[‘ఆదాబ్ హైదరాబాద్’ అంటూ హైదరాబాద్‌లో ముఖ్యమైన పెంపుడు పక్షులు, జంతువుల మార్కెట్ ‘ముర్గీ బజార్’ని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి గారు ఈ రచనలో.]
~
హైదరాబాద్‌లో ముఖ్యమైన పెంపుడు పక్షులు, జంతువుల మార్కెట్ – ముర్గీ బజార్
మెహబూబ్ చౌక్ దగ్గరే లాడ్ బజార్‌కు కాస్త దూరంలో ఉన్న మార్కెట్ ముర్గీ బజార్. ఈ బజార్ కారణంగా దీన్ని ముర్గీ చౌక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వరస దుకాణాలలో రంగు రంగుల పక్షులు, కుందేళ్లు, పిల్లులు కనువిందు చేస్తాయి. నిజానికి ఇది కోడి మాంసం అమ్మే విక్రయ కేంద్రంగా మొదలయిందని అంటారు. కాని మెల్లిగా పెంపకానికి పనికొచ్చే పక్షులను అమ్మే దుకాణాలు ఇక్కడ వెలిసాయి. ఈ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి అక్కడ దుకాణదారులను కలవడానికి నాలుగైదు సార్లు వెళ్లవలసి వచ్చింది. వీళ్లేవరూ మాట్లాడడానికి ఇష్టపడలేదు. పైగా వారి ప్రెసిడెంట్ అనుమతిస్తేనే ఆ బజారు గురించి మాట్లాడతాం అన్నారు. రెండు మూడు సార్లు వెళ్లి అక్కడివారిని కలిసినా ఎవరూ కనీస ప్రాథమిక సమాచారం ఇవ్వడానికి కూడా సముఖత చూపలేదు. ఏవో అంతర్గత రాజకీయాలు కావచ్చు అనుకున్నాను. అయినా పట్టు వదలక చార్మినార్ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా అక్కడ బజారులో ఓ రౌండ్ నడిచి ఎవరైనా ఆ బజారు గురించి చెప్తారేమో అని చూసేదాన్ని. ఒక అరడజను సార్లు వెళ్లాక అనుకోకుండా ఒక రోజు ఓ నలుగురు దుకాణదారులతో మాట్లాడగలిగను. అప్పుడు కాని వారెందుకు సాధారణ సమాచారం ఇవ్వడానికి కూడా వెనుకంజ వేస్తున్నారో అర్థం కాలేదు.
ఆ ప్రాంతంలో పక్షుల అమ్మకం రెండొందల సంవత్సరాల నుండే మొదలయ్యిందని ఒకరు చెప్పారు. ఐదు తరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్న వాళ్లూ అక్కడ ఉన్నారట. నిజాం కాలంలో పక్షులను పెంచుకోవడం ఒక హాబీగా ఉండేది. ఈ వ్యాపారానికి నిజాం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలనుండి వ్యాపారస్థులను పిలిపించారట. ఆ రోజుల్లో పక్షులను బహుమతిగా ఇవ్వడం, ఖరీదైన పంజరాలలో వాటిని ఉంచి పెంచుకోవడం ఓ రాచరికపు హోదాగా కూడా ఉండేది. విదేశాలనుండి పక్షులు అక్కడకు తీసుకొచ్చేవారు. మన దేశంలో దొరకని అరుదైన పక్షులను వేరే దేశాలనుండి తెప్పించి వాటి సంతతిని పెంచేవారు వ్యాపారస్థులు. దీన్ని బ్రీడింగ్ అంటారు. ఈ పక్షుల వ్యాపారం రెండు దశలుగా సాగుతుంది. మొదట బ్రీడర్స్ పక్షులను జత కట్టించి వాటి సంతానాన్ని బలం వచ్చే దాకా వారి వద్దే ఉంచుకుని తరవాత దుకాణాలకు అమ్మేస్తారు. దుకాణదారులు కూడా తమ కస్టమర్లు కోరిన పక్షులను వారికి అందించే ప్రయత్నం చేస్తారు. ఒకో జాతి జంతువుకు, పక్షులకు బ్రీడర్లు వేరేగా ఉంటారు. వీరు అందించిన జీవాలను అమ్మడం దుకాణాలలో దుకాణదారులు చేస్తారు.
ప్రస్తుతం ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలకు పక్షులను, పెంపుడు జంతువులను పంపే సౌకర్యం ఉంది. బస్‌లో ఎక్కువగా వేరే ప్రాంతాలకు వీటిని పంపిస్తారు. బాతులు, టర్కీలు లాంటివి రైలులో కూడా పంపే వెసులుబాటు ఉంది. చాలా మంది హోల్‌సేల్ ధరలకు ఇక్కడ పక్షువులను కొనుగోలు చేసి ఆ తరవాత వాళ్ళే బ్రీడర్లుగా మారి తమ ఇంట చిన్న వ్యాపారాలు చేస్తున్నారట కూడా. 2002 లో వచ్చిన చట్టాల దృష్ట్యా ఇప్పుడు వేరే దేశాలకు ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ వ్యాపారాలను భారత ప్రభుత్వం నిషేధించింది. విదేశాల నుండి ఇంతకు ముందు వచ్చిన బ్రీడ్ పక్షుల సంతానాన్నే బ్రీడర్లు జాగ్రత్తగా దుకాణాలకు చేరవేస్తున్నారు. చిన్న చిన్న కోడి పిల్లలు పది రూపాయలు నుండి మొదలయి లక్షలలో విభిన్న పక్షుల వ్యాపారం సాగుతుంది.
ఈ బజార్ లోనే రకరకాల పంజరాలు, ఆ పెంపుడు జంతువులకు సంబంధించిన ఆహార విక్రయాలు జరుగుతున్నాయి. నాకు ఈ సమాచరం ఇచ్చిన వ్యక్తి పేరు గౌసుద్దీన్. ఈయన దుకాణం ఆ స్థానంలో యాభై ఏళ్లుగా ఉంది. ఇలాంటి బజార్లు దేశంలో ప్రముఖ నగరాలన్నిటిలోనూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఇదంతా లీగల్‌గా జరిగే వ్యాపారమే అయినా యానిమల్ రైట్స్ ఉద్యమాలు వచ్చిన తరవాత తమపై ఆంక్షలు పెరిగాయని అందువల్ల తాము ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడట్లేదని చెప్పారు గౌసుద్దీన్.
నిజానికి యానిమల్ రైట్స్ వాళ్లు సూచించే విధంగా వ్యాపారం చేయాలంటే ఓ పెద్ద పంజరంలో ఓ నాలుగు పక్షులను మాత్రమే పెట్టి అమ్మాలని కాని అలా అయితే తాము దివాళా తీయాల్సి వస్తుందని అందుకే వీలయినంత లీగల్‌గా పని చేస్తూనే కొన్ని సార్లు కొన్ని నియమాలు సడలించుకుంటున్నాం అని దాని కోసమే కొత్తవారితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడం అని చెప్పారు గౌసుద్దీన్. పైగా తమ దగ్గర, బ్రీడర్స్ దగ్గర విలువైన అంతర్జాతీయ పక్షుల వ్యాపారం సంబంధంలో ఇంకా జాగ్రత్తలు అవసరం అని, అక్కడ లీగాలిటీ పట్ల జాగ్రత్త వహించాలని, కొన్ని లొసుగులు ఉంటాయాని దానికి జాగ్రత్త పడవలసి వస్తుందని చిరునవ్వుతో బదులిచ్చారు.
బ్రీడింగ్‌కి చలికాలం అనుకూలమైన సమయం. అప్పుడు చాలా జాగ్రత్తగా బ్రీడర్స్ తమ దగ్గర ఉన్న జాతి పక్షులు జంతువులు పెట్టే పిల్లలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తరవాత ఎండాకాలంలో విక్రయాలు ఎక్కువగా జరుగుతాయట. పిల్లల సెలవులు కావచ్చు ఎక్కువ మంది ఎండాకాలంలో వచ్చి పక్షులను కొనుక్కుని వెళుతుంటారు. ఆ వీధిలోనే 55 షాపులు ఉన్నాయి. మొత్తం హైదరాబాదులో రెండు వందల దాకా పెట్ షాప్స్ ఉంటాయని చెప్పారు గౌసుద్దీన్. ఇప్పుడు కేవలం పక్షుల అమ్మకాలపై జరుగుబాటు సాగదని అందుకే చాలా మంది దుకాణదారులు బ్రీడర్స్ గానూ పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని చెప్పారాయన.
ఇక్కడ కేవలం పక్షులే కాదు, కొన్ని పత్యేకమైన జాతుల పిల్లులు, కుందేళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. వన్యప్రాణుల అధికారుల తనిఖీలు ఇక్కడ మామూలే. ప్రసిద్ధ కళ్యాణి బిర్యానీ 1950లలో చౌక్ ప్రాంతంలోని స్థానిక దర్గా వెనుక ఏర్పాటు చేయబడిన స్టాల్‌లో ఉద్భవించిందని చెబుతారు.
అనేక సంవత్సరాలుగా పరిపాలనా ఉదాసీనత, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల, ఈ మార్కెట్ వారసత్వ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. 2023లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) అసలు నిర్మాణ సౌందర్యాన్ని నిలుపుకుంటూ కొత్త, ఆధునిక మార్కెట్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి పాత మార్కెట్ నిర్మాణాన్ని కూల్చివేసే పనిని ప్రారంభించాయి. ఈ ప్రాజెక్ట్ దుకాణాల సంఖ్యను పెంచడం, సరైన డ్రైనేజీ వ్యర్థాల శుద్ధితో సహా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ సమయంలో దుకాణదారులను తాత్కాలికంగా పక్కనే మరో చోటకు మార్చారు.
ఇండియన్ రోలర్ అంటే మన పాలపిట్ట. దీని చుట్టూ ఓ మూఢ నమ్మకం ఉంది. దసరా రోజున దీనిని చూడటం వల్ల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. ఒక వ్యక్తి దీన్ని చూసి ఏదైనా కోరిక కోరుకుంటే, ఆ పక్షి తన కోరికను కైలాస పర్వతంపై ఉన్న నీలి గొంతు కలిగిన శివుని వద్దకు తీసుకెళ్తుందని, ఆయన ఆ కోరికను తీరుస్తాడని చాలా మంది నమ్ముతారు. ఐదు భారతీయ రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, బీహార్ ప్రజలు ఈ నమ్మకంతో ఉంటారు.
ఆ సమయంలో మన ముర్గీ బజార్‌లో ఈ పక్షులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పండుగకు దాదాపు ఒక నెల ముందు నుంచే ఈ పక్షులను బంధించడం ప్రారంభిస్తారు. చాలా మంది ఈ పక్షులను హైదరాబాద్‌లోని ముర్గీ బజార్ నుండి కొని, తర్వాత వదిలివేస్తారు. తక్కువ ధనవంతులు పంజరంలో ఉన్న పక్షిని లేదా ‘పక్షి మంత్రగాడి’ చేతిలో ఉన్న టవల్ కింద ఉన్న పక్షిని చూసే అవకాశం పొందుతారు. అయితే అలా ప్రజల మూఢ నమ్మకాల కోసం పట్టుకున్న ఈ పాలపిట్టలు ఎక్కువ కాలం జీవించవు. ఇవి పంజరంలో ఉండి ఆహారం తినవు. ప్రజల భక్తి కోసం వాటిని పంజరంలో బంధించడంతో అవి లోపల ఎంత బలవంతం చేసినా తిండి తినకుండా అలాగే ఉండిపోతాయి. వీటినీ ఎవరో కొని వదిలివేస్తే అప్పటికే బలహీనపడి ఉండడంతో ఇవి త్వరగా చనిపోతాయి.
మరి కొందరు పక్షులను పంజరం నుండి విడిపించడంతో పుణ్యం వస్తుందనే భావంతో ఈ బజార్‌కు వచ్చి పక్షులను కొని వదిలేస్తూ ఉంటారట. ఇలా ఎన్నో రకాల నమ్మకాలు ఈ పక్షుల అమ్మకాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి. హిందువుల అంతక్రియలప్పుడు చనిపోయిన వ్యక్తి మంచి రోజున ప్రాణం వదలలేదని, పాడెకు నల్ల కోళ్ళను కట్టి తీసుకువెళ్లడం కూడా ఉంది. దాని కోసం ప్రత్యేకంగా నళ్ల కోళ్లు అమ్మే దుకాణాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
