[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘అచ్చతెలుగును మనం ఇందుకు వ్రాయాలి!’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
అచ్చతెలుగున వ్రాయటం వ్రాతలలోకెల్లా ఒక మిన్న! ఇది తెలుగు పట్ల నెనరుతో, తెలుగు నుడి కాపు కోసరం ఒక పట్టుదలతో, కొత్తవి చెప్పాలనే నిలుకడ కలిగిన వారు వ్రాసే ఒక జన్నం (యజ్ఞం).
ఇది వేరే ఒక వ్రాత తీరు (సాహిత్య ప్రక్రియ) ఎంతమాత్రమూ కాదు. కొత్తగా ఇప్పుడేదో పుట్టుకొచ్చినదీ కాదు. అచ్చతెలుగున వ్రాయటం ఒక గురి (లక్ష్యం). వెయ్యేళ్లుగా వ్రాతరులందరికీ ఉన్నా నెరవేని పని!
తెలుగుకు మేలు చేయాలనే తలంపుతో తీసుకున్న ఒక అచ్చుపాటు (నిర్ణయం) ఇది! దీన్ని ఉబలాటం కొద్దీ చేసే నడపు (ప్రయోగం) అనడం సరికాదు. తెలుగునే వ్రాస్తామని కంకణం కట్టుకున్నవాళ్ల చెమట చిందులు అచ్చతెలుగు వ్రాతలు!
తెలుగుని మంచుమిట్టంత (ఎవరెస్టు శిఖరం) ఎత్తున నిలపాలన్న నిండైన ఆదతోనే పొన్నగంటి తెలుగన్న యయాతి చరిత్ర వ్రాశాడు. అప్పట్లో తెలంగాణంలో మహమ్మదీయుల ఏలుబడి, సంస్కృతం వ్రాతలు మితిమీరి సాగటం, ఉర్దూ, పర్షియన్ అరబ్బీ మాటలు చేరి తెలుగు కలకబారటం (కాలుష్యం).. అచ్చంగా తెలుగునే వ్రాయాలనే తలంపుకు ఇవి కూడా తోడై తెలంగాణంలో అచ్చతెలుగు ముందుగా ఊపందుకుంది. ఆంధ్రలో ఆంగ్లం ఇదే తీరున తెలుగుకు కలక కలిగిస్తున్నప్పటికీ ఇక్కడ అప్పట్లో పెద్దగా కదలిక లేకుండా పోయింది. సంస్కృతం పట్ల మితిమీరిన యావ, ఆబ వలన తెలుగు బెంగ తక్కువయిపోయింది.
తెలుగన్నకు 200 యేళ్ళ తరువాత మన తెలుగు మాటల్ని తెలియ చెప్పటానికే, నుడి వెలుగు (భాషాజ్ఞానం) కలిగించ టానిక తాను నీతిచంద్రిక వ్రాస్తున్నానని చిన్నయ సూరి చెప్పుకున్న దాన్ని అచ్చతెలుగు అనే వైపు నుండి చూడాలి.
సూరిగారి సమకాలికుడైన కోలా శేషాచలకవి నీలగిరి యాత్రని కూడా నుడివెలుగు కలిగించటానికే వ్రాస్తున్నానని చెప్పుకున్నాడు.
ఒక పెద్ద చదువరి “యయాతి చరిత్రలో తెలుగన్న తనకు తెలుగు నెనరు ఎక్కువ అని పదేపదే చేప్పుకోలేదు కదా.. కాబట్టి ఆయనకు తెలుగు నెనరు ఉన్నదనటానికి ఆదరువు లే”దని వ్రాశాడు. ఆయన ఎక్కడా తాను పూర్తిగా ఆ కబ్బాన్ని చదివే వ్రాస్తున్నా నని ఎక్కడా అనలేదు కాబట్టి, ఆయన ఈ పిచ్చివ్రాతని చదివే వ్రాశాడనటానికి కూడా ఆదరువు లేదంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయీ మాటలు. ఎల్లబడుల పెద్ద (విశ్వవిద్యాలయం)లో పట్టాకోసం వ్రాసిన గాలింపుల వ్రాతల్లోనూ, బెజ్జపు గాలింపు వ్రాతల్లోనూ ఇలాంటి వంకరమాటలు కనిపిస్తాయి.
‘శ్రీ’ లాంటి సంస్కృతం మాట వాడకుండా అచ్చతెలుగు కబ్బాన్ని మొదలుపెట్టడాన్ని “ఒక చమత్కారం మాత్రమే” అన్నాడు మరో పెద్ద చదువరి. తెలుగంటే ఏ మాత్రం నెనరు, ఇంపు, ఎలమి లేని వారి మాటలు ఇవి. పేర్లను, బిరుదుల్నీ అలాగే ఉంచి, తక్కిన సంస్కృతాన్ని ఆపి అచ్చంగా తెలుగులోనే వ్రాయాలని నోము పట్టి పదిరెట్లు ఎక్కువ చెమటోడ్చి వ్రాయటాన్ని కేవలం ‘ఉబలాటం” అనుకోగలమా!
ఇందులో కొంత భాషాభిమానం కూడా ఉందని కొందరు వీణనొక్కులు నొక్కారు. ‘కొంత భాషాభిమానం’తోనే ఒక మిన్న అయిన కబ్బపు కూర్పు వీలయ్యేనా? ఎదనిండా తెలుగు ఎలమి నిండి ఉంటేనే అది కుదిరే పని!
అచ్చతెలును కోరేవారు సంస్కృతాన్ని, ఇంగ్లీషుని, ఇంకా ఇతర నుడుల్ని నోటికొచ్చినట్టు తిట్టరు. వారిది తెలుగు నుడి వలపే గాని, తెలుగు రజ్జు (దురభిమానం)కాదు! కాబట్టి, ఎముకల దండ వేసుకుని మాంసం తిన్నానని చాటుకునే వాడిలా మాటిమాటికి సివమెత్తినట్టు తెలుగు కేకలు వెయ్యాల్సిన పనిలేదు. ఒక వ్రాతరి వ్రాసిన ఇంపైన వ్రాతలే తెలుగు నెనరును, ఎలమిని చాటుతాయి.
పాల్కురికి సోమన, కొరవి గోపరాజు, పొన్నెగంటి తెలుగన్న ఇలాంటి అచ్చతెలుగు వ్రాతరులు వ్రాస్తున్న ఆ పొద్దుల్లో కొద్దివాళ్లు (సామాన్యులు) మాట్లాడే మాటల్లోనూ సంస్కృతం పలుకులు తేలికగా ఒదిగిపోయి ఉన్నాయి. ఇప్పటి కొద్దివారికి రైలు రోడ్డు బస్సు లాంటి తేలికపాటి ఇంగ్లీషు మాటలు తెలిసినట్టే అప్పటి కొద్దివారికి దేవుడు, అవతారం, జన్మ, కర్మ, అధ్యాయం, పుస్తకం, ధర్మం, మంత్రం, జపం, యజ్ఞం, కాలం లాంటి సంస్కృతం మాటలు తెలుసు. అందుకని కబ్బాలలో సంస్కృతం మాటల వాడటం ఒక విరివిగానే సాగాయప్పట్లో!.
సంస్కృతం ఎంత ఎక్కువ వ్రాస్తే అంత మిన్న అనే పొద్దుఅవి!. అలా వ్రాసినవాళ్లకే బిరుదులు ఈనాములు దక్కేవి. అచ్చతెలుగున వ్రాయాలనుకోవటం ఏటికి ఎదురీదటమే అప్పట్లో!
ఇప్పటి మనకి అలాంటి అడ్డులేమీ లేవు కదా! అయినా మనం తెలుగులోనే వ్రాస్తానని అనుకోలేకపోతున్నాం.
అచ్చతెలుగులో వ్రాసినా ‘మళ్ళీ యయాతి చరిత్రనే కదా..!’ అనే పెదవి విరుపు కూడా ఉంది. సంస్కృతాన్ని అంటుకునేసాగిన కత కాబట్టి మాటలు మాత్రమే కాసినన్ని మార్చారు గానీ ఇది పూర్తి అచ్చతెలుగు వ్రాత కాదన్న వారూ ఉన్నారు. వెమకటి కాలంలో సొంతంగా ఒక కతను కూర్చుకుంటే గుర్తింపు తక్కువ. వాటికి తోటి వ్రాతరుల మెప్పు దక్కేది కాదు. సంస్కృతం లేనిదే మనకు మనుగడ లేదని అప్పటి వ్రాతరుల్లో ఒక గట్టి నమ్మిక ఉండేది. అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగారు అచ్చతెలుగు వ్రాతరులు.
అందరూ సంస్కృతం కలిసిన తెగున వ్రాస్తోంటే, ఒక్కడు.. ఒకే ఒక్కడు అచ్చతెలుగంటూ బయలుదేరి యయాతి చరిత్ర వ్రాస్తుంటే అప్పటి వ్రాతరులు ఎంత ఒప్పారో, ఎంతమంది పట్టించుకున్నారో, ఎంతమంది ఆహా అన్నారో చెప్పలేము. దీని వలన ఏం ఒనగూరుతుందని అడిగినవారూ ఇప్పటిలాగే అప్పుడూ ఉండి ఉండొచ్చు.
తెలుగును వాడటమే తెలుగుకు మనం చెయ్యగలిగినదన్న ఒకే ఒక్క గురి ఇలా అచ్చతెలుగున వ్రాయిస్తున్నదన్న ఎరుక చాలా తక్కువ మందిలో ఉంది అప్పుడే కాదు ఇప్పుడు కూడా!
మతాలను, కులాలను, ‘ఇద్దరి – అద్దరి’ తేడాల్ని (ప్రాంతీయతా భేదాల్ని) దాటుకుని అచ్చతెలుగు నడక సాగాలి. వ్రాసేది తెలుగైనప్పుడు తెలుగులోనే వ్రాద్దామన్నదే ఇందులో కూకటి అనదగింది!
నూటికి 80 వంతులు సంస్కృతంతోనో, ఒరుల నుడులతోనో నింపేసి ఇదంతా తెలుగనటం మనల్ని మనం తక్కువ చేసుకోవటమే!
తెలుగులో కలిసిపోయిన సంస్కృతం మాటలు
అన్నం, సూర్యుడు. చంద్రుడు, ఆకాశం, దేవుడు, స్నేహితుడు, నయం. భయం. ప్రతిపక్షం. నాయకుడు, వినాయకుడు. నాశనం, నాశకుడు, ఆశ, అత్యాశ, దురాశ, మహాత్ముడు. మహారాజు. ముష్టి. ఇష్టం,కష్టం, నష్టం,లాభం. కపటం, నాటకం, వాసం, వేషం, ఫలం, పుష్పం, క్రయం, విక్రయం.. స్నానం, తీర్థం, ప్రసాదం, ఫలం, వాసన, దేవాలయం, స్వామి, వస్త్రం, ఆసనం, భార్య, భర్త, సంతానం, వృక్షం, వక్షం, పక్షం, ప్రయాణం, ద్వారం, పాత్ర, ముఖం., చిత్రం, విచిత్రం. బంధువు, బంధం, విరోధం, శత్రువు, ప్రయాణం, ప్రసాదం, రక్తం, క్షమించు, రక్షించు,. భక్షించు, విహారం,. పుస్తకం, పత్రం, పత్రిక ..తరచుగా మనం వాడే మాటల్లో సంస్కృత, వైదిక నుడులు ఎలా ఒదిగిపోయాయో చూడండి:
అయ్యోపాపం!, వాడిఖర్మకాలింది, ఇదినాకర్మకొచ్చింది, ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి, ఈ పని చేసిపెట్టు పుణ్యం ఉంటుంది, పూర్వజన్మసుకృతం వలనే అంతటి కొడుకు పుట్టాడు, దేవుడి మీద భారం వేశాను. భగవంతుడే చూసుకుంటాడు, అంతా విధి నిర్ణయం, చేసిన కర్మ అనుభవించక తప్పదు, పాపం పండింది, స్వర్గం చూపించాడు. కర్మకొద్ది దొరికావు, పుణ్యం కొద్దీ దొరికాడు, ఏజన్మలో చేసిన పాపమో, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతోంది, ఆప్రాజెక్టుకి ఇప్పటికి మోక్షం వచ్చింది, స్వర్గధామంలా ఉన్నదా ఇల్లు, నరకప్రాయంగా మారింది సంసారం, ‘ఆత్మ’ విమర్శ చేసుకో, లోగుట్టు పరమాత్మకే ఎరుక, విధివ్రాత ఇలా తగులడింది, ప్రారబ్దం కొద్దీ దొరికాడు, మంచి యోగం పట్టింది, అందుకోసం తపస్సు చేసాడు, పెద్దయఙ్ఞం చేసినంతపని అయ్యింది, పనిమంతుల్ని ఆవాహన చేసుకున్నాడు, ఏదో మంత్రం వేసి లోబరచుకున్నాడు, సంకల్పం చెప్పుకున్నాడు, అది మన ఆచారం, ఇది మన సంప్రదాయం, దరిద్రం పట్టింది, గ్రహచారం బాగోలేదు, దిష్టితగిలింది, శుభకార్యం జరుగుతోంది, అశుభసూచకంగా ఉంది, ముహూర్తం కుదరలేదు.. ఇలా తెలుగులో పాతుకుపోయిన మాటలెన్నో ఉన్నాయి.
నిజానికి వైదికానికి చెందిన మాటల్ని తెచ్చి మనం మామూలు వాటికి వాడుతున్నాం. మచ్చుకి యజమాని అంటే జన్నం (యజ్ఞం) చేసేవాడని. చివరికది ఇల్లు అద్దెకిచ్చిన వాడిక్కూడా వాడటం మొదలు పెట్టాం. వారి ఆధ్వర్యంలో జరుగుతోందనటం కూడా వైదికానికి చెందిన మాటే! బిరుదులు కూడా సంస్కృతంలోనే ఇవ్వటం ఈనాటికీ కొనసాగుతోంది. అచ్చతెలుగున బిరుదులు ఇచ్చే రోజులు ఎప్పటికొస్తాయో ఏమో!
వీటికి జోడైన తెలుగుమాటలు ఏవీ తెలుగున పుట్టకుండా పోయాయి. వైదిక ధర్మాలు తెలుగున పుట్టినవి కాదు కాబట్టి వాటికి తెలుగున మాట ఉండనే ఉండదు. ఎవరూ పుట్టించే పని కూడా పెద్దగా చెయ్యకపోవటమే అచ్చతెలుగు పెరగకపోవటం. ఇప్పుడు జరగవలసింది ఏమిటో ఈ ముచ్చటింపుల వలన కొన్ని కొత్త తలంపులు కలిగే వీలుంది.
ఇప్పుడీ సంస్కృతం మాటల్ని ఏం చేద్దాం?
అగ్గి, వడ్డన, మన్నెం, బండి, అంతు, పంచదార, తొరగా, అరదం, ఇతవు, సున్నా, అంకె లాంటివి సంస్కృత ప్రాకృతాలలోంచి పుట్టిన తద్భవాలు. రైలు రోడ్డు బస్సు, సెల్లు, పెన్ను, బుక్కు, మంది అందరికీ తెలిసిన ఇలాంటి ఆంగ్ల నుడులు కూడా తద్భవాలే! వాటన్నింటినీ ఒక గాటన కట్టి, అచ్చతెలుగున వ్రాసేటప్పుడు వాటికి మారుగా ఇంకో మాట మనకు దొరకనప్పుడు వాటినే ఉన్నవి ఉన్నట్టుగా వాడుకోవటం తప్పనిసరే అవుతుంది. సంస్కృతాన్నే కాదు ఆంగ్లాన్ని కూడా కాదని మనం ముందుకు వెళ్ళగలిగేది లేదు.
సంస్కృతానికో ఇంకో నుడికో మనం ‘పగ’వాళ్లం కాదు. మన మాటలన్నీ మాయమైపోతున్నా యనే ‘వగ’ ఉన్నవాళ్లం. వాటిని వాడకంలోకి తేవాలన్న ‘కుతి’ ఉన్నవాళ్ళం. అంతే! .
సంస్కృతం మాటలకు జోడైన తెలుగు మాటలను వెదకటం, దొరికిన వాటిని ఇప్పటి మన పనులకు తగ్గట్టుగా వాడుకోవటం మొదలు పెట్టాలి. రచయితల సంఘం అనటానికి ‘వ్రాతరుల కూటువ’ అనటం వలన కొలదిగాళ్లకు కూడా తేలికగానే తెలుస్తుంది అధ్యక్షుణ్ణి తలకన్ను అనీ, కార్యదర్శిని నడుపరి అనీ, కోశాధికారిని ‘సంచిరేడు’ అనీ పిలవటం మొదలు పెడితే అందరికీ తేలికగా తెలుస్తుంది. మనం ఇదే పనిగా మాటలకోసం వెదుకుతూ ఉంటే ఇంతకన్నా మంచి మాటలు దొరుకుతాయి కూడా!
వెనకటి కవులు పేర్లకు (నామవాచకాలు) ఇలానే అనేక పుట్టింపులు చేశారు. అలా చేసిన వాటిని మరొక్క సారి ఇప్పటి మనకు చాలినట్టుగా ఉన్నాయా అన్నది చూసుకుని తిరిగి వాడకంలోకి తెచ్చుకోవాలి,
అట్లాగే, తెలుగులో కొన్ని నుడికట్లు (పదబంధాలు) మంది వాడకంలో ఏర్పడ్డాయి. “వాడికి కళ్ళమంట”, “కళ్లలో కారం కొట్టాడు”, “వెన్ను చూపించేశాడు”, “మడమ తిప్పడు”, “కళ్ళు నెత్తికెక్కు”, “ఉవ్విళులూరు”, “కడగంట చూచు”, “కడచెడు” ఇలాంటి నుడికట్ల వాడకం పెరిగితే అచ్చతెలుగు వ్రాత వన్నెకెక్కుతుంది. ఇంగ్లీషు మాటలకో సంస్కృతం మాటలకో మారుగా ఇలాంటి మాటలు వాడుకో గలిగితే చక్కగా సమకూరుతాయి.
సంస్కృతం మాటలు మనం పిలిచి తెచ్చుకున్నవేగాని వాటికవి వచ్చి తెలుగులో చొరబడలేదు. సంస్కృతం తెలుగును లోకువ చెయ్యలేదు. మనమే మన అవసరాలకు తెలుగున మాటలు పుట్టించకుండా అవే వాడుకోసాగారు. లేదా కావ్యాన్ని కబ్బం అనటం లాంటి మార్పులు చేశారు. కవి అనేది కూడా వైదికం మాటే! దానికి సరి అయిన తెలుగు మాట లేదు. రచన, సాహిత్యం, వ్యాసం, కథ, భాష ఇలాంటివాటికి చక్కని తెలుగు మాటల గురించి మన వెనకటి వ్రాతరులు ఎవరూ పట్టించుకున్నట్టు లేదు.
కొన్ని సంస్కృతం మాటలకు వాటి పుట్టుకనుబట్టి (వ్యుత్పత్తి) ఆ మాటల్ని తెలుగున పుట్టించుకోవటం మన వెనకటి కవులు కొంత ముందుకు వెళ్ళారు. కరివేల్పు, వెన్నముచ్చు నల్లనయ్య లాంటివన్నీ ఇలా పుట్టించిన మాటలే!
ముగ్గులోకి దిగితే అన్నీ వాటికవే సమకూరుతాయి. వ్రాతరికి కైతకు కావలసిన తలంపులను సమకూర్చుకోవటమే పెద్ద పని. అచ్చతెలుగున వ్రాసే వ్రాతరికి ఆ తలంపులకు కావలసిన తెలుగు మాటలను పుట్టించుకొవటం కొసరు పని! ఇదే ఎక్కువ చెమటతో కూడినది! కానీ, అచ్చతెలుగున వ్రాసిన వ్రాతరికి ఎక్కువ మన్నన దకుతుంది. ఇంక రానున్న పొద్దుల్లో జరిగేది ఇదే! తెలుగు వాళ్లం తెలుగులోనే వ్రాద్దాం అచ్చంగా తెలుగులోనే వ్రాద్దాం!!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
