడిపప్పులా తెలుగుకు కమ్మదనాన్ని చేర్చాయే గానీ మనవైన అచ్చతెలుగు మాటలు చెదరలేదు.

అందుకే తెలుగు నుడి కథని ‘ఒరుల నుడి కలయిక’గానే చూడటం సరికాదు. అది తన సొంత నుడిని కాపాడుకుంటూనే ఒరుల నుడులను అక్కున చేర్చుకుంది.

మాటలు ఇలా బతుకుతాయి

నుడి అనేది మంది నోట పుడుతుంది. మంది వాడకంలో పెరుగుతుంది.

ఒరులమాట ఒక్కోసారి మంది నాలుకపైన మితిమీరి ఆడి, వారి సొంత సొత్తుగా మారిపోతుంది. వాడుకలో నిలబడిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందన్న దానికంటే, ఆ నుడిలో అది ఎలా బతికున్నదనదే లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది.

అలమర, బొప్పాయి, తాళంచెవి లాంటి మాటలు పోర్చుగీసుల వైనా తెలుగులో కలిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఒరుల నుడి మాటలని ఏరి పారేయలేము.

తిక్కనగారే ‘త్రాసు’ అనే మాటను వాడక తప్పలేదు. అది పర్షియన్ నుంచి వచ్చిన మాటైనా, వాడుకలో మన నుడిలో ఒకటైపోయింది.

కొత్త పనులు, కొత్త మాటలు

మన బతుకుతీరుకు చెందినదైనప్పుడే ఒక మాట మంది నోట ఆడగలుగుతుంది. బతుకుతీరుకు పనికిరాని ఏలిమాటల్ని (కృత్రిమపదాలు) ఎవరో తెచ్చి మంది నోట కుక్కినా అవి వాడుకలో నిలబడవు.

కొత్తకొత్త పనులు పుడుతున్నప్పుడు వాటికి తగిన మాటలు కూడా పుడుతుంటాయి. ఆ మాటలకు కొత్త పలుకుబడులను వ్రాయితలు, నుడిబంట్లు ఏర్పరుస్తారు. అలా నుడి కలిమి పెరుగుతుంది. కొన్ని మంది నోట సాజంగా పుడతాయి. ఏవైనా, మంది వాడుకలో నిలబడినవే చివరికి నుడిలో నిలుస్తాయి.

మనుగడను చాటేదే మాట

నుడి అనేది ఒక కుదురు ఉనికిని కళ్లకు కట్టిస్తుంది. ఆ కుదురు నడవడిని చాటుతుంది. ఆ కుదురు బతుకుతీరును చూపుతుంది.

వారి కూడు, గూడు, బట్ట, వారి కొలుపులు.. ఒక్కటేమిటీ, ఆ కుదురులోని ప్రతి ఒక్కరి బతుకుతీరునీ వారు మాట్లాడే మాటలు చాటుతాయి.

వారి అక్కరలు, పనులు, చుట్టరికాలు, వారు నేర్చిన ఎరుక.. ఈ అన్నింటికీ వారి నుడిలోనే మాటలు ఏర్పడతాయి. అందువల్ల నుడిని కాపాడుకోవడం అంటే మాటల్ని కాపాడుకోవడమే కాదు; నుడిని మాట్లాడేవారి మనుగడను, ఉనికిని కాపాడుకోవడం అని గుర్తించాలి.

తెలుగుకు సంస్కృతం పెంపుడుతల్లి

వేరే నుడులతో తెలుగుకి ఏర్పడిన చుట్టరికాలు వేరు. సంస్కృతం మనకు చుట్టం అనటం సరికాదు. అమ్మనో పెద్దమ్మనో చుట్టం అంటామా..? అంతకు మించిన తల్లీబిడ్డల కట్టు సంస్కృతంతో తెలుగుకు ఉంది.

తెలుగుకు పాలిచ్చి, లాలించి పెంచిన పెంపుడు తల్లి సంస్కృతం.

సంస్కృతపు పలుకులు పాలలో పంచదార పలుకుల్లా కలిసిపోయాయి. తెలుగుతో విడదీయటానికి వీల్లేనంతగా సంస్కృతం కలిసిపోయింది, వెనకటి మన పెద్దలు మినుకులు (శాస్త్రాలు), మొక్కులు, కొలుపులు, ఏలుబడితీరులు ఇలా ఎన్నింటినో సంస్కృతం లోనే నేర్చుకున్నారు. కాబట్టి, అలా సంస్కృతం మాటలు నోటి నిండా వచ్చేశాయి. ఇప్పుడు మనం అన్నీ ఆంగ్లంలో చదువుతున్నట్టు!

అందుకే, ఇప్పటికిప్పుడు మనం సంస్కృతాన్ని తెలుగులోంచి వేరు చేయటం అంత తేలికగా కుదిరేది కాదు.

అది తప్ప వేరే పనిలేదన్నట్టుగా కొందరు చేస్తున్నట్టు సంస్కృతాన్ని తిట్టటమూ సరికాదు. వింత ఏవిటంటే సంస్కృతాన్ని “ఛాందసము” అనే వాళ్లెవరూ అచ్చతెలుగున వ్రాసినవారు కాదు.

సంస్కృతంతో మనకున్న ఈ లోతైన చుట్టరికాన్ని గుర్తించడం వేరు. సంస్కృతం మాట వేస్తేనే గొప్పగా ఉంటుందనే మోజు వేరు. ఈ రెండింటినీ కలిపి చూడకూడదు. తెలుగుకి బిగువు (గంభీరత) తక్కువ అనేది మన చూపు తక్కువ తనమే!

మంది మాట్లాడేదే అచ్చతెలుగు

ఏ మాటలు మంది నోట సాజంగా పలుకుతున్నాయో అవే మనకి కొలబద్దలు. వాటన్నింటినీ మనం అచ్చతెలుగుగా పుచ్చుకుందాం!

మంది వాడే మాటల్ని గుర్తించి, వాటి వాడకాన్ని పెంచాలి. మరుగునపడిన తెలుగు మాటల్ని మళ్లీ మంది నోళ్లకు అందించి పలికించాలి.

కొత్తకొత్త ‘తప్పనిసరులు’ (అవసరాలు) పెరుగుతున్నాయి. ఇప్పుడు వాటికి తగిన తెలుగు నుడులు ఉన్నాయేమో వెదకాలి. లేకపోతే మందికి తేలికగా తెలిసే తీరున కొత్త తెలుగు మాటలు కుదురుతాయేమో చూడాలి.

అదీ చాలనప్పుడు ఒరుల నుడిని తీసుకోవటం తప్పక పోవచ్చు.

ఇదంతా అచ్చతెలుగు ఒట్టు పెట్టుకున్నప్పుడే వీలు కుదురుతుంది.

అచ్చతెలుగు అంటే మాటల్ని గోడల మధ్య కట్టేయటం కాదు. మన నుడిలోని సాజమైన సొగసును గుర్తించి, దాన్ని ఇప్పటి మన బతుకులకు తగినట్టుగా పెంపు చేయడం.

వేరే నుడులతో చుట్టరికాలను తెంచుకోపని లేదు. నుడికడలిలో మన నుడులున్నప్పుడు వేరే నుడుల పైన ఎక్కి తిరగటమే మానాలి.

Exit mobile version