[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అచ్చతెలుగుకు నన్నయే అన్నయ్య’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
నన్నయగారు ఆంధ్రమహాభారత వ్రాతకు పూనుకునే నాటికే కబ్బాలు (కావ్యాలు) రాసే కోపు (శైలి) నిండుగా వాడుకలో ఉంది.
ఈ కబ్బాల అల్లిక (కావ్యరచన) నన్నయగారి దగ్గర రాత్రికి రాత్రే పుట్టింది కాదు. ఆయనకు ముందు ఇంచుమించు ఐదొందల ఏళ్లపాటు ఏలిక లెందరో రాతిపలకల పైనా, రాగిరేకులపైనా వేయించిన రాకట్టుల్లో (శాసనాలు, ఆఙ్ఞలు) పద్యాల తీరున వ్రాసినవి కొన్ని ఉన్నాయి. ఆ నాటి వ్రాతపోతలకు ఈ రాకట్టులే (శాసనాలే) ఊతాలు. విడిగా వ్రాసిన కబ్బాలు ఏమైనా ఉండేవేమో దొరకలేదు.
నన్నయకు ముందే కైతల అల్లిక
“మహిత గండవెండ మధ్యదేశాధీశ జనకదత్త రాజ్య సమధికేశ” అనే ఒక రాకట్టులోని నుడి (భాష) ఆనాటి తెలుగుకు ఒక మచ్చుతునక. ఇది తెలుగు ఛందస్సు లోనే వ్రాసింది. కానీ, శూరుడు అనటానికి ‘గండ’ అనేది తప్ప, తక్కినదంతా సంస్కృతం లోనే ఉంది. ఆనాటి వ్రాత తీరు అదే! అలా వ్రాస్తేనే ఎన్నిక.
అయితే, అప్పటికి ఛందస్సు కూడా ఇంకా పంటకు వచ్చింది కాదు. “యతి ప్రాసలు సరిగా లేక, ఛందస్సుకు సంబంధించిన వాసనలు ఉన్నాయని ‘తృప్తి’ పడాలి.. అంతే!” అన్నారు ఆరుద్రగారు.
ఇందుకూరులో దొరికిన క్రీ.శ 700 నాటి రాకట్టులో ఇలా ఉంది: “స్వస్తిశ్రీ ‘చోఱమహారాజు’ల్లేశన్ ఎరిగల్ దుగరాజుల్ ఇచ్చిన పన్నస కొచ్చియ పాఱ రెవ సమ్మాన్రికిన్| తేనిలచ్చినన్ఱు పఞ్చమహాపాత సంయుక్తున్డగు..” ఇలా కొద్దికొద్దిగా తెలుగు మాటలు, పాత ద్రావిడ మాటల వాడకాన్ని చూడవచ్చు.
ఇందులో చోఱ అనేది సంస్కృత చోర (=దొంగ) కాదు. చోఱమహారాజు అంటే చోళ నేలకు ఏలిక అని! సంస్కృతం పలుకులు తెలుగులోకి చొరబడిపోయాక ఏది తెలుగో ఏది సంస్కృతమో తెలీని గతి ఏర్పడింది.
ఱ, ర, ళ వీటిమధ్య ఏర్పడిన మార్పులు తెలుగు నుడి తీరును చాలా ముందుకు నడిపించాయి.
రేనాటి చోళులు, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు ఎక్కువగా గద్యంలో వ్రాయిస్తే, గుణగ విజయాదిత్యుడి బంటు – పండరంగడు – క్రీ.శ. 848లో అద్దంకిలో వేయించిన రాకట్టులో గద్యం, పద్యం కలిసిన తరువోజ అనే తెలుగు ఛందస్సులో వ్రాసినది కనిపిస్తుంది.
అలా, నన్నయకు 150 ఏళ్ల ముందే పచ్చిదిగా ఉన్న పద్యపు వ్రాత నెమ్మదిగా కుదురుకుని పలకబారి, పండిందని చెప్పవచ్చు!
సంస్కృతం జాడల్లోనే నడుస్తూ..
తెలుగు ఎదుగుదల సొంత కూకటుల్లోంచే సాగింది. సంస్కృతం కూకట్లలోంచి తెలుగు పుట్టలేదు. అవిసె మొక్కని అంటుకుని తమలపాకు తీగ పాకినట్టు సంస్కృతాన్ని అంటుకుని తెలుగు పెరిగింది.
అందువలన అచ్చుల్లో ఋ, ౠ, హల్లుల్లో ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, శ, ష వంటి మహాప్రాణ వర్ణాలు తెలుగు నుడువు(వర్ణాలు)ల్లోకి చేరిపోయాయి. తెలుగు పదాల్లో ‘అ+ఇ’ కలయిక ‘ఐ’గానూ, ‘అ+ఉ’ కలయిక ‘ఔ’గానూ దగ్గరై ‘అయిదు’ → ‘ఐదు’గా, ‘అవును’ → ‘ఔను’గా మారాయి.
ఇవి మొదటినుంచీ తెలుగుకు సాజమైన పలుకులు కావు. సంస్కృత పదాల వాడకం వల్ల తెలుగులో కొన్ని కొత్త పలుకుబడి మార్పులు చోటుచేసుకున్నాయి.
‘ఐరావతం’, ‘ఔషధం’ వంటి సంస్కృతం మాటల్లో ఈ అచ్చుల పొందిక సంస్కృతానికి సాజమైనది. ఇలా ‘తత్సమాలు’ వాడటం వల్ల తెలుగు మాటలాడే తీరులోనూ మార్పులు వచ్చాయి. లోతుగా వెడితే సంస్కృతం జాడలోనే తెలుగు నడిచిన వైనం తెలుస్తుంది.
అందుకే, వాడుకతో మారుతూ ఉండే దేశి నుడిని కొందరు పండితులు నిలకడలేనిదిగా చూశారు. “నిత్య ప్రవాహినీ దేశ్యా” – నీటిపారులా నిలకడ లేనిది ‘దేశి (తెలుగు) కైత’ అన్నారు. సంస్కృతాన్ని మాత్రం విద్యా, సాహిత్య రంగాల్లో నిట్ట (స్థిరమైనప్రమాణం)గా అనుకున్నారు.
వేద విషయాలే సాహిత్యం ఆనాడు
ఆనాటి అల్లికన్నీ పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడ్డవే! అవి కాకుంటే, మిన్నతి ఉండేది కాదు.
వేద తలంపులకు సరయిన తెలుగు మాటల్ని ఎంచుకోవడం పెద్ద అగచాటు! మనవి కాని వాటికి మన తెలుగులో మాటలు ఉండవు. నొక్కి చెప్పాలంటే, నిలుపు (మూర్తిమత. రూపు) లేని విద్యుత్తు లాంటి మాటలకు తెలుగులో నుడువు లుండవు. బలవంతంగా తెలుగులో వండితే, ఎబ్బెట్టుగా ఉంటుంది కూడా!
అందుకని వైదికానికి చెందినవాటికి తెలుగులో జోడైన మాటలు దొరకవు. అన్నం అనటానికికూడు, బువ్వ లాంటి లోతైన మాటలే మనకి ఉన్నప్పటికీ అన్నం అనే అంటున్నాం. నలుగురూ కూడి తినేది కూడు.. అన్నంత లోతు ‘అన్నం’ అనటంలో లేదు. అయినా మనం సంస్కృతం మాటనే తెలుగు వాడుక పలుకుగా చేసుకున్నాం.
వేల్పుకి తిరుబోనం (నైవేద్యం)గా అన్నం పెడతామా..? కూడు పెడతామా? సంస్కృతం మాటలో ఉన్నంత పోతనం (పవిత్రత) తెలుగులో ఉండదనేదే మనవారి నమ్మిక.
అచ్చతెలుగులో వ్రాయాలంటే సంస్కృతం ఒక్కటే వస్తే చాలదు. ఒక్కో తెలుగు మాటను కూకటిలోంచి వెదికి పట్టుకుని, తగిన చోట కుదిర్చి తెలుగున వ్రాయగలగాలి. తెలుగు వ్రాతే ఎక్కువ చెమటోడ్పు. అంత చెమటోడ్చి వ్రాసినా దానికి ఎంపిక ఉండేది కాదు. అలా తెలుగుకు నెనరు లేకుండా పోయింది.
ఈ ఒడుదుడుకుల్ని పట్టించుకోకుండా తెలుగులో వ్రాయడాన్ని సంస్కృతం రానివాళ్ల చేతకాని తనంగా ‘అచ్చుకట్టు’ (ముద్ర) వేసి, దేశీ వ్రాతల్ని పక్కకు నెట్టి, ‘కొంచెపు వ్రాత’లని ఈసడించారు.
తెలుగుమాటల సొంత చేవని నిలిపే దిట్టే లేకుండా పోయాడానాడు.
సంస్కృతం రానివాడు కవే కాడన్నట్టు..
తెలుగులో తొలి ఛందస్సుల విరివిని తెలిపిన మల్లియ రేచన, నన్నయకన్నా ముందునాటి వాడని చెబుతారు. ఆయన కవిజనాశ్రయంలో ఇలా అన్నాడు:
“కడు కవితా మహిమకు దివి
రెడు కవికిచ్చదువు తెఱగెఱింగినఁ గాకె
క్కడి నుండి వచ్చు బెడఁగడ
రెడు కబ్బము సెప్ప మేరు పరిఁఙ్ఞాన మిలన్”
ఛందస్సుల తీరును ఎరిగినవాడికే కవిత్వపు గొప్పతనం, కబ్బపు కోపు (కావ్యశైలి) పట్టుబడతా యంటాడు రేచన. తెలుగు సంస్కృత ఛందస్సులు రెండింటి తెరగు ఎరిగిన వాడికి తప్ప దొడ్డకైతని చెప్పగల చేవ ఎవరి కుంటుందని అడిగాడు.
సంస్కృతం చాలా తెలిసి ఉంటేనే తెలుగున కబ్బపు వ్రాత కుదురుతుందన్నది రేచన కవి మాట!
2,000 యేళ్లుగా సంస్కృతం మన నోటినిండా నాని ఉండటాన మన వాడుక మాటల్లో సంస్కృతం పలుకులే నిండి ఉన్నాయి. అంటే, మనకు బోళ్లెడంత సంస్కృతం వచ్చని కాదు, అది సంస్కృతం అని తెలీకుండానే వాడేస్తున్నాం.. ‘రోజు’ అనేది పర్షియన్ మాట అయినప్పటికీ రోజూ వాడుకుంటున్నట్టే!
పారిన నీళ్ళను కట్టడి చేస్తే ఒరిగేదేం ఉండదు కాబట్టి జరిగిపోయినదాన్ని తవ్వటం ఆపి, రేపటిమీద చూపు పెట్టి నేడు చెయ్యాల్సిన దాన్ని తలపోద్దాం!
అచ్చు పనిముట్లు వచ్చాక, పద్యాలూ వచనాల వ్రాత ముమ్మరమైనాక, మందికి చెందిన వాటిని సొంతంగా వ్రాయటం మొదలు పెట్టాక, అచ్చంగా తెలుగులో వ్రాయటానికిఇప్పుడు అడ్డంకులన్నీ పోయాక కూడా ఇంకా మనం తెలుగు మీద చూపు పెట్టకపోతే పెద్ద తప్పిదం చేసినట్టే!
మేలుకొలుపు వ్రాతల్లో(అభ్యుదయ సాహిత్యం) వేదకవులను మించి వైదికం బొమ్మకట్లు (ప్రతీకలు) కనిపిస్తాయి. తెలుగును మరచి సంస్కృతాన్ని అంటుకుని సాగుతున్నామనే యావ చాలామందికి లేదు.
మాండలికాలనే ఊరిపలుకుల్లో వ్రాసే వారిలో కనిపించే తెలుగు చూపు తక్కినవారిలో కనిపించటం లేదు. ఊరిపలుకుల్లో ఎక్కువగా అచ్చతెలుగు పలుకులే ఉంటాయి. వాటిని ఎరుకతో వాడదగినవి కూడా! మాండలికాలకు ‘పరువు’ అంటే అచ్చతెలుగునకు పరువునివ్వటమే!
అచ్చతెలుగుకు నన్నయే ఆదికవి!
సంస్కృతం వలనే బిగువు ఉంటుందనే తలపోత మనకే ఇంతగా ఉంటే ఆనాటి నన్నయకు ఇంకెంత ఉండాలి..? అయినా అచ్చంగా తెలుగులో వ్రాయటానికి మొదటిగా మొదలు పలికినవాడు నన్నయే!
“దెప్పరపుఁజోట నీ కీ
యొప్పని విధ మెచటనుండి యొదవెను విను మీ
చొ ప్పవివేకులయది యిది
దప్పించును సద్గతియ నుదాత్తయశంబున్.”
దెప్పర అనేది ప్రమాదకరమైన యుద్ధభూమిని తెలియజెప్పే చక్కని తెలుగుమాట. దెప్పరమైన చోట నీకు తగని ఈ పిరికితనం ఎక్కడినుండి వచ్చిందని గాండీవాన్ని పారేసిన అర్జునుణ్ణి నిలదీస్తున్నాడు ఈ పద్యంలో కృష్ణుడు. వీలైనన్ని తెలుగు మాటలు చొప్పించటాన్ని నన్నయే మొదలెట్టారిలా!
అప్పటి వాళ్లు రాసినవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, వైదిక భావాలతో ముడిపడ్డవే కావడంతో వారి కొలదులకు, ఎల్లలకు కొన్ని మేర (పరిమితులు)లున్నాయి.
సంస్కృతాన్ని మీరడం అంటే వేల్పులను కించపరచడమే అనుకునేవాళ్లు. తెలుగులో మొక్కితే వేల్పులకు ఎక్కదనే తలంపు కూడా ఆ నాడు తెలుగు వాడకానికి అడ్డుపడింది.
వేదవాక్యాలను తెలుగు చేయటానికి నారాయణ భట్టుని అడ్డం పెట్టుకున్నట్టే, నన్నయ రాజరాజ నరేంద్రుణ్ణి కూడా అడ్డం పెట్టుకున్నాడు. వేల్పుల కథల్ని వీలున్నంత మేర తెలుగు మాటల్లో చెప్పటం ఆనాడు పెద్ద గండాన్ని దాటటమే! అందుకనే రాజరాజ నరేంద్రుడి కోరిక ఇది.. అనే నెపాన్ని ముందే అడ్డువేసుకున్నాడు. అలా, తెలుగులో కొలిచినా వేల్పులు పలుకుతారనే నమ్మిక మందిలో కలిగించ గలిగాడు నన్నయ! ఆయనే ఇంత తెగించి వ్రాయగలిగాడు కాబట్టే, పోతనగారు ఆంధ్రమహాభాగవతం వ్రాయగలిగా డనటం ఎక్కువచేసి చెప్పటం కాదు!
నన్నయగారు తెలుగు అనబడే దట్టమైన సంస్కృతం అడవిలోకి దూరి, కబ్బపు కోపు (కావ్యశైలి)లో కాసినన్ని తెలుగు మాటల్ని కొసరుగా చొప్పించ గలిగాడు. అంతా సంస్కృతంగానే సాగుతున్న కబ్బాల్లోకి తెలుగు మాటల్ని తెచ్చి నింపాడు. కబ్బపు వ్రాతలో తెలుగు మాటల వాడకానికి నన్నయే ‘ఆదికవి’!.
లోనారసి చూస్తె లోనింగిలో వేగుచుక్కలా అవుపిస్తాడు నన్నయ!
కైతల ఈ వెనకటి నడవడిలోకి తొంగి చూడటం దేనికంటే, వెన్కటి నుండి కొంత ఎరుకని పొంది ఇప్పటి తెలుగుని చక్కగా సాకటానికి! మార్పులన్నీ ఎప్పటికప్పుడు మారుతోన్న తలంపుల తీరును బట్టి వచ్చినవే! మారే దానిలోనే కొత్త అనేది కొత్తగా పుట్టుకొస్తుంది. మారనిది మారనిదిగానే ఉంటుంది.
ఇప్పటి మన బతుకుతీరులో నుడిపోకడ లన్నీ మారిపోయాయి. ఎరుకమినుకులు(శాస్త్ర, సాంకేతిక పదాలు) పెరిగాయి. నుడి తీరు మారింది. అయితే, కొత్తగా వస్తోన్న ఎరుక మాటల్ని మళ్లీ సంస్కృతంలోనే వండి వార్చే పనిని మానుకుని, ఇప్పుడైనా వాటిని తెలుగులోకి మార్చగలమేమో తలపోయవలసి ఉంది.
ఇప్పటి మార్పులకు తగ్గట్టుగా తెలుగు తీరును కూడా మార్చుకుంటూ వెడితేనే నుడి మెరుగు పడ్తుంది. మెరుగు లీనుతుంది.
ఈ విరివివ్రాతలో (వ్యాసం) పదే పదే సంస్కృతం ఊసెత్తటాన్ని “సంస్కృత నింద” చెయ్యటానికి కాదు! అగత్యం ఉన్నంత మేర సంస్కృతం వాడక తప్పదు ఈనాటికైనా! వీలు ఉన్నంతలో తెలుగు మాటల్ని కూడా వాడుకుందాం అని అడగటానికీ, అచ్చతెలుగులో వ్రాయటం, చదవటం కూడా తేలికేనని చెప్పటానికే ఇదంతా!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
