[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ ‘మొజంజాహి మార్కెట్’ అంతా తిప్పి చూపిస్తున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]
హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ(హుడా) వారసత్వ కట్టడంగా గుర్తించిన ‘మొజంజాహి మార్కెట్’ నాంపల్లికి సమీపంలో, చార్మినార్ నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నగర ప్రజలకు ఒకే పైకప్పు కింద ప్రతిదీ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో దీన్ని నిజాం కాలంలోనే రూపొందించారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడు, అప్పటి నగర అభివృద్ధి బోర్డు అధ్యక్షుడు నవాబ్ మోజ్జం జా బహదూర్ పేరును ఈ మార్కెట్‌కు పెట్టారు. CIB 1912లో ఏర్పడ్డ హైదరాబాద్ నగర పట్టణ ప్రణాళిక సంస్థ. దీన్ని హైదరాబాద్ ఆధునీకరణ కోసం స్థాపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మార్కెట్ నిర్మాణం కోసం అప్పట్లో రూ. 4 లక్షలను ఖర్చు చేశారు. ఈ నిర్మాణ ప్రణాళిక 1932లో చేస్తే, దానికి పూర్తి రూపం 1935లో వచ్చింది. 1.77 ఎకరాలకు పైగా విస్తరించి, అప్పట్లో 120 దుకాణాలతో ముస్తాబయిన ఈ మార్కెట్ మరో ఉద్దేశం, మెహబూబ్ చౌక్ బజార్, రెసిడెన్సీ బజార్, బేగం బజార్లలోని రద్దీని తగ్గిండం.
ఇది ఒక చారిత్రాత్మక, త్రిభుజాకార కట్టడం. ఇది కేవలం ఒక మార్కెట్ కాదు, నవాబుల జీవన శైలికి గుర్తింపు. నిజాముల రాచరికపు జీవన శైలికి గుర్తు. ఈ మార్కెట్‌ను నిర్మించిన విధానంలో నిజాంలు తమ హయంలో నిర్మాణ శైలికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థం అవుతుంది. సరుకులు విక్రయించే స్థలాన్ని కూడా ఇంత కళాత్మకంగా తీర్చిదిద్దడం బహుశా నిజాం హయాంలోనే జరిగిందేమో. ఈ మార్కెట్ ఇండో-సారాసెనిక్ శైలిలో (ఉస్మానియన్ శైలి) నిర్మించబడింది. ఈ శైలిని నగరంలోని ఇతర ప్రసిద్ధ భవనాలైన హైకోర్టు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా గమనించవచ్చు.
ఇండో-సారాసెనిక్ ఆర్కిటెక్చర్ అనేది 19వ శతాబ్దపు చివరిలో భారతదేశంలో బ్రిటిష్ వాస్తుశిల్పులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ శైలి. ఇస్లామిక్ (మొఘల్, ఇండో-ఇస్లామిక్), హిందూ, గోతిక్/నియోక్లాసికల్ అంశాలను కలిపి నిర్మించిన ఉల్లి గోపురాలు, మినార్లు, కోణాల తోరణాలు, జాలిలు (తెరలు), ఉబ్బెత్తు గోపురాలు, అలంకరించబడిన చెక్కడాలు, ఛత్రిలు (గోపురం ఉన్న కియోస్క్‌లు), వేలాడుతున్న చూరులు (చజ్జాలు), స్తంభాలు, గ్రాండ్ మెట్లు ఈ శైలి ముఖ్య లక్షణాలు. ఎర్ర ఇసుకరాయి వంటి శక్తివంతమైన పదార్థాలను ఉపయోగించి గొప్ప ప్రజా భవనాలను ఈ శైలిలో సృష్టించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (విక్టోరియా టెర్మినస్), మైసూర్ ప్యాలెస్ వంటి మైలురాళ్ల ద్వారా ఉదహరించబడిన వలస ఆధునికతను నొక్కి చెబుతూనే, బ్రిటిష్ పాలనను భారతదేశ గొప్ప గతంతో అనుసంధానించడం ద్వారా దానిని చట్టబద్ధం చేయడానికి ఈ శైలి ఉపయోగపడింది.
ఇది విభిన్న దేశాల భవన నిర్మాణ శైలుల కలయిక. భారతీయ (హిందూ, మొఘల్)ను ఇస్లామిక్ (పర్షియన్, అరబిక్), యూరోపియన్ (గోతిక్, నియోక్లాసికల్) డిజైన్లను ఇది మిళితం చేస్తుంది. ఈ నిర్మాణాలకు ఎర్ర ఇసుకరాయిని ప్రధానంగా ఉపయోగించారు. క్లిష్టమైన రాతి పని, స్టెయిన్డ్ గ్లాస్ అలంకారాన్ని ఈ శైలి ప్రోత్సహిస్తుంది. రైల్వే స్టేషన్లు, విశ్వవిద్యాలయాలు, కోర్టులు, మ్యూజియంలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణంలో ఈ శైలి ప్రధానంగా ఉపయోగించేవారు. ఇది సామ్రాజ్య అధికారాన్ని సూచించే శైలిగా గుర్తింపు పొందింది.
హైదరాబాద్‌లో CIB వారి పట్టణ పునరుద్ధరణ ప్రయత్నాలలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ఈ శైలిని నిజాం పాలనను ఇక్కడి భవనాలకు ఉపయోగించారు. ఈ నిర్మాణ శైలి లౌకికవాదాన్ని సూచిస్తుందని నమ్మేవారు. హైదరాబాద్ కట్టడాలలో కాకతీయ, కుతుబ్ షాహి, మొఘల్, అసఫ్ జాహి సంప్రదాయాల కలయికను ప్రధానాంశంగా తీసుకున్నారు. ఈ మార్కెట్లోని గ్రానైట్ నిర్మాణంలోనూ, ప్రముఖ తోరణాలు, కేంద్ర గోపురంలోనూ దీన్ని గమనించవచ్చు. ఇది భవనానికి గంభీరమైన, శాశ్వతమైన ఉనికిని ఇచ్చింది. సొగసైన తెల్ల గోపురాలు, స్పైరల్ మెట్లు, ఐకానిక్ క్లాక్ టవర్‌తో ఈ మార్కెట్ భవనం హైదరాబాద్ నగర చారిత్రిక సంపదలో భాగం అయింది. ఆ తెల్లటి గోపురాలు, బూడిద రంగు గ్రానైట్ రాళ్లు కనువిందు చేస్తాయి. మార్కెట్ ప్రవేశద్వారం దగ్గర ఆకట్టుకునే క్లాక్ టవర్‌తో త్రిభుజాకార రూపకల్పనను గమనించవచ్చు. ఈ గడియారానికి అప్పట్లోనే 7వేల రూపాయలతో కొనుగోలు చేశారట. దుకాణాలు, స్టాల్స్‌ను కలిగి ఉన్న ఆర్కేడ్లు, జాక్ ఆర్చ్‌లతో మద్దతు ఇవ్వబడిన ఫ్లాట్, టెర్రస్ పైకప్పు ఈ మార్కెట్‌కు రాజసాన్ని ఆపాదిస్తాయి. టెర్రస్ పైకి వెళ్లడానికి స్పైరల్ మెట్లు ఉన్నాయి.
మొదట పండ్ల మార్కెట్‌గా దీన్ని ప్రారంభించినా తాజా పండ్లతో పాటు, డ్రై ఫ్రూట్శ్, పువ్వులు, ఇతర (సుగంధ ద్రవ్యాలు), ధూపం, కుండలు, ఆయుధాలు, మందు గుండు సామగ్రి, పాన్, ఐస్ క్రీం, హుక్కాలు, కూడా ఇక్కడే టోకు (హోల్‌సేల్) ధరలకు అమ్మడం మొదలెట్టారు. సందర్శకులు ఒకప్పుడు ఇక్కడి నుండి గుచ్చి లేదా కాశ్మీరీ పుట్టగొడుగులను కొనుగోలు చేసేవారు, అప్పట్లో అవి ఈ మార్కెట్ లోనే దొరికేవి. వివిధ రకాల పాన్లు కూడా ఇక్కడ అమ్మేవారు. మోజంజాహి మార్కెట్ ఆ రోజుల్లో పెద్ద పాన్ బజార్‌గా గుర్తింపు పొందిందని స్థానిపుకు ఇప్పటికీ చెప్పుకుంటారు. సికింద్రాబాద్కీ పాత నగరానికి మధ్యన ఉన్న ఈ మార్కెట్ జంట నగరాల మధ్య అనుసంధాన బిందువుగా నిర్మించబడింది. ఈ ప్రదేశం నగరం నడిబొడ్డున ఉన్నందువల్ల అటు, ఇటు ఉండే ప్రజలకు అనువుగా ఉంటుందని మార్కెట్ కోసం ఈ స్థలాన్ని నిజాం ప్రభుత్వం ఎన్నుకుంది. నగరం ప్రతి మూల నుండి ప్రజలు ఈ మార్కెట్‌ను సులభంగా సందర్శించవచ్చనే ఆలోచనతో దీనిని నిర్మించారు. ముఖ్యంగా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నివసించే నిజాంల కోసం ఈ మార్కెట్ నుండి అన్ని రకాల పండ్లు కొనుగోలు చేసేవారు. ఇక్కడ ఉన్న పెషావరి పండ్ల దుకాణం అత్యంత ప్రసిద్ధ దుకాణాలలో ఒకటి.
నిజాం పాలనలో పండ్లతో పాటు, మార్కెట్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విక్రయించే ప్రదేశం కూడా ఇదే. నిజామ్లు వేటను ఆస్వాదించారు. ఈ మార్కెట్ నగరం మధ్యలో ఉన్నందు వల్ల, నిజాంలకు ఇక్కడ ఆగి ఆయుధాలు కొనడం సులభం అయేది. ఈ మార్కెట్‌కు దగ్గరగా నిజాంల అశ్వికదళం ఉండేది. దానితో ఇక్కడ ఆయుధాలు, మందుగుండు సామగ్రి దుకాణాలను ఉంచడానికి వారికిది అనుకులమైన ప్రదేశంగా అనిపించింది.
ఇప్పుడు, ఆ దుకాణాలన్నీ పోయాయి. అప్పటి అయుధాల విక్రయశాలలు ఇప్పుడు మాంసపు దుకాణాలుగా మారిపోయాయి. పాన్ దుకాణాలు మాయమయ్యాయి. 1980లలో ఇక్కడి పండ్ల మార్కెట్‌ను కొత్తపేట మార్కెట్‌కు, మరికొన్ని దుకాణాలను బేగమ్ బజార్, ఉస్మాన్గంజ్లకు మార్చారు. ప్రసిద్ధ జాంబాగ్ పూల మార్కెట్ మోజంజాహి మార్కెట్లో భాగంగా ఉండేది, కానీ దానిని 2009లో గుడిమల్కాపూర్ మార్కెట్‌కు మార్చారు.
అయినా ఇప్పడు కూడా ఈ మార్కెట్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశమే. మోజంజాహి మార్కెట్ ఉదయన్నే మేల్కొంటుంది. ఇక్కడ స్టాళ్లు సాధారణంగా ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ ప్రాంగణం స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదించేవారికి గమ్యస్థానం. అల్పాహారం, చిరుతిళ్ళు లేదా రాత్రిపూట రుచికరమైన వంటకాలు తినాలని కోరుకునేవారికి, మోజంజాహి మార్కెట్ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఈ మార్కెట్లో ఉంది. ఈ ఐస్ క్రీంకు ఎందరో అభిమానులున్నారు. హైదరాబాదీ యువతకు ఇది ఎంతో ఇష్టమైన చోటు. చాలా మంది ఇప్పుడు, ఫేమస్ ఐస్ క్రీం స్టోర్ విక్రయించే సహజమైన, స్థానికంగా తయారు చేసిన ఐస్ క్రీంల కోసం తరచుగా ఈ మార్కెట్‌కు వస్తూ ఉంటారు. 1951లో మొహమ్మద్ హలీమ్ ఈ ఐస్ క్రీం సెంటర్‌ను ప్రారంభించారు. ఇవి చేతితో తయారు చేసే ఐస్ క్రీంలు. పాలు, చక్కెరతో తాజా పండ్ల గుజ్జును ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. మామిడి, లిచీ, సపోటా, సీతాఫలం, అంజూర, పుచ్చకాయలతో సంవత్సరంలో వివిధ సమయాల్లో వైవిధ్యాన్ని అందించే కొన్ని కాలానుగుణ పండ్లు ఈ ఐస్ క్రీంల తయారీలో ఉపయోగిస్తారు. వీటిలో ఆధునిక ఐస్ క్రీంల క్రీమీనెస్ ఉండదు, కానీ చాలా సరసమైన ధరకు తాజా పండ్ల రుచులను అందిస్తాయి. 74 ఏళ్ల నాటి ఈ దుకాణం సరసమైన ధరలకు పండ్ల ఐస్ క్రీంలను అందించడం ద్వారా హైదరాబాదీలకు దగ్గరయింది. ఫేమస్ ఐస్ క్రీం షాప్ కాకుండా, బిలాల్, గఫూర్, షా వంటి ఇతర ఐస్ క్రీం విక్రేతల దుకాణాలు ఇక్కడే ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఏ పాత తరం వ్యక్తిని కదిలించినా, ఈ దుకాణాలలో ఒకదాన్ని తన కిష్టమైన దుకాణంగా పేర్కొంటారు. వీటిలో అసహజమైన రంగులు, ప్రిజర్వేటివ్స్ వాడరు. మార్కెట్ పక్కన ఉన్న బహిరంగ స్థలం ప్లాస్టిక్ కుర్చీలతో నిండి ఉంటుంది. సాయంత్రం పూట ఆ కుర్చీలలో కూర్చుని ఐస్ క్రేం సేవించడం, క్లాక్ టవర్ గడియారపు గంటలు వినడం. నిజాం శైలిలో కట్టిన ఆ గోడల సొగసును ఆస్వాదించడం ఓ చక్కని అనుభూతి. కొంత మంది భోజన ప్రియులు ఇంట్లో భోంచేసి డెజర్ట్ కోసం ఇక్కడకు రాత్రి పూట రావడం సర్వసాధారణం.
స్థానికంగా పాట్ ఐస్ క్రీంలు అని కూడా పిలువబడే ఐస్ క్రీంలు సాధారణంగా ఇక్కడే దుకాణాలలోనే తయారు చేస్తారు. వీటి ధర ₹ 35 వరకు ఉంటుంది. కాలక్రమేణా, నగరంలోని అనేక ఆధునిక ఐస్ క్రీం పార్లర్ల నుండి, అలాగే హైదరాబాద్‌లో ప్రారంభించబడిన జాతీయ ఐస్ క్రీం బ్రాండ్ల నుండి వస్తున్న పోటీ కారణంగా, కొన్ని దుకాణాలు ఫ్రోజెన్ డెజర్ట్‌లను కూడా అందించడం ప్రారంభించాయి. క్రమంగా మారుతున్న కాలంతో పాటు ఐస్ క్రీంల ఉత్పత్తి కూడా యాంత్రికంగా మారింది. చర్నింగ్ కోసం మోటారును ఉపయోగించడం మొదలయింది. కొన్ని ఉత్పత్తులు ఈ దుకాణాలకు దూరంగా ఏర్పాటు చేసిన కర్మాగారాల నుండి కూడా వస్తున్నాయి. అయినా, ఇప్పటికీ ఈ భవన చారిత్రిక సొగసును ఆస్వాదించడానికి, సంప్రదాయ పండ్ల ఐస్ క్రీంలను రుచి చూడడానికి, ముఖ్యంగా వేసవిలో, రంజాన్ మాసంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వస్తారు.
ఈ మార్కెట్ చుట్టూ అందమైన హుక్కాలు, అత్తర్లు, అత్తరు సీసాలు, ధూప సామగ్రి దుకాణాలు ఉన్నాయి. సరసమైన ధరలకు సువాసనలు వెదజెల్లే వందల రకాల అత్తరు సీసాలు, ధూపం కోసం అబరబత్తీలు, సాంబ్రాణి పొడులు ఎన్నో రకాల సువాసనలతో దొరుకుతాయి. హైదరాబాద్ వాసులు చాలా మంది ఇక్కడకు వచ్చి ఈ సామాను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎన్నో హిందూ పూజా గృహాలలో నేటికీ ఈ మార్కెట్లో కొన్న సాంబ్రాణి, ధూపాలనే ఉపయోగిస్తూ ఉంటారు. ఆ దుకాణాలలోని అందమైన సీసాలు, రంగు రంగుల అత్తరు బుడ్లను చూడడానికి వచ్చే సందర్శకులు ఎందరో. ఈ దుకాణాలు మార్కెట్ లోపలి నుంచి బైట ప్రాంగణంలోనూ నిండి ఉంటాయి. ఇందులో బైటికి కనిపించే రంగు రంగుల సీసాలు నిజామీ నవాబుల జీవనశైలిని గుర్తుకు తెచ్చే హుక్కాలు సాధారణ ఖరీదు నుండి వేల రూపాయలలోనూ దొరుకుతాయి.
ఈ అత్తరు దుకాణాలలో కొన్ని అతి పాత దుకాణాలు ఉన్నాయి. అవి 1951 నుండి మారుతున్న హైదరాబాద్ ప్రజా జీవనాన్ని గమనిస్తూ తమ ఉనికిని నిలుపుకుని ఉన్నాయి. ప్రత్యేకంగా ఆ దుకాణాలకే వచ్చి అత్తర్లు, సెంట్లు, స్ప్రేలు తీసుకుని వెళ్లే కుటుంబాలు ఎన్నో. తాము మూడు తరాల కుటుంబాలకు తమ సేవలను అందిస్తున్నామని ఈ దుకాణదారులు గర్వంగా చెప్పుకుంటారు.
ఈ దుకాణాలన్నిటికి ముందు ప్రదర్శనకు పెట్టిన రంగు రంగు సీసాలు వింత ఆకారాలలో మనకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం 15 కోట్లతో మొజంజాహి మార్కెట్ కాంప్లెక్స్ పునరుద్ధరణ చేసింది. ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఆకర్షించేలా క్లాక్‌టవర్‌ను తీర్చిదిద్దడంతోపాటు, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎగురవేసేలా వంద ఫీట్ల భారత జాతీయ జెండాను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని 2020, ఆగస్టు 14న రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, మొజంజాహి మార్కెట్ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేశారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నడపాలనే ప్రతిపాదన కూడా జరిగింది. 2021లో ప్రఖ్యాత ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్‌కు ఈ వేదిక ఆతిథ్యం ఇచ్చింది.
ఈ మార్కెట్ ఎదురుగా ఒక స్వీట్ షాప్ ఉంది, అక్కడ రుచికరమైన గుమ్మడికాయ హల్వా దొరుకుతుంది. మార్కెట్ లోపల కట్ నోట్స్ అంటే చిరిగిన కరెన్సీ నోట్లను ఎక్సేంజ్ చేసే ఓ షాప్ కనిపించింది. డిజిటల్ కరెన్సీకి అలవాటు పడుతున్న తరంలో ఈ షాపు ఇంకెన్నాళ్లు ఆ ప్రాంగణంలో ఉంటుందో కాని అక్కడ కొందరు వచ్చి నోట్లు మార్చుకోవడం చూడడం అపురూపంగా అనిపించింది. ఇక్కడికి సమీపంలోనే కరాచీ బేకరి కూడా ఉంది.
హైదరాబాదీయులకు ఎంతో ఇష్టమైన ఈ మార్కెట్ స్కేల్డ్ వెండి నమూనా పురాని హవేలి మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. 1950 నుంచి ఇప్పటికీ కబాబ్ లను అందుస్తున్న మరో దుకాణం ఈ మార్కెట్ చరిత్రను గుర్తు చేస్తూ నిలిచే ఉంది.
