[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ ఖైరతాబాద్ మసీదుని, ఖైరత్ – ఉన్నిసా కట్టించిన సమాధిని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]
ఖైరతాబాద్ హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో కోలాహలంతో ఉండే ప్రదేశం. జనావాసంగా మారని రోజుల్లో ఈ ప్రాంతంలో మొట్టమొదట ఒక మసీదు నిర్మించారు. ప్రస్తుత తరంలో వచ్చిన కొత్త కట్టడాల నడుమ గొప్ప పనితనంతో నిర్మించిన ఒకప్పటి ఆ మసీదు, దానికి కొన్నిఅడుగుల దూరంలో కళాత్మకంగా నిర్మించిన సమాధి ఇప్పుడు కనిపించకుండా ఇరుక్కుపోయాయి. చరిత్రను తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ సందుల నడుమ వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయే పనితనంతో కనిపించే ఈ రెండు కట్టడాలు కనిపిస్తాయి. వీటి నిర్మాణం వెనుక ప్రధాన పాత్ర పోషించినది ఓ స్త్రీ మూర్తి అని తెలిసి ఆశ్చర్యపోతారు చరిత్రకారులు. ఆమే ఖైరత్ –ఉన్-నిస్సా. ఈమె పేరు మీదే ఆ చూట్టూ ఉన్నప్రాంతం ఖైరతాబాద్‌గా పేరు గాంచింది.
ఒకప్పటి ఈ రెండు కట్టడాల సౌందర్యం ఈ క్రింది చిత్రంలో చూడవచ్చు. చుట్టూ ప్రాంతం అంతా కట్టడాలమయం అయిపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఇంత అందంగా ఉండదు కాని నిశితంగా పరిశీలిస్తే ఈ కట్టడాల నైపుణ్యం నేటికీ ఆకట్టుకుంటుంది.
(చుట్టూ నగరం ఏర్పడకముందు ఖైరతాబాద్ మసీదు ~ ఖైరత్-ఉన్నిస్సా నిర్మించిన సమాధి చిత్రం)
ఖైరత్-ఉన్-నిస్సా బేగంను ఖైరతీ బేగం లేదా మా సాహెబా అని కూడా పిలిచేవారు. ఈమె కుతుబ్ షాహీ వంశానికి చెందిన 17వ శతాబ్దపు యువరాణి. కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఆరవ పాలకుడైన సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా కుమార్తె. ఈ ప్రాంతం ఆమెకు ‘జాగీరు’గా లభించిందంటారు. క్రీ.శ. 1612 నుండి 1626 మధ్య కాలంలో ఈమె ఈ జాగీరులో తన గురువు అఖుంద్ ముల్లా అబుల్ మాలిక్ కోసం ఒక మసీదును నిర్మించడానికి పూనుకుంది.
ఆ జాగీరు చుట్టూ విస్తరించి ఆ తర్వాత ఒక నివాస ప్రాంతంగా రూపుదిద్దుకుంది ఖైరతాబాద్. అంటే ఖైరతాబాద్ ప్రాంతానికి మూలం ఆ మసీదే. దాని చుట్టూనే ఆ ప్రాంతం వృద్ది చెందింది. కాని కాలక్రమేణా ఈ మసీదు, చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోవడంతో అభివృద్ది పేరుతో ఈ స్థలానికి ఆనుకుని కట్టబడిన భవనాల నడుమ అలనాటి చరిత్రకు సాక్ష్యంగా మౌనంగా మిలిగిపోయింది. అయితే ఆ భవనాన్ని మత పెద్దలు సంరక్షించుకున్నారు కాబట్టే ఇప్పటికి అలనాటి పనితనం ఆ మసీదు మీనార్లపై నుండి మనల్ని అలరిస్తూ ఉంటుంది.
ఓ శిష్యురాలు తాను గురువుగా భావించే వ్యక్తి కోసం ప్రత్యేకంగా మసీదు నిర్మించి ఇవ్వడం అన్నది మరే చోటా వినిపించదు. ఈ మసీదు ప్రత్యేకత అదే. గురు శిష్య సంబంధానికి ప్రతీకగా నిలిచిపోయిన దీని గురించి నగరవాసులకే పెద్దగా తెలియకపోవడం విషాదం. అంతే కాదు ఖైరత్ –ఉన్-నిస్సాను ఖైరున్నిసా అనే మరో నిజాం కాలపు రాచరికపు స్త్రీతో పోల్చి పొరబడతారు చాలా మంది. ఈ మసీదు కట్టించిన ఖైరత్–ఉన్-నిస్సా కుతుబ్ షా కుమార్తె అయితే, క్రిక్ పాట్రిక్ అనే ఆంగ్లేయుడిని వివాహం చేసుకున ఆ ఖైరున్నిసా నిజాం ప్రధాన మంత్రి కూతురు. హైదరాబాద్ చరిత్రను చదువుకునే వాళ్లు గుర్తుంచుకోవలసిన తేడా ఇది.
ఈ మసీదు రోడ్డుకు కాస్త లోపలగా ఉంటుంది. ప్రత్యేకించి చూస్తే తప్ప ఇప్పుడు కనిపించదు. రోడ్డుపై ఓ చిన్న ద్వారం ఉంటుంది. దాని గుండా వెళితే తప్ప ఈ ప్రాంతం వైశాల్యం అర్థం కాదు.
ఖైరతాబాద్ మసీదు పనితనం ఆశ్చర్యపరుస్తుంది. ముందు భాగంలో మూడు వంపులతో కూడిన ద్వారం పైనుండే ఈ పనితనం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ మసీదుకి సంబంధించిన మీనార్లు చాలా అందంగా ఉంటాయి. దీన్ని, ప్రముఖ సూఫీ గురువైన, హుస్సేన్ షా వలి రూపొందించారు. హుస్సేన్ షా వలీ ఎవరో కాదు హుసేన్ సాగర్ నిర్మాణ కర్త. హుసేన్ సాగర్ పేరు ఆయన జ్ఞాపకార్ధం పెట్టబడినదే.
ఖైరత్–ఉన్-నిస్సా యువరాణి కోసం ఒక రాజభవనం, ఒక మసీదు ఒక చెరువును నిర్మించడానికి పూనుకున్నారు హుస్సేన్ షా వలి. అలా ఈ మసీదు నిర్మాణం తర్వాత, ఖైరతాబాద్ ఉత్తర సరిహద్దులో హుస్సేన్ సాగర్ రూపుదిద్దుకుంది. కొందరు చరిత్రకారులు హుస్సేన్ షా వలీ ఖైరత్–ఉన్-నిస్సాకు అల్లుడు అని, మరికొందరు, ఇతను ఆమె గురువుకి అల్లుడని చెప్తారు. ఏదీ ఏమైనా కుతుబ్ షాహీ రాజులలో ఎవరికో ఒకరికి ఇతను అల్లుడని మాత్రం ఒప్పుకుంటారు. ఇతన్ని పదివేల ట్రూప్స్‌కి కమాండర్‌గా నియమించి రాచరికపు కట్టడాలన్నిటికీ సెక్రెటరీగా నియమించారు అప్పటి హైదరాబాద్ పాలకులు. ఖైరతాబాద్ మసీదు ఇతని హయాం లోనే 1626లో పూర్తి అయ్యింది.
ఈ మసీదు క్లిష్టమైన జాలీ పనికి, సన్నని, అలంకారమైన మినార్లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ పనితనం అలనాటి వైభవానికి గుర్తుగా కనిపిస్తూనే ఉంటుంది. మసీదు పై భాగంలో చిన్న చిన్న ఆర్చీలు ఎంత సుందరంగా రూపుదిద్దుకున్నాయో పై చిత్రంలో గమనించవచ్చు. అతి శ్రద్ధతో ఒకే క్రమంలో చెక్కిన ఆకారాలు, చిన్న చిన్న జాలీలు హైదరాబాదీ దక్కనీ వాస్తు కళకు చిహ్నాలుగా దర్శనమిస్తాయి. ప్రస్తుతం ఈ మసీదు ప్రాంగణంలో ఒక పెద్ద మదరసా నడుస్తూ ఉంది. మసీదు వెనుకకు వెళితె పిల్లలు ఉండే హాస్టల్, చదువుకునే స్థలం, డైనింగ్ హాల్ కనిపిస్తాయి.
ఈ హాలు వెనుక గేటు గుండా వెళితే పక్కనే ఉంటుంది ఖైరత్– ఉన్–న్నీసా కట్టించిన సమాధి. అత్యంత దీనావస్థలో ఉన్న ఈ సమాధి చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఈ సమాధి స్థలం మసీదును ఆనుకుని ఉన్నా, మసీదు సంరక్షణ ఇక్కడ కనపడదు. నాలుగు పక్కలా ఇరికిచ్చిన ఇల్లు దీన్ని అందవికారంగా మార్చివేశాయి. శిథిలావస్థలో ఉన్న గోపురం, గోడలనుండి బైటకు పెరిగిన చెట్లు, బీటలు పడి పెచ్చులూడిపోయిన గోడలు విషాదంగా పలకరిస్తాయి. దీనిని అందరూ ఖైరతీ బేగం సమాధి అనే పిలుస్తారు. దీన్ని ప్రభుత్వం కాని ప్రజలు ఎన్నో ఏళ్లుగా పట్టించుకోవడం మానేశారు. నగర స్మృతి నుండి చెరిగిపోయిన శిథిలావస్థలో ఉన్న ఈ వారసత్వ కట్టడం ఖైరతీ బేగం సమాధి లేదా ఖైరున్నీసా సమాధి అని పిలవబడుతున్నా నిజానికి ఇది ఆమె సమాధి ఎంత మాత్రమూ కాదు. ఇందులో ఎవర్నీ ఖననం చేయలేదు.
దీనిని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమార్తె ఖైరత్-ఉన్-నిసా తన గురువు అఖుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం నిర్మించారు. ఆయన చనిపోయాక ఇక్కడే ఆయనను ఖననం చేయాలన్నే ప్రతిపాదనతో ఈ సమాధి ఆయన జీవించి ఉండగానే నిర్మించారు. నిజానికి ఆ రోజుల్లో వ్యక్తులు బ్రతికి ఉన్నప్పుడే వారి సమాధులు నిర్మించుకునే ఆచారం ఉండేది. అఖుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ దీన్ని తన ఆత్మసమాధిగానే భావించుకున్నారు. కాని ఆయన హజ్ యాత్రకు వెళ్లి దురదృష్టవశాత్తు అక్కడే మరణించారు. ఇది ముస్లింలు ఎంతో కోరుకునే మృత్యువు. వారి పార్థివ దేహం అందుకే ఇక్కడకు తరలించలేదు. అలా ఇది ఖాళీగా మిగిలిపోయింది. ఇలా ఖాళీగా ఉండే మరో సమాధి కులీ కుతుబ్ షా సమాధుల నడుమ ఇంకోటి ఉందని అంటారు.
సమాధికు చెందిన మినార్లు, దట్టంగా పెరిగిన చెట్లతో కప్పబడి ఉన్నాయి. దీనివల్లే వాటిపై పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. కట్టడం మొత్తం కూడా మందపాటి నల్లటి పొరతో నిండిపోయి ఉంది. స్థానికుల ప్రకారం, వాహనాల కాలుష్యం కారణంగా ఈ నల్లటి పొర ఏర్పడింది. ఇది ఒక సంరక్షిత వాస్తు స్మారక చిహ్నం అయినప్పటికీ, ఈ సమాధి సంవత్సరాలుగా ఇదే స్థితిలో ఉందని వారసత్వ పరిరక్షణ కార్యకర్తలు అన్నారు. హైదరాబాద్‌లో అత్యంత అధ్వాన్నంగా నిర్వహించబడుతున్న వారసత్వ కట్టడాలలో ఇది ఒకటి. నగర నడిబొడ్డున ఉన్న ఒక వారసత్వ కట్టడం పరిస్థితి ఇలా ఉంటే, ఇతర స్మారక చిహ్నాల పరిస్థితిని ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అద్భుతమైన పరదా పనితో పాటు, పగుళ్లు తక్కువగా రావడానికి, మృదువైన పదార్థాలను ఒత్తిడి నుండి కాపాడటానికి ఉపయోగించే సున్నపు ప్లాస్టర్ చాలా చోట్ల ఊడిపోవడంతో ఇది ఇంకా ఎక్కువ రోజులు ఇలా నిలిచి ఉండదేమో అన్న భయం కలుగుతుంది.
సమాధి చుట్టు గమనిస్తే గొప్ప నగిషీలు, జాలీలు ఆర్చ్‌లు కనిపిస్తాయి. ప్రతి వైపు మూడు ఆర్చ్‌లు ఉండేలా మధ్య ఆర్చ్‌లో సమాధి లోపలకు తలుపు ఉండేలా డిజైన్ చేసారు. కొలిచి చూస్తే అన్ని ఆర్చులు ఫర్ఫెక్ట్ గా ఒకే సైజులో ఉండి ఆశ్చయపరుస్తాయి.
ఈ సమాధిని కూడా హుస్సైన్ అలీ అధ్వర్వంలోనే కట్టారు. ఇప్పుడున్న పరిస్థితి దృష్యా ఇది ఇలా ఎక్కువ రోజులు నిలిచి ఉండకపోవచ్చు. ఒకవేళ సంరక్షించినా దీని వ్యూ పాత పద్దతిలో ఉండే అవకాశం మాత్రం లేదు. ఖైరతాబాద్ ప్రాంతానికి ఈ రెండు కట్టడాలు గొప్ప చారిత్రికతకు అనవాళ్లు. విస్తృతంగా పెరిగిపోతున్న నగరం, చరిత్రపై నేటి తరానికి ఆసక్తి లేకపోవడం, మతం అన్నిట్లోనూ ముఖ్యమయిపోవడంతో ఇటువంటి కట్టడాలపై ప్రస్తుత తరం దృష్టిపెడుతుందని, వాటిని సంరక్షించడానికి నడుం బిగిస్తుందని కాని అనుకోలేం. కాకపోతే హైదరాబాద్ నగరాన్ని ప్రేమిస్తున్న వ్యక్తులుగా ఈ చరిత్రను కేవలం రికార్డు చేయగలం. ఖైరత్ ఉన్నీస్సా గురించి హఫీజ్, ముహమ్మద్ అబ్దుల్ 2014లో ‘The Story of Princess Khairat Unissa Begum of Golconda’ అనే పుస్తకం రాశారు.
