[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ ‘అన్ని దారులు ప్యారడైజ్ వైపుకే’ అంటున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]
బిరియాని అనగానే నగరవాసులకు చప్పున గుర్తుకు వచ్చేది ‘ప్యారడైజ్’ హోటల్. సికిందరాబాద్ ప్రాంతంలో ఉండే ఈ హోటల్ హైదరాబాద్ నగరానికి ఓ చెరగని సంతకంగా మిగిలిపోయింది. ఈ హోటల్ ఉన్న కూడలిని ‘ప్యారడైజ్ సర్కిల్’ అని పిలుచుకుంటారు నగరవాసులు. హైదరాబాద్ వచ్చిన ప్రముఖులందరూ ఈ హోటల్ బిరియాని రుచి చూసిన వారే.
(నేటి ప్యారడైజ్ హోటల్, ఔట్ లెట్లు)
ఒకప్పుడు ఈ కూడలిలో ‘ప్యారడైజ్ టాకీస్’ అనే ఓ సినిమా థియేటర్ నడిచేది. ఇది అప్పట్లో నగరంలో మొదటి ఏ.సి థియేటర్. ఇందులో అతి గొప్ప సినిమాలను ఏరి ప్రదర్శించేవారట. దీని యజమాని అంగట్ల అంజయ్య. కాస్త దూరంగా ఉన్న అజంతా టాకీస్ కూడా అయనదే. అప్పట్లో సినిమాలో ప్రదర్శనకు రీళ్లను వెళ్లి తెచ్చుకోవలసి వచ్చేది. అలా థియేటర్‌లో ప్రదర్శించబోయే కొత్త సినిమా రీల్ కోసం ట్రైన్‌లో మద్రాసు బైలుదేరిన అంజయ్య వరదల కారణంగా దెబ్బ తిన్న రైల్వే లైన్‌పై ట్రైన్ ప్రమాదానికి గురవడంతో మరణించారు. ఆలేర్ దగ్గర రివర్ బ్రిడ్జ్‌పై ఈ ప్రమాదం జరిగింది. ఆయన మరణం తరవాత కొన్నాళ్లు ఈ కూడలిని అంజయ్య ప్యారడైజ్ అని కూడా పిలిచారు. ప్యారడైజ్ టాకీస్ ఎనభైల ప్రారంభంలోనే పెరిగిన ఎంటర్మెయిన్మెంట్ టాకీస్‌ల ధాటికి తట్టుకోలేక మూతపడింది.
(పాత పారడైజ్ థియేటర్)
ఈ థియేటర్‌కు ఆనుకునే సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు 1953లో ప్రారంభం అయింది. దీని యజమాని గులాం హుస్సేన్ హెమ్మతీ, ఇరాన్ నుంచి వలస వచ్చారు. ముందుగా బొంబాయి వెళ్లి అక్కడ నుండి హైదరాబాద్‌లో టీ హోటల్ వ్యాపారం కోసం వచ్చిన తొలి తరం ఇరానీలలో ఈయన ఒకరు. మొదట థియేటర్ లోపల ఓ చిన్న కాంటీన్ తెరవాలని ఈయన అనుకున్నారు. కాని ధియేటర్ యజమానితో స్నేహం పెరిగి, ధియేటర్ పక్కన 100 మంది కూర్చోగలిగే టీ కొట్టును మొదలుపెట్టే అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు హుస్సేన్. ఆ సినీ థియేటర్ పేరుని ప్యారడైజ్‌గా నిర్ణయించారని తెలిసి తన టీ హోటల్‌కు ఆయన అదే పేరు పెట్టుకున్నారు. వీరి కుటుంబం ఖైరతాబాద్‌లో ఉండేది. ఆ టీ కొట్టు దగ్గరే ఓ కిరాణా స్టోర్ కూడా ప్రారంభమయింది. అప్పట్లో సూపర్ మార్కెట్లు లేవు. ఆ కూడలిలో వెలసిన మొట్టమొదటి ప్రొవిజినల్ స్టోర్ అది.
(హుస్సైన్ మొదలుపెట్టిన మొట్టమొదటి ప్యారడైజ్ కెఫె, ప్రొవిషనల్ స్టోర్)
అప్పట్లో ఈ టీ కొట్టులో దొరికే కడక్ చాయ్ ఎందరికో ఇష్టమైన పానీయం. సగం పాలు సగం నీటితో తయారు చేసే ఈ టీ ఎందరినో ఆ కొట్టుకు రప్పించేది. మెల్లిగా అక్కడే బిస్కట్లు, సమోసాలు మొదలయ్యాయి. టీ ని లైట్‌గా ఇష్టపడేవారికి అలాగే చేసి అందించేవాళ్లు. కస్టమర్ ఇష్టాలను అనుసరించి టీ తయారు చేసి అమ్మే ఈ చిన్న టీ కొట్టు అలా నగర వాసులకెంతో దగ్గరయ్యింది. పూర్తి స్థాయి భోజనశాలగా మారిన తరవాత కూడా కస్టమర్ ఫ్రెండ్లీ గానే ఉండగలగడం ఈ హోటల్ ప్రత్యేకత. సాయంత్రం నాలుగింటికి వచ్చి బిరియాని అడిగినవారికి కూడా తాజాగా వండి వడ్డించడం ఇక్కడ ఇప్పటికీ సాధారణం. అలా బిరియాని అంటే ఎప్పుడైనా ఏ సమయంలోనయినా ప్యారడైజే అన్న మాట ప్రతి ఇంటా వ్యాపించింది. చైనీస్, ముఘలాయి వంటకాలు ఆ తరువాత వీరి మెనూలో చేరినా హైదరాబాదీ రుచులను నగరవాసులకు అందించడం ప్రధానాంశంగానే ఈ హోటల్ ఈ రోజుకీ నడుస్తోంది.
ఈ టీ కొట్టు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి దాకా ప్రొద్దున్నే ఐదింటికే దీన్ని తెరవడం జరుగుతుంది. ప్యారడైజ్ సర్కిల్‌కు కాస్త దూరంలోనే రైల్వే స్టేషన్ ఉండడం, అటు పక్క కొద్ది దూరంలో ఒకప్పటి ఏర్‌పోర్ట్ ఉండడం, అక్కడే బస్‌లో ఊర్లకి వెళ్లే వాళ్లు తెల్లవారు జామునే రావడంతో ఈ ప్రాంతంలో జనం రద్దీ ప్రొద్దున్నే మొదలయ్యేది. ఆ సమయంలో వీరందరికీ టీ అందించేది ఈ ప్యారడైజ్ టీ పాయింట్. మొదట 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు 2014 నాటికి 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. ఇప్పటికీ ఇక్కడ తెల్లవారుజామునే దొరికే రోటీ కీమా చాయ్ కోసం జనం వస్తుంటారు. ఇక్కడి లుక్మి చాయ్‌కు ఎందరో అభిమానులు. పైన రెస్టారెంట్‌లో వంటగదిలో పని 11కి మొదలయ్యి అర్ధరాత్రి దాకా కొనసాగుతుంది. వంటగదిలో పని చేస్తున్న వంటవాళ్లు ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఒక పక్క థియేటర్ మూతపడి చరిత్రలో కలిసిపోతే, మరో పక్క ఈ టీ పాయింట్ క్రమంగా విస్తరించింది. ఆ రోజుల్లో పక్కనే ఉన్న అక్బర్ రెస్టారెంట్‌ను కూడా కలుపుని ఇంకొన్ని ఔట్‌లెట్లు ఇక్కడ మొదలయ్యాయి.
గులాం హుసేన్ టీ కొట్టు ప్రారంభించిన రోజునే ఆయాన కుమారుడు అలీ హెమ్మతి జన్మించారు. యువకుడిగా యు.ఎస్. వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని అలీ యవ్వనపు తొలి రోజుల్లో అనుకున్నారు. కుటుంబంలో పెద్ద కొడుకుగా ఆ హోటల్ బాధ్యత అలీ తీసుకోవాలన్నది హుసేన్ కోరిక. తండ్రి కోరికను బాధ్యతగా స్వీకరించి 1978లో ఈ హోటల్ నిర్వహణను చేతుల్లోకి తీసుకున్నారు అలీ. ఆయన నేతృత్వంలో ఈ హోటల్ విస్తరించింది. ఆ రోజుల్లో ప్రాంక్ హాండ్రిచ్ హైదరాబాద్‌లో పెద్ద ఆర్కిటెక్ట్. (ఈయన ప్రముఖ నటి దియా మిర్జా తండ్రి). ఈయన జర్మన్ గ్రాఫిక్ డిజైనర్, ఆర్టిస్ట్, ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్యారడైజ్ హోటల్ రూపశిల్పి ఆయనే. టీ ఔట్‌లెట్‌గా ఉన్న ప్యారడైజ్‌ను పూర్తి స్థాయి ఫామిలీ రెస్టారెంట్‌గా రూపొందించారు ఫ్రాంక్ హాండ్రిచ్. ఈ హోటల్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఎంత జనాదరణ సంపాదించుకుందంటే ఇక్కడి కూడలి ప్యారడైజ్ సర్కిల్ అయితే బస్ స్టాప్ కూడా ప్యారడైజ్ పేరుతోనే గుర్తింపు పొందింది.
హుస్సేన్ కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా ఈ హోటల్‌ను అభివృద్ధి చేశారు. ఆ క్రమంలోనే పర్సిస్ గోల్డ్, పర్సిస్ హైట్శ్, పర్సిస్ రూఫ్ హార్డెన్, ప్యారడైజ్ టేక్ అవే (కబాబ్స్, బిరియాని) ప్యారడైజ్ బేకరి, కూల్ డ్రింక్స్, జ్యూస్ ఔట్లెట్లతో హైదరాబాదీ ప్రజల జీవితంలో దీన్నీ ఒక భాగం చేశారు. ఒకప్పుడు ప్యారడైజ్ సినిమా హాల్ ఉన్న చోట ఇప్పుడు సన్‌షైన్ హాస్పిటల్, ఓ పెద్ద షాపింగ్ కాంపెక్స్ వచ్చాయి. 2014 నుంచి సమారా కాపిటల్ దీని బాధ్యతలు తీసుకుంది. 2027 లోగా 500 ప్యారడైజ్ ఔట్‌లెట్లు దేశమంతా విస్తరించేలా కృషి జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి.
ఇక్కడ బిరియాని దేశ విదేశాల ప్రతినిధులను రప్పించింది. ఈ బిరియాని కోసం వాడే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ, హైదరాబాద్ లోని బేగం బజార్ నుంచి తెచ్చుకుంటారు. బిరియానీ కోసం లేత మాంసాన్ని ఉపయోగిస్తారు. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో కూడా ఇక్కడి బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.
2014 నాటికి సికింద్రాబాద్ ప్యారడైజ్‌తో పాటు హైదరాబాద్‌లో 6 ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటెక్ సిటీ, మాసబ్‌ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్‌పల్లి, బేగంపేటల్లో ఇవి పనిచేస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్, ఏఎస్‌రావ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరో 4 హోటళ్లు మొదలుపెట్టలన్నది యాజమాన్యం ఆలోచన.
ఇప్పటివరకు ప్యారడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్‌మెంట్‌లలో శిక్షణ పూర్తి చేసినవారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్యారడైజ్ హోటల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్’ను కూడా ప్రారంభించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణతో పాటు శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా కూడా నియమించుకుంటారు.
ఒక టీ కొట్టుగా మొదలయి ఓ చారిత్రిక సామ్రాజ్యంగా విస్తరించిన ప్యారడైజ్ హోటల్ హైదరాబాది బిరియానికి మారు పేరుగా నగర వాసులు నమ్ముతారు. అయితే కాలం తెచ్చిన మార్పులతో విద్యుత్తు పరికరాలతో నడిచే వంటశాలలో ఆ పాత బిరియాని రుచి కనుమరుగయిపోయిందని నమ్మే సాంప్రదాయ భోజన ప్రియులూ ఉన్నారు. ఆ నాటి పాత రుచులని ఆస్వాదించని వారు మాత్రం ఇప్పటికీ బిరియానీ అంటే ప్యారడైజే అంటూ ఉంటారు. నగరానికి వచ్చిన ప్రముఖులు కనుక్కుని మరీ ఈ హోటల్‌ను సందర్శించడం ఓ రివాజుగా మారింది. ఈ హోటల్‌కు వచ్చిన ప్రముఖుల చిత్రాలను, వారి సంతకాలను సేకరించి హోటల్ ప్రాంగణంలోనే ప్రదర్శించారు హోటల యాజమాన్యం. ఇది ఆ హోటల్‌కు వెళ్లే వారికి అదనపు ఆకర్షణ.
రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్, సచిన్‌పైలట్, మిలింద్ దేవరా, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వై.యస్. రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, చిత్రకారుడు ఎం.ఎఫ్. హుసేన్, నాటి మంత్రులు గురుమూర్తి, రోడా మిస్త్రీ, సికింద్రాబాద్ మేయర్ సాంబయ్య ఇలా చాలా మంది ఈ హోటల్‌ను సందర్శించి ఈ బిరియాని రుచిని ఆస్వాదించారు. డైబ్బై ఏళ్లుగా ఇది ఎందరికో ప్రియమైన భోజనశాల.
(ప్యారడైజ్ ను సందర్శించిన ప్రముఖుల చిత్రాలు రెస్టారెంట్ లో)
ఈ హోటల్ గతాన్ని ప్రస్తుత వైభవాన్ని తెలిపే ఛాయాచిత్రాలు అక్కడ మనకు కనిపిస్తాయి. అందులో చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న కొన్ని పాత ఫోటోలూ ఉన్నాయ్. రెస్టారెంట్‌కు వెళ్లేటప్పుడు మనకు కనిపించే ప్రాంగణం ఇలా ఉంటుంది.
(హైదరాబాద్ నగర చరిత్రను తెలియజేసే అలనాటి అపురూప చిత్రాలు ప్యారడైజ్ హోటల్ ప్రాంగణంలో)
హోటల్‌లో హైదరాబాద్ నవాబీ శైలిని సూచించే అలంకరణ ఉంటుంది. గోడలపై ఛాయా చిత్రాలు ఇక్కడి గంగా జమునా తెహజీబ్‌ని సూచిస్తుంటాయి.
(హొటల్ గోడపై చిత్రాంజలి)
క్రింద కెఫేలో ఒకప్పటి పాత సమోవర్ అతి పెద్ద సైజులో గాజు అద్దాల మధ్య సందర్శకులను అలరిస్తూ ఉంటుంది. ఆ పక్కనే సమోవర్‌కి ఉపయోగించే విధానాన్ని తెలిపే ఓ పెద్ద సమాచార పటం ఉంది.
ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం సమాజ సేవలో భాగంగా ప్యారడైజ్ ఫొండేషన్ ద్వారా అనాథ పిల్లలకు హాస్టల్ సౌకర్యాలు, భోజన, విద్య సదుపాయాలను కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్యారడైజ్ బిరియాని ఓ ట్రెండ్‌గా మారింది.
ఉత్తర భారతదేశంలోనూ ఇతర దక్షిణ రాష్ట్రాలలోనూ బిరియాని హోటళ్లలో ప్యారడైజ్ బిరియానీ పేరుతో అక్కడివారిని ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందంటేనే ప్యారడైజ్ ముద్ర అర్థం చేసుకోవచ్చు. ఏమైనా హైదరాబాదీలు గర్వంగా చెప్పుకోదగ్గ వారసత్వ సంపద మన ప్యారడైజ్.

