Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అదృశ్యం వెనక

[శ్రీ రాజ మోహన్ ఇవటూరి గారు రచించిన ‘అదృశ్యం వెనక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“అమ్మాయ్ వచ్చేసా” అన్నాడు సీతారాం గుమ్మం నుంచే. “నీకోసమే చూస్తున్నాం మావయ్యా. ఏడు కొట్టగానే వస్తావు కదా!” అంది మాలతి నవ్వుతూ.

“ఏమిటోనమ్మా. మూడేళ్ళుగా పొద్దున్న నడక తర్వాత నీ కాఫీ తాగి వెళ్ళటం వల్లనే ఆరోగ్యం బావుంటోంది.”

“మాకు కూడా నువ్వు రోజూ పలకరిస్తుంటే బావుంటుంది. మరిది గారు కూడా అప్పుడప్పుడు రావచ్చు కదా!” అని కాఫీ అందించింది మాలతి.

“వాడెందుకు వస్తాడు? ఇప్పటికీ ఆస్తి సరిగ్గా పంచలేదని ఏడుస్తున్నట్టున్నాడు. నువ్వేమో రోజూ రెండు పూటలూ కాఫీలు తాగి, పోయిందనుకున్న ఆస్తి జమ కట్టుకుంటావేమో.” అన్నాడు మాలతి తమ్ముడు సోమరాజు నవ్వుతూ.

“ఏమిట్రా ఆ మాటలు? ఎప్పుడూ మావయ్యని ఆటపట్టిస్తావు.” అంటూ లోపలికి వెళ్ళింది మాలతి.

“వాడి మాటలకేంలేమ్మా! చెప్పేది విను. నేను వస్తున్నప్పుడల్లా చూస్తున్నాను. ఎవరో బీహారీ వాళ్ళు సునీల్‌తో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లెవరో ఎక్కడినుంచి వచ్చారో తెలియదు. కొంచెం జాగ్రత్త” అన్నాడు సీతారాం.

“వాళ్ళా! చాలా మంచి వాళ్ళండి. పక్క పేటలోనే ఉంటారు. లారీ డ్రైవర్లంట.”

“లారీ డ్రైవర్లా! ఎక్కడినుంచో వచ్చారా? అయినా వాళ్ళు మంచివాళ్ళయిపోయారా. స్వయానా మీ ఆయనకి బాబాయినే అయినా నేను మాత్రం పరాయివాడిని.”

“తెలియకుండా ఎవరినీ అనుమానించకూడదు బాబాయ్” అంటూ అప్పుడే గదిలోంచి బైటికి వచ్చాడు శ్యామ్.

“ఓహో! నా గురించి బాగా తెలుసు కనుక దూరం పెట్టావన్నమాట. సరేమరి. నా కాఫీ అయింది. ఇక బైలుదేరతా” అని నవ్వుతూ నడిచాడు సీతారాం.

***

శ్యామ్ విచారంగా కూర్చున్నాడు. అతనితో పాటు భార్య, బావమరిది సోమరాజు కూడా విచారంగా ఉన్నారు. సాయంత్రం ఆటల తర్వాత రెండు గంటలయినా సునీల్ ఇంటికి రాలేదు.

“అమ్మాయ్. వచ్చేసాను. నా కాఫీ సిద్దమేనా?” అంటూ సాయంత్రం నడక పూర్తి చేసుకున్న సీతారాం అడుగు పెట్టాడు. ఎప్పట్లా నవ్వుతూ ఎదురొచ్చే మాలతి పలకకపోతే “ఏమిటి ఏదో కొంపలు మునిగినట్టు మౌనంగా కూర్చున్నారు?” అంటూ అప్పుడు గమనించాడు. ఇంట్లోనూ, బైటా చాలా మంది గుమిగూడి ఉన్నారు.

“వీళ్ల కొడుకు మూడు గంటలనుంచి కనపడటం లేదు” అన్నాడు ఒకతను. “హేవిటీ! అన్ని చోట్లా చూసారా?”

పరమ నికృష్టమైన ప్రశ్న!

“అబ్బే లేదండి. అందరం సినిమా చూసి ఇప్పుడే వచ్చాం” అన్నాడు సోమరాజు వెటకారంగా. “లేకపోతే ఆ ప్రశ్నేమిటండి? తెలిసిన చోటల్లా వెతికాకే ఇంటికి వచ్చాము.”

“నా ఉద్దేశం ఏమిటంటే ఇంతసేపటినుంచి కనపడకపోతే కిడ్నాపర్ ఈ పాటికి ఫోన్ చేసేవాడు. అదేం లేదంటే పిల్లాడు ఎక్కడో తెలిసిన వాళ్ల దగ్గర ఉన్నాడేమో. కంగారు పడకండి. వాడి దగ్గర ఫోన్ ఉందా?” అడిగాడు సీతారాం.

ఆ మాత్రం ధైర్యం చెప్పాడని స్తిమితపడుతూ “లేదు మావయ్యా. కానీ మన నెంబర్ వాడి నోటికి తెలుసు.” అంది మాలతి.

“అదే మన పిల్లలతో చిక్కు. మనం కంగారు పడతామని తెలిసినపుడు ఒక్క ఫోన్ చెయ్యచ్చు కదా. అయినా వచ్చేస్తాడులే.”

“ఇంతకీ మీరెవరు?” అని అడిగాడు ఇంట్లో ఉన్న కొత్త మనిషి. “మీరెవరు?” అని ఎదురు ప్రశ్న వేసాడు సీతారాం.

“నేను జగన్. ఈ వీధిలోనే ఉంటున్నాను. వీళ్ళబ్బాయి నా కొడుకు ఫ్రెండ్స్.”

“అలాగా. నేను శ్యామ్‌కి బాబాయిని” అన్నాడు సీతారాం. కొంత నిశ్శబ్దం.

“విషయం పోలీసులకి చెప్తే మంచిది” అన్నాడు సోమరాజు.

“అప్పుడే కొంపలంటుకున్నట్టు హడావుడి చెయ్యకు.” అని సోమరాజు నోరు మూయించి “మర్చిపోయాను. ఆ బీహారీ వాళ్ళని కలిసారా?” అని శ్యామ్‌ని అడిగాడు సీతారాం.

“ముందు వాళ్ళింటికే వెళ్లాను. ఇంటికి తాళం ఉంది!!!”

“అనుకున్నదే అయినట్టుంది. వాళ్ళ గురించి మొన్ననే అనుమానం వచ్చింది.”

“వాళ్ళు చాలా మంచి వాళ్ళు మావయ్యా” అంది మాలతి.

సీతారాం చికాగ్గా చూసి “అందరూ మంచివాళ్ళే.” అని ఇంకేమో అనబోయి ఈ సమయంలో ఎందుకన్నట్టు ఆగిపోయాడు.

“మనం వేరేచోట్ల కూడా వెతకటం మంచిది” అన్నాడు రవి. అతను శ్యామ్ పక్కింట్లో ఉంటాడు.

“అంతా వెతికాం కదండీ.”

జగన్ ఒక క్షణం అటూ ఇటూ చూసి మాలతి లేదని నిర్దారించుకున్నాక “రవి చెప్పింది నిజమేనండి. వెతకవలసినది కేవలం బైటే కాదు. గుంటల్లోనూ, మురికి కాలువలలోనూ కూడా” అన్నాడు.

“భగవంతుడా!” అన్నాడు సీతారాం. శ్యామ్ ఏమీ అనలేదు. కానీ ఆ కోణంలో కూడా చూడాలేమో అని అందరూ అనుకున్నారు. వాళ్ళ మౌనం అంగీకారంగా భావించి రవి, జగన్ వెళ్లారు.

“ఆ మధ్య నీతో ఇంటి గోడ గురించి గొడవ పెట్టుకున్న వాడేగా రవి?” అన్నాడు సీతారాం.

అవునన్నట్టు తలాడించాడు శ్యామ్. “అందుకు ఏమైనా పగ పెంచుకున్నాడేమో?” అన్నాడు సోమరాజు. “అరడుగు దూరం, వెడల్పు ముప్పై అడుగుల నేల వాడిదని గొడవ చేసాడు. అదేమీ చిన్న విషయం కాదు” అని కూడా అన్నాడు.

“ఏమో! ఎవరిని అనుమానించాలో తెలియటం లేదు.” అన్నాడు శ్యామ్.

రవి, జగన్ గంట తర్వాత వచ్చారు. సునీల్ దొరకలేదు.

“ఇవన్నీ చూసాం కనుక ఇది కిడ్నాప్ అనే అనుకోవాలి” అన్నాడు జగన్. “పోలీసులకి చెప్తే మంచిది”

“కిడ్నాప్ అని మీరే అన్నారు. పోలీసులకి చెప్తే పిల్లాడికి ప్రమాదం కదా!” అన్నాడు రవి.

“అలా అని వదిలేస్తే ఎలా?” గొంతు పెంచి అన్నాడు జగన్.

“పిల్లాడి ప్రాణం ముఖ్యమండీ. నన్నడిగితే మనం ఫోన్ కోసం వేచి ఉంటే మంచిది.” మరింత గట్టిగా అన్నాడు రవి.

“మీ అందరికీ పిల్లడిపైన ప్రేమ ఉందని తెలుసుకో. కానీ వాదించుకోకండి.” అని వాళ్ళని వారిస్తూ శ్యామ్ వైపు తిరిగి “ఏరా నువ్వేం మాటాడవేం?” అన్నాడు సీతారాం.

“నాకేం తోచటం లేదు బాబయ్యా” అన్నాడు శ్యామ్.

సీతారాం నిట్టూర్చి “సరే! ధైర్యంగా ఉండండి. నేను వస్తాను. ఏ వార్త అయినా నాకు చెప్పండి. ఇప్పటికి పోలీసులకి ఏమీ చెప్పద్దు.” అన్నాడు.

రవి, జగన్, మిగతావారు వెళ్లిపోయారు.

విచారంగా కూర్చున్న శ్యామ్ ఫోన్ మోగగానే వెంటనే తీసుకున్నాడు. ఊహించినట్టే ప్రైవేట్ నెంబర్!!!

***

మరికొన్ని నిముషాలలో జగన్, రవి వచ్చారు.

“ఏమంటాడు?” అడిగాడు రవి.

“యాభై లక్షలు ఇవ్వాలట. నేను ఆలోచించుకోవాలని చెప్పాను.” విచారంగా అన్నాడు శ్యామ్. “నా దగ్గర అంత డబ్బు లేదు.”

“ఏదో ఒకటి చేసి డబ్బులిచ్చేయ్యండి” అన్నాడు రవి.

“నో. అలా చేస్తే ఇలాంటి కిడ్నాపర్లని ప్రోత్సహించినట్టే.” అన్నాడు జగన్.

“పోలీసులేం చేస్తారండి? పిల్లాడి ప్రాణాలకి ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత?” ఆవేశంగా అన్నాడు రవి.

“మాలతీ. నీ పెళ్లి నగలు ఉన్నాయి కదా! అవి అమ్మేసి ఇచ్చేద్దామా?” కొంచెం బెదురుగానే అడిగాడు శ్యామ్.

అప్పటికి సీతారాం కూడా వచ్చాడు.”ఆడ కూతురి డబ్బు తీసుకోవటమేమిటిరా? ఎంత అడిగాడు?” అన్నాడు.

“యాభై లక్షలు! నాకేం అర్ధం కావటం లేదు బాబాయ్. పోలీసుల దగ్గరికి వెళ్ళటమే మంచిదేమో.”

“వద్దు” అన్నాడు సోమరాజు. “డబ్బిచ్చేద్దాం. నాదగ్గర ఉన్న డబ్బులు కూడా తీస్తాను”

“ఏదో ఒకటి త్వరగా తేల్చండి. అక్కడ మనవడు ఎలా ఉన్నాడో? వాడు రోజూ సాయంత్రం అదేదో ప్రోటీన్ పాలు తాగాలి. రాత్రి ఇంకేదో మందు కూడా ఇవ్వాలి కదా!” అన్నాడు సీతారాం.

“అవును. ఫ్రెసుమిన్ విటమిన్ ఇవ్వాలి. కిడ్నాపర్ వెధవ దగ్గర ఇవన్నీ కుదరదు. ఎలా?” భోరుమంది మాలతి.

“అమ్మాయీ. ఇలా తిట్టుకుంటే ఏం లాభం? జరగాల్సినది చూడాలి. నా దగ్గర 5 లక్షలున్నాయి. మిగతావి పోగు చేద్దాం. త్వరగా నిర్ణయం తీసుకోండి. పోలీసులకు చెప్పాలనుకుంటే ఆ విషయం కూడా నాకు చెప్పండి” అని కాఫీ తాగకుండానే వెళ్ళాడు సీతారాం.

***

“కిడ్నాపర్ ఫోన్ చేసాడండి. డబ్బు ఏర్పాటు చేస్తున్నామని ఒక రోజు గడువు తీసుకున్నాను. పోలీసులకి చెప్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని బెదిరించాడు.” అన్నాడు శ్యామ్.

“అయితే డబ్బు ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నారా?” అడిగాడు జగన్.

“అదే సరైనది” అన్నాడు రవి వెంటనే. సోమరాజు కూడా అంగీకారంగా తలాడించాడు.

“మావయ్య, తమ్ముడు కొంత సద్దుతున్నారు. నగల డబ్బులు వస్తే అన్నీ అప్పజెప్తాము. పిల్లాడి ప్రాణాలు ముఖ్యం” అంది మాలతి.

“ఒరేయ్ శ్యామూ. ఇక దిగులు పడకండి. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ప్రాణాలు ముఖ్యం. ఇదిగో నేను చెప్పిన మొత్తం” అన్నాడు సీతారాం గుడ్డలో చుట్టిన డబ్బు కట్టలు అతని సంచీలోంచి తీసి బల్ల మీద పెడుతూ. బాంకులోంచి తెచ్చినట్టున్నాడు. అతను మూట విప్పగానే, డబ్బులతో పాటు రిసీట్లు, ఇంకేవేవో కాగితాలు కూడా బల్ల పైన పడ్డాయి.

“ఒక సారి డబ్బులు లెక్కపెట్టుకుని మిగతా సొమ్ముతో కలుపు. అవతల మనవడి ప్రాణాలు ముఖ్యం. “ అన్నాడు సీతారాం.

“మీ మనవడి ప్రాణాలు ముఖ్యమే. అలాంటపుడు మీ కుర్రాడిని ఎందుకు తీసుకుపోయారు?” అని అడిగాడు జగన్.

ఏమంటున్నాడో అర్థం కాక సీతారాం అయోమయంగా చూస్తుంటే “మిమ్మల్నే సీతారాం గారూ! మీ మనవడిని వెంటనే అప్పగించండి. పాపం వీళ్ళు కంగారు పడుతున్నారు” అన్నాడు జగన్.

“జగన్! ఏమిటి మీరనేది?” అడిగాడు శ్యామ్.

“శ్యామ్! మీ కొడుకుని అపహరించింది మీ బాబాయే.” అన్నాడు జగన్ ఒక చీటీ చూపిస్తూ. ప్రెసుమిన్ విటమిన్ డబ్బా కొన్న రసీదు అది.

“ఈయన మాటలకి అనుమానించి నిన్న వెంబడించాను. మెడికల్ షాపులో ప్రోటీన్ డబ్బా కొని వెళ్ళాక షాపు నుంచి రసీదు తీసుకున్నాను. వారి అతి తెలివే పట్టించింది” అన్నాడు జగన్.

“బాబాయ్! నువ్వు..” శ్యామ్ నమ్మలేక చూస్తున్నాడు. సీతారాం తల దించుకున్నాడు.

“నేను పోలీసునని తెలియదు కనుక ఈయన కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడు. లేకపోతే..” అన్నాడు జగన్.

అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే “మీ అబ్బాయ్ కనిపించటం లేదనగానే ముందు మామూలుగానే వెతికాం. మా అనుభవం వలన డ్రైనేజీ గుంటల్లాంటి చోట్ల కూడా వెతికాం. కిడ్నాప్ అనిపించగానే ఎవరో బాగా తెలిసిన వారే చేసి ఉంటారని రవి, సోము, ఆఖరుకి శ్యామ్‌ని కూడా అనుమానించాను. రవికీ మీకూ కూడా గొడవలు ఉన్నాయని తెలుసు కనుక అతన్ని అనుమానించాను. పైగా పోలీసులకి చెప్పద్దని రవి పదే పదే అంటుంటే అనుమానం బలపడింది. కానీ మరే ఆధారం దొరకలేదు. భార్య నగలు పదేపదే అడుగుతున్న శ్యామ్, స్వయంగా కొడుకుని దాచి భార్య సొమ్ములు వాడుకోవాలనుకున్నాడేమో అని కూడా అనుమానించాను. కానీ శ్యామ్ నేపథ్యం తెలుసుకున్నాక ఆ అనుమానం కూడా తప్పేనని తెలిసింది. ఇక మీ బాబాయ్! నిజానికి మొదటే వారిమీద అనుమానం వచ్చింది. పిల్లాడు కనపడలేదు అన్న మొదటి నిముషంలోనే ఆయన కిడ్నాప్ కోణంలో మాటాడటం అసహజంగా అనిపించింది. కొన్నాళ్ల క్రితం మీ మధ్య ఆస్తి తగాదా నడిచిందని నా పరిశోధనలోనూ మీ మాటలలోనూ తెలిసింది. ఆ అక్కసు మనసులోనే ఉంచుకుని మూడేళ్లు ఏమీ జరగనట్టు నటించిన తర్వాత ఈయన రంగంలోకి దిగారు. మీకు అనుమానం రాకుండా తనే డబ్బు సాయం చేసినట్టు నాటకం ఆడారు. ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేది గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించారు. ఇంత ప్రణాళికతో వచ్చినా, మనవడి పైన ప్రేమ ఉండటం వలన వాడికి రోజూ అవసరమైన ప్రోటీన్ కొంటూ దొరికిపోయారు.” అని ముగించాడు.

“క్షమించరా శ్యామ్. మహామహులే కొడుకులకి లొంగిపోయారు. నేనూ అలాగే నా కొడుకు కోసం తప్పు చేసాను.” అన్నాడు సీతారాం.

“పోనీలే బాబాయ్! నా కొడుకుని క్షేమంగా చూసుకున్నందుకు మీకు ఋణపడి ఉన్నాను. వాడిని ఇంట్లో దింపేయ్యండి. ఈ విషయం ఇక్కడితో పోనివ్వండి.” అన్నాడు శ్యామ్ చేతులు జోడించి.

సీతారాం వెళ్ళిపోయాక “మీరు పోలీసులకి చెప్పకుండా తప్పు చేశారు. నేను పోలీసునని మీకెవ్వరికీ తెలియకపోవటం వలన నేరస్థుడిని పట్టుకోగలిగాం. న్యాయవ్యవస్థని తక్కువ చెయ్యకండి. పోలీసులకి సహకరించండి.” అని చెప్పి ఇంటికి బయల్దేరాడు జగన్.

Exit mobile version