Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అడవి గండుపిల్లే ‘బాహుబలి’

[బాలబాలికల కోసం ‘అడవి గండుపిల్లే ‘బాహుబలి’ అనే కథని అందిస్తున్నారు డా. కొప్పరపు నారాయణ మూర్తి. సంచిక నిర్వహించిన బాలల కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రామాపురం ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్ళో సుమారు రెండు వేలమంది ప్రజలుండేవారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. వాళ్ళు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వారు పక్కనే ఉన్న శాలినీ పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకొస్తుండేవారు.

అందుకు వాళ్ళు ఊరి పక్కనే ఉన్న అడవి దాటి పోవలసి వచ్చేది. ఆ అడవి ఒక ఒక భయంకర కీకారణ్యం. ఆ అడవిలో లేని జంతువులు లేవు.

ఆ అడవిలో వసంతుడు అనే బాలుడు ఒకడు ఉండేవాడు. వాడిని ఎవరు కన్నది వాడికి తెలియదు. ఆ ఊరివారికీ తెలియదు. ఎవరో అనాథ ఈ వసంతుడిని కని అడవిలోనే చనిపోయింది. కొన్ని దయగల ఆవులు, మేకలు ఆ వసంతుడు ఏడుస్తుంటే పాలుబట్టి వాడిని కాపాడేవి. సింహాలు, పులులు కూడ వాడికి తోడుగా, రక్షణగా వాడిపక్కనే, వాడిని తమకు పొదివి పెట్టుకొని పడుకొనేవి. కొన్ని కోతులు వాడిని గారాబం చేసి, ఫలాలు, కాయలు ఇచ్చి తమ పిల్లలతో సమంగా పెంచాయి. జంతువులకు కూడ పసిపిల్లలు అంటే ఆప్యాయత, ప్రేమ ఉంటాయి అన్నది వాడు అక్కడే పుట్టి, అక్కడే పెరగటమే రుజువు.

కానీ రామాపురం ప్రజలకు ఆ అడవి అంటే, దాని గుండా వెళ్లాలంటే భయం. ఆ అడవి దాటడం అంటే రెండు మూడు గంటలు పడుతుంది. గుంపులు, గుంపులుగా కాగడాలు అంటించుకొని వెళ్లేవారు పట్టపగలు కూడ. అంటే ఆ ఆడవి కూడ అంత చీకటిగా ఉండేది. నాలుగైదేళ్లు వచ్చాక వసంతుడు ఊర్లోకి వచ్చి, ఆ ఊరి వారికి కనబడటం మొదలైన తరువాతనే ఆ ఊరివారికి ఆ బాలుడి సంగతి తెలియసాగింది.

వసంతుడు ఎప్పుడూ వాడి భుజం మీద ఒక భయంకరమైన నల్లపిల్లి (అడవి గండుపిల్లి)ని వేసుకొని తిరిగేవాడు. మొదట్లో వాడు ఆకులు, అలములు మొల చుట్టూ కట్టుకొనే ఊళ్ళో తిరిగేవాడు. ఊళ్ళోవాళ్లకి అడవి దాటడంలో అప్పుడప్పుడు వాడు సహాయం చేస్తుండటంతో వాళ్ళు సంతోషంగా బట్టలు కుట్టి ఇచ్చి వేసుకోమనేవారు.

అడవిలో అందమైన సెలయేళ్ళు ఎన్నో ఉన్నాయి. వాడు సెలయేళ్ళ ఒడ్డునే అడవి పుల్లలతో చిన్న గూడు కట్టుకొని అందులో ఉండేవాడు. వాడే తన ఇంటిని ఊరిపెద్దలకు చూపించాడు. అంతేగాదు, ఎవరైనా పొరుగూరు శాలినీకి పోతుంటే దగ్గరుండి వారిని పొరుగూరు చేర్చేవాడు. వాడిని చూస్తే పులులు, సింహాలు కూడ గాండ్రించడం, గర్జించడం మానేసే పక్కకు వెళ్ళిపోయేవి.

ఆ సమయంలో శాలినీ, శ్రావస్తీలను పాలించే విజయసేన మహారాజుకు ఒక సందేహం వచ్చింది. ఆయన తరచూ తన నగరాల చుట్టూన్న అడవులకు వేటకెళ్ళేవాడు. తనకిష్టమైన జంతువులను, వేటాడి, చంపి తెచ్చేవాడు. ఆయనకెందుకో సింహాలను వేటాడినా, జింకలను వేటాడినా, ఆ వేటలో ఏమీ తేడా కనిపించలేదు. సాధారణంగా పులులు, సింహాలను అడవికి రాజులంటారు కదా! అలాంటప్పుడు వాటిని వేటాడటం కష్టంగా, గొప్ప అనుభూతిగా ఉండాలి. కానీ, జింకలు ఎంత సులువుగా రాజుకు బందీ ఆయ్యేవో, పులులు, సింహాలు కూడ అంత సులువుగా చిక్కేవి.

అన్నింటికీ మించి, సింహాలు, పులులు, చిరుతలు వంటి అతి క్రూరమృగాలు సైతం ఏనుగునైనా, అడవిదున్ననైనా, ఖడ్గమృగాన్నైనా గుంపుగా ఎదుర్కోవటం తప్ప, ఒంటరిగా ఎదుర్కొనేవి కావు. ఒంటరిగా సింహంనైనా, పులినైనా ఏనుగు, ఖడ్గమృగం, అడవి దున్న సులభంగా ఎదుర్కోవటం, సింహాలను, పులులను, చిరుతలను పరిగెత్తించటం చాలా సార్లు చూశాడు మహారాజు.

అందువల్ల ఆయన ఒకసారి సభలో తమ రాజ్య విద్యాధికులనందరినీ పిలిచి, తాను చూసింది వివరించి, ఒక ప్రశ్న వేశాడు. “నా వేట అనుభవంలో సింహాలు, పులులు పెద్ద సవాలు కానప్పుడు, అడవిలో రాజనిపించుకోదగ్గ ‘బాహుబలి’ ఏదీ?” అని.

రాజు వేసిన ఈ ప్రశ్నకు వాళ్ళు నోరు వెళ్ళబెట్టారు. ఇటువంటి ప్రశ్న రాజునుంచి వస్తుందని వారెన్నడూ ఊహించలేదు. “రాజా! మాకు తెలిసిన సాహిత్యంలో అడవికి రారాజు సింహమే. తప్పితే పులి. అంతే గానీ మాకు మరోటి తెలీదు” అన్నారు ముక్త కంఠంతో.

అందుకు రాజు నవ్వి, “సింహం అందం చూసి, క్రూరత్వం చూసి సాహిత్యకారులు దానిని ‘అడవికి రారాజు’ అని ఉంటారు తప్ప అందులో నాకే నిజం కనపడలేదు. సాహిత్యంలో ఎన్నైనా రాయవచ్చు ఒక్కోసారి అది నిజమూ కావచ్చేమో! కానీ, నా అనుభవం వేరే చెబుతోంది కనుక మీరు కొంత తడవు పరిశోధన చేసి, సరైన జవాబుతో రండి” అని సభ ముగించి పంపించేశాడు.

ఈలోగా ఆ నోటా, ఈ నోటా శాలినీ మంత్రికి ఈ వసంతుడి గురించి తెలిసింది. భటులను పంపి వసంతుడిని రాజాస్థానానికి తెప్పించాడు మంత్రి తిమ్మరుసు.

రాజసభలో వసంతుడిని ప్రవేశ పెట్టారు రాజాజ్ఞ పైన. వసంతుడిని చూసి, అతని వివరాలు తెలుసుకొని, “వసంతా, నువ్వు అడవిలోనే క్రూర జంతువులైన పులులు, సింహాల మధ్యనే ఉంటావు కదా! నువ్వు చెప్పు! అడవిలో అన్ని జంతువులకు భయం పుట్టించేది ఏది?” అని అడిగాడు. వసంతుడు ఏమీ తడుముకోకుండా “అడవి గండుపిల్లి మహారాజా” అని తన భుజం మీదున్న అడవి గండుపిల్లిని చూపాడు. అది నల్లగా, బొద్దుగా, బాగా ఎత్తుగా, మెరిసే కళ్ళతో భయంకరంగా ఉంది.

“ఎలా?” అని రాజు, సభికులు ముక్త కంఠంతో అడిగారు.

“అడవి గండుపిల్లి, పులి, సింహం, చిరుత — దగ్గర కుటుంబానికి చెందినవి మహారాజా. ముఖ్యంగా దీని యుద్ధతంత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు రారాజు అనుకొనే సింహాన్నీ, రాజు అనుకొనే పులిని కూడ ఠారెత్తేలా భయపెట్టి, పరుగులు తీయిస్తోంది మహారాజా. ఏ అడివిలోనైనా సింహాల నుంచి భయానకర విష సర్పాల దాకా ఈ అడవి పిల్లి ధాటికి భయపడి పారిపోవలసిందే. ఇది నా అనుభవం” అని నిక్కచ్చిగా చెప్పాడు. “కావలిస్తే మీరు ఇప్పుడే సింహానికి ఈ గండుపిల్లికి పోటీ పెట్టి చూడండి” అని సవాలు విసిరాడు వసంతుడు.

రాజు తనవద్దనున్న సింహాన్ని బోనులో రప్పించి, రెంటి మధ్య పోటీ పెట్టాడు. వసంతుడు తెచ్చిన నల్ల గండుపిల్లి భయంకరంగా అరుస్తూ, రక్కుతూ, సెకనుల తేడాతో వేగం వేగంగా పంజా విసురుతూ సింహం పైకి దాడిచేసింది. దానిని మెరుపు వేగంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజంగానే నిముషాల్లో సింహం తోకముడిచి, బోనులోకి వెళ్లి కూర్చుంది. అది చూసి రాజు ఆశ్చర్య పోయాడు.

“శభాష్ వసంతా! సింహాలు, పులులకు క్రూరత్వం, క్రౌర్యం మెండుగా ఉండవచ్చు. కానీ అవి జంతువులను చంపడానికి వాడే ప్రక్రియ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జంతువులను ఓడించగలమా లేదా అని ఒక్క క్షణం ఆలోచించవు. అనాలోచిత యుద్ధం, యుక్తి లేని పోరాటం చేయటం వాటిని ఎంతో నష్టపరచటం నేనూ చూసాను. కానీ, అడవి గండుపిల్లి సెకనులలో వ్యూహాలను మార్చుకొంటూ ఏ జంతువునైనా ఇట్టే ఓడిస్తుంది. ఈ సూక్ష్మం చాలామంది గ్రహించరు. సాహిత్యం వేరు. సింహాన్ని ‘రారాజు’ అని శ్లాఘించడం వేరు. నిజానికి సింహాలను ముప్పతిప్పలు పెట్టే అనేక అడవి జంతువులున్నాయి. యుద్ధభూమిలో అడవి గండు పిల్లి చాకచక్యం వేరని నిరూపించావు” అన్నాడు.

వసంతుడి అనుభవాన్ని మెచ్చుకొని, అడవి గండుపిల్లే ‘బాహుబలి’ అని ప్రకటించాడు. వసంతుడిని అడవికి రాజుగా ప్రకటించి, అడవిలోనే ఉండటానికి తగిన ఇల్లు, సదుపాయాలు ఏర్పరిచాడు.

Exit mobile version