[కుమారి బబ్బిలి తనుశ్రీ రచించిన ‘అద్దం – అందం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఎవరిని అడగాలి, నేనెలా వున్నానని,
అమ్మా నాన్నా, వాళ్ళు మంచే చెప్తార్లే!
ఎంతైనా కాకి పిల్ల కాకికి ముద్దే కదా!
అక్కనడగనా, అమ్మో వద్దులే!
వున్నవి, లేనివి చెప్ప ఆట పట్టిస్తంది.
నాకు తెలుసు నేను బాగుంటానని
కానీ ఏదో చిన్న సందేహం నేను మంచిదానినేనా?
అబ్బ!! ఏంటి ఈ అల్లకల్లోలం
అస్సలు నిద్ర పట్టట్లేదే!
అద్దంలో చూసుకుంటే!! అద్దాన్ని అడిగితే??
‘ఓ అద్దమా! నేను ఎలా వుంటాను?’
‘అద్దం ఎప్పుడూ అబద్దం చెప్పదమ్మా!
నీవు అందంగానే వున్నావు కానీ
అందం అంటే ఏంటి?
ప్రతీ ఒక్కరు దాని గురించే ఆలోచిస్తారు.
అందం అంటే అంతరించిపోయే
శరీరం రూపురేఖలా? లేదా
అంతే లేని అంతరాత్మ సౌందర్యమా?
ఎందుకూ పనికిరాని శరీరం అందంగా
వుంటే ఏం లాభం ఓయ్!
అందరూ గుర్తించుకునే నీ వ్యక్తిత్వం
అమోఘంగా వుండాలి
ఎప్పటికి గుర్తుంచుకో
ఈ లోకం నీ బహిరంగ సౌందర్యాన్ని కాదు
నీ అంతర్గత పరిమళాన్ని లెక్కిస్తుంది
నీవు ఈ భూమి పై చిరకాలం వుండాలంటే
నీ శరీరం కాదు!
నీ వ్యక్తిత్వం బాగుండాలి
దాన్ని కాపాడుకో!! అప్పుడూ
నీ కంటే అందంగా
ఈ లోకంలో ఎవరూ వుండరు’
చెప్పింది అద్దం!!
బబ్బిలి తనుశ్రీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థిని. నిజామాబాద్ లోని ముబారక్ నగర్లో నివాసి. కవిత్వం పట్ల ఆసక్తితో ఈమధ్య నుంచే రాస్తున్నారు.
