Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అచ్యుతమీ రామకథ’.. అవధానుల అవధానం

[అవధానుల మణిబాబు గారి ‘అచ్యుతమీ రామకథ..’ అనే సమీక్షా గ్రంథాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ మాకినీడి సూర్య భాస్కర్.]

రామాయణంలోని ‘యుద్ధకాండ’, కేవలం రామాయణ అంతర్భాగమే కాదు, స్వతంత్రంగా ఒక ‘సంపూర్ణ ఇతిహాసం’గా పరిగణించదగినదని అవధానుల మణిబాబు గారు తమ సమీక్షలో సూచించారు. ఈ వి‌షయంలో అచ్యుత రామచంద్రమూర్తిగారి అనువాదం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన ప్రతిపాదించారు. ఈ సమీక్షలో ఆయన చేసిన ముఖ్యమైన పరిశీలనలను క్రమపద్ధతిలో చూద్దాం.

మూలానికి విధేయత:

మణిబాబు గారి దృష్టిలో, ఈ యుద్ధకాండ అనువాదం మూలానికి అత్యంత విధేయమైనది. మూలంలోని భావాన్ని వక్రీకరించకుండా, భాషలో అభిరుచి, సరళత కలిగించి తెలుగు పాఠకునికి దగ్గర చేసిందంటారు. వాల్మీకి విస్తార వర్ణనలున్న చోట అచ్యుతరామచంద్రమూర్తి వాటిని తగ్గించి, సారాన్ని కోల్పోకుండా అనువదించారనీ, అవసరమైన చోట విస్తరించారనీ గమనించారు.

కూచిమంచి తిమ్మకవిగారి యుద్ధకాండ (600 పద్యాలు)తో పోలిస్తే అచ్యుతరామచంద్రమూర్తిగారి యుద్ధకాండలో 3452 పద్యాలు ఉండటం ఆయన కృషి విస్తారాన్ని సూచిస్తుందంటారు అవధానుల. ఇందులో రెండు శార్దూలాలు, 16 చంపకమాలలు, 33 ఉత్పలమాలలు, మిగిలినవి సీసపద్యాలు, కందాలు, ఆటవెలదులు, గీతాలు. అనువాదంలో విభిన్న ఛందోరచనలు కవికి ఉన్న నైపుణ్యాన్ని చూపుతున్నాయంటారు.

కవితా తాదాత్మ్యం:

మణిబాబు గారు విశేషంగా ప్రస్తావించిన ఘట్టం ఇంద్రజిత్తు మరణం. “హా! పుత్రరత్నమా! అసురేశు గర్వమా! రాకాసి లోకైక ఏకవీర!” వంటి సంబోధనలు కవి తాలూకు తాదాత్మ్యాన్ని తెలియజేస్తాయని భావిస్తూ, తాను కూడా ఈ సమీక్షారచనలో తాదాత్మ్యం చెందారు రచయిత. బహుశా పుత్రవియోగం అనుభవించిన వేదన కవిలో ప్రతిఫలించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కవిత్వంలో భావప్రవాహం కేవలం అనువాద కర్తవ్యంగా కాకుండా, అనుభూతి విస్తృతికి సంకేతంగా ఇది చూపుతుందంటూ గొప్ప పరిశీలన చేశారు.

పునరుక్తి:

మణిబాబు గారు పునరుక్తిని ప్రత్యేకంగా గమనించారు. మూలంలో ఉన్నట్లుగానే, అనువాదంలోనూ ప్రతీకలు, ఉపమానాలు, పద/భావచిత్రాలు పునరుక్తమవుతూ వస్తాయి. ఉదాహరణకు – వాల్మీకి రామాయణంలో 112వ సర్గలో 22వ శ్లోకం, అలాగే 114వ సర్గలో 101వ శ్లోకం ఒకటేనంటారు. అలాగే, అచ్యుతరామ చంద్రమూర్తిగారి అనువాదంలో 2914వ, 3010వ పద్యాలు దాదాపుగా ఒకటే – “వైరమన్నది మరణంబు వఱకె గాన శత్రు భావంబు తగదోయి”..

అలాగే, లక్ష్మణుని “రామానుజుడు”, సుగ్రీవుని “కీశప్రభువు”, రాక్షసులను “పొలదిండులు” అని పదేపదే పిలవడం కవిత్వానికి హాయిని చేకూర్చిందంటూ – ఈ పునరుక్తి పాఠకుని ఉత్సుకతను తగ్గించక, కథను ఇంటింటా నిలబెట్టే శిల్పవిన్యాసం అయిందంటారు. ఎందుకంటే సంస్కృత సంప్రదాయంలో సద్భావన పునఃపునః మననం చేసుకోవడమే ప్రధానమైనదంటూ, దానికి ప్రతిపత్తిని కూడా చూపుతారు.

మూలం నుండి విచలనం:

మూలానికి విధేయత ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్వల్ప విచలనం కనిపించిందని మణిబాబు గారు గుర్తించారు – 32వ సర్గ: “సాగరముతీర్య సత్త్వవాన్” అనే శ్లోకాన్ని, “మహదంబునిధి దాటి దోమ కుత్తుక చొచ్చి చచ్చె” అని, తెలుగు పాఠకులకు పరిచయమైన పోలికతో చెప్పారనీ..

38వ సర్గలో చెరుకు మధురం చెడిపోవడం వంటి కొత్త ప్రతీకలు కవిగారివేనని స్థిరీకరించారు. 60వ సర్గ: కుంభకర్ణుని నిద్ర సంఖ్యను క్రమం మార్చినా భావం నిలుపుకున్నారని గమ్మత్తుగా అంటారు. 87వ సర్గలో ఇంద్రజిత్తు విభీషణుని మందలించే చోట మూలంలో తీవ్ర పరుషభాష ఉండగా, అనువాదంలో వినయం, జాలి కనిపిస్తాయి. 36వ సర్గ: “స్వభావో దురతిక్రమః” అనే సార్వకాలిక నానుడి అనువాదంలో వ్యక్తిగతంగా మారిందంటారు. ఇంకా, 94వ సర్గలో మూలంలోని ఆధ్యాత్మిక–తాత్విక దృశాంతం (ఇంద్రియానుభవం–పరమాత్మ) అనువాదంలో ప్రతిఫలించలేదని ఖరాఖండిగా చెబుతారు.

ఇవన్నీ చెబుతూ, మూలాన్ని తొలగించకుండా, తెలుగు పాఠకుని రుచికి దగ్గర చేయడం కోసం కొన్ని స్వతంత్ర రూపకల్పనలు చేశారని మణిబాబు గారు అభిప్రాయపడ్డారు.

ముగింపు భావాలు:

ముగింపునకు ముందు, సీతమ్మ హనుమ వాక్కులను “అష్టాంగ సమృద్ధిగా ఉన్నవి” అని చెప్పిన సందర్భాన్ని మణిబాబు గారు ఉటంకించారు. ఈ అష్టాంగములు (గ్రహించడం, ధారణ, స్మరణ, ప్రతిపాదన, తర్కవితర్క, దోషనివారణ, అర్థగ్రహణం, సారాంశబోధ) మనం కూడా రామకథను తెలుసుకోవడానికి అవలంబించవలసిన మార్గాలుగా సూచించారు.

చివరి సమాప్తిలో, ఇతిహాస లక్షణాలైన చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వవృత్తాంతాలు అన్నీ యుద్ధకాండలోనే పుష్కలంగా కనిపిస్తున్నాయని పేర్కోవడం, రచయిత కూలంకష పరిశీలనకు తార్కాణం. అందువల్ల యుద్ధకాండ కేవలం రామాయణంలోని భాగమే కాకుండా, స్వతంత్ర పరిపూర్ణ ఇతిహాసంగా పరిగణించదగినదని తేల్చారు.

సమగ్ర సమీక్ష:

మొత్తం మీద, అవధానుల మణిబాబు గారి సమీక్షలో మూడు ముఖ్యాంశాలు ప్రతిఫలిస్తున్నాయి:

  1. మూలానికి విధేయత – భావన, వచనం రెండూ మూలాన్ని నమ్మకంగా నిలబెట్టడం.
  2. సృజనాత్మక స్వాతంత్య్రం – పాఠకుని రుచికి దగ్గరయ్యే కొత్త ప్రతీకలు, మృదుత్వం.
  3. భావగాఢత – కవిత్వంలో తాదాత్మ్యం, పునరుక్తి, ఆధ్యాత్మికతను సమన్వయం చేయడం.

ఈ మూడు దృక్కోణాల సమన్వయమే అచ్యుతరామచంద్రమూర్తిగారి యుద్ధకాండను ఇతర అనువాదాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టిందని మణిబాబు గారి సమీక్ష తేటతెల్లం చేస్తుంది.

రచయిత విశ్లేషణలో చూపిన సూక్ష్మదృష్టి, ప్రతి అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించిన నైపుణ్యం ప్రశంసనీయం. మూలగ్రంథంలోని భావజాలాన్ని వదలకుండా, తన విమర్శన శీలతతో పాఠకునికి కొత్త దృష్టిని అందించడం రచయిత ప్రత్యేకత. క్రమపద్ధతిగా ఒకో అంశాన్ని విడదీసి, వర్ణిస్తూ ప్రధాన విషయానికి తీసుకువెళ్ళిన తీరు ప్రశంసనీయం.

శాస్త్రీయ పద్ధతి, సాహిత్య రసం రెండింటినీ సమన్వయపరచడంలో రచయిత అసాధారణ నైపుణ్యం చూపారు. వచనంలో పునరుక్తి లేకుండా, స్పష్టతతో భావప్రకటన జరగడం మణిబాబు రచనా విధానానికి ప్రత్యేకమైన అందం.

అన్వేషణాత్మక దృక్పథం పాఠకునికి కొత్త కోణాలపై ఆలోచింపజేస్తుంది. విమర్శలో వ్యక్తిగత అభిప్రాయాలు, శాస్త్రీయ ఆధారాలు రెండూ సమతూకంగా మిళితం చేయడం కత్తిమీద సాము.

ఈ సాముగరిడీలో మణిబాబు నైపుణ్యం అబ్బురపరుస్తుంది.

మొత్తంగా, ఈ సమీక్ష, కేవలం విమర్శక గ్రంథం మాత్రమే కాక, సాహిత్య-పారంపర్యాల మధ్య వారధిగా నిలిచిందని చెప్పడానికి సంకోచించనవసరం లేదు.

“చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం” – ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ, తాను ఈ సారస్వతసాగర తీరాన గులకరాళ్లను ఏరుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఏరుకున్న గులకరాళ్ళ నుంచి ఒక గుప్పెడు నాకు కూడా ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. చివరగా ప్రేరకులైన, కారకులైన అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలిపిన మణిబాబు గారికి తత్కారణంగా నేను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

***

అచ్యుతమీ రామకథ (సమీక్షా వ్యాసం)
రచన: అవధానుల మణిబాబు
పేజీలు: 64
వెల: ₹ 150/-
ప్రతులకు:
అవధానుల మణిబాబు,
3-62,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర,
సర్పవరం,
కాకినాడ 533005
ఫోన్ 9948179437

Exit mobile version