[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ అంటూ హైదరాబాద్ లోని, ‘పైగా సమాధుల’ని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]
నిజాం రాజులకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటూ, వారి పరిపాలనా కాలంలో రాజనీతిజ్ఞులుగా, దాతలుగా సైన్యాధిపతులుగా సేవలందించారు ‘పైగా’ వంశీయులు. ఈ కుటుంబానికి చెందిన ప్రముఖుల సమాధుల స్థలాన్ని ‘మఖ్బరా షమ్స్-అల్-ఉమరా’ అనేవారు. ఇప్పుడు అవే ‘పైగా సమాధులు’గా సామాన్య ప్రజలను వాటి అద్బుత కళాత్మకతతో ఆశ్చర్యపరుస్తూ హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన అద్భుతాలలో ఒకటిగా పర్యటకులకు ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ అతి గొప్ప హస్తకళా నైపుణ్యానికి ఇవి ప్రసిద్ధి చెందాయి. చార్మినార్‌కు ఆగ్నేయ దిశలో 4 కిలోమీటర్ల దూరంలో, సంతోష్ నగర్ సమీపంలోని ఒవైసీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఒక చిన్న సందులో, ఫిసల్ బందా ప్రాంతంలో ఈ పైగా వంశస్థుల సమాధి స్థలం ఉంది. సున్నంతో, గచ్చుతోనూ నిర్మించబడిన ఈ సమాధులు అందమైన పాలరాతి చెక్కడపు పనితనంతో అలంకరించబడి ఉంటాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సమాధులు, పైగా వంశానికి చెందిన అనేక తరాల ప్రముఖుల అంతిమ విశ్రాంతి స్థలాలుగా ఉన్నాయి. పైగా రాచరికపు సమాధులు నాలుగు దిక్కులా అదుభతమైన నగిషీలతో, పనితనంతో ద్వారాలు ఉంటాయి. వాటిపై ప్రత్యేకమైన వృత్తాకారపు మీనార్లు దక్కనీ వాస్తు శైలికి గుర్తుగా గర్వంగా నిలిచి ఉంటాయి. సమాధులు లోపల ఈ ద్వారాల మధ్యన ఉంటాయి. సమాధుల పైన కప్పు ఉండదు. నిండైన ఆకాశం తొంగి చూస్తూ ఉంటుంది. ఇలా పై కప్పు లేని సమాధులు దక్కన్ ప్రాంతంలో ఇక్కడే కనిపిస్తాయి.
18వ శతాబ్దంలో హైదరాబాద్ సంస్థానంలోని ఉన్నత వర్గాలలో అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన కుటుంబాలుగా పేరొందిన ‘పైగా’ వంశీయులు, ఇస్లాం రెండవ ఖలీఫా అయిన ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ వారసులు. వీరి జాగీర్లు దాదాపు 4,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండేవి. వీరి పూర్వీకుడైన అబ్దుల్ ఫతే ఖాన్ తేగ్ జంగ్, అసఫ్ జా I తో కలిసి దక్కన్‌కు వచ్చి ‘పైగా’ వంశాన్ని స్థాపించారు. 1760 – 1803 మధ్య పాలించిన రెండవ నిజాంకు సేవలు అందించిన ఆయన, ‘షమ్స్-ఉల్-ఉమ్రా’ ‘అభిజాత్య వర్గంలో సూర్యుడు’ అనే బిరుదుతో పాటు సర్వసైన్యాధ్యక్షునిగా అత్యున్నత పదవిని పొందారు. వారి విశిష్టమైన కుటుంబ నేపథ్యం, నిజాం వంశానికి వారు అందించిన విలువైన సేవలు, పాలక నిజాం కుటుంబాలతో కుదుర్చుకున్న వివాహ సంబంధాలు వారిని నిజాంల తర్వాత హైదరాబాద్ సంస్థానంలో అత్యున్నత స్థాయి కలిగిన ప్రభువులుగా నిలిపాయి.
పైగా కుటుంబీకులు నగరంలో అనేక రాజభవనాలను నిర్మించారు. వాటిలో అస్మాన్ గఢ్ ప్యాలెస్, ఖుర్షీద్ జా దేవ్డీ, వికార్-ఉల్-ఉమ్రా ప్యాలెస్, ప్రసిద్ధ ఫలక్‌నుమా ప్యాలెస్ ముఖ్యమైనవి. దేశంలోని సాధారణ మహారాజుల కంటే వీరు అత్యంత సంపన్నులుగా పరిగణించబడేవారు. తమకంటూ ప్రత్యేక ఆస్థానాలు, రాజభవనాలు, వేల సంఖ్యలో సైనికులతో కూడిన సొంత ప్రైవేట్ సైన్యాలను నిర్వహించుకునే విశేషాధికారం నిజాం పరిపాలనలో వీరికి మాత్రమే ఉండేది.
1786లో అబ్దుల్ ఫతే ఖాన్ తేగ్ జంగ్ మొదట ఇక్కడ సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత ఈ ప్రదేశం కాలక్రమేణా వారి కుటుంబ సభ్యుల సమాధుల కేంద్రంగా మారింది. దీనిని ప్రధానంగా ఆయన కుమారుడు అమీర్-ఎ-కబీర్ I అభివృద్ధి చేశారు. తరువాత 1880లలో సర్ అస్మాన్ జా, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్-ఉల్-ఉమ్రా దీనికి మరికొన్ని నిర్మాణాలు జోడించారు. ఇక్కడ అబుల్ ఫతా ఖాన్ షమ్స్-ఉల్-ఉమ్రా I నుండి షమ్స్-ఉల్-ఉమ్రా V వరకు, అలాగే సర్ అస్మాన్ జా, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్-ఉల్-ఉమ్రా, సుల్తాన్-ఉల్-ముల్క్, లేడీ వికార్-ఉల్-ఉమ్రా, లేడీ ఖుర్షీద్ జా, లేడీ అస్మాన్ జా, మొయిన్-ఉద్-దౌలా, జహీర్ యార్ జంగ్, జైద్ యార్ ఖాన్ మొదలుకుని పైగా కుటుంబానికి చెందిన ఇతర సభ్యుల సమాధులు ఉన్నాయి. ఈ నిర్మాణాలు అద్భుతమైన ఇన్‌లేడ్ మొజాయిక్ పనిలో తమను తాము ప్రదర్శించుకునే విశేషమైన కళా నైపుణ్యానికి నమూనాలు. ఈ సమాధుల శిల్పాలలోని జ్యామితీయ నమూనాలు ప్రత్యేకమైనవనని, ప్రపంచంలో మరెక్కడా కనిపించవని స్థానికులు చెబుతారు.
ఇక్కడ ఉన్న అనేక సమాధుల సముదాయంలోని తోరణాలన్నిటిని పోలిస్తే అమీర్ ఎ కబీర్ కుటుంబ సమాధులకు సంబంధించిన తోరణం పెద్దది. సాధారణంగా ఒకే సమయంలో నిర్మించిన సమాధుల సముదాయంలో అన్ని సమాధుల నిర్మాణ శైలి ఒకేలా ఉండాలి, కానీ ఇక్కడ నిర్మాణ సౌందర్యం విషయంలో నవాబ్ సర్ ఖుర్షీద్ జా కుటుంబ సమాధికి మాత్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక్కడ ఉన్న అతిపెద్ద తోరణం, ‘మహజర్’ అని పిలువబడే లోపలి భాగంలోని జంట సమాధి (డబుల్ మఖ్బరా) నిర్మాణం మరే ఇతర సమాధిలోనూ కనిపించదు. సర్ ఖుర్షీద్ జా అమ్మమ్మ లతీఫున్నిసా బేగం సాహెబా సమాధిపై ఉన్న అందమైన స్టకో (సున్నపు పూత) అలంకరణలు మరే ఇతర సమాధిలోనూ కనిపించవు. లతీఫున్నిసా బేగం సాహెబా సమాధి రాయిపై, దీనిని నవాబ్ సర్ ఖుర్షీద్ జా బహదూర్ నిర్మించినట్లు పేర్కొనబడింది. దీని మీద ఉన్న జిద్దే అనే ఉర్దూ పదానికి ‘అమ్మమ్మ/నానమ్మ’ అని అర్థం. అలా ఇది సర్ ఖుర్షీద్ జా బహదూర్ అమ్మమ్మ సమాధి అని గుర్తిస్తారు
‘తయ్యారియే, మొహమ్మద్ మొహినుద్దీన్ ఖాన్ ఖుర్శిద్ జా బహాదుర్’ అంటే ‘ఖుర్షీద్ జా బహదూర్ ద్వారా రూపొందించబడింది’ అని అర్థం. ఈ సమాధి గృహంలో నవాబ్ సర్ ఖుర్షీద్ జా బహదూర్ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి. వీరిలో షాజాదీ హుస్సేనున్నిసా బేగం (భార్య), షాజాదీ హష్మతున్నిసా బేగం (తల్లి), అమీర్-ఎ-కబీర్ నవాబ్ మహమ్మద్ రషీదుద్దీన్ ఖాన్ బహదూర్ (తండ్రి) హుస్సేనీ బేగం (నవాబ్ రషీదుద్దీన్ ఖాన్ రెండవ భార్య) ఉన్నారు.
మొదట చూసినప్పుడు, పైగా సమాధులు నిర్మానుష్యంగా, కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే చాలా మంది హైదరాబాదీలకు కూడా వీటి గురించి తెలియదు. వీటిని చేరుకునే దారి కూడా ఇరుకుగా చిన్న సందుల గుండా వెళితే వస్తుంది. కాని దగ్గరకు వెళ్లి వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ పనితనానికి ఆశ్చర్యపోతారు. అద్భుతమైన చెక్కడాలు, పూల డిజైన్లలోని నమూనాలు, పొదిగిన మొజాయిక్ టైల్ పనులతో, ఈ సమాధుల చుట్టూ నడవడం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. సమాధులు, వాటి గోడలు సున్నితంగా చెక్కబడి, రంధ్రాలు గల పాలరాతి ముఖభాగాలతో కప్పబడి ఉన్నాయి; వాటిలో కొన్ని వరుసలలో, అందంగా చెక్కబడిన తెరలు, పందిళ్లు కనువిందు చేస్తాయి.
ఈ గోడలన్నీ కూడా ఎంతో ఓపికతో అందంగా తీర్చిదిద్దిన పువ్వులతోనూ ఆకారాలతోనూ నిండిపోయి ఉంటాయి. హిందూ ఇస్లామిక్ మిశ్రమ వాస్తు శైలి ప్రతి మలుపులోనూ కనిపిస్తుంది. గాలి వెలుతురు ధారాళంగా లోపలికి బైటికి వచ్చేలా నిర్మించిన కట్టడం ఇది. అందుకేనేమో ఇతర పాత కట్టడాలలో సాధారణంగా వచ్చే ముక్కు వాసన ఇక్కడ రాలేదు. సున్నం ఎక్కువగా వాడి కట్టిన గోడలు కావడం వల్ల లోపల చల్లగా అనిపిస్తుంది.
పైగా వంశస్తులందరి విశ్రాంత స్థలం ఇదే అయినా వారి ఆర్థిక, రాజకీయ స్థాయిని బట్టి ఆ సమాధులు కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రధాన కుటుంబీకుల సమాధులు, కాస్త పెద్ద జాగీర్దార్లుల సమాధులు, మధ్య తరగతి ఆఫీసర్లు, తరువాత ఏ స్థాయి లేని వ్యక్తుల సమాధులను ఇన్నేళ్ళ తర్వాత కూడా అక్కడ నిర్మాణాల నడుమ గుర్తించవచ్చు. వీటి మధ్య తిరుగుతూ ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూడా సమాధులపై ముస్లిం పరిపాలకులకు ఇంత మోహం ఎందుకా అని అనిపించింది. చావులో కూడా వదలని రాజకీయ ఆర్థిక స్థాయిని అక్కడ సమాధుల నడుమ చూడడం బాధ కలిగించింది.
ఈ సమాధులు 35-40 ఎకరాలలో విస్తరించి ఉన్నా, నిజాంల కుమార్తెలను వివాహం చేసుకున్న పైగా వంశీయులు, వారి భార్యల సమాధులు రెండు ఎకరాల స్థలానికి పరిమితం చేయబడ్డాయి. ఇక్కడి ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పం, ఆసఫ్ జాహీ, రాజపుతానా వాస్తు శైలుల మిశ్రమం. మొఘల్, పర్షియన్, దక్కన్ శైలులను ప్రతిబింబించే అద్భుతమైన స్టక్కో పనితో చేసిన అలంకరణను ఆశ్చర్యానుభూతులకు గురి చేస్తాయి. బర్హానా షా సాహెబ్ దర్గాకు సమీపంలో ఉన్న ఈ సమాధులు, మొఘల్ ప్రావిన్సుల శైలిలో నిర్మించబడిన అత్యంత సున్నితమైన, అద్భుతమైన కళాఖండాలు. ఈ ఆవరణ, జాలీ పలకలతో కూడిన చౌఖండీల ఆకారంలో ఉండి, ఆకాశానికి తెరిచి ఉంటుంది. 7వ నిజాం సింహాసనాన్ని అధిష్టించే వరకు, నిజాంల సమాధులన్నీ ఆకాశానికి తెరిచి ఉండేవి. అంటే సమాధి భవనాలకు పై కప్పు ఉండదు. దీనికి కారణం, ఇవన్నీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని అనుకరించి కట్టబడి ఉండటం. నిజాంలు ఔరంగజేబుకు గవర్నర్‌గా ఉండేవారు. అందుకే పైగా వంశీయులు తమ సమాధులకు పైకప్పు లేకుండా ఉంచేసారు. ఈ ఆలోచన ఇస్లాం మతం ప్రతిపాదించే సరళమైన సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. సమాధుల చుట్టూ ఉన్న అందమైన గోడల నిర్మాణంలో జ్యామితీయ పుష్ప డిజైన్లతో కూడిన జాలీ పలకలు ఉన్నాయి. సున్నితమైన, నునుపుగా పాలిష్ చేసిన గార పని, జాలీ కళ ఆ కాలపు సాధారణ శైలిని ప్రతిబింబిస్తుంది.
ఈ సమాధి స్థలం ప్రారంభంలో పేరును తెలిపే ఒక ఎత్తైన సైన్‌బోర్డు స్వాగతం పలుకుతుంది. ఈ ఆవరణలోకి అడుగుపెట్టగానే, సౌందర్యం, కళాత్మకత కలబోత కనువింది చేస్తుంది. సమాధి మందిరం చుట్టూ, విస్తృతంగా చెక్కబడిన పందిళ్లు, పాలరాతిలో పొదిగిన పూల డిజైన్లతో కూడిన అద్భుతమైన కళాత్మకత ఆకర్షిస్తుంది. నిశితంగా గమనిస్తే ఈ డిజైన్లలో ఏదీ పునరావృతం కాదు. పైగాలోని ప్రతి ప్రభువు సమాధిలో ఏదో ఒక ప్రత్యేకమైన భిన్నత్వం ఉంటుంది. ఆ చెక్కడాలలోని తేడాలను కనుగొంటూ వాటిని పరిశీలించడం ఓ గొప్ప అనుభవం. అలనాటి నిర్మాణ శైలిలోని గొప్పతనం, అప్పటి శిల్పులు చూపించిన సృజనాత్మకత ఆశ్చర్యం కలిగిస్తుంది.
క్లిష్టమైన డిజైన్లతో కూడిన జాలీపనిని అధ్యయనం చేయడానికి పైగా సమాధులను మించిన మరో కట్టడం దేశంలోనే లేదు. సున్నితంగా చెక్కబడిన చెక్క తలుపులు, జాలీ పనితో చేసిన కిటికీ తెరలను చూస్తే ఎవరికైనా అద్భుతమైన ఆశ్చర్యం కలుగుతుంది. సమాధుల వెలుపల చూడటానికి పెద్దగా ఏమీ లేకపోయినా, ఇక్కడి మార్గాలు, మూసి ఉన్న ప్రదేశాలలో నడుస్తూ గంటల తరబడి గడపవచ్చు. ప్రతి సమాధిపై దానిలోని గొప్ప శిల్పాలపై పడే నీడలను చూసి, చిత్రీకరించడానికి ఫోటోగ్రాఫర్లు తప్పకుండా ఇక్కడికి రావాలి. ఛాయాగ్రహకులకు ఇది ఒక అద్భుత ప్రపంచం.
సమాధుల వాస్తుశైలి మొఘల్, మూర్ శైలుల సమ్మేళనం. సున్నం, మోర్టార్‌తో నిర్మించిన గర్భగుడి గదులలో, స్పెయిన్‌లోని గ్రనడా సెవిల్లేలను గుర్తుచేసేలా క్లిష్టమైన పాలరాతి పొదుగుపని, గారపని అబ్బురపరుస్తాయి. మొఘల్, గ్రీక్, పర్షియన్, అసఫ్ జాహీ, రాజస్థానీ దక్కనీ వాస్తుశైలులకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. అద్భుతంగా పొదిగిన మొజాయిక్ పనిలో స్పష్టంగా కనిపించే అసాధారణమైన కళానైపుణ్యం చూసి తీరవలసిందే. పైగా సమాధులలోని జ్యామితీయ నమూనాలు విశిష్టమైనవి. అవి గొప్ప నైపుణ్యంతో తెరలతో అమర్చబడి ఉన్నాయి.
ఈ కట్టడాలపై ఉన్న గారపని వివరాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిపై చెక్కబడిన జ్యామితీయ లక్షణాల కారణంగా అవి చాలా ప్రాచుర్యం పొందాయి. జ్యామితీయ డిజైన్లతో పాటు, పూల డిజైన్లు, జాలీ పాలరాతి కంచె , పందిళ్ళు కూడా చాలా క్లిష్టంగానూ అందంగా ఉంటాయి.
ఈ సమాధులలో కూడా, అస్మాన్ జా, బేగం ఖుర్షీద్ జా సమాధులు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ కట్టడాలు పాలరాయితో నిర్మించబడ్డాయి. ఒకప్పుడు విలువైన, రాళ్లతో వీటిని అలంకరించారట. ఇవి కాల మార్పులతో పాటు ఈ రాళ్లు రంగులు మార్చుకునేవట. పురావస్తు శాఖ ఈ సమాధులను గురించి అవి ఎవరివో తెలుపుతూ దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి సమాధి వద్ద ఉంచడం చరిత్రను మాసిపోకుండా కొంత కాలం నిలపడానికి చేసిన ప్రయత్నంగా అనిపిస్తుంది. పైగా ఇంటి కోడళ్ళుగా వెళ్లిన నిజాం కూతుర్ల సమాధులు ఇక్కడ కనిపిస్తాయి.
ఈ సమాధుల చుట్టూ కనిపించే ప్రతి గోడపైన పండ్లు, డ్రమ్ములు, పాములు, పువ్వులు, పూలకుండీలు మొదలైన వాటితో విభిన్నంగా అలంకరించి ఉంటాయి. విభిన్నమైన డిజైన్లను కలిగి ఉన్న ఈ సమాధులలో అద్భుతమైన హస్తకళా నైపుణ్యం కనబడుతుంది. భారతదేశానికి ప్రత్యేకమైన లక్షణమైన, చిన్న అర్ధ వృత్తాకార తోరణాలతో కారిడార్లు కనిపిస్తాయి. ఈ సమాధులను ఆ రోజుల్లో విలువైన రాళ్లతో అలంకరించారట. అవి దొంగలించబడి, కొన్ని చెదిరిపోయి ఆ ఆనవాళ్ళు ఇలా సమాధిపైన చెక్కుళ్ళుగా మిగిలి కనిపిస్తూ ఉంటాయి.
కాలం ఈ సమాధులను కాస్త దెబ్బతీసింది. అయితే వాటిని ప్రస్తుతం పునరుద్ధరించడానికి, మరమ్మతులు చేయించడానికి, నిర్మాణ పగుళ్లను సరిచేయడానికి తెలంగాణ వారసత్వ శాఖ (Department of Heritage Telangana) భాగస్వామ్యంతో ‘ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ (AKTC) సంరక్షణ పనులను చేపడుతోంది. ఇందులో భాగంగా 18వ, 19వ శతాబ్దాలలో నిర్మించిన ఆరు సమాధి కట్టడాల పునరుద్ధరణకు ‘యు.ఎస్. అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్’ (AFCP) మద్దతు లభిస్తోంది. యు.ఎస్. AFCP నుండి 250,000 డాలర్లు ఈ పని కోసం అందాయి.
నేను ఇవి చూడడానికి వెళ్లినప్పుడు కాలేజి పిల్లల్లా కనిపించే యువకులు ఈ గోడలను అలనాటి రీతిలో పగుళ్ళు పడ్డ చోట మరమ్మత్తులు చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. రెండొందల ఏళ్ళ నాడు ఇవి ఎవరు కట్టారో తెలియదు కాని ఇప్పుడు విరిగిపోయి పగిలిపోయిన గోడలు, గోడపై కళాఖండాలను అదే పద్దతిలో బాగు చేస్తున్న ఈ శిల్పకారుల పనితనాన్ని ఒక రెండు గంటల పాటు వీక్షించడం చాలా ఆనందాన్నిచ్చింది. వారు బాగు చేసి సరి చేసిన ఆ భాగాలను చూసి అంత సహజంగా పని చేస్తున్న ఆ కళాకారుల నైపుణ్యం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా విరిగిపోయిన జాలీలను ఎక్కడా తప్పు దొర్లకుండా నా ముందే వాళ్ళూ సరి చేసి చూపించారు. అది ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం.
ఈ యువకులలో ఎక్కువ మంది రాజస్థాన్ నుండి వచ్చిన వారు. కొందరు బీహారీలు, యుపికి చెందిన శిల్పకారులూ ఉన్నారు. మట్టితో సున్నంతో వీరు పడిపోయిన గోడలకు పునరాకృతిని ఇస్తూ ప్రతి జాలీని తమ పనితనంతో మళ్ళీ నిలబెడుతుంటే, నేటి తరంలోనూ ఈ పని చేసే వారు ఉన్నరని తెలిసి ఆనందం కలిగింది.
ఈ సముదాయాన్ని దాని పూర్వ వైభవానికి పునరుద్ధరించడానికి, ఆ ప్రదేశంలో గమనించిన సాంప్రదాయ నిర్మాణ పద్ధతులను అనుసరించి, వందకు పైగా మినార్లను చాలా జాగ్రత్తగా ఈ శిల్పకారులు పునర్నిర్మించారు. ఈ పనిలో అలంకార గార, సున్నపు మోర్టార్ జాలీ తెరలను మరమ్మత్తు చేస్తున్నారు. ఇవి టెర్రకోట పలకలు, ఇనుప కోర్లతో తయారు చేయబడినట్లు కనుగొన్నారు. గతంలో చేసిన అనుచితమైన మరమ్మతులను అంటే సిమెంట్ ప్యాచ్‌లు వంటి వాటిని సాంప్రదాయ పదార్థాలు, పద్ధతులతో తిరిగి భర్తీ చేస్తున్నారు కూడా.
అలాగే ఇక్కడకి పెద్ద సంఖ్యలో పర్యటకులు రావడానికి మెరుగైన సౌకర్యాలు, నడక మార్గాలు, సూచికలు దీపాలు వంటివి అమర్చే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని పైగా సమాధుల సముదాయానికి పశ్చిమ వైపున 18వ శతాబ్దపు అసఫ్ జాహీ శైలికి చెందిన ఒక మసీదు ఉంది; దీనికి సరిగ్గా ముందు భాగంలో ఒక చిన్న కృత్రిమ జలాశయం లేదా అబ్లూషన్ పూల్ (ప్రార్థనకు ముందు శుద్ధి చేసుకునే కొలను) ఉండి, అందులో ఆ మసీదు నిర్మాణం ప్రతిబింబిస్తుంది. ఈ కొలను చుట్టూ రాట్ ఐరన్ కుర్చీలు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఇవి ఆ మసీదు సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
చాలా మందికి ఈ సమాధుల గురించి పెద్దగా తెలియదు. కాని ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పని చూసిన తర్వాత త్వరలో ఇది ఒక ప్రముఖ పర్యాటక స్థలంగా మారగలదని అనిపించింది.
