Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదాబ్ హైదరాబాద్.. -1

[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]

మెహబూబ్ కాలేజ్- సికింద్రాబాద్

సికింద్రబాద్ నుండి పారడైజ్ వైపుకు బయలుదేరితే సంగీత్ చౌరస్తాను దాటుకుని గార్డెన్ రెస్టారెంట్‌ను దాటి ఒకప్పటి నటరాజ్ థియేటర్ హంగులను గుర్తు చేసుకుంటూ క్లాక్ టవర్ దాటి కొంత ముందుకు వెళితే వస్తుంది పాట్నీ సెంటర్. ఇప్పుడు అతి పెద్ద మార్కెట్‌గా మారిన ఈ స్థలానికి ఎడమ వైపుకి వస్తుంది మెహబూబ్ కాలేజ్ ప్రాంగణం. మన నగరంలో 162 సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ చారిత్రిక ప్రదేశం ఇది. ‘ఆదాబ్ హైదరాబాద్’ శీర్షికలో భాగంగా మొదట నేను మీకు పరిచయం చేయబోతున్నది సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ లోని ఈ మెహబుబ్ కాలేజ్‌ని..

ఈ కాలేజి నుండి ఎన్ని సార్లు నా జీవిత కాలంలో ప్రయాణించి ఉంటానో లెక్కలేదు. కాని అందులోకి కేవలం రెండు సార్లు మాత్రమే వెళ్లాను. మొదటిసారి రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఏదో కల్చరల్ ఫెస్ట్ ఆ కాలేజీ ప్రాంగణంలో జరుగుతుందని తెలిసి స్నేహితులతో వెళ్లాను. అప్పుడు మొదటిసారి అక్కడ బైట నిర్మించిన స్టేజీపైన లంబాడీ నృత్యం పూర్తి కాస్టూమ్స్‌తో చూసిన గుర్తు. తరువాత అక్కడే ఓ అంతాక్షరీ పోటీలో పాల్గొన్నట్లు గుర్తు. ఆ రోజుల్లో ఏదో కలల ప్రపంచంలో జీవించే వాళ్లం, పరిసరాలపై ఇప్పుడున్నంత శ్రద్ద ఉండేది కాదు. అందుకే అప్పుడు కూడా ఆ కట్టిన స్టేజీని వదిలి వెనుక ఉన్న కాలేజీ పరిసరాలలో మేం తిరగలేదు. రెండవసారి పోయిన నెలలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నప్పుడు సిట్టింగ్ స్క్వాడ్‌గా వెళ్లాను. ఆ భవనపు అందాన్ని చూసి విస్మయం చెందాను. ఆ భవనం చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యాను. 52 సంవత్సరాలుగా ఇదే నగరంలో జీవిస్తూ కొన్ని వేల సార్లు ఆ కాలేజీ ముందు నుండి వెళ్లిన నేను ఆ కాలేజీ చారిత్రిక నేపథ్యాన్ని ఇప్పటిదాకా తెలుసుకోలేకపోవడం ఎంత తప్పు. భారతదేశంలో పావు వంతు తిరిగిన నాకు నా నగరం గురించి ఎంత తెలుసని? అప్పుడు నిర్ణయించుకున్నాను నా నగరంలోకి నిజంగా ప్రయాణించాలని. ఆ ఆలోచన ఫలితమే ఈ ‘ఆదాబ్ హైదరాబాద్’.

మెహబూబ్ కాలేజీ ఉండే ఆ సెంటర్‌ని పాట్నీ సెంటర్ అంటారు. పాట్నీ సెంటర్ అనే పేరు 1927 లోనే ఆ సెంటర్‌కు వచ్చింది. ఎం.ఆర్. పాట్నీ అనే ఓ పెద్ద వ్యాపారస్థుడు ఆ సమయంలో ఓ కార్ షో రూంను అక్కడ స్థాపించాడు. హైదరాబాద్ ఏడవ నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోసం ప్రత్యేకమైన కారును తయారు చేసిన ఆటోమోబైల్ ఇంజనీయర్ ఆయన. అప్పట్లో బ్రిటీషర్ల స్థాయిలో అక్కడ ఈ కార్ షో రూం ఉండేది. ఇంగ్లీషు కార్లతో పాటు మోటర్ సైకిళ్ళు, ట్రాక్టర్లను కూడా అక్కడ అమ్మేవారట. ఇప్పుడు ఎస్.డీ. రోడ్ అని పిలుచుకునే ఆ వీధిని ఆ రోజుల్లో ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ అనేవారట. ఇప్పటి ఆర్.పీ. రోడ్ ఆ రోజుల్లో కింగ్స్ వే. ఇక ప్రస్తుతం ఉన్న చందనా బ్రదర్శ్ షో రూమ్ నా చిన్నతనంలో వెస్పా స్కూటర్ షోరూం. ఆ షోరూం నాకు బాగా గుర్తు. దాని స్థానంలో ఆ తరువాత చందనా బ్రదర్స్ రావడం ఇంకా బాగా గుర్తు. పాట్నీ వంశీకులు ఇప్పటికీ హైద్రాబాద్‌లో కొన్ని వ్యాపారాల్లో ఉన్నారంటారు.

మెహబూబ్ కాలేజ్ ఈ పాట్నీ సెంటర్ లోనే 1862 లో స్థాపించబడింది. సోమసుందరం ముదలియార్ అనే ఓ సామాజిక కార్యకర్త ఈ స్కూల్‌ను స్థాపించారు. అప్పట్లో దీన్ని ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ అనేవారట. ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఈ స్కూల్‌కు ఎంతో ధన సహాయం చేసారట. నిజాం సింహాసనాన్ని అధిష్టించిన సందర్భంలో ఈ కాలేజీకి ఆయన పేరు ఖరారు చేస్తూ మెహబూబ్ కాలేజ్‌గా మార్చారు. పేద మగ పిల్లల కోసం మొదలయిన స్కూల్ ఇది.

(ఒకప్పటి పాట్నీ సెంటర్)

ఆసిఫ్ జా VI గా పిలవబడిన మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సిద్దిఖీ 1869 – 1911 మధ్యలో హైదరాబాద్‌ను పరిపాలించారు. రెండేళ్ల సమయంలో తండ్రి మరణం తరువాత ఈయన మొదటి సాలార్ జంగ్ పర్యవేక్షణలో రాజయ్యారు. పాశ్చాత్య విద్యను అభ్యసించిన మొదటి నిజాం ఇతను. 5 ఫిభ్రవరి 1884 లో ఈయన రాజ్య భారాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లో ఎన్నో కాలేజీలు స్కూలు ఈయన హయాం లోనే మొదలయ్యాయి. భారతదేశంలోని మొట్టమొదటి వైద్య కాలేజీని హైదరాబాద్‌లో ఈయనే ప్రారంభించారు. 1876 లో హైదరాబాద్‌లో పెద్ద కరువు వచ్చినప్పుడు 1908లో మూసీ వరదలప్పుడు, ఈయన ప్రజల కోసం రూపొందించిన పధకాలు చరిత్రలో నిలిచిపోయాయి. సతీ సహగమనాన్ని పూర్తిగా ఇక్కడ నిర్మూలించడంలోనూ ఆయన పెద్ద పాత్ర వహించారు. కట్ట మైసమ్మ గుడిలో యాగం కూడా చేసి మతసామరస్యాన్ని చాటుకున్న రాజాయన. ప్రజలందరూ ప్రేమగా ఈయన్ని మహబూబ్ ఆలీ పాషా అని పిలిచే వారట. మెహబూబ్ అంటే ప్రియమైన అని అర్థం. ఈయన పెద్ద వేటగాడని, 33 పులులను తన జీవిత కాలంలో సంహరించాడని అంటారు. అందుకే ఆయన్ని ‘తీస్ మార్ ఖాన్’ అని కూడా పిలిచేవారు. 2010 లో ఆ పేరుతో వచ్చిన హిందీ సినిమా ఇప్పటి తరానికి గుర్తే కదా. ఆ సినిమా హీరో సంగతేంటో కాని నిఖార్సయిన తీస్ మార్ ఖార్ మన హైదరాబాద్ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నిజాం రైల్వేను ప్రారంభించిన వ్యక్తి కూడా ఇతనే. ఆయన పేరు పెట్టబడిన ఈ కాలేజ్‌కు అంతటి చరిత్రే ఉంది మరి.

(ఆడిటోరియంలో మెహబూబ్ అలీ ఖాన్, సోమసుందరం మొదలియార్ల అలనాటి చిత్రాలు)

ఈ పాఠశాలను ఫిబ్రవరి 1893లో స్వామి వివేకానంద మతాల పార్లమెంటుకు హాజరయ్యేందుకు యూ.ఎస్.ఏ.కి వెళ్లేముందు సందర్శించారు. 13 ఫిబ్రవరి 1893న స్వామి వివేకానంద ‘మై మిషన్ టు ది వెస్ట్’ ఉపన్యాసం ఈ కాలేజీ ప్రాంగణంలోనే ఇచ్చారు. ఇది ఇప్పటి తరానికి తెలియని విషయం. ఆ చారిత్రిక నేపథ్యానికి గుర్తుగా ఈ కాలేజీ ఆడిటోరియంలో వివేకానందుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. షికాగో సమావేశానికి వెళ్ళే ముందు వివేకానందుడు దేశంలో ఒకే ఒక చోట సామూహిక సమావేశంలో సంభాషించారు. అదీ మన హైదరాబాద్ లోని మెహబూబ్ కాలేజీ పరిసరాలలోనే. ఆ విషయాన్ని దృవీకరించే శిలాఫలకం కాలేజీ ఆడిటోరియం బైట కనిపిస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వివేకానందుని 150వ జన్మదిన సంబరాల నేపద్యంలో స్వామీ వివేకానందుని విగ్రహ ప్రతిష్ఠ ఈ ఆడిటోరియంలో స్వామీ జ్ఞానానంద చేతుల మీదుగా 2014 లో జరిగింది. ఈ విషయాన్ని దృవీకరించే ఫలకాలు ఆడిటోరియం ప్రాంగణంలో కనిపిస్తాయి.

(ఆడిటోరియంలో వివేకానందుని విగ్రహం)

అపార్ట్మెంట్లను కాలేజీలుగా చూడడానికి అలవాటు పడిన ఈ తరానికి ఈ కాలేజీ మైదానం ఓ గొప్ప అనుభవం. ముఖ్యంగా కాలేజీ ముందు గేటు యూరోపియన్ స్టైల్‌లో దర్శనమిస్తుంది. కాలం కాలేజీ భవనాలలో ఎన్ని మార్పులు చేసినా ఆ ద్వారం అలనాటి శైలిలో ఇప్పటికీ నిలిచి ఉంది. పాట్నీ సర్కిల్ ప్రాచీన ఆనవాలుకు సంబంధించి మిగిలి ఉన్న ఒకే ఒక కట్టడం ఇది.

(మెహబూబ్ కాలేజ్ ప్రధాన ద్వారం)

కింగ్స్‌వే ప్రాంతంలో అప్పట్లో బ్రిటిష్ ప్రభావం ఎక్కువ. అదే ఈ కట్టడంలోనూ కనిపిస్తుంది. మెహబూబ్ కాలేజ్ అందమైన ప్రవేశ ద్వారం విశాలమైన క్యాంపస్‌కి దారి తీస్తుంది, మరో గేటు లోపల ఉంది. ప్రధాన భవనానికి ప్రవేశ ద్వారం ‘ఎలిప్టికల్ ఆర్చ్’కి దారితీస్తుంది, అటు వైపు మూడు వైపుల నుండి మెట్ల వ్యవ్యస్థ కలిగి ఉంది, దీనితో పాటు పైకప్పుపై శిఖరం వద్ద ఒక ‘కీస్టోన్’ ఉంది. పైన త్రిభుజాకార ‘పెడిమెంట్’ ఉంది. దానిపై చెక్కబడిన షీల్డ్‌పై పాఠశాల లోగో ‘ట్రూత్ అండ్ సర్వీస్’ అని రాసి ఉంటుంది.

(ముఖ్య భవనం పై స్కూల్ ఎంబ్లం)

ప్రవేశ ద్వారం యొక్క ఇరువైపులా నాలుగు ‘ఎలిప్టికల్’ ఆర్చ్‌లు సెమీ-డ్రెస్డ్ రాతితో తయారు చేయబడ్డాయి. కఠినమైన బెల్లం అంచులు ఇందులో బయటపడ్డాయి.

ఒక ఓపెన్ గ్యాలరీ అన్ని గదులకు కలుపుతుంది. ఓ పెద్ద ఎత్తైన సీలింగ్‌తో ఆడిటోరియం కనిపిస్తుంది. ఆ, హాల్ గోడలపై పైన చూపిన పోర్ట్రెయిట్‌లు వేలాడుతున్నాయి.

ఈ పాఠశాల క్యాంపస్‌లో ప్రస్తుతం వివిధ కాలాలు మరియు శైలులలో నిర్మించబడిన అనేక బ్లాకులను ఒకే చోట మనం చూడవచ్చు.

(వివేకానందుని మెమోరియల్‌గా మారిన ఆడిటోరియం)

ప్రస్తుతం ఈ కాలేజీ ప్రాంగణంలో పాఠశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలెజిలతో పాటు అదే ప్రాంగణంలో ఆధునికంగా నిర్మించిన స్వామీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (SVIT) కాలేజీ నడుస్తోంది. ఈ 160 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులకు ఈ కాలేజీ గురయినా ఈ భవనం ఇంకా అలాగే నిలిచి ఉండడం, ఇప్పటికీ ఎందరో విద్యార్థులకు ఇక్కడ విద్య లభించడం వలన హైదరాబాద్ నగరంలో దీనికి చారిత్రికంగా గొప్ప స్థానం ఉంది. అత్యంత రద్దీగా మారిన పాటీ సర్కిల్ లోపల అంత విశాలమయిన ఆవరణలో ఓ విద్యాసంస్థ ఉందని మనం లోపలికి వెళ్ళేదాకా ఊహించలేం.

ఈ పాఠశాల భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ రాందాస్ కటారి, మేజర్ N.K వంటి IAS అధికారులతో సహా వివిధ రంగాలలో ప్రముఖ వ్యక్తులను తయారు చేసింది. గురుస్వామి, మోహన్ కందా, ఎస్. ఆనందరామ్ మరియు ఏ. వెంకట్ రావు వంటి ఐ.పీ.ఎస్. అధికారులు, ఎయిర్ మార్షల్ పి. జై కుమార్ మరియు ఎయిర్ మార్షల్ మియానెక్ బీ. మదన్, 1971 తూర్పు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్ ఎన్. అశోక్ కుమార్, క్రీడా ప్రముఖులు ట్రిపుల్ ఒలింపియన్ (హాకీ) ముఖేష్ కుమార్, క్రికెటర్ ఎమ్. ఎల్. జైసింహ, టెన్నిస్ స్టార్ ఎస్. పి. మిశ్రా, సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ మరియు ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి వంటి వారు ఈ కాలేజీలో విద్యను అభ్యసించారు.

(కాలం మాటున దాగిన జ్ఞాపకాలు, ఫొటోలు మాయమయి ఇలా ఆడిటోరియం గోడ మీద)

దివాన్ బహాదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త, కందుకూరి వేరేశలింగం గారి శిష్యులు. తెలుగు వారికి సుపరిచితులు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కూడా ఈయన పని చేసారు. ఈయన 1899 -1904 దాకా మెహబూబ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేసారు. అక్కడి నుండి కాకినాడ పిఠాపురం రాజా కాలేజీకి వెళ్లారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలం వైస్ చాన్సలర్‌గా పని చేశారు. నాయుడు గారు విద్యావేత్తగా పని మొదలుపెట్టింది మొదట మెహబూబ్ కాలేజీ నుండే. అది ఈ కాలేజీ చరిత్రకు సంబంధించిన మరో గొప్ప విషయం.

(కాలేజీకు సహాయం చేసిన మరికొందరి ఫోటోలు)

కీస్ హై స్కూల్ అని మనం పిలుచుకునే పురాతన బాలికల పాఠశాల ప్రాంగణంలోనే దివాన్ బహాదూర్ సీ వీ పద్మారావ్ ముదలియార్ కాలేజీ ఉంది. ఇది పూర్తిగా అమ్మాయిల కోసం నడిచే కాలేజ్. దాని వ్యవ్యస్థాపకుడు పద్మారావ్ మొదలియార్‌కు మెహబూబ్ కాలేజ్ తోనూ సంబంధం ఉంది. కొన్ని సంవత్సరాలు ఈ కాలేజీకి గౌరవ అధ్యక్షులుగా ఆయన పని చేసినట్లు తెలుస్తుంది. మెహబూబ్ కాలేజ్ ఆడిటోరియంలోని ఫోటోలలో వీరి చిత్రం కనిపిస్తుంది. సికింద్రబాద్ లోని పద్మారావు నగర్ వీరి పేరు మీద వెలసిన ప్రాంతం.

(దివాన్ బహాదూర్ పద్మారావ్ ముదలియార్)

అప్పట్లో విద్య కోసం చాలా మంధి ధనవంతులు తమ ధనాన్ని దానంగా ఇచ్చేవారు. కాలేజీ మొదలయిన తరువాత కూడా ఎందరో దాతలు తమ తోడ్పాటును అందించారు. అలా అంచెలంచెలుగా ఈ భవన నిర్మాణం జరిగి పాఠశాల ప్రాంగణంలోకి కొత్త భవనాలు చేరాయి. దానికి సంబంధించిన చారిత్రిక ఆధారం ఒకటి ఇది.

ఇప్పుడు స్వామి వివేకానంద హాల్‌గా పిలుచుకునే ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం ఇది. ఈ మధ్య ఈ కాలేజీకి వెళ్లినప్పుడు అక్కడ వెనుక భాగంలో ఓ గుడి కనిపించింది. అక్కడి సిబ్బందిని అడగగా అక్కడ ఓ పుట్ట వెలిసిందని, నాగులమ్మకు అక్కడ స్థానికులు పూజలు చేస్తూ ఉంటారని, వారి కోసం అక్కడ ఓ గుడి కట్టించారని తెలిసింది. భక్తుల కోసం ఆ గుడి పక్కన విడిగా ద్వారం కూడా నిర్మించారు. ప్రతి సంవత్సరం గొప్పగా అక్కడో జాతర కూడా జరుగుతుందని చెప్పారు. గుడిలో అమ్మవారి విగ్రహం ముసుగుతో కొత్తగా కనిపించింది. నేనలాంటి అలంకరణతో అమ్మవారి విగ్రహాన్ని అప్పటి దాకా చూడలేదు. ముస్లిం రాజు పేరుతో ఉన్న కాలేజి వ్యవ్యస్థాపకులు తమిళ ముదలియారు. ఆ ప్రాంగణంలో హీందూ దేవాలయం, అక్కడ ప్రతి సంవత్సరం జరిగే జాతరలో పాల్గొనే స్థానికులు. ఇది కదా మన హైదరాబాద్.

(మెహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో నాగులమ్మ గుడి, గుడిలోని విగ్రహం)

మెహబూబ్ కాలేజ్‌కు నాలుగు స్తంభాలుగా నిలిచిన ఆ నలుగురు మహానుభావుల చిత్రపటాలు భవనం బైట ఇలా మనకు కనిపిస్తాయి. ఈ తరం విద్యార్దుల కోసం ఆడిటోరియం బైట దీన్ని ఉంచేశారు.

సమయం చేసుకుని ఓ సారి ఈ కాలేజి ప్రాంతానికి వెళ్ళి చూడండి. ఈ నగర నిర్మాణం అన్ని మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా మానవ సంక్షేమం దిశగా జరిగిన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

Exit mobile version