Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదాబ్ హైదరాబాద్ – సైదాని మా సమాధి – ట్యాంక్‌బండ్ రోడ్

[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ ట్యాంక్‌బండ్ రోడ్ లోని, ‘సైదాని మా సమాధి’ని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]

సికింద్రాబాద్ నుండి ట్యాంక్ బండ్ వైపుకు వెళుతున్నప్పుడు ఎడమ వైపున ఓ తెల్లటి సమాధి దర్శనమిస్తుంది. దాన్ని పరీక్షగా చూసే అవకాశం వేగంగా వెళ్తున్న ట్రాఫిక్ మధ్య దొరకదు. ఇది ఇతర చారిత్రక కట్టడాల నుండి కొంత దూరంగా, ఏకాంతంగా ఉంటుంది. ఎవరైనా కొన్ని క్షణాలు ఆగి తమ పరిసరాలను గమనిస్తే తప్ప, ఇది తరచుగా ఎవరి దృష్టికీ రాకుండా పోయే ఒక అందమైన కట్టడం. ఆ సమాధి ముందున్న చిన్న గేట్ తెరుచుకుని ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ప్రాంగణంలోకి అడుగుపెడితే ఆ సమాధిపైనున్న పనితనానికి ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ఇది చాలా అందమైన విశాలమైన వీధి. అప్పటి చిత్రాలను చూసి, ఇప్పుడు ఇరుకుగా మారిన ఆ ప్రధాన కూడలి నడుమ ముడుచుకుని కనిపించీ కనపడనట్లున్న ఆ సమాధిని పరీక్షగా చూస్తే తప్ప దీని గురించి తెలుసుకోవలసిన అవసరం అర్ధం కాదు. ఆ నిర్మాణ శైలి, అద్భుత పని తీరుని శ్రద్దగా గమనించేవారు అతి కొద్ది మందే. కాని నగర చరిత్ర, ప్రాచీన కట్టడాల సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారు మరచిపోకుండా గమనించాల్సిన కట్టడం ఈ ‘సైదాని మా సమాధి’ .

దీనిని ‘మక్బరా సైదాని మా సాహెబా’ అని కూడా పిలుస్తారు. దీని నిర్మాణం 1883లో జరిగింది. ఇది 19వ శతాబ్దానికి చెందిన, రాష్ట్ర రక్షణలో ఉన్న ఒక వారసత్వ కట్టడం. ఈ సమాధిని హజ్రత్ సైదానీ మా సాహెబా కోసం నిర్మించారు. ఆమె నవాబ్ అబ్దుల్ హక్ దిలేర్ జంగ్ తల్లి. ‘దిలేర్ జంగ్’ (1853–1896) అనే బిరుదును కూడా కలిగిన సర్దార్ అబ్దుల్ హక్, తల్లి కోసం నిర్మించుకున్న సమాధి ఇది. ఈయన స్వతహాగా బొంబాయి ప్రావిన్స్ (బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతం) కు చెందినవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో, అప్పటి హైదరాబాద్ రాజ్యంలో ఈయన విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నారు.

దిలేర్ జంగ్ తన కాలంలోని అత్యంత సంపన్న ప్రభువులలో ఒకరు. ఆరవ నిజాం, నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో ఉన్నతాధికారిగా పనిచేశారు. నిజాంకు హోం సెక్రటరీగా, ఆ తర్వాత 1885లో నిజాం స్టేట్ రైల్వేస్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈయన మరణించాక ఇక్కడే వీరిని కూడా ఖననం చేశారని చెప్తారు. దిలేర్ జంగ్ సమాధి అతని తల్లి సమాధికి ఉత్తర దిశలో ఉంది.

ఈ నిర్మాణం మొఘల్, కుతుబ్ షాహీ శైలుల అద్భుతమైన సమ్మేళనం. విస్తృతమైన సున్నపు పూత అలంకరణలు, జాలీలతో కూడిన ఈ సమాధి 1883లో ఆసఫ్ జా VI పాలనలో నిర్మించిన ఓ అద్భుత కట్టడం. దీనిపై కనిపించే విస్తృతమైన అలంకరణలు, రాతి జాలీలు (ఫ్రేట్‌వర్క్ స్క్రీన్స్) సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఆ అద్భుతమైన పనితీరుకు ఆకర్షింపబడనివారు ఉండరు. ముస్లిం పాలనలో సమాధులను నిర్మించడంలో ఎంతో శ్రద్ద చూపారన్నది నిజం. అయితే నగరంలో కనిపించే ఇతర సమాధులన్నీ కూడా రాచరికపు కుటుంబాలకు చెందినవి. రాజవంశానికి చెందినవారు, రాచరికపు కుటుంబాలలోని ముఖ్యులకు ఇలాంటి సమాధులను నిర్మించేవారు. అయితే ఇది మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించుకున్న సమాధి. అందుకే ఇది హైదరాబాద్ ప్రాంతానికి దూరంగా సికింద్రాబాద్‌కు దగ్గరగా ఉంది. ఇంత గొప్పగా నిర్మించిన సామాన్యురాలి సమాధి కూడా ఇది ఒక్కటే అని చరిత్రకారులు చెబుతారు. దీనిపై కనిపించే పనితనం మాత్రం ఏ రాకరికపు సమాధికి తక్కువ కాకుండా ఇంకా చెప్పాలంటే వాటిని మించి ఉన్నదన్నది మాత్రం నిజం.

2022లో, తెలంగాణ ప్రభుత్వం నగరవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న అనేక చారిత్రక కట్టడాలను పునరుద్ధరించడం ద్వారా హైదరాబాద్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యం తర్వాత, ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (AKTC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)ల సహకారంతో ఈ సమాధి, దాని ప్రక్కనే కాస్త దూరంలో ఉన్న చారిత్రాత్మక మెట్ల బావి (బౌలి) పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. అక్టోబర్ 2023లో ఇది పూర్వ వైభవంతో ప్రజల సందర్శనార్థం ముస్తాబయింది. కాని ఇప్పటికీ దీన్ని సందర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది. దీని పక్కనుండే వేల వాహనాలు వెళుతూ ఉంటాయి కాని దీన్ని చూడాలనే ఆసక్తి కలిగిన నగరవాసులు చాలా తక్కువ. మన నగర చరిత్ర పట్ల ఉత్సాహం చూపే యువత తక్కువ అవడం వెనుక పెద్దల నిర్లక్ష్య వైఖరి కూడా కారణమే కదా.

భవన నిర్మాణ శైలిని పరిశీలిస్తూ ఎన్నో సుందర కట్టడాలను చూసేవారికి ఈ సమాధిపై కనిపించే పనితనం ఉత్తర దక్షిణ శైలుల మేళవింపు, ముఘలుల, కుతుబ్ షాహీల శైలుల కలయిక ఆశ్చర్యపరుస్తుంది. అప్పటి నిర్మాణాలలో చూపించే శ్రద్ద, ఓపిక ఈ సమాధి ఇప్పటికీ నిలిచి ఉండడానికి కారణం.

ఈ భవనం మధ్య భాగంలో సమాధి కనిపించదు. ఒక నలుచదరపు స్థలంలో ఓ తివాచి మాత్రమే పరిచి ఉంటుంది. నిజమైన సమాధి ఈ గోపురం అడుగు భాగంలో భూగర్భంలో ఉంది. దాన్ని అందరూ చూడలేరు. ఈ నిర్మాణంలోనే సైదానీ మా కుమారుడైన నవాబ్ దిలేర్ జంగ్ సమాధి, దీని వెనుక భాగంలో ఒక ముస్లిం శ్మశానవాటిక కూడా ఉన్నాయి. 133 ఏళ్ల పురాతన కట్టడమైన సైదానీ మా సాహెబా సమాధి కుతుబ్ షాహీ పనితనానికి ప్రతీకగా నిలిచి ఉంది. ఒక సామాన్యురాలి జ్ఞాపకార్థం నిర్మించిన అతికొద్ది అద్భుతమైన సమాధులలో ఈ కట్టడం ప్రధానమైనది.

ఒక వాచ్‌మన్ ఆ ప్రాంగణాన్ని చూసుకుంటున్నాడు కానీ అది ఇప్పటికీ సరిగ్గా నిర్వహించబడటం లేదు. దీన్ని దర్శించే వారి సంఖ్య ఎక్కువగా లేకపోవడం ఒక కారణం. దీన్ని పూర్తిగా చూడడానికి నేను రెండు సార్లు వెళ్లవలసి వచ్చింది. రెండు సార్లు కూడా వాచ్‌మన్ కనిపించలేదు. ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో లోపలిని వెళ్ళి దాన్ని చూడడం తటస్థించినా, సమాధి లోపలి భాగం ఆ జాలీల నుండే చూడవలసి వచ్చింది. సమాధి మధ్యలో ఓ ఖాళీ స్థలం ఉంటే, దాని చుట్టూ నాలుకు పక్కల అద్భుతమైన నగిషీలతో చెక్కిన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణ నిర్మాణంలో చెక్కిన ఆర్చీలు, పైకప్పు పై చెక్కిన నగిషీలు చాలా అందంగా ఉంటాయి. ఆ ఆర్చీల డిజైన్ పై కనిపించే చెక్కుళ్లు ఆ నాటి భవననిర్మాణంలో ప్రదర్శించిన కళాత్మకతను సూచిస్తాయి.

ఆ ప్రాంగణం చివర్లో కొన్ని ఇతర వ్యక్తుల సమాధులు కనిపిస్తాయి. బైట కూడా అదే పద్ధతిలో నాలుగు పక్కలా సమాధులు ఉంటాయి. బహుశా అవి ఆ కుటుంబానికి చెందిన వారి సమాధులు కావచ్చు.

దీని లోపలికి ప్రవేశించినప్పుడు, ఇది పైగా పాలకులకు చెందినదని అనిపిస్తుంది. ఎందుకంటే పైగా సమాధుల పోలికలు కొన్ని కనిపిస్తాయి. కానీ పూర్తిగా పైకి చూసినప్పుడు, గోపురం కుతుబ్ షాహీ శైలిలో ఉంటుంది. కింది అంతస్తులోని తోరణాలు మొఘల్ శైలిలో వంపులతో నిర్మించబడ్డాయి. ఈ సమాధి నవ కుతుబ్ షాహీ శైలికి ఒక ప్రస్ఫుటమైన ఉదాహరణ.

దీని అందం ఇనుమడింపచేసేవి సమాధి నాలుగువైపుల మూడు ఆర్చీల ఆకారంలో ఉండే ఎలివేషన్. మూడిటి పక్కన మళ్లీ ఒకో ఆర్చి. అంటే ఒకో పక్క అయిదు ఆర్చీలు అందంగా చెక్కబడి ఉంటాయి. మధ్యలో మూడు ఆర్చీలు కలిసి ఉంటే వాటికి అటు ఇటు జాలీల నడుమ ఒకో ఆర్చీ ఉంతుంది.నాలుగు పక్కల నుండి చూస్తే అవి ఒకే ఆకారంలో ఖచ్చితమైన పద్దతిలో కనిపిస్తాయి. ప్రతి ఆర్చి సమామైన కొలతలతో ఉండి అప్పటి పనితనాన్ని సూచిస్తాయి. ఆ ఆర్చీలకు అటు ఇటు నిర్మించిన జాలీలు ఏ ఒక్కటి ఒకే పోలికతో ఉండవు. ఒకో జాలి ఒకో పనితనంతో చెక్కబడి ఉంటుంది.

ఈ ఫోటోలో కనిపించే ఇనప తలుపులు ఈ మధ్య పెట్టినవి. వీటి మధ్య ఈ కట్టడం బంధించినట్లు కనిపిస్తుంది కాని నిజానికి ఇది కట్టినప్పుడు ఈ ఇనప తలుపులు లేవు. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ద్వారాలు తెరిచే ఉండేవి. ఇప్పుడు ఎవరంటే వాళ్లు ఇందులోకి ప్రవేశించి దీన్ని పాడు చేయకుండా ఆపడానికి లోపల నుండి ఈ ఇనప తలుపులు పెట్టారు. అవి సమాధి అందాన్ని, బైటి ఎలివేషన్ ను పాడు చేయకుండా శ్రద్ద వహించారు.

ఈ కట్టడం పై గదిలోని ఆర్చ్‌లు స్పష్టంగా కుతుబ్ షాహీ కాలం నాటివిగా కనిపిస్తుండగా, కింది అంతస్తులోని ఆర్చ్‌లు మొఘల్ స్ఫూర్తితో నిర్మించినవని చెబుతారు. ఈ కట్టడాన్ని పరిశీలనగా చూస్తే మనల్ని ఆశ్చర్యపరిచేది ప్రతి మూలలోనూ చూపిన పనితనం. సమాధి మూలలోని అందమైన చెక్కడాలు, దానిపై సన్నని నగిషీలు దీని అందాన్ని ఇనుమడింపజేస్తాయి.

ఈ సమాధికి నాలుగు వైపుల గోడలలో అమర్చిన జాలీలు ప్రతి ఒకటి భిన్నమైన డిజైనులో కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. ఈ జాలీల పన్నితనమే ఈ సమాధి ప్రత్యేకత కూడా.

ఒక సామాన్యురాలైన స్త్రీ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ సమాధి అద్భుతమైన వాస్తుశిల్పంతో ఆశ్చర్యపరుస్తుంది. ఈ సమాధి వెనుక భాగంలో ఉండే స్మశానవాటిక మధ్యన ఇంజన్ ఆయిల్ వంటి ఇతర వస్తువులను విక్రయించే చిల్లర వ్యాపారులు ఉన్న ఒక వక్ఫ్ భవనం కూడా ఉంది. వీటి మధ్య ఈ మధ్యే వెలికి తీసిన మెట్ల బావి ఉంది. ప్రత్యేకించి చూస్తే తప్ప ఇది ఎవరికి కనిపించదు. ప్రధాన సమాధి నుండి పక్కగా సమాధుల నడుమ నడుచుకుంటూ ఓ యాభై అడుగులు వేసాక ఈ బావి గట్టుకు చేరాక కూడా ప్రత్యేకించి చూస్తే తప్ప ఈ మెట్ల బావి కనిపించదు.

నగరం నడిబొడ్డున మొఘలుల, కుతుబ్ షాహీల భనవ నిర్మాణ శైలిని కలుపుకుని కనిపించే కట్టడం ఇదొక్కటే. హైదరాబాద్ గత చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ నిర్మాణం గురించి అటుపక్కన ప్రతిరోజూ ప్రయాణించే వారు సైతం ఆసక్తి చూపించకపోవడం ఇప్పటి జీవిన పరిస్థితులకు అద్దం పడుతుంది.

Exit mobile version