Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అదే సహజం

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘అదే సహజం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆకు
పచ్చగానే పచ్చిగానే ఉండిపోదు
తొడిమకు తడి జిగురు తగిలించి
కొమ్మనో రెమ్మనో కూడి అలాగే
అస్తమానం అంటిపెట్టుకుని ఉండదు
తనలోని పచ్చదనాన్ని
పసుపుతనంలోకి మార్చేసుకుంటూ
క్రమంగా పండుబారిపోతుంది
కాలం లెక్క సరిపోగానే
బంధాన్ని తెంచుకుని నేల రాలిపోతుంది
నిశ్శబ్దంగా

ఆకు రాలడం
అలా సహజంగానే ఉండాలి
పరామర్శించేదిగానే ఉండాలి, కానీ
ప్రశ్నల పరంపర
కురిపించేదిగా ఉండకూడదు
సానుభూతి వర్షించేదిగానే ఉండాలి, కానీ
సమూహాలుగా మారి
చర్చించేదిగా ఉండకూడదు
ఎందుకిలా అంటూ..
కంటనీరు కార్చేదిగా ఉండాలి కానీ
కారణాలకై
శోధనలు చేసేదిగా ఉండకూడదు

అవునన్నా! కాదన్నా!!
ఆకు అర్ధాంతరంగా కాకుండా
లెక్క చూసుకుని మరీ నేల రాలాలి

క్రమశిక్షణ కలిగిన కాలం..
కప్పేసే మట్టిలో భౌతికాలు కలిసిపోవాలి
కడిగేసే మరపులో జ్ఞాపకాలు వెలసిపోవాలి

అంతే! అది సహజం, అదే సహజం.

Exit mobile version