[శ్రీ కే.ఆర్. రావు ఆంగ్లంలో రచించిన Miracles Happen అనే రచనని అనువదించి ‘అద్భుతాలు జరుగుతాయి’ అనే పేరుతో అందిస్తున్నారు డా. ఎ. బి. సాయిప్రసాద్.]
వ్యక్తుల పరంగా, సంఘటనల పరంగా కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. తీరిక లేని పనులలో మునిగి తేలుతుండడం వల్ల మన పరిసరాలలో జరుగుతున్న అద్భుతాలను మనం అంతగా పట్టించుకోము. జరిగిన లేక జరుగుతున్న అద్భుతాలను గురించి ఇతరులతో ముచ్చటించము. ఇక్కడ నాలోని లోపాన్ని తప్పక ఒప్పుకుంటాను. ఒక వ్యక్తి గొప్పతనాన్ని నేను గుర్తించలేక పోయానని మీకు తెలియజేస్తున్నాను. ఆమె ఒక సీదా సాదా మహిళ. ఎలాంటి బేషజాలకు పోని వ్యక్తి. ఆమె ఎక్కువుగా చదువుకోలేదు. ఒక్క కన్నడ భాష మాత్రం ఆమెకు తెలుసు. కన్నడం తప్ప మరే భాషలోనూ ఆమెకు ఎలాంటి పరిచయం లేదు. కన్నడం ఆమె రాయగలదు. చదవగలదు.
ఇరుగు పొరుగు వారు ఆమెను ఎరుగుదురు. వారు ఆమెను ఎక్కువగా గౌరవించేవారు. కొంత మంది ఆమెను ఒక అసాధారణ ప్రతిభ గలిగిన వ్యక్తిగా భావించేవారు. వారివారి సొంత సమస్యలకు ఆమె తన మంచి సలహాలతో పరిష్కారాన్ని సూచించ గలిగేది. కొంత మందికి మాత్రం ఆమె ఒక సాధారణ స్త్రీగా కనపడేది.
ఆమె దినచర్య క్రమశిక్షణతో కూడుకొన్నదిగా ఉండేది. తప్పని సరిగా కన్నడ దిన పత్రికను చదివేది. ఒక గృహిణిగా ఎంతో చాకచక్యంతో సంసారాన్ని నడిపేది. అటు భర్తకు ఇటు పిల్లలకు చేదోడు వాదోడుగా ఉండేది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇంటి వ్యవహారాలను ఎంతో సమర్థవంతంగా నడిపేది, చక్కదిద్దేది. రామాయణ, భారత, హరికథామృతసారం, భాగవతాలకు సంబంధించిన అపార జ్ఞానం, అవగాహన ఆమెకుండేదన్న సంగతి చాలా మందికి తెలియదు. మన ప్రాచీన గ్రంథాలతో ఉన్న ప్రగాఢ పరిచయం కారణంగానే ఆమె తనను సంప్రదించిన వారికి చక్కటి సలహాలు ఇవ్వగలిగేది.
‘జాతస్య మరణం ధృవం’ కారణంగా అందరిలాగానే ఆమె కూడా తన సమయం ఆసన్నమైనప్పుడు తనువు చాలించింది. కారణాంతరాల వల్ల ఆమె కుటుంబం వారు తాము ఇదివరకు ఉన్న నగరం నుండి ఇంకో నగరానికి తమ విలాసాన్ని మార్చారు. కొన్ని సంవత్సరాలు ఇట్టే గడచి పోయాయి.
దివంగతురాలైన ఆమె కూతురు ఒకరోజు ఇల్లు తీరికగా శుభ్రం చేసే కార్యక్రమాన్ని తలపెట్టింది. కింద వున్న వస్తువులను సర్ది అటక పైనున్న ఒక పెట్టెను కిందికి దించింది. ఆ పెట్టెను తెరువగా ఆమెకు కాగితాల కట్టలు కనిపించాయి. తూకానికి ఆ పేపర్లను అంగడి వాడికి వేయాలనుకుంది. ఎందుకో తెలియదు. ఆ కట్టలలో ఉన్న పేజీలను – ఒకటి రెండు పేజీలు చదవసాగింది. అవి తన తల్లి చేతివ్రాతగా గుర్తించింది. చదవగా అవి కన్నడ పద్యాలని తెలుసుకుంది. తన చెల్లెలను పిలిచి మొత్తం పేజీలను చదవమని ఆదేశించింది. కన్నడ సాహిత్యంతో కొంత పరిచయం ఉన్న ఆమె చెల్లెలు అది పాండిత్యంతో కూడుకున్న పద్యాలని అర్థం చేసుకుంది.
ఆమె చెల్లెలు తనకు తెలిసిన కన్నడ విద్వాంసుడు డా. గురురాజ కరజిగికి ఆ పేజీలనిచ్చి అతని అభిప్రాయాన్ని కోరింది. అతడు ఓపికగా ఆ వ్రాతప్రతిని చదివాడు. ఆ కావ్య రచయిత్రి పాండిత్య ప్రతిభకు అతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. రచయిత్రికి సరైన ప్రాథమిక చదువు కూడా లేదన్న సంగతి తెలుసుకొని ముక్కుపైన వేలు వేసుకున్నాడు. అది ఒక అద్భుతమైన కావ్యం అని అతడికి ఇట్లే తెలిసి పోయింది.
ఇద్దరు అక్కచెల్లెళ్ళు, డా. గురురాజ కరజిగి సూచన మేరకు ఆ కావ్యాన్ని ప్రచురించాలని నిర్ణయించుకున్నారు. రచయిత్రి మంత్రాలయపు శ్రీరాఘవేంద్రస్వామిగారి జీవిత చరిత్రను ఆ కావ్యంలో పొందుపరిచింది. అది నాలుగు పాదాల కావ్యం. ఆ కావ్యంకు ముందుమాట రాస్తూ రచయిత్రి తనకు కన్నడభాష మాత్రం తెలుసునని, ఇతర భాషలతో ఎలాంటి పరిచయం తనకు లేదని స్పష్టంగా విన్నవించుకుంది. అంతేకాదు తాను మూడవ తరగతి వరకే చదువుకున్నానని ప్రకటించుకుంది.
మంత్రాలయపు శ్రీరాఘవేంద్రస్వామి ఆశీస్సుల కారణంగానే ఈ కావ్యరచన సాధ్యమై ఉండొచ్చని డా. గురురాజ కరిజిగి త్రికరణ శుద్ధిగా నమ్మాడు. ఆ తరువాత ఆ వ్రాతప్రతిని రచయిత్రి ఇద్దరు కూతుళ్ళు కలిసి ప్రచురించారు. అది రెండువందల పేజీల కావ్యంగా వెలువడింది. ఆ కావ్యం పేరు ‘శ్రీరాఘవేంద్ర మహిమాదర్శన’ ఈ అసాధారణ కావ్యంను రచించిన స్త్రీకు ఎలాంటి సాహిత్య పృష్టభూమి లేదని తెలుసుకున్న పాఠకుల మనస్సులో అనేక ప్రశ్నలు తప్పక ఉదయిస్తాయి. సాధారణంగా అందరూ అంగీకరించే సాహిత్య ప్రమాణాలను ఈ ‘శ్రీరాఘవేంద్ర మహిమాదర్శన’ కావ్యం సవాలు చేస్తోందని గ్రహించి మనం విస్తుపోతాము.
చివరిగా నేను వ్యక్తిగతంగా అందర్నీ ప్రశ్నిస్తున్నాను. మనలో ఎంతమంది మన బంధుమిత్రులలో దాగున్న ప్రతిభను గుర్తించ గలుగుతున్నారు. ఈ వ్యాసంలో పేర్కొన్న రచయిత్రి పేరు కాశి ఇందిరాబాయి. ఆమె ఎవరో కాదు. నాకు జన్మనిచ్చిన తల్లి. ఆమె ప్రతిభను పాండిత్యాన్ని మేము ఆమె చనిపోయిన తరువాతే గుర్తించగలిగాము. ఆమె నిజంగా మట్టిలోని మాణిక్యం.
(భవన్స్ జర్నల్ 2025 అక్టోబర్ 16-31 సంచిక సౌజన్యంతో)
ఆంగ్ల మూలం: శ్రీ కే.ఆర్. రావు
తెలుగు అనువాదం: డా. ఎ. బి. సాయిప్రసాద్
