Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదాబ్ హైదరాబాద్..-7

[హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరికతో నగరంలో ప్రయాణించి పి. జ్యోతి గారు అందిస్తున్న ఫీచర్ ‘ఆదాబ్ హైదరాబాద్’.]

చార్ కోని నాన్

హైదరాబాద్ అంటే బిరియానీ, ఇరానీ టీ మాత్రమే కాదు. ఇంకా ఇక్కడి రుచులు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి ‘చార్ కోని నాన్’. ఇక్కడి ప్రజలకు 173 ఏళ్లుగా ఈ నాన్ లను అందిస్తున్న ‘ఖాదీం మున్షీ నాన్’ దుకాణం చారిత్రాత్మకమైన బీబీ కా ఆలం అషుర్ఖానా మార్గంలో ఉంది. పురానీ హవేలీకి వెళ్ళేటప్పుడు వీధి మూలలో ఇది కనిపిస్తుంది. చతురస్రాకారంలో మృదువైన ఫ్లాట్‌ బ్రెడ్‌ను (నాన్) ను ఒక శతాబ్దం క్రితం మొదటిసారిగా ఈ దుకాణంలోనే తయారు చేసారు.

చార్మినార్ సమీపంలోని పురాణి హవేలీ వద్ద క్రాస్ రోడ్‌లోకి ప్రవేశించినప్పుడు, తాజాగా కాల్చిన నాన్ వాసన మనకు స్వాగతం పలుకుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే, ఇరుకైన వీధుల్లో పెద్ద పెద్ద తాండాలు, వరండాల మీద మైదా కుప్పలతో పేర్చబడిన దుకాణాలు మనకు కనిపిస్తాయి. ‘చార్ కొని నాన్’ అని పిలవబడే హైదరాబాద్‌ నాన్ ఈ దుకాణాలలో దొరుకుతుంది. వాటిలో అత్యంత పురాతనమైన దుకాణం ‘ఖాదీమ్ మున్షీ నాన్’. ఇది హైదరాబాద్‌లో నిజాం పాలన కాలంలో స్థాపించబడింది. ఈ దుకాణం అసలు పేరు ‘మున్షీ నాన్’. వంద సంవత్సరాలు దాటిన గుర్తుగా 1951లో దినికి ‘ఖాదిమ్ మున్షీ నాన్’ అని పునఃనామకరణ చేసారు. ఖాదిం అంటే పురాతన అని అర్ధం అట.

(ఖాదీం మున్షీ నాన్ దుకాణం)

తరాల వారీగా వ్యాపారం సాగించే పద్దతి అంతరించిపోతున్న రోజులివి. కాని మున్షీ నాన్‌ను ఇప్పుడు నడీపిస్తున్నది మాత్రం నాలుగు, ఐదో తరాలు. మున్షీ నాన్ 1829 నుండి 1857 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించిన నాల్గవ నిజాం నాసీర్-ఉద్-దౌలా పాలన నాటిది. ‘మీర్ ఫర్కుందా అలీ ఖాన్’ని (1794 – 1857) నాసిర్-ఉద్-దౌలా అని కూడా పిలుస్తారు, ఇతను హైదరాబాద్ నాల్గవ నిజాంగా 1829 నుండి 1857లో మరణించే వరకు పాలించాడు. ఈయన దగ్గర మున్షీ (గుమాస్తా)గా మహమ్మద్ హుస్సేన్ పని చేసేవారు. ఈ నాన్ తయారీ విధానాన్ని ఆయన ఢిల్లీలో నేర్చుకు వచ్చారట. ఆ తరువాత 1851 లో ఈ దుకాణాన్ని ఇప్పుడున్న స్థానంలోనే ఆయన ప్రారంభించారు. మొఘల్ కాలంలోనే ఈ చార్ కోనా నాన్ హైదరాబాద్ వరకు ప్రయాణించిందని అందరూ చెప్తారు. దీన్ని ఇంకొన్ని విభిన్నమైన ఆకారాలలో ఇప్పుడు తయారు చేస్తున్నా కాని హైదరాబాద్ పెళ్ళిళ్ళలో ఇప్పటికీ చార్ కోని నాన్ అంటే చదరపు ఆకారంలో ఉన్న నాన్‌ను మాత్రమే వడ్డిస్తారు. ఇదే ఎందుకు ఎక్కువ జనాదరణ పొందిందో మాత్రం మున్షీ నాన్ కుటుంబీకులు కూడా చెప్పలేకపోతున్నారు. కాని హైదరాబాదీ ఉత్సవాలలో చార్ కోని నాన్ కే ప్రాధాన్యత.

(మున్షీ నాన్ దుకాణంలో వ్యవస్థాపకుల ఫోటోలు)

(నాలుగవ నిజాం)

ఈ దుకాణం 1851లో ప్రారంభించాక అక్కడకు వెళ్లి నాన్ కొనుక్కునే వాళ్లు దీన్ని మున్షీ గారి దుకాణంగా గుర్తించేవారు. దానితో అదే పేరు దీనికి స్థిరపడింది. రెండవ తరంలో మొహమ్మద్ హుసేన్ కుమారుడు ఖ్వాజా మెహబూబ్ దీన్ని చూసుకుంటే, మూడవ తరంలో ఖ్వాజా అబ్దుల్ అజీమ్ ఈ దుకాణ బాధ్యతను తీసుకున్నారు. నాలుగవ తరానికి చెందిన ఖ్వాజా అబ్దుల్ హమీద్ దీన్ని నిర్వహిస్తుండగా, ఐదవ తరానికి చెందిన క్వాజా అబ్దుల్ మాజిద్ దీని భాద్యతలు చేపట్టారు. నేను దుకాణానికి వెళ్లినప్పుడు ఈయనే ఉన్నారు. అలా మున్షీ నాన్ చరిత్ర తెలుసుకోగలిగాను.

ప్రతి రోజు వెయ్యి దాకా నాన్‌లు ఇక్కడ తయారవుతాయి. నేను అక్కడ ఉండగానే శాకాహారులు కూడా రెండు మూడు నాన్‌ల కోసం రావడం కనిపించింది. ప్రతిరోజూ ఇక్కడ నాన్‌లను కొనుగోలు చేసే సాధారణ కస్టమర్‌లు వందల సంఖ్యలో ఉంటారట. కానీ వీళ్ళ వ్యాపారంలో ఎక్కువ భాగం పార్టీలు, వార్షికోత్సవాలు, ఇతర వేడుకల కోసం వీళ్లు పొందే భారీ ఆర్డర్‌లపై ఆధారపడి ఉంటుంది. ‘చార్ కోని నాన్’ పండుగ సందర్భాలలో, పెళ్ళిళ్లలోనూ ఈ ప్రాంతంలో రెగ్యులర్‌గా కనిపించే ఆహారం.

మున్షీ నాన్‌లో ఫ్లాట్‌బ్రెడ్‌ను తయారు చేసే ప్రక్రియ ముందు రోజు రాత్రి ప్రారంభమవుతుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు నాన్‌కు కావలసిన పిండిని నీటితో కలుపుతారు. పిండి తగినంత మందంగా ఉందని నిర్ధారించుకున్నాక పిండిని ఖచ్చితమైన, చతురస్రాకారంలో కత్తిరిస్తారు. గాలి ప్రసరణ కోసం ప్రతి నాన్ పైన చిన్న రంధ్రాలను చేస్తారు. తరువాత తండూర్లో వీటిని ఉంచుతారు. ఈ బట్టీలు ప్రాథమికంగా ఒక పెద్ద డెక్చీ లేదా ఒక మట్టి పొయ్యి లోపల నిర్మించబడిన ఫ్లాట్ బాటమ్ ఉన్న వంట కుండలు. నాన్‌ను కాల్చే ఈ ప్రక్రియ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది కొద్దిసేపు విరామం తీసుకుని, మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం వరకు మళ్లీ పని జరుగుతుంది.

మున్షీ నాన్ రుచికి, ఇప్పటికి ప్రజలు దీన్ని ఇష్టపడడానికి కారణం పాత సంప్రదాయ పద్దతిలోనే ఈ నాన్ లను ఇప్పటికీ తయారు చేయడం. నాన్‌ను తయారుచేసే విధానం 1851 నుండి ఇప్పటికీ ఇక్కడ ఒకేలా ఉంది. బొగ్గును కాల్చి, సాంప్రదాయ ఓవెన్‌లోనే వీటిని కాలుస్తారు.. ఆధునికత పేరుతో ఎలక్ట్రిక్ ఓవెన్ లను, టైమర్ ఉన్న ఓవెన్ లను వీళ్లు వాడట్లేదు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పు తీసుకురావాలని వీళ్లు కొన్నేళ్ళ క్రితం ప్రయత్నించారట. కాని నాన్ లకు ఆ పాత రుచి రాలేదు. కస్టమర్లకు కూడా అవి నచ్చలేదు. దానితో ఆధునీకరణను వదిలేసి వారికి తెలిసిన పాత పద్దతిలోనే మళ్ళీ నాన్ లను తయారు చేయడం మొదలుపెట్టారు. చలికాలంలో ఎక్కువ వేడి కోసం పిండిలో కొన్ని పదార్థాలను కలుపుతారట., దానితో నాన్ బాగా ఉబ్బుతుంది. అదేవిధంగా, వేసవిలో చేసే నాన్‌లకూ పిండిలో మార్పు చేసుకుంటారు. అది వారి బిజినెస్ రహస్యం కాబట్టి దాన్ని వాళ్ళు అడిగినా చెప్పలేదు

సాధారణంగా ఇతర బేకరీలలో చేసే నాన్‌లన్నీ రెడీమేడ్‌వే. ఈస్ట్, రిఫైన్డ్ ఆయిల్, ఉప్పును ఆల్ పర్పస్ మైదా (మైదా)తో కలపి పిండి తయారు చేసుకుంటారు. తరువాత దాన్ని ఒక యంత్రంలో ఉంచుతారు. అరగంట తర్వాత ఆ పిండితో రొట్టె సిద్ధం చేస్తారు. కానీ మున్షీ నాన్‌లో ప్రత్యేకత ఏంటంటే వీళ్లు నాన్‌లలో ఈస్ట్‌ని ఉపయోగించరు. పెరుగు, మైదా, ఇతర పదార్థాలు (ఇది రహస్యం) కలిపిన మిశ్రమాన్ని రాత్రిపూట ఒక గుడ్డలో వేలాడదీస్తారు. ఆ పిండిని మరుసటి రోజు ఉదయం నాన్‌ల కోసం ఉపయోగిస్తారు. నాన్‌ల కోసం ఇక్కడ ప్రతి రోజు సగటున 3-4 క్వింటాళ్ల మైదా ఉపయోగిస్తారు.

ఇలా రాత్రంతా కలిపిన పిండిని వేలాడదీసి ఉంచడంతో మున్షీ నాన్‌లో ఇతర బేకరీల మాదిరిగా నాన్‌లు వెంటనే తయారు కావు. రోజూ పరిమిత పరిమాణంలో పిండిని తయారు చేసుకుని, ఓ రాత్రంతా కలిపి ఉంచి అప్పుడు ఆ పిండితో పొద్దున్న నాన్‌లు చేస్తారు. పిండి, ఒకసారి సిద్ధమైన తర్వాత, బ్యాచ్‌ల వారీగా బట్టీపై పూర్తిగా కాలుస్తారు. తండూర్ తగినంత వేడిగా ఉందని నిర్ధారించుకున్నాకే వీటిని కాలుస్తారు.

ఈ నాన్ లను కాల్చే ముందు వాటిని బెల్లం నీటితో అద్దుతారు. ఇది ఆ నాన్‌కు నారింజ రంగును ఇస్తుంది. అలాగే ఆ బ్రెడ్‌లో రంధ్రాలను చేయడంతో, బెల్లం నీరుతో అవి నానడంతో తండూర్‌కు అంటుకోకుండాను కాలిపోకుండానూ ఉంటాయి.. నాన్‌ను కాల్చేటప్పుడు ఉపరితలం కాలిపోకుండా ఉండటానికి నాన్‌కి కొంత గాలి ప్రవాహం అవసరం కాబట్టి ఆ నాన్ లపై చిన్న రంధ్రాలు తప్పకుండా చేస్తారు.

(బట్టీలో తయారవుతున్న నాన్‌లు)

మున్షీ నాన్‌లో బొగ్గు బ్లాకులతో నిండిన రెండు మట్టి చిప్పలతో పాటు చిన్న గది వెలుపల తండూరులు ఉంచారు. బొగ్గును తాండూర్ లోపల ఉంచి నిప్పుల మీద కాలుస్తారు. ఆ తరువాత రొట్టెలను జాగ్రత్తగా పొడవాటి మెటాలిక్ రాడ్‌తో ఈ తండూర్ లోపల ఉంచుతారు, సాధారణంగా ఒక వాయలో 7-8 రొట్టెలు ఉంటాయి. నాన్ కాల్చినప్పుడు, అప్పుడప్పుడు నీరు ఉపరితలంపై చల్లబడుతుంది, దీనితో రొట్టెలు మెరిసే ఆకృతిని పొందుతాయి. నాన్‌లను 5-7 నిమిషాల తర్వాత తండూర్ నుండి జాగ్రత్తగా తీసి తెల్లటి గుడ్డపై వేస్తారు. అవి చల్లబడ్డాక వాటిని సేకరించి దుకాణం ముందు ఉన్న గాజు తలుపుల షెల్ఫ్‌లలో పేరుస్తారు.

(బట్టీలలోకి బొగ్గును కాల్చి సిద్దం చేసుకునే విధానం)

ఆ రోజుల్లో నాన్ ఆకారాలు గుండ్రంగా లేదా అండాకారంగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు గుండె ఆకారంలోనూ లేదా పాన్-లీఫ్ ఆకారంలోనూ నాన్స్‌ను తయారు చేస్తున్నారు.

ఈ నాన్‌లు అన్ని సంవత్సారాల నుండి అదే దుకాణంలో అమ్ముతున్నారు. దుకాణం అందమైన భవనం కాదు. కాని ఇక్కడకు వెతుక్కుని వచ్చి నాన్‌లను కొని తీసుకువెళుతుంటారు ప్రజలు. నగరం అంటే కేవలం భవనాలు కట్టడాలు కాదు. అది ప్రజల జీవితంతో ముడిపడి ఉంటుంది. అందుకే 173 ఏళ్ళుగా నగర ప్రజలకు నాన్ లను అందించే మున్షీ నాన్ హైదరాబాద్ నగరంలో ఓ ముఖ్య భాగం అని ఒప్పుకోవాలి.

ఈ దుకాణం అదే స్థలంలో ఉన్నా ప్రస్తుత స్థలం దాని అసలు పరిమాణంలో సగం మాత్రమే ఉంది. కొన్నేళ్ళ క్రితం రహదారి విస్తరణ కోసం ముందు భాగాన్ని వీళ్లు కోల్పోయారు. అంతకు ముందు అక్కడ రోడ్డు లేదు. భవనం వెనుక వైపున్న పాత తలుపు నుండే వీరి ప్రవేశ ద్వారం ఉండేది. ఈ దుకాణం మొదట సున్నపురాయి మోర్టార్‌తో కట్టారు. పై కప్పును చెక్కతో నిర్మించారు ఇప్పటికీ ఆ నిర్మాణం అలాగే ఉంది. పైన చూపించిన ఫోటోలలో షాపు పై భాగాన్ని గమనించవచ్చు.

‘చార్ కోని నాన్స్’ మటన్ స్టూతో ఇష్టంగా తింటారు. ఇది హైదరాబాద్‌కు ప్రత్యేకమైన వంటకం, పెరుగు, కొబ్బరి, బాదంతో దీన్ని తయారు చేస్తారు. అలాగే దీన్ని నిహారీ (నెమ్మదిగా వండిన మాంసం), చికెన్ కర్రీ లేదా కేవలం పెరుగుతో కూడా తినవచ్చు. కానీ తినేటప్పుడు నాన్స్ వెచ్చగా ఉంటేనే రుచి బావుంటుంది. తండూర్ నుండి వచ్చే సాధారణ రొట్టెల మాదిరిగా కాకుండా, హైదరాబాదీ నాన్ ఎక్కువ కాలం వెచ్చగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఎవరూ చల్లటి నాన్ లను ఇష్టపడరు, అది మన సంస్కృతి కాదు.

ఈ నాన్ లను రెండు అణాలకు ఒకటిగా మొదట అమ్మడం మొదలుపెట్టారట. ఇప్పుడు 27th సెప్టెంబర్ 2024 నుండి ఒక్క నాన్‌కు ఇరవైరూపాయల ధర నిర్ధానించారు. సంవత్సరాల వారిగా నాన్ ధర ఎలా పెరిగిందో సూచించే ఒక లిస్ట్ ఈ దుకాణంలో ఇచ్చారు. అది ఇక్కడ మీ కోసం ఇస్తున్నాను.

అక్కడ చుట్టు పక్కల చాలా మంది కూర మాత్రమే వండుకుని ఇక్కడి నాన్‌లను తీసుకెళ్లి తింటారట. కొందరు యవకులు కేవలం పెరుగుతో తినడానికి నాన్ కోసం ఇక్కడకు వచ్చారు. ఒకటి రెండు నాన్ లను కొనుక్కుని వెళ్ళే వారితో ఈ దుకాణం అన్ని సమయాలలో కిటకిటలాడుతూనే ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ దుకాణం మెట్రో నిర్మాణంలో మాయమవబోతుంది. దాని యజమానులు ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థానం కోసం చూస్తున్నారు. కొత్త స్థలం దొరికిన తరువాత ఈ దుకాణాన్ని అక్కడకు మారుస్తారు.

పాతబస్తీలో హైదరాబాద్ మెట్రో రైల్ కోసం ఈ దుకాణాన్ని కూల్చివేయడానికి మార్క్ చేసారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 29, 2024న మెట్రో రైల్ రెండవ దశ కారిడార్‌లను ఆమోదించారు, ఇందులో హైదరాబాద్‌ను విమానాశ్రయానికి అనుసంధానించే మెట్రో లైన్లు, ఓల్డ్ సిటీ కోసం చాంద్రాయణగుట్ట నుండి MGBS లైన్‌ను కలిపే లైన్ కూడా ఉన్నాయి. మొత్తం 116.2 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్లకు అనుమతి లభించింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గం ఆరామ్‌ఘర్ మీదుగా వెళుతుంది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ కోసం మెట్రో రైలు తప్పనిసరిగా దారుల్ షిఫా – పురానీ హవేలీ ప్రాంతం గుండా వెళుతుంది, ఇది మార్గంలో ఉన్న కొన్ని చారిత్రక స్మారక చిహ్నాలను ప్రభావితం చేస్తుంది. ప్రభావిత స్మారక చిహ్నాలు షియా ముస్లిం వర్గానికి చెందినవి. అలా కొన్ని రోజుల్లో రోడ్డు విస్తరణ కోసం మున్షీ నాన్‌ను కూల్చివేయనున్నారు.

ఓల్డ్ సిటీకి చెందిన ఒక చిన్న విభాగం ప్రజలు, ప్రధానంగా దారుల్ షిఫా మైదానం సమీపంలో నివాసితులు, ఓల్డ్ సిటీ హైదరాబాద్ మెట్రో రైలు లైన్ విస్తరణను కూడా వ్యతిరేకిస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలోని షియా ముస్లిం వర్గానికి చెందిన చారిత్రక స్మారక చిహ్నాలను దెబ్బతీస్తుందన్నది వాళ్ళ వాదన.

ప్రస్తుతం మున్షీ నాన్ ఉన్న చోట, దాని చుట్టూ బీఫ్ బిర్యానీ, బీఫ్ కబాబ్‌లు విక్రయించే స్థానిక హోటళ్లు ఉన్నాయి. పాత నగరంలో ప్రజలు ఈ నాన్‌ను షీక్ కబాబ్ (బీఫ్) లలో కలిపి తినడానికి ఇష్టపడతారు. అందుకని ఆ కబాబ్ దుకాణాలు ఈ వీధిలో ఎక్కువ కనిపిస్తాయి. అలాగే దీని చుట్టు కొన్ని ఆ నాటి నాన్ దుకాణాలూ కొన్ని ఉన్నాయి. ఒకప్పుడు ఈ వీధి అంతా నాన్ లు తయారు చేసే దుకాణాలతో ఉండేది. ఆ వరుసలోనే ఉంది షాహీ నాన్ దుకాణం.

షాహీ నాన్ తరువాత మనకు కనిపించేది అబ్బాసీ నాన్. ఇది 1853 నుండి ఉంది. మున్షీ నాన్ పెట్టిన రెండు సంవత్సరాల తరువాత దీన్ని కుతుబుద్దీన్ సాహెబ్ నడిపించారట. ఆయన ఫోటో ఈ షాపు ప్రాంగణంలో కనిపించింది. ఇది కొంచెం ఆధునీకరించబడి ఉంది. కానీ వీళ్ళూ సాంప్రదాయ పద్దతిలోనే నాన్ లను వండుతున్నారు.

అన్నట్లు ఈ నాన్‌లను కొందరు షెర్మల్ కుల్చాలని కూడా పిలుస్తారట. షర్మల్ చిన్న సైజులో గుండ్రంగా ఉంటే, కుల్చా పెద్దగా గుండ్రంగా ఉంటుంది. ఓవెల్ షేప్ లో ఉన్న దాన్ని నాన్ అంటారట. పదిహేనేళ్ళ నుండి మున్షీ నాన్ లను కేవలం స్క్వేర్ షేప్‌లో తయారు చేస్తున్నారు. ఆర్డర్ మీద గుండె ఆకారంలో నాన్ లను కూడా వీళ్లు చేస్తున్నారు వాటిని పాన్ నాన్ లేదా బేబీ నాన్ అని అంటారు. అబ్బాసి నాన్ దుకాణంలో నాన్ ఆకారాలను సూచించే ఓ అలనాటి డిస్ప్లే ఉంది. నాన్ పై పెట్టే రంధ్రాలలో కూడా కొని డిజైన్లు ఉంటాయట. పాత బస్తీలో ఈ నాన్ లపై ఆధారపడి జీవించే కార్మికుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పురానీ హవేలీ పక్క వీధిలో ఉంటూ రాచరికపు కుటుంబానికి నాన్‌లు అందించడమే కాక సాధారణ పేద ప్రజలకూ అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలు ఉండేవి. రాజూ పేద ఒకే అంగట్లో సరుకు తినడం వింటుంటేనే ఎంతో అనందంగా ఉంది కదా..

పత్తర్ కే ఘోశ్, బడే మియా కబాబ్లు ఆ పరిసర ప్రాంతాలలో దొరుకుతాయి. ఈ వీధిలో ఎక్కువగా బీఫ్‌తో చేసిన వంటకాలు కనిపిస్తాయి. చాలా మంది హైదరాబాదీయులు ఈ నాన్‌లను భీప్ కబాబులతో తినడానికే ఇష్టపడతారు.

ఇక్కడ దుకాణాలు ప్రొద్దున ఆరుకి తెరుస్తారు. ఏడు నుండి రాత్రి తొమ్మిది దాకా కస్టమర్లు నాన్‌ల కోసం ఈ షాపులకు వస్తూ ఉంటారు. పది గంటల దాకా మరుసటి రోజుకి పిండి సిద్దం చేసుకుని వెళ్తారు.

ఇంకొన్నాళ్ళలో ఈ వీధి చరిత్రలో కలిసిపోవచ్చు. కాని ఇప్పుడు 173 ఏళ్ళూగా ఒకే చోట ఉండి ఒకే రకంగా వండుతూ చార్ కోని నాన్ లను మనకు అందిస్తున్న ఈ దుకాణాలకు అందులోనూ అతి ప్రాచీనమైన మున్షీ నాన్ దుకాణానికి ఓసారి వెళ్లండి. హైదరాబాద్ చరిత్రను స్వయంగా ఆస్వాదించండి.

మాంసాహారులు, శాకాహారులు అదే సంఖ్యలో మనకు ఈ వీధిలో నాన్‌లు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. ఈ పేరుతో కొన్ని ఔట్‌లెట్లను తెరిచి నాన్‌లు అమ్ముతున్నారట. కాని తమకు మరే బ్రాంచీలు లేవని అబ్దుల్ మాజేద్ గారు చెప్పారు.

Exit mobile version