[1969 నాటి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
‘ఆదర్శ కుటుంబం’ (1969) కథ పైపైన చూస్తే ఈనాటి సమాజానికి అతకదు అనే అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉమ్మడి కుటుంబం, పెద్ద కొడుకు కష్టపడుతుంటే అందరూ కూర్చుని తినటం, తలిదండ్రులు పరువు కోసం ఆడంబరాలకు పోవటం వంటివి ఉంటాయి. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. ఉన్నా పిల్లలందరూ కష్టపడుతున్నారు. ఆడంబరాలు మాత్రం తగ్గలేదు. పరువు కోసం కాదు, పోటీ కోసం. ఈ చిత్రంలో చూపించిన ముఖ్యవిషయం కుటుంబంలో కానీ, సమాజంలో కానీ అసూయలు పెరిగిపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని. ఈ రోజుల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కారణమయితే, ఆస్తి వ్యవహారాలు మరో కారణం. ప్రేమ వ్యవహారాల గురించి ఈ చిత్రంలో స్పృశించలేదు. ఆస్తి వ్యవహారాల వల్ల రగిలిన ద్వేషాన్ని చూపించారు. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు కదా అని ఈ చిత్రాన్ని తేలికగా తీసిపారేయవద్దు. ఇందులో సంఘటలను చూస్తే నేరప్రవృత్తి ఎలా పెరుగుతుందో తెలుస్తుంది. అప్పట్లో ఇది పెద్ద షాక్‌లా అనిపించినా ఇప్పటి సమాజానికి దర్పణంలా అప్పుడే ఎలా తీశారో అనిపిస్తుంది. ఒక నీతిపాఠంలా ఉపయోగపడుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.
రాఘవేంద్రరావు (నాగయ్య), రాజ్యలక్ష్మి(హేమలత) దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పట్టాభి (గుమ్మడి) కష్టపడి వ్యవసాయం చేస్తుంటాడు. అతని భార్య జానకి (అంజలీదేవి). ఇంటి పనంతా ఆమే చేస్తుంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. రెండో కొడుకు ప్రకాశం (నాగభూషణం) పంచాయితీ ప్రెసిడెంటు. పదవీకాంక్ష ఎక్కువ. పలుకుబడి పెంచుకోవటానికి సొంత డబ్బు – అంటే అన్నగారు సంపాదించిన డబ్బు – ఖర్చు చేస్తూ ఉంటాడు. ఎలక్షన్లలో కూడా ఆ డబ్బే. ఇప్పటి నాయకుల్లా ప్రజల సొమ్ము తినటం అతనికి చేతకాదు. ప్రజల సొమ్ము అభివృద్ధి పనులకే వాడతాడు. అతని భార్య జయ (ఎస్. వరలక్ష్మి). వారికో కొడుకు. ఇంటికంతా మగ వారసుడు తన కొడుకే అని ఆమెకి దర్పం. ఇంటిపని చేయదు. మూడో కొడుకు ప్రతాప్ (భీమరాజు) వస్తాదు. కుస్తీ పోటీలకి వెళుతూ ఉంటాడు. సంపాదన లేదు. తిండి మాత్రం సుష్టుగా తింటాడు. అతని భార్య రమ (గీతాంజలి). భార్యతో శృంగారం నెరిపితే శరీరంలో పటుత్వం తగ్గిపోతుందని అతని భావన. ఆ భార్య మౌనంగా భరిస్తూ ఉంటుంది. నాలుగో కొడుకు ప్రసాద్ (అక్కినేని). చదువుకుంటున్నాడు. పెళ్ళి కాలేదు. మెడిసిన్ చదువుకున్న సరోజ (జయలలిత)ని ప్రేమించాడు. ఆ ఇంటి ఆడపడుచు చంద్ర (అనిత). ఆమె భర్త సూర్యం (పద్మనాభం). తల్లి (సూర్యకాంతం) పోరు పడలేక భార్యని తీసుకుని అత్తవారింటికి వచ్చేస్తాడు. ఏదైనా వ్యాపారం చేద్దామని అతని కోరిక. రాఘవేంద్రరావు తమ్ముడి కొడుకు తలిదండ్రులు లేక ఆ ఇంట్లో ఉంటాడు. అతను చిన్నబ్బాయి ప్రసాద్ కంటే చిన్నవాడు. మూగవాడు.
పెద్దకొడుకు పట్టాభి తన మరదళ్ళు బట్టలు, ఇతర సరదాల కోసం చేసే బాకీలు కూడా మారుమాట్లాడకుండా తీరుస్తూ ఉంటాడు. ఇంటి ఖర్చులు సరేసరి. అతని భార్య జానకి తన మరుదుల అవసరాలు కూడా తీరుస్తూ ఉంటుంది. పెద్ద మరిది కొడుకుని కూడా ప్రేమగా సాకుతుంది. ఆమెకి తన పెదనాన్న కూతుర్ని ఆ ఇంటి చిన్న కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. కానీ చిన్నబ్బాయి ప్రసాద్‌కి ఆ ఇంటి పరిస్థితి తెలుసు. అన్నగారు ఎంతగా నలిగిపోతున్నాడో తెలుసు. వదినలు ఎలా ఎడమొగం పెడమొగంగా ఉంటారో తెలుసు. దానికి తోడు చిన్న వదినలు కూడా తమ చెల్లెళ్ళని ఆ ఇంటి చిన్నకోడలుగా తీసుకురావాలని పోటీ పడుతుంటారు. వారి పోరు పడలేక “ఈ నరకంలోకి ఇంకొకరిని తీసుకురావటం ఎందుకు?” అని వదినల మొహం మీదే అనేస్తాడు. ప్రియురాలు సరోజతో తన ఇల్లు నరకమని చెప్పి వాపోతాడు. ఆమె “నేను ఆ ఇంటిని బాగు చేస్తాను” అంటుంది. తలిదండ్రులు ఆడంబరాలకు పోయి ఖర్చు తడిసి మోపెడు అవుతుందని ప్రసాద్ సరోజని రెజిస్టర్ పెళ్ళి చేసుకుంటాడు. సరోజకున్నది తాతగారు (రమణారెడ్డి) ఒక్కరే. ప్రసాద్ సరోజని తీసుకుని ఇంటికి వస్తాడు. పెద్దవాళ్ళు చీవాట్లేసినా తర్వాత సర్దుకుంటారు.
ఇదిలా ఉండగా పెద్ద కోడలు జానకి మళ్ళీ గర్భవతి అవుతుంది. కొడుకు పుట్టాలని ఆమె కోరిక. రెండో కోడలు జయ “ఈమె ఆడపిల్లల్ని కంటూ పోతే ఆస్తి ఏం మిగులుతుంది?” అని సరోజ దగ్గర ఆడిపోసుకుంటుంది. జానకికి కొడుకు పుట్టకూడదని ఆమె కుత్సితబుద్ధి. మూడో కోడలు రమ ఆమె వెళ్ళగానే “వీళ్ళాయన ఎలక్షన్లకి వేలకి వేలు గుమ్మరిస్తాడు. ఖర్చు సంగతి ఈవిడ చెప్పొచ్చింది” అంటుంది సరోజతో. సరోజ జానకితో మాట్లాడితే “ఎందరికి కళ్ళు కుడుతున్నాయో. ఇదంతా మేమే తినిపోతున్నట్టు” అని బాధపడుతుంది. వారి చాడీలు, అసూయలు, ద్వేషాలు చూసి సరోజ ఆశ్చర్యపోతుంది. ప్రసాద్ నవ్వుతాడు. “వీళ్ళందరూ కలిసి సమస్యలు చర్చించుకుంటే సరిపోతుంది” అని సరోజ కోడళ్ళ సమావేశం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు గట్టి పిండాలు. ఒకరి ఎదుట ఒకరు బయటపడరు. దాచుకోవటమే ఆడదానికి మర్యాద అంటుంది జానకి. “మనుషులన్న తర్వాత ఏవో కోరికలు కొరతలు ఉంటూనే ఉంటాయి” అని వేదాంతం చెబుతుంది జయ. “ఇక్కడ ఎవరేం బావుకుంటున్నారని?” అంటుంది తెలివిగా రమ. వారెవరూ పెద్దగా చదువుకోలేదు, కానీ వారి తెలివితేటలు ముందు సరోజ చదువు ఎందుకూ పనికిరాదు. ఆమె సంధి ప్రయత్నాలకి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది.
పట్టాభి, జానకిల పెద్ద కూతురికి ఒక పెళ్ళి సంబంధం వస్తుంది. కట్నం, ఖర్చులు కలిపి లక్ష రూపాయలు అవుతుందని తేలుతుంది. ఈ సంగతి జయకి తెలిసి తమ పురోహితుడి చేత ఆ అమ్మాయికి సుమంగళి యోగం లేదని ప్రచారం చేయిస్తుంది. మగపెళ్ళివారు వెనక్కి వెళ్ళిపోతారు. పట్టాభి, జానకి కుమిలిపోతారు. జానకి గర్భవతి కావటంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. సరోజ ఆమెని పరీక్షిస్తుంది. మళ్ళీ గర్భం ధరిస్తే ఆమెకి ప్ర్రాణాపాయమని తెలుస్తుంది. ప్రసాద్ పోత్సాహంతో ఆమె పట్టాభితో “మీరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది” అని చెబుతుంది. పట్టాభి కూడా ఆమె డాక్టర్ హోదాలో చెబుతోందని అర్థం చేసుకుంటాడు. ఆరోజుల్లో ఇలాంటి సన్నివేశం సినిమాలో పెట్టడం సాహసమే. నిర్మాతని, దర్శకుడిని అభినందించాలి. పట్టాభి ఆపరేషన్ చేయించుకుంటాడు. తర్వాత జానకికి చెబుతాడు. ఆమె దేవుడి మీదే భారం వేస్తుంది. నెలలు నిండుతాయి. మగపిల్లవాడు పుడతాడు కానీ పురిటిలోనే మరణిస్తాడు. జానకి ఇంకా కుంగిపోతుంది. ఆమెకి కొడుకు పుట్టకూడదని జయ కోరుకుందని చాకలి ఆమె ద్వారా జానకికి తెలుస్తుంది. అప్పట్లో పని మనుషులే వార్తలు మోసేవాళ్ళు.
మరోపక్క జయ కొడుకు తాను మగవాడినని, తానే గొప్ప అని జానకి కూతుళ్ళని ఏడిపిస్తాడు. అన్నీ తల్లి నేర్పించిన బుద్ధులే. ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రాంతాల్లో మగపిల్లలు గొప్ప అని, ఆడపిల్లలు అణిగిమణిగి ఉండాలని తల్లులు నేర్పిస్తూ ఉంటారు. కట్టుబాట్లు మంచివే. అవి మగపిల్లలకి కూడా ఉండాలి. ఆడపిల్లలని గౌరవించటం నేర్పించాలి. ఇంటి పనులు అందరూ సమానంగా చేసేలా చూడాలి. సరోజ పిల్లలందరూ సమానమే అని చెబుతుంది. ఈ మొత్తం వ్యవహారం జానకికి మనోవేదన పెంచుతుంది. మరోపక్క పురోహితుడు జానకి కూతురికి సుమంగళి యోగం లేదని చేసిన ప్రచారం మూడో కొడుకు ప్రతాప్‌కి తెలుస్తుంది. అతను పురోహితుడిని ఇంటికి లాక్కువస్తాడు. పురోహితుడు పట్టాభికి, జానకికి నిజం చెబుతాడు. జయ తన చేత అలా చెప్పించిందని చెప్పి వారి కాళ్ళు పట్టుకుంటాడు. పట్టాభి ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అందరికీ చెబుతాడు. జానకి కోపం పరాకాష్ఠకి చేరుకుంటుంది. పట్టాభి “మనం ఇంటికి పెద్దవాళ్ళం. సర్దుకుపోవాలి” అంటాడు. అప్పట్లో ఇంటికి పెద్దకొడుకులంటే భారమంతా మోసేవారు. తప్పులన్నీ కాసేవారు.
దీపావళి పండగ వస్తుంది. జానకి జయ కొడుక్కి ఇచ్చే పాయసంలో విషం కలుపుతుంది! కుటుంబకలహాలు సహనవంతులని కూడా కర్కశులుగా ఎలా మార్చేస్తాయో ఈ సంఘటన చూపిస్తుంది. నిజానికి జానకి జయ కొడుకుని ప్రేమగా సాకింది. కానీ తనకి, తన బిడ్డకి జరిగిన అన్యాయానికి ఆమె మనసు పాషాణంగా మారిపోయింది. ఆమెలోని నేరప్రవృత్తికి ముఖ్యకారణం పట్టాభి. జయ చేసిన పని తెలిసి కూడా దాచటం అతను చేసిన తప్పు. దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసి తల్లి గాంధారి కూడా అతన్ని వెలివేయమని చెప్పింది. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. మహాయుద్ధం వచ్చింది. అన్యాయాన్ని ఎదుర్కోకపోతే అది వినాశనానికి దారి తీస్తుంది. పట్టాభి జయ చేసిన పని తలిదండ్రులకి చెప్పి ఆమెని, ఆమె భర్తని బయటకి పంపిస్తే ఇంత దారుణం జరిగేది కాదు. కానీ అప్పట్లో కుటుంబప్రతిష్ట అని ఉమ్మడిగానే ఉండేవారు. ఆడవాళ్ళు నలిగిపోయేవారు. ఇప్పుడు కూడా ఆస్తి కోసం నేరప్రవృత్తులు పెరుగుతున్నాయి. వాటిని మొగ్గలోనే తుంచేయాలి. జయ భర్త ప్రకాశానిది కూడా తప్పు ఉంది. భార్య చేసే అక్రమాలు ఆపకపోవటం అతని తప్పు. ఎటూ దారి లేక జానకి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అమాయకుడైన పసి పిల్లవాడిని చంపకూడదనే జ్ఞానం లేకుండాపోయింది. నేరం చేసేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నేరం రుజువైతే శిక్ష తప్పదు. జానకి మరో ఆలోచన చేసి ఉండవచ్చు. భర్తకి నచ్చజెప్పి వేరుగా వెళ్లిపోయి ఉండవచ్చు. కానీ తలిదండ్రులని వదిలి పెద్దకొడుకు వెళ్ళటం అప్పట్లో పరువు తక్కువగా భావించేవారు. జానకి తన కూతురికి జరిగిన అన్యాయం లాగే జయ కొడుకు హత్య కూడా బయటపడకుండా ఉంటుందని అనుకుంది. కానీ ఒక ప్రాణం తీయటం మాత్రం క్షమించరాని నేరం. అదీ పసి ప్రాణం. మనిషి ఎలాంటివాడైనా పరిస్థితుల వల్ల అతని ప్రవృత్తి మారిపోతుంది అనేది నిజం.
అదృష్టవశాత్తూ మూగ అబ్బాయి జానకి పాయసంలో విషం కలపటం చూస్తాడు. పాయసం గ్లాసు పడగొట్టేస్తాడు. ఆ పాయసం ఒక వీధి కుక్క తిని చనిపోతుంది. అది చూసి ఇంటిలో అందరికీ పాయసంలో విషముందని తెలుస్తుంది. కానీ ఎవరు కలిపారో తెలియదు. సరోజ మూగ అబ్బాయికి చదువు నేర్పింది. ఆమె, ప్రసాద్ అడగటంతో అతను జానకే విషం పెట్టిందని పలక మీద రాసి చూపిస్తాడు. వారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మరోపక్క జానకి అపరాధభావంతో సతమతమవుతుంది. క్షణికావేశంలో చేసిన నేరాలకి శిక్ష పడకపోయినా క్షోభ తప్పదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి అన్యాయాన్ని భరించాలా? జానకి అత్తమామల దగ్గరకి వెళ్ళి జయ చేసిన అకృత్యం చెబితే అదో దారి. వారు ఏమైనా చేసేవారేమో. ఒకప్పటి అగ్రనటి అయిన అంజలీదేవి నేరం చేసే జానకి పాత్రని చేయటం ఆమె ఔన్నత్యమనే చెప్పాలి. మంచివాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కర్కశంగా మారతారో చూపించిన ఈ కథ అందరికీ ఒక నీతిపాఠంలా ఉపయోగపడాలి. పరువు, ప్రతిష్ఠ అంటూ అన్యాయాన్ని సహించకూడదు. ఇంట్లో వాళ్ళు సాయం చేయకపోతే పెద్దమనుషుల సాయం తీసుకోవచ్చు. ఇక్కడ జానకి చేసిందే నేరం. జయ చేసింది చట్టరీత్యా నేరమని నిరూపించటం కష్టం. పెద్దమనుషులైతే సరైన తీర్పు చెపుతారు. అదే మధ్యవర్తిత్వం వల్ల ఉన్న ప్రయోజనం. కానీ ఇంటిగుట్టు బయటపడకూడదు అనుకుంటే కష్టం. గుట్టు ఎంతవరకో అంతవరకే.
ఇక్కడ ఒకే సన్నివేశంలో జానకికి ఇద్దరితో భావోద్వేగపూరితమైన సంభాషణలు జరుగుతాయి. ఒకరు జయ కొడుకు. మరొకరు పట్టాభి. జయ కొడుకు జానకి దగ్గరకొచ్చి “పెద్దమ్మా. నాకు ఎవరో విషం పెట్టారట. నేను చచ్చిపోయేవాడినట” అంటాడు. జానకి అతణ్ని హత్తుకుని “నువ్వు నా ఆయుష్షు కూడా పోసుకుని వందేళ్ళు బ్రతుకుతావు” అని ఏడుస్తుంది. పట్టాభి ఆమెని ఓదారుస్తాడు. ఆమె అతణ్ని పక్కకి తీసుకువెళ్ళి “విషం ఎవరు పెట్టారో నాకు తెలుసు. మీకు చెబుతాను” అంటుంది. అతను “నాకు చెప్పొద్దు” అంటాడు. చెప్పుకునేవారు కూడా లేక ఆమె మరింత కుమిలిపోతుంది. ఇదే పెద్ద శిక్ష.
ప్రసాద్ ఈ అసూయలతో కలిసి ఉండే కంటే విడిపోవటమే మంచిదంటాడు. తలిదండ్రులు, అన్నలు ఒప్పుకోరు. ముసలివాళ్ళు, పట్టాభి ఒప్పుకోకపోవటానికి కుటుంబగౌరవం, సంప్రదాయం కారణమైతే ప్రకాశం, ప్రతాప్ ఒప్పుకోకపోవటానికి వారి స్వార్థమే కారణం. విడిపోతే వచ్చే వాటా ఎలక్షన్లకే సరిపోతుందని ప్రకాశం, పండక్కి కుస్తీ పోటీల ఖర్చు నెత్తి మీద పడుతుందని ప్రతాప్ భార్యలతో అంటారు. ఎప్పుడూ డబ్బే గెలుస్తుంది. వారి భార్యలు కూడా విడిగా ఖర్చులు భరించలేమని ఒప్పుకుని కలిసి ఉండటానికే నిశ్చయించుకుంటారు. విషప్రయోగం జరిగి ప్రాణం మీదకు వచ్చినా డబ్బు కోసం రాజీ పడతారు. అందుకే డబ్బుకి లోకం దాసోహం అన్నారు.
సరోజ తాను ఆ కుటుంబాన్ని కలపటంలో ఓడిపోయానని బాధపడుతుంది. ప్రసాద్ “విడిపోవాలని అందరికీ ఉంది. కానీ బయటపడటం లేదు. వేరే మార్గం చూడాలి” అంటాడు. ఆస్తి ఉందని అందరూ కలిసి ఉన్నారు. అదే లేకపోతే? అంటే అటు నుంచి నరుక్కురావటమన్న మాట. ప్రసాద్ తాగుబోతులా మారినట్టు నాటకమాడతాడు. తాగిన మైకంలో ఒక నాట్యకత్తెతో చిందులేసినట్టు నటిస్తాడు. పట్టాభి ఇది తెలిసి అతన్ని కొడతాడు. జానకి అడ్డుపడుతుంది. జయ, రమ మాత్రం “తాగుడు అలవాటయింది. మిగిలినవి రాకుండా ఉంటాయా? తగలెయ్యనీ. ఉమ్మడి ఆస్తేగా” అనుకుంటారు. సరోజ విని బాధపడుతుంది. కానీ నాటకం ప్రయోజనం నెరవేరాలని మిన్నకుంటుంది.
సరోజ తాతగారు ఒకరోజు వస్తాడు. ఆయనెవరో ప్రసాద్‌కి, సరోజకి తప్ప ఎవరికీ తెలియదు (ఇది కొంచెం అసమంజసంగా ఉంటుంది.) ప్రసాద్ తన దగ్గర అప్పు తీసుకున్నాడని, అది ఆస్తిలో అతని వాటా కంటే ఎక్కువ అయిందని, తన అప్పు తీర్చమని గద్దిస్తాడు. ఇదంతా నాటకంలో భాగమే. ప్రసాద్ తాను అప్పు చేసిన మాట వాస్తవమే అంటాడు. ఏమి వచ్చినా కుటుంబమంతా భరించాలని తండ్రి అంటాడు. అయితే అప్పు తీర్చటానికి ఇంటితో సహా ఆస్తి అమ్మేయాలని తెలుస్తుంది. అమ్మెయ్యమని తండ్రి అంటాడు. ఆస్తి అంతా సరోజ తాతగారికి అప్పగించి అందరూ తలోదారిన వెళ్ళిపోతారు. ప్రకాశం, ప్రతాప్ కూడా తమ వాటా అడిగితే ‘మంచిరోజుల్లో ఉమ్మడి ఆస్తి తిని ఇప్పుడు వాటాలు అడుగుతారా?’ అంటారని కిక్కురుమనకుండా ఊరుకుంటారు. కుటుంబం ముక్కలైపోతుంటే పట్టాభి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ముసలివాళ్ళని పురోహితుడు రామాలయంలో ఉండమని ఆహ్వానిస్తాడు. ముసలివాళ్ళు అక్కడికి వెళతారు. పెద్దాయన “ఈ వయస్సులో, ఈ రూపంలో ఆ రాముడు తన దగ్గరకి మనల్ని రప్పించుకుంటున్నాడేమో” అని భార్యతో కలిసి అక్కడికి వెళతాడు. ఏది జరిగినా మంచికే అనుకోవటం ఆ తరం వారికి అలవాటు. పెద్దాయన సరోజ తాతగారితో “మేము బతికున్నంతవరకు ఈ ఇల్లు ఇలాగే ఉండనివ్వండి” అంటాడు. సరోజ తాతగారు “భగవంతుడు నా చేత ఎందుకిలా చేయిస్తున్నాడో.. ఎందుకు నన్ను దుర్మార్గుడిని చేస్తున్నాడో.. నేను నిమిత్తమాత్రుడిని. మంచివాళ్ళకి తాత్కాలికంగా కష్టాలు వచ్చినా మళ్ళీ మంచిరోజులు వస్తాయి” అంటాడు. పెద్దాయన సరోజ తాతగారిని ద్వేషించకుండా ఉండటం, సరోజ తాతగారు కూడా సౌజన్యంతో మాట్లాడటం భారతీయతకి చిహ్నాలు. భగవంతుడు ఆడే నాటకంలో అందరూ పాత్రలే. మన కర్మఫలాలే మనకి దక్కుతాయి. ఇతరులు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. వారు నిమిత్తమాత్రులే. అదే ఇక్కడ చెప్పారు. అది చెప్పటానికి ప్రసాద్ ఆడిన నాటకాన్ని సాధనంగా ఉపయోగించటం కథనంలోని గొప్పతనం.
ప్రసాద్ కోరటంతో సరోజ తాతగారు పొలాన్ని పట్టాభికి కౌలుకి ఇస్తాడు. యజమానిగా అనుభవించిన పొలం కౌలుదారుగా సాగు చేసుకోవాల్సి రావటం పట్టాభికి చిన్నతనమేమీ కాదు. అందరూ దూరమైనా భూమి దగ్గరగా ఉంటుందని సంతోషపడతాడు. కష్టసుఖాలు కావడికుండలని భావించారు కాబట్టే మన పూర్వీకులు ధైర్యంగా బతికారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునేవారు పెరిగిపోయారు. పట్టాభి, జానకి పొలం దగ్గరే ఒక పాక వేసుకుని పిల్లలతో పాటు ఉంటారు. సరోజ ఊళ్ళోనే డాక్టర్ ప్రాక్టీస్ పెడుతుంది. ముసలివాళ్ళిద్దరూ ఆలయంలో తోటపని చేసుకుంటూ ఉంటారు. ప్రకాశం, ప్రతాప్ తలో చోట తలదాచుకుంటారు. వాళ్ళు ప్రసాద్ వల్లే తమకి కష్టాలు వచ్చాయని అతన్ని తూలనాడతారు. ప్రసాద్ నిబ్బరంగా ఉంటాడు.
ఒకరోజు జయ కొడుకు స్కూలు నుంచి జానకి దగ్గరకు వస్తాడు. అతనికి ఒళ్ళు వేడిగా ఉండటంతో అతన్ని అక్కడే ఉండమంటుంది జానకి. అతడికి పొంగు వ్యాధి వస్తుంది. జానకి అతనికి సపర్యలు చేస్తుంది. సరోజ వైద్యం చేస్తుంది. బాబు కోలుకుంటాడు. జయ జానకికి కృతజ్ఞతలు చెబుతుంది. మరోపక్క డబ్బులు లేక ఎన్నికల్లో ప్రకాశం ఓడిపోతాడు. పదవి పోవటంతో అతనికి మతి చలిస్తుంది. జానకి జయకి తన నగలిచ్చి పాల వ్యాపారం చేయమంటుంది. జయకి కనువిప్పు కలుగుతుంది. తన తమ్ముడిని జానకి కూతురికిచ్చి పెళ్ళి చేయటానికి నిశ్చయించుకుంటుంది. ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. ప్రతాప్ పొలం పని చేయటం నేర్చుకుంటాడు. భార్యతో సంతోషంగా ఉంటాడు. ఇలా అందరూ కష్టాన్ని నమ్ముకుని పైకొస్తారు. ప్రసాద్ ఆడిన ఈ నాటకం సంగతి మొదటి నుంచీ తెలిసినది ప్రసాద్ చెల్లెలికీ, ఆమె భర్త సూర్యంకు మాత్రమే. ప్రసాద్ సూర్యానికి కోళ్ళ వ్యాపారం చేసుకోవటానికి డబ్బు ఇస్తాడు. చివరికి ఉగాది పండక్కి అందరూ తమ కష్టార్జితం అనుభవిస్తూ సుఖంగా ఉంటారు. ప్రసాద్ ఆడిన నాటకం ఉద్దేశం ఒక్కడు సంపాదిస్తుంటే పది మంది కూర్చుని తినకూడదని చెప్పటమే. అది తెలిసి అందరూ అతన్ని అభినందిస్తారు.
పదవుల కోసం ఆస్తులు అమ్ముకునేవారు, సోమరిపోతుల్లా తిని కూర్చునేవారు, పరువు ప్రతిష్ఠ అంటూ పిల్లల చేత ఖర్చులు పెట్టించే పెద్దలు ఈ చిత్రం చూసి పాఠం నేర్చుకోవాలి. ఈరోజుల్లో పోటీ పడి అప్పులు చేసి భేషజాలకి పోయేవారు అప్పులు మాని ఉన్నంతలో బతకటం నేర్చుకోవాలి. అప్పులేని వాడే అధిక ధనవంతుడు అని తెలుసుకోవాలి. చిత్రంలో హేమాహేమీల వంటి నటీనటులున్నా అంజలీదేవి నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. శాంతం, రౌద్రం, కరుణ రసాలని అద్భుతంగా పోషించింది. అక్కినేని పాత్ర కథానాయకుడే అయినా ప్రాధాన్యం కొంచెం తక్కువే. ఈ పాత్ర చేసిన అక్కినేని అభినందనీయులు. జయ పాత్రధారి ఎస్. వరలక్ష్మికి, పట్టాభి పాత్రధారి గుమ్మడికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. పద్మనాభం పాత్ర సూర్యం ద్వారా హాయి అయిన హాస్యం కూడా పండింది. అతనికి రేచీకటి. ఆ విషయం బయటపడకుండా అతను పడే పాట్లు, తెలివిగా తప్పించుకునే అతని ఎత్తులు నవ్వులు పూయిస్తాయి. ఈ చిత్రంలో విజయలలిత, అక్కినేని మీద ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా ప్రసాద్ నాటకంలో భాగంగా ఈ పాటలో డ్యాన్స్ చేశాడని చెప్పించారు. 1969 అంటే సినిమాలకి సంధికాలం. అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని మెప్పించటానికి దర్శకుడు కె. ప్రత్యగాత్మ ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనవే. ఆయన, ఆచార్య ఆత్రేయ కలిసి రాసిన సంభాషణలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏ. వి. సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్నారు.
1967లో వచ్చిన ‘సుడిగుండాలు’ చిత్రంలో నేరప్రవృత్తికి మరో కోణం చూపించారు. క్రైమ్ నవలల ప్రభావం వల్ల నేరప్రవృత్తి ఎలా పెరిగిందో ఆ చిత్రంలో చూపించారు. అప్పుడు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు సెల్ ఫోన్ల వల్ల, ఓటీటీ సీరీస్‌ల వల్ల నేరప్రవృత్తి ఎలా పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఒక మనిషి ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో చూడాలని చిన్నపిల్లల్ని హత్య చేసే ప్రబుద్ధులు ఇప్పుడు తయ్యారయ్యారు. ఈ విషయాన్ని ముందే ఊహించి ఆ సినిమా తీసిన ఆదుర్తి సుబ్బారావు కూడా దార్శనికుడే. తలిదండ్రులు పిల్లలని ఓ కంట కనిపెట్టి ఉండకపోతే ఇంకా ఎన్ని దారుణాలు చూడవలసి వస్తుందో! ఈ మధ్య వచ్చిన ‘యూఫోరియా’ చిత్రంలో ఈ అంశాన్ని స్పృశించారు. కానీ ఆ చిత్రం వచ్చినట్టు కూడా చాలామందికి తెలియదు. అదీ మన సినిమాల ప్రస్తుత పరిస్థితి!

