[శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారి ‘అద్దాల భరిణ’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత్రి శీమతి నండూరి సుందరీ నాగమణి గారి 4వ కథాసంపుటి ‘అద్దాల భరిణ’. 15 కథలున్న ఈ కథా సంపుటి ప్రధానంగా సమాజంలోని మధ్యతరగతి కుటుంబాల జీవన చిత్రణ, మానవ సంబంధాలలోని సున్నితత్వం మరియు నైతిక విలువల చుట్టూ తిరుగుతుంది. నండూరి సుందరీ నాగమణి గారు నిత్య జీవితంలో మనం చూసే సాధారణ మనుషుల అంతరంగాలను, వారి ఆశలను, ఆవేదనలను ఈ కథల ద్వారా అద్దం పట్టారు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులో, గ్రామీణ, పట్టణ శాఖలలో పనిచేయడం వల్ల ఎంతో మంది వ్యక్తుల జీవితాలను సన్నిహితంగా చూడగలిగారు. మరికొందరి జీవితాల గురించి తోటి ఉద్యోగుల ద్వారా విన్నారు. అందుకే ఈ కథలు ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలతో రచించినవని చెప్పవచ్చు.
సామాన్య కుటుంబాలలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, ఆడంబరాలకు పోకుండా జీవించే వారి నైతిక విలువలను రచయిత్రి ఈ కథల్లో ప్రతిబింబించారు. ఉమ్మడి కుటుంబాలలోని ఆత్మీయతలు, ఆధునిక కాలంలో మారుతున్న బంధాల తీరు, అత్తాకోడళ్లు, తల్లీ కూతుర్లు, దంపతుల మధ్య ఉండాల్సిన అవగాహనను చక్కగా చర్చించారు. సమాజంలో మరియు కుటుంబంలో స్త్రీ ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు, బాధ్యతల నిర్వహణలో ఆమె చూపే ఓర్పు, చదువు-ఉద్యోగం పట్ల ఆమెకు ఉండే ఆశయాలను కథాంశాలుగా మలిచారు. పేదరికం, కష్టపడి బతికే శ్రామికుల నిజాయితీని హృదయానికి హత్తుకునేలా వివరించారు. ఆమె కథలలోని సామాన్య పాత్రలు ఎంత కష్టాల్లో ఉన్నా తోటివారిని మోసం చేయకూడదనే నైతికతను ప్రదర్శిస్తాయి.
రచయిత్రి నండూరి సుందరీ నాగమణి గారి శైలి చాలా సరళంగా, గ్రామీణ పట్టణ వాతావరణాల కలయికతో సాగుతుంది. క్లిష్టమైన సామాజిక సమస్యలను కూడా ఎక్కడా విసుగు పుట్టించకుండా, సున్నితమైన సంభాషణలతో, చక్కని ముగింపులతో పాఠకులలో ఆలోచన రేకెత్తించేలా రాయడం వారి పద్ధతి.
~
ఓ తమిళ వృద్ధుడు తప్పిపోయి, ఏదో రైలెక్కేసి కాచీగుడాలో దిగుతాడు. కూరగాయల వ్యాపారం చేసుకునే సత్తెవ్వ వెంట ఆమె ఇంటికి వెళ్తాడు. ఆయనది ఏ భాషో, ఆమెకి అర్థం కాదు. ఆయనకి తమిళం తప్ప మరో భాష రాదు. ఆయనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది సత్తెవ్వ. వాళ్ళది హృదయ భాష! చివరికి పక్కింటిలో ఎవరో తమిళియన్స్ అద్దెకి రావడంతో, తెలుగు తెలిసిన వాళ్ళ బంధువు ద్వారా, వృద్ధుడి వివరాలు రాబట్టి, ఆయన కొడుకులకు తెలియజేసి, భద్రంగా కోయంబత్తూరు పంపిస్తుంది. ఆయన కొడుకు లక్ష రూపాయలు ఇవ్వబోతే, తీసుకోకుండా స్థానిక వృద్ధాశ్రమానికి ఇవ్వమని కోరుతుంది సత్తెవ్వ. ఆమెది పెద్దమనసు. ఆయన రోజూ పెట్టుకునే అమ్మవారి కుంకుమ భరిణని ఆయనకి కానుకగా ఇచ్చేస్తుంది ‘అద్దాల భరిణ’ కథలో.
చేస్తున్న ఉద్యోగం పోతుంది రంగాకి. గత్యంతరం లేక, మరో ఉద్యోగం దొరికే వరకు ఓ బార్లో వెయిటర్‌గా చేరుతాడు. అది భార్య వల్లీకి ఇష్టం ఉండదు. బారుకి వచ్చే చిన్న వయసు పిల్లలకి మందు పొయ్యలేక మానసికంగా ఇబ్బంది పడతాడు. ఓ రోజు లక్ష్మి అనే ఆవిడ బార్ దగ్గరకి వచ్చి, లోపల తన భర్త ఉంటాడనీ, కూతురికి దెబ్బలు తగిలాయి, ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పమని అడుగుతుంది. అతను మత్తులో ఉంటాడు, రాడు. చివరికి రంగానే ఆమె వెంట వెళ్ళి పాపకి చికిత్స చేయిస్తాడు. ఆ తర్వాత అక్కడ పనిమానేసి, లక్ష్మితో కలసి టిఫిన్ బండి ప్రారంభించి, స్వయం ఉపాధి కల్పించుకుంటాడు ‘ఆత్మతృప్తి’ కథలో.
‘శిశిరమెరుగని వనాలు’ కథలో ఇద్దరు పరస్పర విరుద్ధ లక్షణాల వ్యక్తులుంటారు. భార్య మాట విని ముసలి తల్లిని ఆశ్రమంలో పెట్టించిన మల్టీమిలియనీర్ వామనరావు; అతని వద్ద నమ్మకంగా పనిచేసి ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆమె బాగోగులు చూసుకున్న ఉద్యోగి రఘునాథ్. ఆవిడ చనిపోతే శవాన్ని చూడ్డానికి కూడా రాని కొడుకు, 12వ రోజు కార్యక్రమాన్ని మాత్రం ఓ ఏసి హాల్లో లక్షలు ఖర్చు చేసి నిర్వహిస్తాడు. వచ్చినవారికి అత్యంత ఖరీదైన భోజనం పెట్టించి, ఒక వెండి పళ్ళెం కానుకగా ఇస్తాడు. ఇదంతా నచ్చని రఘునాథ్, తన భార్య దగ్గర వాపోతాడు. లోపలి గదిలో ఉన్న నానమ్మని చూసుకోడానికి అతని కూతురు వెళ్ళడంతో అతనికి ఓ భరోసా కలుగుతుంది. మనసు శాంతిస్తుంది.
భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోడానికి, అపార్థాలు తలెత్తినప్పుడు తొలగించుకోడానికి చక్కని మార్గాన్ని చెబుతుంది ‘అన్ డూ’ కథ. కంప్యూటర్ అవగాహన ఉన్న వారికి ‘అన్ డూ’ కమాండ్ ఏం చేస్తుందో తెలిసినదే. పెళ్ళయి ఆర్నెల్లు కూడా కాని కాంచన, వివేక్‌ల మధ్య గొడవలు మొదలవుతాయి. ఇంటి సమస్యల వల్ల ఇద్దరి వర్క్ ప్లేస్‌ల లోను ఇబ్బందులు తలెత్తుతాయి. తన కొలీగ్, గురుతుల్యుడు అయిన సదాశివ చెప్పిన జీవన మంత్రంతో తమ దాంపత్యాన్ని కాపాడుకుంటాడు వివేక్. అదే సమయంలో, తను చేసిన పొరపాటు కూడా కాంచన గ్రహిస్తుంది. భర్తకి సారీ చెబుతుంది. సాధారణంగా అనిపించే మంచికథ ఇది.
ఇద్దరు స్నేహితురాళ్ళ కథ ‘సంధ్యాసమీరాలు’. ఓ మోసగాడి వలలో సమీర చిక్కుకోకుండా సంధ్య కాపాడుతుందీ కథలో. అతని ఆకర్షణలో పడి సంధ్యని నిర్లక్ష్యం చేసినందుకు బాధపడి, క్షమించమని కోరుతుంది సమీర.
మధ్యతరగతి కుటుంబాలలో పిల్లల పెంపకం గురించి, పిల్లలు ఏదైనా తప్పుడు పనులు చేస్తే, ఎంత నగుబాటు అవుతుందో అని ఆలోచించే తల్లిదండ్రుల గురించి చెబుతుంది ‘మురళీగారి అబ్బాయి’ కథ. తన సెన్సిటివ్‌నెస్ తోనే కొడుకూ, కూతుర్లను మారుస్తాడు మురళి.
నేర్చుకోడానికి వయసు అడ్డం కాదు, కేవలం మనలోని సంశయాలని వదిలేయాలంతే. చిన్నప్పుడు చదువుకోని దుర్గమ్మ, చివరికి మనవరాలితో పాటు తెలుగు అక్షరాలు నేర్చుకుని, దినపత్రికలు చదువుకునే స్థాయికి చేరుతుంది. సంకోచాలను అధిగమించి, అక్షరాస్యురాలైన ఆమె, కూతురుకి ఉత్తరం రాస్తుంది. అది చదువుకున్న కూతురు మురిసిపోతుంది ‘అమ్మ ఉత్తరం’ కథలో.
‘రాలిన పువ్వులు రెండు – పూసిన గుత్తులు మూడు’ కథ విభిన్నమైన శీర్షిక ఉన్న కథ. కరోనా నేపథ్యంగా అల్లిన కథ. తల్లి కాబోతున్న కళ్యాణికి గర్భస్రావం అవుతుంది. ఏదో సమస్య వల్ల గర్భసంచీ తీసేయాల్సి వస్తుంది. శారీరిక అనారోగ్యంతో పాటు మానసికంగా క్రుంగిపోయిన భార్యకు అన్ని రకాల సేవలు చేస్తాడు విష్ణు. “భగవంతుడు ఒకటి తీసుకుంటే, మరొకటి ఇస్తాడు” అన్న ఓ ఆధ్యాత్మిక గురువు గారి మాటలు ఈ దంపతుల పట్ల నిజమవుతాయి. ఈ కథ గురించి రచయిత్రి ఏమన్నారో స్పెషల్ ఇంటర్వ్యూలో చదవండి.
ఒక దొంగని మార్చి, సన్మార్గంలో పెట్టిన ఓ వైద్యుడి కథ ‘మీరు నిజంగా దేవుడండీ!’. దొంగ మామూలు మనిషవడం.. అంత సులువుగా ఏమీ సాగదు. తనెంతో నమ్మకం పెట్టుకున్న ఆ వైద్యుడే తనని పోలీసుకులకి ఎందుకు పట్టించాడో నిజం తెలిసాకా, ఎన్నో ఏళ్ళ తరువాత అప్పుడు మారుతాడా దొంగ!!
ఫించన్ అందని ఓ వృద్ధురాలి సమస్యని కాస్త వ్యక్తిగతంగా తీసుకుని పరిష్కరించిన ఓ లేడీ మేనేజర్ కథ ‘స్వీట్ బాక్స్’. చాలా ఆర్ద్రమైన కథ. ఇలాంటి అధికారులు ఉంటే, వృద్ధుల పెన్షన్ సంబంధిత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
‘అపురూప కానుక’ చక్కని కథ. ఆ కానుక ఎందుకు అపురూపమైనదో, ఎవరు ఎవరికిచ్చారో తెలుసుకోవాలంటే కథ చదవాలి.
మంచితనానికి లోకం గొడ్డుపోలేదని, సార్థపరులున్నట్లే.. మంచివాళ్ళూ ఉంటారనీ, వాళ్ళు తమ మంచితనంతో, అందరికీ మేలు చేస్తూ, సమాజం కుళ్ళిపోకుండా చూస్తుంటారని చెపుతుంది ‘శ్రీరామరక్ష’ కథ.
~
మనుషులకి నేడు ‘మానవత్వం’ అనే ‘ఔషధం’ అవసరం అని నమ్మిన రచయిత్రి, ఆ నమ్మకాన్ని నిలుపుకునే కథలను అందించారు. పఠితలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయీ కథలు.
***
రచన: నండూరి సుందరీ నాగమణి
ప్రచురణ: జెవి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 132
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/addala-bharina
~
నండూరి సుందరీ నాగమణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://www.sanchika.com/special-interview-with-mrs-nanduri-sundari-nagamani/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

