[శ్రీ సి.హెచ్.ప్రతాప్ గారు రచించిన ‘అదృశ్యపు పుటలు’ అనే ఉత్కంఠభరిత నవలని ధారావాహికగా అందించనున్నాము.]
[చాలా రోజుల తర్వార రాఘవ్ ప్రశాంతంగా నిద్ర లేస్తాడు. తనకి ఎదురైన సంఘటనలు, కనిపించిన వస్తువులు అన్నీ ఒక లాజికల్ సీక్వెన్స్‌లో ఉన్నట్టు గ్రహిస్తాడు. క్రిందకి దిగి వచ్చేసరికి సుబ్బయ్య దినపత్రిక చదువుతుంటాడు. రాత్రి ఏం చూశావ్ అని అడిగితే, కుడి మణికట్టుపైన ఉన్న నాగుపాము పచ్చబొట్టున్న వ్యక్తి కలలో కనబడ్డాడని చెప్తాడు రాఘవ్. సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. కాసేపు గుర్తు చేసుకుని, నాగుపాము పచ్చబొట్టున్న వ్యక్తి ఎవరో చెప్తాడు. రేంజ్‌కార్యాలయంలో గత ముప్పై సంవత్సరాల నిర్మాణ పనులు, మరమ్మతులు, నీటి ట్యాంకులు, క్వార్టర్స్ పునరుద్ధరణలకు సంబంధించిన కాంట్రాక్టర్ల జాబితా తెప్పించి, అందులో సివిల్ కాంట్రాక్టర్ నాగేశ్వరరావుని గుర్తిస్తాడు. అయితే, నాగేశ్వరరావుకి సంబంధించిన ఫైల్స్ ఏవీ రికార్డులలో కనిపించవు. గుమాస్తాని కారణమడిగితే, ఎవరో కావాలనే తీసేసినట్లున్నారంటాడు. సాయంత్రం క్వార్టర్స్‌కి వస్తుండగా, జీపుకి అడ్డంగా ఐదేళ్ళ బాబు ఎర్రబంతి పట్టుకుని అడ్డంగా నిలబడి ఉండడంతో డ్రైవర్ ఆపుతాడు. ఆ బాలుడు రహదారి పక్కన అడవిలోకి వెళ్లే ఇరుకైన దారివైపు తన చిన్నచేతిని చాస్తాడు. అది చింతలపల్లికి దారితీసే మార్గం. పాత మిషన్ బంగ్లా ఉన్న ఊరు. మర్నాడు ఉదయం అవసరమైన పరికరాలు తీసుకుని రాఘవ్ చింతలపల్లికి బయల్దేరుతాడు. జీపులో కొంత దూరం, అక్కడ్నించి నడక కొంత దూరం. అలా అడవిలోకి వెళ్ళేసారికి పాతకాలపు మిషన్ బంగ్లా ఎదురవుతుంది. వరండా చివరనున్న చిన్న గదిలోకి అడుగుపెట్టగానే నేల మూలన పాత చెక్కపెట్టెపై రాఘవ్ దృష్టి నిలుస్తుంది. దానిలో పిల్లల ఆటవస్తువులో పాటు ఒక డ్రాయింగ్ బుక్ కనిపిస్తుంది. తల్లిదండ్రులు, ఒక పిల్లాడి బొమ్మలు ఆ పుస్తకంలో ఉంటాయి. చేతిమీద పడగ విప్పిన నాగుపాము ఆకారంలో పెద్ద పచ్చబొట్టు ఉన్న మనిషి బొమ్మ కూడా ఉంటుంది. విహాన్ ఆ వ్యక్తిని చూశాడనీ, గుర్తు పట్టాడని రాఘవ్ గ్రహిస్తాడు. తర్వాత పేజీల్లో గబగబా రాసినట్టుగా, అమ్మ భయంగా ఉందనే వాక్యం మాత్రమే ఉంటుంది. ఇంతలో ఏదో చప్పుడైనట్టు అనిపించి ఒక పాత రాతి బావి దగ్గరకు వస్తాడు రాఘవ్. దానిపై ఎప్పుడో పెన్సిల్‍లో రాసిన నేను ఇక్కడ లేను అన్న వాక్యాన్ని గుర్తిస్తాడు. – ఇక చదవండి.]
11
ఆ రాతి బావి ముందు రాఘవ్ చాలాసేపు కదలకుండా నిలబడి ఉన్నాడు. తుప్పుపట్టిన ఇనుప జాలి కింద నల్లటి నీరు నిశ్చలంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ నిశ్చలతలోనే ఏదో చెప్పలేని అశాంతి దాగి ఉన్నట్లు అనిపిస్తోంది. బావి అంచులపై పెరిగిన అడవి గడ్డి, చుట్టూ చిక్కగా అల్లుకున్న వెదురు పొదలు, వాటి మధ్య నుంచి అప్పుడప్పుడు వీచి ఎండిన ఆకులను గిరగిరా తిప్పుతున్న గాలి – ఇవన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని కాలం మరచిపోయిన నేరస్థలంలా మార్చేశాయి. అయితే రాఘవ్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది బావిని మూసివేసిన హెచ్చరిక పలక కాదు; దాని కింద పెన్సిల్‌తో చెక్కిన చిన్న వాక్యమే.
“నేను ఇక్కడ లేను..”
ఆ అయిదు మాటలు అతని మనసులో వరుస ప్రశ్నలను రేపాయి. ఐదేళ్ల చిన్నారి అలా ఎందుకు రాస్తాడు? అంతకన్నా ముఖ్యంగా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి రాశాడు? తనను వెతికే తల్లికా? అక్కడికి వచ్చే పోలీసులకా? లేక ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రహస్యాన్ని వెంబడిస్తూ వచ్చే తనలాంటి అపరిచితుడికా? ఒక పిల్లవాడి భయంతో రాసిన వాక్యమా అది.. లేక ఎవరో నిజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా వదిలిన సందేశమా? ఆలోచించిన కొద్దీ సమాధానాలు దొరకడం లేదు. కానీ ప్రతి ప్రశ్న అతన్ని మరో ఆధారం వైపు నడిపిస్తోంది.
రాఘవ్ జేబులోంచి చిన్న టేప్ కొలత, మడతపెట్టే లెన్స్, కెమెరా తీసి ఆ ప్రదేశాన్ని పద్ధతిగా పరిశీలించడం ప్రారంభించాడు. అటవీ శాఖలో పనిచేస్తూ అక్రమ వేటగాళ్ల అడుగుజాడలు, కలప స్మగ్లర్ల కదలికలు, అడవి జంతువుల మార్గాలను గుర్తించడం అతనికి దినచర్యే. అదే అనుభవంతో బావి చుట్టూ ఉన్న నేలను అంగుళం అంగుళం పరిశీలించాడు. వర్షం తడిసిన మట్టిలో రెండు రకాల ఆనవాళ్లు కనిపించాయి. ఒకటి తన బూట్ల ముద్రలు. రెండోవి చాలా పాతవి. వర్షాలు, ఎండలు, కాలగమనంతో దాదాపు చెరిగిపోయినా, రెండు రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన మట్టిలో వాటి ఆకారం ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. అవి పిల్లవాడి అడుగులు కావు. పూర్తి ఎదిగిన మనిషి వేసిన అడుగులు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ అడుగులు బావి వరకు వచ్చి ఆగలేదు; తిరిగి వెళ్లిన ఆనవాళ్లు లేకుండా వెదురు పొదల మధ్య కుడివైపు తిరిగిపోయాయి.
ఆ దిశగా నెమ్మదిగా నడిచిన రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అక్కడి నేల చుట్టుపక్కల ప్రాంతంతో పోలిస్తే కొద్దిగా కుంగిపోయినట్లు కనిపిస్తోంది. అది సహజంగా ఏర్పడిన గుంత కాదు. ఎప్పుడో తవ్వి మళ్లీ పూడ్చిన నేలకే ఉండే అసమానత అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మట్టి రంగు కూడా మిగిలిన ప్రదేశంతో పోలిస్తే కొద్దిగా ముదురు రంగులో ఉంది. రాఘవ్ దగ్గర ఉన్న చిన్న ఇనుప రాడ్‌తో నేలను నెమ్మదిగా తట్టి పరిశీలించడం ప్రారంభించాడు. చాలాచోట్ల గట్టి రాతిపై కొట్టినట్టుగా స్పష్టమైన ప్రతిధ్వని వినిపించింది. కానీ ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రం శబ్దం ఒక్కసారిగా మారిపోయింది. లోపల ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు వినిపించే మొద్దుబారిన ప్రతిధ్వని అతని అనుభవజ్ఞుడైన చెవులను తప్పించలేదు.
“ఇది సహజంగా ఏర్పడిన గుంత కాదు..” అని అతను తనలోతానే గొణిగాడు. “ఎప్పుడో ఎవరో ఇక్కడ ఏదో పూడ్చారు.. లేదా కింద ఉన్న దాన్ని దాచిపెట్టారు.”
అప్పుడే వెనుక నుంచి ఒక పొడవాటి దగ్గు శబ్దం వినిపించడంతో రాఘవ్ సహజసిద్ధంగా వెనక్కి తిరిగాడు. కొద్దిదూరంలో తెల్లటి గడ్డంతో, చేతిలో పొడవాటి కర్ర, భుజంపై కట్టెల మోపు వేసుకున్న ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతని దుస్తులు చూస్తే సమీప గ్రామానికి చెందిన గొర్రెల కాపరిగా అనిపిస్తున్నా, అతని చూపు మాత్రం సాధారణ గ్రామస్తుడిదిగా లేదు. రాఘవ్‌ను కాదు.. అతను నిలబడి ఉన్న నేలనునే గమనిస్తున్నాడు.
“బాబూ..” అని వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. “ఆ నేలను అంత జాగ్రత్తగా ఎందుకు చూస్తున్నావు?”
రాఘవ్ తన పరిచయం చెప్పి, ఈ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవడానికి వచ్చానని వివరించాడు.
“ఈ పాత మిషన్ బంగ్లా గురించి మీకు ఏమైనా గుర్తుందా తాతయ్య?”
వృద్ధుడు వెంటనే సమాధానం చెప్పలేదు. నెమ్మదిగా వచ్చి బావి అంచున కూర్చున్నాడు. కొద్దిసేపు బావిలోకి తొంగిచూసి, లోపల ఏముందో తనకే కనిపిస్తున్నట్లుగా చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు.
“ఈ బంగ్లా గురించి అడిగేవాళ్లు చాలా తక్కువ బాబూ,” అని చివరకు గొంతు సవరించుకుని మాట్లాడడం ప్రారంభించాడు. “అడిగిన వాళ్లలో కూడా సమాధానం పూర్తిగా వినేవాళ్లు ఇంకా తక్కువ. ఎందుకంటే భయం వినాలనుకునే వాళ్లు ఎక్కువ.. నిజం వినాలనుకునే వాళ్లు చాలా అరుదు.”
రాఘవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని ప్రతి పదాన్ని జాగ్రత్తగా వింటున్నాడు.
“నేను చిన్నవాడినప్పుడు ఈ బంగ్లాలో ఒక ఆంగ్ల మిషనరీ ఉండేవాడు. తర్వాత ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని కొంతకాలం అధికారుల నివాసంగా ఉపయోగించింది. కుటుంబాలు వచ్చాయి.. పిల్లలు ఆడుకున్నారు.. మళ్లీ వెళ్లిపోయారు. కానీ ఒక రాత్రి తర్వాత అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. బంగ్లా మూతపడింది. అధికారులు వచ్చారు. పోలీసులు వచ్చారు. కొన్నిరోజులు హడావుడి జరిగింది. తర్వాత అందరూ వెళ్లిపోయారు. కారణం మాత్రం ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రాత్రి అడవంతా ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించిందని మా పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు.”
రాఘవ్ కొద్దిసేపు ఆగి మెల్లగా అడిగాడు.
“ఆ పిల్లవాడి పేరు.. విహాన్ అని మీకు తెలుసా?”
వృద్ధుడి కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం మెరిసింది. అతను నిటారుగా కూర్చుని రాఘవ్ ముఖంలోకి తీక్షణంగా చూశాడు.
“ఆ పేరు నీకు ఎవరు చెప్పారు బాబూ?”
రాఘవ్ సమాధానం ఇవ్వలేదు. కొన్ని నిజాలు చెప్పలేనివని అతనికి తెలుసు.
వృద్ధుడు స్వల్పంగా తల ఊపాడు.
“అయితే నువ్వు చాలాదూరం వచ్చావు. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఈ గ్రామంలో విహాన్ గురించి చెప్పుకునే కథలో సగం మాత్రమే నిజం. మిగిలిన సగం.. ఎవరో కావాలనే కల్పించారు.”
రాఘవ్ గుండె వేగంగా కొట్టుకుంది.
“అంటే.. నిజంగా ఏమైంది?”
వృద్ధుడు నెమ్మదిగా లేచాడు.
“ప్రజలు ఇప్పటికీ పిల్లవాడు అదృశ్యమయ్యాడని అనుకుంటారు. కానీ మా నాన్న ఒక్క మాటే చెప్పేవాడు.”
అతను కాసేపు ఆగి రాఘవ్ కళ్లలోకి నేరుగా చూశాడు.
“అదృశ్యమైనది పిల్లవాడు కాదు బాబూ.. నిజం.”
ఆ ఒక్క వాక్యం రాఘవ్ మనసులో గుద్దుకున్న మేకులా మిగిలిపోయింది.
వృద్ధుడు వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి మళ్లీ ఆగిపోయాడు.
“నువ్వు బంగ్లాలో దొరికిన డ్రాయింగ్ బుక్ చూశావు కదా?”
రాఘవ్ ఆశ్చర్యంగా తల ఊపాడు.
“చివరి పేజీ చదివావు. కానీ ముందు అట్ట లోపల కూడా చూసావా?”
ఆ ప్రశ్న వినగానే రాఘవ్‌కు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. తొందరలో ప్రతి పేజీ పరిశీలించాడు గానీ, కవర్‌ను మాత్రం పూర్తిగా పరీక్షించలేదు.
వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు.
“కొన్ని పుస్తకాలు కథను చివరి పేజీలో ముగించవు బాబూ. అసలు కథను మొదటి అట్ట లోపలే దాచిపెడతాయి.”
అంతే.
ఇంకేమీ చెప్పకుండా అతను వెదురు పొదల మధ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. రాఘవ్ ఒక క్షణం అతని వెనుక పరుగెత్తాలనుకున్నాడు. కానీ అంతకంటే విలువైన ఆధారం ఇప్పుడు తన బ్యాగ్‌లో ఉందని గ్రహించాడు.
అతను సమీపంలోని పెద్ద రాతిబండపై కూర్చుని డ్రాయింగ్ బుక్‌ను బయటకు తీశాడు. దుమ్ము దులిపి ముందు అట్టను చాలా జాగ్రత్తగా పరిశీలించగా, కవర్‌కు లోపల సన్నగా అతికించిన మరో పలుచని కాగితం కనిపించింది. అది సాధారణ కాగితం కాదని మొదటి చూపులోనే అర్థమైంది. మడతలను విప్పి పూర్తిగా తెరిచేసరికి అతని శ్వాస క్షణకాలం ఆగిపోయింది.
అది..
పాత ప్రభుత్వ క్వార్టర్స్ అసలు నిర్మాణ పటం.
నీలిరంగు సిరాతో గీసిన ఆ పటంలో ప్రతి గది, ప్రతి వరండా, ప్రతి మెట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ఒక చోట మాత్రమే ఎర్రటి పెన్సిల్‌తో గుండ్రంగా వృత్తం గీసి ఉంది.
రాఘవ్ టార్చిలైట్ వెలుతురును ఆ గుర్తుపై నిలిపాడు.
అది..
డాబాపై తుప్పుపట్టిన తాళంతో మూసి ఉన్న అదే చిన్న గది.
ఆ వృత్తం పక్కనే పిల్లల చేతిరాతలో వణుకుతూ రాసిన మూడు మాటలు కనిపించాయి.
“అమ్మ.. నేను ఇక్కడ.”
ఆ మాటలు చదివిన క్షణంలో రాఘవ్‌కు ఒక్క విషయం స్పష్టమైంది.
విహాన్ తనను బావి దగ్గరకు తీసుకురాలేదు.. తిరిగి ఆ మూసి ఉన్న గది దగ్గరకే పంపిస్తున్నాడు.
12
డ్రాయింగ్ బుక్ ముందు అట్టలో దాచిన ఆ పాత నిర్మాణ పటాన్ని రాఘవ్ చేతులు స్వల్పంగా వణుకుతుండగానే మరోసారి పూర్తిగా విప్పి జాగ్రత్తగా పరిశీలించాడు. ప్రభుత్వ క్వార్టర్స్‌కు సిద్ధం చేసే సాధారణ బ్లూప్రింట్లలో గదుల కొలతలు, గోడల మందం, పైకప్పు బీమ్‌లు, నీటి పైపుల మార్గాలు, విద్యుత్ వైరింగ్, మురుగునీటి లైన్లు వంటి సాంకేతిక వివరాలు మాత్రమే ఉండడం అతనికి బాగా తెలుసు. కానీ ఈ పటం వాటితో పోలిస్తే భిన్నంగా ఉంది. ప్రతి గది ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా గీసి ఉన్నప్పటికీ, డాబాపై ఉన్న చిన్న గది చుట్టూ ఎర్రటి పెన్సిల్‌తో గీసిన వృత్తం మాత్రం మిగిలిన ప్రతి గుర్తుకన్నా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట అతని దృష్టి ఆ వృత్తంపైనే నిలిచిపోయింది. కానీ కొద్దిసేపటి తర్వాత టార్చిలైట్ వెలుతురును మరింత దగ్గరగా ప్రసరించగా, ఆ వృత్తం మధ్యలో ఉన్న చిన్న గది కింద మరో గుర్తు కనిపించింది. మొదట అది సిరా మరక అనుకున్నాడు. లెన్స్‌తో పరిశీలించిన తర్వాతే అది చిన్న బాణం అని అర్థమైంది. ఆ బాణం తలుపు వైపు కాదు.. గోడ వైపు చూపిస్తోంది. ఆ ఒక్క గుర్తు అతని అనుభవానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. అంటే ఆ గది రహస్యం తలుపు వెనుక దాగి ఉండకపోవచ్చు; అసలు నిజం గోడల్లో ఎక్కడో మూసివేసి ఉండొచ్చు.
డ్రాయింగ్ బుక్‌ను మళ్లీ జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకున్న రాఘవ్ ఇంకో క్షణం కూడా అక్కడ ఆగాలనుకోలేదు. చింతలపల్లి మిషన్ బంగ్లాలో దొరికిన ప్రతి ఆధారం చివరికి ఒకే దిశగా చూపిస్తోంది. ఎర్రటి బంతి, “అమ్మ వస్తానంది..” అని రాసిన గాలిపటం, పాత కుటుంబ ఫోటో, ప్రభుత్వ రికార్డుల్లో అదృశ్యమైన ఫైళ్లు, పిల్లవాడి డ్రాయింగ్ బుక్, ఇప్పుడు ఈ నిర్మాణ పటం – వీటిలో ఒక్కటీ యాదృచ్ఛికం కాదని అతనికి ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఇప్పటివరకు విహాన్ తనను ఒక్కో ఆధారం దగ్గరకు తీసుకెళ్తూ వచ్చాడు. ఇప్పుడు మాత్రం నేరుగా గమ్యస్థానాన్ని చూపిస్తున్నాడు. ఇరవై సంవత్సరాలుగా మూసుకుపోయిన ఒక తలుపు తెరవమని ఆ చిన్నారి తనను వేడుకుంటున్నట్లుగా అతనికి అనిపించింది.
సాయంత్రం చీకట్లు కమ్ముకునే సమయానికి రాఘవ్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గేటు దగ్గరే సుబ్బయ్య ఆందోళనగా ఎదురుచూస్తూ కనిపించాడు. జీప్ ఆగగానే అతను తొందరగా దగ్గరకు వచ్చి, “రోజంతా నీ కోసమే ఎదురు చూస్తున్నాను బాబూ,” అని చెప్పి వరండాలోకి తీసుకెళ్లాడు. అతని ముఖంలో కనిపిస్తున్న ఆందోళన సాధారణం కాదని రాఘవ్‌కు వెంటనే అర్థమైంది.
“ఏమైంది తాతయ్య?” అని అడిగాడు.
సుబ్బయ్య కాసేపు పై అంతస్తువైపు చూసి గొంతు తగ్గించాడు.
“ఈ మధ్యాహ్నం ఒక విచిత్రమైన విషయం జరిగింది. నేను నీ గదిలోకి వెళ్లలేదు. తాళం అలాగే ఉంది. అయినా పై అంతస్తు నుంచి బంతి దొర్లిన శబ్దం చాలాసేపు వినిపించింది. మొదట గ్రామం పిల్లలు ఎవరైనా లోపలికి వచ్చారేమో అనుకున్నాను. కానీ ఈ క్వార్టర్స్‌లో మనిద్దరం తప్ప ఇంకెవరూ లేరని గుర్తొచ్చేసరికి పైకి వెళ్లే ధైర్యం కాలేదు.”
రాఘవ్ ఒక్క మాటా మాట్లాడకుండా బ్యాగ్‌లో నుంచి నిర్మాణ పటాన్ని తీసి చెక్కబల్లపై పరిచాడు. సుబ్బయ్య వంగి చూడగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెగసి, పెదవులు స్వల్పంగా కంపించాయి.
“ఇది.. ఈ పటం ఇంకా ఉందా?” అని అతను దాదాపు గుసగుసలాడాడు.
“మీరు దీన్ని ఇంతకుముందు చూశారా?” అని రాఘవ్ వెంటనే ప్రశ్నించాడు.
“ఒక్కసారి మాత్రమే,” అని సుబ్బయ్య మెల్లగా అన్నాడు. “క్వార్టర్స్ మరమ్మతులు మొదలయ్యే ముందు నాగేశ్వరరావు చేతిలో ఈ పటం చూశాను. పనులు పూర్తయ్యాక మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. అది కూడా మిగతా ఫైళ్లలాగే పోయిందనుకున్నాను.”
రాఘవ్ పటంలో ఎర్రటి వృత్తం గీసిన గదిని చూపిస్తూ అడిగాడు.
“ఈ చిన్న గది గురించి మీకు ఏమైనా గుర్తుందా?”
సుబ్బయ్య చాలాసేపు పటాన్ని చూస్తూ జ్ఞాపకాలను వెతికాడు.
“తలుపు మాత్రం బాగా గుర్తుంది. కానీ లోపల ఏముందో నాకు ఎప్పుడూ తెలియదు. మాకు అక్కడికి వెళ్లే అనుమతి ఉండేది కాదు. ఒకసారి మరమ్మతుల సమయంలో ఇద్దరు పనివాళ్లు ఆ గదిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేశారు. వాళ్లు బయటకు వచ్చేసరికి గోడకు కొత్త సిమెంట్ పూశారు. మరుసటి రోజు తలుపుకు కొత్త తాళం వేసి, ప్రభుత్వ ఆదేశమని చెప్పడంతో అక్కడికి ఎవరూ దగ్గరపడకూడదని హెచ్చరించారు. అప్పట్లో ఉద్యోగం కొత్తది. ప్రశ్నలు అడిగే ధైర్యం కూడా లేదు.”
ఆ మాటలు వినగానే రాఘవ్ కళ్లలో మెరుపు మెరిసింది.
“ఒక్క నిమిషం తాతయ్య.. మీరు ఇప్పుడే ఏమన్నారు? గోడకు కొత్త సిమెంట్ పూశారా?”
“అవును,” అని సుబ్బయ్య వెంటనే సమాధానమిచ్చాడు. “అప్పుడే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. పైకప్పు మరమ్మతులు చేస్తే గోడకు సిమెంట్ ఎందుకు పూయాలి అనిపించింది. కానీ ఎవరూ మాట్లాడలేదు.”
రాఘవ్ ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచాడు.
“ఇప్పుడే పైకి వెళ్దాం.”
సుబ్బయ్య కిటికీ బయట చీకటిని చూసి సంకోచంగా అడిగాడు.
“ఈ సమయంలోనా బాబూ?”
రాఘవ్ గంభీరంగా నవ్వాడు.
“ఇంతవరకు మనం ఊహలను వెంబడించాం. ఇక నుంచి ఆధారాలు మాట్లాడాలి.”
ఇద్దరూ టార్చిలైట్లు చేతిలో పట్టుకుని డాబాపైకి చేరేసరికి సాయంత్రపు వెలుతురు పూర్తిగా కరిగిపోయింది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకుని, ఎప్పుడైనా వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. గాలిలో తేమ పెరిగింది. చుట్టూ ఉన్న చెట్లు మెల్లగా ఊగుతున్నాయి. డాబా ఉత్తర మూలలో ఉన్న చిన్న గది తలుపుకు వేలాడుతున్న తుప్పుపట్టిన తాళం మాత్రం యథాతథంగా కనిపించింది.
ఈసారి రాఘవ్ తలుపు వైపు వెళ్లలేదు.
నిర్మాణ పటంలో బాణం చూపించిన గోడ దగ్గరకు నేరుగా నడిచాడు.
టార్చిలైట్ వెలుతురును గోడపై నెమ్మదిగా కదుపుతూ ఒక్క అంగుళం కూడా వదలకుండా పరిశీలించాడు. కొద్దిసేపటికే అతని అనుమానం నిజమైంది. మిగిలిన గోడలన్నింటికంటే ఆ ఒక్క భాగంలో సిమెంట్ రంగు కొద్దిగా భిన్నంగా ఉంది. కాలం గడిచినా ఆ తేడా పూర్తిగా చెరిగిపోలేదు. చేతితో తట్టి చూడగా కూడా ప్రతిధ్వని మారుతోంది. ఒకచోట గట్టి ఇటుక గోడను తట్టినట్టుగా శబ్దం వినిపిస్తుంటే, మధ్యభాగంలో మాత్రం లోపల ఖాళీ ఉన్నట్టుగా మొద్దుబారిన ప్రతిధ్వని వినిపించింది.
రాఘవ్ వెనక్కి తిరిగి సుబ్బయ్య వైపు చూశాడు.
“వినిపించిందా?”
సుబ్బయ్య కూడా అదే ప్రదేశాన్ని తట్టి చూసి నెమ్మదిగా తల ఊపాడు.
“లోపల ఏదో ఉంది బాబూ.. ఇది గట్టి గోడ శబ్దం కాదు.”
రాఘవ్ వెంటనే కిందికి వెళ్లి జీప్‌లో ఎప్పుడూ ఉంచుకునే చిన్న జియాలజికల్ హామర్, ఫ్లాట్ చిసెల్ తీసుకొచ్చాడు. గోడను ధ్వంసం చేయాలనే ఉద్దేశం అతనికి లేదు. సిమెంట్ పొర ఎంత మందంగా ఉందో తెలుసుకోవడమే లక్ష్యం. ఒక మూలను అత్యంత జాగ్రత్తగా చిసెల్‌తో తట్టి, హామర్‌తో స్వల్పంగా కొట్టాడు.
సిమెంట్ చిన్న ముక్క ఊడి కిందపడింది.
దాని వెనుక ఇటుక కనిపించలేదు.
రాఘవ్ మరోసారి మెల్లగా కొట్టాడు.
మరొక ముక్క ఊడిపోయింది.
ఈసారి టార్చిలైట్ వెలుతురులో స్పష్టంగా కనిపించింది.
అది ఇటుక కాదు.
దశాబ్దాలుగా వెలుతురు చూడని పాత సాగవాన్ చెక్క.
రాఘవ్, సుబ్బయ్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మాటలు రావడం లేదు.
“ఇది..” అని రాఘవ్ నెమ్మదిగా అన్నాడు, “..గోడ కాదు తాతయ్య. ఎవరో గోడలా కనిపించేలా సిమెంట్‌తో కప్పేశారు.”
అతను మరికొన్ని చోట్ల సిమెంట్‌ను చాలా జాగ్రత్తగా తొలగించగానే మొత్తం ఆకారం బయటపడింది. అది సాధారణ చెక్క పలక కాదు. రెండు భారీ ఇనుప కీళ్లతో బిగించి అమర్చిన ఒక రహస్య ద్వారం. దాని అంచున దుమ్ముతో కప్పబడి, తుప్పు పట్టినా ఇంకా బలంగానే కనిపిస్తున్న పిత్తల హ్యాండిల్ యథాతథంగా ఉంది.
రాఘవ్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
ఇరవై సంవత్సరాలుగా వెతుకుతున్న నిజం..
ఈ ద్వారం అవతలే ఉందేమో.
అతని చేయి తెలియకుండానే ఆ పిత్తల హ్యాండిల్ వైపు నెమ్మదిగా సాగింది.
అదే క్షణంలో..
డాబా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక చిన్నారి నవ్వు వినిపించింది.
ఈసారి ఆ నవ్వులో భయం లేదు.
బాధ లేదు.
ఎంతోకాలంగా ఎదురు చూసిన మనిషి చివరకు సరైన తలుపు దగ్గరకు చేరుకున్నాడనే ఉపశమనం మాత్రమే ఉంది.
రాఘవ్ లోతుగా శ్వాస తీసుకుని హ్యాండిల్‌ను బిగిగా పట్టుకున్నాడు.
అది తాళం వేసి లేదు.
బయట నుంచి కాదు..
లోపలి నుంచే ఎప్పుడో మూసివేసినట్లుగా, నెమ్మదిగా కదలడం ప్రారంభించింది.
(ఇంకా ఉంది)
