Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదాబ్ హైదరాబాద్ – లాడ్ బజార్ – హైదరాబాదీ గాజులు

[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ లాడ్ బజార్ లోని, ‘హైదరాబాదీ గాజుల బజారు’ని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]

స్త్రీల అలంకరణలో భారతీయ సంస్కృతిలో గాజులకు చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ ముస్లిం సాంప్రదాయాల కలబోత హైదరాబాద్ సంస్కృతిలో గాజులు ఎంత ముఖ్యం అంటే వీటి తయారీ, విక్రయాల కోసం ఒక బజారునే నిర్మించారు. హైదరాబాద్‌ను మొదట కాకతీయ రాజులు, ఆ తర్వాత కుతుబ్ షాహీ పాలకులు పాలించారు. ఈ ఇద్దరి ప్రభావం ఇక్కడి ప్రజల జీవన శైలిపై కనిపిస్తుంది. కుతుబ్ షాహీ పాలకులు పర్షియన్, ఇండో-ఇస్లామిక్ సంస్కృతులు, భాషలకు గొప్ప పోషకులుగా ఉండి, ఈ నగరాన్ని హిందూ-ముస్లిం వాస్తుశిల్ప వైభవానికి ప్రతీకగా నిలిపారు. ఇక్కడి ముస్లిం స్త్రీల అలంకరణ, హిందూ స్త్రీల అలంకరణలో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. వాటిని నిశితంగా పరిశీలించాలంటే హైదరాబాద్ లోని లాడ్ బజార్‌కు వెళ్ళాలి.

1500వ దశకంలో కుతుబ్ షాహీల పాలనలో స్థాపించబడిన ఈ బజారు, ముఖ్యంగా కాసర్లు గాజు లేదా లక్కతో తయారు చేసిన మెరిసే గాజులకు ప్రసిద్ధి చెందింది. నవాబుల కాలంలో ఇక్కడ మేలైన వజ్రాలు, ముత్యాలు, కెంపులు దొరికేవి. నవాబుల యుగంలో హైదరాబాద్ నగరంలో విశాలమైన రాజభవనాలు, బజారులు, పార్కులు, సరస్సులు ఈ చుట్టూతా వెలిశాయి. ఇక్కడి స్థానిక దక్కనీ హిందువులు, ముస్లిం పాలకుల సంస్కృతులు, సంప్రదాయాలను స్వీకరిస్తూ, తమ సంస్కృతిని వారికి పంచుతూ సామరస్యపూర్వక సమాజాన్ని సృష్టించారు.

భారతీయ సంప్రదాయాలలో గాజుల ప్రాముఖ్యతకు సంబంధించిన వేడుకలు, పండుగలు, ఋతువులను స్త్రీల జీవితంలోని ముఖ్య సంఘటనలన్నిటిలోనూ చూడవచ్చు. పెళ్లి, పుట్టినరోజు, వివాహ వేడుక, తీజ్ పండుగ, ప్రార్థన సమయాల్లో మహిళలు లాడ్ బజారుకు వెళ్లేవారు. చేతులకు గోరింటాకు, మణికట్టుకు గాజులు, ముఖ సౌందర్యం కోసం బిందీలు, జూమర్లు, దుస్తులకు గోటా పట్టి లేదా మెరిసే బంగారు అంచులు, పాదాలకు సున్నితమైన కాలి గొలుసులను ఈ మార్కెట్‌లో కొనుగోలు చేసేవారు.

కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చారిత్రాత్మక చార్మినార్‌ను నిర్మించిన తర్వాత, దాని అద్భుతమైన సౌందర్యం కారణంగా ఆ ప్రాంతం వేలాది మంది సందర్శకులను ఆకర్షించింది. దాని పక్కనే వెలిసిన ఈ మార్కెట్ల ఆవిర్భావానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు ఏవీ లేవు కాని ఇవి కుతుబ్ షాహీల కాలం, హైదరాబాద్ నిజాంల కాలం నుండే వాడుకలో ఉన్నాయని చెబుతారు. లాడ్ బజార్ చౌమహల్లా ప్యాలెస్‌కు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది.

ఈ మార్కెట్‌కు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా తన కుమార్తె వివాహం కోసం దీనిని మొదట ఏర్పాటు చేశారని కొందరు అంటారు. మరో కథనం ప్రకారం, వలసరాజ్యాల కాలంలో బ్రిటిష్ అధికారుల పేరు మీద ఈ మార్కెట్కు లార్డ్స్ బజార్ అని పేరు పెట్టారని, కాలక్రమేణా అది లాడ్ బజార్‌గా మారిందంటారు. కొంతమంది స్థానికులు ఈ పేరును హైదరాబాద్ ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ భార్య అయిన లాడ్లీ బేగంతో కూడా ముడిపెడతారు. మరి కొందరు లార్డ్ రిప్పన్ పేరు మీద వచ్చిన ‘లార్డ్ బజార్’ లేదా గోల్కొండ సైన్యాధిపతి అబ్జుర్ రజాక్ లారీ పేరు మీద వచ్చిన ‘లారీ బజార్’ అనే పేరు నుండి ఈ పేరు వచ్చి ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉందని అంటారు.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ‘లాడ్ బజార్’ తో పాటు పత్తర్గట్టి, కోట్ల అలీజా రోడ్ చార్మినార్ రోడ్ వంటివి ఇతర ముఖ్యమైన మార్కెట్లు ఆ చుట్టూ ఉంటాయి. తన వైభవ దశలో, చార్మినార్ మార్కెట్ ప్రాంతంలో సుమారు 14,000 దుకాణాలు ఉండేవని అంచనా.

చార్మినార్ నుండి పడమర వైపు వెళ్లే మార్గంలో ఉంటుంది లాడ్ బజార్. దీన్ని ‘చూడీ బజార్’ అని కూడా అంటారు. ప్రస్తుతం ఇది దేశంలోనే అతి పురాతనమైన చారిత్రిక బజారులలో ఒకటిగా పేరు సంపాదించింది. ఒకప్పటి నిజాం పాలనకు సంబంధించిన వైభవమైన గతాన్ని ఈ రోజుకీ గుర్తుకు తెస్తుంది. ప్రస్తుతం స్థానికులు ‘లాడ్’ అంటే ఇక్కడ కృత్రిమ వజ్రాలతో పొదిగిన గాజులను తయారు చేయడానికి ఉపయోగించే లక్క అన్న అర్థంతో దీన్ని లక్క గాజుల బజారు అంటే లాడ్ బజార్ గా అన్వయించుకుంటారు. ఈ బజార్ సుమారు ఒక కిలోమీటరు మేర విస్తరించి ఉండి, ముత్యాలు, కలంకారీ చిత్రాలు ముస్లిం వధువుల సంప్రదాయ ‘ఖారా దుపట్టా’లను కూడా అందిస్తుంది.

ఇక్కడ 150కి పైగా గాజుల వర్క్‌షాపులు ఉన్నాయి. ఒకో లక్క గాజును పూర్తి చేయడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఈ మార్కెట్ ప్రత్యేకంగా చూడీ బజార్ (గాజులు), మీనా బజార్, జోడా బజార్ (వస్త్రాలు) వంటి చిన్న ప్రత్యేకమైన సందులుగా విభజించబడింది. ఇది తెలుసుకుంటే ఇక్కడ కావల్సిన దుకాణాలకు వెతుక్కోవడం సులువవుతుంది.

ఈ మార్కెట్ లోకి రాగానే మరో ప్రపంచంలోకి, మరో కాలంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది. హైదరాబాదీ మహిళకు, హిందూ అయినా, ముస్లిం అయినా, లాడ్ బజార్‌కు వెళ్లకుండా పెళ్లి సన్నాహాలు పూర్తి కావు. పెళ్ళికి కావల్సిన వధువు దుస్తులు, మెహెందీ, అత్తర్, అప్లిక్, సీక్విన్లతో అలంకరించిన స్కర్టులు, బంజారా జిప్సీల మెరిసే అద్దాలు, చిన్న పూసలతో పొదిగిన బ్యాగులు, బెల్టులు, గాజు లేదా రాళ్లతో పొదిగిన లక్క గాజులు, లెక్కలేనన్ని వజ్రాల ఆభరణాలు, జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలకు హైదరాబాదీలు ఇక్కడికే వస్తారు. సుర్మా, సున్నితమైన పూసలు, అత్యుత్తమ లేస్ను అందించే దుకాణాలు, వరుడికి తగిన షేర్వానీలు, వాటికి సంబంధించిన ప్రతి అలంకరణ ఇక్కడ దొరుకుతుంది. ఈ ప్రధాన వీధి చార్మినార్ నుండి మెహబూబ్ చౌక్ వరకు విస్తరించి ఉంటుంది. ఇక లాడ్ బజార్ ముగిసే చోట ముర్గీ బజార్ మొదలవుతుంది.

ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా స్టైలిష్ కడాలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌తో, ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న ఈ వ్యాపారం పూర్తిగా రూపు మార్చుకుంది. 50 రూపాయల జత నుండి వేల రూపాయల విలువైన పెళ్లి సెట్ల వరకు ఈ దుకాణాలలో దొరుకుతాయి. చాలా దుకాణాలలో ‘నిర్ణీత ధర’ (Fixed Price) అనే బోర్డులు ఉన్నప్పటికీ, ఇక్కడ బేరసారాలు జరుగుతుంటాయి. హైదరాబాదీలు బేరం చేయకుండా ఏ వస్తువూ కొనలేరు. నిజానికి అందులో ఒక వింత ఆనందం ఉంటుంది.

ఈ గాజులకు ముఖ్యంగా ఉపయోగించేది లక్క. ఇది ఒక చెట్టు జిగురు నుండి లేదా కొన్ని కీటకాల నుండి కూడా సేకరించబడుతుంది. ఇది నలుపు, గోధుమ, లేత బంగారు రంగులలో లభిస్తుంది. దుకాణదారులు పాత నగరం సమీపంలోని స్థానిక మార్కెట్ల నుండి ముదురు నలుపు, లేత బంగారు రకాలను కొనుగోలు చేస్తారు. ఒక కిలోగ్రాము ధర రూ. 300 దాకా ఉంటుంది. ఒక కిలో లక్క నుండి సుమారుగా 25 డజన్ల మధ్యస్థ పరిమాణపు గాజులను తయారు చేయగలరు. ఈ రెండు రంగులను సమాన నిష్పత్తిలో కలపడం ద్వారా గట్టిపడిన లక్క ఏర్పడుతుంది.

ఈ గాజుల తయారీని చూడడం చాలా బావుంటుంది. ఈ గాజుల తయారీ గురించి తెలుసుకోవడం కోసమే అక్కడకు వచ్చానని తెలిసి నాకు గాజులు తయారు చేసి చూపించడానికి సిద్దపడ్డాడు షబ్బీర్ బాంగిల్ సెంటర్‌లో వ్యాపారం చేసుకుంటున్నసోదరుడు. ఇప్పటి కార్పోరేట్ తరం ఇష్టపడే లక్క గాజులలో రెండు లేటెస్ట్ డిజైన్లను స్వయంగా తయారు చేసి చూపించాడు.

గుండ్రని లోహపు చట్రం మీద జిగురులాంటి లక్కను కరిగించి, ఆ వేడి జిగురులో మెరిసే కృత్రిమ రాళ్లు, పూసలు, గాజు ముక్కలను రకరకాల రంగుల నమూనాలలో అమర్చడం గాజుల తయారీలో పాత సంప్రదాయ పద్దతి. ఇలా 30 నిమిషాలలో ఒక సాధారణ గాజుల సెట్‌ తయారు చేస్తారు. ఆ లక్క గాజులపై రాళ్లను అంటించే పని చాలా వరకు స్త్రీలు చేస్తారు. ఒకో రాయిని ఏరుకుని వరుసగా రకరకాల డిజైన్లతో వేడి లక్కపై అంటిస్తారు. ఆ రాళ్ల ఖరీదు, నాణ్యతను బట్టి గాజుల ధర ఉంటుంది. నవాబుల రోజుల్లో అచ్చమైన వజ్రాలు, కెంపులతో ఈ రాళ్ళ గాజులు తయారు చేసేవారు. చార్మినార్ గాజులంటూ వీటిని దేశంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు కూడా అలాంటి విలువైన రాళ్ళను ఎన్నుకుని ప్రత్యేకంగా గాజులు చేయించుకునే కుటుంబాలు ఉన్నాయట. సాధారణ ప్రజలు అందమైన రంగు రంగు రాళ్ళతో తృప్తి పడతారు.

ఈ గాజుల తయారీలో ప్రధాన పదార్థమైన ముదురు గోధుమ రంగు లక్క కర్రను చేతిలోకి తీసుకుని, దానిని మెత్తబరచడానికి వేడి బొగ్గులలోకి నెడతారు. అది కరుగుతున్నప్పుడు, ఒక రంగు ముక్కను ఎంచుకుని, మెత్తబడుతున్న లక్కపై సున్నితంగా అద్దుతారు. ఇప్పుడు రంగు అద్దిన ఆ లక్కను పొడవాటి, సన్నని స్థూపాకారపు చుట్టగా సాగదీస్తారు. వేడి లక్కను వేగంగా కోసి, కర్ర నుండి వేరు చేయడానికి అదే సంకేతం. ఆ చుట్టను ఒక పక్కకు మెలితిప్పి, వేడి చేసి రెండు బరువైన లోహపు పలకల మధ్య నొక్కి ఉంచిన కొన్ని ఇత్తడి గాజుల చుట్టూ చుడతారు. ఈ ప్రక్రియ ఇత్తడి గాజులలోని వంపులు లేదా గుంతలను తొలగించడంలో సహాయపడుతుందని కళాకారులు చెబుతారు. ఈ ఇత్తడిని ముంబై నుండి తెప్పిస్తారు, ఇది గాజులకు దృఢమైన, అస్థిపంజరం లాంటి నిర్మాణాన్ని ఇస్తుంది. గాజుల గట్టితనం ఈ ఇత్తడి గాజు పై ఆధారపడి ఉంటుంది.

లక్కను కరిగించి కడ్డీగా మార్చి దాన్ని నున్నగా చేయడం మొదటి ప్రక్రియ. పై ఫోటోల్లో ఇత్తడి గాజులు పక్కన ఉన్నాయి. వీటి ఆధారంగానే ఆ గుండ్రటి లక్కను గాజు ఆకారంలోకి తీర్చిదిద్దుతారు. దానికి ముందుగా ఆ ఇత్తడి గాజును కూడా బొగ్గులపై వేడి చేస్తారు.

ఇక ఆ తర్వాత పూర్తి వెడల్పాటి గాజు ఆకారంలోకి దీన్ని తీసుకు వస్తారు. అది ఇలా జరుగుతుంది.

పూర్తిగా తయారయ్యాక ఈ కడాలను స్పృశించడం ఎంత బావుందో. అప్పుడే బొగ్గుల వేడి నుండీ బైటపడి మన కోసమే తయారయిన ఆ గాజు వెచ్చగా చేతికి తగలడం అందమైన అనుభవం. ఇలాంటి గాజులను విదేశాలలోని మిత్రుల కోసం హైదరాబాదీలు తీసుకువెళుతుంటారు.

షబ్బీర్ ఆ రోజు రెండు రకాల గాజులను నాకోసం తయారు చేసి చూపించాడు. ఇది కాకుండా జడగా అల్లినట్లుండే గాజులు ఇప్పుడు కాలేజీ పిల్లలు ఇష్టపడి చేయించుకుంటున్నారని చెప్పాడు. ఆ గాజు తయారీ మరీ బావుంటుంది. ఇంతకు ముందు చేసిన గాజు ఒక లావుపాటి కడ్డి నుండి తయారయింది. ఇప్పుడు ఈ రెండో డిజైన్ కోసం మూడు రంగులలో మూడు పల్చని కడ్డీలను తయారు చేసాడు షబ్బీర్.

(మూడు రంగుల లక్క కడ్డీలను జడ ఆకారంలో అమర్చి వేడి చేయడం తరువాత దానిలో ఇత్తడి గాజు ఉంచి దానికి ఆకారాన్ని ఇవ్వడం ఇలా జరుగుతుంది)

వీటిని ప్రస్తుత తరం కాలేజీ పిల్లలు ఇష్టపడి ధరిస్తున్నారట. కొన్నికార్పొరేట్ సంస్థలు వీటిని కార్పరేట్ గిఫ్ట్‌ల రూపంలో కొనుగోలు చేస్తుంటాయి కూడా. విదేశీ కస్టమర్లు ఈ గాజులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి తీసుకెళుతుంటారని దుకారణదారులు చెప్పారు. హైదరాబాద్ దర్శించిన వాళ్ళు తప్పకుండా లాడ్ బజార్ వెళ్లి గాజులు కొంటుంటారు. ఈ తయారీ మీద బ్రతికే కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం పూట, రంజాన్ సమయంలో రాత్రిల్లు ఈ బజార్‌లో షాపింగ్ ఇంకా బావుంటుంది.

ఈ బజారులో ప్రత్యేకంగా రాళ్లు పూసలు అంటించిన పెన్నులు కూడా చూడముచ్చటగా ఉంటాయి. వీటిని కూడా మిత్రుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకెళుతూ ఉంటారు.

కొంచం పక్కకు వెళ్లితే పత్తర్ ఘట్టీ మార్కెట్ లో రకరకాల అత్తర్ల కోసం వచ్చే వాళ్ళు, అక్కడ దొరికే అత్తరు వెరైటీలు ఆశ్చర్యపరుస్తాయి. వీటి గురించి మరోసారి.

Exit mobile version