Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అచ్చతెలుగుకి దారి చూపిన కొఱవి గోపరాజు

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘అచ్చతెలుగుకి దారి చూపిన కొఱవి గోపరాజు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“తెనుఁగునఁ దేటగాఁ గథలు దెల్పినఁ గావ్యము పొందులేదు మె
త్తన పస చాల దండ్రు విశదంబుగ సంస్కృత శబ్ద మూఁదఁజె
ప్పిన నవి దర్భముండ్లనుచుఁ బెట్టరు వీనులఁ గావునన్ రుచుల్
దనరఁ దెనుంగు దేశియును దద్బవముం గలయంగఁ జెప్పెదన్”

ఏ వ్రాతగానికైనా ఒక పెద్ద వ్రాతపనిని నెత్తినెత్తుకోవటానికి కొన్ని అడ్డంకులు కలగటం మామూలే! ఎవరో కొందరి కళ్ళలో మెరుపులను చూడాలని వ్రాతలు వ్రాయాలంటే తనదైన గొంతు కలిగిన వ్రాతనేర్పరులకు కుదిరే పనికాదు. సాటి వ్రాత గాళ్ళంటే కళ్లలో నిప్పులు పోసుకునే వారి పాలిట తానే ఒక కొరవిగా నిలిచాడు.. “సింహాసన ద్వాత్రింశిక” కబ్బాన్ని వ్రాసిన కొఱవి గోపరాజు,

ఇది 600 యేళ్ళనాటి కత. అప్పట్లోనూ కొందరు వ్రాతగాళ్ల మీద పెత్తనం చేయాలని చూసేవారు ఉండేవారని “సింహాసన ద్వాత్రింశిక” కావ్యంలోని ఈ పద్యం చెప్తుంది. కూటాలు కట్టి తమవారి వ్రాతల్ని మిన్నుకన్నామిన్నగా ఎత్తి చూపటం, కాని వారి వ్రాతల్ని “కానివ్రాత”లుగా, పనికి రానివిగా చూడటం అప్పుడూ ఉండేదన్న మాట!

అలాంటి వాళ్ళని తాను పట్టించుకోనని, తన ఎదలో వెలిగిన తలపులను తనదైన రీతిలోనే తాను వ్రాస్తానని నొక్కిచెప్తున్నాడు కొఱవి గోపరాజు.

కొఱవి లేదా కొరవి/కొరివి అనేది అచ్చతెలుగు ఇంటి పేరు. నిప్పుల కొలిమి అనే.. (అగ్నిహోత్రానికి ఇది తెలుగు పేరు!) కొరివితో తల గోరుకొనే వారుంటారా? కొరవి గోపరాజు ఎదురులేని వ్రాత నేర్పరి!

తెగువ, చొరవ, తెంపు, తెగింపు లేనివాడు కబ్బపు కూర్పరి కాలేడు. పదిమంది తమవాడని అహాహా అంటే చాలదు.. తక్కిన తొంబదిమంది కూడా అవుననాలి. కూటువుల (ముఠాలు కట్టేవారు) మీద కాదు, కైత వ్రాసేవాడి చూపు నికరపు బంగారం మీద ఉండాలి. ఆ మాత్రం గుండెదమ్ము లేనివాడేం వ్రాతగాడు?

తెలుగులో తేటగా కథలు చెప్తే అది గొప్ప రచన కాదని, మెత్తగా ఉంటుందనీ, పసచాలదనీ అంటారు. పెద్దపెద్ద సంస్కృతం మాటలు గుప్పించకుండా వ్రాస్తే దర్భముండ్లు అంటారు. చదవరు, పెట్టరు. కాబట్టి, తొమ్మిది రుచులు(రసాలు) తనరారేలా అచ్చ తెలుగు మాటలతో, మరీ అగత్యమైనప్పుడు అది కూడా నేరుగా సంస్కృతం మాటలు కాకుండా సంస్కృతాన్ని అనుసరించి ఏర్పడిన తెలుగు మాటలు (తద్భవాలు) మాత్రమే వాడుతూ ఈ కావ్యాన్ని వ్రాయాలని తాను పూనిక పట్టినట్టు చెప్పుకున్నాడు.

తన ఎదకు నచ్చిన తీరున తాను వ్రాయాలన్నది ఆయన ఎన్నిక. “వీలున్నచోటునెల్లా మేలైన లేత తెలుగు నుడికట్టుల్ని వాడాడు. ఆయన కైతలోని ఓజను, మిన్నతను ఒకరొచ్చి విడమరచ వలసిన అగత్యం లేకుండా తన కైతకు తానే అద్దమై నిలిచాడు” అని ఆంధ్రసాహిత్య పరిషత్ వారు చక్కని మెచ్చుకోళ్లు అందించారు.

“ఎప్పటి కే యది ప్రస్తుత మప్పటి కా విద్యమహిమ మచ్చుపడంగాఁ
జెప్పక సర్వఙ్ఞత్వము, చొప్పడునే కావ్యమంత సులభమె ధాత్రిన్”

ఏప్పటికేది తగినదో అప్పటికి దాన్ని మిన్నగా మచ్చుపడేలా చెప్పక పోతే కబ్బానికి ఆకళింపు (సర్వజ్ఞత) ఉండదని వ్రాతనేర్పు అంత తేలికైన పనేమీ కాదని వివరిస్తాడు కొఱవి గోఫరాజు. మచ్చుపడటం అంటే, తూకానికి నిలిచేదని చెప్పుకోవచ్చు.

సంస్కృత కథా సరిత్సాగరంలోని కతలను ముక్కకు ముక్కగా తెలుగు చేసే పని తనది కాదన్నాడు. ఎక్కడివో ఎప్పటివో కథల్ని తెలుగులో తేవటంలోని ఇక్కట్టుల్ని ముందుమాటల్లో (అవతారికలలో) చక్కగా విడమరచి చెప్పుకున్నాడు. కత చెప్పే తీరులో తన కొత్తదనాన్ని తరచి చూడాలన్నాడు.

రాయలవారికన్నా ముందరివాడు

“సనదవ్రోలిపురవరాధీశ్వర వెలనాటి పృథ్వీశ్వర రాజ్య సముద్ధరణ శ్రీ కొఱవి వెన్నయామాత్యపౌత్ర….. కసవరాజ తనూజ గోపరాజ విరచితంబు” అనే పద్యాన్ని బట్టి గోపరాజు తండ్రి కొఱవి కసవరాజు అనీ, ఆయన వెన్నయామాత్యుని కొడుకని ఉంది. వెన్నయామాత్యుడి మనుమడు అమరేశ్వర మంత్రి అని కూడా చెప్పుకోవటం వలన వెన్నయామాత్యుడు, అమరేశ్వరుడు, కసవరాజు వీరంతా తాత, తండ్రీ కొడుకుల కట్టుతో ఒక్క ఉమ్మడిగా కలసి బ్రతుకుతెరువు సాగిస్తూ ఉండి ఉంటారని ఆచార్య కొర్లపాటి వారి ఉజ్జాయింపు!

ఈ కబ్బానికి ముందుమాటల్లో (అవతారిక) పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని పేరు చెప్పటాన ఈ గోపరాజుగారు పినవీరభద్రుని తరువాతి తరానికి చెందిన వాడని భావించవచ్చు. పినవీరభద్రుడు క్రీస్తు తరువాయి ఇంచుమించు 1491లలో జైమిని భారతము వ్రాశాడు. దాన్నిబట్టి, గోపరాజు సింహాసనద్వాత్రింశిక 1500లో వ్రాసి ఉండాలని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి లెక్కలు కట్టారు. నెమ్మదించి ఆయన ఎంచిన దాన్నిబట్టి ఈ కబ్బం వ్రాసేనాటికి గోపరాజు యాబదేళ్ల వాడైతే, 1450-1525 ఆయన మనుకువ(కాలం) అయి ఉండాలి. తండ్రి కసవరాజు 1420-1495 నాటివాడు కావాలి!

కసవరాజు పెదతండ్రి కుమారులు బాచన, సింగన గోపరాజుకి బాబాయిలు లేదా పెదతండ్రు లౌతారు. వారు అనపోత సింగయ దగ్గర మంత్రులని గోపరాజే పేర్కొనటం వలన ఈ సింగయ ప్రభువుని సర్వఙ్ఞ సింగ భూపాలుడిగా గుర్తించారు. సర్వఙ్ఞ సింగభూపాలుడు 1425-50 ప్రాంతాలవాడు. కాబట్టి, గోపరాజు తండ్రుల తరం తరువాత 1450–1525 గోపరాజు తరం మొదలై ఉండాలన్నమాట!

తెలంగాణా కైతల పగడం

కొరవి గోపరాజు 1500–1530 కాలానికి చెందిన వాడు. ఆయన నిజామాబాద్ జిల్లా భీంగల్ నగరానికి చెందినవాడని పెద్దలు ఎంచారు. పల్లికొండ ఏలికగా ఉన్న రాణా మల్లన కొలువుకూటములో ఉండేవాడు.

ఒకనాటి తెలంగాణ తేనెపలుకులను తన కబ్బపు బరిణెలో దాచిపెట్టిన కవిగా ఈయనను చెప్పుకోవాలి. తెలుగు నుడికట్టు లెన్నింటినో ఆయన ఇందులో చేర్చాడు. “సురవరం ప్రతాపరెడ్డిగారి సాంఘిక చరిత్రకు మూలకవిగా గోపరాజును పేర్కొనాలి” అన్నాడు నా నేస్తుడు జేజేలవీడుకేగిన (స్వర్గస్థుడు) ద్వా నా శాస్త్రి.

చీకటిలో 500 యేళ్ళు మగ్గిపోయి..

32 సకినలు (సాలభంజికలు) భోజరాజుకు చెప్పిన విక్రమార్కుని కతలే ఈ సింహాసన ద్వాత్రింశికకి ఆనిక (ఆధారం). కథాసరిత్సాగరం లోంచి ఈ పగడాలను ఏరి గోపరాజకవి దీన్ని వ్రాశాడు. కానీ, ఇది వెలుగులోకి రాకుండా చీకటి కొట్లలో చిక్కుకు పోయింది. తరువాతి తరం వ్రాతగాళ్లెవరూ ఈ కబ్బం ఊసెత్తక పోవటానికి సాకు ఏమిటనేది తెలీదు. మనలో దాగున్న పట్టనితనానికి ఎవరినో అంటే ఏమొస్తుందీ..?

1936లలో ఆంధ్రసాహిత్యపరిషత్తు కాకినాడ వారికి ఇది ఎలానో దొరికింది. దానిలోని తప్పుపట్లు సరిచేసి తమ “ఆంధ్ర సాహిత్యపరిషత్ పత్రిక”లో నెలనెలా వరుసగా అచ్చువేశారు. ఆ తరువాత పొత్తము రూపాన తెచ్చారు.

“వ్రాతరేడుల కూటములు” (రచయితల సంఘాలు) చేయదగిన మిన్న ఇంతకన్నా ఏముంటుంది?

దేనికైనా అచ్చివచ్చే అనువు కలసిరావాలి! తెలుగు నుడి కాపులకు ఒక ఊపునిచ్చేదిగా ఇది నిలబడ్తుంది కాబట్టి, సింహాసన ద్వా త్రింశతిక సరైన పొద్దులో వెలుగులో కొచ్చింది. అయినా ఈ ఎనుబదేళ్లలో ఈ కబ్బం పైన చాలినంత చర్చ జరగలేదు. తన నేర్పునంతా గుప్పించి ఈ కబ్బానికి నుడినొడుగులు (వ్యాఖ్యానాలు) వ్రాయటానికి కావాల్సినంత సంస్కృత నుడికట్లు ఇందులో లేవు కాబట్టి, ఉన్నవాటిలో తెలుగువే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, తెలుగంటే ఎటుతిరిగీ చిన్నచూపే కాబట్టి ఈ కబ్బంపైన పరామరిక (విమర్శ) చాలినంతగా జరగలేదన్నది నిక్కము!

అచ్చ తెలుగు నుడులను తవ్వి వెలికి తీసి వాడకాన పెట్టే పనిలో ఉన్నవారికి సింహాసన ద్వా త్రింశతి మెలగు చేస్తుంది.

జాను తెనుగు పేరుతో సంస్కృత పదాల వాడకాన్ని గుప్పించిన వైనాన్ని గుర్తించిన గోపరాజుగారు సంస్కృతాన్ని పక్కన బెట్టి సంస్కృతంతో చుట్టరికం ఉన్న మాటల్ని వీలున్నంత మేర తగ్గించి అచ్చతెలుగులో ఈ కబ్బానికి పూనిక పట్టాడు.

మనం కాపు కాయాల్సింది అచ్చతెలుగు పలుకులనే! కానీ, మనవాళ్లు తెలుగుని తేలిక చేయాలనే అచ్చతెలుగు నుడులు (వర్ణాలు) కొన్నింటిని ఎత్తేసి, అచ్చ తెలుగు పలుకుల్ని దాచేసి, మూడొంతులు సంస్కృత నుడులతో భాషని నింపేశారు. తరంతరంగా అచ్చతెలుగు పలుకులు కలికానిక్కూడా కానరాకుండా పోయాయి. మనం చెయ్యదగినది ఇప్పుడు మన నుడుల్ని ఏరి తెచ్చుకుని మళ్ళీ వాడకాన పెట్టటమే! ‘నుడికొలుపు’ మనల్ని పురికొలిపేది ఇదే!

అచ్చతెనుగంటే ఏది?

ఏ నేలకు చెందినవారికి ఆ నేల నుడులు అచ్చనుడు లన్నాడు అప్పకవి.

సంస్కృత, ప్రాకృత నుడుల్లోంచి పుట్టిన తెలుగు మాటల్ని ‘వికృతి’ అంటారు. వీటిలో్ సంస్కృతం లోంచి వచ్చిన వాటికన్నా ప్రాకృతం లోంచి వచ్చిన వికృతులే తెలుగులో ఎక్కువని చెప్తారు.

నేరుగా వచ్చి తెలుగులో కలిసిన సంస్కృతం పలుకులు, ఈ వికృతి పలుకులు, ఇతర భాషల్లోంచి వచ్చి చేరిన పరాయి పలుకులు, పల్లె పలుకులు (గ్రామ్యాలు), మనవైన అచ్చతెలుగు పలుకులు (దేశ్యములు) అన్నీ కలగలసిన తెలుగుని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం!

రానురానూ ఈ పలుకుల పొదిలోంచి ఒక్కటొక్కటిగా అచ్చతెలుగు నుడులు జారిపోతున్నాయి. దీన్ని తప్పించాలంటే “అచ్చతెనుగు ఒట్టు” పెట్టుకుని వ్రాతనోము పట్టవలసి ఉంది. అందుకు మొదటగా సంస్కృతంతో చుట్టరికం ఉన్న మాటల్ని ఏరివేసి, పరాయి నుడుల్ని పక్కన పెడితే, మిగిలినవన్నీ అచ్చతెనుగులే!

వీటిలో ఊరిపలుకులు (మాండలికాలు) కూడా కలిసి ఉన్నాయి. వాటినీ మనం కాపుకాయాలి. నుడిసొత్తుని ఇప్పటి దాకా కనిపెట్టుకొచ్చింది పల్లెలే! చదువుకున్నవాళ్ల వలన నుడులకు మైల (కాలుష్యం) పెరిగిందే గానీ బాగుపడింది లేదు.

అచ్చమైన తెలుగు బతికేది కబ్బాలలో కాదు; మన ఎదల లోపల, మన నుడికట్టుల నడుమ మాత్రమే నుడికి మనుగడ ఉంటుంది.

తెలుగును నిలుపుకోవటం అంటే అచ్చతెలుగును నిలుపుకోవటమే! సింహాసన ద్వా త్రింశికని ఓపికగ అచదివితే నుడినేర్పు తప్పక అలవడుతుంది!

గోపరాజుగారి వ్రాత ఇలా ఉంటుంది..

“చింతమదిలేక మనుజులు
చింతించిన కొలది చవులు చేకూర్చుచుని
శ్చింతులుగా నొనరించెడు
చింతకు సరిగలదె లోక చింతామణికిన్‌”

‘చింత’ అంటే తెలుగులో వగపు, తలపు. దాని తలపు రాగానే నోట నీళ్ళురుతాయి కాబట్టి, చింతపండనే పేరుతో అది వంటిట్లో వెలుగుతోంది. ఈ చింత అనే మాటని తీసుకుని సొంపుగా గోపరాజుగారు వ్రాసిన పద్యం ఇది. ఎలాంటి చింత (వగపు) ఎదలో పెట్టుకోకుండా, చింతించిన కొలదీ చవులు (రుచులు) చేకూర్చి నిశ్చింతులుగా ఎలమి కలిగేలా చేసే చింతని ఆయన లోకచింతామణి అంటూ, దానికి సాటి ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడీ పద్యంలో!

వ్రాయటం అనే పని కాకతీయుల తరువాత తేలికయ్యింది. దినవహులు లెక్కలు వ్రాసేవారు. దొంగ లెక్కలు వ్రాయటం కూడా సులువయ్యిందట. 600 యేళ్ళనాటి కొరవి గోపరాజుగారు దొంగలెక్కల రాతగాళ్ల గురించి ఇలా వ్రాశారు:

“వహి వారణాసి యనగా
మహి బరగిన దిందు కపట మార్గంబు నా
గ్రహమున వ్రాసిన వానికి
నిహపరములు లేవు నరక మెదురై యుండున్”

దొంగ లెక్కలు రాసే వాడికి నరకం ఎదురయ్యే ఉంటుందట! లెక్కలు ఎలా వ్రాయాలో ఈ పద్యంలో చెప్తున్నారు.

“ఒక దెస దెచ్చిన యాయం
బొక దిక్కున చెల్లు వ్రాసి యొక దెస వ్యయ మ
ట్లొక దిక్కున జమ వ్రాసిన
బ్రకటంబుగ వాడు మిగుల పాపాత్ముడగున్”

ఒక వైపున తెచ్చిన సొమ్ముని (ఆదాయాన్ని), ఇంకో వైపున తెచ్చినదానికి చెల్లుని వ్రాయాలి. అలా కాకుండా వెచ్చాన్ని (కర్చు) ఆయంలో వ్రాయటం లాంటివి చేసిన వహి (అక్కౌంటెంటు)ని కొడిమోలాడు (పాపాత్ముడు) అంటాడు.

లెక్కలు వ్రాయటాన్ని ఆంగ్లేయులు నేర్పారని మనం అనుకుంటూ ఉంటాం. ఆంగ్లేయులకు ఇంకా బొడ్డూడకమునుపే ఇక్కడ దొంగలెక్కలు కూడా వ్రాశారన్నది వింతగొలిపే నిక్కం.

“రాని పైడి చెల్లుట వ్రాయుట, యాయంబు
తక్కువై వ్యయంబదెక్కుడౌట
లెక్క తుడుపు వడుట లిపి సందియం బౌట
చెల్లు మరచుటయును కల్లపనులు”

రాని డబ్బుని వచ్చినట్టు చూపించటం, ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ చూపించటం, కొట్టివేతలు తుడుపుల్తో వ్రాత అర్థం కాకుండా వ్రాయటం, చెల్లించినదాన్ని మరిచిపోయి చూపించకపోవటం ఇలాంటివన్నీ కల్లపనులన్నాడు. కరణం నీతిమంతుడైతే మంచి ఉపకరణం అవుతాడంటాడు కవి కొఱవి గోపరాజు.

“అలతి అలతి మాటలతో నిట్టదనాన్నిస్తూ, తప్పనప్పుడు మాత్రమే రంగులేసి బొమ్మచూపుతూ (వర్ణన) చదువరికి విసుగు రానీయకుండా వ్రాసిన ఈ కబ్బంలో తన తెలివిని చాటుకోవటం కంటే, వ్రాత బలిమిని చూపుకోవటం మీద కొఱవి గోపరాజ కవి ఎక్కువ చూపు పెట్టాడు. అందుకనే ఈ కబ్బం తెలుగు కైతల గుంపులో తనదైన వెలుగుని గడించుకుంది.

Exit mobile version