[శ్రీ ఆడెపు రమేశ్ గారు రచించిన ‘అదృశ్య వర్ణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కనురెప్పల కుంచెలతో
కలల కాన్వాసు మీద
నిన్ను చిత్రించిన
ప్రతిసారి..
ధవళ వర్ణతేజమై
దూరి పోతావెందుకు..?
అక్షరాలను ఏర్చి కూర్చి
అందంగా ముస్తాబు చేసి
వీక్షిస్తున్న ప్రతిసారి..
శూన్యంగా మారిపోయి
మాయమవుతావెందుకు..??
జ్ఞాపకాల సురధారల్ని
మనసు నిండా ఒడిసి పట్టి
మోహ దాహం తీర్చాలని
అనుకున్న ప్రతిసారి..
పట్టు చిక్కని మంచు తెరవై
మరుగై పోతావెందుకు..???
కనిపించని నీ నీడకై
కంటిచూపు వెతికి వెతికి
అలసిన ఈ మౌనాక్షరాలు
అనునిత్యం వేచిచూసే
సాక్ష్యాలుగా..
మిగిలినాయి ఎందుకు..????
ఆడెపు రమేశ్ తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామానికి చెందినవారు. ఆయన వృత్తిరీత్యా స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామాయంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో తన విధులను నిర్వహిస్తున్నారు.
