[డా. సి. భవానీదేవి రచించిన ‘అదృశ్య శక్తి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వాయువే జీవనాధార ప్రాణశక్తి,
వాయువే విశ్వ విస్తారిత అదృశ్యదీప్తి!
వేదమంత్రాలలో ప్రకృతి పవిత్రతా ప్రతిధ్వనితో
మానవానుబంధం ధర్మమై నిలుస్తుంది!
వీస్తున్న గాలిలో విశ్వగమన రహస్యం,
శ్వాసిస్తున్న ప్రాణిలో జీవన పరమార్థం!
వాయువే లేకపోతే జీవకోటి వాడిపోతుంది
వాయువు తోడుంటే జగతి వికసిస్తుంది
ఆకాశం ఒడిలో స్వేచ్ఛగా సంచరిస్తూ,
అడవి హరితాల అమృతగీతం ఆలపిస్తూ
పర్వత శిఖరాలపై పరిమళాలు వెదజల్లుతూ
పచ్చని పంటలకు ప్రాణం పోస్తూ!
వాయువొక అపురూప దివ్యశక్తి
విశ్వజీవన నిరంతర ప్రేరణా మూర్తి!
ఆ చల్లని స్పర్శలో చందన మమకారం,
ఆ స్వచ్ఛశ్వాసలో ఆరోగ్య సౌభాగ్యం!
మన వేదఋషుల ధ్యానంలో ఆరాధనం
వారి మంత్రధ్వనిలో విశ్వకల్యాణ భావనం
యజ్ఞాగ్నికి తోడై సందేశాన్ని మోసే వాయువు
లోక జీవన బంధాన్ని నిలిపే వాయువు
కాలుష్యంతో కలత చెందుతోంది ,
విషవాయువుల భారంతో విలవిలలాడుతోంది
చెట్లను నరికేస్తూ స్వచ్ఛతను హరిస్తున్నాం
స్వార్థపు పొగతో భవిష్యత్తును కమ్ముకుంటున్నాం!
వాయువును గౌరవించడం
జీవాన్ని కాపాడటం
గాలిని సంరక్షించడం
ధర్మాన్ని ఆచరించడం!
వేదం చాటిన ప్రకృతి ప్రేమను
మనసారా నిలుపుకుందాం
స్వచ్ఛమైన గాలితో సుఖమయ
లోకాన్ని నిర్మించుకుందాం!!
